తాతా చరిత్రము/పౌరసేవ
10. పౌరసేవ.
ఇతరజీవులవలె గాక నరుడు, విశేషముగ సాంఘికుడు; అనగా సంఘములో నొకభాగమై, దానివలన చాల సహాయము బొందుచుండును. చాలవరకు సంఘక్షేమమే అందలి వ్యక్తుల క్షేమమగును. అందువలన తాను సంఘమునకు వీలైనంతవరకు సాయముచేయుట ప్రతినరుని ధర్మము. ఆసాయము దేశమంతకు వ్యాపించిన, అది దేశసేవ యనిపించుకొనును. అట్టిసందర్భముకొలది మందికే కల్గును; కాని ప్రతివాడును తాను కాపురముండు గ్రామమునకో పురముకో ఉపకరింపవచ్చును. పెద్దనగరములం దుండువారు తమ నగరవృద్ధికై యధాశక్తిగ పనిచేయుటకు మంచి యవకాశము లుండును. ఇదియే పౌరసేవ యనిపించుకొనును. (ఈపౌరసేవయే దేశ సేవకు పునాదికావచ్చును. ఆయావ్యక్తి ప్రవృత్తిని బట్టి ఇది వేరువేరు రూపము దాల్చవచ్చును.)
13 వ యేట విద్యారంభముకై జంషెడ్జి బొంబాయి వచ్చి, అప్పటినుండి యందే వసించెను; (మధ్య ఎంప్రెసుమిల్లు
- [1] సందర్భమున మూడునాలుగేండ్లుమాత్ర మాయన నాగపురమందుండెను.) అప్పుడప్పుడు విదేశయాత్రలకు పోయినను కొన్ని నెలలకు బొంబాయి చేరుచుండెను. బొంబాయిపౌరుడగుటచే, జంషెడ్జి కానగరముపైన నమితాభిమానముండెను. ఆతని కాడంబరమన్నను వక్తృత్వమన్నను ఇష్టములేదు; ఎన్నడును మునిసిపలుసభ్యుడగుటకు యత్నింపలేదు; కాని పైకి తెలియకుండనే, బొంబాయి నగరపుఆరోగ్యమును విద్యాదిసౌకర్యములను హెచ్చించి, దానినిసుందరముగ జేయుటకాయన చాల కృషిచేసెను. (తనజన్మస్థలమగు నవసారిలోను ఆయన పాఠశాలలను భవనములను ఆరామములను నిర్మించెను.) బొంబాయియే మనదేశపు ప్రధానపురమని, అది ఆదర్శనగరము కావలెనని ఆయన ఆశయము.
జంషెడ్జితాతా ప్రవేశించునప్పటికి బొంబాయి యిప్పటి స్థితికి రాలేదు. అది సముద్రతీరపు ద్వీపపుంజము; మొదట
- [2] చిన్నగ్రామముగ నుండి, 17 వ శతాబ్దినుండి పాశ్చాత్య స్పర్శ కలిగినమీదట వర్తకము కోస్తావ్యాపారము వృద్ధియైనందున మద్రాసు కలకత్తాలవలె క్రమముగా నది పెద్ద పట్టణమయ్యెను. కాని ఈతక్కినపురములకన్న బొంబాయి యూరపుకు చాల దగ్గర; పాశ్చాత్యులకది మనదేశపు ద్వారముగనుండెను. మరియు బొంబాయిరేవు మద్రాసు కలకత్తాలకన్న చాల ప్రశస్తము, నైసర్గికము, చాలభద్రము అందువలన 19 వ శతాబ్ది మధ్యకది చాల వేగముగ వృద్ధియయ్యెను. కాని యందు మహాభవనము లేర్పడినను, వానిని తగిన కట్టుబాట్లు పురనిర్మాణపద్ధతులు లేకుండ, అవసరమునుబట్టి జనులు తమకు తోచినట్లెల్ల కట్టిరి. చాల యంతస్తుల పెద్దమేడలు చిన్న యిండ్ల ప్రక్కను, ఇరుకుసందులవద్దను, ఏర్పడెను. వీధులు బారుగను విశాలముగను లేక, కశ్మలముగ నుండెను.
