Jump to content

తాతా చరిత్రము/విజ్ఞానవర్ధనము

వికీసోర్స్ నుండి

11. విజ్ఞానవర్ధనము.

జంషెడ్జితాతా పారిశ్రామిక నాయకుడు; ఆమహనీయుడు తనజీవితమంతను ఈదేశపు వ్యాపారవృద్ధికి ఆర్థికోన్నతికినే ధారవోసెను; అందఖండప్రజ్ఞతో జయమొందెను. మనదేశపు ఇతరపారిశ్రామికులకు సాధారణముగా విజ్ఞానాభిలాష లేదు. కాని తాతామాత్రము మొదటినుండియు విజ్ఞానమం దమితేచ్ఛ గల్గియుండెను. కళాశాలలో విద్యార్థి దశలోనే, ఆయనకుశాగ్రబుద్ధి విజ్ఞానాభిరుచి విశదమగుచుండెను.

భారతదేశ ముచ్చస్థితిలో నుండినప్పు డీదేశీయులు విజ్ఞానమందును ప్రజ్ఞావంతులై యుండిరి. అప్పుడు చాల వెనుకబడి యుండియు, ఇటీవల నీదేశముకన్న ఇంగ్లండు, జర్మనీ, అమెరికా, జపానులు చాల బలీయములైనవి; అందు కాదేశములం దిటీవలజరిగిన యద్భుత విజ్ఞానాభివృద్ధియే మూలకారణమనియు, విజ్ఞానమున వృద్ధిగాంచినగాని యీదేశము మరల ఉన్నతము కాజాలదనియు, తాతా గ్రహించెను. ఆర్థిక వ్యాపారాదులకే గాక, రాజకీయముకు, తుదకు నిజమగు ఆధ్యాత్మికాభివృద్ధికి గూడ, విజ్ఞాన మావశ్యకము; (ప్రకృతిలో లీనమగు భౌతికశక్తిని వశపర్చుకొనుటకును, అమేయమగు సృష్టిరహస్యమును చిద్విలాసతత్వమును గ్రహించుటకును, విజ్ఞానమే ముఖ్యసాధనము.) తాతా తనమిల్లుల స్థాపించునాటికి మనదేశమున కొత్తగ విశ్వ విద్యాలయము లేర్పడినను, అందున్నత విజ్ఞానబోధకు పరిశోధనలకు అవకాశములు లేవు. అందుకై విదేశములకే పోవలెను. అంతటి ఉత్సాహ సాహసములుగల ధీమంతులగు యువకులు నిర్ధనులగుటచేతను, మన శ్రీమంతుల కావిషయమున శ్రద్ధలేకయు, మన విద్యార్ధులకు విజ్ఞానము దుర్లభమయ్యెను. మరియు కలెక్ట రీమున్నగు ఉన్నతోద్యోగపరీక్షలందును ఉన్నత విజ్ఞానవంతులే సులభముగ కృతార్థులు కాగలరు; అప్పుడు ఐ. పి. ఎస్. పరీక్షలు లండనులోనే జరుగుచుండెను. *[1] ఆ పరీక్షలో ద్రవ్యహీనులగు భారతీయులు పాల్గొనుటకు అవకాశ ముండుటలేదు; చాలవరకు బ్రిటిషువారే ఆపెద్ద యుద్యోగము లొందుచుండిరి; ఆస్థితిలో మనదేశీయులకు తగు నవకాశము కల్గించుట యవసరమని తాతాకు తోచెను.

