తత్త్వముల వివరము/11వ తత్త్వము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

--------------11. తత్త్వము--------------


శ్రీ గురు రాయుడు మాయమర్మము తెలిపినాడే
మాయలో ఉంటూ లేనివాడు కమ్మన్నాడే


 1) ఆరును ద్రుంచి ఆరును నరకమన్నాడే
ఆరును ఆరును చేరక ఉండమన్నాడే || శ్రీ గురు ||

 2) తొమ్మిది వాకిల్ల కొంపకు ఎందుండి వస్తివన్నాడే
ఎందు తిరిగినా ముందుచోటుకే పొమ్మన్నాడే || శ్రీ గురు ||

 3) ఆరు శిఖరములపైన వెయ్యికాల్ల మంటపమన్నాడే
ఆరు శిఖరముల ఎక్కి ఎగచూడమన్నాడే || శ్రీ గురు ||

 4) మూడు నదులు కలియుచోటు తెలియమన్నాడే
మూటిలోయుండే మూల పురుషుని చూడమన్నాడే || శ్రీ గురు ||


వివరము :- విశ్వమంత వ్యాపించియున్నవి రెండే రెండు అవియే ప్రకృతి పురుషుడు అని అంటాము. ప్రకృతికి మారు పేరు మాయ అని కూడ కలదు. అలాగే పురుషున్ని దేవుడు అని కూడ అనుచున్నాము దేవుడు పుట్టించినదే మాయ. దేవుని ఆజ్ఞప్రకారము నడుచుకొనునదే మాయ. తనకు వ్యతిరేఖముగ వ్యవహరించమని దేవుడు మాయను ఆజ్ఞాపించాడు. కావున మాయ ఎప్పటికి దైవమార్గమునకు వ్యతిరేఖమే. ఒక విధానములో మాయను భార్య అని, దేవున్ని భర్త అని చెప్పవచ్చును. భర్త అయిన దేవునికి తన భార్య అయిన మాయ యొక్క వివరమంతయు తెలియును. కావున మాయ వివరము తెలియజెప్పవలయునంటే అది దేవునికొక్కనికే సాధ్యము. దేవుడు తన శక్తిలో కొంత భాగమును భూమి విూద మనిషిగ తన ప్రతినిధిగ పుట్టించును. అతనినే గురువు అంటున్నాము. భూమిమీద దేవుని అవతారము తప్ప ఎవరు గురువగుటకు అర్హులు కారు. దేవుని అంశ అయిన గురువు తనను విశ్వసించిన వారికి మాయ యొక్క మర్మము తెలుపును. అలా మాయ యొక్క మర్మము తెలిసిన వారు తామరాకు నీటిలో ఉన్నప్పటికి తేమ అంటనట్లు మాయలో ఉన్నప్పటికి కర్మ అంటని వారైవుందురు. అందువలన ఈ తత్త్వములో మొదటనే శ్రీగురు రాయుడు మాయమర్మము తెలిసినాడే మాయలో ఉంటూ లేనివాడు కమ్మన్నాడే అన్నారు.