బొంబాయిలో దబాటువాన యధికము. నగరము హఠాత్తుగా జలమయమగుచుండెను. నీటిపారుదలకు తగు నేర్పాట్లు లేకుండెను; ఆహర్మ్యములు మధ్యకాలపురీతివై, బ్రహ్మాండమగు బోషాణములవలె నుండెను; గాలి మెలుతురు గృహములోపల ప్రసరించుటకు వీలులేకుండ కట్టబడెను.
*[3] తాతా వ్యాపార మారంభించుసరికి, ఆసంకులనగరము వికృత భవనములతో క్రిక్కిరిసి, జనసమ్మర్దముచే విశ్రాంతికి తావులేక, ఇరుకుసందులతో ననారోగ్యము కావాసమై యుండెను. మరియు మిల్లులు వృద్ధియైనకొలది, ఆప్రాంతములందు కార్మికులకై 'చాలు' లనబడు ఇరుకుకొ ట్లేర్పడెను. ఆపేటలు చాల క్రిక్కిరిసి తగువీధులు లేక గాలి వెలుతురులకు తావు లేనివై, నీటిసదుపాయము లేకయుండెను. దుర్భర దుర్గంధ భూయిష్టములైన యీ కొట్లలోని కూలిజనులు పశువులకన్న హీనముగ నుండిరి. తరుచు కుటుంబమంతయు, ఒక్కొకప్పుడు రెండుమూడు కుటుంబములుగూడ, ఒకే గదిలో భుజించుచు శయనించుచు, రాత్రింబవళ్లు నందే కాపురముండెను. అట్టిస్థితిలో, ఆపేటలం దంటువ్యాధు లారంభించి, తరుచు ప్రబలుచుండెను. ఆవ్యాధులు నగరమందలి యితరభాగములకును తీవ్రముగ వ్యాపించెను; వేలకొలది జను లావ్యాధులచే మరణించుచుండిరి. అందువలన బొంబాయి పురక్షేమముకు వ్యాపార వృద్ధికిని గూడ చాల హాని కలుగుచున్నదని, ఈకళంకమును మాన్పి నగరమును వాసయోగ్యముగ జేయుట ప్రథమకర్తవ్యమని, తాతాకు తోచెను.
1863 ప్రాంతమున దూదియెగుమతి చురుకుగ జరిగినపుడు, బొంబాయి వర్తకులకు చాల ద్రవ్యము చేరెను; అప్పు డాసొమ్ముతో చిత్రమగు కంపెనీలు చాల లేచెనుగదా? అప్పు డు ప్రేమచందురాయచందు అను కోటీశ్వరు డొక్కపెద్ద బాంకును స్థాపించెను అందలి సొమ్ముతో బొంబాయిచుట్టు నున్న విశాలమగు పల్లపు స్థలములో జొచ్చు సముద్రపుపోటు నీటిని పెద్దరాతిగోడలతో నరికట్టి, ఆస్థలముల మెరకజేసి, అందు వాసగృహముల నిర్మించుటకు తాతాయు మరికొందరును సమకట్టి కొంతపనిచేసిరి. అందుకు చాల సొమ్ముకావలెను. కాని అమెరికాలో సంధిచే యుద్ధము నిల్చిపోయి, మనదూది యెగుమతి హఠాత్తుగ ఆగినప్పుడు, బొంబాయిలో మరికొన్ని యితర బాంకులతో బాటు ప్రేమచందురాయచందుగారి బాంకును దివాలాతీసెను. ఆప్రళయమున చాలసొమ్ము నష్టమైనందున, ఆనివేశస్థలముల ప్రణాళికయు నిల్చిపోయెను.
నాగపురమం దెంప్రెసు మిల్లుల స్థాపించినప్పుడు, అచటి కూలీలకై జంషెడ్జి పాశ్చాత్యపురములందలి ఉత్తమరీతిని చక్కని కుటీరముల నిర్మించెను. దరిమిలాను బొంబాయిలోను అహమ్మదాబాదులోను మిల్లుల గట్టినప్పుడును, ఆయన యట్లే చేసెను. తనమిల్లుల నాయన విశాలముగను, పనివాండ్రకు సుకరముగ నుండునట్లును, కట్టెను. వారు వసించుటకై, విశాలమగు పేటలను తానే, చాలచొమ్ము ఖర్చుపరచి, నిర్మించెను.
................................................
