తాతా చరిత్రము/లోహయంత్రశాల

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

12. లోహయంత్రశాల.

జంషెడ్జి తాతా తన అంత్యకాలముకు ముందు మరి రెండు పెద్దపరిశ్రమలగూడ స్థాపింపయత్నించెను. అందొకటి మంచియినుమును, ఇనుపవస్తువులను జేయుట; రెండవది జలపాతమూలమున విద్యుచ్ఛక్తిని తయారుచేసి, దానిని చోదక శక్తిగను, దీపాదులకును, వినియోగించుట. బొంబాయిలోని మిల్లు పరిశ్రమ పరాధీనత లేకుండ, వీలైనంతవరకు నిరాఘాటముగ సాగవలెనని, ఆయనగాఢముగ కోరెను. మిల్లులను ఇతర పరిశ్రమలను స్థాపించుటకు వలయు యంత్రములన్నిటిని, చాల వ్యయప్రయాసలకులోనై, మనమితరదేశముల నుండియే తెప్పించుకొనవలసి వచ్చుచున్నది. సూది, గుండుసూది, మంచిచాకులు, మేకులు, ఉక్కు తీగలు మున్నగు నిత్యావసరమగు చిన్నపనిముట్లుగూడ తరుచు విదేశములనుండియే తెచ్చుకొనుచుంటిమి. ఇవి మనదేశమందే తయారు కావలెనన్నచో, మంచియినుము, ఉక్కు సమృద్ధిగ తయారుచేయవలెను. మరియు బొంబాయిలో మిల్లులు మున్నగు యంత్రములకు చోదకశక్తినిచ్చు నేలబొగ్గు చాలదూరమునుండి రావలెను. అది సమృద్ధిగ సకాలముకు దొరుకకను, రాణిగంజి ప్రాంతమునుండి రైలుపై దెచ్చుటకు వ్యయప్రయాసలు హెచ్చుట వల్లను, బొంబాయి పరిశ్రమలకు చిక్కు గల్గుచుండెను. అందువలన తాతా బొంబాయికి సమీపమగు సహ్యాద్రిలో జలపాతముగల్గించి, దానితో విద్యుచ్ఛక్తి జనింప జేసి, దాని నీయంత్రాదుల కుపయోగింపదలచెను.

ఈరెండు మహాపరిశ్రమలను ఆయన తలపెట్టినను, 1904 లోనే యామహనీయుడు మరణించుటచే, తానేవానిని స్థాపించి జరుపుటకు వీలుకలుగలేదు. ఆయన కోరికప్రకారము వాని నాయనపుత్రులు పూర్తిచేసి నిర్వహించిరి. *[1]

ఆధునిక నాగరికత అయోమయము అయ:పరిశ్రమతోనే గొప్ప మరఫిరంగులను, గుండ్లను, శస్త్రములను, గొప్ప యుద్ధనౌకలను తయారుచేసి, పాశ్చాత్యజాతులు, జపానీయులు, బలీయులైరి. ఇంజనులు, రైలుపట్టాలు, కత్తులు, మేకులు, మరలు మున్నగు పనిముట్లును ఇనుపవే. ఇనుపవస్తువుల వాడుక యింకను హెచ్చుచున్నది. ఇటీవల గొప్ప భవనములు, వంతెనలు, భద్రమగు పెట్టెలు, పనిముట్లు, మున్నగువానికిని క్రమముగా కర్రకు బదులు యినుమునే వాడుచున్నారు. పూర్వము, మనదేశమున లోహపరిశ్రమ వృద్ధిలో నుండెను. ఇచటి యినుప ఆయుధములు దేశాంతరములందును ప్రసిద్ధిజెందెను. చిరకాలమునుండియు మనదేశమున నేటికిని చెక్కు చెదరకయున్న 'కుతుబ్ మినారు'ను బోలుకట్టడము లద్భుతములు; అవి మన పూర్వికుల లోహశిల్పముకు నిదర్శనములు. కొన్ని ఖడ్గములుమున్నగు వివిధశస్త్రములు విదేశములకు చాల యెగుమతి యగుచుండెను.

ఆపరిశ్రమ 18 వ శతాబ్దివరకు జరుగుచుండి, అంతట నితరపరిశ్రమలవలె క్షీణించినది. పాశ్చాత్యు లీరెండు శతాబ్దులలో తమవిజ్ఞానము వృద్ధిజేసుకొని, గనులనుండి భస్మముతీసి శుద్ధిజేసి, లోహపరిశ్రమలో నవీనపద్ధతుల గనిపెట్టి, వివిధయంత్రములను పనిముట్లను యంత్రసహాయమున చౌకగ చేయదొడగిరి. వాని దిగుమతిచే, పోటీవలన, మనలోహపరిశ్రమ క్రమముగ మూల కొదిగెను. రైళ్ళువచ్చిన మీదట విదేశపు లోహవస్తువులు మన దేశమున మూలమూలలకు గూడ వ్యాపించెను. అంతట మన లోహపరిశ్రమ లడుగంటెను. ఇక పురాతన పద్ధతులతో నీదాడి నెదుర్కొనుట సాధ్యముకాదు.

