Jump to content

తాతా చరిత్రము/జలవిద్యుచ్ఛక్తిశాల

వికీసోర్స్ నుండి

15. జలవిద్యుచ్ఛక్తిశాల.

రాట్టము, చేతిమగ్గము చేతిమరలు మున్నగు చిన్న యంత్రములను చేతితోనే త్రిప్పి నడుపవచ్చును; కాని పెద్ద యంత్రముల నడుపుటకింకను చాల బలీయమగు చోదకశక్తి కావలెను. 'ఇంజను'లనబడు ఆవిరియంత్రము లట్టిచోదకశక్తి నిచ్చును. ఆయింజనులందు నీరు సలసలకాగి యావిరియై, అందలి ఉక్కు కమ్ములను త్రోయును. ఆశక్తిమూలమున వానికి చేర్చిన చక్రము లతివేగముగ తిరుగును. ఇట్లు ఇంజనులు రైళ్ళను మిల్లులను నడుపుట చూచుచున్నాము; ఈఇంజనులం దావిరి కల్గుటకై, అత్యుష్ణతనిచ్చు నిప్పుకావలెను; ఇందుకు నేలబొగ్గును వాడుదురు. (కర్రనిప్పు, పెద్దయంత్రములం దంత యుష్ణత నిచ్చుటకు చాలదు.)

బొంబాయినగర ప్రాంతమున చాల దూదిమిల్లులు క్రమముగా వృద్ధియాయెను. ఆమిల్లుల ఇంజనులకు వలసినంత నేలబొగ్గు సప్లైచేయుట కట్టిగను లాప్రాంతమున లేవు. వంగ విహారాది దూరప్రాంతములనుండి బొగ్గును రైలుపై తేవలెను. ఆరైలుకంపెనీవా రా బలువుసామాను తెచ్చుటకు చాల హెచ్చురేటు బాడుగ వసూలుచేయుదురు. అందువలన బొంబాయిలో బొగ్గుకు కిమ్మతు చాలహెచ్చి, మిల్లులపని గిట్టుబాటు గాక, నష్టముకలుగుచుండెను. మరియు కొన్నిగనుల నేలబొగ్గుకు ఖర్చు అధికమై, సరుకు చాలనప్పుడును గిరాకి కలుగును. ఇంగ్లం డు, అమెరికా, జర్మనీలందున్నంత విశాలమగు బొగ్గుగనులు మనదేశమున దొరకలేదు. *[1] అందువలన మరియొక బలీయమగుశక్తి దొరకుట యవసరమయ్యెను.

కొన్ని పాశ్చాత్యదేశములందు కొన్నిచోట్ల విజ్ఞానసహాయమున నదులజలపాతముతో విద్యుచ్ఛక్తిని పుట్టించి, బొగ్గుకు బదులు విద్యుచ్ఛక్తితో పెద్దయంత్రముల నడుపుచున్నారు. మనదేశమున, కావేరినది మైసూరులోని శివసముద్రమునొద్ద కొండలనుండి క్రిందకు ప్రవహించుచోట, గొప్ప జలపాతము కలదు; ఆజలపాతమున్నచోట, క్రిందచక్రములనుంచి, ప్రవాహపుదెబ్బచే వేగముగ తిరుగు చక్రయంత్రములద్వారా యచట నొక యూరపియను కంపెనీవారు విద్యుచ్ఛక్తిని పుట్టించుచున్నారు. దానితో యంత్రములు నడుపబడి, మైసూరులో కోలారు స్వర్ణ ఖనులనుండి బంగారు చేయబడును. ఆవిద్యుచ్ఛక్తి బెంగుళూరు మైసూరుల యెలెక్ట్రికుదీపములకుగూడ నుపయోగించుచున్నది. ఇట్లే బొంబాయిప్రాంతమునగూడ చౌకగ విద్యుచ్ఛక్తి దొరకినచో, దానిసహాయముననే బొంబాయిమిల్లులు నడుపవచ్చును. ఆవిధముగ బొగ్గుబాధయు వదలునని జంషెడ్జితాతా ఆలోచించెను. (రసాయనశాలలందు విద్యుచ్ఛక్తి తయారుచేయుటకు చాలసొమ్ము ఖర్చు అగును.) ఇదివరలో 1875 ప్రాంతమున, మధ్యరాష్ట్రమందు తన ఎంప్రెసుమిల్లు స్థాపించుటకు తగుస్థలముకొరకు వెదుకుచుండి నప్పుడు, జంషెడ్జితాతా జబ్బల్‌పురముకు వెళ్ళెను; అచట నర్మదానది వింధ్యగిరినుండి క్రిందకు పడును. ఆజలపాతమునొద్ద తనమిల్లునుంచి, దానిశక్తితో సులభముగ యంత్రముల నడిపింపదలచి, తాతా యాస్థలమును ఖరీదుకిమ్మని ప్రభుత్వమును కోరెను. కాని అక్కడనే, ఒక సన్యాసి ఆశ్రమముంచి, అందొక విగ్రహమునుంచి, పూజించుచుండుట తటస్థించెను. ఆజిల్లాలోని పామరులందరు నచటికివచ్చుచు, ఆవిగ్రహమును దర్శించి, ఆ సన్యాసిని సేవించి పోవుచుండిరి. ఆస్థలమును మిల్లుకై అమ్మినచో, ఆసన్యాసి యటనుండి పోవలెనని, అందుచే చుట్టుపట్లజనులం దుద్రేకము కలుగునని తలచి, ప్రభుత్వమువారు తాతా కోరినక్రయము జరిగించుటకు నిరాకరించిరి. తుదకు జంషెడ్జి తనమిల్లును నాగపురమం దేర్పర్చెను.

