Jump to content

తాతా చరిత్రము/తాతాస్వభావము

వికీసోర్స్ నుండి

18. తాతాస్వభావము.

తాతాగారి జీవితపు ముఖ్యసంగతు లిట్లు పైయధ్యాయములందు వివరింపబడినవి. అందు, చాలవరకు, ఆయన స్వరూపస్వభావములును సూచితములు. అందలి ముఖ్యసంగతుల నిచట స్మరింతము.

జంషెడ్జితాతా కొంచెము పొట్టియై, చామనచాయవర్ణము సౌమ్యమగు ముఖవర్చస్సు గల్గియుండెను. ఆయనశరీరము దేఢమైనదే; ఆయనమనోబలము, సహృదయత, అద్భుతములు. ఆయన తన నిత్యకృత్యములను సకాలముగ జేసికొను నలవాటు గల్గియుండెను. ప్రతిదినమును, ఉష:కాలముననే లేచి, సముద్రతీరమున బాలసూర్యుని దర్శించి, అచట కొంతసేపు నడచి, కాల్యకృత్యములన్నిటిని దీర్చుకొనును; ఉదయము 8 గంట లగునప్పటికే, తనగుర్రపుబండిపై నెక్కి, ఆయన కొందరుమిత్రుల యిండ్లకు బోయి, వారితో మాట్లాడును; అప్పటికి వారు తరుచు పడకనుండి లేవబోవుచుండిరి. అటనుండి తిరుగవచ్చి, ఉదయభోజనము కాగనే, తొందరవ్రాతపనియున్న, దానిని స్వయముగ చేసికొనును; లేనిచో నేదేని చదువుకొనుచుండును. మధ్యాహ్నము తనకార్యాలయమునకు బోయి, అచట సాయంకాల మారుగంటలగువర కతిశ్రద్ధతో తన వ్యవహారముల జేసికొనును; అంతట నొకగంట విహారముకు పోవును; లేదా క్లబ్బులో మిత్రులతో సంభాషించును; అంతట గృహము జేరి, చక్కగ భుజించును. (ఆయన కొంచెము భోజనప్రియుడు.) మద్యపాన మెన్నడును చేయుట లేదు; రాత్రి చాలసేపు గ్రంథముల జదువుచుండును. ఆయనకు మంచి పుస్స్తకముల జదువుటయన్న చాలప్రీతి. ఆటలాడుట కాయనకు తీరిక, అభిలాషయుకూడ, లేకుండెను. కాని ఆయన మంచి వ్యాయామ గ్రంథములగూడ దెప్పించి, తనక్లబ్బుల కిచ్చుచు; తానును చదువును. ఆయన గుజరాతీ హిందూస్థానీలలోనే గాక, ఇంగ్లీషులోను మంచి విద్వాంసుడయ్యెను. ఆయన రచనశైలి శబ్దాడంబరములేక, సులభమై, ఓజోవంతమై యుండెను.

ఆయన వ్యక్తిజీవనము పరిశుద్ధమైనది. ధనికుడైనను, ఆయన యెన్నడును వ్యసనములకై ద్రవ్యమును దుర్వినియోగము చేయుటలేదు; తనయింటిపిల్లలకు దురభ్యాసములు కలుగకుండునట్లు జాగ్రత్తతో నుండుచు, వారికి మితవ్యయమును స్వతంత్రముగ వ్యవహరించుశక్తిని, నేర్పుచుండెను. మద్యపానము, స్త్రీలోలత, జూదము, పందెములు, ఆటపాటలు, ఆడంబర వేషములు, ఆయన కెన్నడును లేవు. విదేశసంచారములందు గూడ దుస్సాంగత్యమున తన సంప్రదాయముకు భిన్నమగు పాశ్చాత్యుల కేళీవిలాసములందును బడకుండ, అప్రమత్తుడై యుండెను. (రుచికరమగు భోజ్యవస్తువుల జూచినప్పుడు మాత్ర మాయనకు కొంచెము జిహ్వాచాపల్య ముండెనట). తాతా నిరాడంబరుడై, తెల్లని సాదాదుస్తులను పార్సీల సాంప్రదాయకమగు పాగానో టోపీనో ధరించెను. ఆయనగుణములలో రెండవది సౌజన్యము. బంధు మిత్రాదు లందరియందును ఆయనకు ప్రేమయుండెను; ఎన్నడును, ఎవరియందును, తాతాకు అసూయ, మాత్సర్యము, లేవు. అందరితోను సహృదయుడై, ఆయన యెల్లప్పుడును న్యాయబుద్ధితోనే యుండెను. ఆయనతో వ్యవహరించువా రందరును గాఢమిత్రులై, విశ్వాసముగల్గి, తామును విశ్వాసపాత్రులై, ఆయన కన్నివిధములను తోడ్పడుచుండిరి. ఇతరులయందు మనము విశ్వాసముతో వర్తించినచో, వారును మనయందు విశ్వాసముగల్గియే యుందురు. మోసము, పేరాస తాత్కాలికముగ లాభకరమైనట్లు కనబడినను, వ్యాపారమునగూడ నీతి న్యాయశీలతయునే తుదకు స్థిరలాభ మొసగుననుటకు తాతాజీవితమే నిదర్శనము.

