తత్త్వముల వివరము/5వ తత్త్వము

వికీసోర్స్ నుండి

-------------5. తత్త్వము------------


ఈ జన్మమిక దుర్లభమురా ఓరీ సాజన్మ సాకార సద్గురుని కనరా ||ఈ జన్మ||


1. పంచాక్షరి మంత్రము పఠన చేయరన్న
పఠన చేసిన యముడు పారిపోవునన్నా,
పారిపోతే అంబఫలమిచ్చునన్న
ఫలమునందిన వాడు పరమగురుడన్నా ||ఈ జన్మ||

2. మూడారు వాకిల్లు మూయవలెనన్న
ముక్తివాకిట నిలచి తలుపు తీయన్నా
తలుపు తీసిన అంబతేజమిచ్చన్న
తేజమందినవాడు తాగురుడోయన్నా ||ఈ జన్మ||

3. ఆరునదుల విూద అంబయున్నదన్న
అంబతో దుర్గాంబ ఆటలాడునన్నా
ఆట్లాటలో మంచి అర్థమున్నాదన్న
అర్థమెరిగినవాడు తాహరిగురుడన్నా ||ఈ జన్మ||

4. నాసికముపై దృష్ఠి నడిపించుమన్న
నడిపించి హరిని నీవు నమ్మియుండన్నా
నమ్మి నవరత్నముల పీఠమెక్కన్న
పీఠమెక్కిన అంబ పిలుచునోయన్నా ||ఈ జన్మ||

5. జంట త్రోవల రెండినంటి ఊదన్న
అంటి యూది మేన్మరచి యట్టే నిలువన్నా
మేను మరచి ఘంటానాదము వినుమన్న
నాదమువిని పోతులూరిని నమ్మియుండన్నా ||ఈ జన్మ||


వివరము :- భూమి విూద ఎన్నో జీవరాసులు గలవు. వాటి అన్నిటిలో తెలివైనది మానవజన్మ. ప్రపంచ జ్ఞానములో తెలివైనదైనప్పటికి పరమాత్మ జ్ఞానములో తెలియనిదే. అందువలన తెలివైన మానవజన్మలోనే తెలియని దైవజ్ఞానము తెలుసుకోవాలి. ఎంత తెలివియున్నవాడైనప్పటికి పరమాత్మ జ్ఞానము తెలియాలంటే తప్పనిసరిగ గురువు అవసరము. చాలా సూక్ష్మమైన జ్ఞాన విషయములు వివరించి చెప్పుటకు సద్గురును వెదకి ఆయనవద్ద జ్ఞానము తెలుసుకోవాలి. కావున పై తత్త్వములో ఈ జన్మమిక దుర్లభమురా ఓరీ సాజన్మ సాకార సద్గురుని కనరా అన్నారు.


1. పంచాక్షరి మంత్రము పఠన చేయరన్న
పఠన చేసిన యముడు పారిపోవునన్నా,
పారిపోతే అంబఫలమిచ్చునన్న
ఫలమునందిన వాడు పరమగురుడన్నా ||ఈ జన్మ||

పంచాక్షరి అంటే ఐదు అక్షరములతో కూడుకొన్న మంత్రమని అందరు అనుకొంటారు. అందరు అనుకొను మంత్రము "ఓం నమః శివాయ". ఈ మంత్రములో ఐదు అక్షరములుకాక ఆరు అక్షరములు గలవు. కావున ఈ మంత్రము యొక్క అసలైన వివరమును తెలుసుకొందాము. అక్షరము అనగ నాశనముకానిదని అర్థము. క్షరము అనగ నాశనము అని అర్థము. ఐదు అనగ ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను పంచభూతములని తెలుసుకోవలెను జ్ఞానము ప్రకారము ఐదు పంచ భూతములకు సర్వ జీవరాసులు నశించిపోవుచున్నవి. పంచభూతముల వలన జీవులు పుట్టుచున్నవి, అలాగే జీవరాసులన్ని పంచభూతములలోనే లయమైపోవుచున్నవి. పంచభూతములకు నాశనముకానిది ప్రపంచములో ఒకటే గలదు అదియే దేవుడు. దేవున్ని 'ఓం' అని ఒక గుర్తుగ మన పెద్దలు పెట్టారు. మిగత పంచభూతములకు కూడ అలాంటి గుర్తులనే ఉంచారు. ఆకాశమునకు 'న' అనియు, గాలికి 'మః' అనియు, అగ్నికి 'శి' అనియు, నీరుకు 'వా' అనియు, భూమికి 'య' అనియు గుర్తులు కల్పించారు. పంచభూతములకు కల్పించిన ఐదు గుర్తులను భీజాక్షరము లన్నారు. పంచభూతములకు భీజాక్షరములు వరుసగ 'నమః శివాయ అని ఉండగ పంచభూతములకు నాశనముకాని దేవునికి 'ఓం' అను భీజాక్షరముగలదు. దేవుడు పంచభూతములకు నశించడు కావున పంచఅక్షరి అని ఓం ను అన్నారు. పంచాక్షరి అనగ ఐదుకు నాశనము కానిదని అర్థము. పంచాక్షరి మంత్రములో ఐదు భూతములైన ప్రకృతి, వాటికి నాశనముకాని పరమాత్మను కలిపి చెపారు. దానినే "ఓం నమః శివాయ" అన్నారు. పంచాక్షరి మంత్రము యొక్క అర్థము తెలిసి దానినే ధ్యానించుచున్నవాడు ఎరుక కల్గియుండును. ఆ ధ్యానము చేత యోగము ఏర్పడును. యోగము వలన కర్మలు నశించుచుపోవును. కర్మలున్నపుడు కదా యముడు మనలను బాధించేది. బాధపడు కర్మలు యోగముచేత కాలిపోవుట వలన యముడు కూడ ఏమి చేయలేడు. అందువలన ఈ తత్త్వములో పంచాక్షరిమంత్రము పఠనచేయరన్న పఠనచేసిన యముడు పారిపోవునన్నా అని మొదటిచరణములో చెప్పారు. ఎపుడు కర్మలు లేకుండపోవునో అపుడు పరమాత్మ మోక్షమను పండును ఇచ్చును. మోక్షము పొందినవాడు పరమగురుడని చెప్పారు. మోక్షమును పండు అని వర్ణించినవారు పరమాత్మను అంబ అని వర్ణించారు. పరమాత్మ ఇచ్చునదే పరమపదము కావున అంబ ఫలమిచ్చునన్నారు.