తరువాత 1897 లో జంషెడ్జితాతా, 'మిల్లరు' అను నాంగ్లేయవర్తకుడు, గోస్లింగు అనుఇంజనీరు, గుజరాతుప్రాంతపు దుగ్ధసాగరజలపాతముద్వారా జలవిద్యుచ్ఛక్తి జనింపజేయ నిశ్చయించిరి. ఈస్థితిలో వీరిదృష్టి 'లోనవ్లా' వైపు మరలెను.

బొంబాయిప్రాంతమున సహ్యాద్రి, యుత్తరదక్షిణములుగా వ్యాపించి యున్నది. దీనినే పడమటికనుమలు అందుము. (అది మనప్రాంతముకు పడమటిదిశనున్నది) ఈపర్వతపంక్తిలో బొంబాయినగరమునకు 50 మైళ్ల లోపున 'లోనవ్లా' అను కొండస్థలము కలదు. అందు సముద్రతీరమునకు 2000 అడుగుల ఎత్తున నున్న యొకబంగాళాయందు చల్లదనముకై ప్రతిసాలున కొన్ని నెలలు 'గోస్లింగు' గారు నివసించుచుండిరి. అప్పుడచ్చటి పరిస్థితుల నాయన గమనించెను. ఈకొండలు చాలయెత్తు, పడమటి వానలమబ్బులు మనప్రాంతముకు వచ్చుటకుముందే మాకొండల దాకును. ఇచట నానైఋతివానలవల్ల కుంభవృష్టిగ వర్ష ధారలు పడుచుండును. ఆకొండపైనచుట్టును ఎత్తగుగట్లును మధ్యను విశాలమగుచరియలు రాతినేలయు నున్నవి. అందువలన వర్షోదక మాకొండపైన నిలవయుండి, బాగుగ హెచ్చినప్పుడు పొర్లి నలుప్రక్కలను పారుచుండెను. ఆఎత్తుస్థలమునుండి యానీటి నొక్కప్రక్కగా నొకే పెద్దధారగా క్రిందికి త్రిప్పుచో, గొప్ప జలపాతమేర్పడును. అందుండి సమృద్ధిగ విద్యుచ్ఛక్తి పుట్టింప వచ్చును.

దూరస్థమగు దుగ్ధసాగరజలపాతముకన్న, 'లోనవ్లా'లో హెచ్చుసదుపాయములు కలవు. అది బొంబాయికి చాలదగ్గర; తక్కువఖర్చుతో నావిద్యుచ్ఛక్తిని బొంబాయిమిల్లులకు సప్లై చేయవచ్చును; ఆమహానగరమున విద్యుచ్ఛక్తికి చాల గిరాకి యుండును. 'లోనవ్లా' ప్రాంతమున సాలీనా వేయిదుక్కుల కన్నను హెచ్చుగ వర్షించును. అచట విద్యుచ్ఛక్తిని జనింపజేసి బొంబాయిపురముకు చేర్చుచో, ఆశక్తితో మిల్లులెక్కువబాగుగ పనిచేయును. మిల్లుగొట్టములనుండి యిదివరలో నిరంతరము బొగ్గుపొగవచ్చి వాయుమండలము నావరించుచు, బొంబాయి నగరమున కనారోగ్యము కల్గించుచుండెను. నేలబొగ్గు వాడక విద్యుచ్ఛక్తినే వాడుచో, బొగ్గుపొగయుండదు. కనుక నచటిగాలియు శుభ్రమగును. మరియు ఈవర్ష జలమంతయు చెదిరి వ్యర్ధముగ సముద్రములో పడకుండ, దానిని కాలువలద్వారా వ్యవసాయాదులకు లాభకరముగ వినియోగింపవచ్చును.

