తాతా చరిత్రము/వస్త్ర పరిశ్రమ : ఎంప్రెసు మిల్లు
4. వస్త్ర పరిశ్రమ : ఎంప్రెసు మిల్లు.
ఆహారమువలె వస్త్రమును ప్రతివానికిని అవసరము.*[1] పూర్వము నార ఆకులు ధరించిన యాటవికులును ఇప్పుడు బట్టలనే ధరించుచున్నారు. ఉన్ని, పట్టు, జంతు సంబంధములు, ప్రియములు; మరియు అవి హెచ్చువేడి నిచ్చును; అందుచే నుష్ణమగు మనదేశమున, జనసామాన్యము దూదిబట్టలనే వాడును. సాధ్యమైనంతవరకు ప్రతిదేశమువారును తమ కవసరమగు దూదిబట్టలను నేసుకొనవలెను; లేనిచో విదేశములనుండి తెచ్చుకొని, అందుల కిమ్మతుసొమ్ము ఆవిదేశముల కిచ్చుకొనవలెను.
నూలు వడకి బట్టల నేయుట మనదేశమున వేలకొలది యేండ్లనుండి పరిపాటియే. రాట్నపునూలుతో చేతిమగ్గములపైన మనదేశీయులు నేసిన సన్నని నాజూకువస్త్రములు పూర్వము ప్రాచీనగ్రంథములందును ఖండాంతరచరిత్రలందును †[2] ప్రసిద్ధములై యుండెను. వంగదేశపు ఢక్కా మస్లినులు, నైఋతి ప్రాంతపు కాలికోలు, బందరు కలంకారీలు, విదేశములందును వ్యాపించియుండెను. కాని 18 వ శతాబ్దినుండి, ఆపరిస్థితి మారెను. యూరపులో నాంగ్లేయులుమున్నగువారు స్వయంకృషిచే తమతమదేశములందే వస్త్రపరిశ్రమ వృద్ధిచేసుకొన దొడగిరి; మనదేశమునుండి వస్త్రములను కొనుట మానిరి; అప్పటికి యూరపులో నూలు మనదేశపునూలుకన్న చాల ముదుకుగ నుండెను. మనదేశమునుండి దిగుమతియగు నూలుపైన, బట్టలపైన, క్రమముగా పాశ్చాత్యులు హెచ్చుపన్ను విధించిరి. ఐనను కొందరు నాజూకుగానున్న మన సన్నబట్టలనే కొనుచుండిరి. అందుపైన మనదేశపు సన్నరకపుబట్టలు తమదేశముకు రానీయకుండ నచ్చటిపాలకులు నిషేధించిరి. తమదేశపు పరిశ్రమల ననేకవిధముల బ్రోత్సహించిరి. ఇట్లు మన బట్టలకు యూరపు యెగుమతి లేకుండబోయెను. మరియు మనదేశము 'ఈస్టిండియాకంపెనీ' అను బ్రిటిషువారి వ్యాపారసంఘముయొక్క పాలనమున బడెను; ఆకంపెనీ యింగ్లండునుండి నూలు బట్టలు తెచ్చి, మనదేశమం దమ్మి, లాభమొందదొడగిరి. వారు తెచ్చు బట్టలతో పోటీలేకుండుటకై, ఆకంపెనీ పాలనమున మనదేశపు సాలెవాండ్ర కనేకనిర్బంధము లేర్పడెను. మన స్వతంత్రదేశీయ రాజ్యములు నశించెను; మన ప్రభుత్వసహాయము క్షీణించెను. ఈస్థితిలో ఆంగ్లదేశమున 19 వ శతాబ్దిపూర్వార్థమున ఆవిరితో నడుపు 'ఇంజను'లను మరమగ్గములను కనిపెట్టిరి. వానిసహాయమున మిల్లులందు సన్ననిబట్టలను సమృద్ధిగ తయారుచేసి, మన దేశముకు తెచ్చి, ఆంగ్లేయులు వానిని మనకు అమ్మ దొడగిరి.
