జ్యోతిష్య శాస్త్రము/దశల కాలములు
39. దశల కాలములు
[మార్చు]కొందరు మాటల సందర్భములో వాని దశ బాగుంది, అందువలన వాడు పట్టినదంతా బంగారమౌతూవుంది అని అంటుంటారు. చాలామందికి వారి గ్రహచారముల మీద నమ్మకములేకున్నా, వారి గ్రహచారమును గురించి వారికి తెలియకున్నా దశలలోనే బాగా జరుగునని అనుకొనుచుందురు. కొందరు జ్యోతిష్యులు కూడా గ్రహచారముకంటే మంచి దశలలోనే బాగా జరుగునని చెప్పుచుందురు. జ్యోతిష్య విషయము తెలియనివారు కూడా దశ బాగుంటే ఏమైనా జరుగుతుందని, ఎంత లాభమైన వస్తుందని అనుచుందురు. ఎవడైనా నష్టపోయినా, కష్టపడుచుండినా వానిని చూచిన వారు వాని దశ బాగాలేదు అందువలన అలా జరుగుచున్నదని చెప్పు చుందురు. వాస్తవానికి ప్రపంచ కర్మలలో మనిషి మీద దశల ప్రభావము అంతగా ఉండదు. మనిషి పడు కష్టములకైనా, అనుభవించు సుఖములకైనా ముఖ్యముగా గ్రహచారమే కారణమని చెప్పవచ్చును. దశల ప్రభావము ప్రపంచ విషయములలో కనీసము పదిశాతము కూడా ఉండదు. కాల చక్ర లగ్నములలో మంచి చెడు గ్రహములు తిరుగుచూ కర్మచక్రము నుండి అందించు ఫలితములనుబట్టి మనిషి యొక్క కష్టసుఖములుండును. కేవలము దైవ జ్ఞాన విషయములలోనున్న వారికి మాత్రము దశలనుబట్టి వాని కర్మ రద్దవునదీ లేనిదీ తెలియును. జ్ఞానులైన వారికి మంచిదశలో వారి కర్మలు జ్ఞానాగ్నిచే ఎక్కువ దహించబడును. చెడు దశలో కర్మలు కాలిపోవడములో ఆలస్యమగును. మంచి దశ వచ్చినప్పుడు జ్ఞాన ధనము కల్గినవారు ఇతరుల కర్మలనుగానీ, తమ కర్మలనుగానీ ఎక్కువగా నిర్మూలించు కొనుటకు అవకాశము కలదు. మంచి దశలలో ఎండాకాలము ఎండిన కట్టెలు సులభముగా కాలిపోయినట్లు కర్మలు కూడా తమ జ్ఞానాగ్ని చేత కాలిపోవును. అదే చెడు దశలో వానల కాలము తడిసిన కట్టెలు సరిగా కాలనట్లు కర్మలు దహించడములో కొంత ఆటంకము, ఆలస్యము ఏర్పడును. దశలన్నీ మనిషిలోని జ్ఞానము అజ్ఞానమునుబట్టి పని చేయునని తెలియవలెను. జ్ఞానములేని సాధారణ వ్యక్తులకు కాల, కర్మచక్రములనుండి లభ్యమగు గ్రహచారమునుబట్టి వారికి కష్టసుఖములుండును. ఏ మనిషికైనా అన్ని అనుకూలములుగా జీవితము సాగుచుంటే అది వాని గ్రహచార కర్మఫలమని తెలియవలెను. అట్లుకాక ఎక్కువ కష్టములు సంభవించుచూ, అన్ని విషయములలో ఆటంకము ఏర్పడుటకు కూడా వాని గ్రహచారమే కారణము.
