తాతా చరిత్రము/అంత్యదశ

వికీసోర్స్ నుండి

16. అంత్యదశ.

వ్యవసాయము తరువాత, మనదేశపు పరిశ్రమలన్నిటిలో నెక్కువముఖ్యము, హెచ్చుమందికి జీవనాధారమైనది, దూదిబట్టల పరిశ్రమ. దానివృద్ధికై, నాగపురం, బొంబాయి, అహమ్మదాబాదు, ఈమూడునగరములందును ఆధునికపద్ధతులపైన ఉత్తమరీతివగు దూదిబట్టలమిల్లులను జంషెడ్జితాతా స్థాపించెను; ఆదర్శరూపమగు వ్యాపారనీతినే యవలంబించి, అందు తనమిత్రులను, విద్యావంతులగు యువకులను, తరిఫీయతు చేసెను; అంతట తనజోక్య మక్కరలేకుండ, ఆయనయుద్యోగులే ఆపరిశ్రమల నడుపుకొనజొచ్చిరి.

అందుచే గలిగిన విశ్రాంతిని తాతా ఆపరిశ్రమవృద్ధి సందర్భమున అన్నిమిల్లులకును గలిగిన మహాసమస్యల పరిష్కారముకు వినియోగించెను: అవి కార్మికసమస్య, నౌకావ్యాపారము, ప్రశస్తమగు ప్రత్తిసాగు, బట్టలపన్ను మున్నగునవి; ఈసమస్యల చర్చను సవ్యమార్గమున జరిగించి వానిననుకూలముగ బరిష్కరించుటకు, ఆయన చాలదూరదృష్టితో వర్తించి, విశేషకృషి చేయుటయేగాక, తోటిమిల్లుదార్లయొక్కయు ప్రభుత్వాధికారుల యొక్కయు సహకారమును సంపాదించుట యత్యవసరమయ్యెను. తాతా కుండిన పరిజ్ఞానము, దేశాభిమానము, దూరదృష్టి, తక్కినమిల్లుదార్లకు తరుచు లేకపోవుటయు, అందువలన తాతాగారికృషికి వెంటనే పూర్తియగుఫలము కలుగక పోవుటయు గూడ, మనము గమనించియున్నాము. ఈకాలమందే ఆయన బెంగుళూరు ప్రాంతమున పట్టుపరిశ్రమను స్థాపించి, దానిని జయప్రదముగ జేసెను; మామిడిపండ్లను చెడకుండ మంచులో నిలవజేసి వానిని విదేశములకు యెగుమతిచేయుట, జలనుండి గొట్టములద్వారా నూతులకు నీరు రప్పించుట, మున్నగు కొన్ని యితరవ్యాపారముల ప్రయత్నమును గూడ ఆయన చేయుచుండెను. ఆవ్యాపారము లిప్పుడీదేశమున లాభకరముగ జరుగుచున్నవి. వీనిని మొదట ఆరంభించి మార్గదర్శకుడైనది తాతాగారే.

1898 నుండి, ఆయన మనదేశపు ఆర్థికసౌభాగ్యమున కవసరమగు విజ్ఞానాలయము, లోహపరిశ్రమ, జలవిద్యుచ్ఛక్తి, ఈమూడింటిస్థాపనయందును ప్రత్యేకదీక్ష వహించి, వానికై నిరంతరము కృషిచేసెను. ఈమూడును చాల గొప్పసంస్థలు, ఇదివరలో మనదేశమున నిట్టివి లేవు. వీనికి సంబంధించిన అనేక విజ్ఞానవిషయములను సమస్యలను పరిష్కరించుటకు ప్రతిభ, విశాలజ్ఞానము, అమితచాతుర్యము, నిరంతరశ్రమ, దూరదృష్టి, అవసరములు.

ఆయన యీమహాసంస్థల స్థాపనకై మనదేశపు వివిధప్రాంతములను జగద్విఖ్యాతులగు విజ్ఞులచేత, విశేషవ్యయముకోర్చి, పరిశోధింపజేసెను; స్వయముగా యూరపు అమెరికాలకు చాలసారులు వెళ్ళి, అచట పరిస్థితుల గ్రహించి, సుప్రసిద్ధకర్మాగారముల బరీక్షించి, అనేకసమస్యల నచటి గొప్పవ్యాపార నాయకులతో చర్చించి, ఆసంస్థలను స్థిరముగ స్థాపించి నడుపగల ఉత్సాహులు విశ్వాసపాత్రులునగు పాశ్చాత్యప్రవీణుల నెన్నుకొనెను; (ఆరంభదశలో వారి సహకార మత్యవసరమాయెను.) ఆయుద్యమముల కాంగ్లసీమలోని భారతమంత్రియు మనదేశమందున్న భారతప్రభుత్వమువారును సుముఖులగునట్లు చేయగలిగెను; అనేకవిఘ్నముల నెదుర్కొని దాటెను; వానికి సంబంధించిన యమూల్యమగు వాఙ్మయమును అనేకపరికరములను భద్రపరచి, తనపుత్రమిత్రులకు వశముచేసెను.

