తత్త్వముల వివరము/2వ తత్త్వము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

-------------2. తత్త్వము-------------


ఆహా బ్రహ్మాండమైనది ఆదిమంత్రము మన బ్రహ్మంగారు చెప్పినది పెద్దమంత్రము.


1) రెక్క ముక్కులేని పక్షి రేయి పగలు తపస్సు చేసి ఒక చెరువు చేపలన్ని ఒక్కటే మ్రింగెను. "ఆహా"


2) ఇంటి వెనుక తుట్టెపురుగు ఇంటిలో అందరిని మ్రింగె, చూడవచ్చిన జనులనెల్ల చూచిమ్రింగెను. "ఆహా"


3) కాళ్లు చేతులు లేనివాడు కడవ ముంత చేత పట్టి నిండుబావి నీళ్లని ఒక్కడే ముంచెను "ఆహా"


4) ఏటివిూద స్వాతికొంగ వేటలాడుచురాగ చాటునున్న విూనుపిల్ల అట్టే మ్రింగె "ఆహా"


5) చెప్పినాడు వీరదాసు చోద్యముగాను ఆత్మతత్త్వము గొప్పవారు దీని భావము విప్పిచెప్పితే చాలు "ఆహా"


దీని అర్థమేమనగా :- శ్వాసను కుంభించి నిలిపి మనస్సును బ్రహ్మనాడి యందు చేర్చ వలయునని అనుకొన్న యోగి ఒక స్థలమునందు కదలక కూర్చొని మొదట శ్వాసను ఊపిరితిత్తులనిండా ఏమాత్రము ఖాళీ లేకుండ పీల్చును. పీల్చిన శ్వాసను ఏమాత్రము బయటికి వదలకుండ మూడు లేక నాలుగు నిమిషములుండును. ఇట్లున్న తర్వాత మరియు బయటి గాలినే లోపలికి పీల్చును. ఇక్కడ గమనింపవలసిన విషయము మొదట ఊపిరితిత్తులు ఏమాత్రము ఖాళీ లేకుండ గాలి పీల్చినాడుకదా ఖాళీలేని ఊపిరితిత్తులందు తిరిగి గాలి ఎట్లు ప్రవేశించినదని అనుమానము కలుగవచ్చును. దానికి సమాధానము మొదట ఖాళీలేని ఊపిరితిత్తులందు మూడు నాలుగు నిమిషముల తర్వాత కొద్దిగా ఖాళీ ఏర్పడియుండును. ఆ ఖాళీస్ధలము ఏట్లేర్పడినదనగా ఊపిరితిత్తులయందున్న గాలి మూడు నాలుగు నిమిషములకు బయటికి రావలయునని ప్రయత్నించును. కాని బయటికి రాకుండ నిరోధించి ఉన్నందువలన ఊపిరితిత్తులలోని మూలలకు గాలి చేరుట వలన ఊపిరితిత్తులు కొద్దిగా ఖాళీ ఏర్పడి ఉండును. ఆ ఖాళీ పూర్తి అగునట్లు రెండవసారి యోగి బయటి గాలిని పీల్చి పూరించుచున్నాడు. ఇట్లు రెండవమారు గాలిని పీల్చిన యోగి మూడు లేక నాలుగు నిమిషముల వరకు శ్వాసను బయటికి వదలక ఉండి, తర్వాత ఇంకా తనయందు గాలి ప్రవేశించునేమోనని మూడవ మారు పీల్చి చూచును. అపుడు కూడ గాలి కొద్దిగ లోపలికి పోవును. ఇట్లు రెండు మూడుమార్లు శ్వాసను పీల్చి ఉదరమునందు ఊపిరి తిత్తులందును గాలిని భర్తిగా చేసుకొని బయటికి వదలక ప్రయత్న పూర్వకముగా భిగించి ఉండును. దీనినే "కుంభకము" అని అందురు. ఈ విధముగా కుంభింపబడిన గాలి బంతియందు బంధింపబడి ఉన్నట్లుండును.


1) గాలిని ఆధారము చేసుకొని ఆడుచున్న ఊపిరితిత్తులు గాలి కదలక నిలిచిన వెంటనే నిలిచిపోవుచున్నవి.

2) ఊపిరితిత్తులు నిలిచిన వెంటనే ఊపిరితిత్తులను నడుపుచున్న నరము లందు చైతన్యము కూడ నిలిచిపోవును.

3) నరములందు చైతన్యము నిలిచిన వెంటనే ఆ నరములతో సంబంధమున్న సూర్యచంద్రనాడులందుండు చైతన్యము నిలిచిపోవును.