కర్రబొగ్గుతో కొలుములద్వారా ఇనుపపొడిని కరగించు పూర్వపద్ధతి లాభకరముకాదు. పాశ్వాత్యదేశము లందువలె వైజ్ఞానిక పద్ధతినే గనులనుండితీయు యినుపపొడిని నేలబొగ్గు నిప్పుతో బాగుగ కాచి, కరగించి, సున్నముతో శుద్ధిచేసి, పోతపోసి, ఉక్కును పనిముట్లను తయారుచేయవలెనని, జంషెడ్జి నిశ్చయించెను. అట్లు పెద్దయెత్తున చేసిననే, అవి ప్రశస్తములై, చౌకగ గిట్టుబాటగును. ఇందుకు నేలబొగ్గు, ఇనుము, సున్నము, ఈమూడింటి గనులు సమీపముగనుండి జలవసతిగూడ గల ప్రదేశమవసరము. ఈవస్తువులు బలువువి. ఆగనులు పరస్పరము దూరమందుండిన లాభములేదు. మరియు అవి సమృద్ధిగ లేకున్న పెద్ద యెత్తున చౌక యగునట్లు తయారుచేయ వీలుండదు.

ఈదేశమున నట్టి సన్ని వేశ సౌకర్యములుగల గనులులేవని, అందువలన పెద్దఅయ:పరిశ్రమ సాధ్యముకాదని, మనదేశపు ప్రభుత్వోద్యోగులు భూతత్వజ్ఞులుగూడ తలచుచుండిరి. కాని తాతా అట్లెంచలేదు. ఈదేశమందు తయారైన పూర్వపు లోహవస్తువు లుండుట బట్టియే, అట్టిసౌకర్యములు మన దేశమందుండి తీరునని, సరిగ వెదకినచో అట్టిగనులు దొరకుననియు, ఆయనకు దృఢవిశ్వాసముండెను. ఇందునుగూర్చి ప్రచురితమగు గ్రంథములన్నిటిని, కరపత్రములనుగూడ, ఆయన యెప్పటి కప్పుడు, తెప్పించి జాగ్రత్తతో పరిశీలించుచుండెను.

మనదేశపు మధ్యరాష్ట్రమున చందాజిల్లాలో లోహగనులు కలవు. వానినిగూర్చి 'వాన్ స్వార్‌' అను జర్మను వైజ్ఞానికుడు వ్రాసిన వ్యాసమును మనప్రభుత్వమువారు 1882 లో ప్రచురించిరి. అప్పుడు జంషెడ్జి మధ్యరాష్ట్రమున బట్టలమిల్లు కనువగు స్థలముకై తిరుగుచుండెను. వెంటనే యావ్యాసమును చదివెను. అచట 'లోహర' యనుచోట లోహఖనియు, సమీపమున 'వరోర' లో నేలబొగ్గుగనియు కలవని, కానివానిని పనిచేయుటకు ప్రతిబంధము కలదనియు, అందు తెలుపబడెను. జంషెడ్జి వెంటనే యాలోహముకు బొగ్గుకు మచ్చులను తీసుకొనివెళ్ళి, వానిని స్వయముగ జర్మనీలో గొప్పలోహయంత్రశాలలందు వైజ్ఞానికముగ పరీక్ష చేయించెను. వానితో మంచియుక్కు తయారగునని తేలెను. వెంటనే స్వదేశముకు తిరిగివచ్చి, ఆయన మధ్యరాష్ట్రపు గవర్నరగు మారిసుదొరగారితో మాట్లాడి, ఆగనులస్థలములను, ఆప్రాంతమందున్న 45 మైళ్ళ బ్రాంచిరైలులైనునుగూడ తనకు కవులుకిమ్మని కోరెను. (బలువగు నావస్తువుల జేరవేయుటకా రైలులైనుకూడ అవసరము) ఎంప్రెసుమిల్లు స్థాపకుడై మధ్యరాష్ట్రముకు మహోపకారము చేసిన తాతా యందు గవర్నరుకు గౌరవమే; కాని భారతప్రభుత్వమువారా రైలులైను నెవ్వరికిని కవులుకిచ్చుటకు నిరాకరించిరి. అందుచే నాప్రయత్న మంతటితో నిల్చిపోయెను.

