తాతా చరిత్రము/పట్టుపరిశ్రమ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

10. పట్టుపరిశ్రమ.

చాల శతాబ్దులనుండి మనదేశమున పట్టుబట్టల వాడుక కలదు. అవి ప్రియమై మన్నిక కల్ల్గి, అందముగనుండును. వీనిని శ్రీమంతులు ధరింతురు. సామాన్యజనులు పరిశుద్ధమని మడికి ఉపయోగింతురు. పట్టునేత మనదేశమున చిరకాలమునుండి చాలమందికి వృత్తిగనున్నది. ఈపరిశ్రమకును గతశతాబ్దిలో విదేశపుసరుకుల దాడిచే హానికలిగినది.

పట్టుపురుగులనబడు ఒకజాతి పురుగులు గూడు నేర్పర్చుకొని, అందు వసించుచు, ఆగూడులోనే తమదేహమునుండి పట్టును నిర్మించుకొనును. అది దూదికన్నను మృదువై, మనోహరముగనుండును. ఈపురుగులు మల్బర్రీ చెట్ల యాకులదిని జీవించును. ఆచెట్లువృద్ధియగు తావులందే యాపట్టుపరిశ్రమ కవకాశముండును. కొన్ని పట్టుపురుగులు ఆముదపు ఆకులగూడ దిని, వసింపగలవు. పట్టుబట్టలకు దుకూలము చీనాంబరము అనియు వాడుక కలదు. చీనాలో, ఈపరిశ్రమ చిరకాలముగ వ్యాపించి యున్నది. అందుండి కొన్నిశతాబ్దములక్రింద కొన్ని పట్టుపురుగులను మల్బర్రీని కొందరు రహస్యముగ ఇటలీ ఫ్రాన్సులకు గొనిపోయి పెంచిరి. క్రమముగా నచట పట్టుపురుగులు వృద్ధియై, కొంతకాలముకు ఆధునిక యంత్రసహాయమున చాల నాజూకగు పట్టు తయారుకాజొచ్చెను. అదిచౌక; మన కోరా పట్టుకు బదులు ఆవిదేశపు పట్టునే మనదేశమందును కొనుటచే, మనపరిశ్రమ క్షీణింపదొడగెను.

జంషెడ్జి ఇంగ్లండుకు వెళ్ళినప్పుడు, ఫ్రాన్సు ఇటలీలం దాగి, అచ్చటి పట్టుపరిశ్రమ పద్ధతులను జాగ్రత్తతో గమనించెను. అవి మనదేశమున గృహపరిశ్రమగ నుండుటకు వీలుకలదని కనిపెట్టి, ఆయన మచ్చునకు కొన్ని ప్రశస్తమగు కొత్తరకపు పట్టుపురుగులను మల్బర్రీ విత్తనములను ఆపరిశ్రమ కుపయోగించు కొన్ని పనిముట్లను మనదేశముకు తెచ్చెను. ఇచట మైసూరులో బెంగుళూరు ప్రాంతపు పీఠభూమి సమశీతోష్ణమై, ఈపురుగులును మల్బర్రీ చెట్లును వృద్ధియగుటకు ఎంతయు తగియున్నది. టిప్పూసుల్తానుకాలమున గూడ, ఆప్రాంతమున మల్బర్రీ తోటలు పెంచబడెను. అందుచే తాతా యాప్రాంతమున కొంతవిశాల స్థలమును కొని, అందు మల్బర్రీతోటల బెంచి, ఆపట్టుపురుగుల వృద్ధిజేసెను.