ఈ సంగతులన్నిటిని గ్రహించి, వెంటనే తాతాగారు సమర్థులగు వాస్తువిజ్ఞులచే నాప్రణాళికను పూర్తిగా పరీక్షింప జేసిరి. ఆయుద్యమము సాధ్యమని, లాభకరమని, వారు తెల్పిరి. అంతట, స్వయముగ నింగ్లండుకుజని, అచటభారతమంత్రియగు హమిల్టను ప్రభువుతో, తాను తలపెట్టిన యుక్కు పరిశ్రమనుగూర్చియు, ఈజలవిద్యుచ్ఛక్తి కార్యమును గూర్చియు, తాతా చర్చించెను. సాధక బాధకములదెల్పి ఆయనసహాయమును గోరెను. హమిల్టనుప్రభువు తనసానుభూతిని తెల్పెను. అందువలన, తరువాత మనదేశమందలి ప్రభుత్వాధికారుల యాటంకమును, ప్రభుత్వపు పరిశోధనలలో తరుచుగ కలుగు విశేషకాలయాపనయు లేకుండ, కొంతసౌకర్యము కలిగినది.

ఈపరిశ్రమకై మైళ్ళకొలది కొండస్థలములను, అడవులను, కొలదిజనులుమాత్రము వసించు కొన్నిలోయలను, కొనవలసివచ్చెను. అందు కొన్నిప్రాంతములు వ్యక్తులవి. వానినికొనుటకు ప్రభుత్వమునకే అధికారముకలదు. †[2] అందుకు ప్రభుత్వసానుభూతి అవసరము. తనప్రణాళికకు పూర్తియగు వివరములను ఆయుద్యమముచే బొంబాయినగరపు జనులకు చుట్టుపట్లజిల్లాల భూస్వాములకు, రయితులకు, గలుగగల లాభములను వివరించుచు, జంషెడ్జి లండనులో హమిల్టను ప్రభువునకొక పెద్దరిపోర్టునంపెను. దానివిశేషమును గమనించి, భారతమంత్రి దానిని తన యాశీర్వాదముతో బొంబాయిగవర్నరు కంపెను. అంతట జంషెడ్జి గవర్నరుతో చాలసార్లు సంప్రతించి, తనయత్నములచే నాప్రాంతములకు లాభము కలుగునని గవర్నరుకు విశదముచేసి, ఆయనకు తృప్తి కలిగించెను. 1903 లో అమెరికా వెళ్ళినప్పు డచ్చటి నయాగరా జలపాతము మున్నగువానినిజూచి, అందు విద్యుచ్ఛక్తి పరిశ్రమ నాయకులనుండి చాలసంగతుల గ్రహించెను. ఇట్లు నిరంతరపరిశ్రమతో నాయుద్యమమునకు పునాదివేసి, ఆమహోద్యమమును నిర్వహించుటకై తొందరగ యత్నించుచుండగనే, 1904 లో జంషెడ్జి చాలవ్యాధిగ్రస్తుడై, మేనెల 19 వ తేదిని మరణించెను.

ఈయాపత్తుచే బంధుమిత్రులు శోకసంతప్తులైరి. ఆయుద్యమమును తరువాత జయప్రదముగ స్థాపించినడుపు భార మాయన పుత్రమిత్రులపై బడెను. జంషెడ్జి ఈమహోద్యమములోని ఆనుపానులను వారికి మొదటినుండి తెలిపి, వారి కాకార్యక్రమపునిర్వహణమున పూర్తియగు శ్రద్ధను ధైర్యోత్సాహములను కలిగించెను. మిల్లరుగోస్లింగులతో నేర్పడిన సంఘమందు తనతో బాటు జ్యేష్ఠపుత్రుడగు దొరాబ్జినికూడ సభ్యునిగ చేర్చెను. అందువలన, ఆయనయనంతర మాయుద్యమమును విడువక, దొరాబ్జియు మిత్రులును సాధించి, జయప్రదముగ నడుపగల్గిరి. 1907 నందే ప్రభుత్వమునుండి ఆపరిశ్రమ స్థాపనకు వలయు లైసెన్సు లభించెను.