4) సూర్యచంద్రనాడులందు చైతన్యము నిలిచిన వెంటనే సూర్యచంద్ర నాడులను ఆధారముగా చేసుకొని చలించుచున్న మనస్సు కదలక నిలిచిపోవును.

5) మనస్సు నిలిచిపోయిన వెంటనే మనస్సును ఆధారముగా చేసుకొని జీవులను నడుపుచున్న ఆరు కేంద్రములలో చైతన్యశక్తి నిలిచిపోవును. అనగా కుండలీశక్తి ఆటకట్టబడినదన్నమాట. నరకేంద్రముల చైతన్యము నకు ఆధారమై ఉన్న ఏడవ కేంద్రము ఒక్కటి తన శక్తిని కోల్పోక ఉండును. ఆరు కేంద్రముల చైతన్యశక్తి నిలిచిపోయినను ఏడవ కేంద్రమందున్న చైతన్యశక్తి నిలిచిపోక ఉండును. ఏడవ కేంద్రమందలి శక్తి అపారమైనది, ఊహించరానిది, చెప్పుటకు శక్యముకానిది, దానినే ఆత్మ అని యోగులు అంటున్నారు. ఈ ఏడవ కేంద్రమునందలి చైతన్యము జీవుని నిదుర, మెలుకువ, స్వప్నములందు సమానముగ ఉండును అందువలన ఏడవ కేంద్రమందున్న చైతన్యమునే మూడవస్థలందు సాక్షిగ ఉన్నదని చెప్పవచ్చును. కుంభకము ద్వారా నిలిచిన మనస్సు బ్రహ్మనాడి యందు ఏడవ కేంద్రము చేరి అందు ఇమిడి పోవుచున్నది. మనస్సుతో పాటు అంతఃకరణములైన జీవుడు కూడ ఏడవ కేంద్రములో ఉన్న ఆత్మయందేలీనమై పోవుచున్నాడు. జీవుడు ఆత్మయందు లీనము కావడమునే "యోగము" అంటున్నారు.


కుంభకమునే పూర్వము యోగి అయిన శ్రీ వీరబ్రహ్మంగారు ఒక తత్త్వముగా చెప్పియున్నారు. కుండలీశక్తిని వేరుగా పోల్చుకొన్న వారు, కుండలీశక్తి నిదురపోతున్నదన్న వారు ఉండుటవలన ఆ తత్త్వమునకు అర్థమే తెలియకపోయి, ఆఖరుకు భిక్షగాళ్లు పాడుకొనుటకు ఉపయోగపడుచున్నది. గుడ్డివానికి రత్నము ఇచ్చిన వ్యర్థమైనట్లు శ్రీ వీరబ్రహ్మముగారు ఎంతో జ్ఞానమును ఉపయోగించి చెప్పిన మాటను తెలియని మనము వ్యర్థము చేయుచున్నాము. కుండలీనే పెద్దగ పెట్టుకొన్న వారు మరియు విన్నవారు, శ్రీ పోతులూరి వీరబ్రహ్మముగారు చెప్పిన క్రింది తత్త్వమును గ్రహించవలయునని తెలుపుచున్నాము. గొప్ప మంత్రము బ్రహ్మముగారు చెప్పినది. ఆ మంత్రము మనశ్వాసయే. శ్వాసలోపలికి ప్రవేశించినపుడు "సో" అను శబ్దముతో, బయటికి వచ్చునపుడు "హం" అను శబ్దముతో చలించుచున్నది. ఈ రెండు శబ్దములు కలసి "సోహం" అను శబ్దము ఏర్పడినది. ఈ శబ్దము మహిమకలది కావున దీనిని మంత్రము అని చెప్పాడు. మరియు అక్షర సమ్మేళనములతో కూడుకొన్నది. కావున మంత్రము అని చెప్పబడినది. "సోహం" అనుమంత్రము ఆదిమంత్రముగా మారుచున్నది. అది ఏ విధముగననగా! "సో" అను శబ్దమునందు చివరిగా "ఓ" అను శబ్దమున్నది. "హం" అను శబ్దమునందు చివరిగా "మ్‌" అను శబ్దమున్నది. ఒక్కమారు శ్వాస లోపలికి పోయి బయటికి వస్తే "సోహం" అను మంత్రము ఏర్పడుచున్నది. అ సోహం మంత్రమునందే "ఓమ్‌" అను శబ్దము ఇమిడి ఉన్నది. కావున "సోహం" తల్లి "ఓమ్‌" శిశువు. "ఓం" ప్రపంచ పుట్టుకలో మొదటపుట్టిన శబ్దము కావున దీనిని ఆది మంత్రము అనుట సంభవించినది.


