తత్త్వముల వివరము/12వ తత్త్వము
------------12. తత్త్వము--------------
గుట్టు తెలిసి మసులుకొనరే సుజ్ఞానులార బట్టబయలు దీని
భావమెల్లను గుట్టు తెలిసి నడుచుకొనరే
1) గండుపిల్లి లోకమెల్ల పారజూచి ఏలగాను,
కొండ ఎలుక లొక్క రెండు కొలువు జేసేరా || గుట్టు||
2) అండబాయక చిలుకలైదు అడవిగాచుచుండగాను,
పండు కోతులొక్క రెండు ప్రహరి తిరిగేరా || గుట్టు||
3) ముట్టు తప్పి గొడ్డురాలు మహిళకొక్క కొడుకు పుట్టి
గొప్పకొండలేడు మ్రింగి గురకపెట్టెరా || గుట్టు||
4) గుట్టు చప్పుడనక నొక్కడు ఉరికి మింటి కెగయగాను,
కుప్పిగంతులేసి పాము కరచి మ్రింగేరా || గుట్టు||
5) భువిని నోరులేని మిడత పులిని మ్రింగేను,
ఆ వార్త తెలిసి మేక యొకటి పకపక నవ్వేరా || గుట్టు||
6) ఈ వివరము అరసి చూడ అలవిగాదు ఎవరికైనను,
తెలివిగల యాగంటి గురుడు తానె తెలియురా || గుట్టు||
ఇక్కడ ఆరవ చరణములో ఈ తత్త్వ వివరము తెలుసుకొనుటకు ఎవరికి అలవిగాదు. తెలివిగల యాగంటి గురుడు తానే తెలియురా
అన్నారు. ఇపుడు ఈ తత్త్వ వివరమును తెలిసి మేము వ్రాయాలంటే యాగంటి గురుడుగ మారి పోక తప్పదు. అలా మారి ఆయనకు ఏ వివరము తెలిసిందో మనము తెలుసుకొందాము.
1) గండుపిల్లి లోకమెల్ల పారజూచి ఏలగాను,
కొండ ఎలుక లొక్క రెండు కొలువు జేసేరా || గుట్టు||
మన శరీరములో కదలికశక్తి ఉన్నది. ఆ శక్తిని చైతన్యశక్తి అంటున్నాము. ఆ శక్తి శరీరములో ఎక్కడున్నదో ఎట్లున్నదో ఎవరికి తెలియదు. దానిని ఎవరు చూడలేదు. మనిషి శరీర బరువుకంటె ఎక్కువున్న బరువును కూడ శరీరములోని శక్తి కదలించుచున్నది. బయటి వస్తువులను కదలించు శక్తి మన శరీరములోని శ్వాసను కూడ ఆడించుచున్నది. చైతన్యమును నమ్మలేనివారు కూడ శ్వాస కదలిక చూచి నమ్మవలసి వస్తున్నది. కనిపించని చైతన్యమును ఒక పేరు పెట్టి పిలువడము జరిగినది. ఆ పేరే "ఆత్మ". ఆత్మ ఒక్క చోట కేంద్రముగ ఉండి శరీరమునంతటిని తన చైతన్యము చేత నడుపుచున్నది. కనిపించని ఆత్మ శరీరములో ఉందా లేదా అని చూచుటకు శ్వాసను బట్టి చూడవలసిందే. శ్వాస ముక్కు రంద్రములలో ఆడుచువుంటే లోపల ఆత్మ ఉందని, శ్వాస ఆడకపోతే లోపల ఆత్మలేదని తెలియగలుగుచున్నాము. ఆకాశములోని సూర్యుడు తన కిరణముల చేత లోకమునంతటిని ప్రకాశింపజేయునట్లు శరీరములోని బ్రహ్మనాడి ఏడవ కేంద్రములోవున్న ఆత్మ తన చైతన్యము చేత శరీరమునంతటిని ప్రకాశింపజేయుచున్నది. శరీరములో ఆత్మ ప్రకాశమున్నదా లేదా అనుటకు బయటకు కనిపించు శ్వాసే ఆధారము. దీనిని బట్టి రాజువలె ఆత్మ శరీర సామ్రాజ్యమును ఏలుచున్నప్పటికి ఆత్మ అనెడి రాజు కనిపించలేదు. కాని ఆత్మకు ఎన్నో రెట్లు తక్కువయున్న, ఆత్మచేత కదలుచున్న రెండు శ్వాసలే శరీరమునకు ప్రకాశమనుకొన్నట్లు భ్రమింపజేయుచున్నవి. ఈ విధముగ స్పర్శకు కనిపించే శ్వాసే శరీరమునకు జీవనాధారమని కొందరనుకొని, దానిని మించినది లేదనుకొనుటయే జ్ఞానమనుకొని, లోపలగల ఆత్మను మరచి శ్వాసవిూదే ధ్యాస పెట్టుకొమ్మంటున్నారు. ఆత్మ మీద ధ్యాస పెట్టక శ్వాస మీద ధ్యాస పెట్టితే గండుపిల్లిని వదలి చిట్టెలకలను నమ్ము కొన్నట్లుంటుంది.
