తత్త్వముల వివరము/9వ తత్త్వము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

-----------------9. తత్త్వము-----------------


శ్రీగురు చరణారవిందములు నమ్మికొలుతుము అనుదినమూ
ఇదే రీతిగ అదే బోధగ అనుదినమూ కోరితివిూ

 1) ఆగర్భశత్రువుల ఆర్గురిని చంపేవిధమూ తెలియని మాకూ
తేజమైన కత్తుల నిమ్మని కోరితివిూ || శ్రీ గురు ||

 2) ఐదు పడగల పాము విషముతో బాధపడే మాకూ
బోధామృతమనే మందిమ్మని కోరితివిూ || శ్రీ గురు ||

 3) ఏడు కొండలు ఎక్కే మార్గము తెలియని మాకూ
   కంటకములు లేని మార్గము తెలుపమని కోరితివిూ || శ్రీ గురు ||

 4) అండ పిండ బ్రహ్మండము తెలియని మాకూ
      అంతా నిండియుండే వానిని తెలుపమని కోరితివిూ || శ్రీ గురు ||

 5) పుట్టలోని పామును బట్టే విధము తెలియని మాకూ
      పామును పట్టే కట్టుమంత్రము తెలుపమని కోరితివిూ || శ్రీ గురు ||


వివరము : పరమాత్మ సాకార ఆకారమైన భగవంతుడే నిజమైన గురువు. అతనే జగద్గురువు. జగత్తుకంతటికి వర్తించు బోధ తెలియజేయువాడు కనుక ఆయనను జగద్గురువు అంటున్నాము. శరీరములో నివశించు జీవునికి శరీరములో నివశించక పరమాత్మలో కలిసిపోవు జ్ఞానమును తెలుపు గురువు యొక్క పాదములకు నమస్కరించుచు మోక్షము పొందు జ్ఞానమును తెలుపమని కోరుచు ఒకరు "శ్రీగురు చరణారవిందములు నమ్మి కొలుతుము అనుదినమూ, ఇదేరీతిగ అదే బోధగ అనుదినము కోరితిమి" అన్నారు.


 1) ఆగర్భశత్రువుల ఆర్గురిని చంపేవిధమూ తెలియని మాకూ
  తేజమైన కత్తుల నిమ్మని కోరితివిూ || శ్రీ గురు ||

పుట్టుకతోనే మొదలైన శత్రుత్వమును ఆగర్భశత్రుత్వము అంటాము. మొదటినుండి ఉన్న శత్రువును ఆగర్భశత్రువు అంటాము. మన పుట్టుకతోనే మన శరీరములోనే మనలను పాపములలో ముంచి కష్టముల పాలుచేయు ఆరు చెడు గుణములు గలవు. అట్లే పుణ్యములను అంటగట్టి సుఖములందు ముంచు ఆరు మంచి గుణములు గలవు. పుణ్యమును తగిలించు మంచి గుణములను మిత్రులుగ లెక్కించినపుడు పాపములను తగిలించి కష్టముల పాలుచేయు చెడు గుణములను శత్రువులుగ లెక్కించ వలసియున్నది. 1) కామ 2) క్రోధ 3) లోభ 4) మోహ 5) మధ 6) మత్సరమను ఆరు గుణములు మన శరీరములోనే శత్రుపాత్ర వహించుచున్నవి. ఇవి జీవుని పాలిట భీకరమైన బలమైన శత్రువులు. ఈ ఆర్గురు శత్రువులను జయించవలెనంటే జీవునికి జ్ఞానము అవసరము. లోకములో జ్ఞానమను కత్తుల చేతనే గుణములనబడు శత్రువులను జయించవచ్చును. అందువలన ఈ తత్త్వములో "ఆగర్భశత్రువులు ఆర్గురిని చంపే విధము తెలియని మాకు తేజమైన కత్తులనిమ్మని కోరితివిూ" అని ఒక జిజ్ఞాసి అడిగినట్లు గలదు.


