తత్త్వముల వివరము/8వ తత్త్వము
---------------8. తత్త్వము---------------
మూడుకాల్వలు దాటలేరయ్యా ఇల మూఢజనులు మూడుకాల్వలు దాటలేరయ్యా
మూడుకాల్వలతోను కూడుచు ఇడపింగళ మద్యమంబున చేరివుండని మూఢు లెల్లరు
1. ఓడ లేకను ఈద బొయ్యేరు - సంసారవారధిలో జాడ తెలియక మునిగిపొయ్యేరు
ఆత్మజ్ఞానమను ఓడనెక్కి - ఏడుకొండలు దాటలేని మూఢులెల్లరు ||మూడు కాల్వలు||
2. బండరాల్లకు మ్రొక్కబొయ్యేరు - అజ్ఞానపూజలు చేయపూనెరు
చేతిలోని జ్ఞానమెరుగక - చేతులెత్తి మ్రొక్కు మూఢులెల్లరు ||మూడు కాల్వలు||
3. బాధగురువుల పంచచేరేరు - బోధనెరుగక ఘోరముగ మోస పొయ్యేరు
బోధలోని జ్ఞానమెరుగక - తత్త్వమంత తెలుసునను మూఢులెల్లరు ||మూడు కాల్వలు||
4. వేదమంత్రములు గొనుగ నేర్చేరు - బాహ్యయజ్ఞములు చేయపూనేరు
మంత్రములోని మర్మమెరుగక - యజ్ఞములోని చావ తెలియని మూఢులెల్లరు ||మూడు కాల్వలు||
5. ఉపదేశమంటు ఊర్లు తిరిగేరు - సన్యాసమంటు భార్యపిల్లల వదలిపొయ్యేరు
ఉపదేశములోని ప్రదేశము తెలియక - సన్యాసములోని సారము తెలియని మూఢులెల్లరు ||మూడు కాల్వలు||
6. రాగముల భజన చేయపూనేరు - సన్మార్గులను లెక్కచేయక మాటలాడేరు
భజనలోని మర్మమెరుగక - సన్మార్గులలోని జ్ఞానమెరుగని మూఢలెల్లరు ||మూడు కాల్వలు||
వివరము : మూడు కాల్వలేమి ఆరు కాల్వలైన దాటగలమనువారు గలరు. బాహ్యముగ ఉన్న కాల్వలైతే ఎన్ని అయిన దాటవచ్చును. కాని ఇక్కడ చెప్పినది బయటి కాల్వలు కాదు. అంతరంగములోనున్న కాలువలు. మనిషి ఎప్పుడు బయటి విషయములనే చూస్తుంటాడు, యోచిస్తుంటాడు. తన శరీరములోపలికి ఎప్పుడు ఆలోచించడు, కావున అంతరంగము యొక్క విషయము చాలామందికి తెలియకుండపోయినది. బయట ఒక పేరుకల్గి సంచరించు మనిషి తన శరీరమును చూచుకొని శరీరమే తానని భ్రమించుచున్నాడు. వాస్తవానికి శరీరము వేరు నేను వేరని తలవడము లేదు. నేను అనుకొనువాడు జీవుడు కాగ, శరీరము జీవుడు నివశించుటకు ఇల్లువలె ఉన్నది. శరీర గృహములో నివశించు జీవుడు కొంత జ్ఞానము తెలుసుకొన్నపుడే తాను వేరు శరీరము వేరని తెలియగలడు. తానువేరని తెలిసిన తరువాత శరీరములో తానెట్లు నివశిస్తున్నది, ఎలా వ్యవహరించుచున్నది తెలియగలడు. అపుడు తాను నివశించు శరీరము ఒక యంత్రములాంటిదని, యంత్రములో ఎన్నో భాగములున్నట్లు శరీరములో కూడ ఎన్నో భాగములున్నవని తెలియు చున్నది. అంతేకాక శరీరములోని భాగములు ఒక్కొక్కటి ఒక్కొక్క విధముగ పనిచేయుట వలన తాను శరీరములో నివశించగల్గుచున్నానని కూడ తెలియుచున్నది. ఇలా తెలుసుకొంటూపోతే ఎన్నో రహస్యములు తెలియగలవు.