మన శరీరములోని ఆత్మ గండు పిల్లిలాంటిది. ఆత్మ బలమును అంచనా వేయలేము, నుక ఆత్మను ఈ తత్త్వములో గండుపిల్లితో సమానముగ పోల్చుచున్నాము. ఆత్మ తన చైతన్యముచేత శరీరమంత వ్యాపించియున్నది. కావున ఇక్కడ గండుపిల్లి లోకమెల్ల పారచూచి ఏలెరా అన్నారు. లోకమంటె శరీరమని అర్థము చేసుకోవలెను. లోపలున్న రాజు తెలియడుగాని బయటున్న భటులు మాత్రము తెలుసునన్నట్లు లోపలగల ఆత్మ తెలియదుగాని, బయటున్న శ్వాసలు మాత్రము తెలియు చున్నవి. అదే విధముగ లోపలున్న బలమైన గండుపిల్లిలాంటి ఆత్మ తెలియదుగాని బలములేని చిట్టెలుకలలాంటి రెండు శ్వాసలు తెలియు చున్నవి. అందువలన అందరికి తెలిసినట్లు రెండు కొండ ఎలుకలు కొలువు చేసెరా అన్నారు. నిజమైన కొలువు లోపల పిల్లిదైన కనిపించెడి కొలువు ఎలుకలదే అన్నట్లున్నది కదా! అందువలన గండుపిల్లి విషయము తెలియని కొందరు మా ధ్యాస శ్వాసవిూదే అని రెండెలుకలను పట్టుకొని ఊగులాడుచున్నారు. గండు పిల్లి సింహాసనము తల మద్య భాగములో ఉన్న ఏడవ నాడీకేంద్రమైతే, చిట్టెలుకలు రెండు ఊపిరితిత్తుల వరకు లోపలికి పోయి వచ్చుచున్నవి. ఏది ఏమైన గండుపిల్లి దయాదాక్షిణ్యము తోనే రెండు ఎలుకలు బ్రతుకుచున్నవి. పిల్లి తన స్థానము వదలి వచ్చినదంటే రెండు ఎలుకలను నోటకరుచుకొని పోతుంది. ఆత్మ బయటికి వస్తే శ్వాసలుండవని అర్థము.
మీరు బాగా అర్థము చేసుకొనుటకు మరొక మారు చెప్పడమేమంటే పిల్లి అనగ ఆత్మ అని, లోకమెల్ల అనగ శరీరమంత అని అర్థము, పారజూచి ఏలడము అనగ గోర్లు వెంట్రుకల వరకు తన శక్తిని వ్యాపింపజేయడమని అర్థము. కొండ ఎలుకలు అనగ శ్వాసలు, ఒక రెండు అనగ రెండు ఒక్కటిగ బయటికి కలసి వస్తున్నవి, కలిసి లోపలికి పోవుచున్నవని అర్థము. కొలువు చేసేరా అనగ శ్వాసలే శరీరమునంతటికి ఆధారమన్నట్లు కనిపిస్తున్నవని అర్థము ఈ విధముగ అర్థము చేసుకొంటే ఈ మొదటి చరణములోని భావమంత బట్టబయలే అని చెప్పారు.
