జ్యోతిష్య శాస్త్రము/దశలు అంటే ఏమిటి?

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

37. దశలు అంటే ఏమిటి?[మార్చు]

కొద్దిపాటి చదువును కల్గినవారికీ, కనీసము ఐదవతరగతి చదివిన వారికైనా దశ అంటే గణితము ప్రకారము పదియని తెలియగలదు. పది అను సంఖ్య మన జీవితములో అనేక విషయములయందు ఉపయోగించు కొని మాట్లాడుచుందుము. ఇప్పుడు ఇక్కడ మనము చెప్పుకొనునది స్వయముగా మనిషి జీవితములోని కర్మకు సంబంధించినది. అందువలన ఈ దశలను జాగ్రత్తగా తెలుసుకొందాము. దశ అనగా పదియనీ, దశలు అనగా కొన్ని పదులని తెలియుచున్నది. ఆచరణ అనగా చేయబడు కార్యమనీ, ఆచారము అనగా చేయబడు విధానము అనీ అర్థము. ఆచారి అనగా ఏ కార్యమును ఎలా చేయాలో తెలిసినటువంటివాడని అర్థము. కొన్ని పదుల సంవత్సరములు జరుగు ఆచరణలను తెలుపునది దశాచారము అని అంటాము. మనిషి జీవితములో అతను జీవించు వరకు కొన్ని పదుల సంవత్సరములుండును. ఆ పదుల సంవత్సరములలో ప్రత్యేకించి కొన్ని సంవత్సరములు మాత్రము ఒక గ్రహము ఆధీనములో ఉండునని, దాని తర్వాత కొన్ని సంవత్సరములు మరియొక గ్రహము యొక్క ఆధీనములో ఉండునని తెలుపు విధానమును దశాచారము అంటున్నాము. ఇంతకుముందు మనము తెలుసుకొన్న జ్ఞానములో ఆగామి, సంచిత, ప్రారబ్ధ అను మూడు కర్మలు కలవని తెలుసుకొన్నాము. ప్రారబ్ధకర్మ ప్రకారము మనిషి జీవితము జరుగుననీ, ప్రారబ్ధకర్మ ప్రకారము కాలచక్రములోని పన్నెండు గ్రహములు కర్మను ఆచరింపజేయుచూ, అనుభవింపజేయుచున్నవనీ తెలుసుకొన్నాము. ప్రారబ్ధ కర్మప్రకారము గ్రహములు మనిషిచేత ఆచరింపజేయు కార్యములను గ్రహచారము అంటున్నాము. కర్మ గ్రహముల చేతిలో ఒక పద్ధతిగా అయిపోవుచున్నది కదా! దానినే గ్రహచారము అంటున్నాము కదా! అలాంటప్పుడు దశలు దశాచారములు అని చెప్పడమేమిటనీ, దశాచారములో ఏ కర్మ అమలు జరుపబడుననీ, దశాచారములు ఉండవలసిన అవసరమేమిటనీ ఎవరైనా అడుగవచ్చును. ఈ ప్రశ్న పద్ధతి ప్రకారము ఎవరైనా అడుగవచ్చును. ఇది హేతుబద్ధమైన ప్రశ్నయే అయినందున దీనికి జ్యోతిష్య పండితులే సమాధానము చెప్పాలి. నేను ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడను. కావున ఈ ప్రశ్నకు నేను సమాధానము ఇవ్వలేను. నాది ఆధ్యాత్మికము కావున ఆ విషయములో సమాధానమును చెప్పగలనుగానీ, జ్యోతిష్యశాస్త్రములోని ప్రశ్నలకు సమాధానము చెప్పు స్థోమత నాకు లేదు. ఇప్పుడు ఈ ప్రశ్నకు జవాబు కావాలి. అందువలన అన్ని శాస్త్రములను తెలిసినవాడైన నాహితుడు, నన్ను నడుపువాడు, నా ప్రక్కనేయున్న నా పొరుగువాడు, అత్యంత దగ్గరున్న వాడు (నియరెస్ట్‌ నైబర్‌) అయిన వానిని అడిగి దీనికి జవాబును చెప్పుతాను. అందువలన నేను, నా వాడు కలిసి మేము చెప్పునదేమనగా!

