తత్త్వముల వివరము/6వ తత్త్వము
-------------6. తత్త్వము--------------
చిల్లర రాళ్ళకు మ్రొక్కుచువుంటే చిత్తము చెడునుర ఒరేయొరే
చిత్తమునందు చిన్మయ జ్యోతిని చూచుచునుండుట సరే సరే ||చి||
1. ఒక్క ప్రొద్దులని ఎంచుచుయుంటే ఒనరుగ చెడుదువు ఒరేయొరే
ఏకమైన ఆ వైభవమూర్తిని చూచుచునుండుట సరే సరే ||చి||
2. నీల్లలో మునిగి గొనుగుచుయుంటే నిలకడ చెడునుర ఒరే యొరే
నీలోయుండే నిర్మల జ్యోతిని చూచుచునుండుట సరే సరే ||చి||
3. బాధ గురువుల పంచను జేరితే భావము చెడునుర ఒరే యొరే
భావమందున బ్రహ్మకాంతిని చూచుచునుండుట సరే సరే ||చి||
4. భూములు అడవులు తిరుగుచునుంటే బుద్దులు చెడునుర ఒరేయొరే
బుద్దిలోయుంటే పున్నమిచంద్రుని చూచుచునుండుట సరే సరే ||చి||
5. వీరయ్య చెప్పిన వాక్కును నమ్మితె వివరము తెలియును ఒరేయొరే
వివరమందుండె విగ్రహమూర్తిని చూచుచునుండుట సరే సరే ||చి||
వివరము : 5160 సంవత్సరముల పూర్వము చెప్పిన ఇందూమత గ్రంథమైన భగవద్గీతలోను, 2005 సంవత్సరముల పూర్వము చెప్పిన క్రైస్తవ మతగ్రంథమైన బైబిలులోను మరియు దాదాపు 1420 సంవత్సరముల పూర్వము చెప్పిన ఇస్లామ్ మతగ్రంథమైన ఖురాన్‌లోను ఏకేశ్వరోపాసన చెప్పబడినది. అందరికంటే మించిన దేవుడొకడున్నాడని, అతనినే ఆరాధించవలెనని మత గ్రంథములన్నియు ఘోషిస్తున్నవి. అయినప్పటికి మానవులు అందరికంటే గొప్పవాడైన పరమాత్మను ఆరాధించక అన్యదేవతారాధనలలో మునిగిపోయారు. అసలైన దేవున్ని మరచి చిల్లర దేవుల్లను మ్రొక్కను మొదలు పెట్టారు. అందరిలోను, అన్ని స్థలములలోను ఎల్లవేళల అంతట వ్యాపించివున్న పరమాత్మ జ్ఞానము తెలియక మిగత చిల్లర దేవుల్లను గొప్పగ పెట్టుకొన్నారు. ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క నియమము ప్రకారము పూజలు చేయుచున్నారు. తనలోనే ఉన్న పరమాత్మను గుర్తించలేక కొందరు తీర్థయాత్రలు, కొందరు వ్రతక్రతువులు, కొందరు యజ్ఞయాగాదులను చేయుచున్నారు. చివరకు ఇవన్ని వృథాప్రయాసలని తెలుసుకొన్నవారు దేవుని జ్ఞానమును పొందు చున్నారు. ఈ విధముగ అసలైన దేవుని జ్ఞానము తెలిసిన పెద్దలు జ్ఞానము తెలియనివారిని గూర్చి తత్త్వరూపములో చెప్పిన దానిని క్రింద వివరించుకొందాము.