2) అండబాయక చిలుకలైదు అడవిగాచుచుండగాను,
పండు కోతులొక్క రెండు ప్రహరి తిరిగేరా || గుట్టు||
శరీర నిర్మాణము ప్రకృతియైన పంచభూతముల చేత నిర్మాణమై ఉన్నది. శరీరము పంచభూతములైన ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను ఐదు పదార్థముల చేత తయారైనది. శరీరమంత ఐదు పదార్థములే నిండివున్నవి. ఆత్మ తల మద్య భాగములో ఉండి ఈ ఐదు భాగములంతటికి తన శక్తిని ప్రసారము చేయుచున్నది. దీనిని బట్టి పంచభూతముల రాజ్యములో ఆత్మ రాజుగ ఉన్నాడని తెలియుచున్నది. ఇంటికి కాపలా కాయమని ఇంటి యజమాని చెప్పితే ఇంటిలోని గుమస్తాలు యజమాని చెప్పిన పని చేసినట్లు ఆత్మ చెప్పిన పని పంచభూతములు చేయుచున్నవి. పంచభూతములు ఒక్కొక్కటి ఐదు భాగములుగ విభజించబడి మొత్తం ఇరువది ఐదు భాగములుగ విస్తరించివున్నవి. ఆత్మ అను యజమానిననుసరించి పంచభూతముల నిర్మితమైన అవయవములు పని చేయుచున్నవి ఈ విధానమును రెండవ చరణములో చెప్పుచు పంచభూతములను ఐదు చిలకలుగ వర్ణించారు. పంచభూతములన్ని ఒక చోట కలిసివున్నాయి కనుక అండబాయక అన్నారు. పంచభూతములు కనిపించెడి పది అవయవములుగ, కనిపించని పదిహేను అవయవములుగ శరీరమంత వ్యాపించివున్నవి. కావున చిలుకలైదు శరీరమను అడవిని కాచుచున్నవని చెప్పారు.
శరీరమును అడవిగ పోల్చుకొంటే దానికి ప్రహరి గోడలాంటిది చర్మము. చర్మము దాటి శరీరముండదు. చర్మములోపలనే శరీరమంత ఉండును. గోర్లు వెంట్రుకలు కూడ చర్మములోని భాగములే అని గుర్తుంచుకోవలెను. శరీరమను అడవిలో ఇరువదైదు అవయవములనబడు జంతువులు కలవని చెప్పుకోవచ్చును. వాటిలో ఎప్పుడు చలనము కలిగినవి కోతులు. అందులోను తిరిగే దానిలో బాగ అలవాటుపడినవని అర్థమగుటకు పండుకోతులని కూడ చెప్పారు. ఉచ్చ్వాస నిచ్చ్వాస అను రెండు కోతులు శరీరము బయటికి కూడ వస్తున్నవి. కావున ప్రహరి దాటిపోయి తిరిగి వస్తున్నవని చెప్పవచ్చును. రెండు ముక్కురంధ్రముల శ్వాసలను రెండు కోతులుగ లెక్కించి చూచితే శరీరమను అడవినుండి చర్మమను ప్రహరి దాటిపోయి తిరిగి వచ్చుచున్నవి. అందువలన పండు కోతులొక్క రెండు ప్రహరి తిరిగేరా అన్నారు.
అండబాయని ఐదు చిలకలనగ ఒక్క చోట కలసియున్న పంచ భూతములని, శరీరమును అడవియని, ఒక్క రెండు అనగ ఒక్క శ్వాసే రెండు భాగములుగ ఉన్నదని, పండుకోతులనగ తిరుగుటలో పండిన రెండు రకముల శ్వాసలని, ప్రహరి అనగ శరీరమును చుట్టియున్న చర్మమని అర్థము చేసుకొన్నపుడు రెండవ చరణములోని రహస్యము సులభముగ అర్థము కాగలదు. చూచుటకు విచిత్రముగ చిలకలు, కోతులు, అడవి అని వ్రాసిన ఈ వాక్యములో ఎంతో జ్ఞానము ఇమిడి ఉన్నది.
