తాతా చరిత్రము/కార్మికసమస్య
8. కార్మికసమస్య.
"స్వదేశీమిల్సు" స్థాపితమైనకాలమున, ఆప్రాంతమున ఒక కార్మికసమస్య కల్గెను. 1887 నాటికి బొంబాయి పరిసరమున సుమా రేబదిమిల్లు లేర్పడెను. ఇందొక్కొకమిల్లులో సుమారు వేయిమంది కూలీలు పనిచేయుచుందురు. ఆప్రదేశము పడమటికనుమలప్రాంతము; కొండనేల; అచటి జనసంఖ్య తక్కువ. కొన్ని యేండ్లవరకు బొంబాయి ప్రాంతీయులే కూలికి చాలిరి; కాని మిల్లులు వృద్ధియైనకొలదిని జనులు చాలలేదు; కూలీల గిరాకి హెచ్చెను. హెచ్చుకూలి నిచ్చినను పనివాండ్రు లేరైరి. గుజరాతులోని యహమ్మదాబాదులోను కొన్నిమిల్లు లేర్పడెను. అచటిజను లాప్రాంతమందే సరుదుకొనిరి; కాని కూలికి బొంబాయివరకు రారైరి. స్వస్థలమందే యుండుట మనదేశపు జనసామాన్యమున కలవాటైపోయినది. హెచ్చుజీతముకైనను, ఎరుగని దూరస్థలములకు వెళ్లుటకు మనవా రంతగా సిద్ధపడరు. కాని మిల్లువ్యాపారమునకు కూలిజనులు సమృద్ధిగ కావలెను; కార్మికులు చాలనిచో పని సరిగా జరుగదు; అట్టిచో కూలీలు సరిగా పనిచేయకున్నను, వారు సమ్మె కట్టుదమని బెదిరించినను, వేళకురాకున్నను, యజమానులే వారికి లొంగి యుండవలెను; పనిసరిగ జరుగదు. కనుక, ఇతరప్రాంతములనుండి బొంబాయికి పనివారల రప్పించుట యవసరమని జంషెడ్జితాతా గ్రహించెను. గంగా యమునా పునీతమగు యుక్తప్రాంతమున జనసమ్మర్ద మధికము. అచటికూలి రోజుకొకయణా యుండెను; చాలమంది కావృత్తియు లేదు. తరుచు అచట కరువుండెను. తాతా తన దృష్టినటు మరల్చెను. వృత్తిలేక యల్లాడు యుక్తప్రాంతీయులలో గొందరిని బొంబాయి ప్రాంతమునకు జేర్చినచో, వారికీమిల్లులందు రోజు కారణాలు కూలి లభించును; మిల్లుపనికి వలయునంత మంది కూలీలు నేర్పడుదురు. కాని వారు నిరాధారులైనను స్వగ్రామముల వదలి భిన్నభాషికము దూరస్థము నగు బొంబాయికి తమంతట రా నిచ్చయింపరైరి. కొత్తస్థలమున పరిస్థితు లెట్లుండునో, వృత్తి సరిగా జరుగునో లేదో యని యాయజ్ఞానులు భీతులైరి. వారి పిరికితనము పోగొట్టి ధైర్యోత్సాహములు కల్గింపవలసి యుండెను. ఇట్టిస్థితిలో ప్రభుత్వమువారును పరిశ్రమల యజమూనులును ముందుగా కొందరిని రప్పించి, వారికి తగు వసతిని మంచి జీతమును ఇప్పించెదమని ప్రోత్సహించినచో, ఆవిశ్వాసమున వారు వలసకు వత్తురు. అట్టి ప్రోత్సాహముచే, చాలప్రాంతముల జనులు విదేశములకును పోవుచున్నారు. ముందుగా వెళ్ళిన కొందరు ద్రవ్యము సంపాదించి, అచ్చటస్థితి సుఖకరముగను లాభదాయిగను ఉన్నదని తిరిగివచ్చినప్పుడు తమ గ్రామములవారికి తెల్పినమీదట, ఆగ్రామములజను లీసారి తమంతటనే బయలుదేరి వెళ్ళుదురు. ఇట్లు కలకత్తా జనపనారమిల్లులకు, అస్సాంటీతోటలకు, బర్మా, ఫిజి, నేటాలు మున్నగు విదేశప్రాంతములకు గూడ, మనజనులు వలసకేగియున్నారు. ఆరంభదశలోమాత్రము ప్రోత్సాహముకై ప్రభుత్వ సహాయమును, కలసి తగువసతుల నేర్పర్చుటకై మిల్లు యజమాని సంఘపు సహాయమును, అవసరమని మిల్లుదార్ల సంఘముకును ప్రభుత్వముకును తాతాగారు తెల్పి, వారి సహాయము కోరిరి. తాతా సలహాప్రకారము వారు జరిగించి యుండినచో, అప్పుడు వేలకొలది యుక్తప్రాంతీయులు బొంబాయి ప్రాంతమున పనివాండ్రుగా వలసవచ్చియుందురు. అందుచే యుక్తప్రాంతమున కొంచము జనసమ్మర్దము తగ్గి, ఆప్రాంతములకును బొంబాయి మిల్లులకును గూడ లాభముకల్గియుండును. తాతా తనదీర్ఘ లేఖలో నాసమస్య నంతను విపులముగ చర్చించి, అట్లువలసవచ్చుటచే గల్గుఫలితములను విశదపర్చెను; కాని తాతాగారి దూరదృష్టి తక్కిన మిల్లుదార్లకు కలుగలేదు. ప్రభుత్వసహాయము కోరుడని, వసతికై తగుకట్టుబాట్లచేయుడని, తాతాసూచించినను, మిల్లు యజమాని సంఘమప్పుడు శ్రద్ధవహింపలేదు. కార్మీకసమస్య కాలక్రమమున తనంతటనే పరిష్కారమగుచుండునని, అందుకు ప్రత్యేకప్రయత్న మక్కరలేదనియు, వారు తాతాగారి లేఖకు జవాబునిచ్చిరి. ఇట్లాసంఘము అశ్రద్ధతోనుండుటచే, ప్రభుత్వమునుపేక్షించెను; ఒక్క తాతాగారి కోరికపైననే అట్టి యుద్యమముకు పూనుట ప్రభుత్వము కిష్టముకాలేదు. తరువాత కొలదికాలముకే తాతా చెప్పినదంతయు మిల్లుదార్లందరకనుభవముకు వచ్చెను; మిల్లులు వృద్ధియై, బొంబాయి ప్రాంతమున కార్మికుల గిరాకి చాలహెచ్చెను. కూలీలు చాలక, మిల్లుపనిలో చాల చిక్కులు కల్గెను. ఆ మిల్లుదార్లప్పుడు తాతా దూరదృష్టికి విస్మితులైరి; ఆయవకాశమును గోల్పోయినందుకు, తాతా సలహా విననందుకును, వారు తరువాత విచారించిరి.
- __________