కాని గొప్ప యింజనీర్లచే నాకొండస్థలము లన్నిటిని పూర్తిగా పరీక్షింపజేసినమీదట, వివరములగూర్చి కొన్ని చిక్కులు కన్పట్టెను. మిల్లులకు, మునిసిపాలిటికి, ఇతరసంస్థలకు, విద్యుచ్ఛక్తి సప్లైచేయుటకు ఖరారుచేయుచో, మధ్య నెన్నడు నావిద్యుచ్ఛక్తి సప్లై నిల్చిపోకుండ తగు కట్టుదిట్టముల జేయవలెను. (అట్లు తప్పిపోయినయెడల, ప్రజలకు అసౌకర్యము కల్గును; మరియు తాతావారు ఆసంస్థలకు చాల నష్టపరిహార మీయవలసియుండును.) నయాగరా శివసముద్రములందువలె నిచట సహజనదీప్రవాహము లేదు. బొంబాయిప్రాంతపు కొండలపైన వేయిదుక్కులకుపైగా వాన కురియును. కాని అందు చాలభాగము వర్ష కాలపు మూడునెలలోనే పడును. తక్కిన 9 నెలలందును, నిరంతరముగ జలధార కొండలనుండి పడు టెట్లు? ఈమూడునెలలలోను పడు మహావర్షపు సమృద్ధజలము వ్యర్ధముగ సాగరములోనికి బోకుండ, కొండలపైననే చాల యెత్తగు మహాసరస్సుల నిర్మించి, అందు విశేషజలమును నిలవజేసి, క్రమముగా నందుండి యవసరమగునంత నీటి ప్రవాహము నొకచోట కొండయంచుకు రప్పించి, అటనుండి క్రిందకు గొట్టములద్వారా జలధార వేగముగ బడునట్లు చేయవలెను. పూర్తియైన జయము కలుగవలెనన్న , రెండుమూడేండ్లు వరుసగ నెప్పుడైన ననావృష్టికలిగి, తగినంతవర్షము పడకున్నను; అప్పటివరకును చాలునంత నీరుకూడ నాకొండలమధ్య నిలవజేసి యుంచవలెను.

అందువలన, వారాలోచించి, మొదట తలపెట్టిన 'లోనవ్లా' ప్రాంతమునేగాక, దాని కాగ్నేయమందున్న 'వల్వాను' కొండను, దానికిని ఆగ్నేయదిశదగు 'షిరాటా' కొండను, వీనిమధ్యనున్న లోయలన్నిటినిగూడ కొని, ఆలోయలనుండి నీరు ప్రక్కలకు తెగిపోకుండ, చాల యెత్తగు బలమైన రాతిప్రాకారముల గట్టుటకు నిశ్చయించిరి. ప్రశస్తమగు యంత్రములను, ఎన్నటికిని చెడని బలీయమగు ఉక్కుగొట్టములు మహోన్నతమగు స్తంభములు తీగలు మొదలగు చాల ఉపకరణములను, హెచ్చువెలకు తేవలసియుండెను. కార్యమంతను విజ్ఞులు జగద్విఖ్యాతులు విదేశములం దట్టి కార్యములలో విశేషానుభవము సంపాదించినవారునగు ఇంజనీర్లచే జరిగించ బడవలెను. అందుకు చాల మూలధనము ఒక్కసారిగా కావలసి వచ్చెను.

పెద్దపరిశ్రమలు లేని మనదేశమున, సందేహగ్రస్తమగు నావిచిత్రపరిశ్రమకై అంతమూలధనము దొరకుట దుర్ఘటము. అందువలన, పరిశ్రమలతో నొప్పుచు ధనముతో తులతూగుచున్న ఆంగ్లదేశపు లండనులోనే ఈసంఘమును స్థాపించి, అందు చాలమంది విజ్ఞులగు ఆంగ్లేయుల సభ్యుల యజమానులుగ జేర్చుకొని, వారిద్వారా ఆంగ్లకోటీశ్వరులనుండి మూలధనము సేకరించి, ఈయుద్యమము సాగింపవలయునని తలచి, దొరాబ్జి తన యాంగ్లమిత్రులసహాయముతో లండనులో నట్టిసంఘము స్థాపించి, ద్రవ్యముకై ప్రకటనలజేసి, మనసార యత్నించెను. అచట ధనము చేకూరినచో, ఈపరిశ్రమ యాజమాన్యము, లాభమును, చాలవర కాంగ్లేయుల హస్తగతమై యుండును. మూడేండ్లు యత్నించినను, కొన్ని కారణములవలన, ఆమూలధన మాంగ్లదేశమున చేకూరలేదు. ఈయదృష్టఫలితమున దొరాబ్జి నిరాశుడై, తిరిగివచ్చెను.

ఈలోగా మనదేశమున స్థితి మారి, 'స్వదేశీ^' యుద్యమము క్రమముగా దేశమంతటను నాటుకొనెను. తాతావారి లోహపరిశ్రమ స్థాపితమై, పనిచేయ నారంభించెను. అందువలన తాతాకంపెనీవారిప్రజ్ఞ, కార్యశూరత్వము, దేశీయులకు విదితమై, తాతావారిప్రతిష్ఠ హెచ్చెను. 'స్వదేశీ' వలన బొంబాయి మిల్లుదార్లకు చాల లాభించెను. బొంబాయిలోని కోటీశ్వరులగు కొందరు తమమిల్లులకు విద్యుచ్ఛక్తి నీకంపెనీనుండి తీసుకొనుటకు ఖరారునిచ్చిరి; వా రీకంపెనీలో చాలవాటాలను గూడ తీసికొని, కొంత ద్రవ్యమిచ్చిరి. తుదకు, 1910 నవంబరులో, ఈ సంఘము 'తాతాహైడ్రో-ఎలెక్ట్రిక్ సప్లైకంపెనీ' అను పేర రిజిస్టరు చేయబడెను.

