తాతా చరిత్రము/ఇతర తాతాసంస్థలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

17. ఇతర తాతాసంస్థలు.

జంషెడ్జి యారంభించిన పునాదులపైననే, ఆయన నియమించిన రీతినే, ఆయనకుమాళ్లు విజ్ఞానాలయమును, లోహ యంత్రాలయమును, జలవిద్యుచ్ఛక్తి, కర్మాగారములను, నిర్మింపజేసిరి; వారు బంధుమిత్రుల సహాయముతో వానిని క్రమముగ వృద్ధిజేసిరి.

జంషెడ్జికి రెండవకుమారుడగు రత్న తాతా 1871 లో జనించి, బొంబాయిలో విద్యాభ్యాసముచేసి, 1892 లో వివాహమాడి, తన తండ్రియొక్క పరిశ్రమలలో పాల్గొనెను; కాని ఆయన ముఖ్యముగ జంషెడ్జి బొంబాయినగరాభివృద్ధికై చేయు వివిధప్రయత్నములందు చాల సాయము చేయుచుండెను. బొంబాయినగరపు చుట్టుపట్ల స్థలములను బాగుచేసి, వాసయోగ్యముగజేసి, వానిలో పేటలు నిర్మింపజేయుటలో చాల కృషిచేసెను. బొంబాయిలో తన తండ్రికున్న వివిధభవనాదులను వృద్ధిచేసి, తండ్రిచేసిన దానములకు చాల సాయముచేసెను. ఆయనకు సాంఘికశాస్త్రమం దభిమాన మధికముగ నుండెను. బెంగుళూరు విజ్ఞానాలయమందు సాంఘికశాస్త్రము బోధించుటకును, అందు ప్రత్యేకపరిశోధనల జేయుటకును, తనతండ్రి యనంతరము తనవాటాఆస్తిలోనుండి పెద్దధర్మము చేయుటకు యత్నించెను; కాని ప్రభుత్వమువారు ఆర్ధికబాధాది కారణములచేత దాని నంగీకరింపరైరి. తరువాత తాతాకంపెనీవారి లండనుశాఖ పర్యవేక్షణకై, రత్నజీతాతా యింగ్లండుకు జని, లండనునందే యుండిపోయెను. అచట తనబంధువగు శక్లత్వాలాతోకలసి వ్యాపార కార్యములందును, సాంఘికసమస్యల పరిష్కారమందును పాల్గొనుచుండెను. లండనులో సాంఘికశాస్త్రపరిశోధనలకై చాల ద్రవ్యమును నిధిగనిచ్చెను. కొంతకాలమునకు జబ్బుచేసి, రత్నజితాతా 1918లో నింగ్లండులోనే చనిపోయెను. దొరాబ్జి రత్నజీ లిద్దరును చాలమందిబీదలకు విశేషద్రవ్యసహాయము చేయుటయేగాక, అనేకప్రజోపకారి సంస్థల బోషించిరి. దొరాబ్జితాతా భాండారకర సంస్కృతపరిశోధన సంస్థకును పూనాలో పార్సీలపూర్వచరిత్ర గూర్చి విమర్శచేయుటకును, చాల ద్రవ్యసహాయము చేసెను. సోదరులిరువురును జనోపయోగకరమగు కొన్నిపరిశోధనలను స్వయముగ చేయించిరి.

జంషెడ్జి జ్యేష్ఠపుత్రుడగు దొరాబ్జితాతా తనతమ్ముని కన్న నెక్కువ దృఢగాత్రుడు; ఆయన తనతండ్రి యభిలాషను పూర్తిగా సాగించి, జంషెడ్జి యారంభించిన యుద్యమముల నన్నిటిని జయప్రదముగ నెరవేర్చి, వృద్ధిచేసెను. తాతాకుటుంబము మనదేశపు పరిశ్రమల వృద్ధికై చేసిన యపారకృషికై, దొరాబ్జి రత్నజీ లిద్దరకును ప్రభుత్వవారు 'సర్‌' బిరుదము నిచ్చిరి. భారతజాతి తనఆమోదమును మరియొక విధమున స్పష్టముగ తెల్పెను. మనజాతీయమహాసభతోబాటే, ఆసభ వారి సహాయముతో, ప్రతిసాలున, అఖిలభారతపారిశ్రామిక మహాసభ జరుపబడుచుండెను. *[1] 1915 లో జరిగిన పారిశ్రామికమహాసభ సర్ దొరాబ్జితాతాగారి అధ్యక్షతనే మహోత్సాహముతో నడిపింపబడెను. దొరాబ్జితాతాకును విద్యాసక్తి యధికమే. తాను విద్యనభ్యసించిన కేంబ్రిడ్జిలో పరిశోధనల జరిగించుట కావిశ్వవిద్యాలయమున కాయన 25000 పౌనుల నిచ్చెను.

