జ్యోతిష్య శాస్త్రము/త్రిరా లేక రాత్రి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

34. త్రిరా లేక రాత్రి[మార్చు]

కాలచక్రములో సూర్యుడు లగ్నముల మీద ప్రయాణిస్తూ ఒక్కొక్క లగ్నమును దాటుచూ కాలచక్రములోని మేషం, వృషభము మొదలగు లగ్నములను దాటుచూపోయి చివరకు మీన లగ్నమును దాటుటకు ఒక సంవత్సర కాలముపట్టునని చెప్పుకొన్నాము. కాలచక్రములో తిరుగు సూర్యుడు తన కిరణములను కర్మచక్రముమీద ప్రసరించునని చెప్పు కొన్నాము కదా! అలా కర్మచక్రము మీద సూర్యకిరణములు పడడమే కాకుండా, అక్కడ పడిన కిరణములు కర్మను తీసుకువచ్చి క్రింద చక్రములో నున్న జీవుని మీద వేయునని చెప్పుకొన్నాము. సూర్య కిరణములు గుణ చక్రము మీద పడినప్పుడు, గుణములు పనిచేయడమూ, పడనప్పుడు పని చేయకుండ పోవడము జరుగుచుండును. గుణచక్రములో మూడు గుణభాగములున్నట్లు చెప్పుకొన్నాము. కర్మ కిరణములు గుణముల మీద పడినప్పుడు గుణములు పని చేయడమూ, గుణముల మీద పడనప్పుడు గుణములు పని చేయకుండ పోవడము జరుగుచుండును. గుణములు పనిచేసిన కాలమును పగలు అనియూ, గుణములు పని చేయని కాలమును రాత్రి అనడము జరుగుచున్నది. త్రి అంటే మూడు గుణములనీ, రా అంటే లేకుండడమని అర్థము. వాటినే రాత్రి అనుట వలన మూడు గుణములు పని చేయని సమయమని అర్థము చేసుకోవచ్చును. మూడు గుణములు పని చేయని సమయములో మనస్సుకు పనిలేక అది నిద్రలోనికి జారుకొనును. నిద్ర అంటే ఏ అనుభవమూ లేనిదని చెప్పవచ్చును. ఏ అనుభవమూ లేనిదానిని నిద్ర అనడమేకాక, మూడు గుణములు లేనిది కావున ఆ సమయమును రాత్రి అని అంటున్నాము. రాత్రి సమయములో కూడా కాలచక్రములో గ్రహములు తిరుగుచున్నా కర్మ అనుభవము జీవునికి ఎందుకు లేదని ప్రశ్నరాగలదు. దానికి సమాధానము ఏమనగా! చావుపుట్టుకల విషయమును మనిషి అనుభవ పూర్వకముగా తెలియునట్లు చావుకు గుర్తుగా నిద్రనూ, పుట్టుకకు గుర్తుగా మెలుకువను దేవుడుంచాడు. చావులోనే మూడు గుణములు పని చేయవు కావున, రాత్రి అను పేరును నిద్ర సమయమునకు చెప్పడము జరిగినది. చీకటి వస్తే రాత్రియని, వెలుగువస్తే పగలుయని అనుకోవడము అందరికీ అలవాటైనది. చీకటి వెలుగులు నిజమైన రాత్రి పగళ్ళుకావు. కర్మ అమలు జరుగునప్పుడు గుణములుండును కావున, అది చీకటి సమయమైనా రాత్రి కాదు. అలాగే కర్మ అమలు జరగనప్పుడు, మూడు గుణములు పనిచేయనప్పుడు, అది వెలుగు సమయమైనా పగలుకాదు. ఇదంతయు అంతరార్థముతో కూడుకొన్న విషయము. ఒక మనిషిలో మూడు గుణ భాగములలోని ఏ ఒక్క గుణము పని చేయకున్నా వాడు ఆ సమయములో కర్మ అనుభవించనట్లేనని లెక్కించవలయును. కర్మ అనుభవించనప్పుడు క్రింద గుణచక్రములోని జీవునికి అనుభవములేదు. అట్లే పైన కాలచక్రములోని గ్రహముల కిరణములు ఏ కర్మమీదా ప్రసరించనట్లేనని తెలియవలెను. అన్ని సమయములలో గ్రహములు కాలచక్రము మీద ప్రయాణించునప్పుడు, వాటి కిరణములు క్రిందగల కర్మచక్రము మీద ఎందుకు పడలేదని ఎవరైనా ఇక్కడ ప్రశ్నించవచ్చును. దానికి సమాధానమును క్రింద సమాచారములో చూస్తాము.