మన శరీరములో మూడు విధములైన గుణ భాగములున్నవని, ఒక్కొక్క భాగములో పండ్రెండు గుణములు గలవని వాటి ప్రభావము వలన యోచించగల్గుచున్నామని తెలియగలడు. మానవుడు దేవుని వైపు పోకుండుటకు ఈ మూడు గుణభాగములే పెద్ద ఆటంకము. వీటినే మాయ అనికూడ అందుము. ప్రయాణికునికి దాటలేని కాలువలు అడ్డమైనట్లు, దైవమార్గములో పయణించు వానికి మూడు గుణములు దాటలేని మూడు కాల్వలుగ అడ్డమైవున్నవి. మూడు గుణములను జయించడము దుస్సాద్యమైన పనియని భగవద్గీతలో కృష్ణుడు కూడ " గుణమయి మమ మాయా దురత్యయా " అన్నాడు. గుణరూపములో ఉన్న మాయను దాటడము దుస్సాద్యమైన పని అని దీని అర్థము. తామస, రాజస, సాత్త్వికమను మూడు గుణములనే ఈ తత్త్వములో మూడు కాలువలన్నారు. కొంత జ్ఞానమున్నవారే దాటుటకు సాధ్యముకాని గుణములను జ్ఞానములేని మూఢులు ఏమాత్రము దాటలేరు. కావున మూడు కాల్వలు దాటలేరయ్యా ఇల మూఢజనులు మూడు కాల్వలు దాటలేరయ్యా అన్నారు.
1. ఓడ లేకను ఈద బొయ్యేరు - సంసారవారధిలో జాడ తెలియక మునిగిపొయ్యేరు
ఆత్మజ్ఞానమను ఓడనెక్కి - ఏడుకొండలు దాటలేని మూఢులెల్లరు ||మూడు కాల్వలు||
ఒక నదిని దాటుటకు చిన్న తెప్ప అవసరము. అట్లే సముద్రమును దాటుటకు ఓడ అవసరము. సంసారమను అతిపెద్ద సముద్రమును దాటుటకు బలమైన జ్ఞానమను ఓడ అవసరము. ఇప్పటి కాలములో ప్రజలు ఏమాత్రము జ్ఞానములేనివారై సంసారసాగరమును ఈదబోయి దానిలోనే మునిగిపోవుచున్నారు. సంసారమునుండి గట్టెక్కవలయునంటే ఆత్మజ్ఞానమను ఓడ అవసరము. ఆత్మజ్ఞానమును తెలిసిన వాడు సంసారములో ఉండినప్పటికి దాని చిక్కులలో చిక్కుకొనక అంతరంగము లోని ఏడుకొండలనబడు సప్తనాడీకేంద్రములను దాటి అవతలనున్న ఆత్మను తెలియగలడు. ఈ విషయమును తెలియజేయుటకు పై తత్త్వములో "ఓడలేకను ఈదబొయ్యేరు సంసారవారధిలో జాడ తెలియక మునిగి పొయ్యేరు ఆత్మజ్ఞానమను ఓడనెక్కి ఏడుకొండలు దాటలేని మూఢులెల్లరు మూడుకాల్వలు దాటలేరు " అన్నారు.
2. బండరాల్లకు మ్రొక్కబొయ్యేరు - అజ్ఞానపూజలు చేయపూనెరు
చేతిలోని జ్ఞానమెరుగక - చేతులెత్తి మ్రొక్కు మూఢులెల్లరు ||మూడు కాల్వలు||
ప్రపంచములో కృతయుగములోనే మనుషులకు జ్ఞానము తెలియ జేయు నిమిత్తము ప్రతిమలనువుంచి పూజించారు. అలా మొట్టమొదట తయారైన ప్రతిమ శివలింగము, తరువాత పాండురంగని ప్రతిమ. ఒకటి నిరాకారమును తెలియజేయుటకు లింగము పెట్టగా, రెండవది సాకారమును తెలియజేయుటకు ఉంచినది రంగని ప్రతిమ. ఈ రెండు దేవాలయములే సాకార, నిరాకార అర్థముతో కూడుకొన్నవి. ఈ రెండు దేవాలయములు మినహా ఏ దేవాలయములు పూర్వము ఉండెడివి కావు. కాలక్రమమున అజ్ఞానము పెరిగిపోయి ఎన్నో దేవాలయములు తయారైనవి. నిరాకార పరమాత్మకు సాకార భగవంతునికి చిహ్నములైన రెండు దేవాలయములను ఎవరు గుర్తించలేకపోయారు. అర్థమున్న దేవాలయములను అర్థములేని దేవాలయములలోనికి కలిపివేశారు. జ్ఞానము తెలిసిన పెద్దలు ఇప్పటికి