ఇట్లు తండ్రిపరిశ్రమల జరిపి, మరికొన్ని కొత్తపరిశ్రమలగూడ స్థాపింప దోడ్పడి, దొరాబ్జితాతా 1932 లో కాలము చేసెను. పోవుటకుముందు తనఆస్తిలో విశేషభాగము నొక ధర్మనిధిగ నేర్పర్చి, ఆద్రవ్యమును కొందరు ట్రస్టీలద్వారా చాల ఆర్ధికసాంఘికధర్మ కార్యములకు వినియోగించుటకు నిర్ణయించెను. ఆసంస్థ 'సర్ దొరాబ్జితాతాట్రస్టు' అనుపేర బొంబాయిలో పనిచేయుచున్నది. వారిసహాయమున బొంబాయిలో సాంఘికశాస్త్రబోధకు పరిశోధనకు ప్రత్యేక విద్యాలయము స్థాపింపబడినది.

లోగడ వివరించినవానినేగాక, దరిమిలాను తాతాకంపెనీవారు మరికొన్ని పరిశ్రమలనుగూడ స్థాపించినారు. ఈకాలమున పాశ్చాత్యదేశములందు మెకానికల్ ఇంజనీరింగు అనబడు యంత్రవాస్తువిద్య గొప్పవిజ్ఞానముగ వృద్ధియైనది. అందువలన, అత్యద్భుతములగు మహాభవనములు గొప్ప ఆనకట్టలు వంతెనలు క్రేనులు మున్నగునవి నిర్మింపబడుచున్నవి. అట్టి ఉపయోగకరములగు గొప్పకట్టడములను వైజ్ఞానికముగ నిర్మించుటకు, వాస్తువిశారదులు సభ్యులు గాగల ఒకనిర్మాణసంఘమును తాతాకంపెనీవారు స్థాపించిరి. ఇదివరలో రైల్వేలబోలు పెద్దకంట్రాక్టులను పాశ్చాత్యులే తీసికొనుచుండిరి. అట్టివాని నిప్పుడీకంపెనీవారు తీసికొని, సులభముగ ప్రజ్ఞతో నిర్వహింప గల్గుచున్నారు. తాతాకంపెనీవారి వివిధ కార్యాలయముల నుంచుటకు మహాద్భుతమగు నొకే భవనము నీకంపెనీవారు నిర్మించిరి. (దీనికే నవసారి బిల్డింగ్సు అని పేరు.)

దొరాబ్జితాతాయు ఆయనమిత్రులును కలసి, రెండుకోట్ల రూపాయల మూలధనముతో, న్యూ ఇండియా అస్యురెంసు కంపెనీ' అనుపేర క్రొత్తరకపు భీమాకంపెనీని స్థాపించిరి. దీని నిలవద్రవ్యము మనదేశమున గొప్పపరిశ్రమల సంఘములకును బలీయమగు ధనసంస్థలకును ఈయబడి, భద్రముగ వృద్ధిచేయబడును. అందువలన ఆదేశీయపరిశ్రమలకు ద్రవ్యసహాయము కల్గును; ఆయిన్స్యురెంసు కంపెనీయు చిరస్థాయిగ నుండును. మరియు, ఇదివరలో మనదేశీయములగు కంపెనీలలో లేని ప్రశస్తమగు క్రొత్తరకపు భీమాలకును, ఇందు ఏర్పాటు కలదు. నరులకు ప్రమాదమరణము కలిగినచో హెచ్చుసొమ్ము నిచ్చుట, అంగవైకల్యమువలన నశక్తులగువారికి సొమ్మునిచ్చుట, జలాగ్నిప్రమాదములకు లోనగు భవనములు ఓడలు సరుకులు మున్నగువానికిని భీమాపట్టుట, ఇట్టివిందు కలవు. ఇవి పెద్ద వర్తకులకు, వ్యాపారస్తులకు, కార్మికులకును, చాల వినియోగించును.