మొదట నిర్ణయించిన మూలధనము రెండుకోట్ల రూపాయలు. తాతాకంపెనీవారే యాసంఘము నడుపుట కేజెంట్లుగా నేర్పడిరి. కొన్నివాటాలను తాతాకంపెనీవారే తీసికొనిరి; కొన్నిటిని బరోడా గయక్వారు మొదలగు స్వదేశీయ రాజులు, మరికొన్నింటిని కొందరు మిల్లుయజమానులు మున్నగు వ్యాపారస్తులును, తీసికొనిరి. ఇట్లు మూలధనమంతయు చేకూరెను. అంతట ద్రవ్యబాధ వదలి, దొరాబ్జితాతా తదేకదీక్షతో కృషిచేసెను. సస్సూన్‌డేవిడు, ఆర్. డి. తాతా, రత్నతాతా, బ్రోచా మున్నగు భారతీయులే చాలవర కిందు డైరక్టరులు; సర్ దొరాబ్జితాతా ఈబోర్డు కధ్యక్షుడయ్యెను. 1911 ఫిబ్రవరిలో, బొంబాయిగవర్నరగు సిడెన్హాం ప్రభువుచే దీని కట్టడములకు పునాది వేయబడెను. 700 మంది కూలీలతో ఇంజనీర్లు వేర్వేరుకట్టడముల నిర్మాణకార్య మారంభించిరి. ఇదివరలో ప్రపంచమందున్న విద్యుచ్ఛక్తి కుపయోగించు జలపాతములన్నియు సహజమగు జీవనదులవి; ఆజలపాతములకు నీరు నిలవచేయనక్కరలేదు; అందు పెద్దరాతికట్టడము లక్కర లేదు. సహ్యాద్రియం దట్లుకాదు; ఇచట హిందూమహాసముద్రమునుండి వచ్చు నైఋతిమేఘములు కొండలదాకుడువలన విపరీతమగు వర్షోదక మాకొండలందు బడును. కొండలందు మూడునెలలలో బడుదానినంతను అరికట్టి, సాలుకంతకును నిలవయుంచుటకు, చలనము లేని ఆనకట్టలబోలు బ్రహ్మాండమగు రాతిగోడల గట్టవలసివచ్చెను. ఉత్తరమందున్న 5 మైళ్ళ విశాలమగు 'షిరాటా' సరస్సుకు 31 గజములయెత్తును మైలున్నరపొడుగునుగల గోడనుకట్టి, అందు 720 కోట్ల ఘనపదములనీటికై కొండలలోనుండి సుమారు మైలుపొడుగు సొరంగముత్రవ్వి, 'వల్వాన్‌' సరస్సుకు దారిజేసిరి. ఈ 'వల్వాను'ను నిట్లే దీర్ఘమగు పెద్దరాతిగోడలతో బిగించి, 1500 ఎకరముల మహాసరస్సుగ జేసిరి. ఇందుండి కొండలలోనే మూడుమైళ్ళ దూరమందలి 'లోనవ్లా'కు దారిచేయబడినది. 'లోనవ్లా'కు నిట్లే యింకొక బలీయమగు రాతిగోడ నిర్మింపబడినది. ఇందలి నిలవనీరు చాలనప్పుడు, ఇట్లు పై రెండుసరస్సులనుండియు దీనికి నీరువచ్చును.