మొదటి రెండు ఆలయములే జ్ఞానముతో కూడుకొన్నవని తర్వాత తయారైనవన్ని జ్ఞానభావములేనివని చెప్పు చుందురు. అందువలననే కనిపించిన రాయికంత మ్రొక్కవద్దని చిల్లర రాల్లకు మ్రొక్కుచువుంటే చిత్తము చెడునుర అన్నారు. నేటి పూజలు కూడ అర్థములేనివై అందరు ఎట్లు చేస్తుంటే అట్లు చేయవలెనని చేస్తున్నారు తప్ప వాటి అర్థము పూర్తి తెలియదు. అందువలన అర్థములేని అజ్ఞాన పూజలు చిల్లర దేవుల్లకు చేస్తుపోతున్నారు. అందువలన ఈ తత్త్వములో "బండరాల్లకు మ్రొక్కబొయ్యేరు, అజ్ఞాన పూజలు చేయపూనేరు" అని అన్నారు. పరమాత్మ నిరాకారమును భగవంతుని సాకారమును తెలియజేయు నిమిత్తము, పూర్వము తెలిసిన జ్ఞానులు ముక్కుముఖము ఆకారములేని లింగమును, ముక్కుముఖమున్న ప్రతిమను తయారుచేసియుంచినట్లు, అంతరంగములోని జీవాత్మ, ఆత్మ, పరమాత్మల వివరము తెలియునట్లు, దేవుడే మానవుని అరచేతిలో మూడు రేఖలు అమర్చి పుట్టించాడు. ప్రతిమ ఆకారమున్న నామాల దేవుడైన ఆలయములలో ఇదే విషయమును తెలియజేయునట్లు హస్తమును చూపుచు ప్రతిమ ఆకారముండును. హస్తములో ఎంతో జ్ఞానమున్నదని పూర్వము పెద్దలు కూడ చెప్పెడివారు. అందువలన ఉదయము నిద్రలేస్తూనే ఎవరి ముఖము చూడక ముందే తన హస్తములోని రేఖలను చూచుకొమ్మని చెప్పెడివారు. చేతులలో ఆత్మ పరమాత్మల జ్ఞానమున్నదని తెలియక, చిల్లర దేవుల్లకు హస్తము లెత్తి మ్రొక్కుచున్నారు. అందువలన ఈ తత్త్వములో "చేతిలోని జ్ఞాన మెరుగక చేతులెత్తి మ్రొక్కు మూఢలెల్లరు మూడు కాల్వలు దాటలేరయ్యా" అన్నారు. అందువలన పెద్దల మాట ప్రకారము హస్తములోని ఆత్మ పరమాత్మల వివరము తెలిసి, అట్లే గుడులలోని సాకార నిరాకార గుర్తులైన రెండు గుడులను తెలిసి పూజలు చేస్తాము.
3. బాధగురువుల పంచచేరేరు - బోధనెరుగక ఘోరముగ మోస పొయ్యేరు
బోధలోని జ్ఞానమెరుగక - తత్త్వమంత తెలుసునను మూఢులెల్లరు ||మూడు కాల్వలు||
దేశములోని గురువులందరు ఏదో ఒక బోధ చెప్పుచున్నప్పటికి అందరిని బోధగురువులనుటకు వీలులేదు. బోధలు చెప్పు గురువులలో కూడ బోధగురువులు, బాధగురువులని రెండు రకములు కలరు. బాహ్యముగ శరీరమునకు, అంతరంగమున మనస్సుకు పనిని కల్పించు ఎటువంటి బోధలు చెప్పువారైన బాధగురువులే అగుదురు. శరీరమునకు మనస్సుకు పనిలేని బోధలు చెప్పువారే బోధగురువులగుదురు. శరీరము, మనస్సు పనులలో లగ్నమైనపుడు ప్రపంచమే తెలియును కాని ఆత్మ తెలియదు. బయట శరీరము, లోపల మనసు పనిని మానుకొన్నపుడే ఆత్మ తెలియబడు బ్రహ్మయోగమగును. అట్లుకాక వ్రతక్రతువులు, యజ్ఞ యాగములు, వేదాపఠనములు, దానములు, మంత్రబోధతో కూడిన తపస్సులను బోధించువారు బాధగురువులే అగుదురు. అందువలననే భగవద్గీతలో కూడ యజ్ఞముల వలన, వేదాధ్యాయణము వలన, దానము వలన, తపస్సుల వలన దేవుడు తెలియబడడని విశ్వరూప సందర్శన యోగమను ఆధ్యాయములో 48వ శ్లోకమున మరియు 53వ శ్లోకమున చెప్పబడియున్నది.