కాని, తాతా యధైర్యము జెందక, తరువాతగూడ లోహపరిశ్రమకై పరీక్షలజేయుచునే యుండెను. లోహతత్వజ్ఞులతో నావిషయమును వీలైనప్పుడెల్ల చర్చించుచుండెను. 1899 లో 'మాహన్‌' అను ప్రభుత్వసేనాని యొకడు మనదేశమున లోహపరిశ్రమజేయుట కవకాశములగూర్చి యొక రిపోర్టును ప్రచురించెను. 'ఝరియా' ప్రాంతమున నినుము చేయవచ్చునని, అందుకు సున్నపురాళ్ళనుమాత్రము బర్మానుండి తేవలెనని, అందు వ్రాయబడెను. ఈరిపోర్టును వెంటనేచదివి, జంషెడ్జి మరలతీవ్రకృషి నారంభించెను. గనులకు ప్రభుత్వమువారిచ్చు కవుళ్ళ విషయమై యప్పటికమలులోనుండిన నియమము లతికఠినములై యుండెను. 1899 లో, అందుప్రతిబంధకమైన షరతులు తగ్గింపబడినవి. అంతట గనులపని కొంతసుకరమయ్యెను. జంషెడ్జి 1900 సం. లో నింగ్లండుకువెళ్ళి, అచట భారతమంత్రియగు హమిల్టను ప్రభువుతో లోహపరిశ్రమ స్థాపించుటకై తానుచేయు యత్నములగూర్చి చెప్పి, ఆయనసానుభూతిని సంపాదించెను. 1882 లో వలెగాక, ఈసారిప్రభుత్వమువారతనికి సాయముచేయగలరని, హమిల్టనుగారు వాగ్దానముచేసిరి.

అంతట స్వదేశముకు తిరిగివచ్చి, జంషెడ్జి చందాజిల్లాలోని 'లోహర' గనుల కవులకై మరల దరఖాస్తుపంపెను. ప్రభుత్వమువారీసారి యనుకూలభావము దెల్పిరి. కాని చాలవివరములగూర్చి దీర్ఘ విచారణ, ముందుగా పరిశోధన, కావలెనని తేల్చిరి. 1902 వేసవిని తాతా మరల బ్రిటనుకుచని, ఆలస్యము లేకుండ జేయుమని భారతమంత్రితో ప్రశంసింపదలచెను. అప్పుడు విక్టోరియా మరణానంతరము, 7 వ ఎడ్వర్డురాజుగారి పట్టాభిషేకోత్సవపు ప్రయత్నములు జరుగుచుండెను. ఆతొందరవలన భారతమంత్రికి తీరిక లేకుండెను. అంతట నింగ్లండు జర్మనీల బొగ్గుగనులను, అచటి యుక్కుయంత్రశాలలను బరీక్షించి, తాతా యమెరికాకు చనెను. అందు సంయుక్త రాజ్యమున లోహపరిశ్రమ చాలవృద్ధిలో నున్నది. అచటి నిపుణులతో మాట్లాడి, ఆయన వారిపరిశ్రమపద్ధతుల గమనించెను. అటనుండి తనకుమారునికి వ్రాసి, మనదేశమున గనులపరీక్షను జరిగించుచునే ఉండెను. లోహఖనిజముల గూర్చియే గాక, అమెరికనుల బట్టలమిల్లుల గూర్చియు, విద్యుచ్ఛక్తి శాలలగూర్చియు, ఆయాత్రలో తాతా చాల సంగతుల గ్రహించెను. అమెరికాలో నయాగరా జలపాతమునుండి విద్యుచ్ఛక్తిని పుట్టించుపద్ధతుల జూచెను. పిట్సుబర్గు పురమున ప్రపంచమంతటికి పెద్దవగు లోహయంత్రములుగలవు. ఆపరిశ్రమకు నాయకుడగు 'కన్నడి' తో కొన్ని సమస్యల జర్చించెను. ఆయన మంచిసలహాలనిచ్చెను. ఆయన సలహాపైన 'పెరిను' అను మహనీయుడగు విజ్ఞుని న్యూయార్కు నగరమున కలుసుకొని, ఆయనను చాలహెచ్చుజీతముపైన తనలోహపరిశ్రమ పరీక్షకు ముఖ్యోద్యోగిగ జేసెను. పెరినుగారు మెటలర్జికల్ ఇంజనీరింగ్ అనబడు లోహవాస్తుశాస్త్రమున నిధి. ఆయనసహచరుడగు 'వెల్డు'గారు వెంటనే ముందుగా మనదేశమువచ్చి, ఆయాస్థలముల భూతత్వము బరీక్షింపసాగెను.

ఈలోగా అమెరికాలో పనియై నంతట, తాతా లండనుకువచ్చి, భారతమంత్రితో మాట్లాడి, అటనుండి జర్మనీవచ్చి, బొంబాయిలో తానుకట్టిన 'తాజ్ మహల్ హోటలు' కవసరమగు ఎలెక్ట్రికువస్తువు లన్నిటిని జర్మనుశాలలందు వెదకి కొని, 1902 డిసెంబరులో మరల స్వదేశము చేరెను. బొంబాయి రాగానే, జ్యేష్ఠపుత్రుడగు దొరాబ్జిని మిత్రులను కలుసుకొని, జంషెడ్జితాతా ఆయాపరిశ్రమలగూర్చి విదేశయాత్రలో గ్రహించిన కొత్తసంగతులను, చేసిన పనులను, వారికి తెలిపెను. కొంతకాలమునుండి అస్వస్థతతోనున్న జంషెడ్జి యీనిరంతరకృషిచే నింకను జబ్బుపడెను. ఆయన మన శ్శక్తిమాత్రము పోలేదు. కుమారునికిని ఆయాపరిశ్రమల యుద్యోగులకును ఆయన అమూల్యములగు చాల సలహాల నిచ్చెను. తన విదేశానుభవములను వారికి తెలిపి, తా నాపరిశ్రమలకై సేకరించిన సామగ్రులను వారి కందజేసి, వారికి కార్యదీక్ష కల్గించెను.