 1) ఆరును ద్రుంచి ఆరును నరకమన్నాడే
ఆరును ఆరును చేరక ఉండమన్నాడే || శ్రీ గురు ||

మన శరీరములో దేవుడు నివశిస్తున్నాడు కావున శరీరమును దేవాలయము అన్నాము. దేవాలయమునందు గర్భగుడిలో భగవంతుని ప్రతిమ ఉన్నప్పటికి దాని చుట్టు వికృతాకారములో ఉన్న సింహ తలాటము లేక ప్రభావలి అనునది తప్పకయుండును. అదే విధముగనే శరీరములో దేవుడున్నప్పటికి మాయ కూడ కలదు. దేవుడు ఆత్మరూపములో ఉంటూ శరీరమును నడుపు శక్తిగ శరీరమంత వ్యాపించి ఉండగ, మాయ గుణముల రూపముతో తలయందు గలదు. మనిషి తలయందు గల గుణములను మాయజనితములని లేక మాయయుక్తములని చెప్పవచ్చును. అందువలన భగవద్గీతలో భగవంతుడైన శ్రీకృష్ణుడు " గుణమయీ మమ మాయా " అన్నాడు. దీని ప్రకారము మాయ ప్రతి శరీరములోను గుణముల రూపములో ఉన్నదని తెలియుచున్నది. గుణములు లేనివాడు ఎవడు లేడు, కావున మాయలో లేనివాడు ఎవడు లేడనియే చెప్పవచ్చును. మనిషి తలలోని మాయ యొక్క స్థానము ఎక్కడున్నదని పరిశీలించి చూచితే, తలలో సూక్ష్మరూపముగ ఉన్న నాలుగు చక్రములో క్రింది చక్రమైన గుణచక్రములో సాత్విక, రాజస, తామసమను మూడు భాగములు గలవు. ఆ భాగములలో ఒక్కొక్క భాగమునందు ఆరు ఒక రకము, ఆరు మరొక రకము మొత్తము పండ్రెండు గుణములు గలవు. ఈ రెండు రకములైన గుణములను జయించగలిగితే మాయను జయించి నట్లగును. అందువలన పై చరణములో ఆరును ద్రుంచి ఆరును నరకమన్నాడే అని వర్ణించి చెప్పారు.


మాయ గుణమయమైయుండినప్పటికి ఆరు ఒక రకము ఆరు మరొక రకమైన గుణములుగ ఉన్నదని చెప్పుకొన్నాము. ఆరు మరియు ఆరు వివరమును పరిశీలించి చూచితే ఆరు చెడు గుణములు, ఆరు మంచి గుణములుగ ఉన్నవి. ఆరు చెడు గుణములు వరుసగ 1) కామ (ఆశ) 2) క్రోధ (కోపము) 3) లోభ (పిచునారితనము) 4) మోహ (నాది, నావారు) 5) మధ ( గర్వము) 6) మత్సర (అసూయ). ఈ ఆరు గుణములనే మనిషికి శత్రువులాంటివని అరిషట్‌ వర్గము అన్నారు. అలాగే మనిషికి మిత్రునిలాంటి మంచి గుణములు కూడ ఆరు గలవు. అవి వరుసగ 1) దాన 2) దయ 3) ఔధార్య 4) వైరాగ్య 5) వినయ 6) ప్రేమ అనునవి. ఈ గుణములను బట్టి మనిషి సమాజములో మంచివాడని లేక చెడ్డవాడని లెక్కించబడుచున్నాడు. ఈ గుణముల వలననే పాపము పుణ్యములను కర్మలు కలుగుచున్నవి. మాయ యొక్క రెండు రకముల గుణములు జీవునకు కర్మలను అంటగట్టి జన్మను కలుగజేయునవే. కనుక కర్మలను బంధనములు అన్నారు. మాయకు వ్యతిరేఖము దైవము. మాయయొక్క గుణములకు వ్యతిరేఖము దైవము యొక్క జ్ఞానము. గుణములచేత తయారగు కర్మలకు వ్యతిరేఖము జ్ఞానము వలన తయారైన జ్ఞానాగ్ని. అందువలన మనషి దైవజ్ఞానమును తెలిసి జ్ఞానాగ్నిని సంపాదించుకొంటే మాయ గుణముల ప్రభావమైన కర్మ కాలిపోవునని తెలుపుచు ఆరును, ఆరును చేరకయుండమన్నాడని వ్రాశారు.


 2. తొమ్మిది వాకిల్ల కొంపకు ఎందుండి వస్తినన్నాడే
ఎందుతిరిగినా ముందు చోటికే పొమ్మన్నాడే ||శ్రీ గురు||

మనము నివశించుదానిని ఇల్లు లేక గృహము అంటాము. మనిషి తన ఆర్థిక స్థోమతను బట్టి పూరిగుడిసెనుండి పెద్దమేడలలో వరకు నివశిస్తున్నాడు. మనిషి ఎటువంటి ఇంటిలో నివశించినప్పటికి ఆ ఇంటికి ఒక ద్వారము (వాకిలి) నుండి అనేక ద్వారముల వరకు ఉండవచ్చును. చిన్న గుడిసెకైతే ఒక వాకిలి ఉంటుంది. పెద్ద మేడలకైతే ఇరువై లేక ముప్పై వరకు ఎన్నైన ఉండవచ్చును. గృహములన్నియు వానివాని కర్మానుసారము ఉండునని చెప్పవచ్చును. ఆధ్యాత్మిక విద్యలో ఆత్మల వివరమే చెప్పబడుచున్నది, కావున ఇక్కడ జీవాత్మ వివరమునే మనము ప్రస్తావించుకోవాలి.


