తత్త్వముల వివరము/నా చివరి మాట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

---------------నా చివరి మాట----------------


నేటి సమాజములో తత్త్వములు అనువాటికి ఏమాత్రము విలువ లేకుండపోయినది. భిక్షగాల్లు తామ భిక్షాటలో పాడుకొనుట మేము చిన్నతనములో చూచాము. ఇప్పటి కాలములో భిక్షగాల్లు కూడ భక్తిరూపములోనున్న సినిమా పాటలు పాడుచున్నారు. తత్త్వములను పాడు భిక్షగాల్లు కూడ చాలా అరుదుగా ఉన్నారు. ఉన్నవారు చనిపోతే వాటిని పాడేవారే కనిపించరనుకుంటాము. ఆత్మ జ్ఞానములో అత్యంత ఉన్నతమైన తత్త్వములు చివరకు భిక్షగాల్లపాలై చివరకు అక్కడ కూడ లేకుండ పోవు స్థితికి చేరుకొన్నవని చెప్పవచ్చును. ఇకపోతే బ్రహ్మముగారి మఠమువారు కొన్ని తత్త్వములను అవియు బ్రహ్మముగారి పేరున్న వాటని కొంత ప్రచారములో పెట్టుకొన్నారు. అయినప్పటికి అవి అందరికి


రుచించడము లేదు. ఇంటింట టీవిలలో చాలామంది స్వాముల చేత జ్ఞానము చెప్పబడుచున్నది. వారు కూడ తత్త్వములను ఎక్కడ ప్రస్తావించడములేదు. దక్షణ భారతదేశములో తెలుగుబాషలో పూర్వము ప్రసిద్ధిగాంచినవి తత్త్వములు. అటువంటి తత్త్వములు నేడు మచ్చుకైన కనిపించకుండ పోయినవి. తెలుగునాట అచ్చు యంత్రములులేని నాడు తమిళనాడైన మద్రాసులో అచ్చుపరిశ్రమలు ఎక్కువ ఉండేవి. సి.వి. కృష్ణాబుక్‌ డిపోవారు, ఎన్‌.వి. గోపాల్‌ బుక్‌ డిపోవారు నూరు సంవత్సరముల పూర్వమునుండి పాత వ్రాతపతులను సేకరించి అచ్చువేసి వ్యాపారరీత్య అమ్ముకొనెడివారు. దాదాపు నలబై సంవత్సరముల క్రితము వరకు ఆంద్రప్రదేశ్‌లో క్యాలెండర్లు కూడ వారివే ఉండెడివి. వారు సేకరించి అచ్చువేసిన తత్త్వముల, పద్యముల పుస్తకములు ఎక్కడైన కనిపించిన అవి శిథిలావస్తలో ఉన్నాయి. మేము స్వయముగ సి.వి. కృష్ణాబుక్‌ డిపోవారితో మద్రాసులో కలసి ఒక పుస్తకమును గురించి అడిగితే అది స్టాకులేదని చెప్పుచు వారి తండ్రికాలములో చేసినవి ఆ పుస్తకములని చెప్పారు. వాటిని ఎవరు కొనడము లేదని, అందువలన వాటిని అచ్చు వేయడములేదని కూడ చెప్పారు. మా తండ్రి ఆధ్యాత్మికవేత్త మరియు గడికోట సచ్చిదానంద శిష్యుడైన దానివలన ఆత్మలింగ శతకము, వేమన పద్యములు, కాలజ్ఞాన తత్త్వములు, ఆత్మబోధామృత తత్త్వములు, తారకామృత తత్త్వములు అను పుస్తకములను అప్పటికాలములో అచ్చువేశాము ఇప్పటికి కొన్ని ఉన్నవి. అందువలన అటువంటి పుస్తకములను మేము చేయమన్నాడు.