 2) ఐదు పడగల పాము విషముతో బాధపడే మాకూ
బోధామృతమనే మందిమ్మని కోరితివిూ || శ్రీ గురు ||

భూమి మీద ఎక్కడైన ఒక పాముకు ఒక తలమాత్రముండును. కాని మన శరీరములో మనస్సు అను పాముకు ఐదు తలలు గలవు. ఒక్కో తలలో ఒక్కో విధమైన విషయమున్నది. మనస్సు ఒకటే అయిన అది జీవునికి అందించు విషయములు ఐదు రకములుగ ఉన్నవి. మనస్సుకు గల ఐదు తలలు వరుసగ 1) కన్ను 2) చెవు 3) ముక్కు 4) నాలుక 5) చర్మము. శరీరములోని ఈ ఐదు ఇంద్రియములు ఐదు రకముల విషయములను జీవునికి అందించుచున్నవి. ఈ ఐదు విషయములతో జీవుడు ఆహర్నిశలు విలవిలలాడి పోవుచున్నాడు. విషమునకు ఏ మనిషైన బాధపడక తప్పదు. అలాగే మనిషిలోని ఐదు పడగల విషమునకు తప్పక బాధపడవలసి వస్తున్నది. విషమునకైతే బాధపడవచ్చునుగాని విషయమునకు ఎందుకు బాధపడవలెనని కొందరు అనుకోవచ్చును. దానికి మా వివరమేమనగా విషము అనునది అందరికి తెలిసినదే. ఆహారమునకు విషమును చేర్చితే విష ఆహారమగును. అట్లే పాణీయమునకు విషమును చేర్చితే విష పాణీయమగును. రెండు పదములలోను "విష" అని చెప్పి విషము అని ఎందుకు చెప్పలేదనగ విష అను రెండక్షరములే పూర్తి అర్థమునిచ్చుచున్నవి. ఒక అర్థముతో ూడిన అక్షరములకు పదము సంపూర్ణమగుటకు "ము" అను అక్షరమును కలుపు కొనుచుందుము. అందువలన విష అను అర్థమునిచ్చు రెండక్షరములను పదము చేయుటకు "ము" ను కలిపి విషము అంటున్నాము.


అలాగే యమ బాధలు అను పదములో యమ అను అర్థమునిచ్చు అక్షరమునకు డు కలిపి యముడు అంటున్నాము. నిజానికి ఈ పదము యమడు అని పలుకవలెను కాని యముడు అని పలుకుట అలవాటై పోయినది. విషము వలన యమలోకమునకు చేరవలసిందే అనగ అక్కడ బాధలు అనుభవించవలసిందే. కావున బాధలను చూచించు యముడు అను పదమును హానిని కలుగజేయు విషము అనుపదమును తీసుకొని విష+యము అను వాటిని కలిపితే విషయము అగుచున్నది. విషయము అను పదములో హానికరమైన బాధలు కలుగజేయునదని అర్థము కలదు. మనస్సను పాము ప్రపంచ విషయమును ఐదు విధములుగ కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము అనువాటి ద్వార తెలియజేయుచున్నది. విషయములోనే హానికరమైన బాధలతో కూడుకొన్న అర్థముండుట వలన ఐదు ఇంద్రియములను ఐదు పాముతలలుగ మనస్సును పాముగ వర్ణించి వాటినుండి హాని కలుగుచున్నదని తెలుపుటకు ఈ తత్వములో "ఐదు తలల పాము విషముతో బాధపడే మాకు" అన్నాడు.


విషమునకు విరుగుడు ఔషదము. మనస్సనెడి పాము పడగల విషమునకు మామూలు మందు సరిపోదు దానికి జ్ఞానమనే మందే విరుగుడు కావున "బోధామృతమనే మందిమ్మని కోరితిమి" అని అన్నారు. దీనిని బట్టి విషయములలో విషమున్నదోయన్న అని కొందరన్నారు. ఇప్పటినుండి విషయములపట్ల బహు జాగ్రత్తగ ఉండవలెను.


 3) ఏడు కొండలు ఎక్కే మార్గము తెలియని మాకు
కంటకములు లేని మార్గము తెలుపమని కోరితివిూ || శ్రీ గురు||

పూర్వకాలములో మొట్టమొదట తయారైన దేవాలయము శివలింగము కలది. తరువాత రెండవది రూపము కల్గిన నామాలప్రతిమ. ఒకటి నిరాకారమైన పరమాత్మకు గుర్తు, రెండవది సాకారమైన భగవంతునికి గుర్తని "దేవాలయ రహస్యములు" అను పుస్తకములో తెలుసుకొన్నాము. మనిషిలో దైవజ్ఞానము వృద్ధి అగుటకు ఈ రెండు దేవాలయములు అవసరమని ఆనాటి జ్ఞానులు వీటిని నిర్మించారు. దైవజ్ఞానము తెలియుటకు ఆనాడు ఎంతో యోచించి సూత్రబద్దముగ, శాస్త్రబద్దముగ తీర్చిదిద్ది తయారు చేయబడినవే రెండు దేవాలయములు. పూర్వము విభూతి రేఖలున్న లింగము, మూడు నామములున్న ప్రతిమ దేవాలయములు తప్ప ఇతర దేవాలయములుండేవి కావు. తర్వాత కొంత కాలమునకు ఈ రెండు దేవాలయముల యొక్క జ్ఞానము వివరము తెలియకుండ పోయినది. వాటి విశేషతను గురించి చెప్పువారు లేకుండపోయారు. ఇటువంటి పరిస్థితిలో మాయకు మంచి అవకాశము ఏర్పడినది. మాయ ప్రేరణతో మనుషులలో అజ్ఞానము పెరిగిపోయినది. అటువంటపుడు రాముని దేవాలయము తర్వాత ఆంజనేయుని దేవాలయము తయారైనవి. వీటి తర్వాత అనేకమైన దేవాలయములు తయారైనవి.


