తత్త్వముల వివరము/1వ తత్త్వము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

---------------1. తత్త్వము--------------


సీ..

కానని భూమిలో కస్తూరి కోనలో
మందరగిరి విూద మర్రి చెట్టు
చెట్టుకు కొమ్మలు చెర్చింప పది నూర్లు
కొమ్మ కొమ్మకు కోటి కోతులుండు
నగదరం బైనట్టి నడికొమ్మ విూదను
నక్క యొకటుండు చుక్కవలెను
సుస్థిరం బైనట్టి చుక్కకు తూర్పున
సూర్య చంద్రాదులు తేజరిల్లు


తే..

దీనికర్థంబు చెప్పు దేశికునకు
నెలలు పండ్రెండు గడువిత్తు నేర్పుతోడ
చెప్పగలిగనేని నేనిత్తు చిన్న మాడ
చెప్పలేకుంటె నేనగుదు చిన్న నగువు.


భావము :- దైవము నిల్వయున్న నిజమైన దేవాలయమైన మన శరీరములో, కంటికి కనిపించని చూడబడని అంతర్గతములో, ఎముకలచే మరియు వెన్నుపూసలచే పేర్చబడిన శరీర భాగములో ఎతైన కపాలస్థాన మందు జీవుల సారాంశమంతయు ఇమిడి ఉన్నది. ఆ స్థానములోనే జీవరాసుల జరిగిన, జరుగుచున్న, జరుగబోవు చరిత్రలన్ని దాచబడినవి. శిరో భాగములో మద్యనగల గుణచక్రమందు గుణములు, కర్మచక్రమందు కర్మ, కాలచక్రమందు కాలము కనిపించక సూక్ష్మముగ ఉన్నవి.


కనిపించు మెదడునుండి ఒకనాడి బయలుదేరి గుదస్థానము వరకు వ్యాపించివున్నది. దీనినే బ్రహ్మనాడి అందురు. ఈ నాడియందు కాల, కర్మ, గుణచక్రములను నడుపు ఆత్మ నివాసమై ఉన్నది. ఆత్మ కంటికి కనిపించక బ్రహ్మనాడి పై భాగమునుండి చివరి భాగమువరకు వ్యాపించియున్నది. చిన్న చిన్న నరములు అనేకము శరీర వివిధ భాగముల నుండి వచ్చి బ్రహ్మనాడితో కలిసియున్నవి. ఈ చిన్న నరముల ద్వారానే శరీరమందు ఏ విషయమైన బ్రహ్మనాడిని చేరి అక్కడినుండి కపాల స్థానములో నివాసమున్న జీవునకు చేరుచున్నది. ఇంతేకాక బ్రహ్మనాడికి ముందర భాగములో ఇరువైపుల సూర్య చంద్రనాడులనునవి కలవు. ఈ నాడులు రెండు ముఖ్యముగ ఊపిరితిత్తులతో సంబంధము ఉన్నవి. మన ముక్కురంధ్రముల ద్వార ఆడుశ్వాస సూర్యచంద్రనాడుల ద్వారానే కదలింపబడుచున్నది.


పై విధముగ శరీర అంతర్భాగమున్నది. ఈ విషయమును యోగులైనవారు పద్యరూపములో చెప్పారు. లోపలి భాగము కనిపించనిది. కావున కానని భూమిలోనన్నారు. శరీరము ఆత్మ నిలయమైన పవిత్ర స్థానము కావున పరిమళముగల కస్తూరికోన అన్నారు. శరీర పై భాగమున ఆత్మ, జీవుడు,గుణములు, కర్మలకు నిలయము కావున శరీరమును పర్వతముగ పోల్చి మందరగిరి అన్నారు. కపాలస్థానము నుండి బ్రహ్మనాడి పుట్టినది కావున దానిని మర్రిచెట్టుగ చెప్పారు. బ్రహ్మనాడి నుండి ఎన్నో నాడులు చీలిపోయాయి. కనుక నాడులన్నిటిని కొమ్మలుగ పోల్చి చెట్టుకు చెర్చింప పదినూర్ల కొమ్మలన్నారు. బ్రహ్మనాడితో సంబంధమున్న నరముల ద్వార లెక్కకురాని అనేక విషయములు బ్రహ్మనాడిని చేరు చున్నవి. కావున కొమ్మకొమ్మకు కోటి కోతులుండు అన్నారు. చిన్న నరములన్నిటికి బ్రహ్మనాడియే ఆధారము. బ్రహ్మనాడినుండియే శక్తి అన్ని నరములకు ప్రవహించుచున్నది. అందువలన బ్రహ్మనాడిని నగధరం బైౖన నడిమికొమ్మ అన్నారు. బ్రహ్మనాడియందే అన్నిటికి సాక్షియైన ఆత్మ నివాసమున్నది. కావున ఆత్మను నక్కగ పోల్చి నడిమి కొమ్మ మీద నక్క ఒకటియని అన్నారు. ఆత్మ స్థిరస్థాయిగ ఒక్క చోటుండి తనశక్తి కిరణములను నరముల ద్వార శరీరమంత వ్యాపింపజేయుచున్నది. అందువలన పగలు రేయి స్థిరస్థాయిగ ఉన్న చుక్కగ ఆత్మను పోల్చి నక్క ఒకటుండు చుక్కవలె అన్నారు. బ్రహ్మనాడికి కొద్దిగ ముందు ప్రక్కన రెండువైపుల సూర్యచంద్రనాడులున్నాయి. జాగ్రతావస్థయందు మాత్రము మనస్సుకు స్థానమైవున్న సూర్యచంద్రనాడులను 12 గంటల కాలము కనిపించి 12 గంటల కాలము కనిపించని సూర్యచంద్రులుగ పోల్చి చుక్కకు తూర్పున సూర్యచంద్రులు తేజరిల్లుయన్నారు.


ఇది నిగూఢ భావముగల పద్యము. శరీర అంతర్గత జ్ఞానము పూర్తిగ తెలిసినవారికే ఈ పద్యము అర్థ్థమగును. శరీరాంతర్గత జ్ఞానము చాలామందికి లేనిదానివలన దీని అర్థము చెప్పుటకు చాలా కాలము పట్టునను ఉద్దేశముతో నెలలు పండ్రెండు గడువిత్తునని చెప్పారు.

-***-