చాలామంది పెద్దలు ఎవడు చేసిన కర్మను వాడు అనుభవించక తప్పదు అన్నారు. కొందరు ఆత్మజ్ఞానులు ‘‘విష్ణు, ఈశ్వర, బ్రహ్మదేవుళ్ళు కూడా కర్మకు అతీతులు కారు. ప్రారబ్ధమును వారు కూడా అనుభవించక తప్పించుకొనుటకు వీలుకాదు’’ అన్నారు. అంతేకాక ఒకమారు సంచితకర్మగా మారిపోయి తిరిగి ప్రారబ్ధమైన తర్వాత దానినుండి ఎవరూ తప్పించు కొనుటకు ఏమాత్రము వీలులేదు. గ్రహముల ఆధీనములోనున్న కర్మను ఏ మనిషిగానీ, ఎటువంటి క్రియవలనగానీ, కొద్దిపాటిగా తీసివేయనూ లేడు, కొద్దిపాటి కర్మను కలపనూ లేడు. ప్రతి మనిషీ నిత్యమూ, ఒక్క క్షణము కూడా ఊరకయుండక కర్మను అనుభవించు విధానమును దేవుడు నిర్మించాడు. అటువంటి విధానమును ఎవరూ అతిక్రమించలేరు. అయితే ఎంతో గట్టిగా ఏర్పరచిన కర్మ విధానమునుండి ఒక్క క్షణము కూడా ఎవడూ తప్పించుకో లేడని చెప్పిన దేవుడు భగవద్గీతలో జ్ఞానయోగమున 37 శ్లోకమందు ఇలా చెప్పాడు.

శ్లో॥ 37. యథైధాంసి సమిద్దోగ్ని ర్భస్మసాత్కురుతేర్జున ।
జ్ఞానాగ్ని స్సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా ॥

భావము :- ‘‘ఏ విధముగా అగ్నియందు కట్టెలు కాలి భస్మమై పోతున్నాయో, అదే విధముగా జ్ఞానమను అగ్నియందు సర్వకర్మలు కాలిపోవుచున్నవి.’’ అని స్వయముగా భగవంతుని రూపమునవున్న దేవుడే చెప్పాడు. దేవుడే కర్మను పాలించుటకు ఖగోళములో ద్వాదశగ్రహములను ఏర్పరచి, వారిని విధి విధానమును తప్పక నడుపునట్లు చేశాడు. ఎవడూ కర్మనుండి తప్పించు కొనుటకు వీలులేదు అన్నాడు. అయితే తన గీతయందు బ్రహ్మవిద్యా శాస్త్రము ప్రకారము జ్ఞానమును తెలియగలిగితే, అటువంటివాని కర్మ యంతయు జ్ఞానాగ్నిలో కాలిపోవును అన్నాడు. ఇంతవరకు మనము తెలుసుకొన్న జ్యోతిష్యము ప్రకారము కాలచక్రములో గ్రహములు తిరుగు చున్నంతకాలమూ, కర్మచక్రములో కర్మయున్నంతకాలమూ, జీవుడు గుణ చక్రమును వదలి బయటపడడు అని తెలియుచున్నది. అంతేగానీ జ్ఞానము కల్గిన వానికర్మ ఈ విధముగా తొలగిపోతున్నదని ఎక్కడా చెప్పుకోలేదు. కర్మచక్రములోని కర్మను జ్ఞాని అయినవాడు అనుభవించకుండా ఎలా తప్పించుకొనును? అను ప్రశ్న ఇక్కడ మొదలగుచున్నది. ఈ ప్రశ్నకు జవాబుగా మేము (నేను+నాఆత్మ) చెప్పునదేమనగా!

