తాతా చరిత్రము/బట్టలపన్ను

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

9. బట్టలపన్ను.

దూది నూలుబట్టల వ్యాపారసందర్భమున, అప్పుడింకొక సమస్యకూడ గల్గెను; అందును దేశీయపరిశ్రమల క్షేమముకై తాతా తీవ్రకృషి సలిపెను.

1892 ప్రాంతముకు మనప్రభుత్వపు సేనాదులు వృద్ధి చేయబడెను; అందుకు సాలీనావ్యయము అధికమగుచుండెను. అంతవరకున్న పన్నులయాదాయము ప్రభుత్వముకు చాలలేదు. అప్పుడు, హర్షల్‌ప్రభువు అధ్యక్షతను, మనప్రభుత్వమొక కమిటీనేర్పర్చిరి. వారు పరిస్థితుల విమర్శించి, ప్రభుత్వాదాయపు వృద్ధికై, మనదేశముకు దిగుమతియగు సరుకులన్నిటిపైన సుంకముల విధింపవలెనని తమరిపోర్టులో దెల్పిరి. ఆప్రకారము దిగుమతుల కిమ్మతుపై నూటి కైదుచొప్పున (1894 లో) భారత ప్రభుత్వమువారు సుంకము విధించిరి.

అప్పటికి మనకు దిగుమతియగు సరుకులన్నిటిలో ముఖ్యమైనవి బ్రిటిషువారి మిల్లుల నూలు, బట్టలు; వానికిని ఈదిగుమతిపన్ను తగిలినది. ఈసరుకులను మనదేశముకంపి బ్రిటిషువా రందుపైన సాలీనా కోట్లకొలది రూపాయల లాభమొందుచున్నారు. ఈదిగుమతిపన్ను వలన యాసీమసరుకుల ధర యిచ్చటకొంచముగ హెచ్చునని, అందుచే నీదేశపు మిల్లుబట్టలకు ధరలో సదుపాయము కలుగునని, అందువలన తమసరుకుల యమ్మకము తగ్గవచ్చునని, అట్లగుచో తమ కంతవరకు వచ్చు చున్న విశేషలాభము తగ్గునేమో యని, బ్రిటిషు వ్యాపారులు భీతిల్లిరి. మన ప్రభుత్వము బ్రిటిషునూలుపైన బట్టలపైన పన్ను విధింపకూడదని, వారు ఇంగ్లండులో పెద్ద ఆందోళన నారంభించిరి. లంకషైరులోని బ్రిటిషు మిల్లువ్యాపారము అచట లక్షలకొలది జనులకు లాభకరముగ ఉన్నది; మరియు, అది యచటి యితరపరిశ్రమలకును చాలసహకారి. ఆపారిశ్రామికులును వారి చెప్పుచేతలలో నుండు పార్లమెంటు సభ్యులును ఇంగ్లండులో ప్రభుత్వమును ఒత్తిడిచేసిరి. వారంతట మనదేశపు ప్రభుత్వమును ఈదిగుమతి సుంకమును తొలగింప నిర్భంధించిరి. (ఇప్పటి రాజ్యాంగవిధానమునుబట్టి మన భారతప్రభుత్వము లండనులో నున్న భారతమంత్రి కెప్పుడును లోబడియుండును. ఆమంత్రి బ్రిటిషుమంత్రివర్గములోనివాడు; ఆయన బ్రిటిషుపార్లమెంటువారి యిష్టప్రకారమే నడుచుకొనవలెను. లేనిచో వా రతనిని, మనదేశములో గవర్నరుజనరలు మున్నగు పెద్ద ఉద్యోగులను గూడ, మార్పించగల్గుదురు; వారిజీతములగూడ తగ్గింపగల్గుదురు. మనప్రభుత్వము మనప్రజల కెంతమాత్రము బాధ్యులు కారు. వా రింగ్లండులోని బ్రిటిషుపార్ల మెంటుకే జబాబుదారులు.) బ్రిటిషుప్రభుత్వమువారు చేసిన యాయొత్తిడివలన మన ప్రభుత్వమువారు తా మిదివరలో హర్షల్‌కమిటీ సలహాప్రకారము విధించిన దిగుమతిపన్నులను బ్రిటనునుండి వచ్చు నూలుపైనను, బట్టలపైనను రద్దుచేయవలసి వచ్చెను. కాని ఆసరుకులే మనదేశపు దిగుమతులన్నిటిలో సగముకన్న హెచ్చుకిమ్మతు వగుటచే, వాని మినహాయింపువలన తిరుగ మనప్రభుత్వపు ఆదాయము చాల తగ్గి, ఆర్ధికబాధ కల్గెను. ఈసంగతినంతను మనవిచేసి నూటికి 3 1/2 వంతున తగ్గింపు రేటుగనైనను వానిపై గూడ పన్ను విధింపనిండని, మనప్రభుత్వమువారు తమ కధికారులైన బ్రిటిషుప్రభుత్వమును కోరిరి. అంత రేటు పన్నును భారతదేశపుమిల్లులలో తయారగు నూలుపైన బట్టలపైనగూడ విధింపవలెనని, అట్లైననే దిగుమతియగు సీమనూలు బట్టలపైనను పన్నువిధింపవచ్చునని, బ్రిటిషుప్రభుత్వమువారు తెల్పిరి. అంతట బ్రిటిషునూలుపై విధించురేటున 3 1/2 చొప్పున, మన మిల్లులలో తయారగు నె 20 రుకు పైబడిననూలు అంతటిపైన (బట్టలపైనను) వెంటనే మన ప్రభుత్వమువారు పన్ను విధించి, వసూలుచేసిరి. బ్రిటిషు మిల్లునూలు 60 న నెంబరుకు పైబడి చాల సన్నగనుండును. దానికి మన ముదుకు నూలుతో పోటీ యుండదు. అందుచే కేవలము ముదుకయగు నె 20 రు లోపునూలుకు మాత్ర మాపన్ను అక్కరలేకుండ బ్రిటిషుప్రభుత్వము సమ్మతించెను.