ఈ విధముగ బాధ బోధ గురువులుండగ జ్ఞానమును తెలుసు కోవాలనుకొన్న ప్రజలు గురువులను గుర్తించలేక, జ్ఞానములోని తారతమ్యములు తెలియక ఆధ్యాత్మికవిద్యలో ఘోరముగ మోసపోవుచున్నారు. అట్లు మోసపోయినవారు తాము తెలుసుకొన్నది బాధబోధ లేక ఆత్మబోధ అని తెలియక, తమకు అంతా తెలుసునను అహముతో దేవున్ని దేవుని జ్ఞానము పూర్తిగ తెలుసునని చెప్పు కొంటున్నారు. ఇటువంటివారు ఎప్పటికి తమలోని ఆత్మను తెలియలేరు. అందువలన ఈ తత్త్వములో "బాధ గురువుల పంచచేరేరు, బోధ తెలియక ఘోరముగ మోసపొయ్యేరు, బోధలోని జ్ఞాన మెరుగక తత్త్వమంత తెలుసునను మూఢులెల్లరు మూడు కాల్వలు దాటలేరయ్యా " అన్నారు.
4. వేదమంత్రములు గొనుగ నేర్చేరు - బాహ్యయజ్ఞములు చేయపూనేరు
మంత్రములోని మర్మమెరుగక - యజ్ఞములోని చావ తెలియని మూఢులెల్లరు ||మూడు కాల్వలు||
దైవ పూజలలో ఆధ్యాత్మికవిద్యలో మంత్రమునకు యజ్ఞమునకు విశేషమైన విలువగలదు. అందువలన ఎన్నో మంత్రములు నేర్చి దైవపూజలు, ఎన్నో యజ్ఞములు చేసి దైవశాంతులు చేయుట నేటి సమాజములో అదియు కొందరిలో పాదుకొని పోయిన ఆచారములు. ఏమి చేయక పూర్తి అజ్ఞానముతో చాలామందివుండగ వారికంటే మేము గొప్పయని, జ్ఞానులమని మంత్రపఠనములు, యజ్ఞములు చేయువారు కలరు. ఏ పూజలు చేయని వారికంటే మంత్రములతో పూజచేయువారు యజ్ఞములు చేయువారు గొప్పగ కనిపిస్తున్నప్పటికి దానివలన దైవము తెలియబడదని భగవద్గీతలో కూడ చెప్పారని పైన వ్రాసుకొన్నాము. అటువంటపుడు యజ్ఞములకు మంత్రములకు విలువలేదా అని అడుగ వచ్చును దానికి మా సమాధానము ఏమనగా!
యజ్ఞములకు మంత్రములకు ఎంతో విలువ ఉన్నది. కాని అవి మీరనుకొన్నట్లు అందరు చేయు యజ్ఞములు కావు, అట్లే మంత్రములు కూడ అందరు అనుకొన్నట్లు పఠించునవి కావు. బ్రహ్మవిద్యాశాస్త్రము ప్రకారము మంత్రమునకు యజ్ఞమునకు ప్రత్యేక అర్థము అనుభవము కలదు. మంత్రమనగా తనకు తాను పఠించబడునది, యజ్ఞమనగా తనను తాను జరుగబడునది. మనిషి పఠించకనే ఉచ్చరించబడునది మంత్రము, అలాగే మనిషి చేయకనే చేయబడునది యజ్ఞము. ఇదెక్కడి వింత అనుకోవద్దండి, ఉన్న సత్యము అంతే. ఈ విషయము తెలియకనే అందరు పొరబడుచున్నారు. అందువలన గీతలో కూడ బాహ్య యజ్ఞముల వలనకాని, బాహ్యమంత్రముల వలన కాని దేవుడు తెలియబడడని తేల్చి చెప్పారు. యజ్ఞములకు మంత్రములకు ప్రత్యేక అర్థము విలువ ఉన్నదని చెప్పారే అని మమ్ములను ప్రశ్నించితే ఆ మాట వాస్తవమే. యజ్ఞములు మన శరీరములో మన ప్రమేయము లేకుండనే ప్రతి నిత్యము జరుగుచున్నవి. అలాగే మంత్రము ప్రతి నిత్యము మన శరీరములో మన ప్రమేయము లేకుండ జపించబడుచున్నది. శరీరములో రెండు రకముల యజ్ఞములు జరుగుచున్నవి. అనేక మంత్రములు మ్రోగుచున్నవి. యజ్ఞములలో శ్రేష్టమైన యజ్ఞము ఒకటి, మంత్రములలో శ్రేష్టమైన మంత్రమొకటి కలదు. యజ్ఞములలో జ్ఞానయజ్ఞము, మంత్రములలో ఓం శబ్దము శ్రేష్టమైనవి. ఏ మనిషి అయినకాని జ్ఞానయజ్ఞమును చేయుట వలన, ఓం మంత్రమును స్మరించుట వలన కాని ముక్తి పొందవచ్చును.