ఆధ్యాత్మిక విద్యలో భారత దేశము మొట్టమొదటిది. ప్రపంచములో అన్ని దేశములకంటే దైవజ్ఞానములో భారతదేశమే ప్రథమ స్థానములో ఉన్నది. మనము నివశించు దేశమునకు మొదట ఇందూదేశమను పేరుండెది. ఆ పేరు కొంత మార్పుతో హిందూదేశమని ఈ రోజుకు పిలువబడుచున్నది. అయినప్పటికి హిందూదేశమునకు భారతదేశమను రెండవ పేరు కూడ కొంతకాలమునకు ఏర్పడినది. వ్యవహరములలో హిందూదేశము అను పేరుకంటే భారతదేశమను పేరే ఎక్కువగలదు. మన దేశము అన్ని దేశములకంటే ఆధ్యాత్మిక జ్ఞానములో మొట్టమొదటిది. కావున ఈ దేశమునకు ఇందూ అని అర్థముతో కూడుకొన్న పేరును కల్గియున్నట్లు ఇందూదేశము అన్నారు. ఆనాటి జ్ఞానులుంచిన మొదటి పేరైన ఇందూ అను అర్థముకాని పదముకాని ఈనాడు లేదు. దైవ జ్ఞానములో ఆనాటికి ఈనాటికి ప్రథమ స్థానములోనే మనమున్నాము. ఇంకను కొంత వివరమును తెలుసుకొంటే ఈ విధముగ గలదు. భారత దేశము ఉత్తరభారతము, దక్షణభారతమను రెండు భాగములుగ ఉండెడిది. ఉత్తర భారతములోని వారికి సంస్కృత విద్యలో పాండిత్యము ఎక్కువగ ఉండెడిది. దక్షణభారతములో ఉన్నవారికి చదువుకాని సంస్కృత పాండిత్యముకాని లేకుండెడిది. కాని ఆధ్యాత్మిక విద్యలో గొప్పగొప్ప జ్ఞానులు దక్షణదేశములో ఉండెడివారు. దక్షణదేశము వారివలననే ఈ దేశమునకు ఇందూదేశమని పేరు వచ్చినది. ఇందూ దేశమంటే జ్ఞానుల దేశమని ఆనాటి అర్థము. ఈనాడు ఆ అర్థము ఏమాత్రము లేకుండ పోయినది. దక్షణ భారతములో ఆనాటి జ్ఞానులు ఆధ్యాత్మికమునకు సంబంధించినట్లుగ బ్రహ్మవిద్యను అనుసరించి దేవాలయములు నిర్మించారు. అందువలన శాస్త్రపద్దతిగ ఉన్న దేవాలయములు దక్షణ భారతదేశములోనే కనిపించును. గాలి గోపురము, ధ్వజస్తంభము, ఏడు ద్వారములు, గర్భగుడి ఇవన్నియు దక్షణదేశములోని దేవాలయము లలో కనిపించును. ఉత్తరదేశములో ఆత్మజ్ఞానులు లేకుండిరి కావున అక్కడ దేవాలయములున్నప్పటికి వాటియందు గాలిగోపురముకాని, ధ్వజస్తంభముకాని, ఏడు ద్వారములుకాని, గర్భగుడికాని ఉండవు. దక్షణ దేశములో ఆత్మజ్ఞానులుండెడివారు, ఉత్తరదేశములో విద్వాంసులుండెడి వారు. కావున ఉత్తరదేశములో సంస్కృతము పాండిత్యము, దక్షణములో ఆత్మజ్ఞానము ఇప్పటికి గలవు. ఇప్పటికి శాస్త్రబద్దమైన పురాతన దేవాలయములు దక్షణదేశములో గలవు. కాలక్రమేపి అజ్ఞానము పెరుగుచు పోవుచున్నది, కావున పురాతన దేవాలయముల అర్థము దక్షణదేశములో కూడ తెలియకుండ పోయినది. అందువలన ప్రస్తుత కాలములో దక్షణ దేశములో కూడ తయారగు దేవాలయములు శాస్త్రబద్దత లేకుండ తయారగుచున్నవి.


