తాతా చరిత్రము/జమ్షెడ్‌పురము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

14. జమ్షెడ్‌పురము.

తాతా లోహకర్మాగారము లొకయటవీప్రాంతమున 'సాక్షి' అను గ్రామమునొద్ద నిర్మింపబడెనుగదా! అప్పటి కాప్రాంతమున పెద్దగ్రామముగాని నాగరిక సౌకర్యములుగాని లేవు. ఈస్థితిలో తాతాకంపెనీవారి కార్ఖానాలు పనిచేయ నారంభించెను; ఆపని యారంభమునుండి కొంద రుద్యోగులును వేలకొలదిని కూలీలును, అచట పనిచేయుచుండిరి. ఆప్రాంతపు 'సంతాలు'లు దృఢగాత్రులే; కాని వారిసంఖ్య చాలతక్కువ. అందువలన సంయుక్త ప్రాంతములనుండి, చుట్టుపట్ల జిల్లాలనుండియు, చాలమంది కూలికచట చేరిరి. ఆకార్ఖానాపనులు వృద్ధియైనకొలదిని పనివాండ్రును ఉద్యోగులును హెచ్చిరి. ఇట్లు వేలకొలది జనులు కుటుంబములతో నచట నివసించుటచే, ఆవన మధ్యమందు కొద్దియేండ్లలోనే యతివేగముగ నొక పెద్దనగర మేర్పడెను. అంతవరకచట నాగరికులకేగాక సామాన్యజనబృందముకు గూడ వలయు వసతులేవియు లేవు.

అందుచే నచట నాయంత్రాలయముకై చేరిన జనులకు వలయు సౌకర్యములన్నిటి నప్పుడు తాతాకంపెనీవారే యేర్పర్చిరి. ఫాక్టరీల కార్మికులు సాధారణముగా కిక్కిరిసిన యిరుకు తాటాకు గుడిసెలలో నుండుచు, తగు నీటివసతివగైరాలు లేక బాధ పడుచుందురు. జంషెడ్జి తాతా మాత్రము మొదటినుండియు తన యంత్రశాలల కనుబంధముగ కార్మికుల కారోగ్యద ములు సుఖకరములు నగు రమ్యకుటీరములను శుభ్రమగు విశాలవీధులలో నిర్మించుచుండెను. ఆయనకుమారుడు దొరాబ్జియు మిత్రులగు మిగిలిన డైరక్టరులును ఆప్రకారమే యచటి పనివాండ్రకై ప్రత్యేకవసతులతో పేటలనిర్మించిరి; అంతేగాక తక్కినవారి వాసముకొరకును నగరమంతను తామే కట్టించుట యుచితమని గ్రహించి, అందలి యుద్యోగులు మున్నగువారికిని వీలుగనుండునట్లు సరియగు నేర్పాటులతో, ఆధునికపుర నిర్మాణపద్ధతిని ఒక ప్రత్యేకపురము నంతను నిర్మించిరి. అచట ఖాళీస్థలము సమృద్ధిగ కలదు; అందు 25 మైళ్ళస్థలమున నా నగరము విశాలముగ కట్టబడినది. ఇప్పటికిని అందు 4500 గృహము లీకంపెనీవారివే; అందు పెద్దయుద్యోగుల కనుకూలముగ పాశ్చాత్యపద్ధతిని చుట్టును తోటలతో బంగాళాభవనముల గట్టి, ఒకపేట నేర్పర్చిరి. *[1] సామాన్యపు జీతగాండ్రగు మధ్యరకపు భారతీయులకు వారి సంసారములకును వీలగునటుల, చక్కని భవనములు మనదేశీయావసరములకు వలయు సౌకర్యములతో గట్టబడి, ఒక చక్కనిపురముగ నేర్పడినది. వీధులు విశాలముగ సరియైన వరుసపంక్తులుగ నుంచుబడెను. అచటి సువర్ణ రేఖ నది కానకట్టను కట్టించి, దానినీటిని ఎత్తగు మిట్టపైన నిర్మించిన ప్రత్యేకపు చెరువుల కెక్కించి, అందుండి నగరముకంతకు కొళా యీలద్వారా మంచినీ రందింపబడుచున్నది. తాతావారి యంత్రశాలలందే చాల విద్యుచ్ఛక్తియు బొగ్గుసారమగు 'కోల్‌గాను' అను, వాయువును పుట్టింపబడును. వానితో నానగరమంతటను ప్రదీపములబెట్టిరి. అన్ని పేటలందును, ఉచిత గ్రంథాలయములను, పఠనమందిరములను, పాఠశాలలను, కార్మికులకు రాత్రి బడులను, చక్కని వైద్యశాలలను, నెలకొల్పిరి. నీటిపారుదలకు మరుగుదొడ్లకు నవీనవిజ్ఞానపద్ధతుల ప్రకారము ప్రశస్తపద్ధతులను అమలులోనికి దెచ్చిరి.

