Jump to content

తాతా చరిత్రము/కొన్ని వ్యాపార సమస్యలు : ప్రత్తి పంట

వికీసోర్స్ నుండి

6. కొన్ని వ్యాపార సమస్యలు : ప్రత్తి పంట.

ఇట్లామిల్లులు వృద్ధియైనంతట, వానిని తాతాయుద్యోగస్తులే ఆయనపద్ధతులతో స్వయముగ నడుపదొడగిరి. ఇట్లు కలిగిన తీరికతో, ఈవ్యాపారసంబంధమగు కొన్నిముఖ్య సమస్యలను జంషెడ్జి పరిష్కరింప యత్నించెను. అందు ప్రత్తి వ్యవసాయము, నౌకావ్యాపారము, కార్మికసమస్య, దూదిసరుకులపై పన్ను, ముఖ్యములు.

మనదేశపు రయితులు సాధారణముగా చాలబీదలు, చదువులేనివారు; నవీనపరిశోధనలు, వానిని వ్యవసాయముకు వినియోగించు విధములు, వారికి తెలియవు. చిరకాలమునుండి కురచపోచగల మామూలు ప్రత్తినే చాలవరకిప్పటికిని మనరయితులు పండించుచున్నారు. ఆప్రత్తినుండి సన్ననూలు వచ్చుట దుర్లభము. పొడుగుపోచగల్గి సన్ననూలు నీయగల జడప్రత్తి, కంబోడియాప్రత్తి, మున్నగు రకములను ధారళముగా పండించుటకవలంబించు పద్ధతులను కొందరు విద్యావంతులు విదేశములందు నేర్చుకొని, అట్టిప్రత్తిని ఆయాప్రాంతములందు పండించి, రయితులకు చూపినచో, వారు నేర్చుకొందురు; అట్టి మంచి ప్రత్తిసాగు మనదేశముననిట్లు క్రమముగ వ్యాపించును. వానితో మనమిల్లులందు సన్ననూలునే తీయవచ్చును. అట్టిదూది మనదేశమున సమృద్ధిగా లేక, దానిని సన్ననూలుకై యితరదేశముల నుండి చాల సొమ్మిచ్చి తెప్పించుకొనవలసి వచ్చుచున్నది; మన దేశమున సాగగు ప్రత్తికి తగు గిరాకి లేకున్నది. ఇట్లు మన వ్యవసాయదారులకును కూలీలకును వృత్తి తగ్గుచున్నది. మరియు మంచిదూదికై విదేశములపై ననే యాధారపడుట మన మిల్లుపరిశ్రమ కెప్పటికైనను అనర్థకమే.

తాతా ఈస్థితికి ప్రతిక్రియ నాలోచించెను. ఈజిప్టు మనదేశముకు సమీపము. అందు, ఇటీవల నైలునదిదగ్గర ప్రశస్తమగు ప్రత్తిసాగు ఆరంభించి, తృప్తికరముగ జరుగుచున్నది. తాతా ఈజిప్టువెళ్ళి, అచటి ప్రత్తిసాగు పద్ధతుల స్వయముగ జూచి, అందుండి కొత్తరకపు మేలైన ప్రత్తివిత్తులను నాగళ్ళనుతెచ్చి, ఆవ్యవసాయ పద్ధతులను కొన్ని వీలైన భూములందు స్వయముగా అమలుజరిపించి చూపెను. ఆప్రత్తిసాగుకు కొంత జ్ఞానము, సాహసము, పెట్టుబడి, అవసరములు; అవి యిచ్చటి మామూలు వ్యవసాయస్థులకు లేవు. ఆరంభకాలమున ప్రభుత్వము మిల్లు యజమానులుకూడ నిందుకు రైతులకు తగుప్రోత్సాహ మీయవలెను. ఆసాయమప్పుడు కలుగ లేదు; తక్కినమిల్లు యజమాను లిందుకు తోడ్పడరైరి; అందుచే, తాతా తీవ్రముగ యత్నించినను, ఆవ్యవసాయము దేశమం దంతగా నప్పుడు వ్యాపించలేదు. తాతా తెల్పినను, ప్రభుత్వమును అప్పుడు తగుశ్రద్ధ వహింపలేదు, ఆప్రత్తి యీదేశమున పండదని వారెంచిరి. కాని తరువాత ప్రభుత్వశాఖవారు కొందరు మిల్లుయజమానులునుగూడ, తాతా కనపర్చిన పద్ధ తిని, సింధు కతియవారు ప్రాంతములందు, అట్టి ప్రత్తిని పండించిరి. అందుచే తాతాగారి ఆయత్నము సవ్యమే అని స్పష్టమయ్యెను.*ఆప్రకార మిటీవల నవీనపద్ధతులతో చాలచోట్ల, ఈ కొత్తరకముల ప్రత్తిని రయితులును పండించగల్గుచున్నారు.


___________
  1. * బ్రిటిషుదేశమున సన్నబట్టల మిల్లులు హెచ్చుగకలవు. అందుకు వలయుదూదికై యెల్ల కాలమును అమెరికాపై నాధారపడక, సామ్రాజ్యమందే అట్టిప్రత్తిని పండింపవలెనని, బ్రిటిషు పారిశ్రామికులు నిశ్చయించిరి. అంతట ప్రభుత్వసహాయముతో నీజిప్టులో కొంతమంచిప్రత్తి సాగుచేయబడెను. ఇట్లే భారతదేశమున ఇట్టిప్రత్తి పండుచో, ఆదూదిని ఆంగ్లసీమకు చౌకగ తెప్పించు కొనవచ్చును. అందుకు ప్రత్యామ్నాయముగ తిరుగ స్టీమరులందు కిఫాయతీరేటుపన్నుతో తమసీమబట్టలను మనదేశమున దింపి యిచట విక్రయించుట లాభకరమగును. బ్రిటిషువర్తకుల ప్రోత్సాహముతో ప్రభుత్వమువారు శ్రద్ధవహించి ఇటీవల మంచి ప్రత్తిపండించుట కేర్పాటుల జేసిరి.