మిల్లుయంత్రములందు తయారగు నూలు, బట్టలు, వడుకు నూలంత మన్నికగలవి కావు; కాని యవి సన్నగ నాజూకుగ గన్పడును; మరియు యంత్రములందు సమృద్ధిగ బహుళోత్పత్తి జరుగును, కనుక మిల్లుబట్టలు చౌకగ నుండును. వానినే మనదేశీయులు కొని వాడజొచ్చిరి. ఇట్లు పరిస్థితులు తారుమారై, బ్రిటిషు మిల్లుబట్టల చలామణి మనదేశమున 19 వ శతాబ్దిలో చాల హెచ్చినది. క్రమముగ వడకుట మున్నగు మనచేతి పనులు క్షీణించెను. ఆపనివాండ్లావృత్తుల గోల్పోయి, కూటికై యల్లాడజొచ్చిరి. అట్టి వృత్తిహీను లదృష్టవశమున కూలిదొరకిన భుజింతురు; లేనిచో, ఏకాదశీవ్రతఫల మనుభవింతురు.**[3]
తుదకు మన సాలీలు వడకువాండ్రుగూడ విదేశపు మిల్లుల సన్నబట్టల ధరించుటచే, అందుకు సొమ్మిచ్చుకొనుచుం డిరి. గ్రామములందు వీరును ఇతరజనులు చాలమందియు నిరుద్యోగులు, నిరాహారులు, అయిరి. విదేశపుబట్టల దూదియు తరుచు విదేశపుదే; కనుక మనప్రత్తికిని ఖర్చుతగ్గి, ధరలేక, మన ప్రత్తిసాగుకును చాల నష్టము కలిగినది. 19 వ శతాబ్దిమధ్యకు, ఇట్లు మన యార్థికస్థితి విషమించెను. విదేశములకు ధనప్రవాహము పోకుండ అరికట్టినగాని అ నీరసస్థితి పోదని, అందుచే జనులకు రుచించు మంచి మిల్లుబట్టలనే మనదేశమున తయారుచేయ వలెనని, మనదేశపుపరిశ్రమలరక్షణ కదియే మార్గమని, ఆపరిస్థితిలో చేతినూలు మిల్లునూలుతో పోటీచేయలేదని, జంషెడ్జి తాతాకు తోచెను.
మనదేశపు మొదటి బట్టలమిల్లు 1855 ప్రాంతమున బొంబాయియం దేర్పడెను. అది కేవలము ముదుకనూలు మిల్లు; దానిని జూచి కొంద రింగ్లండునుండి యట్టి యంత్రములనే తెప్పించి, బొంబాయి ప్రాంతమదే మిల్లుల నెలకొల్పిరి. అం దా ప్రాంతపు దూదితో ముదుకబట్టలు దయారగుచుండెను. (అమెరికా యుద్ధపు నాలుగేండ్లలో మాత్రము ప్రత్తిధర చాల హెచ్చి, మిల్లులకు గిట్టుబాటు లేకుండెను.) బొంబాయి శీతోష్ణస్థితి, అచ్చటి చల్లనినీటిగాలి, వడకుటకు నేతకు అనుకూలములు; ప్రత్తి పండు జిల్లాలు దాని దగ్గర నున్నవి; అచ్చట ధనాఢ్యులు నుండిరి. ఇట్లు చాలమిల్లులు బొంబాయిలోనే యేర్పడెను. జంషెడ్జితాతాయు కొందరు వాటాదార్ల గూర్చుకొని, 1869 లో చౌకగ అమ్ముచున్న యొకతైలయంత్రమును కొని, దానికి కండెలను మగ్గములను చేర్చి, బట్టలమిల్లుగా జేసి, 'అలెగ్జాండ్రామిల్లు' అనుపేర, దానిని నడపెను కాని ఈమిల్లును ముదుకునూలునే చేయును. అంతకన్న సన్ననినూలుబట్టల జేయు మిల్లును తాతా స్థాపింపదలచెను; అవకాశము దొరకగనే 1873 లో అలెగ్జాండ్రామిల్లు ఒక శ్రీమంతున కమ్మి వేయబడెను; అందుచే తాతాకు కొంతలాభము కలిగెను.