ఆధునికపరిశ్రమలకు ప్రకృతిశాస్త్ర పరిజ్ఞాన మవసరము. నవీనావిష్కారములు కలిగినకొలదిని, నిర్మాణమున సౌకర్యపద్ధతులను లాభకరమగు సదుపాయములను అమలుబెట్టవచ్చును. ఆయంత్రశాలల కంగముగ విజ్ఞానపరిశోధనశాలలనుంచి, విద్యావంతులగు యువకులకు విజ్ఞానమును ఆధునిక శిల్పవిద్యలను నేర్చుకొనుటకు అందు ప్రత్యేకప్రోత్సాహము నిచ్చుచున్నారు; ప్రత్యేకమగు టెక్నికలు పాఠశాలలగూడ పెట్టిరి. ఈనగరపు నిర్మాణముకు దాని పారిశుధ్యభద్రతలకు ఆకంపెనీవారే బాధ్యత వహించి, వ్యయప్రయాసములకు జంకక దాని నాదర్శనగరముగ జేసిరి. ఆనగరముకై, ఆకంపెనీవా రిప్పటికి రమారమి రెండుకోట్ల రూపాయలసొమ్ము ఖర్చుజేసిరి. అందిప్పుడు సుమారు లక్షమంది జనులు వసించుచున్నారు. ఆపురమున కొత్తకొత్త అనుబంధ పరిశ్రమలింకను ఏర్పడుచున్నవి. ఇంకను కొత్తపనివాండ్రు వ్యాపారస్థులు చేరుచున్నందున, ఆపురమింకను వేగముగ వృద్ధియగుచున్నది. 1919 లో, అప్పటి రాజప్రతినిధి యగు షెమ్స్‌ఫర్డ్‌ప్రభు వాపురమునకు వచ్చెను, అప్పు డానగరమునకు పూర్వపు కుగ్రామనామమగు 'సాక్షి'కి బదులు, 'జంషెడ్‌పుర'మని పేరుపెట్టిరి. అచట యూరపియనులు మున్నగు పెద్ద ఉద్యోగులు వసించుపేటకు మాత్రము 'తాతానగర్‌' అని పేరుంచబడెను. అప్పటినుండి యావిచిత్రనగరముకు 'జంషెడ్‌పుర' మనియే వాడుక. ఇట్లు జంషెడ్జి తాతాగారి పారిశ్రామికప్రతిభ కానగరము స్మారక చిహ్నమైనది.

ఈపురము సార్వజనికము; ఇందు పాశ్వాత్యులు, చీనులు, భారతీయులలో అన్నిప్రాంతముల వారును, కలరు. భారతీయైక్యముకు నిదియొక చిహ్నము. ఇం దిప్పటికిని కొందరు పెద్ద యుద్యోగులు పాశ్చాత్యులే; కాని కొంతవర కిటీవల భారతీయులే పూచీతోగూడిన నిర్వహణకార్యములగూడ నిర్వహించుచున్నారు. విద్యుచ్ఛక్తి వైద్యశాఖ మున్నగు కొన్నిశాఖల ప్రవర్తకులు భారతీయులే. తక్కిన కొన్నిశాఖల నిర్వాహకులు, ప్రత్యేకనిపుణత విశేషవాస్తువిజ్ఞానము కావలసిన ప్రధానోద్యోగులును, ఇప్పటికిని విదేశీయులే, ఇందుకు వలయు ప్రత్యేకనైపుణ్యపరిజ్ఞానములు విదేశీయులకే కలవను భావమున, వారు దీర్ఘకాలపు షరతులపైన ఇంగ్లండు, జర్మనీ, అమెరికా, మున్నగు దేశముల పెద్దయంత్రాలయములనుండి రప్పింపబడిరి. వారికి చాల హెచ్చుజీతము లీయబడును. *[2] వారు పెద్దయుద్యోగులగుటవలన, అచటి వ్యవహారముల నడుపుటలో నాపాశ్చాత్యులకు పలుకుబడియుండుట సహజము; కాని కంపెనీ యాజమాన్యము భారతీయులదే.

అందలి కార్మికులకు సముపాయమునకై చిల్లరవైద్య సహాయమును సోడానీరుమున్నగు వానిసౌకర్యమును, ఆకంపెనీవా రుచితముగనే కలిగించుచున్నారు. బియ్యము మున్నగు నిత్యాహారపు వస్తువులను కంపెనీవారే కొని యుంచి, ప్రత్యేకపు చౌకధర కందజేయుదురు. అచటి నీటిపన్ను, దొడ్డిపన్ను, దీపపుపన్ను మున్నగునవి ఆగృహములందు వసించు వ్యక్తులు భరింపనక్కరలేదు. నగరపు మునిసిపలుఖర్చు చాలవరకు కంపెనీవారే (కొంతవరకు ఇటీవల నచట నేర్పడిన 7 కొత్త కంపెనీలును) భరింతురు. అచటి ప్రజాప్రతినిధులు ఇప్పుడు కొంతవరకు నగరయాజమాన్యము వహించియున్నారు. విద్యా వ్యాయామ సమావేశాదులకై చాల క్లబ్బు లేర్పడినవి. ఇందు వాస్తువిద్య, విద్యుచ్ఛక్తి, ఖనిజశాస్త్రము, రసాయనము, పారిశుధ్యశాస్త్రము, లోహశాస్త్రము, కార్ఖానా నిర్మాణము, మున్నగు విద్యలందు పరిశోధనకును ప్రత్యక్షానుభవముకును చాల అవకాశముకలదు. అందువలన ఇచట పనివాండ్ర జ్ఞానాభివృద్ధికిని మంచి యవకాశముండును. ఈసౌకర్యముల నేర్పర్చుట కంపెనీవారి దూరదృష్టిని తెల్పును. (కంపెనీలోని యుద్యోగులు కార్మికులు ఆరోగ్యవంతులు జ్ఞానవంతులు నగుటవలన, కంపెనీవారి పనులు ప్రశస్తముగ జరుపబడి కంపెనీకిని లాభమే కలుగును.)