ఆయన నిగర్వి, వినమ్రుడుగా నుండెను; జనులనుండి గాని, ప్రభుత్వమునుండి గాని పేరుపొంద యత్నింపలేదు. విజ్ఞానాలయముకు తన పేరుపెట్టవలదని నిషేధించెను, గౌరవ పదవులకు బిరుదములకు ఎన్నడు నపేక్షింపలేదు; బొంబాయిలో గౌరవ న్యాయాధికారిగను, తరువాత విశ్వవిద్యాలయ సభ్యుడుగను, మాత్రముండెను.

ఐనను, స్వజాతిగౌరవముకు భంగము కలుగునని తోచినప్పుడుమాత్ర మాయన పట్టుదలతో నాత్మగౌరవమును కాపాడుకొనుచుండెను. ఒకసారి 1863 లో నొకయుత్సవము జూ చుచున్నప్పు డొకపెద్ద యాంగ్లోద్యోగి అన్యాయముగ తనతో దుర్భాషలాడగా, ఆతని నెదిర్చి, తాను కారాగృహముకు పోవుటకుగూడ సిద్ధమై, ఆతడు తనకు అసందిగ్ధముగ క్షమార్పణ చేసికొనువర కావిషయమును వదలలేదు. ఆంగ్లేయుల నౌకలందు భారతీయులను న్యూనముగ జూతురనియు, వారికేవులు మాత్రము హెచ్చుగ నుండుననియు గమనించి, జంషెడ్జి ఆంగ్లే తరములగు జర్మను మున్నగువారి నౌకలపైననే సాధారణముగ ప్రయాణము చేయుచుండెను.

ఆయన కార్యదీక్ష మూడవ సుగుణము: జంషెడ్జి సామాన్యకుటుంబమందే జనించెను. ఆయనతండ్రి గొప్ప యైశ్వర్యవంతుడు కాడు. వ్యాపారజీవనమున అదృష్టమే ప్రధానమని కొందరు భావింతురు. అదితప్పు, జంషెడ్జి కదృష్టలాభమొకప్పుడు కలుగుచుండినను, చాలసారు లాయనకు అదృష్టపూర్వములగు నష్టములును కలిగెను; దూది యెగుమతి వ్యవహారము చేయుచో, 1865 లో, ఆయన లండనులో చాలసరుకు నిలవజేసి, అచట క్రొత్తగా బ్యాంకునుగూడ స్థాపించుచుండినప్పుడు, అమెరికా సంధిచే పరిస్థితులు హఠాత్తుగ విషమించి, తోటి కంపెనీలు దివాలాతీయగా, తాతాకును ఆర్థికస్థితి చాల క్లిష్టమయ్యెను; అప్పుడు బొంబాయిలోను, ప్రేమచందురాయచందు బ్యాంకు దివాలావలన, తాతాకు చాలనష్టముకలిగెను. 1887 లో, స్వదేశీమిల్లు స్థాపనకై కుర్లాయొద్దకొనిన 'ధరంసీ' మిల్లులోని యంత్రము లెంతబాగుచేసినను పనికిరాక, ఆక్రయము మోసపు వ్యాపార మయ్యెను. బొంబాయి నివేశనములపైన బట్టలపైన ప్రభుత్వమువారు పన్ను విధించినప్పుడు, ఆయన కధికారులతో తీవ్రవివాదము కలిగెను. అందు ప్రభుత్వోద్యోగులు న్యాయపద్ధతికి కట్టుబడలేదు. చాలవ్యయప్రయాసలకు లోనై, తాతా లోహపరిశ్రమ స్థాపనకై మధ్యరాష్ట్రపు చందాగనులందు వ్యాపార మారంభింపబోగా, ప్రభుత్వమువారు వానిని కౌలుకిచ్చుటకు నిరాకరించిరి. ఆయాపరిశ్రమల యారంభమున, ముందుగా వేలకొలది రూపాయల ఖర్చుతో, విశేషశ్రమకు లోనై, దీర్ఘ పరిశోధనలజేసి, జాగ్రత్తతో నెన్నియో విఘ్నముల నెదుర్కొనవలసివచ్చెను. జపాను నావికులతో కలసి ఓడవ్యాపారము జరిపినప్పుడు, తన మిత్రులగు బొంబాయి వర్తకులు ద్రోహమొనర్ప, ఆవ్యాపారము భగ్నమయ్యెను. అట్టి క్లిష్టసమయములందుగూడ, ఆయన వెనుదీయక, న్యాయబుద్ధితోను ధైర్యోత్సాహములతోను నిరంతరము కృషిచేసి, కష్టములను తుదకు దాటగల్గెను. "విఘ్నై: పున:పునరపి ప్రతిహన్యమానా: ప్రారబ్ధముత్తమగుణా నపరిత్యజంతి" అను సుభాషిత మాయనకు చక్కగ వర్తించును.