చిల్లర రాళ్ళకు మ్రొక్కుచువుంటే చిత్తము చెడునుర ఒరేయొరే
చిత్తమునందు చిన్మయ జ్యోతిని చూచుచునుండుట సరే సరే ||చి||
సర్వ సృష్ఠికి మూలకర్త అయిన పరమాత్మ విశ్వమంత వ్యాపించి అణువణువున నిండియున్నాడు. మానవజన్మ యొక్క అంతరార్థము పరమాత్మను తెలుసుకోవడమే, అయినప్పటికి ఆ దేవున్ని తెలుసుకొను జ్ఞానము తెలియకుండపోయినది. జ్ఞానము తెలియక మాయలో మునిగియున్న మానవులు తమలోని భక్తిని దేవుడైన పరమాత్మ మీద కాక మాయయైన చిల్లర దేవుల్ల మీద చూపుచున్నారు. దేవుడు కానటువంటి మాయయైన చిల్లర దేవుల్లను మ్రొక్కడము వలన మనిషిలోని చిత్తము అనేక భ్రమలలో మునిగిపోవుచున్నది. అనేక దేవుల్లలో ఏ ఒక్క దేవుని మీదను కాక అనేక దేవుల్లను పండుగలను బట్టి, కోర్కెలను బట్టి పూజించుట వలన చిత్తములో ఏమాత్రము శాంతి ఏర్పడక మనిషి అశాంతితో మునిగిపోవుచున్నాడు. కావున జ్ఞానము తెలిసిన పెద్దలు పై తత్త్వములో చిల్లర రాల్లకు మ్రొక్కుచుయుంటే చిత్తము చెడునుర అన్నారు. దైవజ్ఞానము తెలిసినవారు చిల్లర దేవుల్ల వ్యామోహములో పడక, కనపడిన ప్రతి బొమ్మకు మ్రొక్కక, శరీరములోనే దేవుడున్నాడని, మిగతవారు అసలైన దేవుడు కాలేరని, శరీరములోనే దేవున్ని తెలుసుకొనుటకు ప్రయత్నంచు చుందురు. అటువంటివారు చిత్తములోని చిన్మయజ్యోతిని చూచుకోవడమే మంచిదని తెలిపారు.
1. ఒక్క ప్రొద్దులని ఎంచుచుయుంటే ఒనరుగ చెడుదువు ఒరేయొరే
ఏకమైన ఆ వైభవమూర్తిని చూచుచునుండుట సరే సరే ||చి||
2. నీల్లలో మునిగి గొనుగుచుయుంటే నిలకడ చెడునుర ఒరే యొరే
నీలోయుండే నిర్మల జ్యోతిని చూచుచు నుండుట సరే సరే ||చి||
కొందరు మంత్రోపదేశములను పొంది ఆ మంత్రములను నియమము ప్రకారము జపించుచుందురు. అటువంటి నియమములలో నీటిలో గొంతువరకు దిగి లేక నడుముల వరకు దిగి జపించవలెనను పద్దతులుండును. అట్లు జపించుటవలన మంత్రము మీద ద్యాస పెరుగునని వారి నమ్మకము. ఈ విధముగ నీటిలో దిగి మంత్రజపము చేయుట వలన, నీటిలో మునిగి శివుని జపము చేయుటవలన లేని ఆస్తమ (ఉబ్బస) రోగము వచ్చును కాని మనసు కుదుటపడదు. ఏమాత్రము జ్ఞానము అభివృద్దిచెందదు. అట్లు బయటి పూజలకు జపములకు అలవాటుపడుట వలన మన శరీరములో ఉండే నిర్మల జ్యోతియైన పరమాత్మను తెలియలేము. దేవుడు తెలియాలంటే నిజమైన భక్తి అవసరము. ఆ నిజమైన భక్తి మన శరీరములోని దైవము మీద చూపడమే సరియైనది. అట్లుకాక బాహ్యాచరణ వలన, అన్యదేవతల ఆరాధనల వలన ఎవరికి అంతరంగములోని దేవుడు తెలియడు. అందువలన ఈ తత్త్వములో నీల్లలో మునిగి గొనుగుచువుంటే నిలకడ చెడునుర అన్నారు. అంతేకాక నీలోయుండే నిర్మల జ్యోతిని చూచుచు నుండుట సరే సరే అన్నారు.