ఇప్పుడు దశల కాల విషయమునకు వస్తాము. ఇంతవరకు ఎందరో మేధావులు జ్యోతిష్యశాస్త్రమును వ్రాశారు. వారికున్న మేధాశక్తి ముందర నేను అల్పుడనని ఒప్పుకోక తప్పదు. అంతపెద్దవారు వ్రాసిన దానిని కాదనీ వారు వ్రాసిన విషయములు కొన్ని శాస్త్రబద్ధత లేనివని ఖండిరచి వేరుగా చెప్పడము మా పనిగానీ, నా పని కాదని తెలియవలెను. జ్యోతిష్య శాస్త్రమును వ్రాసే విజ్ఞానముగానీ, జ్ఞానముగానీ నాకు లేదు. పైకి ఈ గ్రంథకర్తగా నేను కనిపించినా, వాస్తవానికి శరీరములో మర్మముగాయుండి ఎక్కడా, ఎవరికీ తెలియనివాడైన ఆత్మని అందరు తెలియాలి. ఆయనకు తెలియనిది ఏమీ లేదు. అందువలన ఇక్కడ చదువబోవు విషయములు సత్యమనీ, శాస్త్రీయతగలవనీ తెలిసి చదువవలెను. గతములో జ్యోతిష్య గ్రంథమును చాలామంది వ్రాసినా అందులో గ్రహములను తొమ్మిది మందిని మాత్రమే చూపారు. ఇక్కడ మాత్రము పన్నెండు మంది గ్రహములున్నారని చెప్పడము జరిగినది. దశల విషయములో మొత్తము 120 సంవత్సరములు చెప్పినా 120 సంఖ్యను తొమ్మిది మందికి సరిచేసి చెప్పారు. వారు చెప్పిన గ్రంథములలో ఇలా కలదు.
తొమ్మిది గ్రహములను కూృరులు, సౌమ్యులుగా చెప్పి అందులో ఐదింటిని కుృార గ్రహములుగా, నాలుగు సౌమ్య గ్రహములుగా విభజించారు. సూర్య, కుజ, శని, రాహువు, కేతువు కుృారులనీ, గురు, చంద్ర, శుక్ర, బుధులు సౌమ్యులనీ చెప్పడము జరిగినది. అయితే ఇప్పుడు మేము వ్రాసిన గ్రంథములో కర్మలేని ఆత్మలు, కర్మవున్న ఆత్మయను పద్ధతితో 2:1 అను సూత్రముతో గ్రహములను రెండు గుంపులుగా విభజించాము. ఈ రెండు గుంపులలో మనుషుల కర్మలనుబట్టి గ్రహములు కృారులుగా, సౌమ్యులుగా లేక శత్రువులుగా, మిత్రులుగా పని చేయుచున్నారని చెప్పాము. ఇదంతయు ముందు వ్రాసిన వారికి వ్యతిరేఖముగా కనిపించినా, వాస్తవానికి ఇది సత్యము మరియు శాస్త్రబద్ధము. ఇప్పుడు చెప్పుబోవు దశల సంవత్సరములు కూడా చాలా వ్యత్యాసముగా ఉండును. అయినా సత్యమను ఉద్దేశ్యముతో చదవండి. శాస్త్రబద్ధముగా ఉందో లేదో చూడండి.
ఇక్కడ పన్నెండు దశల సంవత్సరములను చెప్పుకొన్నాము. ఒక ప్రక్క గురువు నాయకత్వములోని గ్రహములు వరుసగా సూర్య, చంద్ర, కుజ, గురు, భూమి గ్రహములు ఐదు వుండగా, వాటి మధ్యలో శని గుంపులోని రాహువు ఉండడము జరిగినది. వాటి మొత్తము 63 సం॥ వచ్చినది. అలాగే రెండవ ప్రక్క శని నాయకత్వములోని గ్రహములు వరుసగా శని, బుధ, శుక్ర, మిత్ర, చిత్ర అను ఐదు గ్రహములుండగా వాటిమధ్యలో గురు పార్టీలోని కేతువు వచ్చి కలిసిపోయినది. వాటి మొత్తము 57 సం॥ వచ్చినది. మొదటి వరుసలోని గురుపార్టీ గ్రహములలో కలిసియున్న రాహువును తీసివేసి ఆ స్థానములో కేతువును ఉంచి చూచితే మొత్తము గురుపార్టీలోని ఆరు గ్రహముల దశా సంవత్సరములు ఖచ్చితముగా 60 సంవత్సరములు వచ్చును. అలాగే రెండవ ప్రక్కయున్న శని పార్టీలోని గ్రహములలో కలిసియున్న కేతువును తీసివేసి అందులో రాహువును చేర్చి చూచితే శనిపార్టీలోని ఆరుగ్రహముల దశా సంవత్సరములు ఖచ్చితముగా 60 సంవత్సరములు వస్తున్నవి.