బాహ్యయజ్ఞముల చేత, బాహ్యమంత్రముల చేత పొందని మోక్షమును అంతరంగమున స్వయముగ ఆత్మ చేయు జ్ఞానయజ్ఞములో నీవు (జీవుడు) ఆత్మతో కలసి చేసితే కర్మ కాలిపోవును. అలాగే అంతరంగమున స్వయముగ ఆత్మ జపించు ఓం అక్షరము నీవు (జీవుడు) ఆత్మతో కలిసి జపించుట వలన ముక్తి పొందవచ్చును. ఈ రహస్యము తెలియక మంత్రములోని మర్మమును, యజ్ఞములోని సారాంశమును తెలియనివారు మూడు గుణములలోనే చిక్కుకొని కర్మ సంపాదించుకొనుచుందురు. మంత్రము మనలోనే గలదని తెలియక స్వార్థముకొరకు బయటి మంత్రములకు అలవాటుపడినారు. స్వార్థముతోనే పఠించుచున్నారు. ఎన్నో కోట్ల సంవత్సరముల నుండి విశ్వమును స్థాపించి నడిపించు దేవున్ని మరచిపోయి, కొద్ది కాలము ఉండిపోవు జీవితమును గొప్పగ ఎంచుకొని, దానిలోని బ్రతుకే విలువైనదని బ్రతుకుట కొరకు, బ్రతుకు తెరువులో లాభము కొరకు, మంత్రములుచ్చరించడము యజ్ఞములు చేయడము జరుగుచున్నది. వ్యాపారస్తుడు అంగడికి (కొట్టుకు) వేయబడిన తాళముకు మ్రొక్కుచున్నాడు, వాకిలికి మ్రొక్కుచున్నాడు, లోపలికి పోయి అన్య దేవతలకు మొక్కుచున్నాడు. అసలైన దేవున్ని, అన్నిటికి ఆధారమైన దేవున్ని, తనను నడిపించు దేవున్ని మరచిపోవుచున్నాడు. ప్రజలు దేవున్ని మరచి చేయు అజ్ఞాన పనులను స్వార్థపనులను చూచిన పెద్దలు ఈ తత్త్వములో "వేదమంత్రములు గొనుగ నేర్చేరు, బాహ్యయజ్ఞములు చేయ పూనేరు, మంత్రములోని మర్మమెరుగక యజ్ఞములోని చావ తెలియని మూఢులెల్లరు మూడు కాల్వలు దాటలేరయ్యా" అన్నారు. మంత్రముల విషయము తెలియని వారు యజ్ఞముల వాస్తవమును తెలియనివారు మూడు గుణములను జయించలేక ముక్తిపొందలేక జనన మరణచక్రము లోనే చిక్కుకొందురని దీని అర్థము.