గ్రహచార విధానమైన ద్వాదశ లగ్నములు, ద్వాదశ గ్రహములు, ప్రారబ్ధకర్మయున్న విధానములో కర్మను తీసివేయుటకు ఎటువంటి వీలులేదు. అందువలన ఒక మనిషి జీవితములోని కర్మను అవసరమునుబట్టి జ్ఞానము ప్రకారము తీసివేయుటగానీ, తగిలించుటకుగానీ ఒక విధానమును దేవుడు ప్రత్యేకముగా అమర్చిపెట్టాడు. దానినే దశాచారము అంటున్నాము. దశాచారము అని పేరు పెట్టబడిన విధానములో జ్ఞానము వలన ప్రారబ్ధమును కొంత లేకుండ చేసుకోవచ్చును. అలాగే క్రొత్తగా ప్రారబ్ధమును తగిలించనూవచ్చును. అయితే కర్మను తగిలించు విధానమును దేవుడు ఎక్కువగా చెప్పకుండా, కర్మను తీసివేయు విధానమునే ఎక్కువగా చెప్పాడు. దేవుడు చెప్పిన బ్రహ్మవిద్యాశాస్త్రమునుబట్టి ఒక మనిషి కర్మను తీసివేయుటకు గానీ, అలాగే తగిలించుటకుగానీ చేయగలడు. గ్రహచార విధానములో ఎక్కడా కర్మను తగ్గించుటగానీ, తప్పించుటగానీ చెప్పలేదు. అయితే ఆ కర్మపోవు ప్రక్రియ దశాచారము అను విధానమునందు కలదని తెలియ వలెను. ముఖ్యముగా చెప్పునదేమంటే! ఇంతవరకు ఏ జ్యోతిష్య శాస్త్రవేత్తకు ఈ విషయము తెలియదు. జ్యోతిష్యులందరికీ గ్రహచారము తెలుసు. అలాగే దశాచారము తెలుసు. అయితే ప్రారబ్ధకర్మను రద్దుచేయు విధానముగానీ, తగిలించు విధానముగానీ దశాచారములో ఉన్నదని తెలియదు. జ్యోతిష్యము లో గ్రహచారము, దశాచారము ఉన్నట్లు జ్యోతిష్యులందరికీ తెలుసు. ఎవరి జాతకమును వ్రాసినా గ్రహచార, దశాచారమను రెండు విధానములను వ్రాసియుందురు. అయితే భగవద్గీతలో దేవుడు చెప్పిన కర్మను కాల్చు విధానము దశాచారములో ఉన్నట్లు బహుశా ఎవరికీ తెలియదు.

ప్రతి మానవునికియున్న గ్రహచార, దశాచారములలో అజ్ఞానికి గ్రహచారము ముఖ్యము. జ్ఞానికి దశాచారము ముఖ్యము. జ్ఞానులకు ముఖ్యమైనది దశాచారమని జ్ఞానులందరికీ తెలియదు. అందువలన ఇప్పుడు ఈ గ్రంథము ద్వారా జ్ఞానులైన వారందరూ తమ కర్మను దశాచారములో రద్దు చేసుకోవచ్చునని తెలియవచ్చును. జ్ఞానులకు ఎంతో ముఖ్యమైన దశాచారమును గురించి అంతాకాకున్నా, కొంతవరకైనా తెలుసుకొనుటకు ప్రయత్నిద్దాము. ఒక మనిషికి గ్రహచారము అతని తలలోని కర్మ, కాల, గుణచక్రములనుబట్టి తెలియవచ్చును. గ్రహచారమును తెలియుటకు పంచాంగములోని ఐదు అంగములైన (భాగములైన) తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములలో ముఖ్యముగా ఉపయోగపడునది ఒకటి కలదు. అదియే నక్షత్రము. నక్షత్రమనబడునది ఐదు అంగములలో మధ్యనగలదు. పంచాంగములకు మధ్యన ఉండుట వలన నక్షత్రము పంచాంగమునకు కేంద్రములాంటిది. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణమను ఐదు పేర్లలో నక్షత్రమను పేరు ప్రత్యేకత కలదిగా తెలియుచున్నది. క్షత్రము అనగా గొడుగు అని అర్థము. ఇంకా వివరముగా చెప్పుకొంటే క్షేత్రమునకు నీడ నిచ్చునది క్షత్రీయనిగానీ, క్షత్రము అనిగానీ చెప్పవచ్చును. గొడుగులేని దానిని, ఏ నీడనూ ఇవ్వని బయలును నక్షత్రము అంటాము.