ఈదేశపు సరుకులపై నీపన్ను వేయుటచే నప్పుడాందోళనకలిగెను. అమ్మకమై సీమనుండి దిగుమతియగు సరుకుపై పన్ను విధించినందుకుగాను, మనమిల్లుసరుకుల కమ్మకము లేకున్నను మిల్లులో నుత్పత్తికాగనే మన సరుకులకును పన్ను తగు లును; బ్రిటనులోవలె గాక, ఈదేశపు మిల్లువ్యాపార మింకను బాల్యదశలో నుండెను. దానికి చాల కష్టములుగలవు. ఈపన్ను అన్యాయమని విశదముచేయుటకు మిల్లుయజమానిసంఘము తరపున జంషెడ్జితాతా ఎన్ వాడియాగార్లు ప్రతినిధులుగ వెళ్ళిరి. వా రాసందర్భములను భారతప్రభుత్వపు ఉద్యోగులకు చక్కగ నివేదించిరి. కాని ఆప్రభుత్వమువా రందలినిజమును గ్రహించినను; తాము బ్రిటిషుప్రభుత్వము కధీనులగుటచే నేమియు చేయలేమని తెల్పిరి. భారతప్రభుత్వమువా రీదేశపు ప్రతినిధుల యొక్కయు, ఇచటి శాసనసభలయొక్కయు, తీర్మానము నంగీకరించు బాధ్యతలేదు. కాని బ్రిటిషుప్రభుత్వపు ఆజ్ఞల నిరాకరించుటకు వారికధికారము లేదు.