దక్షణ దేశములోని ఇందువులు పూర్వము పూర్తి జ్ఞానము కల్గి ఉండుట చేత వారు తయారుచేసిన ఆలయములు జ్ఞాన చిహ్నములై ఉండెడివి. అట్లే వారు చెప్పెడి బోధలు పూర్తి జ్ఞానముతో నిండుకొని ఉండెడివి. అదేవిధముగ వారు వ్రాసిన తత్త్వములను పాటలు ఆత్మజ్ఞానముతో మూర్తీభవించి ఉండెడివి. ఇప్పుడు మనము చెప్పుకొను ఈ తత్త్వము పూర్వపు జ్ఞానులచేత వ్రాయబడినది కావున అందులో ఆత్మజ్ఞానముతో కూడుకొన్న వివరములు గలవు. ఇక్కడ "ఏడుకొండలు ఎక్కే మార్గము తెలియని మాకు కంటకములులేని మార్గము తెలుపమని కోరితివిూ" అని గలదు. పూర్వకాలము జ్ఞానుల ఉద్దేశము ప్రకారము ఏడుకొండలు అనగ మన శరీరములోని ఏడు నాడీకేంద్రములని అర్థము. శరీరములోనే ఆత్మలు నివశిస్తున్నవి. అందులన శరీరములోనే ఆత్మజ్ఞానము కలదు. ఆత్మజ్ఞానము ప్రకారము ఏడు నాడీకేంద్రములను ఏడు ద్వారములుగ, ఏడు కొండలుగ పోల్చి చెప్పారు. శరీరములోని ఆరు నాడీకేంద్రములను అతిక్రమించి ఏడవ నాడీకేంద్రమైన మెదడు భాగములో గల ఆత్మను తెలియవచ్చును. శరీరములో మనస్సును నిరోధించి బ్రహ్మయోగము చేయు యోగులకు అది సాధ్యమైన పని. శరీరములోని ఏడు కొండలైన ఏడు నాడీకేంద్రములను ఎక్కే విధము వివరము తెలియని అజ్ఞానులైన మాకు పూర్తి జ్ఞానము కల్గించి సంశయములను ముల్లులులేని మార్గములను తెలుపమని గురువును కోరినట్లు ఈ వాక్యములోని వివరము.


 4) అండ పిండ బ్రహ్మాండము తెలియని మాకు
అంతనిండియుండే వానిని తెలుపమని కోరితివిూ

అండము అనగ గ్రుడ్డు, పిండము అనగ గర్భము. కనిపించెడి కదలుచున్న జీవరాసులలో కొన్ని అండమునుండి పుట్టుచున్నవి, కొన్ని గర్భమునుండి పుట్టుచున్నవి గలవు. భూమి మీద చరించు జీవరాసులను అన్నింటిని కలిపి అండజములు, పిండజములు అని అంటున్నాము. అంతేకాక కనిపించని జీవరాసులైన సూక్ష్మక్రిములు చలించని జీవరాసులైన చెట్లు ఎన్నో గలవు. మొత్తము విశ్వమంతటిని లెక్కించి చూచితే ఈ జీవరాసులే కాక ప్రకృతి అయిన మహా భూతములనబడు ఐదు పెద్ద జీవులు కూడ కలరు. చిన్న జీవరాసులైన చలించు జీవరాసులను అండ పిండమని పిలుస్తు, అతి పెద్దవైన బలమైనవైన ఐదు జీవుల్లను బ్రహ్మాండమని పిలుస్తున్నాము. మొత్తము విశ్వమంతటిని ఒక్క మాటలో అండ, పిండ, బ్రహ్మాండమని అంటున్నాము. చాలామందికి కొన్ని జీవరాసులు తెలుసు కొన్ని తెలియవు. కొందరికి అండపిండమైన జీవుల్లు తెలిసిన బ్రహ్మాండమైన ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి కూడ జీవుల్లని తెలియదు. అందువలన అండ పిండ బ్రహ్మాండము తెలియని మాకు అని ఈ వ్యాకములో చెప్పబడియున్నది.