ఐ. సి. ఎస్. మున్నగు పెద్దఉద్యోగ పరీక్షలకు విజ్ఞానాభ్యాసముకు ఇంజనీరింగు (వాస్తువిద్య) మున్నగువానికి పోదలచు బీదయువకులకు తోడ్పడుటకై, తాతా గారిట్లు 1892 లో కొన్నిలక్షల రూపాయలతో నొకనిధి నేర్పర్చిరి. ప్రతిసంవత్సరమును ప్రతిభావంతులగు ఇద్దరు మనదేశపు యువకులకు, విదేశములందున్నతవిద్య నభ్యసించుటకు, సాలీనా యీఫండులో నుండి యవసరమునుబట్టి కొన్ని వేలరూపాయల ద్రవ్యసహాయ ముచేయబడును. *[2] ఆసొమ్ము సాయమున విదేశములం దున్నత విద్యనభ్యసించి పరీక్షలో కృతార్ధులైనవారు మరల స్వదేశముకు వచ్చి తరువాత పెద్దఉద్యోగులో డాక్టరులో వ్యాపారులో అయి, చాల సొమ్ము సంపాదింపవచ్చును. అట్లు సంపాదనలో నున్న యెడల, తరువాత వారు (తమ సంపాదనచేగల్గు ఆదాయమునుండి) తా మిదివరలో తీసికొన్న సొమ్మును కొంతకొంతగా వసూ లిచ్చుచు, తాతా ఫండు వారిసొమ్మును యధాశక్తిగ తీర్చివేయవలెను.

ఆపద్ధతివలన నాయువకు లితరుల ద్రవ్యమును భిక్షగ దీసికొంటిమను నైచ్యములేకుండ, స్వయం సహాయముననే వృద్ధికి వచ్చిన ట్లాత్మగౌరవము కల్గియుందురు; మరియు నాపద్ధతివలన తాతా యేర్పర్చిన యాఫండు నశింపులేక, ఎప్పటికప్పుడు భర్తీ యగుచు తరతరములుగ నట్లేనిల్చి, ముందుతరముల యువకుల కెల్ల కాలము నుపయోగించును. అప్పటినుండి నేటివరకు చాలమంది మనయువకు లీఫండుసహాయమున, ఇంగ్లండు, జర్మనీ, అమెరికా మున్నగుదేశములం దనేకవిజ్ఞానవిద్యల నభ్యసించి, స్వదేశమున కనేకవిధముల నుపకరించియున్నారు. ఇప్పటికి సుమారు డెబ్బదిమందివరకు భారతీయు లీఫండు సహాయమున విజ్ఞానవంతులై గొప్ప వైద్యులో, ఇంజనీర్లో, కలెక్టరులో అయిరి. *[3]

యంత్రనిర్మాణము, గనులపని, బైసికిళ్ళు, మోటారు, అద్దములు, రసాయనవస్తువులు మున్నగు ఆధునిక పరిశ్రమలన్నిటి యభివృద్ధికి, శిల్పాదులకు గూడ, విజ్ఞానార్జన మత్యవసరము. అందుకై ప్రతిసాలున చాలమంది విదేశముల కేగుచో, వారికి విదేశములందు చాల వ్యయప్రయాసములు, అనారోగ్యాదులచే బాధలును, కలుగును. అంతమంది కచటతగు ప్రవేశము దొరకుటయు కష్టము. మరియు చాలకాలమట్లు విజ్ఞానముకై కేవల మితరదేశములపై నాధారపడుట భావ్యముకాదు. కనుక మనవిశ్వవిద్యాలయములం దంతవరకు లభింపని యున్నత విజ్ఞానమును యువకులు మనదేశమందే నేర్చుకొనుటకును, నూతన పరిశోధనల జేయగల్గుటకును, మనదేశమందే గొప్ప విజ్ఞానాలయమును స్థాపింపవలెనని జంషెడ్జి నిశ్చయించెను. కాని, ఆధునికములగు ఉన్నతవిజ్ఞాన పరిశోధనాలయముల స్థాపనకు చాల ద్రవ్యము కావలెను. యూరపు అమెరికా లందు గొప్ప కుబేరులు విజ్ఞానాభివృద్ధి యావశ్యకతను గమనించి, తమదేశముల పురోభివృద్ధికి గొప్ప విరాళములనిచ్చి, అనేక విజ్ఞానపరిశోధనశాలల స్థాపించి, జరుపుచున్నారు. అచ్చటి విశ్వవిద్యాలయములకును చాల ద్రవ్యనిధి యుండుటచే, అందును పరిశోధనలకు మంచి యవకాశములు గలవు. మన దేశముననున్న శ్రీమంతుల కట్టి యభినివేశము లేదు. అప్పటికి విజ్ఞానాలయ స్థాపనకు యత్న మేమియు కలుగ లేదు. అందుచే, తాతాయే మార్గదర్శకుడై, మంచి విజ్ఞానాలయముకై అధమము 30 లక్షల రూపాయలు కిమ్మతుచేయు స్థిరవసతి నిచ్చుటకు నిశ్చయించి, 1898 లో ఆసంగతిని ప్రకటించెను.