దొరాబ్జి తాతాకు మేనమామకొడుకగు షపుర్జీ సక్లత్వాలా అను ధీశాలియగు యువకు డిదివరలో జంషెడ్జీతో తిరిగి, చందాజిల్లాగనులం దనుభవము గల్గియుండెను. *[2] ఆతడు, దొరాబ్జి, వెల్డుదొర, ఈముగ్గురును మధ్యదేశమున ఒరిస్సా ప్రాంతమున కొండలలోను అడవులలోను గనులకై తిరుగుచు, తీవ్రముగ పరిశోధన జేసిరి. అందుచాలచోట్ల రోడ్డు, సరియగు దారికూడ, లేకుండెను. కొన్ని ప్రదేశములందు త్రాగుటకు నీళ్ళే లేవు. పులులు మున్నగు భీకరమృగము లందందు తిరుగుచుండెను. రాత్రులం దొకప్పుడు కొండనేలను, ఒకప్పుడు తమ యెడ్లబండిలోనే, వారు నిద్రించుచుండిరి. ఇట్లు సంచరించుచు ఆయాప్రాంతముల భూతత్వమును శ్రద్ధతో బరీక్షించిరి.

చందాలో ఇనుము సున్నపురాళ్ళు నుండెను. కాని అప్పటికి 'వరోరా' గనిలోని బొగ్గు అడుగంటెను. అందుచే దగ్గరనున్న 'బెల్లారపు' బొగ్గుగనికై వారు దరఖాస్తుపెట్టిరి. ఆబొగ్గు ప్రభుత్వముకే యవసరమని, దాని కేవ్యక్తులకును లైసన్సు నీయవీలులేదని, ప్రభుత్వమువారు తెల్పిరి. ఆప్రాంతపు లోహమును ఒకేచోట సమృద్ధిగ లేదు. కనుక చందాజిల్లాలోని గనులను తుదకు వదలుకొనవలసివచ్చెను. ఈపరీక్షలన్నిటికై, అప్పటికి జంషెడ్జికి 5 లక్షల రూపాయలు వ్యయమయ్యెను.

అంత నాయంధకారబంధురస్థితిలో హఠాత్తుగ వారికొక జ్యోతి కనబడెను. 'ప్రమధనాధవసు' అను ప్రతిభాశాలియగు బెంగాలి భూతత్వజ్ఞుడు ప్రభుత్వోద్యోగవశమున అనేకప్రాంతముల భూమిస్వభావమును శ్రద్ధతో బరిశీలించి యుండెను. ఆయన ఓఢప్రాంతపు 'ధల్లి, రాజహర' కొండలందు ప్రశస్తమగు నినుము సమృద్ధిగ కలదని, 1887 లోనే యొక ప్రభుత్వపు రిపోర్టులో వ్రాసియుండెను. 1904 లో తిరిగి తిరిగి వేసారి యేమియు తోచక, మనత్రిమూర్తులు నాగపురముజేరి, అందలి గ్రంథాలయములోనికిబోయి, కాలయాపనకని అందు బూజుపట్టిన యొకపుస్తకమును తీసిరి. అది వసువురిపోర్టేయగుట తటస్థించెను. దానిని చదివి యచ్చెరువొంది, వారు ముగ్గురును ఆకొండల యొద్దకు తక్షణమే పోయి, పరీక్షించిరి. వెంటనే యాగనుల పనికై ప్రభుత్వమునుండి లైసెన్సు బొందిరి. ఆకొండల దృశ్య మత్యద్భుతము; ఆప్రాంతమంతయు అయోమయమే. ఆయినుము చాల ప్రశస్తము పరిశుద్ధముగ నుండెను. 'ఝరియా' బొగ్గు గనులును దీనిసమీపమందే యున్నవి. వెంటనే, ఆయినుము బొగ్గుల మచ్చుల దీసికొని, వానిని వా రమెరికాకు పరీక్షకై పంపిరి. వానితో ప్రశస్తమగు ఉక్కు తయారగునని యా పరీక్షచే తెలియవచ్చెను.

కాని యాప్రాంతమున నీరులేదు. పెద్ద యినుప కార్ఖానాలు పనిచేయునప్పుడు, అందలి బ్రహ్మాండమగు కొలుముల వేడిని తగ్గించుటకు, సంతతము నీరు పోయుచుండవలెను. అచట నది మొదలగు నీటివసతి లేనందున చిక్కుకలిగెను. ఇంతలో, అమెరికానుండి 'పెరిను'గా రచటకు చేరిరి. జంషెడ్జితాతా 1904 మే నెలలో చనిపోయినను, ఆయనకుమాళ్ళు విడువక, తండ్రి యుద్దేశించిన పరిశ్రమల నడుప నిశ్చయించిరి; జంషెడ్జికి కార్యదర్శిగనుండిన బర్జోర్జిపాద్షాయు వారి నుత్సాహపూరితుల జేసి, బొంబాయిలొ కేంద్రకార్యాలయమునుండియే పనులన్నిటిని చక్కబెట్టుచుండెను.

