జ్యోతిష్య శాస్త్రము/గ్రహముల రాజు - గ్రహముల మంత్రి

వికీసోర్స్ నుండి

35. గ్రహముల రాజు - గ్రహముల మంత్రి[మార్చు]

ఖగోళములో ఎన్నో గ్రహములు, ఉపగ్రహములు, గ్రహములకంటే పెద్దవైన భూతములూ, మహాభూతములూ ఉన్నాయని గతములో మేము వ్రాసిన గ్రంథములలో కూడా చెప్పాము. మనము నివశించు భూమి కూడా ఒక గ్రహమే. కొన్ని గ్రహముల సముదాయము ఒక గుంపుగా ఏర్పడి తమ బాధ్యతను నిర్వర్తించుచున్నవి. అటువంటి గుంపులలో మనము ఇంతవరకు చెప్పుకొన్న పన్నెండు గ్రహములు కలిసి తమ విధి విధానమును ఆచరించుచున్నవి. సూర్యుడు మొదలుకొని మిత్ర చిత్ర వరకు గల పన్నెండు గ్రహములను ఒక కుటుంబముగా చెప్పుకొంటున్నాము. మన గ్రహ కుటుంబమును సూర్యకుటుంబము అని అంటున్నాము. కుటుంబములో ఒక పెద్ద ఉన్నట్లు, కుటుంబములోని వారందరు కుటుంబపెద్ద మాటను అనుసరించి నడుచుకొన్నట్లు, సూర్య కుటుంబములో సూర్యుడే కుటుంబ పెద్ద. సూర్యుని మాటను అనుసరించి సూర్యకుటుంబములోని గ్రహములు పనిచేయును. సూర్య కుటుంబములో ముఖ్యమైన నియమము ఒకటి కలదు. అది ఏమనగా! సూర్యుడు తన కిరణములను కర్మచక్రము మీద ప్రసరించినప్పుడే మిగత పదకొండు గ్రహములు తమ కిరణములను కర్మచక్రముమీద ప్రసరింప చేయాలి. ఎప్పుడు తన కిరణములను సూర్యుడు ప్రసరించకుండ చేయునో, అప్పుడు అన్ని గ్రహములు అట్లే చేయాలి. ఇది కుటుంబ నియమము. ఈ నియమమును పాటిస్తూ లగ్నములకధిపతులుగా, లగ్నములనుబట్టి మిత్ర శత్రువులుగా ఎవరి పని వారు చేయవలసి ఉండును.

సూర్యకుటుంబములో సూర్యుడు కుటుంబ యజమానిగా ఉండుట వలన, మిగతా గ్రహములన్నీ సూర్యున్ని ఆధారము చేసుకొని, వాటి కిరణములను కర్మచక్రము మీద ప్రసరింపజేయుచున్నవి. సూర్య కిరణములు కర్మచక్రము మీద లేని సమయములో మిగత గ్రహములనుండి వచ్చు కిరణములూ, కర్మ ఆగిపోవుట వలన ఆ సమయములో జీవుడు ఏ కర్మనూ అనుభవించడు. కర్మ అనుభవించని కాలమును నిద్ర అనియూ, రాత్రి అనియు అంటున్నాము. రాత్రి సమయములో లేక నిద్ర సమయములో సూర్యున్ని గౌరవిస్తూ అన్ని గ్రహములు కాలచక్రములో తిరుగుచున్నప్పటికీ తమ కిరణములను కాంతి హీనముగా చేసుకొనును. సూర్య కుటుంబములో ఏ మనిషి అయినా రెండు గ్రహములను చూడగల్గుచున్నాడు. ఆ రెండు ఒకటి సూర్యుడు, రెండు చంద్రుడు. ప్రత్యక్షముగా బయట ప్రపంచములో అందరికీ కనిపించు గ్రహములు సూర్య, చంద్రులని ఎవరైనా చెప్పుదురు. ఈ రెండు గ్రహములకూ మిగత పది గ్రహములకు లేని ప్రత్యేకత కలదు. సూర్యుడు గ్రహముల కుటుంబ పెద్దగా ఉండడమేకాక, కర్మను పాలించడము లో రాజు అని పేరుగాంచియున్నాడు. మనిషి (జీవుని) కర్మను అమలు చేయుటకు విధివిధానములన్నిటిని సూర్యుడు ఏర్పరచి పెట్టాడు. అందు వలన కర్మ పాలనలో రాజు సూర్యుడు అని చెప్పవచ్చును. కర్మ పాలనలో గ్రహచారము, దశాచారము అని రెండు విధానములను ఏర్పరచి అందులో గ్రహచారము నకు పెద్దగా సూర్యుడుండగా, దశాచారమునకు పెద్దగా చంద్రుడు కలడు.

కాలచక్రములో ద్వాదశ గ్రహములు నిత్యము ఎడతెరపి లేకుండా సంచరించుచున్నప్పటికీ, వాటి వేగములతో ముందుకు పోవుచున్నప్పటికీ, సూర్యున్ని అనుసరించి రాత్రి (నిద్ర) సమయములో కర్మలను అమలు చేయడము లేదు. సూర్యుడు కాలచక్రములో కుటుంబ యజమాని హోదాను కల్గియుండడమేకాక, కర్మచక్రములోని కర్మపాలనలో రాజు హోదా కల్గి యున్నాడు. కర్మపాలన రెండు విభాగములుగా ఉండుట వలన, ఒక భాగమైన గ్రహచారమునకు తాను రాజుగా ఉంటూ, రెండవ భాగమైన దశాచారమునకు చంద్రున్ని మంత్రి హోదాలో అధిపతిని చేశాడు. ఈ విధముగా కాలచక్రములో యజమాని కుటుంబ పెద్ద అయిన సూర్యుడు, కర్మచక్రములో రాజుగా ఉండడమేకాక, చంద్రున్ని మంత్రిగా ఉంచుకొన్నాడు. దీనినిబట్టి కాలచక్రములో ఒకరు పెద్దకాగా, కర్మచక్రములో ఇద్దరు పెద్దలు కలరని చెప్పవచ్చును.