2. మూడారు వాకిల్లు మూయవలెనన్న
ముక్తివాకిట నిలచి తలుపు తీయన్నా
తలుపు తీసిన అంబతేజమిచ్చన్న
తేజమందినవాడు తాగురుడోయన్నా ||ఈ జన్మ||

మన శరీరమునకు మొత్తము తొమ్మిది రంధ్రములు గలవు. వాటినే తొమ్మిది వాకిల్లు అన్నారు. శరీరము మీద ద్యాసలేకుండ చేయడమును తొమ్మిది వాకిల్లు మూసివేసినట్లాన్నారు. అజ్ఞానమునుండి జ్ఞానములో ప్రవేశించుటకు కనిపించని ఒక వాకిలి గలదు. దానినే ముక్తివాకిలి అన్నారు. ఒక మనిషి తన శరీరము విూద ద్యాసలేకుండ చేసుకొని తన జ్ఞానము ద్వార యోగములోనికి ప్రవేశించడమును పై తత్త్వములో మూడారు (మూడు ఆరు మొత్తము తొమ్మిది) వాకిల్లు మూయవలెనన్న ముక్తివాకిట నిలిచి తలుపుతీయన్నా అని అన్నారు. ఆ విధముగ శరీరము మీదూడ ద్యాసలేకుండ జ్ఞానము ద్వార ముక్తివాకిలి తెరచి బ్రహ్మయోగము లోనికి పోయిన వానికి ఆత్మ తెలియును. ఆత్మ తెలియడము ద్వార జ్ఞానశక్తి లభించును. ఆత్మ ద్వార ఆ జ్ఞానాగ్నిని కల్గినవాడు తనకున్న కర్మలను కట్టెలను పూర్తిగ కాల్చివేసుకొని మోక్షము పొందును. అందువలన తలుపుతీసిన అంబ తేజమిచ్చునన్నా తేజమందినవాడు తాగురుడోయన్నా అని రెండవ చరణములో రెండవవాక్యమునందు చెప్పారు. మూడారు వాకిల్లు శరీరములోని తొమ్మిది రంధ్రములని, తలుపు తీయడమంటే యోగము పొందడమని, అంబతేజమును జ్ఞానాగ్ని వెలుగని, అంబ అనగ ఆత్మని, కర్మ కాలిపోయి మోక్షము పొందినవానిని గురుడని పై చరణములో తెలిపారు.


3. ఆరునదుల విూద అంబయున్నదన్న
అంబతో దుర్గాంబ ఆటలాడునన్నా
ఆట్లాటలో మంచి అర్థమున్నాదన్న
అర్థమెరిగినవాడు తాహరిగురుడన్నా ||ఈ జన్మ||

మన శరీరములో అతిపెద్దనాడి బ్రహ్మనాడి. దానినే సుసుమ్ననాడి అని కూడ అంటుంటారు. ఈ నాడిలో మొత్తము ఏడుకేంద్రములు గలవు. ఆరు కేంద్రములకు పైన ఏడవకేంద్రములో ఆత్మ నివాసము చేయుచున్నది. అందువలన మూడవ చరణములో క్రింది ఆరు నాడి కేంద్రములను ఆరు నదులుగ పోల్చి, పైన ఏడవ కేంద్రములోనున్న ఆత్మను అంబ అని, ఆరు నదుల మీద అంబ ఉందన్నారు. ఆత్మ పరమాత్మ స్వరూపమైన 'ఓం' అను పంచాక్షరితో శ్వాసను నడుపుచున్నది కావున శ్వాసనడుచుటను ఆట అని, శ్వాసలో ఇమిడియున్న 'ఓం'ను మంచి అర్థమని, ఓంకారమును తెలిసినవాడు ఆటలోని అర్థము తెలిసిన వాడని, పరమాత్మలోనికి ఐక్యమైనవానిని హరిగురుడని కూడ ఈ చరణములో చెప్పారు.