ఇట్లే కొబ్బరినుండి వివిధవస్తువుల జేయుటకు, 'తాతా ఆయిల్‌మిల్స్ కంపెనీ' అనుసంఘము స్థాపింపబడినది. మనదేశపు వివిధప్రాంతములందు చిరకాలమునుండి కొబ్బరితోటలు విశేషముగ గలవు. ఈతోటలు కొన్ని మనము కాయలదినుటకును, తక్కినవన్నియుకల్లుగీతకును ఉపయోగపడుచున్నవి. కొబ్బరియు, ఇంకను ఇతరవిధములగు చమురుగింజలును, చాలవరకు విదేశముల కెగుమతి యగుచున్నవి. అట్లుగాక కొబ్బరినుండి చమురుగింజలనుండి ఈకంపెనీవారు వైజ్ఞానికపద్ధతులచే చిరకాలము నిలవయుండు పరిశుద్ధమగు నూనెలను, ప్రశస్తమగు చాలరకముల సబ్బులను చేయుచున్నారు. మరియు ఈకొబ్బరిసారము శుద్ధిజేసి 'కోకోజెం' అనబడు చౌక నేతినిగూడ చేయుచున్నారు. మనము మామూలుగ వాడు నేయి శాకాహారము కాదు; అది పశుసంబంధము. అట్లుగాక 'కోకోజం' కేవలము వృక్షసంబంధము ఈకంపెనీవారు బట్టలసబ్బులు మున్నగు చాలరకముల వస్తువుల జేయుచున్నారు, అవి చౌకవి; అని విదేశపువాని కెందును తీసిపోవు. 'తాతాఎయిర్వేసు' అనబడు ఆకాశవిమానసంఘమును ఇటీవల ఈసంఘమువారి సహాయమున ఆరంభమైనదే. తాతా కరాచీ బొంబాయిలనుండి హైదరాబాదుగుండ మన మద్రాసు ప్రాంతముకు, తిరువాన్కూరుకు, ఈకంపెనీవారు విమానములను నడుపుచున్నారు. తాతాకంపెనీలు చేయు వ్యాపారము లింకను కొన్నికలవు.

మనదేశపు పారిశ్రామిక సంస్థలట్టిలో తాతాకంపెనీయే ప్రధానము. జంషెడ్జితలపెట్టి స్థాపించినవానిని వారు వృద్ధినొందించినారు; క్రొత్తపరిశ్రమలను స్థాపించుచున్నారు. ఇతరపరిశ్రమికులతో సృహృద్భావముకలిగి, దేశపు ఆర్థికసంపత్తిని పెంపొందించుచున్నారు. ఆకంపెనీలో పుంజీపతులకుండు కొన్నిలోపము లున్నను, అనేకసుగుణములును కలవు. ప్రస్తుతము తాతాకంపెనీలు రమారమి నూరుకోట్లరూపాయల మూలధనముతో వివిధప్రాంతములందు చాల పరిశ్రమల స్థాపించి నడుపుచున్నారు. వంగదేశము మొదలు మళయాళ ప్రాంతమువరకు దేశమంతటను వీరి కార్ఖానాలు పనిచేయుచున్నవి. ఇందు రమారమి మూడులక్షలజనులు పనిచేయుచున్నారు. ఇందుకొంతమంది విద్యావంతులకు, ప్రభుత్వోద్యోగమునందుకన్న, హెచ్చు జీతములుండును. ప్రపంచమందలి ముఖ్యదేశము లంతటను వీరి కార్యాలయము లున్నవి. అంతర్జాతీయముగను దీనికి చాల ప్రసిద్ధి ప్రాముఖ్యము కలవు. వీనికన్నిటికిని మన కధానాయకుడగు జంషెడ్జితాతాయే బీజమని చెప్పవచ్చును. తాతా కంపెనీ స్థాపించిన యీసంస్థలన్నియు రిజిష్టరు చేయబడిన లిమిటెడుకంపెనీలు. ఈకంపెనీల వాటాలను అందరును కొనవచ్చును. వాటాదార్ల సమావేశములం దీకంపెనీల డైరక్టర్లు ఎన్నుకొనబడుదురు; వారిచర్యలు, కంపెనీస్థితి, ఆసమావేశములందు చర్చకు ఆమోదముకు వచ్చును. ఒకరిద్దరు వ్యక్తులపైనే ఆధారపడు సంస్థలు వారియనంతరమును, వారిపరిస్థితులు మారుటవలనను, తరుచు త్వరలోనే క్షీణించిపోవుట యెరుగుదుము. అట్లుగాక నివి అనుభవము పలుకుబడి గల బొంబాయి వ్యాపారస్థులచే ప్రస్తుతము నడుపబడుచున్నవి. వీని యన్నిటికి కేంద్ర కార్యాలయములు బొంబాయి లోనే యుండును. ఈసంస్థలందు ప్రజాప్రతినిధు లెక్కువ శ్రద్ధవహించి, చాలమంది వాటాల దీసికొని క్రమముగ వానిని జాతీయసంస్థలుగ జేయింప యత్నించుట యవసరము.


_________
  1. * కొన్నియేండ్లనుండి ఆసభ ప్రతిసంవత్సరమును కాంగ్రెసుతో సంబంధములేకుండ నేరుగా జరుగుచున్నది.