అట్టి విజ్ఞానాలయము జయప్రదమగుటకు ప్రభుత్వపు ఆదరప్రోత్సాహము లవసరములు. అది స్థిరముగ జరుగుటకు ప్రభుత్వము నిబంధన చేయవలెను; అందు చదివి కృతార్ధులైన యువకుల పట్టముల గుర్తించి, వారి కున్నతోద్యోగములను పరిశ్రమలం దుచితస్థానమును, ప్రభుత్వ మీయవలెను. ఆ విజ్ఞానాలయము బాగుగ వృద్ధిజెందుట కింకను ద్రవ్యసహాయ మవసరము. అందుచే దానికి తనపేరు పెట్టకూడదని తాతా నిర్ణయించెను; * అందుచే దానికి ప్రభుత్వపు ప్రోత్సాహము ద్రవ్యసహాయము కూడ కోరెను. మనదేశమున శ్రీమంతులు కొందరు కలరు. కాని ప్రభుత్వాదరము లేనివానికి, ఇతర వ్యక్తులపేర ఉన్న సంస్థలకు, వారు సాధారణముగా సాయము చేయరని తాతాకు తెలియును.

అంతట భారతప్రభుత్వమువారి కోరికపైన, ప్రసిద్ధ పాశ్చాత్య దేశములందలి ఆయావిజ్ఞానాలయముల ప్రణాళికలను సేకరించుటకై, తాతా ప్రకృతి శాస్త్రవేత్త ప్రతిభాశాలియునగు బర్జోర్జిపాద్షా అను ఒక పార్సీ యువకు నంపెను; అంత డాదేశముల దిరిగి, ఆప్రణాళికల విమర్శించి, కొందరు ముఖ్యవైజ్ఞానికుల యభిప్రాయముల గూడ గ్రహించివచ్చి, విపులమగు రిపోర్టునిచ్చెను. ఆరిపోర్టును ప్రభుత్వమువా రందుకొనిరి. అప్పటినుంచి పాద్షా చాల ఉత్సాహముతో పనిచేయుచు, ఈవిషమందును ఇతరోద్యమములందుగూడ తాతా కుటుంబముకు సహాయకుడై, చాల విశ్వాసపాత్రుడుగ కృషిచేసెను. ఆరిపోర్టునందుకొని, 1900 లో ప్రభుత్వమువారా విజ్ఞానాలయ


  • [4] ము స్థాపించుట కంగీకరించిరి. కాని సుప్రసిద్ధులగు వైజ్ఞానికు లొక రీదేశముకువచ్చి స్వయముగ పరిస్థితుల విమర్శింప వలెనని ప్రభుత్వము వారనిరి; అంతట తాతా బ్రిటనుకు వెళ్ళి, అందు వైజ్ఞానిక ప్రముఖుడగు ప్రొఫెసర్ విలియం రామ్సేగారిని లండను నుండి రప్పించెను. తాతాఖర్చుపైన రామ్సేగారు వచ్చి, అయాప్రాంతములదిరిగి, విమర్శించి, 1901 లో కొన్ని సూచనలతో రిపోర్టు నిచ్చెను. తాతా ఆయనను బహూకరించి పంపెను.