వ్యాపారదక్షత ఆయనలో మూర్తీభవించినది. అది కొంతవరకు పార్సీలందరికిని సామాన్యగుణము. కాని ఆయనప్రజ్ఞ మహాప్రతిభగ పరిణమించి, వ్యాపారమందారితేరిన పాశ్చాత్యనా యకులగూడ నాశ్చర్యచకితులగావించినది. ఏయేపరిశ్రమల స్థాపించిన తనకును దేశముకునుగూడ లాభముకల్గునో, వాని నేప్రదేశమున స్థాపించుట యుచితముగ నుండునో, వానిని నవీనపద్ధతులలో నెట్లు నడుపవచ్చునో, వానిపరికరములను వివరములను ఎట్లు సిద్ధపర్చి యుపయోగించుకొనవలెనో, గమనించి గ్రహించుటలో ఆయనకుండిన చాతుర్యము, దూరదృష్టి, అద్భుతములు. ఆప్రతిభ ఆయననిరంతరకృషిచేతను, తదేకదీక్ష చేతను, ఇంకను వర్ధిల్లెను.

ఆయనప్రపంచజ్ఞానము, మానవతత్వపరిజ్ఞానము, అసమానములు. ఆయన యూరపుకు అమెరికాకు జపానుకు అవసరమైనప్పుడెల్ల స్వయముగ వెళ్ళుచుండెను; అది వ్యారవృద్ధికి చాలతోడ్పడెను. వివిధదేశములందు సంచరించుట ఆయనకు చాలప్రీతిగ నుండెను. కాని తనజ్ఞానమును లోకానుభవమును వృద్ధిజేసికొనుటకే దేశాటనమును ఆయన పూర్తిగ వినియోగించుకొనెను. మనదేశమందును విదేశములందును సంచరించునప్పుడు, ఆయాప్రాంతముల జనుల వివిధపరిశ్రమలను వారియాచారములను, గృహనిర్మాణాదులను, వ్యవసాయాది పద్ధతులను, అచటి వస్తుసముదాయమునుగూడ, జాగ్రత్తతో గమనించి, ఆయనుభవముతో తనవస్తునిర్మాణపద్ధతులను జనుల కనుకూల మగునట్లు చేయుచుండెను. జనులకిష్టమగు వానినే తయారు చేయగల్గెను. కాల మమూల్యమని గ్రహించుటచే జంషెడ్జి తనకాలమునెన్నడును వృధపరుపలేదు; సంచారములలోను ఆయన కేవల వినోదముల జూడక, తాను సంకల్పించు ఉద్యమముల వృద్ధికి వలయుసంగతులపైనే తనదృష్టినుంచుచు, విదేశపరిశ్రమలందలి విశేషములను చౌకపద్ధతులను, క్రొత్తవస్తువుల ఉత్పత్తి విధములను, మనదేశమందు ప్రవేశింపజేసెను. మనకు ముఖ్యమగు వస్త్రపరిశ్రమ బాగుపడుటకై ఆయన యవలంబించిన వివిధపద్ధతులు ఆయనప్రజ్ఞకు నిదర్శనములు.

