Jump to content

తాతా చరిత్రము/నౌకావ్యాపారము

వికీసోర్స్ నుండి

7. నౌకావ్యాపారము.

మనదేశపు మిల్లులం దిదివరలో ముదుకబట్టలే తయారగుచుండెను. వానిలో కొన్నిమాత్ర మిచట ఖర్చు అయినను, చాలభాగము చీనా జపాను పారసీకము తూర్పుఆఫ్రికామున్నగు విదేశములందే అమ్ముచుండెను. (అప్పటికింకను జపానులో మిల్లు లేర్పడలేదు; ఆపోటీబాధ తగుల లేదు.) బొంబాయి ప్రాంతములనుండి ఆదేశములన్నిటికిని స్టీమరులపైననే సరుకుల బంపవలెను. మనదేశమునుండి అప్పు డాదేశములకు బ్రిటిషు వారి పి. అండ్ ఓ. కంపెనీయు, ఇటలీ ఆస్ట్రియాల మరిరెండు కంపెనీలునే, ఓడలనడుపుచుండెను. ఈకంపెనీలమధ్య పోటీ యున్నంతకాలము కేవుల రేట్లు న్యాయముగనే యుండెను. కాని యాసరుకుల యెగుమతికి తామే యాధారమగుట గాంచి, ఈ మూడు యూరపియనుసంఘములు నేకీభవించి, కేవులను చాల హెచ్చించిరి. అందువలన మన మిల్లుదార్ల లాభపుద్రవ్యమంతయు కేవులరూపమున హరించి, నౌకాసంఘములకు పోవుచుండెను. కష్టపడి వ్యాపారముచేయు బొంబాయిమిల్లు వర్తకులకు గిట్టుబాటే లేకుండెను; కాని వారు చేయునది లేక యట్లే సరుకుల బంపవలసివచ్చెను. ఈవర్తకులలో నొకరగు జంషెడ్జి తాతా ఆయూరపియను కంపెనీల యన్యాయచర్యలకు ప్రతిక్రియ చేయదలంచెను; న్యాయమైనరేటుకే బొంబాయినుండి చీనాజపానులకు సరుకులగొనిపోగల మరియొకసంఘ మేర్ప డుట యవసరమని కనిపెట్టి, అందుకై తీవ్ర యత్నము చేసెను. అందు దేశీయనౌకల జేర్చుటకును ఆయన తలపెట్టెను.

పూర్వము మనదేశపు వివిధవస్తువులు అప్పటి నాగరిక దేశములన్నిటికిని హిమాలయపు కనుమలగుండ మెట్టదారిని, సముద్రముపై నోడలమీదనుగూడ, ఎగుమతి యగుచుండెను. కొందరు భారతీయు లప్పుడావిదేశములకు జని, అందు విజ్ఞానమును వ్యాపారమును వ్యాపింపజేసిరి. ఈరాకపోకలు, ఎగుమతి, చాలవరకు మనదేశపు నౌకలపైననే జరుగుచుండెను. మనతీరములందు తామ్రలిప్తి, కురంగపురము (కోరంగి) భారుకచ్ఛము (బ్రోచి) మున్నగు పురముల రేవులయొద్ద గొప్పనౌకలు నిర్మితము లగుచుండెను. ఇప్పటికి సుమారు నూరేండ్లక్రిందటి వరకును మన దేశపుఓడలు దేశాంతరములకు కోస్తావ్యాపారము జరిగించుచునే ఉండెను. నూరేండ్లక్రింద బొంబాయి రేవులోకట్టిన కొన్నియోడలు యూరపుకు గొంపోబడి, అచటి సముద్రములందు బ్రిటిషు యుద్ధనౌకలకన్నను వన్నెగా పని చేసెను. కాని తరువాత పరిస్థితులు మారెను. మననౌకలకు ప్రభుత్వాదరణ పోయెను. పాశ్చాత్యదేశముల ప్రభుత్వములు అచట మంచినౌకల నిర్మించుటకు విశేషప్రోత్సాహ మొసగిరి. ఆదేశముల వ్యాపారము వృద్ధియయ్యెను. అచటి విజ్ఞానమును వృద్ధియై, అందుమూలమున పాశ్చాత్యులు క్రమముగ ఇనుముతోను ఆవిరియంత్రములతోను మహానౌకల నిర్మింపగలిగిరి. మనదేశమున విజ్ఞానవ్యాప్తి లేక, ఆసౌకర్యము లేకుండెను. ఆధునిక నౌకల నిర్మాణమునకు కోట్లకొలది రూపాయల పెట్టుబడి కావలెను; మన వ్యాపారుల కట్టి పెట్టుబడియు లేదు. క్రమముగ విదేశనౌకల పోటీ ధాటికి నిలువలేక, మనకోస్తా నౌకలు రంగస్థలమునుండి తొలగి మూలబడెను; ఇట్లీదేశపు నౌకానిర్మాణము క్షీణించిపోయెను.