ఆకాశములో చంద్రుడు, సూర్యుడు, నక్షత్రములు మూడు మాత్రమే కనిపిస్తుంటాయి. వెలుగును కల్గి సూర్య, చంద్ర, నక్షత్రములు మూడు కనిపించడము వలన కొంత వివరము కలదు. సూర్యుడు, చంద్రుడు ఇరువురు ఒకే గ్రహకుటుంబములోని వారే, కనిపించు నక్షత్రము మాత్రము గ్రహ కుటుంబములోనిది కాదు. ఎవరి ఆధిపత్యములేని వాడు దేవుడు. అలాగే ఎవరి క్షత్రము క్రింద, ఎవరి క్షత్రము ఆధీనములో లేనిది నక్షత్రము. నక్షత్రము అనుపేరునుబట్టి దానిని దేవునికి ప్రతిగా (ప్రతిరూపముగా) చెప్పు కోవచ్చును. బయట కనిపించు సూర్య చంద్రగ్రహములకు ఆధారము, నిర్మాత దేవుడు అన్నట్లు సూర్య చంద్రులు లేని అమావాస్యరోజు కూడా నక్షత్రములు కనిపిస్తుంటాయి. సూర్య చంద్రులు లేకుండా పోయినప్పుడు కూడా నక్షత్రముండుట వలన నక్షత్రము శాశ్వతమైన దేవునికి ప్రతి రూపముగా చెప్పుకొంటున్నాము. మనిషి తలలో కాలచక్రమందు కనిపించ కుండ ఇమిడియున్న సూర్య చంద్ర మొదలగు గ్రహకుటుంబమునకు అంతటికి నక్షత్రము ఆధారముగాయున్నది. కావున నక్షత్ర ఆధారముతోనే గ్రహచారమును తెలియవచ్చును. నక్షత్ర ఆధారము మీదనే గ్రహములు ప్రయాణించుచున్నవి. పంచాంగములో కూడా మధ్యలో నక్షత్రముండి ఇటు తిథి, వారమునకు అటు యోగ, కరణములకు కేంద్రముగా ఆధారమై ఉన్నది. జ్యోతిష్యములో ఎంతో ప్రాముఖ్యముగలది నక్షత్రము. బయట ప్రపంచములో సూర్య చంద్రులు వెలిగే గ్రహములుగా కనిపించినా అలాగే గ్రహము అను పేరు లేకుండా నక్షత్రము కనిపించినా సూర్య చంద్రులున్నట్లు నక్షత్రము లేదు. జ్యోతిష్యములో సూర్య చంద్రులు ఎక్కడికి పోయినా అక్కడ నక్షత్రముండును. దేవుడు కనిపించకుండా ప్రపంచమంతా వ్యాపించి యున్నట్లు, లగ్న కుండలియందు అన్ని లగ్నములలో నక్షత్రము కనిపించక యుండి సూర్యచంద్ర మొదలగు పన్నెండు గ్రహములకు ఆధారమైయున్నది. దేవునికి ఆకారములేనట్లు, జ్యోతిష్యములో నక్షత్రమునకు కూడా ఆకారము లేదు. నక్షత్రము ద్వాదశ లగ్నముల స్థలమంతయు ఆక్రమించి అనేక పేర్లతో పిలువబడుచున్నది. ఇట్లు ఎంతో విశిష్టత చెందిన నక్షత్రము దశాచారమునకు మూలముగాయున్నది. దశాచారమును తెలియుటకు నక్షత్రము యొక్క ఆధారముతోనే చూడవలయును.