వ్యాపారములోను ఆయన స్వార్ధపరుడుకాక, భారత జాతిక్షేమమే ప్రధానముగ భావించెను; ఆకాలమున, ఎగుమతిచే ముదుకనూలుబట్టలపైన లాభము వచ్చుచున్నను, మన దేశీయులు చాలమంది విదేశపు సన్నబట్టల ధరించుట గమనించి, అందుచే విదేశములకుపోవు ధనధార నాపుటకు, సన్ననూలు బట్టలమిల్లులను మనదేశమందే స్థాపించెను. విద్యావంతులను చక్కని కార్యకర్తలుగా తనమిల్లులందు తరిఫియతుచేసి, తన వ్యాపారమర్మముల దెలియజేసి, వారిని నితరుల మిల్లులకును కార్యకర్తలుగ బంపుచుండెను. తనమిల్లులందలి క్రొత్తపద్ధతులను మిత్రులకందరకు మర్మము లేకుండదెల్పి, ఆప్రకారము సన్ననూలుమిల్లుల స్థాపింపుడని, తోటిమిల్లుదారుల బ్రోత్సహించెను. చాలశ్రమకోర్చి అందుకైన విశేషవ్యయమును భరించి, క్రొత్తయంత్రముల దెప్పించి, ఆయన వానినుపయోగించుపద్ధతిని ఇచటి జనులకు నేర్పెను. చాలసొమ్ము ఖర్చుపరచి, ప్రశస్తమగు ప్రత్తిని సాగుచేయువిధమును ఈజిప్టులో స్వయముగా నేర్చుకొని, ఆప్రత్తిని మనదేశమున పండించెను. నల్లమందు ఆబ్కారి మున్నగువాని వ్యాపారమువలన పూర్వమునుండి తోటిపార్సీమిత్రులు చాలలాభ మొందుచుండిరి. తనతండ్రియు తనను చీనాతో నల్లమందువ్యాపారమున దింపెను. కాని లాభకారియైనను, అవి ప్రజాహానికరములను భావమున, ఆవ్యాపారములను జంషెడ్జి త్వరలో వదలిపెట్టెను. మనదేశమున కుపయోగించు క్రొత్తపరిశ్రమలస్థాపించుటే, ఆయనముఖ్యోద్దేశము. ఆయనకట్టించిన భవనములలోను అనుకరణీయమగు క్రొత్తపద్ధతులుండెను. ఆయాదర్శ పద్ధతులు క్రమముగా దేశమున నితరులకు మార్గదర్శకము లయ్యెను. ఆయన 'తాజ్ మహల్ హోటలు' విదేశీయుల సంస్థల కన్నను మిన్నయై, భారతీయుల గౌరవమును వృద్ధిజేసినది. ఆహోటలులో నాయన చక్కనియుచితగ్రంథాలయాదుల నేర్పర్చెను.

పెద్దపరిశ్రమలకు, ఇంజనులు పనిముట్లు వస్తువులు ఏర్పడుటకు, మంచియినుము ఉక్కు అవసరములు. తక్కినవానికి కీలకమగు లోహపరిశ్రమస్థాపనవలననే అన్ని దేశములందు నితర పరిశ్రమలేర్పడి, వానిసంపద హెచ్చినది. మనదేశమున పెద్దపరిశ్రమలస్థాపనకు, (ముఖ్యముగ చోదకశక్తికి లోహపరిశ్రమకు) అవకాశము లేదని, అందుచే నెల్లకాలమును భారతదేశము వ్యవసాయదేశముగనే యుండుచు, విదేశములకు ముడివస్తువులనే పంపుచు, పారిశ్రామికములగు కొన్నివిదేశములనుండి తయారగువస్తువుల రప్పించుకొనుచుండవలెనని, చెప్పుచుండుట సాధారణముగ వాడుక; ఈ అపవాదము నిరాధారమని జంషెడ్జి మొదటనే తలచెను.

పూర్వము మనదేశమున నశ్వరముకాని యద్భుతముగు కుతుబ్‌మినారు బోలు ఇనుపకట్టడము లేర్పడెను. చిత్రవిచిత్రములగు రకరకముల ఖడ్గములు తయారై, అప్పటినాగరికలోకముకంతకు నెగునతియాయెను. అందుచే, పెద్ద లోహఖను లీదేశమున చక్కని సన్ని వేశములతో నుండితీరవలెను. మనదేశపు సహజసంపత్తి యత్యధికము; ఇచ్చట అన్నివిధములగు శీతోష్ణ పరిస్థితులు, దాదాపు సకలవస్తువులు తయారగు వివిధతత్వముల భూతలములును, కలవు. మరియు ఆయాప్రాంతపు భూగర్భమున వివిధములగు గనులును గలవు. బాగుగపరిశోధనజరిగినచో, తగు లోహఖనులు దొరికితీరునని, ఆయనకు దృఢవిశ్వాసముండెను. కనుక కొందరు నిరుత్సాహపర్చినను, ఎన్ని చోట్ల తనప్రయత్నము విఫలమైనను, జంకక, ఆయన యనుభవముగల, గొప్పభూతత్వజ్ఞులను, ప్రసిద్ధులగు వాస్తువిజ్ఞులను, స్వయముగ రప్పించి, ఇదివరలో నెవరును శోధించని కొండలను, అడవులనుగూడ, విశేషవ్యయ ప్రయాసలకు లోనై పరీక్షించెను; తనపుత్రమిత్రులు గూడ నట్లేచేసి సాధించునట్లు వారలను ప్రోత్సహించెను; ఆశ్రమఫలితముగనే, మనదేశమున ప్రశస్తమగు లోహఖనులు, సున్నపుగుట్టలు, బొగ్గుగనులు, సమీపముననే కలవని, ఈదేశమున గొప్పలోహపరిశ్రమ సుసాధ్యమే యని, తరువాత తేలెను.