3) ముట్టు తప్పి గొడ్డురాలు మహిళకొక్క కొడుకు పుట్టి
గొప్పకొండలేడు మ్రింగి గురకపెట్టెరా || గుట్టు||
మానవులలో పూర్వము వెయ్యింటికొకడు అదియు అరుదుగ జ్ఞానము మీద ఆసక్తి కల్గియుండెడివారట. నేటి కాలములో లక్షమందిలో ఒక్కనికి జ్ఞానము మీద ఆసక్తియుండడము అరుదే అని చెప్పవచ్చును. రెండు మూడు లక్షలకు ఒకడు జ్ఞానము మీద ఆసక్తియున్నవాడు దొరికినప్పటికి వాడు చివరి వరకు జ్ఞానము తెలుసుకుంటాడను నమ్మకము లేదు. దీనిని బట్టి చూస్తే కడవరకు జ్ఞానాసక్తి కల్గియుండువాడు కొన్ని లక్షలకు ఒకడు దొరుకునని తెలియుచున్నది. బహుశ పదిలక్షలకు ఒకడు దొరికితె పదిలక్షలమంది అజ్ఞానులుంటారన్నమాట. అంతమందిలో జ్ఞాని అయినవాడు కర్మయోగము, బ్రహ్మయోగము అను రెండు యోగములలో ఏ యోగమునైన అనుసరించవచ్చును. ఒక వేళ బ్రహ్మయోగమును అనుసరించాడని అనుకొందాము. అతడు బ్రహ్మయోగి అగును. ఇంత వరకున్న వివరమును పై చరణములో ఏ విధముగ వివరించారో చూద్దాము. గొడ్డురాలు అనగ పిల్లలు పుట్టనిదని అందరికి తెలియును. గొడ్డురాలుకు పిల్లలు పుట్టకున్న ముట్టు అనునది ప్రతి నెల ఉండనే ఉండును. అజ్ఞానికి జ్ఞానము కలుగుట దుర్లభము, పది లక్షలమందికి కూడ ఒకడు దొరుకుట అరుదు అనుకొన్నాము కదా! అజ్ఞానిని గొడ్డురాలుగ పోల్చి వారికి జ్ఞానము అను సంతతి కలుగదు అన్నారు. సంతతి కలగాలంటే వారిలో జ్ఞానమనే భీజము పడాలి. జ్ఞానమనేది టీవిలలోను, రేడియోలలోను ఎక్కడైన గురువులవద్దను విన్నప్పటికి ఆసక్తిలేని వారికి అది ఫలించదు, అనగ బుర్రకెక్కదు. ఎంతో మంది అజ్ఞానులలో ఒక్కడైన జ్ఞానుల సాంగత్యములో జ్ఞానమును విని దానిమీద ఆసక్తి పెంచుకొంటే వానికి జ్ఞానభీజముపడినట్లే. అటువంటివాడు కొంత కాలమునకు యోగి కాగలడు. అజ్ఞానమనే గొడ్డుతనము కల్గి యోగమనే సంతతిలేనివానికి జ్ఞానభీజము పడినపుడు అజ్ఞానము అను ముట్టు నిలిచిపోవును. జ్ఞానభీజము పడినవానికి కొంతకాలము వరకు గర్భము పెరిగినట్లు జ్ఞానము పెరిగి యోగము అను పుత్రున్ని పొందగలడు. పుట్టిన వారిలో కొడుకు పుట్టవచ్చు లేక కూతురు పుట్టవచ్చు. జ్ఞానము కల్గినవాడు కొంతకాలమునకు కర్మయోగి అయితే కూతురు పుట్టినట్లే అట్లుకాక కొడుకు పుట్టినట్లయితే బ్రహ్మయోగిగా లెక్కించుకోవలయును.
భూమి మీద బ్రహ్మయోగి అయినవాడు మనస్సును జయించు సాధన చేసి మనస్సును జయించును. ఎన్నో సంకల్పములతో కూడుకొన్న మనస్సును ఏ ఒక్క ఆలోచన చేయనీక శూన్యముగ ఉంచడమును బ్రహ్మయోగము అంటాము. శరీరమునకున్న ఐదు జ్ఞానేంద్రియములైన కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము యొక్క ప్రస్తుత విషయములనుగాని, జరిగిపోయిన, జరుగబోవు విషయములనుగాని యోచించకుండ ఉండడమును బ్రహ్మయోగము అంటాము. ఇక్కడ కొందరికి ఒక ప్రశ్న రావచ్చును. అదేమనగా ఒక గురువువద్ద ఉపదేశమంత్రమును తీసుకొని దానిని ధ్యానించుచున్నపుడు, అది ఇంతకు ముందు విన్నదగును కదా! జరిగిపోయిన చెవుకు సంబంధించిన విషయముకదా! ఇది ఇంద్రియ విషయమగుట వలన చేసేది ధ్యానము కాదంటామా? అని అడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! ఇంద్రియములకు సంబంధించిన ఒక్క విషయము మీద ధ్యాసపెట్టి జపించడము వలన అతడు అనేకము నుండి ఏకములోని వచ్చి మనస్సును ఒక్క దానిమీద పెట్టాడు కావున అది యోగము కానేరదు. మనస్సుకు ఏక విషయము కూడ లేకుండ చేసి ఏకము విూదగల సున్న విూదికి పోయినపుడు ఏకాగ్రత చెందిన వాడగును. అపుడు అతని మనస్సులో ఒకటి కూడ లేకుండ సున్న స్థితిలో ఉన్నాడని తెలియుచున్నది. ఏకాగ్రత చెందినవాడే బ్రహ్మయోగి అగును. అట్లుకాక మనస్సులో ఏదో ఒక దానిని ధ్యానించువాడు ధ్యాని లేక తపస్వి అగును, కాని యోగి కాలేడు. ఒక్క దానిని తపించుచు జపించు వానిని తపస్వి అంటారు. తపస్వికంటే ఏ ఒక్కటిలేని యోగి గొప్ప అని గీతలో కూడ "తపస్వి భ్యోధికో యోగీ" అన్నారు.