కొండలమధ్యనున్న యీ 'లోనవ్లా'సరస్సులోని యుదకము కృతకనదీప్రవాహముగ, ఆకొండపీఠభూమియంచుకు పెద్దసొరంగములద్వారా తేబడి, *[3] అటనుండి 7 అడుగుల వెడల్పుగల పెద్దయుక్కు గొట్టములద్వరా 1734 అడుగుల క్రిందికి వేగముతో విడువబడును. ఈమహాజలధార కచట అంగుళముకు 750 పౌనుల రేటున యొత్తిడియుండును. అట్టిమహాశక్తితో వచ్చునాధార యచ్చటనుంచినయుక్కు చక్రముల నతివేగముగ త్రిప్పివేయును. అందుచేజనించు మహాశక్తి యంత్ర సహాయమున ఎలెక్ట్రిసిటీ (విద్యుచ్ఛక్తి)గా మార్పబడును. అప్పుడాశక్తి 5వేల 'వోల్టు' లది; దానిని మరియొక మహాయంత్రపు సహాయమున కుదించి, దానిని లక్షవోల్టులగా చేయుదురు. ఆ 'పవర్‌హౌసు' (శక్తిగృహము) నుండి బొంబాయినగరమందలి 'పరేల్‌' అను మిల్లుపేటకు 43 మైళ్లుండును; మధ్యను ఉప్పుటేళ్లు; సముద్రపు పాయకూడ, దాటవలెను. ఈ 43 మైళ్ళును లోతుగ కాంక్రీటు పునాదులతో 200 అడుగులయెత్తున బలీయములగు నుక్కు స్తంభములనుపాతి, వానిపైనుండి రాగితీగలనుబిగించిరి; ఈతీగల పైన పవర్ హౌసునుండి 'పరేలు^'లో నిర్మించిన రిసీవింగ్ స్టేషను (గ్రాహకస్థానము)లోని కీలక్షవోల్టుల బలముగల యమ్మహాశక్తి కొనిపోబడును; అందాశక్తి మరల నైదువేల 'వోల్టులకు^' పలచన చేయబడి, నిలవయుంచబడును; అటనుండి భూమిలోపలనుండి వేసిన తీగలద్వారా బొంబాయినగరపు మిల్లులకు నితరయంత్రములకును ఈవిద్యుచ్ఛక్తి చాలచౌకగ సరఫరాచేయబడును. (విద్యుచ్ఛక్తి ప్రసరించుచున్న తీగలను నరులు ఇతరప్రాణులు ముట్టినచో, ఆశక్తిబలమునవారు తక్షణము మరణింతురు. అందువలన విద్యుచ్ఛక్తి ప్రసరించుతీగలు చాల ఎత్తుగనో భూమిలోపలనుండియో పోవలెను.)

నీరు షిరాటా మొదలుకొని కొండలపై నిలవచేయుట, దానిని కొండల క్రిందకు సరియగుధారగ రప్పించుట, కొండక్రింద విద్యుచ్ఛక్తి పుట్టించు యంత్రముల గట్టుట, ఆశక్తిని బొంబాయికి తీగలపై చేర్చి నిలవయుంచుట, ఇట్లీపనియంతయు పదేండ్లు పట్టి, 1920 తో పూర్తియయ్యెను. లోనవ్లా సరస్సునుండి కార్యము 4 ఏండ్లలోనే పూర్తి అయినవి. 1915 నుండియే మిల్లులకు విద్యుచ్ఛక్తి సప్లై ఆరంభించెను. ఆయామిల్లుల మోటార్ల కేగాక అందుల దీపములకు గాలివిసురు 'ఫాను'లు మున్నగువానికిని తాతాకంపెనీనుండియే విద్యుచ్ఛక్తి యందజేయబడును.

ఈచౌక విద్యుచ్ఛక్తితో బొంబాయిమిల్లులవారు బొగ్గు బాధలేకుండ తమమిల్లులను ఇతరయంత్రములను, నడుపుకొన జొచ్చిరి. *[4] అందువలన బొంబాయిప్రాంతమున పరిశ్రమలు వేగముగ వృద్ధియయ్యెను. ఈవిద్యుచ్ఛక్తి జనకయంత్రమునొద్దను ఆతీగలు పోవుదారిని, గూడ, క్రొత్తపరిశ్రమల కర్మాగారములేర్పడెను. పొగబాధ పోయినందున, బొంబాయినగరపు ఆరోగ్యమును అందువలన బాగుపడెను.

కొలదియేండ్లకే యీకంపెనీవారు జనింపజేయు విద్యుచ్ఛక్తి యంతయు నాయామిల్లులువగైరాలకు ఖర్చైపోవుచుండెను. ఇంకను విద్యుచ్ఛక్తి కావలెనని, గిరాకి కలిగెను. అంతట తాతాకంపెనీవా రీకంపెనీ మేనేజరుద్వారా ఆప్రాంతపు ఇతరగిరులనుగూడ పరిశోధించిరి. 'లోనవ్లా'కు 12 మైళ్ళు ఉత్తరమందలి సహ్యాద్రినేయున్న 'ఆంధ్ర' నదియొక్కలోయయు నిందుకు తగినదని తేలెను. ఈలోయకు 19 అడుగులయెత్తు రమారమి 1800 అడుగులపొడుగుగల పెద్ద రాతిప్రాకారములగట్టి, 11 మైళ్ల మహాసరస్సు నాకొండలోయలలో సృజింపజేసి, అటనుండి నీటి ధారవలన కొండక్రిందయంత్రములద్వారా 60 వేలయశ్వశక్తిగల విద్యుచ్ఛక్తి జనింపజేసి, బొంబాయికి తీగలపైన బంపుటకు నేర్పాటుజరిగెను. కాని తాతాకంపెనీవారు దానిని స్వయముగానడుపలేదు. ఆహక్కును తాతావారివద్ద ఖరీదుకుతీసుకొని, 'ఆంధ్ర వాలీపవర్ సప్లైకంపెనీ' అనుపేర మరియొక సంఘమువా రాయంత్రాలయమును 1922వ సంవత్సరమునుండి జరుపుచున్నారు. 'లోనవ్లా' కట్టడములకును ఈకంపెనీవానికిని కొన్ని వివరములలో భేధముకలదు. దీనికార్యమును జయప్రదముగనే యున్నది.