ఈదేశమున గొప్పలోహపరిశ్రమ స్థాపించునట్లు ఆంగ్లదేశపు కోటీశ్వరులగు వ్యాపారనాయకులను ప్రోత్సహించి, అప్పటిరాజప్రతినిధియగు కర్జను ప్రభువుగారు చాలప్రయత్నించెను. (ఆయన మనదేశమందలి గనుల కౌలుషరతులనుగూడ సులభముగ చేసెను.) కాని, ఇట్టిప్రశస్తమగు లోహఖను లచ్చట కలవని అప్పటికి వారికి తెలియదు. ఆయన యుద్దేశించిన బ్రిటిషుపారిశ్రామికు లెవరును అప్పు డందుకు సిద్ధపడలేదు. ఈలోగా జంషెడ్జితాతాయే అందుకు సిద్ధపడి, ఆపరిశ్రమకు పునాదివేసెను. *[1]

ఇట్లే నేలబొగ్గు చౌకగను సమృద్ధిగను దొరకని బొంబాయి ప్రాంతమున నింకొక బలీయమగు చోదకశక్తి నెట్లైన సాధింపవలెనని ఆయనకు తోచెను. ఇంజనీర్లతో నాలోచించి, ఆయన పడమటికనుమలనుండి జలపాతముద్వారా విద్యుచ్ఛక్తిని సాధింప నిశ్చయించెను; తుదకాపరిశ్రమ లాభకారియౌనని ఆయన ముందే గ్రహించెను. కాని, లాభముమాటయటుండ, ఈజలవిద్యుచ్ఛక్తి పరిశ్రమ అచట కొనసాగుట సాధ్యమని దాదాపు యెవరికిని అప్పటికి నమ్మికలేకుండెను. తాతావారి నిరంతరకృషివలన తుదకాపరిశ్రమయు జయప్రదమయ్యెను. దీని జయమును జూచి ప్రభుత్వము వారిప్పుడు పైఖారావిద్యుచ్ఛక్తిని స్థాపించినారు. మరియు ఈ దేశమున హిమాలయాద్రి ప్రాంతములందు చాలచోట్ల పెద్దజలపాతములు కలవు. అట్టిచోట్ల ముందింకను ఈ పరిశ్రమ లేర్పడుటకు తాతా యుద్యమము మార్గదర్శకమగును.

ప్రతిచర్యలోను ఆయన సంఘక్షేమమునే మనస్సునందుంచుకొనెను. జంషెడ్జికి స్వసంఘమగు పార్సీజాతియం దభిమానముండెను, కాని ఆయన సాంఘికదురభిమానముగాని, ఇతర సంఘములపైన నెట్టిద్వేషముగాని లేనివాడు. అందుచేతన సంస్థలవలని లాభమును భారతీయు లందరికి నిచ్చెను. ఆయనకు కులతత్వము, ప్రాంతీయభావము, లేవు. (తాతాసంస్థలు బొంబాయి యందే గాక వీలునుబట్టి నాగపురము బెంగుళూరు బొహారుప్రాంతము మున్నగు అన్నిప్రాంతములందును స్థాపింపబడినవి). భారతీయు లేకజాతియగుటచే, పరస్పరవిభేదములు తొలగి యైకమత్యము గల్గియుండవలెనని, తోటిపార్సీల నాయన ప్రోత్సహించుచుండెను. విజ్ఞానాభివృద్ధి పరిశ్రమల జయముకు దేశాభివృద్ధికి ముఖ్యావశ్యకములని, ఆయన చాలయేండ్ల క్రిందటనే గన్పట్టెను. ప్రకృతిశాస్త్రజ్ఞానము వృద్ధికానిచో, పాశ్చాత్యదేశములకు జపానుకు ఇప్పటి యార్థికాధిక్యము కల్గియుండదు; రాజకీయప్రాబల్యముకును కొంతవరకదియే మూలకారణము. జంషెడ్జి అనేకవిజ్ఞాన గ్రంథములను గొని చదువుచుండెను. విదేశములందలి గొప్ప విజ్ఞానశాలల బరీక్షించెను. మనదేశీయులు విదేశములం దున్నత విజ్ఞానము గ్రోలునట్లు చేయుటకై, ఆయన కొన్నిలక్షల రూపాయల నిధి నేర్పర్చెను. మరియు మనదేశమందే ఉన్నతప్రకృతిశాస్త్రము నేర్పుటకు, పరిశోధనకు, 30 లక్షల రూపాయల స్థిరమగు ఆస్తినిచ్చి విజ్ఞానాలయము స్థాపించెను. ఇందును భారతీయు లందరికిని ప్రవేశముకలదు. ఆర్థికసమస్యలకు పరిశ్రమలకు సంబంధించిన గొప్ప గ్రంథముల నన్నిటిని తెప్పించి, ఆయన తన గృహమందు గొప్ప వైజ్ఞానికభాండార ముంచెను. ప్రపంచమునగల ఉపయోగములగు విశేషవస్తువులను వివిధఫలవృక్షాదులను ఆయన విదేశయాత్రలందు సేకరించి, ఆశీతోష్ణాదుల ఆవశ్యకతలబట్టి వానిని నవసారిలోనో, బొంబాయి ప్రాంతమందో, బెంగుళూరు సమీపముననో, తోటలలో నాటించి పెంచెను. ఈదేశమున, పాతాళగంగ నూతులను నాయనయే మొదలిడెను.