ఈపరాధీనస్థితి తెలిసి, తాతా ఆంగ్లదేశము పోయి, అచట భారతమంత్రితో నీవిషయమును తీవ్రముగ చర్చించెను. అచట మిల్లునూలుపైన బట్టలపైన పన్ను లేదు; పైగా, ఇదివరలో ఆమిల్లులకు బ్రిటిషుప్రభుత్వము చాలరీతుల సాయము చేసియుండెను. అచటి కార్మికులు, నాయకులు గూడ, అప్పటి కావ్యాపారమం దారితేరి గొప్ప నిపుణులైరి. వారు శ్రీమంతులు, అందరును విద్యావంతులు; అవసరమగు విజ్ఞానమును నేర్పు పాఠశాలలు, యంత్రశాలలు, అచ్చట చాలగలవు. ఆదేశ ముష్ణముకాదు; అచటిజనులు చాల దృఢగాత్రులు, ఓర్పుతో నెక్కువపని చేయగలరు. ఆంగ్లదేశము క్రమముగ అన్ని యంత్ర పరిశ్రమలకు ద్రవ్యముకు వ్యాపారసౌఖ్యములకును ఆలవాలమైనది. అచటి మిల్లులకుదగ్గరనే చౌకయగునేల బొగ్గును కలదు. భారతదేశపు మిల్లుపరిశ్రమకో ప్రభుత్వసహాయ మెన్నడును లేదు. కార్మికులకు తగు జ్ఞానము, ప్రజ్ఞ, శక్తి, ఓర్పు, లేవు; యంత్రములను విదేశములనుండి హెచ్చుధరకు రప్పింపవలెను; వ్యాపారులకు పెద్దపరిశ్రమలకై తగినంత మూలధనము లేదు.*[1] బొంబాయిమున్నగు మిల్లుస్థలముల సమీపమున నేలబొగ్గుగనులు లేవు. మరియు సాధారణముగ, ఇచటిమిల్లుయంత్రములు ముదుకనూలునే తీయగలవు. ఈస్థితిలో, ఈమిల్లులకు బ్రిటిషు మిల్లులకు నిజమగు పోటీయుండదు. ముదుకబట్టలవేయు చీనా జపానుల మిల్లులతో మాత్రము భారతదేశపు మిల్లులకు పోటీ యుండును. జపానుప్రభుత్వము తమదేశపు మిల్లులకు చాల సాయముచేయును; ఆమిల్లుల కనేక సదుపాయములును కలవు. కనుక భారతదేశపు నూలుపై వేసిన పన్ను ఈదేశీయులకు నష్టకరము; జపానీయులకు లాభకరము నగును.†[2] బ్రిటిషుపరి శ్రమల రక్షణ కాపన్ను అవసరముకాదు. ఇట్లీసంగతులన్నిటిని లండనులో భారతమంత్రియగు హమిల్టనుప్రభువుకు తాతా సవిమర్శముగ వివరించెను.

అంతయువిని హమిల్టనుప్రభువు భారతదేశపు మిల్లులకు హెచ్చులాభము వచ్చుచున్నదని, అందుచే నీపన్నువలన బొంబాయిమిల్లులకు బాధయుండదని, జవాబుచెప్పిరి. సగటున నూటికారుకన్న హెచ్చులాభము లేదని, చాలమిల్లుల కంతవరకుగూడ లాభములేక నష్టముకూడ పొందుచున్నవని, తాతా జవాబునిచ్చెను; ఆసంగతికి నిదర్శనము కావలెనని భారతమంత్రి కోరగా, తాతాగారట్లేయని మనదేశముకు వెంటనే తిరిగివచ్చి, 1897 లో మనదేశపు మిల్లులన్నిటి జమాఖర్చులను సరిగా తేల్పించి, వానినుండి నిరాక్షేపణగ లెక్కల తయారుచేసెను; వానిని తానే యచ్చువేయించి, ఆంగ్లమంత్రులకును ఇతరప్రముఖులకును పంపెను. మన మిల్లులలో చాలవానికి లాభమతి స్వల్పమని, కొన్ని కేవల దుర్దశలోనున్నవని, ఆలెక్కలచే స్పష్టమయ్యెను; కాని యెట్లైన నాపన్నురద్దుచేయుట కాంగ్లపారిశ్రామికులు, అచటి ప్రభుత్వమును, ఒప్పుకొనలేదు. అప్పుడు పోటీ లేకున్నను, ముందైనను భారతదేశపు మిల్లులు బాగుగ వేద్ధియైనంతట, తమమిల్లు సరుకుల దిగుమతి తగ్గునేమో యని వారిభయము. ఇట్లు మనప్రతినిధిగ తాతా చేసిన వాద మరణ్య రోదనమయ్యెను; కాని యీ యార్ధికసమస్యచర్చ జనులలో చాల ఆందోళనను విమర్శను కల్గించినది.