మనిషికి గృహమెలాగలదో జీవాత్మకు కూడ గృహము కలదు. అదియే శరీర గృహము. మనుషులు నిర్మించుకొన్నవి బయటికి మిద్దెలు మేడలైతే, దేవుడు నిర్మించి ఇచ్చిన గృహము శరీరము. బయటి ఇంటికి వాకిల్లు ఎన్నైన మనము పెట్టుకోవచ్చును గాని దేవుడు ఇచ్చిన శరీర గృహమునకు కేవలము తొమ్మిది వాకిల్లు మాత్రము తప్పక ఉండును. జీవాత్మ శరీరమను గృహములో కొంతకాలము నివాసము చేసి ఆ శరీర గృహమును వదలి పోవడము కూడ జరుగుచున్నది. మనము నిర్మించుకొన్న బయటి గృహము కొంతకాలమునకు శిథిలమై నివాస యోగ్యముకానట్లు శరీరగృహము కూడ శిథిలమై పోవుచున్నది. జీవాత్మ శిథిలమైన శరీరమును వదలి మరొక క్రొత్త శరీర గృహములో చేరుచున్నాడు. మొట్టమొదట జీవాత్మ పరమాత్మ నుండి వచ్చినదే. అలా వచ్చిన జీవాత్మ నివశించుటకు శరీరము తప్పనిసరి అయినది. మొదట పరమాత్మనుండి వచ్చిన జీవాత్మ తర్వాత శరీర గృహములు మారుచు భూమి మీదనే ఉండిపోయినది. ఈ తత్త్వములో జీవాత్మకు కావలసిన జ్ఞానమును చెప్పుచు తొమ్మిది వాకిల్లకొంపకు ఎందుండి వస్తివని ప్రశ్నించారు. తర్వాత ఎన్ని శరీరములు మారిన మొదటి పరమాత్మలోనికి పొమ్మని చెప్పుచు ఎందుతిరిగిన ముందు చోటికే పొమ్మన్నాడు. గురువు శిష్యునకు బోధించవలసినది ఆత్మజ్ఞానము కావున జీవాత్మకు తన మొదటి స్థానమును జ్ఞాపకము చేసి తిరిగి అక్కడికే పొమ్మని హితము ఈ చరణములో చెప్పారు.


 3. ఆరు శిఖరములపైన వెయ్యికాల్ల మంటపమన్నాడే
ఆరు శిఖరములు ఎక్కి ఎగచూడమన్నాడే ||శ్రీ గురు||

శిఖరము అనగ కొండ అగ్రభాగమని అర్థము. ఆరుకొండలు పూర్తి ఎక్కిన తర్వాత పైన ఏడవకొండ మీద వెయ్యికాల్లమంటపమున్నదట. వేయిస్థంభాల మంటపములో దేవుడు తప్ప ఎవరుంటారు. కావున దేవున్ని చూడాలంటే ఆరు శిఖరములను ఎక్కి పైన ఉన్న దేవున్ని ఎగ చూడమన్నారు. ఇదే విషయమును తెలియజేయుటకు ఏడుకొండల మీద వెంకటేశ్వరుడున్నాడని చెప్పుచుందురు. కొండల మీద దేవుడుంటే ఏడుకొండలేమిటి ఏకంగా ఎనభై కొండలైన ఎక్కి చూడవచ్చును. ఏడు కొండలు ఎక్కిన, ఎనభైకొండలు ఎక్కిన అక్కడ కనిపించేది శిలాప్రతిమ తప్ప ఏమి ఉండదు. అది ప్రతిరూపమైన ప్రతిమే తప్ప దేవుడు కాదు.