పరిశ్రమలకు సహాయకరముగ నుండుటకై, ఈవిజ్ఞానాలయమును బొంబాయిలోనే ఉంచవలెనని, అట్లైనచో నింకను కొందరు వదాన్యులగు కోటీశ్వరులు విత్తమిత్తురని, కొందరనిరి. కాని యట్లెవ్వరును పెద్ద మొత్తముల నిచ్చుట కప్పుడు సిద్ధపడలేదు. మరియు, ఆయాపరిశోధనాదులకు విశేషస్థలము కావలెను; బొంబాయిలో, అంతఖాళీస్థలము దొరకుటకష్టము; దొరకినను చాల ప్రియముగ నుండును. బెంగుళూరెక్కువ యనుకూలముగ తోచెను. బెంగుళూరు మైసూరు సంస్థానపు మధ్యను పీఠభూమిపైనున్నది; అది సమశీతోష్ణము, చాల ఆరోగ్యకరము; ఎక్కువ మన:పరిశ్రమతో పరిశోధనల జేయుటకచ్చటి వాతావరణము చాల ననుకూలము; అచట కావ లసినంత విశాలమగు ఖాళీస్థలము కలదు. భారతప్రభుత్వము, రామ్సేగారు కూడ, బెంగుళూరునే వరించిరి. *

ఈస్థితిలో వదాన్యుడు ప్రజాక్షేమాభిలాషియునగు మైసూరు మహారాజుగారు (అప్పటి తమదివానగు శేషాద్రి అయ్యరుగారి ప్రోత్సాహమున), బెంగుళూరులో దానినుంచుచో, అచట (300 ఎకరములకు తక్కువలేకుండ) అందుకు వలయు స్థలమంతయు, భవనయంత్రాదులకై 5 లక్షల రూపాయలను, ఇంకను సాలినా యేబదివేల రూప్యములను, ఎట్టిషరతులు లేకుండ నుచితముగ నిచ్చెదమనిరి. మరొక ప్రాంతమున దాని నుంచుచో, ఇట్టివిరాళము దొరకునట్లు కనబడలేదు; (మైసూరు సంస్థానమందు స్థాపింపదలచు వివిధపరిశ్రమల కావిజ్ఞానాలయము సహకారియగునని, తమ సంస్థానవిద్యార్ధులకును లాభకరమని, మైసూరుప్రభుత్వమువారు గ్రహించిరి). అంతట బెంగుళూరిలోనే యావిజ్ఞానాలయము నుంచుట స్థిరమయ్యెను.

కాని యప్పుడైనను పనులు వెంటనే యారంభము కాలేదు; రామ్సేగారి యంచనాఖర్చు నింకను తగ్గించుటకు భారత

  • [5] ప్రభుత్వమువారొక కమిటీ నేర్పర్చిరి. ఆకమిటీవారు కొన్ని సందేహముల దెల్పిరి; భారతప్రభుత్వమెంత యిచ్చునదియు తేలలేదు; ఇట్లు కాలహరణమగుచుండెను. తాతా యీలోగా జబ్బుపడుచుండెను; ఆయన స్వయముగ లండనువెళ్ళి, అచట రామ్సేగారితోను భారతమంత్రితోను చర్చించి, వారిచే మనప్రభుత్వమున కావిషయమై తొందరకల్గించెను. 1903 లో నటనుండి మనదేశముకు తిరిగివచ్చి, తాతా మరల నిచ్చటి ప్రభుత్వాధికారుల బ్రోత్సహించెను. అంతట మనప్రభుత్వమువారు కొంత స్థిరసహాయము చేయుదుమని ప్రచురించిరి. ఇట్లు వివరముల విమర్శ జరుగుచుండగా, 1904 మే నెలలో జంషెడ్జి కాలధర్మ మొందెను.

కాని యాయన కుమాళ్ళగు దొరాబ్జి రత్నజీతాతాలు పితృవాక్యపాలన జరిగింప నిశ్చయించిరి; 30 లక్షలరూపాయలు అప్పటికిమ్మతుగ తేల్చిన (బొంబాయిలోని) తనమహాభవనములను జంషెడ్జి యీవిజ్ఞానాలయముకై యిచ్చుటకు నిర్ణయించి యుండెను. ఆప్రకార మాధర్మము జరుపుట కాయాస్తులను ప్రభుత్వాధికారులకు దఖలుపర్చుచు, దొరాబ్జి రత్నజీలు 1905 లో దఖలుపత్రము వ్రాయించియిచ్చిరి.