5. ఉపదేశమంటు ఊర్లు తిరిగేరు - సన్యాసమంటు భార్యపిల్లల వదలిపొయ్యేరు
ఉపదేశములోని ప్రదేశము తెలియక - సన్యాసములోని సారము తెలియని మూఢులెల్లరు||మూడు కాల్వలు||
మనుషులలో కొందరు తాము గురువు కావాలని కాంక్ష కలిగి యుందురు. అందువలన కొంత జ్ఞానము తెలిసిన వెంటనే, పూర్తి జ్ఞానమును సంపాదించకనే గురువులుగా మారిపోవుచుందురు. అంతటితో ఊరుకోక శిష్యులను సంపాదించుకోవడములో మునిగిపోవుదురు. తాలి కట్టితే భార్య అయినట్లు ఉపదేశమిచ్చితే శిష్యులయ్యె విధానముంది కాబట్టి అడిగిన అడగకున్న ఉపదేశమిచ్చి శిష్యులను చేసుకోవడము పనిగ పెట్టుకొందురు. ఉపదేశమిచ్చు గురువుల పోటి కూడ ఎక్కువగ ఉండుట వలన గురువులే ఊరూరు తిరిగి అక్కడి ప్రజలకు ఉపదేశ మిచ్చుట జరుగుచున్నది. ఒక ఇంటిలో ఒరు గురు ఉపదేశము మీద అసక్తి కనబరిస్తే చాలు ఆ ఇంటికి పోయి ఇంటిలోని వారందరికి బలవంతముగ ఉపదేశమిచ్చు వారు కూడ గలరు. పూర్వకాలము గురువులను వెదకుచు శిష్యులు పోవుచుండెడివారు. ఈ కాలములో గురువులే శిష్యులను వెదకుచు వచ్చుచున్నారు. ఈ విధముగ ఉపదేశమని ఊర్లూర్లు తిరుగుచు గురువులమను భ్రమలో కొందరు గలరు.
అలాగే సన్యాసమంటే మరియు సంసారమంటే అర్థము తెలియని వారు, భార్యపిల్లలే సంసారమనుకొని, వారిని వదలడమే సన్యాస మనుకొని, ఎందరో భార్యపిల్లలను వదలిపోయారు. పూర్వకాలములో గౌతమ బుద్దుడు ఒక సంవత్సరము కొడుకును, చిన్న వయస్సుగల భార్యను సన్యాసమని వదలిపోయాడు. ఆదిశంకరాచార్యులు, వివేకానందుడు సన్యాసమని పెళ్లే చేసుకోలేదు. అప్పటి కాలములోను ఇప్పటి కాలములోను సన్యాసము అంటే సంసారమును వదలడమను అర్థము గాఢముగ ఉన్నది. అందువలన ఇప్పటి స్వాములందరు కషాయగుడ్డలు కట్టి పెళ్లి చేసు కోకుండ కొందరు, ముందే చేసుకొన్నవారు విడిచిపెట్టిన వారు కొందరు గలరు. ఈ విధముగ సన్యాసము తీసుకోవడముగాని, గురువులుగ మారి ఉపదేశమిచ్చుటగాని మంచి పద్దతంటామా అని అడిగితె కొందరు పెద్దలు ఒప్పుకోకుండ ఉపదేశమందు మర్మము, సన్యాసమందు సారము తెలియక పోతే మూడు గుణములు దాటలేవు మాయను జయించలేవు అంటున్నారు. యజ్ఞములు మంత్రములు ఉన్నట్లే గురువులు, గురూపదేశములు రెండు రకములు కలవు. మనుషులు గురువులుగ మారినవారు ఒక రకముకాగ, దేవుడే భగవంతునిగ వచ్చి గురువుగ మారడము రెండవరకము. మనిషి గురువుగ మారితే గురువు అనవచ్చును దేవుడు గురువుగ వస్తే జగద్గురువు అనవచ్చును. ప్రపంచ మంతటికి దేవుడొక్కడే నిజగురువు. అతను మోక్షమునుండి మనిషిగ వచ్చి తిరిగి మోక్షమునకే పోగలడు. కాని మనిషి గురువుగ తయారైనప్పటికి మోక్షమునకు పోతాడను నమ్మకము లేదు. మనుష్య గురువు తాను మోక్షమునకు పోలేని స్థితిలో ఉండి కూడ ఇతరులకు మోక్షము కల్గిస్తానని ఉపదేశమిచ్చి శిష్యులుగ చేసుకోవడము చాలా వింతగ ఉంటుంది. దైవము భూమి మీదకు గురువుగ వస్తే ఎవరికి మంత్రోపదేశము చేయడముగాని, శిష్యులను చేర్చుకోవడముగాని చేయడు. తాను చెప్పవలసిన ధర్మములను మానవాళికి చెప్పిపోవును తప్ప తాను గురువునని కూడ చెప్పుకోడు. ఇట్లు మానవ గురువునకు దైవ గురువునకు ఎంతో వ్యత్యాసముండును. అందువలన ఈ తత్త్వములో ఉపదేశమని ఊర్లూర్లు తిరగవద్దని, ఉపదేశములోని మర్మమును తెలుసుకొమ్మని తెలిపారు.