ఈయినుపగనుల గనిపెట్టిన ప్రమధనాధు డప్పటి కుద్యోగకాలముతీరి, ఆసమయమున నోఢ్రప్రాంతమందే, 'మయూరభంజి' సంస్థానములో దివానుగా నుండెను. ఈవిచిత్రసంఘటనమువలన, తాతాకంపెనీవారి ప్రయత్నముసంగతి యాయనకు తెలిసి, మయూరభంజి సంస్థానములో నింకను నత్యుత్తమములగు లోహగనులు కలవని, వానిని సులభముగ పనిచేయవచ్చునని, అందుకు మహారాజుచేత నవసరమగు కవుళ్ళనిప్పించెదననియు, ఆయన తాతాకంపెనీకి వ్రాసెను.

పెరినుగూడ వారిని చేరినందున, ఆచతుష్టయమును రాజుగారి యాహ్వానముపైన, మయూరభంజి రాజ్యముకు జనిరి. ఈరాజ్యము సుమారు 4000 చదరపు మైళ్ళుండును. దాని మధ్యను విశాలమగు మహాటవులతో నిండి వనగజములతో సంకులమగు వేయిమైళ్ళ కొండభూమి కలదు. వా రాగహనములందు జొరబడి, దిగ్భ్రమజెందుచు ప్రమధనాధుడు దోవచూపిన ట్లెల్ల బోవుచుండిరి. చాలదూరమువర కంతయు నగమ్యగోచరముగ నుండెను. అప్పుడు వారికి మూడువేల యడుగుల యెత్తగు 'గురుమైశిని' గిరి ప్రత్యక్షమయ్యెను. దానిని చూడగనే వారి కపరిమితానందము కలిగెను. అది పాదాదిశిర:పర్యంతము లోహమయమే, ఎటుజూచినను అన్ని ప్రక్కలను పెద్ద ఇనుపపెళ్ళలు, ఆపెళ్ళలే కొన్నియేండ్ల పనికి చాలును. ఆవైపున నింకను నిట్టిగనులు కొండలు గలవు. లోగడజూచిన 'ధల్లి, రాజహర' గనులకన్న గూడ నివి చాల ప్రశస్తములు; వానికన్నను ఇవి బొగ్గుగనులకు సముద్రముకు దగ్గరవి. సమృద్ధిగ మంచి యినుము తయారైనచో, దాని నిటనుండి 150 మైళ్ళ లోపుననున్న కలకత్తారేవుద్వారా విదేశములకు గూడ నెగుమతి చేయవచ్చును. ఇట్టి సౌకర్యఘటనము దుర్లభము. ఇరువదిమైళ్ళ విశాలమగు యాగనుల ప్రాంతమంతను వెంటనే తాతాకంపెనీవారు మయూరభంజి సంస్థానముకు న్యాయమైన రాజాంశమిచ్చుపద్ధతిని, వసువుగారి ద్వారా ఆమహారాజుగారివద్ద కవులుకు తీసుకొనిరి.

