Jump to content

జ్యోతిష్య శాస్త్రము/మంచి దశలు - చెడు దశలు

వికీసోర్స్ నుండి

38. మంచి దశలు - చెడు దశలు

[మార్చు]

గ్రహచారమును చూచుటకు పన్నెండు లగ్నములను చూచినట్లు దశా చారమును చూచుటకు లగ్నములనూ, వాటిలోని నక్షత్రములనూ చూడవలసి యుండును. పుట్టిన సమయమునుబట్టి జాతక లగ్నమును తెలుసుకొన్నట్లు దశలను తెలియుట కొరకు కూడా పుట్టిన సమయమునుబట్టి తెలియవలసిన అవసరమున్నది. పుట్టిన సమయములో గల నక్షత్రమునుబట్టి చంద్రుడు ఎన్నో లగ్నములోయున్నాడో, ఎన్నో నక్షత్ర పాదములోయున్నాడో తెలిసినట్లు ఒక మనిషి దశలను తెలియుటకు కూడా పుట్టిన సమయమును అనుసరించి ఆ దినము జరుగుచున్న నక్షత్రమునుబట్టి దశలను తెలియ వచ్చును. జనన సమయములోనున్న లగ్నమును ఆ దిన పంచాంగములో తెలియవచ్చును. పంచాంగములోని లగ్నమును తెలిసినంతమాత్రమున ఆ లగ్నము ఎన్నో పాదము (భాగము) లో జన్మించినదీ కొంత గణితమును ఉపయోగించి తెలియవలెను. అలా తెలియుటకు ముందు దినమున గడచిన నక్షత్రమును తీసుకొని అది ఆ దినము గడచిపోగా, ముందు దినమున గడచిన జన్మదిన నక్షత్రమును తెలిసి, అట్లే పంచాంగము ప్రకారము మనిషి పుట్టిన సమయము వరకు గడచిన నక్షత్రమును తెలిసి ముందు దినము గడచిన మరియు ప్రస్తుత దినము గడచిన నక్షత్రమును కలుపగా మొత్తము గడచిన నక్షత్రము తెలిసిపోవును. అప్పుడు ఆ దినము నక్షత్రము ఎంత వరకున్నదో పంచాంగములో చూచి పంచాంగము ప్రకారము గడచినది తీసివేయగా జరుగవలసినది మిగిలిపోవును. మిగిలిపోయిన దానినిబట్టి గానీ లేక జరిగిన దానినిబట్టిగానీ ఆ దినము జనన సమయమునకు నక్షత్రము ఎన్నో పాదములో ఉన్నదీ తెలిసిపోవును. ఆ దిన నక్షత్రమునుబట్టి పన్నెండు దశలలో ప్రస్తుతము జరుగుచున్న దశ ఏమిటి? అని తెలియవచ్చును. జన్మలో ఉన్న దశను తెలిసిన దాని వెనుకవచ్చు దశలు ఏమిటనీ, అవి ఎన్ని సంవత్సరములు గడియవలసియున్నదనీ తెలియును. ఇప్పుడు ఉదాహరణకు 2009 సంవత్సరము అష్టమి మంగళవారము 17వ తేదీన ఉదయము 9 గంటలకు జన్మించిన రంగయ్య జాతకమునుబట్టి అతను జన్మించిన సమయములోనున్న అనూరాధా నక్షత్ర రెండవ పాదమునుబట్టి అతనికున్న దశలను వాటి సంవత్సరములను తెలుసుకొందాము. కాల చక్రములో మేషము మొదలుకొని మీనము వరకు పన్నెండు భాగములు ఉన్నట్లు, మనిషి దశలలో పన్నెండు గ్రహములు గలవు. మేషలగ్నములో ఎన్ని నక్షత్ర పాదములున్నవో వాటిలో జన్మించిన అదియే సూర్య దశకు ప్రారంభమగును. అట్లే పన్నెండు లగ్నములకు నక్షత్రములున్నవి కదా! ఆ నక్షత్రములతోనే దశా సంవత్సరములను చూపడము జరుగును క్రింద చూడండి.