- [4] అందు సరియైన వీధులనుంచి, మరుగుదొడ్లకు ఆటస్థలములకు ప్రత్యేకమగు వసతుల గల్గించెను. మంచి కిటికీలనుంచి గాలి వెలుతురు తగులునట్లు చౌకలోనే చక్కని కుటీరములను బారులుగను మనోహరముగను గట్టెను. కూలీల స్నానపానాదులకు మంచినీళ్ళవసతి నేర్పరచి, మురుగునీరు పోవుటకును తగునేర్పాటుల జేసెను; వానికి కొద్దిపాటి అద్దెనే స్థిరపర్చెను. ఆకుటీరముల పేటలు ఆరోగ్యకరములై, కూలీల కాకర్షకములై, ఆదర్శరూపముగ నుండెను. వానినిజూచి కొందరితరులును అట్టి కుటీరపంక్తులనే నిర్మించిరి. తాతా తనకూలీల కుటీరములందు వ్యాయామస్థలములను వైద్యశాలలను విద్యాలయములను పఠనమందిరములను నిర్మించి, వానినుచితముగ నడుపుచుండెను. అందువలన నాకార్మికుల దేహమనశ్శక్తులు వృద్ధి యాయెను.
ఇట్లు క్రమముగా బొంబాయి మిల్లుప్రాంతములందు కొంత ఆరోగ్యస్థితి కార్మికజనులకు సౌకర్యములు నేర్పడెను. జనులు నధికారులును దూరదృష్టి లేక గృహములను వీధులను నిర్మించుటచే, నగర మనారోగ్యముగనున్న స్థితిలో, ఆసార్వజనిక నగరమున పశ్చిమదేశములనుండి ప్లేగు (మహామారి) తగిలెను; అంటువ్యాధులు ఆనగరమును వీడక, ఏండ్లకొలది బాధింపజొచ్చెను. ఈప్లేగు 1895 నుండి చాలతీవ్రముగ వ్యాపించెను; అందుచే చాలజనులు చనిపోయిరి, అనేకులు నగర మువీడి పారి పోయిరి; వ్యాపారము స్తంభించెను, చాలమంది వ్యాపార నాయకులప్పుడు బొంబాయి విడచి చనిరి; అప్పుడు జంషెడ్జి మాత్రమందేయుండి ఆవ్యాధి నివారణకు, ఆరోగ్యవ్యాప్తికి, జరుపు చర్యలందు చాల తోడ్పడెను; అందుకు చాల ద్రవ్యసహాయము గూడ చేసెను.
బాల్యమునుండి తండ్రితో గలసి ఆనగరమందునే వేర్వేరు పేటలలో కాపుర ముండినందున, జంషెడ్జి యాపురమున చక్కని భవనముల నిర్మించుటకు వీలగుస్థలములను, జాగ్రత్తతో కనిపెట్టెను. వ్యాపార సందర్భమునను, తనబాకీసొమ్ముల తీర్మానముకును, ఆయన చాల నివేశస్థలములను క్రయముకు సంపాదించెను. వ్యాపారరంగములకు దగ్గరను ముందు వేగముగ వృద్ధికాదగిన ప్రాంతములందును గల ఖాళీస్థలములు ముందు చాల యుపయోగకరము లగునని గ్రహించి, ఆయన వానిని చౌకస్థితిలో కొనివేసెను; ఆస్థలములందు చక్కని సౌధముల నిర్మించెను.