*[3]


_________
  1. * పాశ్చాత్యదేశములందు గొప్ప భూస్వాములు ఉద్యోగులు తమ నిలవసొమ్మును యంత్రపరిశ్రమల పెట్టుబడికి వినియోగింతురు. మనజమీందారులు సంస్థానాధిపులు, గొప్ప ఉద్యోగులు, సాధారణముగా అట్లు చేయక, తరుచు వ్యర్ధముగనే ఖర్చుచేయుదురు.
  2. † ఈపన్ను భరించి మన మిల్లుబట్టలు చీనా కెగుమతియై, అచట హెచ్చుధర కమ్మవలసివచ్చెను. జపానుసరుకులు ప్రత్యేకనౌకలపైన ప్రభుత్వ సహాయమున పోటీగ తక్కువ కిమ్మతు కమ్ముచుండెను. అందువలనను, మనదేశజనులకును గూడ, ఈపన్నుచే నష్టమే కలిగెను. క్రమముగ జపానుబట్టలు వ్యాపించెను.
  3. * ఈపన్ను వేయుట చీనాలో జపాను మిల్లుబట్టల వృద్ధికి సహకారియైనది. జపాను బట్టలు చీనాలో మనమిల్లు బట్టలతో పోటీ సల్పుటయే గాక, క్రమముగా మనదేశముకు ఆఫ్రికామున్నగు ప్రాంతములకు కూడ వ్యాపించి, బ్రిటిషు మిల్లు సరుకులతో తీవ్రముగ పోటీచేయుచున్నవి. ఇట్లు బ్రిటిషుప్రభుత్వము నిర్బంధముగ ఈదేశపు మిల్లులపై విధింపజేసిన పన్ను, ఇచటి మిల్లులకే గాక, తుదకు బ్రిటిషువారి వ్యాపారముకును ఒకవిధముగ హానికల్గించెను. ఇంతలో యూరపుమహాయుద్ధముచే, మన ప్రభుత్వపు ఆర్ధికస్థితి మరలచెడెను. మరియు, ఆయుద్ధసమయమున మనప్రభుత్వము వారు బ్రిటిషు ప్రభుత్వముకు 150 కోట్ల రూప్యముల నుచితముగ నిచ్చుట కొప్పుకొనిరి; అప్పటి యుద్ధమున మనసేనలఖర్చును మనఖజానానుండియే భరించిరి. 'ఇట్లు ఖర్చు హెచ్చి ఆదాయము తగ్గగనే, కొత్తపన్నుల వేయవలసివచ్చెను. అంతట బ్రిటిషుప్రభుత్వపు అంగీకారముతో, ఈదిగుమతి పన్నును 1917 లో కొంచెము హెచ్చించిరి. తరువాత నీపన్ను బ్రిటిషుసరుకులపై కొంత హెచ్చు రేటుగను, జపాను మున్నగు ఇతరవిదేశములపైన ఇంకను హెచ్చుగను, ఉండుటకు నిర్ణయమయ్యెను.