ఈ విధముగా నక్షత్రములనుబట్టి దశలను గుర్తించవచ్చును. ఏ నక్షత్రములో జన్మించితే ఏ దశ వచ్చునో తెలియవచ్చును. దీనినిబట్టి రంగయ్య పుట్టిన సమయంలో అనూరాధ నక్షత్రము రెండవ పాదము ఉండుటవలన అతనిది బుధదశయని చెప్పవచ్చును. మనిషి మరణించిన వెంటనే రెండవ జన్మకు పోవునని చెప్పుకొన్నాము. మరణము జరిగిన తర్వాత జన్మకు పోవు లోపల ఎంతకాలము జరుగవచ్చును అని ప్రశ్నవస్తే ఒక్క సెకను కాలము కూడా పూర్తిగా ఉండదనియే చెప్పవచ్చును. మరణము తర్వాత జన్మించవలసిన స్థలము పదివేల కిలోమీటర్ల దూరములోయున్నా, లేక అంతకంటే ఎక్కువగా ఖండాంతరములలోయున్నా, ఇంకా ఎక్కువగా గ్రహాంతరములలోయున్నా ఒక్క సెకను కాలము కూడా పూర్తిగా పట్టదనీ, మరణించిన వెంటనే ఎక్కడైనా జన్మించుననీ చెప్పుకొన్నాము. ఏమాత్రము ఆలస్యము లేకుండా చనిపోయిన క్షణములోనే జన్మించినప్పటికీ, అంతకంటే ఎక్కువ వేగముతో సంచిత కర్మ ప్రారబ్ధముగా మార్చి వేయబడును. ఎవరి ఊహకూ అందనంత వేగముగా ఒక జీవితమునకు సరిపడు ప్రారబ్ధకర్మను సంచితము నుండి నిర్ణయించబడును. చనిపోయిన జీవుడు గతజన్మలో కాలచక్రమునుబట్టి కర్మచక్రమునుబట్టి గుణచక్రములో ఎక్కడుండునో, ఏ మార్పు లేకుండ అక్కడేవుండి జన్మించును. కాలచక్ర, కర్మచక్ర, గుణచక్రముల చట్రములో ఏ మార్పు లేకుండ జన్మ కల్గుచున్నది. అంతేకాక పోయిన జన్మలో ఏ దశలోవుండి చనిపోయివుండునో, అదే దశలోనే మరుజన్మ కూడా యుండును. ఒక దశాకాలము పది సంవత్సరము లుండి అందులో మూడు సంవత్సరముల, నాలుగు నెలల, పది రోజులు గడచియుంటే మరుజన్మలో అదే దశ ప్రారంభమగును. పోయిన జన్మలో అయిపోయిన చోటనుండియే ప్రారంభమై గతములో ఆ దశలో జరుగవలసిన ఆరు సంవత్సరముల, ఏడు నెలల ఇరువది రోజులు గడచిన తర్వాత రెండవ దశ ప్రారంభమగును. జన్మలో కర్మ మారినా కాలచక్ర లగ్నములు గానీ, దశా సంవత్సరములుగానీ, గుణచక్రములోని గుణములుగానీ మారవు. ఇంతకుముందు ఏ నక్షత్రములో పుట్టినవారు ఏ దశలో పుట్టునో తెలుసు కొన్నాము. ఇప్పుడు ఏ దశ ఎన్ని సంవత్సరముల పరిమాణమున్నదో తెలుసుకొందాము.