4) గుట్టు చప్పుడనక నొక్కడు ఉరికి మింటి కెగయగాను,
కుప్పిగంతులేసి పాము కరచి మ్రింగేరా || గుట్టు||
మనిషి నిత్యము తన మనస్సులో అనేక విషయములను చింత చేయుచుండును. అనేక విషయములలోనున్న మనిషి ఏ విషయము తన ఆలోచనలో లేకుండ చేసుకొను ప్రయత్నమే యోగసాధన. విషయ చింతనలలోనున్నపుడు మనిషి సంతగోలలోవున్నట్లు గందరగోళములో ఉండును. దానిలో మనస్సుకు విశ్రాంతిగాని, జీవునకు శాంతిగాని ఉండదు. మనస్సుకు ఒక్క పని కూడ లేకుండ పోయినపుడే దానికి విశ్రాంతి లభించును, అపుడే జీవునకు శాంతి దొరుకును. అదియే యోగము. యోగము చేయువేళ మనస్సుకు ఆలోచన అను చప్పుడు లేకుండ పోవుచున్నది. దానినే ఈ వాక్యములో గుట్టు చప్పుడనక అన్నారు. ఏ యోచన లేకుండ మనస్సు గుట్టుగ నిలిచిపోవడమని దాని అర్థము. అటువంటి సమయము యోగము ఎట్లగుచున్నదనగా! అపుడు క్రిందగల ఆధారమను ఒకటవ నాడీకేంద్రమునుండి బయలుదేరి పైనగల సహస్త్రారము అను ఏడవ నాడీకేంద్రమునకు మనస్సు చేరి పోవును. ఈ విషయమునే ఒక్కడు ఉరికి మింటికెగయగాను అన్నారు. మనస్సు యొక్క ధ్యాస ఏడవ కేంద్రములో చేరిపోయినపుడు క్రింద ఒకటవ కేంద్రములోనున్న చైతన్యము ఎగిరి రెండవ కేంద్రము చేరుచున్నది. అక్కడ నుండి మూడవ కేంద్రము చేరుచున్నది. ఇట్లు ఒక్కొక్క కేంద్రమును వదలి చివరకు ఏడవ కేంద్రమును చేరి అక్కడున్న మనస్సును అసలు లేకుండ చేయుచున్నది. క్రింద ఆరు కేంద్రములలోనున్న ఆత్మశక్తి ఏడవ కేంద్రమునకు వచ్చి మనస్సును మాయము చేసినపుడు జీవుడు ఆత్మలో చేరిపోవుచున్నాడు. అదియే నిజమైన బ్రహ్మయోగము. మనస్సు ఏడవ కేంద్రములో ఏక అగ్రతగ నిలిచిపోయినపుడు శరీరమంత వ్యాపించి ఉన్న ఆత్మచైతన్యము శరీరభాగములనుండి ముకులించుకొని బ్రహ్మనాడి లోని కేంద్రములకు చేరిపోవుచున్నది. అట్లుచేరిన ఆత్మచైతన్యము క్రింది నుండి గబగబ పై కేంద్రములకు ప్రాకుచువచ్చుచున్నది. అలా ప్రాకుచు చివరకు ఏడవకేంద్రము చేరి అక్కడున్న మనస్సును లేకుండ చేయుచున్నది. అలా మనస్సు ఎప్పుడైతే లేకుండ పోవుచున్నదో అపుడు జీవుడు ఆత్మతో కలియుచున్నాడు. వేరుగనున్నవి ఒకటిగ కలిసి పోవడమును యోగము అంటాము. ఒకటిగనున్నవి వేరుగ విడి పోవడమును వియోగము అంటాము. విడి విడిగనున్న జీవాత్మ ఆత్మ రెండు ఒకటిగ కలసిపోవుచున్నవి కావున దానిని ప్రత్యేకించి బ్రహ్మయోగము అంటున్నాము.