ఇంగ్లండు ఫ్రాంసు జర్మనీలలోను, జపానులోను, ఆమెరికాలోను, గృహములను ఆరోగ్యకరముగ నిర్మించి, అందు చౌకలోనే స్నానపానదీపాదుల సౌకర్యములను, ఆధునిక వైజ్ఞానికపద్ధతుల ప్రకార మొనగూర్చుచున్నారు; వానిని తనవ్యాపారయాత్రలందు తాతా గమనించి, బొంబాయిలో నాప్రకార మిండ్లను కట్టెను. చుట్టును ఖాళీస్థలముంచి, బలమగు పునాది పైన, ప్రశస్తమగు నిర్మాణపరికరములతో నుక్కుస్థంభముల మూలమున చాల యంతస్థుల మేడల నిర్మించెను. విశాలమగు వరండాలు; గాలికెదురుగ పెద్దకిటికీలు గల్గి, మేడపైనగూడ నీటిసదుపాయము, విద్యుచ్చక్తి యేర్పాటుతో వంటలు, లోనికి వెలుతురునిచ్చు నద్దపుపైకప్పులు, చలువరాతి చీడీలు మొదలగు చక్కని సౌకర్యము లమర్చబడెను. అప్పటికింకను మనదేశమున వ్యాప్తిలేకున్నను, తానుకట్టు భవనములందు తాతా యెలెక్ట్రికు (విద్యుత్) దీపముల నమర్చెను. ఆభవనము లందనేక కుటుంబములు పరస్పర సంబంధ మక్కరలేకుండ వేర్వేరుగ కాపురముండునట్లు సౌకర్యముల నేర్పర్చెను; వానిని న్యాయమగు బాడుగకు మధ్యరకపు ఉద్యోగులకు వర్తకులకు అద్దెల కిచ్చుచుండెను. ఆసుందరభవనముల చక్కని వసతినిబట్టియు, వ్యాపారస్థలములకవి సమీపముగ నుండుటవలనను, చాలమంది యాభవనములందే కాపురముండుటకు వచ్చుచుండిరి. తాతాయు వారియవసరముల దెలుసుకొనుచు, సలహాల గ్రహించుచు, వారికి వలయు కొత్త సదుపాయముల నమర్చుచు, సహృదయుడై, వారికష్టసుఖములందు సానుభూతి కల్గియుండెను. ఆయన కట్టించిన ఎస్ప్లనేడు భవనము, విక్టోరియా బిల్డింగ్సు, జూబిలీబిల్డింగ్సు మున్నగు ఆసౌధగృహములు బొంబాయిలోను ఆరాష్ట్రమంతటను గూడ త్వరలోనే ప్రసిద్ధములయ్యెను. వానిలో చక్కని బల్లలను, కుర్చీలను, తాను యాత్రలందితర దేశములనుండి తెచ్చు సుందరప్రతిమలను, విచిత్ర వస్తువులను, కొన్నిగ్రంధములను గూడ, అమర్చెను.
బొంబాయికి చుట్టుపట్ల 'జుహు, బంద్రా' సాల్సెటి, మహద్, అను చిన్నదీపములు గలవు. అందును బొంబాయికి పరిసరమందును గూడ విశాలస్థలములను గొని, అందువాసయోగ్యమైన చక్కని బంగాళాయిండ్ల నాయన కట్టించెను. ఆయన యితరదేశములందలి కట్టడములలో వేర్వేరు పంపిణీలను కనిపెట్టుచు, అందు చౌకలో చక్కగనుండువానిరీతిని తనగృహమున నిర్మించుటచే, అవి ఉత్తమములై ఇతరుల కాదర్శముగ నేర్పడెను. తరువాత నట్టివిశాలములు ఆరోగ్యప్రదములునగు భవనములను కొందరితర శ్రీమంతులు ననుకరించిరి; సామాన్యమగుజీతము ఆదాయముగలవారికి వీలగునట్లు, 'జింఖానా చాంబర్సు' అనుపేర చాలయిండ్లవరుస నాతడు కట్టించెను. ఇందు పాశ్చాత్యపద్ధతి స్నానపానాదుల సౌకర్యమేర్పర్చబడెను. ఇదినాలుగంతస్థులదై వ్యాపారస్థలముల సమీపమున చుట్టునుఖాళీస్థలముననున్నది. చాలమంది యూరపియనులిందు కాపురముందురు.
తనమిల్లులపైవచ్చు నాదాయములో కొంతభాగమును తాతాగారు భవననిర్మాణముకును వానినివృద్ధి జేయుటకును వినియోగించుచుండెను. ఆకర్షకములగు నాగృహములందెప్పుడును జనులు కాపురముండుటచే, ఆగృహములవల్లను తాతాకు మంచి ఆదాయమే వచ్చుచుండెను. కాని సౌకర్యమును బట్టి జనులు హెచ్చుగవచ్చుచున్నను, ఆయన వాని అద్దెలను అనవసరముగ వృద్ధిచేయుట లేదు; కొద్ది రేటులాభముకే తృప్తుడగు చుండెను.