ఈగనులను ఇంగ్లండు అమెరికాలోవలె పెద్దయెత్తున లాభకరముగ పనిచేయుటకు, చాల మూలధనము, గొప్ప నిపుణుల సహాయమును, కావలెను. అట్టిపరిశ్రమ లింతవరకు మనదేశమున లేవు. కావున దొరాబ్జితాతా 1906 లో లండనుకు వెళ్ళి, ఇంగ్లీషు పరిశ్రమల నాయకులను పెట్టుబడి పెట్టుడని కోరెను; అందుకు, వడ్డీయేగాక, వారికి పరిశ్రమలో వాటా గూడ నిచ్చెదననెను. కాని, అట్లును, అచట తగు ద్రవ్య సహాయము లేకపోయెను. ఇట్లు దొరాబ్జి నిరాశుడై, 1907 లో స్వదేశముకు తిరిగి వచ్చెను. ఈలోగా మనదేశమున హఠాత్తుగ 'స్వదేశీ' ఉద్యమ మారంభించెను. ప్రభుత్వమువారు 1905 లో వంగ రాష్ట్రమును రెండుగా విభజించిరి. ఈవంగభంగముకు ప్రజలిష్టపడక, దానిని రద్దుచేయించుటకై తీవ్రముగ ఆందోళన నారంభించిరి. అప్పుడే పాశ్చాత్యమహా సామ్రాజ్యమగు రష్యాను ప్రాచ్యులగు జపానీయు లోడించిరి. అందుచే భారతీయులలో గూడ ఆత్మవిశ్వాసము, జాతియోత్సాహమును, ప్రబలెను. పాశ్చాత్యదేశములనుండి దిగుమతియగుచున్న సరుకులగొనుట తగ్గించి, 'స్వదేశీ' య వస్తువులనే కొనవలెనని, సాధ్యమైనంత వరకు పరిశ్రమలను మనదేశమందే స్థాపించుచు, అవసరమగు వస్తువుల నీదేశమందే తయారుచేసుకొనవలెననియు, దేశమంతట నుద్బోధము కలిగెను; విద్యావంతులలో నుత్సాహము వ్యాపించెను. ఆయుద్రేకమువలన మనదేశీయులే దొరాబ్జికి తోడ్పడిరి. ఆయన జారీచేసిన ప్రకటనప్రకారము రు. 2,31,00,000 లును భారతీయులనుండియే సమకూడెను. అందుతో "తాతా ఐరన్ అండ్ స్టీల్ వర్క్సు" అను పేర వాటాదార్ల జాయింటుస్టాకు కంపెనీ యేర్పడెను. తాతా కంపీనీవారే దీని నియంతలు; దొరాబ్జితాతా యధ్యక్షుడు, నరోత్తమగోకులదాసు, విఠల్‌దాస్ థాకర్సే, కొవాస్జి జహంగీరు మున్నగువారు డైరక్టర్లును, అయిరి. అందు చాల వాటాలను తాతా బందుమిత్రులు తీసుకొనిరి. అంతట తాతాకంపెనీవా రీలోహపు కార్ఖానాల గట్టుట కుచితస్థానము వెదకి, తుదకు బిహారురాష్ట్రపు మానభూమిజిల్లాలో, 'సాక్షి' అను కుగ్రామపు స్థలమును నిర్ణయించిరి. ఇది బెంగాలు నాగపుర రైలులైనుకు సుమారు రెండుమైళ్లలో నున్నది. ఆప్రాంతము వనమయము, సుందరము, కొండ నేలయగుటచే, అందు భవననిర్మాణము సుకరము, కావలసినంత విశాలస్థలము చౌకగ దొరకును. ఇది కలకత్తా రేవుకు 150 మైళ్లలో నుండును. అచటనే రైలుమార్గ ముండుట యెగుమతికి లాభకరము. అచటి రైలుస్టేషను అగు కలిమాటి *[3] నుండి 2 1/2మైళ్లును, గురుమైశిం ఇనుపగనులకు 40 మైళ్లును, రైలులైను వేయబడినది. ఈరైలులైనులను తాతాకంపెనీ వారే నడుపుకొందురు. దక్షిణమున ఇనుపగనులు, ఉత్తరమున తూర్పున బొగ్గుగనులు, పడమట సున్నపురాళ్ల దిబ్బలు, వీనిమధ్య నీస్థలము జీవనదియగు 'సువర్ణ రేఖ' తీరమందున్నది. ఇచట సంతాలులు మున్నగు దృఢగాత్రులగు అడవిజనులు కొద్దిమంది కలరు. వీరిభాష ప్రాచ్యహిందికి ఉపశాఖ; ఇచట యంత్రాలయపు నిర్మాణము 1908 లో ఆరంభించెను.

పనివాండ్రకు వీలైనంతవరకు శ్రమతగ్గుటకై, బలువుపనులన్నిటికి నవీనపద్ధతివగు ప్రశస్తయంత్రములను జర్మనీ, అమెరికా, ఇంగ్లండులనుండి రప్పించిరి. లోహకార్యపు యంత్రముల నడుపు కార్మికులు, ఉద్యోగులు, ఇదివరలో నిచట లేనందున, ఆమహాయంత్రముల నడిపి అందుసరిగ పనిచేయుటకు, వారు రెండువందల మంది తెల్లవారి నుద్యోగులుగ చేర్చుకొనిరి. అందు అమెరికనులు, ఆంగ్లేయులు, జర్మనులు, ముఖ్యులు. కార్ఖానాలగట్టి, పరిశోధించి, యంత్రముల జయప్రదముల నడుపుటకు, వారికి చాలహెచ్చు జీతముల నియవలసివచ్చెను. వెల్సు అను ఒక యమెరికను కొంత కాలమువరకు ముఖ్యుడగు మేనేజరుగ నుండెను. పెరినుగారే ఇంజనీర్లలో ప్రధాని. వీరిక్రింద పార్సీలు బెంగాలీలు మున్నగు భారతీయులనేకులు మొదటినుండియు ఉద్యోగులుగ పనిచేయుచుండిరి.

ఉత్తరపు 'ఝరియా' మున్నగుగనులనుండి నేలబొగ్గు తెప్పించి యంత్రములలో శుద్ధిజేసి, అందు తయారగు 'కోకు' *[4] తో దక్షిణపు లోహఖనులనుండి తెచ్చుపొడిని బాగుగ కరిగింతురు. ఇచట బ్రంహ్మాండమగు ఉక్కు కొలుములందు విద్యుచ్ఛక్తిచే జనించు విపరీతోష్ణముచే నాపొడి ద్రవమగును. దానిని కట్నిప్రాంతనుండి రప్పించు రాతిసున్నముతో కలిపి, శుద్ధి చేయుదురు; అప్పుడు శుద్ధమగు ఇనుము నీటివలె ప్రవహించును. ఈద్రవలోహ మామహాయంత్రములందు అత్యుష్ణమువలన పాలవలెకళపెళకాగును. ఇంకనుశుద్ధిజేసి, అందుబయలుదేరు బూడిదను వేరుచేయుదురు; మిగిలిన పరిశుద్ధప్రవాహ మొకచోట చేర్చబడి, జాగ్రత్తతో మెల్లగ చల్లార్పబడి, ఇనుమగును. అంతట కొన్ని శాస్త్రీయచర్యలు జరిగినంతట, అది ప్రశస్తమగు ఉక్కగును; అది అనేకవిధములగు పనిముట్లుగ, ఆయాయంత్రములందు మార్చబడును. ఇట్లు అన్ని శాఖల యంత్రములు నమర్చబడి, ఆలోహపరిశ్రమ దినదినవృద్ధినొందెను.