ఈపురమున నీకంపెనీవారి కార్ఖానాలనుండి వేర్వేరు మచ్చుల యినుమును ఉక్కును చౌకగ, వలయునంత సమృద్ధిగ, వలయునప్పుడెల్ల దొరకును; శిల్పజ్ఞానముగల నిపుణులగు పనివాండ్రకును లోటులేదు. అందువలన, ఈనగరమందే కొన్ని యనుబంధపరిశ్రమల కంపెనీ లేర్పడినవి. ఇందలి 'జూట్‌మెషినరీ కంపెనీ' వారు కలకత్తామున్నగు ప్రాంతములందలి జనపనార పాక్టరీలకు వలయు యంత్రముల తయారుచేయుదురు. *[3] 'టిన్ ప్లేట్ కంపెనీ' యను మరియొక కంపెనీవారు ఇందు తగరపు డబ్బాలు ఇత్యాదుల జేయుదురు. 'ఎగ్రికల్చరల్ ఇంప్లెమెంట్స్ కంపెనీ'లో ఇనుపనాగళ్ళు మున్నగు వ్యవసాయ పరికరములు తయారగును. 'ఎన్‌ఫీల్డ్‌కేబిల్ కంపెనీ'లో విద్యుచ్ఛక్తి ప్రసారాదులను వలయు బలీయమగు లోహపు తీగలు చేయబడును. 'ఇండియన్ స్టీల్ వైర్ ప్రోడక్ట్స్‌' వారుక్కు తీగలతో వివిధ వస్తువుల జేయుదురు. 'ఎనామల్డ్ ఐరన్ వేర్ కంపెనీ' వారు ఎనామలు పూతతో రేకు పాత్రల జేయుదురు. ఇట్లు మనకు తరుచు అవసరమగు చాల వస్తువులను ఇదివరలోవలె విదేశముల నుండియే తెప్పించుకొననక్కరలేకుండ, ఇచటనే తయారు చేయబడుచున్నవి. తాతాలోహ యంత్రశాలలో ఇనుము ఉక్కు సులభముగ దొరికి, శిల్పులు సిద్ధముగ యంత్రముల పనినేర్చియుండుట చేతను, సమృద్ధియగు విద్యుచ్ఛక్తి నేలబొగ్గు మున్నగు సౌకర్యములుండుట చేతను, అట్టి అనుబంధ పరిశ్రమలు గూడ ఇచ్చట నేర్పడి, గిట్టుబాటుగ పాశ్చాత్యపు సరుకులతో పోటీకినిలుచుట సాధ్యమైనది.



__________
  1. * ఇదియే తరువాత 'తాతానగరము' అని పిలువబడుచున్నది అచటి రైలుస్టేషనుకును 'కలిమాటి' అను పేరుకు బదులు 'తాతానగర్‌' అనిపేరు పెట్టబడినది.
  2. * ఇప్పుడున్న పాశ్వాత్యులనుగూడ చాలవరకు తగ్గింపవలెనని, వారు చేయుపనులలోగూడ కొన్నింటిని నిర్వహింపగల సామర్ధ్యము ఇప్పుడు భారతీయులకును కలదని, అందువలన చాల హెచ్చుజీతముల నిచ్చి విదేశీయులనే పెద్దయుద్యోగులుగ నుంచుట యవసరముకాదని, చాలమంది భారతీయుల అభిప్రాయము. పాశ్చాత్యోద్యోగులకు చాల హెచ్చుజీతముల నీయవలసి వచ్చుటచే, కంపెనీ సిబ్బందిఖర్చు చాల హెచ్చుగనున్నది.
  3. * సంచులుమున్నగువానిని తయారుచేయు జూటుమిల్లులకు కలకత్తానగరము ముఖ్యకేంద్రము; ఆమిల్లులయజమానులు చాలవరకు బ్రిటిషువారు; ఆమిల్లులకు తరుచు కావలసియుండు వివిధయంత్రములను పనిముట్లను వారు విదేశములనుండియే తెప్పించుకొనుచుండిరి. అచటికి 150 మైళ్ళలోనే మంచి యినుము ఉక్కు దొరకుచున్నందున, జూటుమిల్లులకువలయు కొన్నియంత్రములుగూడ జంషెడ్పురమందే తయారగుట సుకరమైనది.