బొంబాయి మహానగరమందలి వివిధావసరములకు నీరెండుకంపెనీలుపంపు విద్యుచ్ఛక్తియు వినియోగమై, ఇంకనధికముగ కావలసివచ్చెను. అంతట తాతాకంపెనీవా రాపడమటి కనుమల యితరప్రాంతములగూడ తిరుగపరిశోధించిరి. పూనాకు పడమర 25 మైళ్ళదూరమున నాకనుమలలో నీల, మూల, అను రెండునదులు కలియును. వర్ష కాలమున చుట్లుపట్లసెలయేళ్ల నీరీ నీలమూలల సంగమవులోయలో జేరును. ఆనీటినచ్చట 'డాము'లతో నరికట్టి, 16 మైళ్ల వెడల్పుగల చెరువుగజేసి, ఆనీటిప్రవాహముతో క్రొత్తజలపాతమును సృజించి, అందుండి యంత్రమూలమున విద్యుచ్ఛక్తి పుట్టించుటకు, తాతాకంపనీవారు నిశ్చయించిరి. ఈ 'డాము' 150 అడుగుల ఎత్తు, 4000 అడుగులపొడుగు. ఇచట కొండను దొలిచి, అందుండి నీటికాలువను కొండయంచుకును, అందుండి క్రిందికిని, రప్పించిరి. ఇచట 1700 అడుగుల ఎత్తునుండి వచ్చుధారతో విద్యుచ్ఛక్తి కల్గింపబడి, అటనుండి 76 మైళ్లదూరమందున్న బొంబాయికి తీగలపై గొనిపోబడుచున్నది. ఇచటి విద్యుచ్ఛక్తి పరిమితి 170 వేల అశ్వశక్తి వరకుండును. ఇది తాతాపవర్ కంపెనీ అనబడును; 1927 నుండి 1929 వరకు తాతాకంపెనీవారే దీనినిజరిపి, తరువాత కొంతహక్కునుంచుకొని, దీని యాజమాన్యమును తగ్గించుకొనిరి. ఇదియు జయప్రదముగ నున్నది.

బొంబాయిలో తాతాకంపెనీవారి కార్యాలయములన్నియు సౌకర్యమునకై యొకే మహాభవనమున నెలకొల్పబడినవి. దానికి తాతాగారి స్వగ్రామముకు స్మారకముగ 'నవసారిబిల్డింగ్స్‌' అని పేరు పెట్టబడినది.

ఈ మూడుజలవిద్యుచ్ఛక్తి సంఘములును సాలీనా సుమారు 2 1/2 లక్షల అశ్వబలముదగు శక్తిని పుట్టించును. బొంబాయినుండి పూనావరకు నీశక్తి యుండును. బొంబాయిలోని చాల మిల్లులకు నితరకర్మాగారములకు కలిపి, 1 1/2 లక్ష అశ్వశక్తిది ఖర్చు అగును. వీనిరేటు చాల చౌక †[5] యగుటచే, బొంబాయికి మునిసిపలు అవసరములకు, ట్రాముబండ్లకును, ఇటీవల బి. బి. సి. ఐ. కంపెనీవారి రైలులైను రైళ్ల నడుపుటకునుగూడ, ఈకంపెనీలనుండియే విద్యుచ్ఛక్తి (ప్రభుత్వాంగీకారముతో) నందజేయుట కేర్పాటుజరిగి, అట్లు వారందజేయుచున్నారు. ఈపరిశ్రమవలన బొంబాయిప్రాంతపు వ్యవసాయాదులకును చాలనుపయోగము కల్గినది. పూర్వము సముద్రములోనికి పోవుచుండిన నీరు విద్యుచ్ఛక్తి పుట్టించుటకై కొండలనుండి మరల్పబడి, గొట్టములద్వారా యంత్రచక్రములపైబడి, క్రింద నేలపై పెద్దకాలువలుగ నిరంతరము పారును. అది స్వచ్ఛమగు వర్షోదకము; ఆచుట్టుపట్ల భూములను తోటలుగ జేసి, అందా సమృద్దజలముతో కూరగాయలను, పూవులను, మంచిపండ్లను, విశేషముగ పండించి, బొంబాయికి పూనాకు సప్లై చేయుచున్నారు. ఇందుకు ప్రత్యేకసంఘము లేర్పడినవి. ఈనీరు జనులు త్రాగుటకును ప్రశస్తమైనది. అందువలన కొంత నీరు పానీయముగను ఉపయోగపడును.†[6]