ఈకార్ఖానాలందు రైలుపట్టాలు, పనిముట్లు, రేకులు, స్లీపర్లు, స్థంభములు, దూలములు, మున్నగు చాలరకముల లోహవస్తువులు తయారై, ప్రతిసాలున కోట్లకొలది రూపాయల విలువగల వివిధవస్తువులు విక్రయింపబడును. ఆయావైజ్ఞానిక చర్యలలో ప్రతిదానికి వేర్వేరుగ పెద్దయంత్రములుండును. ఆయా వివిధచర్యలు అతిజాగ్రత్తతో జరిగించబడును. అందుకు ప్రకృతిశాస్త్రమున పూర్ణప్రజ్ఞ, ధైర్యసాహసములు, దక్షత, శిల్పము, కావలెను. ఆయాశాస్త్రములందు వాస్తువిద్యయందు నిపుణులగుటయే గాక, ఆయాశాఖాధికారులు; ఉత్సాహులు, సహృదయులు, దూరదృష్టియుతులుగను, ఉండవలెను.

వివిధశాఖలకు, ఈకార్ఖానాలకు పురముకును వలయు బలీయమగు విద్యుచ్ఛక్తి నంతను ఈకంపెనీవారే తమ ప్రత్యేక యంత్రములందు పుట్టించి, తమకార్ఖానాలకు, నగరముకుకూడ, విద్యుచ్ఛక్తి నందజేయుదురు. ఈలోహయంత్రశాల అమెరికా, ఇంగ్లండు, జర్మనీలలోని నవీనవాస్తువిజ్ఞానము ప్రకారము కట్టబడిన మహాయంత్రములకుకూడ తీసిపోక, సర్వసమగ్రముగ నుండునట్లుగ నిర్మింపబడినది. ఈపనిపూర్తి యగుటకు సహజముగ చాలయేండ్లుపట్టెను. ఇప్పుడు తాతా లోహయంత్రశాల మన ఆసియాఖండమందును, బ్రిటిషుసామ్రాజ్యమంతటను; ఉన్నయన్నిటిలోను గొప్పదని చెప్పుదురు. ఈయంత్రములం దిప్పుడు సాలీనా సుమారు ఆరులక్షల టన్నుల శుద్ధమగు ఇనుము, 570,000 టన్నుల ఉక్కును తయారుచేయవచ్చును. వానిని వివిధవస్తువులుగా చేయు చాలయంత్రములు దరిమిలాను చేర్చబడినవి.

ఇందు తయారైన ఇనుపవస్తువుల చాలఉపకరణము లిప్పుడు దేశమంతటను అమ్ముచున్నవి. ఇందలి ఇనుము ఉక్కు జపాను ఇంగ్లండు మొదలగు ఇతరదేశములకును ఎగుమతియై, ఆదేశముల పరిశ్రమలతో పోటీగా చలామణి అగుచున్నవి. 1914 నుండి జరిగిన ప్రపంచయుద్ధమున మన ప్రభుత్వమువారికి మెసపొటేమియా, ఆఫ్రికామున్నగు ప్రాంతములకు చాలరకముల యుద్ధసామగ్రులను 1500 మైళ్ళ రైలుపట్టాలను 3 లక్షల టన్నుల ఉక్కువస్తువులను ఈకంపెనీవారు సప్లై చేసిరి. ఇందు ప్రత్యేకము సుమారు 40000 కార్మికులు ఉద్యోగులు పనిచేయుచున్నారు. వారిలో రమారమి నూరుమంది ఉద్యోగులు పాశ్చాత్యులు; తక్కినవారందరు భారతీయులే; మరియు, ఈ తాతాలోహయంత్రములకై బొగ్గు యినుము వగైరాల బంపు గనులలో ఇంకను వేలకొలది పనివాండ్రు మధ్యరకపు ఉద్యోగులు భూతత్వజ్ఞులు ఇంజనీర్లు మున్నగువారు పనిచేయుచు, గౌరవజీవనము చేయుచున్నారు.