ఒక మనిషి జీవితము యొక్క పరిమాణము 120 సంవత్సరములుగా నిర్ణయించబడినది. 120 సంవత్సరములలో ఒక మనిషి ఎన్నిమార్లు చనిపోయినా, ఎన్నిమార్లు క్రొత్త జన్మకు పోయినా వాటిని దేవుని దృష్ఠిలో అన్ని జన్మలుగా లెక్కించబడవు. 120 సంవత్సరములకు ఒక జన్మగా లెక్కించుటకు నిర్ణయము చేయబడినది. 120 సంవత్సరములు గడచితేనే ఒక జీవితము లేక ఒక జన్మగా లెక్కించుటకు శాసనము చేయబడినది. మనిషికైనా వేరు జంతువుకైనా, ఇతర క్రిమికైనా ఒకే నిర్ణయము ప్రకారము 120 సంవత్సరములకొకమారు జన్మగా గుర్తించవచ్చును. 120 సంవత్సరములలో ఒక జంతువు లేక ఒక మృగము ముప్పదిమార్లు చనిపోయి తిరిగి జన్మించినా అవన్నియు అన్ని జన్మలుగా లెక్కించబడక ఒకే జన్మగా లెక్కించ బడును. దానికి సూత్రము కలదు. మానవుని గ్రహచారములో పన్నెండు గ్రహములున్నట్లే, దశాచారములో కూడా పన్నెండు దశలు కలవు. పన్నెండు దశలు ఒకమారు అయిపోవుటకు మొత్తము 120 సంవత్సరముల కాలము పట్టును. అలా పన్నెండు దశలు ఒకమారు తిరిగినప్పుడే ఒక జన్మగా లెక్కించవచ్చును. సూర్యదశతో ప్రారంభమైన దశ తిరిగి వాని జీవితములో వచ్చుటకు 120 సంవత్సరముల కాలము పట్టుచున్నది. అందువలన ఎవనికైనా 120 సంవత్సరములకు ఒకమారు జన్మయని లెక్కించవలెను. మనిషి జీవితములో పన్నెండు దశలున్నవని తెలుసు కొన్నాము కదా! పన్నెండు దశలు కలిసి మొత్తము 120 సంవత్సరములని అనుకొన్నాము కదా! అయితే పన్నెండు దశల కాలము సమానముగా యున్నదా? లేక ఒక్కొక్క దశ ఒక్కొక్క కాలపరిమితికల్గియున్నదా అను ప్రశ్నకు జవాబును తెలుసుకొందాము. గ్రహచారములోని పన్నెండు గ్రహములలో ఆరు గ్రహములు మిత్రులుగా, ఆరు గ్రహములు శత్రువులుగా యున్నట్లు, దశలలో కూడా ఆరు దశలు మంచివిగా, ఆరు దశలు చెడువిగాయున్నవి. వాటిని క్రింద చూస్తాము. ఒక మనిషి జనన కాలము ఏ లగ్నములో జరిగినా ఆ లగ్నమును బట్టి పన్నెండు గ్రహములలో ఆరు మిత్రులుగా, ఆరు శత్రువులుగా ఉందురని తెలుసుకొన్నాము. మిత్రులనగా పుణ్యమును ఇచ్చి సుఖ పెట్టువారు. శత్రువులనగా పాపమును అమలు చేసి కష్టపెట్టువారు అని అర్థము. జనన కాల లగ్నమునుబట్టి మిత్రులుగా మరియు శత్రువులుగా యున్న గ్రహములనే దశాచారములో కూడా, మిత్ర శత్రువులుగా లెక్కించు కోవలెను. 2009 సంవత్సరము ఫిబ్రవరి 17వ తేదీ అష్టమి మంగళవారము జన్మించిన రంగయ్య అను వ్యక్తి యొక్క జనన నక్షత్రమునుబట్టి పుట్టుకలోనే అతనిది బుధదశ అని తెలిసిపోయినది. ఇప్పుడు రంగయ్యకు ఏ దశ మంచిదో, ఏ దశ మంచిది కాదో తెలుసుకొందాము. జనన సమయములో నున్న లగ్నము మీనలగ్నమగుట వలన మీన లగ్నమునకు ఎవరు మిత్రులో, ఎవరు శత్రువులో వారే దశలలోను మిత్ర శత్రువులుగా చెప్పబడుదురు. దాని ప్రకారము మీన లగ్నమునకు మిత్రులు శత్రువులు క్రింది విధముగా కలరు.

రంగయ్య అను వ్యక్తికి జాతకరీత్యా గురు, కుజ, చంద్ర, సూర్య, భూమి, కేతువు అను ఆరు గ్రహములు అనుకూలురుగా, మిగత బుధ, శుక్ర, రాహు, శని, మిత్ర, చిత్ర అను ఆరు గ్రహములు వ్యతిరేకులుగా యున్నారు. వీరి పేరుతోనే దశలుండుట వలన ఆయా గ్రహముల దశలలో మంచివిగా కొన్ని, చెడువిగా కొన్ని యున్నవని చెప్పవచ్చును. మిత్ర శత్రు గ్రహములనుబట్టి రంగయ్యకు ఆరు అనుకూలమైన దశలూ, ఆరు అను కూలములేని దశలున్నాయని చెప్పవచ్చును. ఇంతవరకు నక్షత్రమును బట్టి దశలూ, వాటిలో అనుకూల అనానుకూల దశలను తెలుసుకొన్నాము. ఇప్పుడు ఏ దశ ఎంతకాలముండునో వివరముగా తెలుసుకొందాము.