ఈకాలమున విదేశములందలి సరకులు చాలదిగుమతియగుచున్నవి; మన ఆర్థికస్థితి బాగుపడవలెనన్న, కీలకములగు కొన్ని పెద్దపరిశ్రమలను అట్టి వైజ్ఞానికపద్ధతిని స్థాపించుటే మార్గమని నమ్మి, ఆయన ఆపరిశ్రమలకై కృషిచేసెను. కాని యాంత్రికపద్ధతిలో కొన్నిలోపములు కలవనియు ఆయన గ్రహించెను. వానిని తగ్గించుట కనేకయత్నముల జేసెను. కార్మికుల కందరకు ఆరోగ్యకరములగు ప్రత్యేకవసతిగృహములను ఆయాకార్ఖానాల దగ్గర విశాలముగ గట్టించి, అందు మంచినీటికి, నీటిపారుదలకు విద్యాలయములకు, వ్యాయామాదులకుగూడ, తగువసతుల గావించెను. వారికి చాల చౌకగ ఆహారవస్తువులను అందించుచుండెను. వారికిని అందలి ఉద్యోగులకును బహుమతులు, ఉద్యోగవృద్ధి, 'బోనసు' అనుపేర లాభములో వాటా కూడ, కల్గించెను. ఉన్నతోద్యోగులకు తనకంపెనీలో డైరక్టరు లగుటకుగూడ అవకాశ మిచ్చెను. ఆపరిశ్రమ తమదే యనుభావము వారికందరికిని కల్గెను.

ఆయన సాధ్యమైనంతవరకు బస్తీల సమ్మర్దము తగ్గునట్లు చేయుచుండెను. ఎంప్రెసుమిల్లును, బొంబాయిలో గాక, అప్పటికి చిన్నవై విశాలమగు నాగపురమునొద్ద కట్టెను. స్వదేశీమిల్లును గూడ బొంబాయినగర మధ్యమునను అచటి మిల్లులయొద్దనుగాక, దానికి కొంచెము దూరమగు 'కుర్లా' అనుచోట ఏర్పర్చెను; 'జిన్నింగుమిల్లు' లను ప్రత్తిపండు ఆయా గ్రామములందే ఏర్పర్చెను; పట్టుపరిశ్రమను విశాలగ్రామములందు గృహపరిశ్రమగనే వృద్ధిచేయించెను. మనదేశపు మిల్లుసరు కులపైన ప్రభుత్వము పన్ను వేసినప్పుడు, ఆపన్ను మగ్గముల నేతబట్టలకును వర్తించవలెనని, లేనిచో పన్ను లేని చేతిమగ్గపు సరుకుల పోటీవలన మిల్లులన్నిటికిని నష్టముకల్గునని, చాలమంది మిల్లుదారులు వాదించిరి. కాని తాతా అందు కొప్పుకొనక, గృహపరిశ్రమలకు సదుపాయము కలిగి, అందుచే కొందరు నేతగాండ్రు బాగుపడిన, అది మంచిదే యనిచెప్పి, ఆమిల్లుదారుల వారించెను.

ఆయన దయాశీలత దాతృత్వము అద్భుతములు. గొప్ప కోటీశ్వరుడైనను, చాల ఆదాయము వచ్చుచున్నను, చాల మితవ్యయపరుడై, ఆయన సత్కార్యములకుమాత్రము విరివిగా నిచ్చుచుండెను. విజ్ఞానాలయ మహాదానమేగాక, విద్యార్థులకు విద్యాసంస్థలకును లెక్కలేకుండ నిచ్చెను; కాని వీలైనంతవరకు గుప్తదానమేచేయుచుండెను. కాంగ్రెసుకు, అనేక సాంఘికసంస్థలకు, ప్రజోపయోగకరమగు క్లబ్బులకుకూడ, చాల సహాయము చేసెను.