4. నాసికముపై దృష్ఠి నడిపించుమన్న
నడిపించి హరిని నీవు నమ్మియుండన్నా
నమ్మి నవరత్నముల పీఠమెక్కన్న
పీఠమెక్కిన అంబ పిలుచునోయన్నా ||ఈ జన్మ||

నాశికము అనగ ముక్కు. ఈ తత్త్వములో నాశికముపై అన్నారు. నాశికాగ్రము (నాశికముపై) అంటే ఏమిటో తెలియక చాలామంది సాధకులు తికమకపడుచున్నారు. పై భాగమును అగ్రభాగము అని అంటాము. ముక్కు పై భాగమును నాశికాగ్రము అని ఆధ్యాత్మిక విద్యలో చాలా చోట్ల చెప్పారు. నాశికాగ్రముపై దృష్ఠి నిలుపమని పెద్దలు చెప్పితే అది అర్థముకాక, తమ మనోద్యాసను ముక్కు పై భాగమునగల ఏడవ కేంద్రములో నిలుపవలెనని తెలియక, బయటి దృష్ఠిని ముక్కు క్రిందికొన భాగములో నిలిపి చూచువారు కొందరు గలరు. మరి కొందరు ముక్కు పై భాగమైన కనుబొమల మద్య భాగములో చూపును నిలిపి చూచువారు గలరు. పై చూపుతో చూచు ఈ రెండు విధానములు తప్పని, చూపు అనగ మనోదృష్ఠి అయిన ధ్యాస అని, నాశికాగ్రము అనగ లోపల గల ఏడవ నాడీకేంద్రమని తెలియదు. ఏడవ నాడీ కేంద్రములో ఆత్మ నివాసమున్నది. ఏడవ కేంద్రములో మనో దృష్ఠిని నిలుపగా కొంతకాలమునకు ఆత్మ తెలియును, ఆత్మను తెలిసిన తర్వాత పరమాత్మను పొందవచ్చును. ఈ విషయమును తెలియజేయుచు పై తత్త్వములోని నాల్గవ చరణములో నాశికముపై దృష్ఠి నిలుపన్నా అన్నారు. ఆత్మ నివాసమును నవరత్న పీఠముగ వర్ణిస్తు, సప్తస్థానము చేరినవానిని పీఠమెక్కినవాడని అన్నారు. అంబ అనగ ఆత్మయని, ఆత్మద్వార పరమాత్మను చేరడమును అంబపిలుపని ఈ చరణములో చెప్పారు. ఈ విధముగ ఏడవకేంద్రములో మనస్సును నిలిపి బ్రహ్మయోగము పొందడమును గురించి చెప్పారు.


5. జంట త్రోవల రెండినంటి ఊదన్న
అంటి యూది మేన్మరచి యట్టే నిలువన్నా
మేను మరచి ఘంటానాదము వినుమన్న
నాదమువిని పోతులూరిని నమ్మియుండన్నా ||ఈ జన్మ||

శరీరములోని పెద్దనాడి అయిన బ్రహ్మనాడినుండి వచ్చు ఆత్మ చైతన్యము ఊపిరితిత్తులకు చేరి వాటిని కదలించి శ్వాస ఆడునట్లు చేయుచున్నది. శ్వాస రెండు ముక్కురంధ్రముల ద్వార ఆడుచున్నది. రెండు ముక్కురంధ్రములలో ఆడుచున్న శ్వాసను ప్రయత్నము చేసి కుంభకము అను సాధన ద్వార నిలబెట్టగలిగినపుడు శరీరములో అన్ని కదలికలు నిలిచిపోవును. శరీరమునంతటిని మరచి మనస్సు ఒకే ధ్యాసలో నిలిచిపోవును. అపుడు శరీరములోని ఆత్మ తెలియును. గంటానాదము ఏకస్థాయి శబ్దము కల్గియున్నట్లు ఒకే స్థాయిలో ఆత్మను తెలియువాడు నిజయోగి అగును. ఈ విషయమును చెప్పుచు రెండు ముక్కురంధ్రములలో శ్వాసను లోపలికి పీల్చినిలుపడమును జంటత్రోవల రెంటినంటి ఊదన్నా అన్నారు. శరీరము మీద ద్యాసలేకుండ మనస్సు నిలచి పోవడమును మేనుమరచి అట్టే నిలువన్నా అన్నారు. ప్రపంచ విషయములను వదలి నిలచిపోయిన మనస్సు ఆత్మను తెలియగల్గు చున్నది. కావున గంటానాదము వినుమన్నా అన్నారు. ఇట్లు శ్వాసద్వార బ్రహ్మయోగమును పొంది ఆత్మను తెలియు విధానమును ఈ తత్త్వములో వర్ణించి చెప్పారు.

-***-