తానారంభించు పరిశ్రమకు ప్రపంచమందన్ని ప్రాంతములలో నెట్టి విశేషపద్ధతు లవలంబింపబడినవో తెలుసుకొని, అవి యిచటి పరిస్థితులకు తగియున్నచో పరీక్షించి, వ్యయప్రయాసముల కోర్చి, అట్టి నవీనపద్ధతులతోనే తనపరిశ్రమల నడుపుట తాతా కలవాటు. ఈపట్టుపరిశ్రమను శాస్త్రీయముగ వృద్ధిచేసినవారిలో జపానీయులు ముఖ్యులు; వారు యూరపియనులవై జ్ఞానికయంత్రముల వాడుచు, వానిని ప్రాచ్యజనుల కనుకూలముగ గృహపరిశ్రమ పద్ధతిని నడుపుచున్నారు. వారు పాశ్చాత్యపద్ధతులను ఆసియాలోని గ్రామపరిసరముల కనుకూలముగ సమన్వయించుటలో దిట్టలని జంషెడ్జి గ్రహించి, తాను 1893 లో స్వయముగ జపానుకేగి, ఆపనివాండ్ర నేర్పును, పురుగుల జంపకుండ సుళువుగ గూడులనుండి పట్టితీసి వడకుటకు వారు వాడుయంత్రములను, గమనించెను. అవి యూరపుపద్ధతుల కన్నను ప్రశస్తములు; అందుచే జపాను నుండి కొందరువిజ్ఞులను రప్పించి, జంషెడ్జి తనతోటలందు వారినుద్యోగులుగ నియమించి, ఆపద్ధతులను, ఆపరిశ్రమలోని చర్యలన్నిటిని, ఇచ్చటి యువకులకు చక్కగ నేర్పించెను. ఆకులకు పురుగు పట్టినచో అవలంబింపవలసిన పద్ధతులను, యాంత్రిక విశేషములను గూడ, మన యువకులు నేర్చుకొనిరి. ఆపరిశ్రమ మర్మములన్నియు బోధించినమీదట, ఆజపానీయులు తిరుగ తమదేశముకును పంపివేయబడిరి.

తాతాచేయు కృషికానందించి, అప్పటి మైసూరు ప్రభుత్వమువారు తమదివానగు సర్ శేషాద్రి అయ్యరుద్వారా, తాతాగారి పట్టుతోటపరిశ్రమకు సాలీనా రు 3000 లు చొప్పున కొన్ని యేండ్లవరకు విరాళమునిచ్చుచు సహాయము చేసిరి. తనతోటలందు కొందరు మైసూరు యువకులను గూడ పట్టుపరిశ్రమలో విజ్ఞులనుగ తయారు చేసెను. తాతా సహజముగ ఆరామ ప్రియుడు; ఆ తోట నాదర్శవనముగ జేసెను. ఆతోటలో తయారైన పట్టు చాల ప్రశస్తముగ నుండి, విదేశపు రకము లన్నిటికిని తీసిపోకయుండెను. భారతదేశమున ఈపరిశ్రమ కిప్పు డవకాశములేదని లోగడ నొకయపోహ కల్గియుండెను. ఆయపోహయిందుచే తొలగెను. తాతాకిందుగల్గిన విజయముచూచి, భారతప్రభుత్వము మైసూరు ప్రభుత్వముకూడ స్వయముగ పట్టుతోటల బెంచి, పట్టుపరిశ్రమకు ప్రోత్సాహ మొసగిరి.

లాభముకొరకు కాక, ఇతరుల కాదర్శముగ నుండుటకే, తాతా ఈపరిశ్రమకై రు 50,000 ఖర్చుచేసి, చాల ప్రయాసతో నీపరిశ్రమకు పునరుద్ధరణ గావించెను. ఆతోటలోని పట్టు భారతదేశమంతటను ప్రసిద్ధిజెందినది. తాము తరువాత స్థాపించిన పట్టుతోటలందు చిక్కుకలిగినప్పుడెల్ల, భారతప్రభుత్వమువారు జంషెడ్జి తాతాకు వ్రాసి, ఆయనసలహా పొందుచువచ్చిరి.

జంషెడ్జి యనంతర మాయనకొమా ళ్ళితరోద్యమము లందు నిమగ్నులై, తీరిక లేక, ఈపట్టుతోట నమ్మజూపిరి. మన దేశమున నిమ్నజాతి వృద్ధికై పాటుపడు క్రైస్తవసంస్థయగు 'సాల్వేషన్ ఆర్మీ'కి నాయకుడగు 'బూత్ టక్కర్‌' గా రీతోటనంతట కొనిరి. ఆయన జంషెడ్జికి ముఖ్యస్నేహితుడై, ఆయన యుద్యమములందు సానుభూతి కల్గియుండెను. అందుచే తాతాపేరనే పిల్చుచు, టక్కరుగారా తోటను వృద్ధిజేసెను.

'తాతా తోట' పద్ధతినే, ఇప్పుడు అలీఘరు మోరదాబాదు, సింహళము, మున్నగుచోట్ల పట్టుతోటలు పెంచబడి, వృద్ధిలోనున్నవి. మున్ముందు పట్టుపరిశ్రమ మనదేశమున నింకను వృద్ధిగాంచి, ముఖ్యగృహపరిశ్రమలలో నొకటి కావచ్చును.


__________