అంతట నియంతకై కొంతయత్నము జరిగి, రాయల్ సొసైటీసభ్యుడు, రామ్సేకు సహకారి, సుప్రసిద్ధ వైజ్ఞానికుడు నగు ట్రావెర్సుపండితు డావిజ్ఞానశాలకు డైరక్టరు (నియంత)గ రప్పింపబడెను. దానికో 'ది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌' (భారతీయవిజ్ఞానాలయము) అని పేరుపెట్టిరి. తరువాత కొన్ని వివరముల గూర్చి 'ట్రావర్సు' గారికిని మనప్రభుత్వము వారికిని తగవువచ్చి, కొన్నియేండ్లు చర్చజరిగెను. తాతాగారిచ్చిన యాస్తులవలన సాలినా ఆదాయము రు 125000 మాత్రముండునని ప్రభుత్వ ప్రతినిధు లంచనావేసిరి; మైసూరుప్రభుత్వము సాలినా రు 50000 ఇచ్చుచు; ఈరెంటిలో సగము అనగా రు 87500 సాలీనాయును భవనాదులకై ఒకసారిగ రెండున్నర లక్షలును భారతప్రభుత్వమిచ్చుటకు తుదకు నిర్ణయమయ్యెను. అంతట 1911 వయేట కార్యక్రమ మారంభించిరి. జీవరసాయనవిద్య, విద్యుచ్ఛక్తి, వైద్యశాస్త్రము, సాంకేతికవిద్య, తత్వశాస్త్రము, ఈశాఖల నేర్పర్చి, అందు పరిశోధన లారంభించిరి. అవసరమగు యంత్రపరికరములు, భవనములు, గ్రంథభాండారము, సిద్ధముచేయబడెను.

ప్రభుత్వముతో నభిప్రాయభేదము కలిగి, ట్రావర్సుగారు త్వరలోనే యిందుండి వెడలిపోయిరి. తరువాతవచ్చిన డైరక్టర్లు, గొప్పపరిశోధకులుకారు; వారు సాధారణముగా మనప్రభుత్వశాఖనుండి వచ్చిన యూరపియనులు; మామూలు నిర్వహణమందేగాని, విజ్ఞాన పరిశోధనలందు వారికంతగా ప్రజ్ఞలేదు; భవనాదులకే చాలసొమ్ము ఖర్చగుచుండెను. మొదట నాశించినంత విజ్ఞానకృషి జరుగ లేదని కొంతకాలముకు గుసగుసలు బయలుదేరెను.
యువకులకు కొంత యసంతృప్తికలిగి, 1922 లో ఒక కమిటీద్వారా కొంతవిచారణ జరిగెను. కార్యక్రమమున కొన్నిమార్పుల జేసిరి; అంతట యూరపియను ఉద్యోగులసంఖ్య కొంత తగ్గెను; మనదేశీయపరిశోధకుల సంఖ్య హెచ్చి, తరువాత క్రమముగా అభివృద్ధికలిగెను. ఇప్పుడు పరిశోధనలు, జ్ఞానార్జన, బాగుగ జరుగుచున్నవి. ఆశాఖలం దిచ్చట గల పరిశోధనావకాశములు మనదేశమందిం కెచ్చటను లేవు. ప్రసిద్ధవైజ్ఞానిక గ్రంథములు విజ్ఞాన పత్రికలన్నియు వివిధ పరిశోధన యంత్రములు నిచ్చటదొరకును.