మిల్లుసరుకులు మున్నగువానిని ఆయాదేశములం దమ్మబోవుటలో విదేశీయులకును భారతీయులకును పోటీ హెచ్చుచున్నది. పాశ్చాత్యులును మనవారును తమతమ సరుకులను చీనాజపానులం దమ్ముట కెగుమతిచేయుచుండిరి; అచట తమ తమ సరుకులను చౌకగ విక్రయింప యత్నించిరి. ఇట్లాదేశములందు కొంత పోటీ కల్గినది. ఇట్లుండ, మనతో పోటీపడు పాశ్చాత్యుల వశమందలి విదేశీయనౌకలే మనదేశపు సరుకుల యెగుమతి కాధారమగుటవలన బాధలు కలుగ నారంభించెను; స్వదేశవ్యాపారము సముద్రముపైన మనచుట్టుపట్ల దేశములతో ప్రాచ్యనౌకలపైననే జరుపవలెనని తాతా గ్రహించెను. ఆరంభమున నౌకావ్యాపారములో కొంతనష్టము కలుగునని జంషెడ్జి యెరుగును, కాని ఆత్యాగమున కాయనసిద్ధపడెను. ఆయన అద్దెషరతుపైన యూరపునుండి రెండు పెద్దనౌకల సంపాదించెను. అప్పుడు జపానీయులు తమప్రభుత్వపు సాహాయ్యమున మంచి నౌకల నిర్మించి నడుపుచుండిరి. ఈవ్యా పారము విశేషద్రవ్యసాధ్యము. మనకు ప్రభుత్వసహాయమును లేదయ్యెను. అందుచే వ్యాపార జయముకై తాతా అప్పటి జపాను నౌకాసంఘముతో కలసి నౌకల నడుపదలచెను. అట్లు గానిచో ప్రబలప్రత్యర్ధులగు యూరపియను నౌకాసంఘముతో పోటీచేయుట అసంభవము. ఈవ్యాపారము జయప్రదమగుటకు, బొంబాయి వ్యాపారులు తమ మిల్లు సరుకులను ఆనౌకల పైననే న్యాయమైన కేవుకు పంపుటయు, యూరపియనులు పోటీ పడగొట్టుటకై కేవుల తగ్గించి ఆకర్షించినను, వీరు చలించకుండుటయు, ముఖ్యావసరము. అట్లీయోడలపైననే రెండెండ్లవరకు తమ సరుకుల బంపుటకు బొంబాయి వ్యాపారులు తాతా కొడంబడిక నిచ్చిరి. ఆప్రకారము తాతాయు జపాను నౌకాసంఘముకు ఖరారుచేసెను. బొంబాయినుండి నూలును బట్టలు మున్నగు సరుకులను ఈనౌకలు చీనాజపానులకు గొనిపోయి, అందుండి మరలి వచ్చునప్పుడు అగ్గిపెట్టెలను, అద్దములు, నేలబొగ్గు మున్నగువానిని, తెచ్చుచు; అందుచే, ఉభయులవ్యాపారమును వృద్ధియగును. యూరపియనులు ముందుగానే విఘ్నము కల్గింపకుండుటకై, ఈయేర్పాటులన్నియు జాగ్రత్తతో గూఢముగ జేయబడెను.