ఈ వరుస క్రమములోనే జాతకుని దశల కాలము అమలుకు వచ్చునని తెలుసుకోవాలి. ముందు తొమ్మిది గ్రహముల జ్యోతిష్యమునకు, ఇప్పుడు పన్నెండు గ్రహముల జ్యోతిష్యమునకు కొంత తేడాయుండడమును గమనించవచ్చును. ముందు వ్రాసుకొన్న దశలలో గురుదశ అయిపోతూనే శనిదశ మొదలగుచున్నది. అయితే ఇక్కడ క్రొత్త విధానములో గురుదశ అయిపోతూనే భూమిదశ ప్రారంభమగుచున్నదని తెలుసుకోవాలి. పన్నెండు గ్రహములను అనుసరించి వ్రాయు క్రొత్త జాతకములో ప్రస్తుతము మేము పైన వ్రాసిన దశలను వాటి సంవత్సరములను ఉపయోగించి వ్రాసుకో వలసినదిగా తెల్పుచున్నాము.
సూర్యుడు, చంద్రుడు మొదలగు గురుపక్షములోని గ్రహములలో శనిపక్ష రాహువు కలిసియుండడమే సరిjైున పద్ధతిగా దేవుడు పెట్టాడు. అలాగే శని, బుధుడు మొదలగు శనిపక్ష గ్రహములున్న శని పక్షమున కేతువు ఉండడమే సరియైన పద్ధతియని దేవుడే ఆ విధముగా ఉంచాడు. రాహువు శనిపక్షమువాడైయుండి దశలలో మాత్రము గురుపక్షములో ఉండుట మంచిదని ఎందుకు చెప్పుచున్నామనగా! పన్నెండు గ్రహములు రెండు గుంపులుగాయున్నా ఆ గుంపు నాయకులు ఒకవైపు గురువూ మరొక వైపు శని ఉండగా, శని గుంపులోని రాహువు, గురుపక్షములోని కేతువు ఇద్దరూ నాయకత్వ లక్షణములు కల్గియున్నారు. అంతేకాక రెండు గుంపులలో ఎవరు తమ పనిని సక్రమముగా నిర్వర్తించకున్నా, అలసత్వమును గానీ, ఆలస్యమునుగానీ ప్రదర్శించినా రెండు వైపుల వారిని దండిరచు నాయకత్వముకలవారుగాయున్నారు. అంతేకాక పన్నెండు గ్రహములలో పది గ్రహములు అనగా రాహు మరియు కేతువు మినహా అందరూ కాలచక్రములో మన చూపుకు ఎడమనుండి కుడివైపుకు ప్రయాణించుచుండగా, రాహువు మరియు కేతువు ఇరువురూ కుడినుండి ఎడమకు ప్రయాణించుచున్నారు. పది గ్రహములు కాలచక్రములో ఎడమ నుండి కుడికి సవ్యముగా ప్రయాణించుచుండగా రాహువు, కేతువు ఇద్దరూ కుడినుండి ఎడమకు అపసవ్యముగా ప్రయాణించుచున్నారు. బస్సు రూట్‌లో ఒకవైపుకు ప్రయాణించు బస్సులను తనిఖీ చేయుటకు చెకింగ్ ఇన్స్‌పెక్టర్లు బస్సులకు ఎదురుగా ప్రయాణించుచూ తమకు ఎదురవుతున్న బస్సులను ఆపి చెక్ చేసినట్లు, పది గ్రహములకు ఎదురుగా ఇన్స్‌పెక్టర్ల మాదిరి రాహువు, కేతువులు ప్రయాణించుచున్నారు. అలా రాహు కేతువులు ప్రయాణించడము వలన గ్రహములన్నీ జాగ్రత్తగా, ఉత్తేజముగా పని చేయుచున్నవి. కాలచక్రములో పది గ్రహములు ఎడమనుండి కుడి వైపుకూ, రాహువు, కేతువు కుడినుండి ఎడమకు ప్రయాణించడము క్రింది 50వ చిత్రపటములో చూడవచ్చును.