సంసారము కూడ రెండు రకములుగ కలదు. ఒకటి బయటి సంసారము, మరొకటి లోపలి సంసారము. బయటి సంసారములో సభ్యులు ఇద్దరు నుండి పదిమందివరకు కాని పదిహేను మంది వరకు కాని ఉండగలరు. సామాన్యముగ నలుగురైదుగురు గల చిన్న సంసారములే ఎక్కువగ ఉండును. మనిషి అజ్ఞానములో ఉండినపుడు, శరీరమే తాననుకొన్నపుడు, భార్యపిల్లలనే సంసారమునుకోవడము సహజము. అజ్ఞానుల దృష్ఠిలో భార్యపిల్లలే సంసారము కావున ఇది ఒక రకమైన బయటి సంసారము. ఈ సంసారమును వదలుకోవడము వలన సన్యాసమైతుందని అనుకోవడము పొరపాటు. ఎందుకనగా మనిషి అజ్ఞానములో ఉండి, అజ్ఞానముతో దేహమే నేనను అహముతో, భార్యపిల్లలే సంసారము అని ఊహించుకొన్నది కావున ఇది దేవుని లెక్కలో సంసారము కాదు.
దేవుని లెక్కలోని సంసారము సన్యాసము వేరుగ ఉన్నవి. సజీవ మనిషిలో జీవుడు శరీరములో నివశిస్తున్నాడు. సంసారము జీవునికే కావున జ్ఞానము ప్రకారము శరీరములోపల జీవుడు 24 మందితో కాపురము చేయుచున్నాడు. అనగ రెండు డజన్ల సహచరులతో జీవుడు కాపురము చేయుచున్నాడు. బయటి కాపురము ఎంతమంది ఉండిన లోపలి కాపురము మాత్రము 24 మందితోనే అని చెప్పవచ్చును. శరీరములో తనతోపాటు కాపురమున్నవారే జీవునికి నిజమైన సంసారము. అంతరంగములోని సంసారమును వదలడమే నిజమైన సన్యాసమని భగవద్గీతలో కూడ తెలియబరచబడినది. శరీరములోపల మనస్సు, బుద్ది, చిత్తము, అహము, అలాగే ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, ఐదు వాయువులు, ఐదు తన్మాత్రలు అని మొత్తము 24 తోటి జీవుడు ఉంటూ జీవయాత్ర సాగిస్తున్నాడు. శరీరాంతర్గతములో గల 24 భాగములతో జీవుడు సంబంధము పెట్టుకోకపోవడమే నిజమైన సన్యాసము. దీనివలన యోగప్రాప్తి మోక్షప్రాప్తి కల్గును. అట్లుకాక బయటి వారిని వదలితే లోపలి కర్మతెగదు, మోక్షము లభించదు. పూర్వము స్వాములుగాని, నేటి స్వాములుగాని బాహ్య సంసారమును వదలడము వలన మూడు గుణములు వదలవు. కావున వారు సన్యాసులు కాదని తెలియుచున్నది. అందువలన ఈ తత్త్వములో "సన్యాసమంటు భార్య పిల్లలు వదలి పొయ్యేరు, సన్యాసమందు సారము తెలియని మూఢులెల్లరు మూడు కాల్వలు దాటలేరయ్యా" అని అన్నారు. ఇప్పటికైన తత్త్వములోని అర్థము తెలిసి నిజమైన సన్యాసము తీసుకొందాము.