లోగడ దూదియెగుమతి వ్యాపారముకై యింగ్లండులో నుండినప్పుడు జంషెడ్జి అచటిమిల్లుల కార్యమును గమనించెను. అంతట మన దేశమందు తాను మిల్లుపరిశ్రమ సాగింపవలెనని తాతా కుత్సాహము కలిగెను. కాని యీలోగా ఇంగ్లీషుమిల్లులందు సన్ననూలుకై యంత్రములను పద్ధతులను బాగుచేసి క్రమముగ కొత్తరకముల బెట్టుచుండిరి; ఆపరిశ్రమ రహస్యములను నవీనపద్ధతులను బూర్తిగ తెలుసుకొనుటకు మరల నిగ్లండు జని, జంషెడ్జి అచటి లంకషైరులో కొత్తయంత్రముల స్వయముగ బరీక్షించి, సన్ననూలు తయారుచేయు పద్ధతులను వ్యాపారమర్మములను గ్రంహించి, తన కవసరమగు ప్రశస్త యంత్రముల నెన్నుకొని, తిరిగివచ్చెను. అప్పుడే యీజిప్టుప్రక్కను సూయెజుకాలువ త్రవ్వబడి, మధ్యధరాసముద్రముద్వారా, మనకు యూరపుతో దగ్గరదారి యేర్పడెను; ఇట్లు రాకపోకల సౌకర్యము హెచ్చెను. తాతా అంతట నాయంత్రస్థాపనకై స్థలపరిశోధన గావించెను. ఇంతవర కందరును గతానుగతికముగ బొంబాయిలోనే మిల్లుల బెట్టుచుండిరి. అందుచే వారిలో పోటీ, పనివాండ్రగిరాకి, ప్రత్తిధర హెచ్చుటయు, కల్గెను. మరియు యింజనులకు వలయుబొగ్గు, కలప, బొంబాయివద్ద లేవు; దూరమునుండి తెప్పించుటకు రైలుఛార్జి చాల తగులును. ఆమిల్లులందు తయారగుబట్టలను దూరప్రాంతములకు చేర్చవలసియుండి, అందుకు హెచ్చు వ్యయప్రయాసములు కల్గును. ఈసంగతుల గమనించి, బొంబాయివాసియైనను తాతా తన సౌకర్యమునే చూచుకొనక, దూరదృష్టితో తన మిల్లును మనదేశపుమధ్యనున్న మధ్యరాష్ట్రపు రాజధానియగు నాగపురమునొద్ద స్థాపించెను. అది ప్రత్తి పండు జిల్లాలమధ్య నున్నది; కలపగల యడవులు నేలబొగ్గును దానికి చేరువ; చుట్టుపట్ల జనపదములం దా మిల్లుసరకుల పోటీలేకుండ, అమ్మవచ్చును. ఆప్రాంతమం దెచ్చటను అప్పటికి బట్టలమిల్లే లేదు. దానిని 1877 ఆరంభమున స్థాపించి, 'ఎంప్రెస్‌మిల్లు' అని పేరిడిరి.*[4] బొంబాయి మిల్లుబట్టలకన్న, ఈయెంప్రెసుమిల్లుబట్టల చాల సన్ననివి, మెత్తవి, మన్నికగలవియై, చాల చౌకగగూడ నుండెను; అవి దేశమంతటను వ్యాపించి, ప్రసిద్ధమయ్యెను. ఈకంపెనీకి 'సెంట్రల ఇండియా స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్స్, అని పేరిడిరి.
జంషెడ్జి మేధావియగు 'దాదాభాయి' అను పార్సీ యువకుని తరిఫీయతుచేసి, అతని నీమిల్లుకు మేనేజరుగ నియమించెను. ఆయన తాతా యుద్దేశించిన కొత్తపద్ధతుల నమలులోనికి తెచ్చి, నిరంతరము కృషిచేయుచు, కార్మికుల బ్రోత్సహించుచు ఆమిల్లును వృద్ధిచేసెను. కొత్తపద్ధతులను ముందు సరిగా పరీక్షించి, అవి తృప్తికరమైనచో, (ఇతరయజమానులవలె జంకక) జంషెడ్జి ఎంత వ్యయప్రయాసములకైన సహించి, వెంటనే వానిని తనమిల్లులం దవలంబించెను. జనోపయోగము వ్యాపార వృద్ధియునే తనకు ముఖ్యముగ నెంచెను, కాని యాయన తన లాభమే ప్రధానముగ నెంచలేదు. అట్టి యాదర్శముతో, తన మిల్లులందు పాతబడిన యంత్రముల తీసివేసి, చాల హెచ్చుకిమ్మతువైనను, నవీనపరిశోధనల ననుసరించి తయారైన గుండ్ర కండెలను ఇంకను