అంతట తాతా ప్రపంచపు సుందరభవనములలో నొకటి బొంబాయి కలంకారము మనదేశముకంతకు నాదర్శమునగు నొక మహాభవనమును నిర్మించెను. ఇదియే 'తాజ్‌మహల్ హోటలు'. మన మహానగరములన్నిటిలోను అన్ని దేశములనుండివచ్చు మహనీయులగు యాత్రికులు వసించుటకు ఆధునిక సౌకర్యములనిచ్చు హోటళ్ళు అన్నియు యూరపియనులవే; వానిలోను పాశ్చాత్యశాలలోనుండు నన్ని సౌకర్యములు లేవు; మరియు అందుభారతీయులకుచితస్థానముండదు. ఈలోపములదీర్చుటకు, తాతా 1898 లో 'తాజ్‌మహల్ హోటలు' నారంభించి యైదేండ్లలో దానిని బూర్తిచేసెను. ఇది బొంబాయి హార్బరుప్రక్కను సముద్రమున కెదురుగా నున్నది. దేశాంతరములనుండి స్టీమరులపై వచ్చువారికి రేవుకు చాలదూరము నుండియు నీటిపైన ముందుగ బొంబాయిలో నీభవనమే రమణీయముగ గాన్పించుచుండును. శ్రీమంతులు సామాన్యులు అన్నిదేశములవారు గూడ బసచేయుటకిందు తగువసతియు, వారివారి యాచారముల కనుకూలమగు సౌకర్యములును కలవు. వెలుతురును సర్వకాలములందును సముద్రపుగాలియు నన్నిప్రక్కలను ప్రసరించునట్లుగా దీని గదులు విశాలమగు కిటికీలతో గట్టబడినవి; ఐనను దీని నిర్మాణ పద్ధతి, అధికారవ్యవహారములు, భారతీయములే; ఏవైపునుండి చూచినను, ఈప్రసాదరాజ మతిసుందరముగ కనబడును. ఇందు దీపములు, వంట, వేడినీటిసప్లై, బట్టలయిస్త్రి, పై అంతస్థుల కెక్కుట, మున్నగు సౌకర్యములన్నియు, విద్యుచ్ఛక్తిమూలముగనే జరిపించబడును. మరియు పోస్టాఫీసు వైద్యసహాయాదులన్నియు అందేకల్పింపబడినవి. మనదేశపు హోటలులన్నిటిలో నిదియసమానము. నలుబదియడుగులలోతునుండి బలమగు పునాదితోను అందుపైన ప్రశస్తమగు ఉక్కు కాంక్రిటుసిమెంటు మున్నగు చలించని వస్తువులతోను, సుందరముగ నిర్మితమైన యీభవనముకై జంషెడ్జి నలుబదిలక్షల రూపాయలు ఖర్చుచేసి, చాలశ్రమపడి ముఖ్యమగు నేర్పాటుల స్వయముగ జరిగించెను.
ఇట్లు బొంబాయినలకరించుటయే గాక, ఆనగరపు ఆరోగ్యము, విద్య, వ్యాయామము మున్నగు సౌకర్యముల వృద్ధికై, ఆయన ధనమునిచ్చితోడ్పడుచుండెను; విద్యాధికులు, వర్తకులు, సాంఘికరాజకీయనాయకులు, సాయంకాలములందు కలుసుకొని అనేకవిషయముల చర్చించుచు సంప్రతించుకొనుటకును, సామాన్యజనులకు గ్రంథాలయ సౌకర్యముండుటకును, ఆయన చాలచోట్ల క్లబ్బులస్థాపింప తోడ్పడెను; అందుల సంభాషణలలో పాల్గొనుచు, అందు తన విశేషానుభవముతో మిత్రులకనేక ముఖ్యవిషయములను తెలుపుచుండెను. ఆయన కార్పొ రేషనులో సభ్యుడగుట కెన్నడును తలపెట్టలేదు; కాని చాలకాలము బొంబాయిలో గౌరవన్యాయపతిగ మాత్రము పనిచేసెను.