ఇట్లంతయు పూర్తియై, 1893 లో, ఆనౌకలు బొంబాయి రేవునుండి నూలును, బట్టలనుకొనిపోదొడగెను. కెవు నెంతహెచ్చించినను బొంబాయినుండి సరుకుల గొనిపోవుటకు తామే దిక్కని తలచుచుండిన యూరపియనుకంపెనీలవా రీదృశ్యమును చూచి, మొదట దిగ్భ్రమజెందిరి. తాతాపన్నిన ప్రతియుక్తి వారికప్పుడు తెలియవచ్చెను. ఆకంపెనీలవా రంతట నసూయావిష్టులై, ఈ 'తాతాజపాను' నౌకల నెట్లైనపడగొట్టుటకు నిశ్చయించుకొనిరి. ఈ 'తాతాజపాను' నౌకాసంఘమువారు, చాలసరసమై న్యాయమగు రేటునకే సరుకుల గొంపోవుచుండిరి. అప్పటికి యూరపియనునౌకల కేవురేటు చాలహెచ్చు. కాని 'తాతాజపాను' కంపెనీకెట్లైన నష్టముకల్గించి యాయోడలసాగకుండ చేయుటకై, యూరపియనులు వెంటనే తమ హెచ్చు రేటుల వదలుకొనుటయేగాక, 'తాతాజపాను' వారిరేటుకన్న నింకను తమరేటులదగ్గించిరి. ఐనను, ఆరంభమున బొంబాయివ్యాపారులు తమసరుకులను చాలవరకు 'తాతాజపాను' నౌకలపైనే పంపుచుండిరి. అంతట యూరపియనునౌకలవా రొకతంత్రము పన్నిరి. తమ రేవులనింకను బొత్తిగతగ్గించి నామమాత్రముగ జేసియు, దానినిగూడ వదలుకొనియు, ఉచితముగనే బొంబాయినుండి చీనాజపానులకు తమనౌకలపైన సరుకులగొనిపోదొడగిరి. కాని అట్లు సరుకులబంపువారు, (తమకుపోటియగు) 'తాతాజపాను' నౌకలపైనమాత్రము మరియెట్టిసరకులను గూడ పంపగూడదని యాయూరపియనులు విషమనియమ మేర్పర్చిరి. ఈషరతుల ఉద్దేశము పోటీదారుల బడగొట్టుటయే యనిస్పష్టముగ కనబడుచున్నను, బొంబాయివ్యాపారులు క్రమముగా నా మాయలోబడిరి. ఆయూరపియను నౌకాసంఘములవా రేటేటను కోట్లకొలది రూప్యముల నార్జించి యార్జించి, చాలయైశ్వర్యముతో దులతూగుచుండిరి; వ్యాపారమున అనేక సౌకర్యములు గల్గియుండిరి. యూరపునుండి అన్నిప్రాంతములకు గొప్పవ్యాపారముచేయు నీమహాసంఘములకు, ఈబొంబాయి చీనాప్రాంతము లందుమాత్రము రెండుమూడేండ్లు నష్టమువచ్చినను, అదివారికొకలెక్కకాదు. వారికిపోటీగనున్న 'తాతాజపాను' సంఘము బాల్యస్థితిలో నున్నది; దానికంతగా మూలధనమును, తమకున్నవిశేష సదుపాయములును, లేవు. ఆ'తాతాజపాను' సంఘముకు సరుకులయెగుమతియే లేకుండ జేసిన, అది దివాలాతీయక తప్పదు; అంతట యూరపియనునౌకలు మరల కేవులనిచ్చవచ్చినట్లు హెచ్చింపవచ్చును. ఈమర్మమును తాతాముందుగనే తోటి బొంబాయివర్తకులతో తెల్పెను. కాని కొన్ని నెలలు బొంబాయివర్తకులు తమవాగ్దానము నిలుపుకొన్నను, ఉచితముగసరుకులబంపుకొని లాభమొందుదుమను పేరాసచే, వారిలోకొందరు తాము తాతాకిచ్చిన మాటకు భిన్నముగ పాశ్చాత్యనౌకలందే సరుకుల నెగుమతి చేయదొడగిరి; వారినిజూచి, మరికొందరును అట్లే చేసిరి. ఇట్లు యూరపియనుకంపెనీల తంత్రము సాగినది; సరుకులన్నియు వారియోడలందే చేరెను; 'తాతాజపాను' ఓడలకు సరుకులు లేవయ్యెను. ఇట్లు తోటివర్తకుల వ్రతభంగముచే, తాతాకు ద్రోహముజరిగెను; వ్యాపారము స్తంభించెను; నెలనెలకు వేలకొలది రూపాయలు వెచ్చించి శ్రమకోర్చి నౌకలనడుపుచున్నను, ఎగుమతి లేనందున, తాతాయు జపానునౌకలును చేయునదిలేక, తుదకా నౌకావ్యాపారము నిల్చిపోయెను. జపాను నౌకలు తమదేశమునకు తిరిగిపోయెను. ఇట్లాయొడంబడిక చెడినందున, తాతాయు తాదెచ్చిన నౌకలను యూరపునకంపివేసెను. జపానీయుల కందుచే చిరాకును నష్టమునుకల్గెను. కాని ఈరీతిని భారతదేశముతో వర్తకానుభవముగల్గించి, యధాశక్తిగ వ్యాపార నీతి నమలుజరిపినందుకు, తాతాగారిని జపానీయులు మెచ్చుకొనిరి. తాతాయు తనసొమ్ము నష్టముకు అంతగా విచారించలేదు; కాని తోటివ్యాపారు లిట్లు దూరదృష్టి లేక, తత్కాలలాభమునే చూచుకొని, ఏకీభావమువదలి, మాటతప్పి, దేశహితముకు వ్యతిరేకముగ నడచిరనిమాత్ర మాయన చింతిల్లెను. తాతా యూహించినట్లే, 'తాతాజపాను' నౌకలుపోయిన కొద్దినెలలకే, యూరపియను కంపెనీలవారు తమ యోడలపైన కేవులను పూర్తిగా విధించిరి; మరియు బొంబాయివర్తకుల అసహాయతను గమనించి, వారిసరుకులపై కేవు రేటునింకను హెచ్చించి, యూరపియను కంపెనీలు తమ వెనుకటి స్వల్పనష్టమును గూడ వారివల్లనే రాబట్టిరి. తాతాసలహాను పెడ చెవిని బెట్టినందుకు తగుఫలితము కల్గెనని బొంబాయివర్తకుల కప్పుడు పశ్చాత్తాపము కల్గెను. వారిచ్చిన లిఖితనియమముకు భిన్నముగ నడచినందులకా తోటివర్తకులపైన నష్టపరిహారము పొందదగియున్నను, ఉదారు డగు తాతా యట్టి ప్రయత్నము చేయలేదు. సంఘీభావము బలము. మనవర్తకు లేకీభవించినచో, దేశీయవర్తకము సురక్షితమై జయప్రదమగునని, లేనిచో చెడునని, తాతాగారి యా యుద్యమముచే స్పష్టమయ్యెను.