దేవుడు ఆత్మరూపములో ఉంటాడు కాని ప్రకృతి రూపమైన రాల్లు, నీల్లరూపములో ఉండడని పెద్దలంటుంటారు. అందువలన చిల్లరరాల్లకు మ్రొక్కుచుయుంటె చిత్తము చెడునుర అన్నారు. అట్లయితే ఈ తత్త్వములో ఏడు శిఖరములు ఎక్కి ఎగచూడమని ఎందుకన్నారని కొందరికి ప్రశ్న రావచ్చును. దానికి సమాధానము ఏమనగా! మన శరీరమే దేవాలయము అందులోని ఆత్మే దేవుడని కొందరు పెద్దలు అన్నారు కదా! దాని ప్రకారము శరీరములోని ఆలయ అమరికను గురించి చెప్పినదే ఈ తత్త్వము చరణము. మన శరీరములో మూడు లక్షల యాభైవేల నాడులు గలవని ప్రతీతి. అందులో అన్నిటికంటే పెద్దవి మూడని, అవియే ఇడ, పింగళ, సుషుమ్ననాడులని వాటినే సూర్య,చంద్ర, బ్రహ్మనాడులని అంటున్నాము. వాటిలో ముఖ్యమైనది సుషుమ్న అనబడు బ్రహ్మనాడి. ఈ బ్రహ్మనాడి శరీరములోని వెన్నెముక మధ్యభాగములో గుదస్థానము మొదలుకొని కపాల స్థానము వరకు వ్యాపించివున్నది. అట్లు వ్యాపించివున్న బ్రహ్మనాడి ఏడు నాడీకేంద్రములుగ విభజింపబడి ఉన్నది. ఆరు కేంద్రముల పైనగల ఏడవ నాడీకేంద్రము ఆత్మకు స్థానమై ఉన్నది. బ్రహ్మనాడిలో ఏడవ నాడీకేంద్రమైన మెదడులో ఆత్మ నివాస ముండుట వలన ఆత్మను దైవముగ లెక్కించుటవలన ఆరు నాడీ కేంద్రములను ఆరు శిఖరములుగ పోల్చి ఏడవ దానివిూదికి ఎగచూడ మన్నారు. శరీరములోని ఆత్మను తెలుసుకొనుటకు చేసిన ప్రయత్నమే ఈ తత్త్వము యొక్క ఉద్దేశము. కావున శరీరములోని నాడీకేంద్రములను కొండలుగ పోల్చి ఏడవకొండ మీద దేవుడున్నాడని ఏడవ నాడీ కేంద్రమునకు దృష్ఠిమరలునట్లు చేశారు.


 4. మూడు నదులు కలియుచోటు తెలియమన్నాడే
మూటిలోయుండే మూల పురుషుని చూడమన్నాడే ||శ్రీ గురు||

ఇంతకు ముందు శరీరములోని మూడునాడుల గురించి చెప్పు కొన్నాము. ఈ మూడునాడులు విడివిడిగ ఉండి క్రింది వరకు వ్యాపించి ఉన్నప్పటికి ఆ మూడు కలియుచోటు ఒకటి కలదు. అదియే మెదడు స్థానము. దానిని ఏడవ పెద్దనాడీ కేంద్రమని కూడ చెప్పుకొన్నాము. ఈ కేంద్రములో మూడునాడులు కలియుచున్నవి. ఈ ఏడవ కేంద్రములోనే ఆత్మ నివాసమని చెప్పుకొన్నాము. ఆత్మయే శరీరమంతటికి అన్ని నాడీ కేంద్రములకు మూలాధారమైవున్నది. ఈ విషయమును వివరించుటకు మూడునాడులను మూడునదులుగ పోల్చి మూడు నదులు కలియుచోటు తెలియమన్నారు. మనలోని మనస్సును బాహ్యచింతలయందు లగ్నము చేయక మన తలయందు త్రికూట స్థానములో ధ్యాసనుంచితే అక్కడున్న ఆత్మ తెలియునని పెద్దల ఉద్దేశము. కావున మూటిలోవుండే మూల పురుషుని తెలియమన్నారు. శరీరములో మూడునాడులు కలియు త్రికూట స్థానమున మనస్సు నిలుపనివాడు, బాహ్యముగ ఆత్మను వెతుకువాడు ఎప్పటికి బ్రహ్మవేత్త కాలేడని నాల్గవ చరణములోని భావము.

-***-