సత్పాత్రదానముకు దీనుల ప్రోత్సాహముకు జంషెడ్జి వెనుదీయ లేదు; కాని విచక్షణలేని, వితరణ ఆయన కిష్టముకాదు. దృఢగాత్రులైనవారు సోమరులై, దేవాలయమో సత్రమోకట్టింతుమని పటాటోపముతో ఏదోపెద్దపేరుపెట్టుకొనియో, వివాహాదులకనియో, వచ్చి యాచించుచుందురు; ఆయన యేమియు వారలకిచ్చుటలేదు. ఆదానమువలన వారిలో ఆత్మగౌరవముపో యి, సోమరితనము వృద్ధియగును; ఇంక ఆసోమరులస్థితి బాగుండుటజూచి, ఇతరులును యాచకులే అగుదురు; ఇట్లు యాచకత్వమును ప్రోత్సహించుటచే, మనదేశముకు చాల హానికల్గుచున్నదని ఆయన యభిప్రాయము. మరియు ఇట్టి అనవసర దానముకు సొమ్ము ఖర్చుచేయుటవలన, జనుల కుపయుక్తమగు సంస్థలకు సహాయము లేకుండుటయు సంభవించును. ఎన్నియో ప్రజాక్షేమకరమగు సంస్థలు తగు ద్రవ్యసహాయము లేక, దీనస్థితిలో బడి క్షీణించుచున్నవి. అందుచే దేశాభివృద్ధికై పనిచేయునని తనకు తృప్తియగుసంస్థలకు, తమశక్తిని సద్వినియోగము చేయదలచు వ్యక్తులకును మాత్రమే, జంషెడ్జి ద్రవ్యసహాయము చేయుచుండెను.

ఇట్లే స్వశక్తివిషయమునను ఆయన ఉచితవ్యయసూత్రమునే గమనించెను. అనేకరంగములందొక్కరు పనిచేయదలచిన, అట్టివాని శ్రమయంతయు వ్యర్ధమై, తగినంతఫలము లేకుండబోవును. సాధారణముగా మనశక్తులను మనతత్వము కనుకూలమగు కొన్నివిషయములందు మాత్రము కేంద్రీకరించుట యవసరమగుచుండును. మతవేదాంతాది విషయములందు రాజకీయములందుగూడ వాగ్వ్యయమొనర్చుట ఆయనప్రకృతికి ప్రతికూలము. మరియు అట్టిపనులచేయువారు మనదేశీయులలో నిప్పటికే చాలమంది గలరు. ఆర్థికపారిశ్రామిక విషయములందు కార్యరూపమున కృషిచేయువారు మనలో చాలతక్కువ. ఆకృషి యత్యవసరము. తనశక్తి నందుకే జంషెడ్జి వినియోగించెను. కానితాతా అనేకార్థికరాజ కీయసమస్యలను గృహమందును క్లబ్బులలోను దాదాభాయినౌరోజీ మెహతా వాచా మున్నగు రాజకీయనాయకులతోను వ్యాపారమిత్రులతోను చర్చించుచుండెను.

1885లో, జాతీయమహాసభ ఆరంభించినప్పటినుండి చనిపోవువరకును, జంషెడ్జి అందుసభ్యుడై హాజరగును, అందుకును బొంబాయి ప్రాంతీయరాజకీయసభకును చాలద్రవ్యమునిచ్చెను. రాజకీయములగూర్చి, ఆయనకు నిశ్చితాభిప్రాయములుండెను. ఆయన మితభాషియైనను, మెహతా వాచాలవలె మితవాది కాడు; దాదాభాయినౌరోజీవలె జాతీయభావము గల్గియుండెను. నాణెములపద్ధతి, వెండికి బంగారముకు ఉండదగు సంబంధము, దిగుమతిపన్నులు, మనమిల్లుసరుకులపై పన్నులు, బొంబాయి నివేశనపుపన్నులు, ప్రశస్తమగు ప్రత్తిసాగు, కార్మికసమస్య ఇట్టి సమస్యలగూర్చి ఆయనవ్రాసిన దీర్ఘ వ్యాసములు అమూల్యమగు ఆర్ధిక సిద్ధాంతముల చర్చతోగూడి, చక్కనిజాతీయ భావములతో నిండియున్నవి.