తరువాత 1908 ప్రాంతమున దక్షిణమున 'తూత్తుకుడి'కి సింహళముకు మధ్య చిదంబరపిళ్ళగా రిట్లే యొక దేశీయ నౌకాసంఘమును బెట్టి, ఓడలనడిపిరి. అచ్చటను, అట్లే బ్రిటిషు నౌకాసంఘమువా రాపోటీ పడగొట్టుటకై తమ కేవులను విపరీతము తగ్గించగా, ఆకంపెనీయు తాళలేక నశించెను.

ఇప్పుడు మన భారతీయవర్తకులలో కొంత జ్ఞానమును, దేశమున జాతీయభావమును, వ్యాపించియున్నవి. అందుచే తాతాకుటుంబీయులును, వారి మిత్రులగు కొందరు పెద్దవర్తకులును కలసి బొంబాయిలో 'సిందియా స్టీంనావిగేషన్ కంపెనీ^' అనుపేర నొక పెద్ద నౌకాసంఘము నిటీవల స్థాపించి, కొన్నియేండ్లనుండి నడుపుచున్నారు. కొందరు సంస్థానాధీశులును, ఇతర శ్రీమంతులును, దీనిలో వాటాలదీసికొని సహాయము చేసిరి. తగినంత ప్రభుత్వప్రోత్సాహము లేకున్నను, ఇప్పుడీ నౌకాసంఘము వృద్ధిలోనే యున్నది. ఈసంఘమువారు గొప్ప పొగయోడల గొనిరి, కొన్నింటిని కట్టించిరి. జలదుర్గ, జలదూత, జలవిహార, మున్నగు పేర్లుగల యానౌక లిప్పుడు మనదేశపుతీరములం దంతటను చీనా జపానుప్రాంతములకును తిరుగుచు, విదేశకంపెనీలతో పోటీకి నిలిచి, వ్యాపారము సల్పుచున్నవి. ఇటీవల వంగదేశమున, ఇంకొక జాతీయనౌకాసంఘమేర్పడి, ఆప్రాంతమున నౌకావ్యాపారము చేయుచున్నది.

ఇట్లు తాతా యత్నమును సద్య:ఫలము లేకపోయినను, ఆయనుభవము లీకంపెనీల కుపకరించి, కొలదికాలముకే దేశీయనౌకాసంఘము లేర్పడి పనిచేయుచున్నవి.



_________