అండ పిండ బ్రహ్మాండమని విశ్వమంతటిని కలిపి అంటున్నాము. విశ్వమంత వ్యాపించియుండి విశ్వమంతటికి ఆధారమై కనిపించనిది ఒకటున్నది. దానినే దైవము అంటున్నాము. వెతికిన కనిపించనిది కావున దేవుడు అంటున్నాము అది స్త్రీలింగము కాదు పురుషలింగము కాదు కావున కనిపించనిదని కనిపించనివాడని రెండు రకములుగ అంటున్నాము. అండ పిండ బ్రహ్మాండమును సృష్ఠించి పోషించువాడు దేవుడు. దేవుని చేత సృష్ఠింపబడిన అండ పిండ బ్రహ్మాండమే మనకు అర్థము కాలేదు. ఇక దానిని సృష్ఠించిన దేవుడు ఎంతటి వాడో, ఎటువంటివాడో ఎవరికి తెలియదు. అండ పిండ బ్రహ్మండము ఏమిటో, దానిని సృష్ఠించిన వాడెటువంటివాడో, కొంత వివరము తెలుపమని గురువును కోరినట్లు పై చరణములో గలదు.


 5) పుట్టలోని పామును పట్టే విధము తెలియని మాకు
పామును పట్టే కట్టు మంత్రము తెలుపమని కోరితివిూ

పాము బుసకొట్టే స్వభావము కలది. పాము పుట్టలలో నివాసముంటాయని అందరికి తెలుసు పుట్టలోని పామును పట్టాలంటే కొంత నేర్పరితనము కావాలి. ఆ నేర్చుకోవడము అంతకు ముందు నేర్చుకొన్న వాని దగ్గరనుండే నేర్చుకోవాలి. పామును పట్టుకోవాలంటే దానిని కట్టడి చేయు మంత్రమును తెలుసుకోవలసియున్నది. ఆ మంత్రమును నేర్చుకొనుటకు ఒక మంత్రగానిని ఆశ్రయించవలసిందే. ఇదే విధానము ఆత్మజ్ఞానములో కూడ కలదు. అదేమనగా పుట్ట అనగ శరీరమని తెలియవలెను. పుట్టలోని పాము అనగ శరీరములోని ఆత్మ అని తెలియవలెను. శరీరమను పుట్టలో రెండు రకముల పాములు గలవు. ఒకటి చలాకిగవుండి పుట్టంతయు తిరుగుచు బుసకొట్టుపాము, రెండవది మజ్జుగ ఒక చోటనేవుంటు బుసకొట్టని పాము. రెండు పాములను రెండు ఆత్మలని అనవచ్చును. ఒకటి చురుకుతనము కల్గి కదలుచున్న బుసకొట్టు నాగుపాము. రెండవది చురుకుతనము లేకుండ కదలకుండ బుసకొట్టకుండ ఉండే పూడుపాము. బుసకొట్టే పాము చైతన్యముగల ఆత్మ అనియు, బుసకొట్టని పామే చైతన్యములేని జీవాత్మ అనియు చెప్పవచ్చును. బయట గల మట్టిపుట్టలో ఒకపాము ఉండవచ్చును, కాని శరీరమను పుట్టలో ఎప్పటికి రెండుపాములే ఉండును. మట్టి పుట్టకు రంద్రములెన్ని అయిన ఉండవచ్చును, కాని శరీరమను పుట్టకు తోమ్మిది రంధ్రములు మాత్రమే ఉండును. ఈ విధముగ బయటి మట్టి పుట్టకు శరీరమను పుట్టకు తేడాలు గలవు.


ఆధ్యాత్మిక విద్యరీత్యా ఇక్కడ విశేషమేమిటంటే రెండవదైన బుస కొట్టని పూడుపాము మొదటిదైన బుసకొట్టు నాగుపామును అదిమి పట్టాలి. అనగ కదలని పాము కదిలెడి పామును జయించాలి అని అనుకొందాము. పూడుపాములమైన మనము అనగ శరీరములోనే నివశించు జీవాత్మలము. జీవాత్మతోపాటు శరీరములోనే ఉండి శ్వాస అను శబ్దముతో బుసకొట్టు ఆత్మను తెలుసుకోవాలి. కదలికలేని జీవాత్మ కదలికయున్న ఆత్మను జ్ఞానము అను మంత్రోపదేశము ద్వార తెలియవచ్చును. జ్ఞానమును తెలియజేయు గురువు దగ్గర ఆత్మను తెలియుటకు అడిగిన విధానమే పై చరణములోని పామును పట్టే విధము తెలియని మాకు పామును పట్టే కట్టు మంత్రము తెలుపమని కోరితిమి అన్నారు.

-***-