బ్రహ్మనాడినుండి కేంద్రముల ద్వార శరీరమునకు ప్రాకు ఆత్మ చైతన్యమును కుండలీశక్తి అనికూడ అంటున్నారు. కుండలిని పాముగ పోల్చి చాలామంది చెప్పుచుందురు. ఎందుకనగ పాముకు బుసకొట్టు స్వభావముండును కదా! కేంద్రములోని కుండలీశక్తి ఊపిరితిత్తులను కదలించి బుసబుసమను శబ్దముతో కూడిన శ్వాసను నడుపుచున్నది కనుక బుసకొట్టు పాముగ చెప్పారు. మనస్సు పైకి చేరిన వెంటనే కేంద్రములకు చేరిన శక్తి ఒక్కొక్క స్థానమునుండి పైకి ప్రాకుచు పోవుచున్నది. దానినే ఈ చరణములో కుప్పిగంతులేసి అన్నారు. పైకి ఎగసి పోయిన పాము అనబడు శక్తి పైన చేరిన మనస్సును లేకుండ చేయుచున్నది. దానినే పాముకరచి మ్రింగెరా అన్నారు. అప్పటివరకు జీవాత్మకు ఆత్మకు మద్యన అడ్డముగనున్న మనస్సు లేకుండ పోవుటచేత జీవాత్మ ఆత్మలో చేరిపోవుచున్నాడు. ఆత్మ జీవాత్మల సంధానమను యోగము ఈ చరణములో చెప్పబడినది. మీకు బాగ అర్థమగుటకు మరొకమారు వివరించడమేమనగా! ఒక్కడు అనగ మనస్సని అర్థము. గుట్టు చప్పుడనక అంటే ఏ యోచనలు లేకుండ ఏకాగ్రతగ అని అర్థము. ఉరికి మింటికెగయ అనగా తొందరగ క్రిందినుండి పైకి ఎక్కిపోగ అని అర్థము. పాము అనగ చైతన్యశక్తి లేక ఆత్మశక్తి అని అర్థము. కుప్పించి గంతులేసి అనగ ఒక్కొక్క కేంద్రమును ఎగరుచు దాటి పోయినదని అని అర్థము. కరచి మ్రింగెర అంటే అడ్డమున్న మనస్సును లేకుండ చేసినదని అర్థము.
5) భువిని నోరులేని మిడత పులిని మ్రింగేను,
ఈ వార్త తెలిసి మేక యొకటి పకపక నవ్వేనురా || గుట్టు||
ప్రపంచములో మిడుత చాలా చిన్నది. పులి మిడుతకంటే చాలా పెద్దది. పులి ఎంత పెద్దదైన క్రిందనే సంచరించుచుండును. మిడుత ఎంత చిన్నదైన పైపైన ఎగిరి పోగలదు. పులివలె నడువడము మిడతకు రాదు. పెద్దపులిని చిన్న మిడుత మ్రింగడమంటే చాలా విచిత్రము కదా! అదియు నోరులేని మిడతంట. పులికి మేకకు శత్రుత్వమున్నట్లే బలమైన పులి బలహీనమైన మేకను సులభముగ చంపివేయగలదు. అటువంటి పులి చనిపోయిందంటే మేకు సంతోషముకాక ఏమగును. అందుకే పులిని మిడత మ్రింగిందను వార్త తెలుస్తునే మేక సంతోషము పట్టలేక పక పక నవ్విందంట. ఇదంత వింటుంటే ఒక కట్టు కథలాగుంది కదా! మమ్ములనడిగితే ఇది కట్టుకథకాదు సత్యమైన కథే అంటున్నాము. ఇందులో ఇమిడియున్న సత్యమేమిటో వివరించుకొందాము.