6. రాగముల భజన చేయపూనేరు - సన్మార్గులను లెక్కచేయక మాటలాడేరు
భజనలోని మర్మమెరుగక - సన్మార్గులలోని జ్ఞానమెరుగని మూఢలెల్లరు ||మూడు కాల్వలు||
గ్రామీణప్రాంతములో భజన చేయడమే ముఖ్యమైన భక్తిగ ఉన్నది. గుడిలో గుంపుగ కూడి అనేక దేవుల్ల కీర్తనలను భజన చేసి అదియే భక్తి అని తృప్తి చెందుచుందురు. గ్రావిూణులకు భజన తప్ప ఏ జ్ఞానము తెలియదు. ఎవరైన గురువులు తోడైనప్పటికి వారు జ్ఞానమును తెలుపక భజనకే ప్రాముఖ్యతనిచ్చుట వలన భజన తప్ప జ్ఞానము తెలియని స్థితిలో వారుండిపోయారు. భజన చేయువారికి ఎందరో దేవుళ్లు తప్ప అందరికి అధిపతియైన దేవుడు తెలియడు. మత్తుత్రాగు వారికి అది అలవాటైనట్లు భజన చేయువారికి కూడ అది ఒక అలవాటైపోవును. భజన చేయువానికి తప్పనిసరిగ భజనకు పోవాలనిపిస్తుంది. ఒక్క రోజుపోకపోయిన అసంతృప్తిగ ఉంటుంది. ముఖ్యముగ వారికి మనమెవరము? ఎవరిని భజించాలి? అసలు భజన అంటే ఏమిటి? అను వివరము తెలియదు. ఇటువంటివారు తమకే నిజమైన భక్తికలదను భావముతో సన్మార్గులను జ్ఞానులను లెక్కచేయక హేళనగ మాట్లాడు చుందురు. ఈ విషయమునే తత్త్వములో "రాగముల భజన చేయ పూనేరు, సన్మార్గులను లెక్కచేయక మాటలాడేరు" అన్నారు.
భజన రాగములతో కూడుకొన్నది కాదని, పాటలభజనకంటే అంతరంగములో జ్ఞానముతో భజించడము గొప్ప అని తెలియదు. పూజించడము భజించడము అను పదములలో మొదటి అక్షరము మాత్రము వేరుగ ఉన్నది. పూజించడము అని పలుకకూడదు, పూజ చేయడము అని పలుకడము సరియైనది. అలాగే భజించడము అని పలుకకూడదు, భజన చేయడము అని పలకాలి. పూజ, భజన అనునవి వాస్తవ పదములు. పూజ అనగా బాహ్యముగ చేయు ఆరాధన క్రమము. భజన అనగ అంతరంగమున చేయు ఆరాధన అని అర్థము. ఇంకను వివరముగ చెప్పుకొంటే పూజ, భజన అను రెండు పదములలోను "జ" కలదు "జ" అనగ పుట్టునదని అర్థము. జ్ఞానము తెలిసి ఆ అర్థముతోనే దేవున్ని బాహ్యముగ ఆరాధించడము వలన అందులో జ్ఞానాగ్ని లేక జ్ఞానశక్తి పుట్టగలదు. అలాగే జ్ఞానము తెలిసి అంతరంగమున ఆరాధించడము వలన అందులో కూడ జ్ఞానశక్తి పుట్టగలదు. కంటికి కనిపించని జ్ఞానశక్తిని బాహ్యముగ పొందడమును పూజ అనియు, అదే శక్తిని అంతరంగమున పొందడమును భజన అనియు పూర్వము అనెడివారు. ఈ కాలములో పూజకు భజనకు అర్థము తెలియకపోయిన దానివలన పూజలు భజనలు అనేక దారులు పట్టిపోయినవి. సన్మార్గులైన జ్ఞానులు జ్ఞానశక్తిని పొందియుందురు. అటువంటి జ్ఞానుల జ్ఞానముగాని, వారిలోని శక్తినిగాని తెలియక హేళనగ మాట్లాడడము వలన తప్పక కర్మ చేకూరును. అందువలన జ్ఞానులలో తెలియకుండ ఉన్నదేదో తెలియనివారు, భజనలో నిజ భజన ఏదో తెలియనివారు మూడు గుణములను దాటలేరు. ఈ విషయమునే తత్త్వములో "భజనలోని మర్మమెరుగక, సన్మార్గులలోని జ్ఞానమెరుగని మూఢులెల్లరు మూడు కాల్వలు దాటలేరయ్యా" అన్నారు.
ఈ తత్త్వమును చూచిన తరువాత గురువులలో బాధ గురువులెవరో, బోధ గురువులెవరో, చిల్లర దేవతలెవరో, దేవ దేవుడెవరో, మంత్రములేవో, యజ్ఞములేవో, ఉపదేశమేదో, సన్యాసమేదో, పూజ ఏదో, భజన ఏదో, అసలు జ్ఞానమంటే ఏమిటో తెలుసుకొనుటకు ప్రయత్నించవలెను.
-***-