వైజ్ఞానిక విషయములందును పరిశ్రమలగూర్చి ప్రభుత్వముకు పారిశ్రామికులకు నిందు సహాయము చేయబడును. ముఖ్యముగ మైసూరు రాష్ట్రపుపరిశ్రమల కిందలి పరిశోధనలచే చాల లాభముకల్గినది. అనేకవిధములగు ముడిదినుసులు, యంత్రనిర్మాణము, వస్తుతత్వము, వీనినిగూర్చి, ఇందనుకూల పరిశొధనలు జరిగినవి. వాని ఫలితముగ మైసూరులో ప్రశస్తమగు సబ్బుబిళ్ళలు, చందనపుతైలము, గట్టికర్రల పిండిజేయు విధము, అల్యూమినం, గంధకం, సోడియం మున్నగు రసాయన వస్తువుల జేయుట, విద్యుచ్ఛక్తి యుత్పత్తి, పెన్సిలులు మున్నగు వాని తయారు, వీనికి చౌకయగు వైజ్ఞానికపద్ధతులు కనిపెట్టబడి, అందుల కర్మాగారము లీ విజ్ఞానాలయపు సహాయమున నిర్మింపబడినవి. ప్రజా క్షేమముగోరు మైసూరుప్రభుత్వమువారు స్వయముగనే యిట్టిపరిశ్రమలను, పట్టు, ఇనుముమున్నగు వానిని గూడ, స్థాపించి జరుపుచున్నారు. ఆపరిశ్రమ లిప్పుడు వేలకొలదిజనులకు జీవనాధారమైనవి. విజ్ఞానాలయముకు ఇట్లు మైసూరు ప్రభుత్వమువారు దూరదృష్టితో ద్రవ్యసహాయముచేసి, దానిని బెంగుళూరిలోనే స్థాపింపజేయుట, మైసూరు రాజ్యముకు విశేష లాభకరమయ్యెను.

ఇటీవల, ఈవిజ్ఞానాలయపు యూరపియను డైరక్టరిందుండి వెడలిపోగా, దీనిసలహాకమిటీవారి శిఫారసుపైన, 1933 సం. లో ఆచార్య సి. వి. రామనుగారు దీని డైరక్టరుగ నియమింపబడిరి. రామను గారప్పటికి కలకత్తా విశ్వవిద్యాలయపు విజ్ఞాన కళాశాలలో ఫిజిక్సు అనగా భౌతికశాస్త్రశాఖలో ప్రధానాచార్యులుగనుండిరి. ఆయన గొప్ప పరిశోధకుడై, నూతనావిష్కారములు జేసి జగద్విఖ్యాతు డయ్యెను. ఆయన యాజమాన్యమున ఈవిజ్ఞానాలయమున భౌతికశాస్త్రశాఖగూడ చేర్చబడి, కొత్తపరిశోధనలు విశేషముగ చేయబడుచు, నూతనోత్సాహముతో కార్యక్రమము జరుగుచున్నది. ఇప్పుడు నిర్వహణము మితవ్యయముతో సమర్ధరీతిని జేయబడుచున్నది. పాశ్చాత్యదేశములందే యిదివరలో లభించు విజ్ఞానబోధను, అంత వ్యయప్ర యాసలక్కరలేకుండ, ఇప్పటికి 300 మందికిపైగా భారతీయు లీవిజ్ఞానాలయమందే పొందియున్నారు. వారిలో కొందరనేక పరిశోధనలగూడ చేసియున్నారు. *[6]