భూమి మీద అజ్ఞానము ఎంతగానో విస్తరించియున్నది. కొన్ని లక్షల మందిలో ఒక జ్ఞాని కూడ ఉండుట అరుదు అనుకొన్నాము. పది లక్షలమందికి ఒక జ్ఞాని ఉన్నప్పటికి దాని ప్రకారము జ్ఞానముకంటే అజ్ఞానము పది లక్షలంత పెద్దదని కొలత పెట్టుకోవచ్చును. జ్ఞానమును చిన్న మిడతగ లెక్కించుకొంటే అజ్ఞానమను పులి కొన్ని లక్షలరెట్లు పెద్దదనియే చెప్పవచ్చును. నేటి సమాజములో అజ్ఞానము ముందర జ్ఞానము చాలా చులకనగా, చాలా చిన్నగ కనిపిస్తునే ఉన్నది. చిన్న మిడతలాగ జ్ఞానముంటే, పెద్ద పులిలాగ అజ్ఞానము ఉండనే ఉన్నది. సమాజ దృష్ఠిలో జ్ఞానము ఎంత చిన్నదైన అజ్ఞానము ఎంత పెద్దదైన పెద్దదైన అజ్ఞానమును చిన్నదైన జ్ఞానము జయించివేస్తున్నది. అది ఎలాగంటే తత్త్వములో చెప్పినలాగేనని చెప్పవచ్చును. నోరులేని మిడత అన్నారు కదా. మిడతకు తినేదానికి నోరులేదుగాని అరిచేదానికి కంఠమున్నది. మిడతలకు తినే నోరుకంటే అరిచే కంఠమే గొప్పగ ఉండును. మిడత నోరు కనిపించదుకాని కంఠము బాగా వినిపించును. ఎక్కువ శబ్దము చేయు చిన్న మిడత గొప్పదైన పులి చెవులో దూరిందనుకో పులి దానిని ఏమి చేయలేదు. చెవులో దూరిన మిడత పులిని ఏమైన చేయగలదు. చెవులోపలికి చేరి మెదడు దగ్గరకు పోయి కంఠమునకు పని పెట్టితే పెద్దపులి ూడ గిరగిర తిరిగి చనిపోవలసిందే. ఏనుగునైన కదిలేటట్లు చేయగల సామత్యము చిన్న దోమకున్నట్లు, కరిచే చోట కరిచి మనిషిని నిలువున ఎగిరిపడునట్లు చేయ సామత్యము చిన్న చీమకున్నట్లు పులిని కూడ చంపు స్థోమత మిడతకున్నదని చెప్పవచ్చును. అందువలన ఈ తత్త్వములో నోరులేని మిడత పులిని మ్రింగెరా అన్నారు. చిన్నదైన జ్ఞానము మనిషి చెవిలో దూరి మెదడుకు చేరితే ఎన్నో సంవత్సరములనుండి మనిషిలో పేరుకొనిపోయిన పెద్ద అజ్ఞానము పటాపంచలగునని పోల్చి చెప్పడమే మిడత పులిని మ్రింగెను అని అన్నారు.
అజ్ఞానముతో కూడిన అజ్ఞానులు, జ్ఞానముగల జ్ఞానులు సమాజములో ఉన్నారు. సమాజములో అజ్ఞానులదే సంఖ్య ఎక్కువ. జ్ఞానుల సంఖ్య తక్కువ. అజ్ఞానులకు జ్ఞానులు ఎప్పుడు భయపడుచునే ఉందురు. జ్ఞానులను లేకుండ చేయాలని అజ్ఞానులు చూస్తునే ఉందురు. తమకు ఆటంకము చేయు అజ్ఞానులు జ్ఞానులుగ మారిపోతే మంచిదని జ్ఞానులు అనుకొనుచుందురు. ఎప్పుడైన ఒక గొప్ప అజ్ఞాని జ్ఞానముచేత మార్చబడి, అజ్ఞానిగ లేకుండ మారిపోయాడంటే ఆ వార్త సుజ్ఞానులకు సంతోషమును కల్గించేదే అగును. అందువలన సాధు జంతువులైన మేకవలెనున్న జ్ఞాని పులిలాంటి అజ్ఞాని నాశనమయ్యాడంటే, జ్ఞానిగా మారాడంటే సంతోషపడునని చెప్పడమే ఈ చరణములో ఆ వార్త తెలిసి మేక యొకటి పకపక నవ్వేరా అన్నారు.
-***-