ఈసంతతకృషివలన 1900 నుండియు, ఆయన యారోగ్యము క్రమముగ చెడి; దేహము క్షీణించెను; నీరసము హెచ్చెను. వ్యాపారసందర్భమున ఆయన తరుచు విదేశములందు యాత్ర చేయవలసివచ్చెను. అమెరికా యూరపులనుండి 1902 సాలాఖరున మనదేశమునకు తిరిగివచ్చి, తన మహోద్యమముల స్థాపనకై సిద్ధముచేసిన ఆయా ప్రణాళికల పరిశీలించుచు, శ్రమపడుచుండగ, ఆయనకు దౌర్బల్యము క్రమముగ హెచ్చి, వ్యాధి యధికమయ్యెను. వైద్యులేర్పర్చిన యాహారనియమముల నాయన సరిగా పాటింపలేకపోయెను. వెంటనే యారోగ్యముకై యూరపుకు వెళ్ళవలెనని వైద్యు లాయనను ప్రోత్సహించిరి. ఆయన మొదట నంగీకరించలేదు; కాని తరువాత తన సహజమిత్రుడగు ఆర్. డి. తాతా తొందరజేయగా, ఆయ
నతో నీజిప్టుకు వెళ్ళెను; అచ్చట నొకనెల యుండినమీదట, జ్యేష్ఠపుత్రుడును కోడలును 1904 ఫిబ్రవరిలో ఆయన నిటలీకి తీసికొనిపోయిరి.

అప్పుడు భారతదేశమున ఆయన భార్యయగు హీరాబాయి, చనిపోయెను; ఆవార్త తెలిసినమీదట జంషెడ్జి యారోగ్య మింకను క్షీణింపజొచ్చెను. దొరాబ్జితో వియన్నా నగరము పోయి, అందుండి జంషెడ్జి, వైద్యుల సలహాపైన, జర్మనీలోని ఆరోగ్యస్థానమగు 'నౌహీం' పురముకు చేరెను. ఆయన మనోబలముమాత్రము తుదవర కట్లే యుండెను. మరియు, ఆదుర్బలస్థితిలో గూడ, జంషెడ్జి మనదేశపు ఆర్థికాభివృద్ధినిగూర్చి యాలోచించుచునే యుండెను. యూరపులో క్రొత్తగా కనబడిన ఉపయోగకరమగు కొన్ని ఫలవృక్షములను పుష్పజాతులను మనదేశమున నెట్లు పెంచవచ్చునో, తనమిత్రులతో చాలసార్లు చర్చించుచుండెను. నీరసమును వ్యాధియు హెచ్చుచున్న కబురు తెలసి, దొరాబ్జి తనభార్యతో వియన్నానుండి నౌహీముకు వచ్చి, తండ్రిని కలుసుకొనెను. తాను తలపెట్టి యత్నించుచున్న మహోద్యమములను శ్రద్ధతో పూర్తిచేయుడని, స్వదేశపు పారిశ్రామికస్థితిని వృద్ధిచేయుడనియు, దొరాబ్జితోను మిత్రులతోను తన యంత్యాభిలాషమును తెల్పి, జంషెడ్జితాతా 19-5-1904 తేదీని కాలధర్మము నొందెను. ఆదుస్థితిలో, వెంటనే దొరాబ్జి యామృతదేహమును తైలసిక్తముజేసి, నౌహీమునుండి లండనునగరముకు జేర్చెను. అచట యూరపునందుండిన పార్సీలందరును, చాలమంది భారతీయ మిత్రులును, జంషెడ్జియొక్క పాశ్చాత్యమిత్రులును సమావిష్టులైరి; అంతట, అచటి పార్సీదేవాలయమున పార్సీమతవిధుల ప్రకారము సంస్కారము చేయబడెను. (పార్సీలమృతదేహముకు ఖననము దహనము గూడ జరిగింపరు. పార్సీదేవాలయముల పైభాగమున మృతసంస్కారమునకై ప్రత్యేకస్థానమేర్పడి యుండును; అందు కళేబరము మంత్రయుతముగ, డేగలుమున్నగు జంతువులకు బలిగ వదలివేయబడును. నరునియాస్తియే గాక యాతని సర్వస్వమగు దేహమును జీవితకాలమందును అనంతరముకూడ, ఇతరజీవుల యుపయోగమునిమిత్తమే వినియోగము కావలెననియు, వ్యర్ధముగబోకూడదనియు, తెల్పు మహాసిద్ధాంతమిందిమిడి యున్నదని తోచును. పార్సీలలో చాలమంది మహాదాతలగుట కీసంస్కారసూత్రము కొంతవరకు తోడ్పడియుండవచ్చును.)