_________
  1. * ఇప్పుడు ఆపరీక్ష యేకకాలమందే లండనులోను మనదేశమున ఢిల్లీలోనుగూడ జరుపబడుచున్నది.
  2. * ఆయువకు లిద్దరిలో నొకడు పార్సీగ నుండవలెనని మొదట ఒక షరతుండెను; కాని ఉదారుడగు తాతా కొలదియేండ్లకే ఆషరతు తొలగించి, ఆయువకు లందరును భారతీయు లెవరైననుసరే, బీదలు అర్హులు నయిన చాలునని నిర్ణయించెను.
  3. * యూరపియనే కలెక్టరు అగుటవలన, అతనికివచ్చు జీతము పెన్షను వగైరాలు దాదాపు అంతయు విదేశములకే పోవును. ఆయుద్యోగము భారతీయునికి వచ్చిన, అతనికి రాజ్యాంగానుభవము మున్నగు లాభములు గల్గుటే గాక, అతనికి వచ్చు జీతమువగైరా లీదేశమందే నిల్చియుండును. మొత్తము మీద లెక్కజూచినచో, యూరపియను స్థానమున భారతీయుడే ఐ. సి. ఎస్. అయి ఉద్యోగి అగుటవలన, సగటున రెండేసిలక్షల రూపాయలు మనదేశముకు లాభమని తాతా గుణించి నిర్ణయించెను.
  4. * ఇతరుల పేరుతో స్థాపితమై వారికేప్రఖ్యాతి గల్గించు సంస్థకు తాము సహాయము చేయుటకు సాధారణముగ మనదేశపు శ్రీమంతు లిచ్చగింపరు. తమకు పేరునిచ్చు సత్కారముల జేయుటకు కొందరు శ్రీమంతులు సిద్ధమగుదురు. అట్టివారి యౌదార్యముకు నిరోధము లేకుండుటకును, తాను సహజముగ కీర్తికాముడు కానందువలనను, తాతా యావిజ్ఞానాలయమునకు తన పేరు చేర్చకుండ నిషేధించెను.
  5. * బొంబాయియంత పెద్దదికాదు కాని, బెంగుళూరును మూడులక్షల జనసంఖ్య గలిగి, ఇంకను వృద్ధియగుచున్నది. ఇందుకొంత (కంటొన్మంటు) బ్రిటిషుపాలనమందు, మిగిలినది మైసూరుప్రభుత్వపు పాలనలోను, ఉన్నది. ఇది యూరపియనులకు భారతీయులకు గూడ ఆరోగ్యప్రదము. 'రాయల్ సొసైటీ' ప్రపంచపు విఖ్యాతవైజ్ఞానిక సంఘములలో నొకటి; దీని కార్యస్థానము లండనులో నుండును.
  6. * ఈవిజ్ఞానాలయ మేర్పడినంతట, ఇంకొక విజ్ఞానకళాశాలను భారతీయుల యాజమాన్యమందే స్థాపించుటకు కొందరు బంగాళీ లుద్దేశించిరి. దాని ఫలితముగ కలకత్తాలో న్యాయవాది ప్రముఖుడగు శ్రీతారకనాధపాలితు గారు 15 లక్షల రూపాయలను, శ్రీరాసవిహారిఘోషుగా రొకసారి పది లక్షలను మరల మరికొంతసొమ్మును, కొందరంతట కొంతభూవసతిని, కలకత్తాలో విజ్ఞానకళాశాల స్థాపనకై యచ్చటి విశ్వవిద్యాలయమున కిచ్చిరి. ఆకళాశాలలో భారతీయులద్వారానే యున్నతవిజ్ఞానబోధ జరుగవలెనని నియమ మేర్పడెను. సుప్రసిద్ధ రసాయనాచార్యులు అనేకపరిశ్రమల నడిపిన నిపుణులు నయిన శ్రీప్రపుల్ల చంద్రరాయలు దీని నియంతగా నేర్పడిరి. భవనాదులకు విశేషముగ సొమ్ము ఖర్చుకాకుండ, ఆయన మితవ్యయముతో నాకళాశాల నారంభమునుండి జయప్రదముగ నడిపిరి. ఇందు విజ్ఞానపరిశోధనజేసిన యనేక యువకు లన్యదేశములందును ప్రసిద్ధిజెంది, స్వతంత్ర పరిశోధకులు ఆచార్యులునై ఉన్నతోద్యోగముల నలంకరించిరి. వారి యావిష్కారములలో కొన్ని పరిశ్రమలకును సహాయకములైనవి. ఇందు కృతార్థులైన యువకులు రాయిగారు నడిపించు 'బెంగాల్ కెమికల్ అండ్ ఫర్మసిటికల్ వర్క్సు'లో వివిధరసాయన వస్తువులను పాశ్చాత్యౌషధములనుగూడ కలకత్తాలో చౌకగ తయారు చేయుచున్నారు. ఇప్పుడు బెంగుళూరులో నియంతగానున్న చంద్రశేఖర వెంకటరామనుగా రాకళాశాలలోనే సుమారు 15 ఏండ్ల పరిశోధనల జేసి ఖ్యాతిగాంచిరి; అచటి మితవ్యయపద్ధతుల ప్రకారమే, బెంగుళూరి విజ్ఞానాలయమును రామనుగా రిప్పుడునడుపుచున్నారు.