ఈ విధముగ తత్త్వాల పుస్తకములు కరువైపోయినవి. ఇప్పటికి ఎక్కడైన తత్త్వము పాడుకొను పాతవారుంటే వారికి పాడేవరకు వస్తుంది కాని దాని అర్థము ఏమాత్రము తెలియదు. నేటికి కాలజ్ఞాన తత్త్వములను పుస్తకములు ఎక్కడైన కనిపించినప్పటికి అందులో తత్త్వాలు గలవుగాని వాటికి అర్థమును ఎవరు వ్రాయలేదు. బాగ అర్థమయ్యే పుస్తకాలను కూడ చదివే ఓపికలేదను మనుషులు అర్థముకాని అర్థములేని వాటిని చదవరు. కొందరు సంస్కృతమును నేర్చిన స్వావిూజీలు ఏ పాండిత్యములేని తత్త్వములను చూచి వాటిని మతి స్థిమితములేనివారు వ్రాసిన తిక్క వ్రాతలు అంటున్నారు. ఇట్లు ఎన్నో విధముల ఆధ్యాత్మిక విద్యలో ఆణిముత్యములైన తత్త్వములకు ఏమాత్రము గుర్తింపు లేకుండపోయినది. కొన ఊపిరితో మరణశయ్యవిూదున్న వానిలాగ తత్త్వములు అంత్యదశకు చేరుకొనుట మాకు కొంత భాద అనిపించింది. అవి తిక్క వ్రాతలుకాదు, మన పెద్దలు సంపాదించి ముడివేసిన పెట్టిన జ్ఞానధనము యొక్క మూటలని చెప్పదలచుకొన్నాము. అవి జ్ఞానధన నిలయములని అందరు గుర్తించలాంటే ఆ మూటలలో ఏముందో విప్పిచూపితేకాని అర్థముకాదనుకొన్నాము. అందువలన అందరికి వాటిలోని అర్థమును వివరించాలనుకొని ఆ కార్యమును గ్రంథరూపము లోనికి తెచ్చాము ఆ చిన్న గ్రంథమే ఈ "తత్త్వముల వివరము"


తత్త్వములన్నిటిని వ్రాయాలంటె చాలా కష్టమైన పని కావున వివిధ రూపాలలో పద్దతులలోనున్న వాటిని ఏరుకొని వివరించి విూ ముందుంచు తున్నాము. వీటిలో సులభమైనవి కష్టమైనవి రెండు రకముల తత్త్వములు గలవు. అంతేగాక వీటిని ఎవరైన అర్థము చెప్పగలరా అని సవాలు చేసినవి, చెప్పగలనంటే సంవత్సరమైన గడువిస్తామని సవాలు విసిరిన వాటిని ఏరుకొని వ్రాశాము. వారి సవాల్లు మాకు పౌరుషమును పోసి వ్రాయించినవి. తత్త్వములన్ని శరీరములోపలి జ్ఞానమును సూచించునవి అను సూత్రము మాకు బాగా తెలుసు. నుక ఆ సూత్రమును అనుసరించి ఎంత కష్టముగ కనిపించిన తత్త్వమునకైన సులభముగ వివరమును వ్రాయగలిగాము. ఈ మావ్రాతతో అవసానదశలో మరణశయ్యపైనున్న తత్త్వములు క్రొత్తగ యవ్వనరూపముపొంది అందరిని ఆకర్షించగలవని అనుకొంటున్నాము. ఈ తత్త్వాలను మీరు చదివి తత్త్వములు ఇటువంటి వని, దేవుని దగ్గర చేర్చునవని, ఇతరులకు తెల్పుటవలన మీరు కూడ దేవుని సేవలో పాలుపంచుకొన్నవారగుదురు. లాభాలు రావాలని మొక్కి అక్రమార్జనలచే హుండీలలో లక్షలు వేసివచ్చిన ఏమాత్రము ఉపయోగము లేదు. నీకున్న స్థోమతతో కొన్ని పుస్తకములనుకొని ఆసక్తియున్నవారికి దానము చేస్తే జ్ఞానదానమగును. దానివలన విశేషమైన ఫలితము నీకు తెలియకుండనే చేరును. దేవుడుకాని దేవుల్లకు డబ్బులు వృథాగా ధారపోయుటకంటే దైవ స్వరూపములై, దైవజ్ఞానము నింపాదిగ అందించు పుస్తకములను ఇతరులకు దానము చేయుట వలన దేవుని పని ఎంతో చేసినట్లగును. ఇదే విషయమునే భగవద్గీతలో "మదర్థమపి కర్మాణి కుర్వాన్‌ సిద్ది మవాప్యసి" అన్నారు. నాకొరకు పని చేసితే నీకు సిద్ది లభించగలదని దీని అర్థము. ఇప్పటినుండైన నిజమైన దేవుని సేవ చేయమని, తత్త్వాలలోని రహస్యములను తెలుసుకోమని తెలుపుచు ముగించుచున్నాము.

ఇట్లు

ఇందూ ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త

ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు

-***-