అభివృద్ధికల్గినకొలదిని, అవసరమునుబట్టి ఈకంపెనీ మూలధనము క్రమముగ హెచ్చింపబడినది. పనిబాగుగనున్నప్పుడాకంపెనీకి సాలీనా సుమారు 75 లక్షలరూపాయల లాభముకలుగును. ఒక గొప్పపరిశ్రమజరుగుచున్నప్పుడు, అందును బట్టి ఇతరపరిశ్రమలకు సహాయముకలుగును. మనదేశపు అనేక రసాయనాది వస్తువులను తమయంత్ర కార్యములకై కొనుచును, తమయినుపవస్తువులను ఇందుజనించు ఉపవస్తువులను దేశీయుల కందజేసియు, మనదేశపు ఇతరపరిశ్రమల కీయంత్రశాలవారు సహకారులగుచున్నారు. †[5]

  1. * జంషెడ్జితాతా కధలో, ఈరెంటి వివరణ మవసరము కాదని కొందరికి తోచవచ్చును. కాని ఈరెండుపరిశ్రమలు మనదేశము కత్యావశ్యకములని, వానిని స్థాపించి లాభకరముగ సాగింపవచ్చునని, జంషెడ్జితాతాయే కనిపెట్టెను; దృఢవిశ్వాసముతో, వానిని సాధించుటకై, అనేక సంవత్సరములు పరిశోధనలజేసి, విశేష వ్యయముతో అనేక ప్రాంతముల బరీక్షించి, దూరదృష్టితో సాధనకలాపముల సిద్ధముజేసి, మార్గదర్శకు డయ్యెను. తనకుమాళ్ళకును, అంతరంగ మిత్రులకును సాధనసామగ్రినంతను నొప్పగించి, వారికి కార్యదీక్ష కల్గించెను; అందువలననే ఆపరిశ్రమలు జయము గాంచగల్గెను. అందుచే జంషెడ్జితాతాయే ఆపరిశ్రమల స్థాపనకు కారకుడని యెంచవలెను.
  2. * ఈసక్లత్వాలా లోహపరిశ్రమ స్థాపనలో తాతాకంపెనీకి చాలసాయము చేసెను. తరువాత ఈయన ఈకంపెనీవారి లండను కార్యస్థానమున పనిచేయుచు, ఆంగ్లస్త్రీని పెండ్లియాడి, ఆంగ్లదేశమందే యుండెను. దరిమిలాను బ్రిటిషు కార్మికోద్యమమున పాల్గొనుచు, తీవ్రభావములుగల కమ్యూనిస్టు (సామ్యవాది) ఆయెను. సామ్యవాదము కాపిటలిజముకు (పుంజీపతిపద్ధతికి) కేవల విరుద్ధము అందుచే, సక్లత్వాలా తాతాకంపెనీతో సంబంధము వదలుకొని, బ్రిటిషు సామ్యవాదుల నాయకుడుగ పార్లమెంటులో సభ్యుడై కొంతకాలము పనిచేసెను. ఇంగ్లండులో భారతీయుల పక్షమున ధైర్యముతో పనిచేయుచు, ఆదేశమున మనదేశీయులకు సాయపడుచుండెను. ఈయన 1935 సాలాఖరున లండనులో చనిపోయెను.
  3. * ఈస్టేషను పేరు తరువాత 'తాతానగర్‌' అని, అచటవృద్ధియైన తాతానగరము పేరుగ, మార్చబడినది.
  4. * మామూలు కర్రబొగ్గుకన్న నేలబొగ్గుచే నెక్కువ వేడి నిప్పు, కల్గును. కాని ఇనుమును కరగించి మంచిఉక్కుగజేయుట కావేడియుచాలదు. అందుచే నేలబొగ్గును ప్రత్యేకయంత్రములందు ముందుగా శుద్ధిజేసి, దానిసారమగు 'కోకు'ను చేయుదురు. దానినిప్పు అత్యుష్ణము; అందుతోఇనుము బాగుగా కరగించి ఉక్కు చేయవచ్చును.
  5. † తాతాకంపెనీవారి లోహయంత్రశాల జయప్రదమగుట జూచి, మైసూరు దివాను విశ్వేశ్వరయ్యగా రాసంస్థానమున (ఈకంపెనీ ఉద్యోగుల సహాయముతో) భద్రావతిప్రాంతమున లోహయంత్రశాల నేర్పర్చిరి. ఆకర్మాగారమున కొన్నిలోపములవలన మొదట సరిగా పనిజరుగక, కొంతనష్టము వచ్చెను. కాని యిటీవల అది బాగుచేయబడి, ఇప్పుడు చక్కగ పనిచేయుచున్నది. ఇప్పుడిప్పుడు ఉక్కుకార్ఖానా సిమెంటుఫాక్టరీకూడచేర్చి, అందు ఉక్కు సిమెంటుగూడ చేయదలచుచున్నారు. ఇట్లే వంగదేశమందొక కంపెనీవారు రాణిగంజిగనుల బొగ్గుతో దానిసమీపపు ఇనుపగనుల బనిచేయుచు, ఇంకొక లోహయంత్రశాల స్థాపించిరి. దాని యజమానులు ఆంగ్లేయులు; అది తాతావారి యంత్రశాల యంత పెద్దదికాదు; దానికన్ని సౌకర్యములును లేవు.