  1. * ఓఢ్రవంగ ప్రాంతములందుమాత్రము బొగ్గుగనులు సమృద్ధిగనే కలవు.
  2. † వ్యక్తులకు హక్కగు ఆస్తిని నిర్బంధముగ కొనుటకు వ్యక్తుల కధికారములేదు. అది పబ్లికు కార్యములనిమిత్తము కావలెనని గజెట్టులో ప్రకటించి, 'లాండు అక్విజిషను ఆక్టు' ప్రకారము చర్యజరిపి, తగుకిమ్మతునిచ్చి, ప్రభుత్వమువారు మాత్రము నిర్బంధముగాగూడ ఆయాహక్కు దార్లనుండి తీసికొనవచ్చును. రైలు గ్రామ నివేశనములు మున్నగు వాటికై యిట్లే చేయుదురు.
  3. * ఈయయిదు మైళ్ళపొడుగునను ఆనదికడుగున నేల చదును చేయబడి, రాతితోను సిమెంటుతోను గట్టిగా కట్టబడినది. పైనరోడ్డు వంతెన, క్రిందనుంచి రైలుమార్గమును, కట్టవలసివచ్చెను. కొండయందు రాతినేలకానందున, అచట నీరింకి నేలదిగి పోకుండుటకై, అంచుభాగమంతయు కాంక్రిటుతో గట్టిచేయబడెను. ఆకొండపైన రాళ్లలో బిగించియుంచిన పెద్ద యుక్కుగొట్టములు శీతోష్ణములకు తగ్గి హెచ్చుటచే కలుగుచిక్కులు తప్పుటకు వైజ్ఞానికమగు కట్టుదిట్టముల జేయవలసివచ్చెను.
  4. * బొంబాయిలో గృహములు ట్రాంబండ్లు మున్నగువానికి విద్యుచ్ఛక్తి నొక యూరపియను కంపెనీవారు జనులకుసప్లై చేయుచుండిరి. ఈకంపెనీ 1905 కు పూర్వమే యేర్పడియుండెను. ఆట్రాములకును చిల్లరగా గృహములకునుగూడ తాతాకంపెనీనుండి విద్యుచ్ఛక్తిని కొనుటకవకాశ మిచ్చినయెడల, అందరును తాతాకంపెనీనుండియే తీసికొందురు. కోట్లకొలది యూనిట్లశక్తిని జలపాతసహాయమున వైజ్ఞానికముగ అతిజాగ్రత్తతో తయారుచేయుటవలన తాతావారి రేటు ఈయూరపియనుల రేటుకన్న చాలాచౌక. అందువలన చిల్లరలకు ట్రాములకు ఈతాతా కంపెనీవారు స్వయముగ సప్లై చేయకూడదని ప్రథమమందు లైసన్సు నిచ్చునప్పుడు ప్రభుత్వమువారు షరతు నేర్పర్చిరి.
  5. † అచట టోకున యూనిటుకు అర్ధణా చొప్పున విద్యుచ్ఛక్తి దొరకును; మనప్రాంతములందు యూనిటుఖరీదు సుమా రైదణాలు.
  6. † తాతా జలవిద్యుచ్ఛక్తిసంఘము చాల లాభకరముగ పనిచేయు చుండుటవలన, ఆరీతిని తమప్రాంతమున మద్రాసుప్రభుత్వమువారు సుమా రైదేండ్లక్రిందట 'పైఖారాస్కీమ్‌' అనబడు ఉద్యమమును స్థాపించిరి. సహ్యాద్రి దక్షిణాగ్రమున (నీలగిరికొండల సమీపమున) 'పైఖారా' అను చిన్న నది యొకటికలదు; దానినీరు కొండలోయలో పెద్ద యడ్డుగట్లు మూలమున నిలవజేయబడి, పెద్ద జలపాతమును, అందుండి విద్యుచ్ఛక్తియు, కలిగింపబడుచున్నవి. ఒక సం. నుండి ఇందువిద్యుచ్ఛక్తి తయారగుచున్నది. ఈవిద్యుచ్ఛక్తిని నిలవజేసి, తీగలపైన నీలగిరి, కోయంబత్తూరు, సేలం, తిరుచునాపల్లి, మధుర మున్నగు తమిళ జిల్లాలలోని పురములకును, గ్రామములకును గూడ, ప్రభుత్వమువా రందజేయుచున్నారు. ఇందువలన వేలకొలది బీదలకు వృత్తులును, ఆజిల్లాల జనులకు చాల సదుపాయములును, ఏర్పడినవి. ఈపైఖారా విద్యుచ్ఛక్తి, తాతాకంపెనీ వారమ్మునంత చవుక గాకున్నను, ఆవిరియింజనుద్వారా మన మునిసిపాలిటీలలో జనింపజేయు విద్యుచ్ఛక్తికన్న చవుకగనే యున్నది.