1) రెక్క ముక్కులేని పక్షి రేయి పగలు తపస్సు చేసి ఒక చెరువు చేపలన్ని ఒక్కటే మ్రింగెను. " ఆహా "

ముక్కు పుటములందు ప్రవేశించు శ్వాసకు ఆకారము లేదు కావున రెక్క ముక్కులేని పక్షి అని చెప్పబడినది. శ్వాస రేయి పగలు విడువక సోహం అను మంత్రమును జపించుచున్నది. కావున పక్షి రేయి పగలు తపస్సు చేసె అని చెప్పబడినది. ఈ శ్వాసయే శరీరము లోనికి ప్రవేశించి కుంభకము ద్వారా నిలిచి శరీరములోనున్న కదలికల (చైతన్యముల) అన్నిటిని నిలిపివేయుచున్నది. కావున చెరువులో అనేక విధములుగా చలించు చేపలన్నిటిని మ్రింగెను అని చెప్పబడినది.


2) ఇంటి వెనుక తుట్టెపురుగు ఇంటిలో అందరిని మ్రింగె, చూడవచ్చిన జనులనెల్ల చూచిమ్రింగెను. " ఆహా "

శ్వాస ఎల్లవేళల సోహం అను శబ్దము చేయుచున్నది కావున 'గీ' మని అరచు తుట్టెపురుగుగా చెప్పబడినది. శ్వాసకు ఆధారము శరీరములో కనపడక ఉన్న బ్రహ్మనాడిలోని చైతన్యము కావున ఇంటి వెనుక పురుగు అని చెప్పబడినది. ఇల్లు అనగా శరీరము. శ్వాస కుంభకము ద్వారా శరీరములోనున్న వ్యాన, సమాన, ఉదాన, అపాన వాయువులన్నియు బంధింపబడుచున్నవి. కావున ఇంటిలోని అందరిని మ్రింగెను అని చెప్పబడి ఉన్నది. శ్వాస కుంభించిన తర్వాత ఊపిరితిత్తులు ఖాళీవల్ల రెండు లేక మూడుసార్లు కొద్దికొద్దిగా బయటి గాలి లోపలికి ప్రవేశించి, ప్రవేశించిన గాలి తిరిగి బయటికి రాక నిలుచుటవలన చూడవచ్చిన జనులనెల్ల చూచి మ్రింగెను అని చెప్పబడి ఉన్నది.


3) కాళ్లు చేతులు లేనివాడు కడవ ముంత చేత పట్టి నిండుబావి నీళ్లని ఒక్కడే ముంచెను " ఆహా "

శ్వాసకు రూపములేదు కావున కాళ్లు చేతులు లేనివాడని చెప్పబడినది. శ్వాస ముక్కురంధ్రములలో ఒక దానియందు ఎక్కువ ఒక దానియందు తక్కువ లోపలికి బయటికి చలించుచున్నది, ఎక్కువ శ్వాసను కడవ అని, తక్కువ శ్వాసను ముంతని చెప్పడమైనది. కావున కడవ ముంత చేతపట్టి అని చెప్పడమైనది. శరీరములోని తలంపులన్ని శ్వాస ఒక్కటి నిలువడము వల్ల నిలిచిపోవుచున్నవి. కావున బావినీళ్లన్ని ఒక్కడేముంచెను అని చెప్పబడి ఉన్నది. శరీరమును బావిగా పోల్చడమైనది.


4)ఏటివిూద స్వాతికొంగ వేటలాడుచురాగ చాటునున్న విూనుపిల్ల అట్టే మ్రింగె " ఆహా "

శ్వాస శరీరములో నిలిచిపోయిన దాని వలన మనస్సు నిలచి పోవుచున్నది. మనస్సు నిలచిపోవుట వలన ఊపిరితిత్తులు తర్వాత నరములు, ఆ తర్వాత సూర్యచంద్రనాడులు, షట్‌ చక్రములు ఒక దాని తర్వాత ఒకటి తమతమ చైతన్యమును కోల్పోవుచున్నవి. కావున ఏటి విూద స్వాతికొంగ వేటలాడుచురాగ అని చెప్పబడినది. ఒక దాని తర్వాత ఒకటి తమ చైతన్యములను కోల్పోయినను, ఆఖరున గల ఏడవకేంద్రము మనస్సు వలన తన శక్తిని కోల్పోక నిలచిన దానివలన అన్నిటియొక్క చైతన్యములను నిలిపి వేసిన మనస్సు ఏడవ కేంద్రము వద్దకు వచ్చి తనశక్తి చాలక నిలిచిపోయిన దానివలన చాటునున్న చేపపిల్ల కొంగను మ్రింగెను అని చెప్పడమైనది.

-***-