తత్త్వముల వివరము/7వ తత్త్వము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

---------------7. తత్త్వము---------------


నేజూచినానే బ్రహ్మమునాలో నేజూచినానే సద్గురునాలో నేజూచినానే
నేజూచినానే తలలో తారకయోగమందు రంజిల్లు నాగురుని నేజూచినానే

  
  1. కన్నుల నడుమను సన్నపు దిడ్డిన తిన్నగా వెలిగేటి పున్నమి చంద్రుని నేజూచినానే ||నేజూ||

 2. పాలభాగమందు నీలజ్యోతులనడుమ నోలలాడుచున్న
పరలింగ మూర్తిని నేజూచినానే ||నేజూ||

 3. చూపులోపల పాపల నడుమను వ్యాపించి వెలిగేటి ఆపరంజ్యోతిని నేజూచినానే ||నేజూ||

 4. చక్షురాగ్రమునందు పశ్చిమవీథిని నిక్షేపమై వెలుగు సాక్షిభూతుని
నేజూచినానే ||నేజూ||

 5. చందమామకు నడుమను కుండలాకృతిని ఆనందముగనున్న హరి
గోవిందుని నేజూచినానే ||నేజూ||


వివరము : ఇంతకుముందున్న తత్త్వములో బాహ్యముగ దేవున్ని తెలియ లేము అని తెలుసుకొన్నాము. ఆ విషయము తెలిసిన కొందరు అంతర్ముఖ జ్ఞానమును సంపాదించి బయటి చింతలు వదలివేసి శరీరము లోపలనే ఆత్మను దర్శించుకొన్న విధానమును ఇప్పటి తత్త్వములో తెలియజేశారు. వారు శరీరములో తెలుసుకొన్న విధానమును గురించి ఏమంటున్నారో క్రిందచూచెదము.


బ్రహ్మ అనగా పెద్ద అని అర్థము, బ్రహ్మము అనగా ప్రపంచములో అన్నిటికంటె పెద్దది దైవము. కనుక దేవున్ని బ్రహ్మము అని పిలుచు చున్నాము. బ్రహ్మ అనగా త్రిమూర్తులలో ఒకరైన మూడుతలల బ్రహ్మని ఇక్కడ అనుకోకూడదు. అలాగే గురువు అనిన దేవుడనియే ఇక్కడ అర్థము చేసుకోవలెను, కాని మంత్రోపదేశమిచ్చు గురువు అని అనుకోకూడదు. శరీరములో యోగము ద్వారనే ఆత్మను తెలియవచ్చును. శరీరములో ధ్యాసనుంచి ఆత్మను తెలియు విధానమును యోగము అంటున్నాము. ఈ విధముగ యోగము ద్వార లోపలి ఆత్మను నే తెలుసుకొన్నానని ఒక యోగి చెప్పుచు నేజూచినానే నాలో బ్రహ్మము నేజూచినానే అన్నాడు.


 1. కన్నుల నడుమను సన్నపు దిడ్డిన తిన్నగా వెలిగేటి పున్నమి చంద్రుని నేజూచినానే ||నేజూ||

రెండు కన్నుల నడుమ శరీరము లోపల మూడు నాడుల కలయిక కలదు. శరీరము లోపల మూడులక్షల యాభైవేల నాడులలో ముఖ్యమైనవి సూర్య, చంద్ర, బ్రహ్మనాడులు. ఈ మూడునాడులలో సూర్య, చంద్రనాడులు బ్రహ్మనాడితో కన్నుల మద్యలోనే కలసిపోవుచున్నవి. దీనినే త్రికూట స్థానము అంటున్నాము. ఈ స్థానములోనే మనిషి ఎరుక (జ్ఞప్తి) అంతయువుండును. ఈ ఎరుకనే ఆత్మ అంటున్నాము. మనిషి యోగముచేత మనస్సు యొక్క సంకల్పములను లేకుండ చేసుకొనిన ఏ ఆలోచనలేని ఎరుక మాత్రము మిగిలిపోవును. ఆలోచనలేని ఎరుకను చూచుచుయుండడమే నిజమైన యోగమగును. అపుడు తెలియబడు ఆత్మను పున్నమి చంద్రునిగ పోల్చి ఈ తత్త్వములో కన్నుల నడుమను సన్నపుదిడ్డిన తిన్నగా వెలిగేటి పున్నమి చంద్రుని నేజూచినానే అన్నారు. ఇక్కడ సన్నపుదిడ్డి అనగా బ్రహ్మనాడిలో సూక్ష్మముగ ఉన్న అని అర్థము. వెలిగేటి పున్నమి చంద్రుడు అంటే త్రికూట స్థానములోనున్న ఆత్మ అని అర్థము.

2. పాలభాగమందు నీలజ్యోతులనడుమ నోలలాడుచున్న
పరలింగ మూర్తిని నేజూచినానే ||నేజూ||

ఇదే విషయమునే క్రింది చరణములో కూడ చెప్పుచున్నారు. తల పాలభాగమునందు లోపల రెండు నాడుల నడుమనున్న బ్రహ్మనాడిలో ఆత్మ నివశిస్తువున్నది. కావున పాలభాగమున నీలజ్యోతుల నడుమ నోలలాడుచున్న వరలింగమూర్తిని నేజూచినానే అన్నారు. ఇక్కడ లింగమూర్తి అనగ ఆత్మ అనియు, నీలజ్యోతుల నడుమ అనగ సూర్యచంద్ర నాడుల మద్య అని అర్థము.


 3. చూపులోపల పాపల నడుమను వ్యాపించి వెలిగేటి ఆపరంజ్యోతిని
నేజూచినానే ||నేజూ||

శరీర మద్యలో గల బ్రహ్మనాడిలో ఆత్మ నివాసముంటు శరీరమంత వ్యాపించియున్నది. ప్రపంచ వస్తువులను చూపించు కల్లలో గల చూపుకు కాంతినిచ్చునది ఆత్మయే. అందువలన చూపులోపల పాపలనడుమను వ్యాపించి వెలిగేటి పరంజ్యోతిని నేజూచినానే అన్నారు. పరం జ్యోతి అనగ ఆత్మ అని అర్థము.



 4. చక్షురాగ్రమునందు పశ్చిమవీథిని నిక్షేపమై వెలుగు సాక్షిభూతుని
నేజూచినానే ||నేజూ||

ఇదే విషయమునే క్రింది చరణములో కూడ చెప్పారు. కన్నులకొనలకు ముందుగల స్థానములో నివాసమున్న ఆత్మను చూచానని చెప్పుచు చక్షురాగ్రమున పశ్చిమ వీధిని నిక్షేపమై వెలుగు సాక్షిభూతుని నాలో నేజూచినానే అన్నారు.

-***-