కొత్తపనిముట్లను తెప్పించి, తనమిల్లులందమర్చెను. అందువలన ఆయనమిల్లుల బట్టలు కొత్తరకపు మాంచెస్టరు సన్నబట్టలకును నాణెమున తీసిపోకుండెను. అవి యంతటను ఖర్చగుచుండెను. బిరారు నాగపురప్రాంతమున చక్కని ప్రత్తి పండును. ప్రత్తి పండు గ్రామముల మధ్యనే తాతా కొన్ని జిన్నింగు (=గింజలుతీయు) మిల్లుల నేర్పర్చెను. అచట కూలి చౌక. అందువల్ల దూది చాల చౌకగ తనమిల్లులకు చేరును; ఆగ్రామీణులకు నందుచే జీవనము నేర్పడెను. తాతా తనపనివాండ్ర కష్టములగమనించి, వారికి మంచి వసతిగృహముల నిర్మించెను. ఎక్కువ సమర్థులకు సాలీనాబహుమతులను, లాభములలో వాటాను గూడ, ఇచ్చుచుండెను. వారికి ప్రావిడెంటుఫండు పద్ధతినేర్పర్చి, సహాయముచేసెను. అందుచే వృద్ధులైనప్పుడా పనివాండ్రకు జీవనోపాధిలంభించును. ఆపనివాండ్రా యంత్రాలయము తమదనుభావముతో, ఉత్సాహముతో పనిచేయుచుండిరి. వారికై తాతా యుచితగ్రంథాలయమును, పఠనాలయమును నడిపెను; చిరకాలము పనిచేసి యశక్తతచే మానువారికి కొంతపారితోషికము గూడ నిచ్చుచుండెను. మనలో విద్యాధికులగు యువకు లుద్యోగములకే యత్నించుట యాచారమైనది; అట్లుగాక, ఉన్నతవిద్య నేర్చినవారికి పరిశ్రమలవైపు దృష్టి మరల్పదలచి, ఆయన కొందరుయువకులకు వ్యాపారోత్సాహము కల్గించి, వారిని సాలీనా ఎంప్రసుమిల్లులో చేర్చుకొని, వారికి పరిశ్రమల వివిధచర్యల నడుపువిధము నేర్పుచు, ఆతరిఫీయతుకాలమున వారికి కొంతజీతము గూడ నిచ్చుచుండెను. ఆయువకులు అందుమూడేండ్లు తమకిష్టమగు పరిశ్రమశాఖల నేర్చుకొని, అంతట తాతాసంఘమువారి కార్యాలయములోనే నిర్వాహకు లగుదురు; అందు ఖాళీలేనిచో, వా రితరత్ర పనిచేసుకొన వచ్చును. ఇట్లిందు నవీనవ్యాపార మర్మములందు తేలిన విద్యావంతులగు యువకులను బొంబాయి అహమ్మదాబాదుల మిల్లుదార్లు తమ మిల్లుల మేనేజర్లు (=నిర్వాహకులు)గ సంతోషముతో గ్రహించుచుండిరి. ఈరీతి నాయువకుల ద్వారా తాతాగారి పద్ధతులు కొంతవరకు నితరులమిల్లులకును వ్యాపించెను; వానిలో క్రమాభివృద్ధికల్గెను. తాతా దేశక్షేమమే ముఖ్యముగనెంచెను, కాని స్వలాభము ప్రధానమని యెంచనందున, వ్యాపారమర్మములను రహస్యముగనుంచక, తోటిమిల్లుదారులకును ధారాళముగ దెల్పుచుండెను. ఇట్లన్నివిధములను ఎంప్రెసుమిల్లులు వృద్ధిజెంది, జనాకర్షకమై మార్గదర్శకమయ్యెను. లాభకరమగు కొత్తపద్ధతులు మొదట ఎంప్రెసుమిల్లులో ప్రవేశమై, తరువాత కొంత వరకితరమిల్లులకుప్రాకి, వానికిని ఉపయోగించెను.
తాతా సాహసముతో చేయుప్రయత్నములలో కొన్ని మొదట విఫలమైనను, అంతటితో నిరాశుడుగాక, అనుభవమును బట్టి లోపముల సవరించి, అవసరమగు మార్పులజేసి, ఆయన తుదకు జయమొందుచుండెను. ఇట్లు 12 ఏండ్ల నిరంతర పరిశ్రమతో తాతా యామిల్లుల నాదర్శప్రాయముగ జేసెను; అంతటినుండి దాదాభాయియు నితరోద్యోగులునే ఆమిల్లుల నట్లు చక్కగ నడుపజొచ్చిరి; తాతా అందులకిక శ్రమపడలేదు. ఆయనతల పెట్టిన తక్కిన ఉద్యమములకుగూడ దాదాభాయి కుడిభుజముగ నుండి, సాయము చేయుచుండెను.