3. బాధ గురువుల పంచను జేరితే భావము చెడునుర ఒరే యొరే
భావమందున బ్రహ్మకాంతిని చూచుచునుండుట సరే సరే ||చి||
ఇప్పటి కాలములో భూమి మీద రెండు రకముల గురువులు గలరు. ఒక రకము బాధ గురువులు, రెండవ రకము బోధ గురువులు. శరీరమునకు పని కల్పించి దానిద్వార దేవున్ని తెలుసుకోవచ్చునని తెల్పెడివారు బాధ గురువులు. శరీరమునకు బాధను కల్పించు వారందరు బాధ గురువులే. ఉదాహరణకు దేవుని ప్రతిమకు ప్రదక్షణలు చేయమని చెప్పెడి గురువులు బాధగురువులే అగుదురు. అట్లు ప్రదక్షణము చేయడము పని అగుచున్నది దానివలన శరీరమునకు శ్రమ ఏర్పడు చున్నది. ఈ విధముగ శరీరముతో చేయు ఆరాధనలను చెప్పువారు కాని, మంత్రము చెప్పు గురువులుకాని బాధగురువులే అగుదురు. ఈ విషయమునే వేమనయోగి తన పద్యములో
కర్మల చెప్పువాడు కడగురుడు
మంత్రము చెప్పువాడు మద్యమ గురుడు
ఊర కుండుమనువాడు ఉత్తమ గురుడు
విశ్వదాభిరామ వినరవేమా.
అన్నాడు. శరీరశ్రమను కల్గించు బోధనలు చేయువారందరు బాధగురువు లని చెప్పడమే ఈ పద్యములోని అంతరార్థము. భక్తిలో పనులు చెప్పువారు తక్కువ గురువని, అలాగే మంత్రము చెప్పి దాని పనిలో ఉండమనువాడు మద్యమ గురుడని వేమనయోగి అన్నాడు. అట్లే శరీరముతో ఏ పనులు లేకుండ, మనస్సుతో కూడ పనిలేకుండ, ఏ సంకల్పము లేకుండ ఉండమని బోధించువాడు ఉత్తమగురుడని అతనే బోధ గురువని అట్లు చెప్పకుండ మనస్సుతోకాని శరీరముతోకాని పని కల్పించు బోధ చేయు వారందరు బాధ గురువులని చెప్పారు. అందువలన ఈ తత్త్వములో బాధ గురువుల పంచను చేరితే భావము చెడునుర అన్నారు. మనస్సును నిలిపి ఆత్మదర్శనమును చేసుకోవడము సరియైనపద్దతని తెలుపుచు భావమందున బ్రహ్మకాంతిని చూచుచునుండుట సరే సరే అన్నారు.
4. భూములు అడవులు తిరుగుచునుంటే బుద్దులు చెడునుర ఒరేయొరే
బుద్దిలోయుండే పున్నమిచంద్రుని చూచుచునుండుట సరే సరే ||చి||
ఎంతోమంది దైవభక్తి కల్గినవారు గలరు. వారికి దైవభక్తి ఉంది కాని దేవుడెవరని తెలియదు. అట్లు తెలియక పోవడము వలన తీర్థయాత్రలను పేరుతో ఎందరో దేవుల్లను దర్శించుచుందురు. ఎన్నో పుణ్యక్షేత్రములను చూచుచుందురు. ఈ విధముగ చేసినప్పటికి అసలైన జ్ఞానము తెలియదు, అసలైన దేవుడు తెలియబడడు. తీర్థయాత్రలచే పుణ్యక్షేత్రములను దర్శించుట వలన పుణ్యమొచ్చునేమోకాని జ్ఞానము మాత్రము రాదు. అవి కేవలము పుణ్యక్షేత్రములు మాత్రమే, కాని జ్ఞాన క్షేత్రములు కాదుకదా! భూమి మీద కొన్ని క్షేత్రములను దర్శించి దైవదర్శనము చేసుకొన్నామనుకొనుట శుద్దపొరపాటు. నిజదైవము కొన్ని పుణ్యక్షేత్రములలోనే కాక భూగోళమంతయు నిండియున్నాడు. దేవుడు బాహ్యముగ తెలియువాడు కాడు, కనుక శరీరమను క్షేత్రములోపలే దర్శించుకోవలసియున్నది. ఆ విషయము మనకు తెలియుటకు ఈ తత్త్వములో భూములు అడవులు తిరుగుచువుంటే బుద్దులు చెడునుర ఒరే ఒరే అన్నారు. శరీరములోనే దైవము తెలియునని చెప్పుటకు బుద్దిలోవుండే పున్నమి చంద్రుని చూచుచునుండుట సరే సరే అన్నారు. ఈ తత్త్వమును చూచిన తరువాతయైన మనము బాహ్యముగనున్న భక్తిని వదలి అంతరంగములో భక్తిని కల్గి లోపలేయున్న దేవున్ని తెలియవలెనని తెలుపుచున్నాము.
-***-