ఆధ్యాత్మిక విద్య అయిన బ్రహ్మవిద్యాశాస్త్రము ప్రకారము దేవున్ని విడదీసిన మూడు ఆత్మలుగా చెప్పవచ్చును. అనగా దేవుడు మూడు ఆత్మలుగాయున్నాడని తెలియుచున్నది. దేవుడు జీవాత్మ ఆత్మలుగా ఉండడమేకాక తన ఉనికి తెలియునట్లు మూడవ ఆత్మ అయిన పరమాత్మగా కూడా ఉన్నాడు. పేర్లుగా విభజించి 27 భాగములుగాయున్న నక్షత్రమునకు 27 పేర్లు పెట్టి చెప్పడము జరిగినది. మూడు ఆత్మలుగాయున్నప్పటికీ దేవుడునుండి విభజింపబడినవే మూడు ఆత్మలు. అదే విధముగా 27 భాగములుగా 27 పేర్లతోయున్న నక్షత్రములన్నీ ఒకే నక్షత్రమని తెలియవలెను. మొదట ఏకముగాయున్న దేవుడు సృష్ఠిలో మూడు ఆత్మలుగా తయారయ్యాడు. అదే విధముగా మొదట ఏకముగాయున్న నక్షత్రము మూడుగా విభజింపబడినది. అలా విభజింపబడినవే 1) అశ్వని 2) భరణి 3) కృత్తిక అని తెలుపుచున్నాము. అశ్వని జీవాత్మకు గుర్తుకాగా, భరణి ఆత్మకు గుర్తుకాగా, మూడవదైన కృత్తిక పరమాత్మకు గుర్తుగాయున్నది. గణితము ప్రకారము సంఖ్యలలో 3 జీవాత్మకు గుర్తని, 6 ఆత్మకు గుర్తని, 9 పరమాత్మకు గుర్తని ఇంతకు ముందు "సృష్ఠికర్త కోడ్‌" అను గ్రంథములో వ్రాశాము. జ్యోతిష్యశాస్త్రములో 1,2,3 సంఖ్యలలో 3ను దేవునిగా గుర్తించాము. గణితశాస్త్రములో అన్ని అంకెలలోకెల్ల పెద్దదయిన 9 సంఖ్యను దేవునిగా చెప్పడము జరిగినది. ఇప్పుడు మనము జ్యోతిష్యమును చెప్పు చున్నాము కాబట్టి ఈ శాస్త్రము ప్రకారము 3 సంఖ్యను ముఖ్యముగా తీసుకొంటున్నాము. మూడు సంఖ్యలలో 1) అశ్వని 2) భరణి 3) కృత్తిక గా ఉన్నాయి. ఈ మూడిరటిని గణితములో పెద్దదయిన దేవునికి గుర్తుగా యున్న 9 చేత హెచ్చించవలసియున్నది. అప్పుడు 3×9=27 అగును. 27 సంఖ్యలో జీవాత్మకు సంబంధించినవి కొన్ని నక్షత్రములుగా, ఆత్మకు సంబంధించినవి కొన్ని నక్షత్రములుగా, పరమాత్మకు సంబంధించినవి కొన్ని నక్షత్రములుగా ఏర్పరచబడియున్నవి. 27 నక్షత్రములను ఎలా విభజించారో ఇప్పుడు తెలుసుకొందాము.

Jyothishya shastramu.pdf
ఈ విధముగా నక్షత్రములు జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అను మూడు భాగములుగా విభజింపబడ్డాయి. ఒక లగ్నమునకు 2¼ నక్షత్రమును కేటాయించినట్లు ఇక్కడ అదే విధముగా 2¼ లగ్నము అనగా 9 నక్షత్ర పాదములను ఒక్కొక్క గ్రహమునకు కేటాయించి ఆ గ్రహము పేరుతోనే కొన్ని దశా సంవత్సరములను నిర్ణయించడము జరిగినది. దైవ జ్ఞానుల కొరకు జ్యోతిష్యములో దశాసంవత్సరములను ఏర్పరచడము జరిగినది. అజ్ఞానులకొరకు 12 లగ్నములను తయారు చేసి ఒక్కొక్క లగ్నమునకు 2¼ నక్షత్రమును (9 నక్షత్రపాదములను) నిర్ణయించినట్లు, జ్ఞానులకొరకు 12 దశలను గ్రహముల పేరుతో తయారు చేసి, ఆ గ్రహము పేరుతోనున్న దశలకు మొత్తము 120 సంవత్సరములను నిర్ణయించడము జరిగినది. జ్యోతిష్యగ్రంథమును చూస్తే పన్నెండు లగ్నములు, పన్నెండు గ్రహములు, పన్నెండు దశలు, పన్నెండు పదుల (120) సంవత్సరములు కనిపించు చున్నవి.