చక్కని పద్ధతులపై నడపుటచే, ఈకంపెనీకార్ధికముగను జయముకల్గెను. 30 ఏండ్లలో మూలధనముకు 13 రెట్లసొమ్ము లాభించెను. అందుకొంత కొత్తరకపు యంత్రములకై ఖర్చుఅయి, మిగిలినది భాగస్థులకు పంచియీయబడెను. ఆ మిల్లుకుకొత్త యంత్రము లేర్పడి, వ్యాపారమువృద్ధియై, తుదకది 5 పెద్దమిల్లుల సమూహముగా నేర్పడినది; వానికితోడు, అద్దకపుపనులు మున్నగు అనుబంధ పరిశ్రమలకును విశాలభవనములు, వసతిగృహములు, వ్యాయామస్థానములు మున్నగునవి చేర్చి కట్టబడినవి. ఆ మిల్లుల నిర్వాహకులగు తాతాకంపెనీవారు తరువాత నాగపురమం దున్నతవిద్యాభివృద్ధికి చాలసహాయముచేసిరి. 1921 లో తాతాపేర స్త్రీలకు హైస్కూలు స్థాపితమై, దానికి తాతాకంపెనీ వారు లక్షరూపాయలనిచ్చిరి. 1925 లో నాగపుర విశ్వవిద్యాలయ మేర్పడెను; అప్పుడు జంషెడ్జి తాతాకు స్మారకముగ 'యూనివర్సిటీ' భవనము నిర్మించుటకు తాతాసన్సు వారింకొక లక్షరూపాయలనిచ్చిరి. ఇట్లు తాతాకుటుంబమువలన, ఎంప్రెసుమిల్లుద్వారా నాగపురప్రాంతమున వేలకొలదిజనులకు జీవనోపాధి యేర్పడుటయే గాక, అనేక విద్యాసంస్థలకును చాల ప్రోత్సాహము కల్గెను.
- __________
- ↑ * నగ్న సిద్ధాంతము కొంత వినోదహేతువైనను జనులలో వ్యాపించుట లేదు. మానరక్షణముకేగాక, శీతోష్ణాదులతీవ్రతనుండి శరీరమును కాపాడుటకును వస్త్రధారణమవసరమే.
- ↑ † క్రీ. పూ. 4 వ శతాబ్దిలో అలెగ్జాండరుతో మనదేశముకు వచ్చిన గ్రీకుచారిత్రకులు ఇతర లేఖకులు మనదేశమువలన మిక్కిలి సన్నవస్త్రములు నేయబడి వాడుకలోనున్నట్టులవర్ణించిరి. సంస్కృత కావ్యగ్రంథములందు గూడ నిట్టివర్ణనగలదు.
- ↑ * రొక్కపు రూపమున పోల్చినచో, చేతివడుకు నేతలచే ఒకనికివచ్చు ఆదాయము చాలతక్కువ (అది మిల్లుకూలికి తీసిపోవును) కాని ఆచేతిపనులను బీదలు తమయింటనే కొద్దిపాటి మూలధనముతో స్వేచ్ఛతో చేసుకొనవచ్చును; మరియు తమయితరకార్యములకు భంగములేకుండ, ఇంట స్త్రీలు బాలురుకూడ తీరికమైనప్పుడు నేసుకొనవచ్చును. ఇట్టి స్వతంత్రవృత్తి ప్రతివారికిని అందుబాటులోనుండును. కూలీలకు యజమానులకృపయే ఆధారము. యంత్రాలయముల పరిస్థితులు ననారోగ్యకరములు; కాని, జనులు చౌకయగు మిల్లుబట్టలనే అభిమానించిరి. అందుచే మనదేశములో వడుకుట నేత క్షీణించి మిల్లుబట్టలే వ్యాపించినవి.
- ↑ * మన 8 వ ఎడ్వర్డు రాజుకు ప్రపితామహి అప్పటిరాణిఅగు విక్టోరియా 1-1-1877 తేదీని మనదేశపు 'ఎంప్రెస్'(=చక్రవర్తిని) బిరుదువహించెను. ఆతేదీనే ఈమిల్లునేర్పర్చిరి.