న్యాయవాదిత్వము మున్నగు వృత్తులకన్న పరిశ్రమల వృద్ధిచేయుటయే సంఘముకు, ముఖ్యముగ బీదలకు, హెచ్చుగ లాభకరము. పరిశ్రమలవృద్ధి దేశసంపదను వృద్ధిచేయును. అందుకవసరమగు జ్ఞానమును అనుభవమును ప్రత్యేకగుణములను జంషెడ్జి వృద్ధిచేసికొనెను. "భారతీయుల కవసరమై, వారియం దిప్పుడు లోపించియున్న, గుణశక్తు లన్నియు జంషెడ్జితాతాయందే మూర్తీభవించెను." అని యొక యాంగ్లచారిత్రకుని వచనము. *[2] చుట్టును వలయునంత జనుము పండుచున్నను, దగ్గరనే రాణిగంజిలో బొగ్గుగనులున్నను, తగినంత విజ్ఞానము వ్యాపారదక్షతలేక, వంగదేశమున జనపనార మిల్లులను మనదేశీయులు స్థాపింపలేదు. ఇంతలో విదేశీయు లా సౌకర్యములగనిపెట్టి కలకత్తాప్రాంతమున అట్టిజనపనారమిల్లుల చాల స్థాపించి, సాలీనా కోట్లకొలది రూపాయలను లాభముగ గ్రహించుచున్నారు. జనపనార (ప్రపంచమంతటను మనదేశమందు మాత్రమే సమృద్ధిగ పండును. మనదేశమునగల ప్రకృతిసౌకర్యముల నుపయోగించుకొనక మనము విడచినచో, వానినిబట్టి విదేశీయులిచటనే పరిశ్రమల స్థాపించుకొందురు; అంతట వానిని మనదేశీయులు మరల స్వాధీనముచేసుకొనుట సుసాధ్యము కాదు.)

జంషెడ్జి తాతా స్వశక్తిని నూతన పరిశ్రమల వృద్ధిలోనే కేంద్రీకరించి, వానిని జయప్రదముగనడపెను. భారతీయులు పెద్దపెద్ద పరిశ్రమల నడుపలేరను అపవాదమును తాతా, తరువాత ఆయనమిత్రులును, తొలగించిరి. ఇదివరలో మనదేశమున తయారుకాని నిత్యావసరములగు అనేక యాంత్రిక వస్తువుల నిప్పుడు మనదేశీయులు తయారు చేయుచున్నారు.

కాని ఆయనజాతీయతలో విదేశీయులపై ద్వేషములేదు. ఆయన తన జ్యేష్ఠపుత్రునికి ఆంగ్లదేశమున విజ్ఞానవిద్యకు కేంద్రమగు కేంబ్రిడ్జిలో విద్యాభ్యాసముచేయించెను. ఆంగ్లేయులు ఇతరవిదేశీయులు నెందరో యీదేశమున, విదేశములందుగూడ, ఆయనకు మిత్రులైయుండిరి. జంషెడ్జి జాతీయవాదియైనను, పెద్ద యుద్యోగులకు బొంబాయిగవర్నరుకు, అప్పటి రాజప్రతినిధియగు కర్జనుప్రభువుకు, లండనులో భారతమంత్రికిగూడ, ఆయనయందు చాలగౌరవభావ ముండెను. తగు భారతీయులు దొరకని (ప్రత్యేకప్రజ్ఞ నైపుణ్యము కావలసిన) కొన్ని కార్యములకై, ఆయన కార్యాలయములందు, (విజ్ఞులగు) పాశ్చాత్యులును ఉద్యోగులుగ నుండిరి. ఆయన ఇట్లు సర్వసముడయ్యు స్వేదేశమం దమితప్రేమ గల్గియుండెను.

బొంబాయిహైకోర్టులోను, తరువాత కలకత్తాహైకోర్టులోను ప్రధానన్యాయాధిపతిగ నుండి, ఇటీవల ప్రీవీకౌన్సిలు జడ్జిగనుండిన సర్ లారెన్సు జంకిన్సుగారు జంషెడ్జితాతా నిరాడంబరుడని ఆయనమాతృదేశభక్తి మితిలేనిదని తమసదభిప్రాయము తెల్పిరి. *[3]

  1. * Lovat Fraser గారి India under Curzon and after అను గ్రంధమును, అందు ముఖ్యముగ 321 వ పుటలోని ఈక్రిందివాక్యమును చూడుడు. "Lord Curzon afterwords tried without success to induce prominent English capitalists to start great iron and steel works in India, and possibly nobody was more surprised than the Viceroy when the courageous and prescient Indian, the late Mr. Jamshedji Tata. Volunteered to undertake the task."
  2. * "There has been hardly any other man among its millions who may more fitly be said to have united within himself the qualities of which the Indian people are greatly in need, ('India under Curzon and after' by Lovat Fraser P. 321.)
  3. * Wealth came to him in full measure, but he remained to the last what he was by nature, a simple, modest man, seeking neither title nor place, and loving, with a love that knew no bounds, the country that gave him birth."