బొంబాయి పరిసరపు నివేశనస్థలములపైన లోగడప్రభుత్వమువారు హెచ్చుపన్ను విధించినప్పుడు, జంషెడ్జి ప్రభుత్వమువారితో తీవ్రచర్చజరిపి, ఆపన్నును తగ్గించుటకు పత్రికలందుగూడ చాల వ్యాసముల మూలమున నాందోళనసలిపెను. ఆయన బొంబాయిపురము పురోభివృద్ధికి సంబంధించు విషయములన్నిటిలోను శ్రద్ధవహించెను. మిల్లులందు బట్టలతయారుచేయుట ఆనగరపు ముఖ్యపరిశ్రమ; అందుల ప్రతిసమస్యలోను పాల్గొని, ఆయన నాయకుడయ్యెను; తనమిల్లులలాభముకే యత్నింపక, నగరముకంతకు లాభించునట్లే కృషిసలిపెను. తనమిల్లులందు యువకులకు సాంకేతికవిద్యను, యంత్రములనడుపు పద్ధతులను, ఆర్థిక వ్యాపారవిధానములను, ఉచితముగ నేర్పుచుండెను.
పౌరాభివృద్ధికి విద్యాసౌకర్య మవసరము; తన యాదాయములో కొంతభాగమును తాతా విద్యాపోషణకై వినియోగించుచుండెను. ఆర్థికవిషయము లందాసక్తి కలిగియుండుట బట్టియు, తనయనుభవమును బట్టియు, నాణెములు వెండిబంగారముల దామాషా రేటు బాంకుపద్ధతులు మున్నగువాని గూర్చి, ఆయన సలుపువిమర్శలును జ్ఞానదాయకములై యుండెను. బొంబాయిలో తనకుమారునిచే కొన్ని వార్తాపత్రికల నడిపించి, అందుకుతగుసలహాలనిచ్చి, అప్పుడప్పుడు ఆర్థిక సమస్యల జర్చించు వ్యాసముల వ్రాయుచుండెను. బొంబాయిలో గొప్పవర్తకశిఖామణులు చాలమందియున్నను, వారికందరకు తాతాయే ఆదర్శ రూపముగనుండెను. తాతాబోలు మహనీయులు పౌరసేవ వలననే బొంబాయి మనదేశమున ప్రస్తుతపు నిరతిశయస్థితికివచ్చినది.
- _________
- _________
- ↑ * ఆధ్యాత్మికముగ గూడ కేవల వ్యక్తి మోక్షమునే యపేక్షించి, కేవల జ్ఞానియై నిష్క్రియుడగుటకన్న, ఈశ్వరప్రీతికరముగ, ఈశ్వరసృష్టిలో ఆయాజీవులు గూడ తనవలె బంధమోక్షము నొందగోరుచు, అందుకై చేతనైనంతవరకు సంఘ క్షేమకరమగు కర్మలజేయుటయే నిశ్శ్రేయసమని చాలమంది మతస్థాపకు లెంచినటుల తోచును.
- ↑ * బొంబాయిపుర మిప్పుడు కొన్ని విషయములలో మనదేశమం దసమానము, పదిలక్షలపైగా జనసంఖ్యగలది; కలకత్తా మాత్రము దీనికన్నను కొంచెము పెద్దదందురు. ఈరెండునగరములందును మనదేశమం దికెక్కడను లేని అనేక ప్రాసాదములు, మహాయంత్రశాలలు, వివిధపరిశ్రమలు, వివిధకళాశాలలు, వివిధజాతి జనసంఘములును, గలవు. కాని కలకత్తాలోని ముఖ్య పరిశ్రమలు చాలవరకు యూరపియనుల వశమందున్నవి. బొంబాయిలో అట్లుగాక పరిశ్రమలు వ్యాపారములు ముఖ్యముగా భారతీయహస్తములందే యున్నవి. అందువల్ల కలకత్తాలో యున్నంత పాశ్చాత్యప్రాబల్యము బొంబాయిలో లేదు. మన దేశీయవ్యాపారములకు బొంబాయియే కేంద్రమని చెప్పవచ్చును.
- ↑ * 17, 18 వ శతాబ్దులందు మనదేశమం దశాంతి బందిబోట్లభయమును వృద్ధియగుటచే, శ్రీమంతులు భద్రతయే ప్రధానముగ జూచుకొని, తమభవనములను ఇరుకుగను పెద్ద పెట్టెలవలెను గట్టుచుండిరని తోచును.
- ↑ * ఈయన గొప్ప వ్యాపారనాయకుడై, దూదియెగుమతిచే చాల శ్రీమంతుడై, అనేక దానధర్మములజేసెను. 'ఏషియాటిక్ బాంకింగ్ కార్పొరేషను' అను యీయన స్థాపించిన యాబాంకు దివాలాతీయగా, ఈయన స్థితిచెడెను.