మరణించునప్పటికి జంషెడ్జి వయస్సు 65 సంవత్సరములు. భారతీయుల దామాషాఆయుర్దాయము చాలమంది విదేశీయుల దానికన్న మిక్కిలి తక్కువ. అందువలన జంషెడ్జిమృతి యకాలమరణమనుటకు వీలులేదు. భారతజాతీయపితామహుడుగ నుండిన దాదాభాయినౌరోజీ, పౌరపరిపాలన ధురంధరుడగు ఫిరోజిషా మెహతా, దిన్షా వాచా, మున్నగు కొలదిమంది జంషెడ్జి మిత్రులింకను చాలకాలము జీవించిరి; కాని, భారతీయప్రముఖులలో చాలమంది షష్టిపూర్తికాకుండగనే మరణించుటయు, వారిప్రజ్ఞానుభవములు దేశమునకు పూర్తిగ వినియోగింపక పోవుటయు, శోచనీయ విషయము. ఆంగ్లదేశమందు 65 ఏండ్లు నడివయస్సుగనే భావింపబడును.

జంషెడ్జితాతా మరణవార్త వెంటనే ప్రపంచమంతటను తంతిద్వారా వ్యాపించెను. అది భారతీయులను శోకసాగరమున ముంచెను; మనదేశమం దన్నిప్రాంతములందును విచారసూచక సభలుజరిగి, జనులదు:ఖము తెలుపు తీర్మానములు చేయబడెను. తరువాత కొంతకాలమునకు జంషెడ్జి స్థాపింప యత్నించుచుండిన లోహపరిశ్రమ జలవిద్యుచ్ఛక్తి పరిశ్రమ సాధింపబడి, వాని జాతీయ ప్రాముఖ్యము జనులకు బోధపడెను. అంతట జంషెడ్జి తాతాగారికి స్థిరమగు స్మారకచిహ్న మేర్పర్చుట యుక్త మని జనులు నిశ్చయించి, కొందరుప్రముఖుల నందుకొక సంఘముగా నేర్పర్చిరి. అందుకు చందాలవలన 47000 రూపాయలు వసూలాయెను. ఆస్మారకచిహ్న మేరీతిగనుండవలెనని కొంతచర్చజరిగి, తుదకు ఆయన జీవితకృషికి ముఖ్యరంగస్థలమైన బొంబాయినగర మధ్యమున స్థలముతీసికొని, అందు ఆయనశిలాప్రతిమను నెలకొల్పుటకు, నిశ్చయింపబడెను. ఆప్రకారము బొంబాయిలో బి. ఐ. పి. రైల్వేకంపెనీవారి కార్యాలయము నెదుట, విశాలవీధుల కలియుచోట, మధ్యస్థలమందు, జంషెడ్జి తాతాగారి శిలాప్రతిమ 1912 లో స్థాపింపబడి, అప్పటి బొంబాయి గవర్నరుచే బహిరంగము చేయబడెను.

తనకు శిలాప్రతిమను జ్ఞాపికలను నెలకొల్పుట జంషెడ్జి కెంతమాత్రము నిష్టముకాదు; అది యాయన ప్రకృతికే వ్యతిరిక్తము. కాని యాప్రతిమ ముందుతరముల యువకులందరకు పారిశ్రామిక జీవనముకు జాతీయోద్ధరణకు నుద్భోధకముగనుండును. ఆయనకు నిజమైన జ్ఞాపకచిహ్నములు బెంగుళూరులో, జంషెడ్పురమందు, నాగపురమున, బొంబాయి అహమ్మదాబాదులలో, ఇట్లు మనదేశమం దన్నిప్రక్కలను ఆర్థికోపకారకమగు సంస్థల రూపమున నేర్పడియేయున్నవి. భారతీయులుగూడ తదేకదీక్షతో పనిచేయు నెడల స్వయంకృషివలననే మనదేశమున పెద్దపరిశ్రమల నడపి, వానిని పాశ్చాత్యసంస్థలకు తీసిపోకుండునట్లు జయప్రదముగ జేయవచ్చునని, ఈసంస్థలును ఆశిలాప్రతిమయు జ్ఞప్తికి తెచ్చుచుండును.



_________