Jump to content

జ్యోతిష్య శాస్త్రము/గ్రహచారము, దశాచారము అంటే ఏమిటి?

వికీసోర్స్ నుండి

36. గ్రహచారము, దశాచారము అంటే ఏమిటి?

[మార్చు]

ఈ రెండు పద్ధతులు సులభముగా అర్థమగుటకు ఒక ఉదాహరణను తీసుకొందాము. ఒక వ్యక్తి ఎండాకాలము కాలినడకన ప్రయాణము చేయునప్పుడు క్రింద కాళ్ళకు చెప్పులు ధరించి నడచినప్పుడు భూమి ఎంత వేడిగాయున్నా ఆ వేడి అతని పాదముల క్రింద తెలియదు. ఒకవేళ కాళ్ళకు చెప్పులు లేకుంటే పాదములకు వేడి తెలిసి ఆ బాధను అనుభవించ వలసివచ్చును. చెప్పులున్న వానికి కాళ్ళు కాలవు, అయినా పైన ఎండవేడి తలకు ముఖమునకు తగులుచుండుట వలన కొంత బాధపడవలసివచ్చును. కాళ్ళకు చెప్పులూ, తలకు గొడుగు ఉన్నవాడు క్రింద బాధ, పై బాధ రెండు తెలియకుండ ప్రయాణమును సాగించును. ఒకవేళ తలకు గొడుగూ, కాళ్ళకు చెప్పులూ రెండూ లేనివాడు పైన క్రింద రెండు బాధలను అనుభ వించవలసి వచ్చును. ఒక ప్రయాణికునికి కాళ్ళకు తలకు ఎండవేడి బాధ రెండు రకములుగా ఉన్నట్లు, ఒక జీవికి కర్మ రెండు రకముల అనుభవము నకు వస్తున్నది. ఎండ బాధ క్రింద కాళ్ళకు, పైన తలకు తగిలినట్లు, కర్మ బాధ ఒక ప్రక్క గ్రహచారము ప్రకారమూ మరొక ప్రక్క దశాచారము ప్రకారమూ కలుగుచున్నది. చెప్పులు గొడుగు రెండూ ఉన్నవాడు సుఖముగా ప్రయాణము సాగించినట్లు, గ్రహచారము దశాచారము రెండూ బాగున్న వాడు సుఖముగా జీవితమును సాగించును. చెప్పులు, గొడుగు రెండూ లేనివాడు కష్టముగా ప్రయాణమును సాగించినట్లు, గ్రహచారము, దశా చారము రెండూ బాగలేనివాడు జీవితమును కష్టముగా సాగించును. చెప్పులుండి గొడుగు లేనివాడుగానీ, గొడుగుండి చెప్పులు లేనివాడుగానీ క్రిందనో పైననో ఒకవైపు బాధను అనుభవించినట్లుండును. గ్రహచారము బాగుండి దశాచారము బాగలేనివాడుగానీ కర్మను పూర్తి అనుభవించును. గ్రహచారము బాగాలేక దశాచారము బాగున్నవాడు కొంత కర్మను అనుభవిస్తూ, కొంతకర్మ అనుభవించక తప్పించుకొని మిగత కొంత కర్మ అనుభవముతోనే జీవితమును సాగించును. మనిషి పుట్టిన సమయమునుబట్టి జాతకము నిర్ణయించబడుచున్నది. పుట్టిన సమయములో కర్మచక్రము మీద సూర్యుని కిరణములు ఎచట ఉండునో, దానినిబట్టి గ్రహచారము నిర్ణయించబడును. అలాగే చంద్రుడు కాలచక్రములో ఏ నక్షత్రములో ఉన్నాడో, దానినిబట్టి దశాచారము నిర్ణయించబడును. కాలచక్రములోని రాజు అయిన సూర్యునితోనూ, మంత్రి అయిన చంద్రునితోను నిర్ణయించబడు గ్రహచార, దశాచారముల వలన మనిషి జీవితము ఎలా సాగునో తెలియగలదు. మనిషి జాతకములో గ్రహచారము కాళ్ళకు చెప్పులులాగా ఉండగా, దశాచారము తలకు గొడుగు లాగున్నదని తెలియవలెను. మనిషి జాతకము లేక జాఫతకము అను దానిలో ప్రారబ్ధకర్మనుబట్టియున్న గ్రహచారమూ, దశాచారమును ఎలా తెలియవచ్చునో ఉదాహరణగా ఒక మనిషి పుట్టుకను తీసుకొని చూస్తాము.

రంగయ్య అనునతడు 2009 సంవత్సరములో ఫిబ్రవరి నెలయందు 17వ తేదీన మంగళవారము ఉదయము 9 గంటలకు జన్మించాడు. ఆ దినము పంచాంగము ప్రకారము మంగళవారము, అష్టమి తిధి సా॥ గం॥ 4-13 నిమిషములు గడియలలో 24-16 వరకు గలదు. నక్షత్రము అనూరాధ గం॥ 3-45 నిమిషములు గడియలలో 53-14 వరకు కలదు. లగ్న విషయము కుంభములో భుక్తి గం॥ 0-18 నిమిషములు కలదు. రంగయ్య అష్టమి రోజు అనూరాధ నక్షత్రమున మంగళవారము పగలు ఉదయము 9 గంటలకు జన్మించాడు. అతడు జన్మించిన సమయములోనే సంచితము నుండి జీవితమునకు కావలసిన ప్రారబ్ధము ఏర్పడినది. జన్మించిన సమయములో ఏర్పడిన ప్రారబ్ధమును కొంతవరకు తెలియడమును లేక గుర్తించుకోవడమును జాతకము (జాఫతకము)ను తెలియడము అంటున్నాము. జాతక విషయము తెలియుటకు రంగయ్య అను వ్యక్తి పుట్టిన సమయములో, సూర్యుడు కాలచక్రము మీదనుండి కర్మచక్రములోని ఏ రాశిమీదికి, తన కిరణములను ప్రసరింపజేయుచున్నాడో మొదట తెలియాలి. సూర్యుడు ఏ రాశిమీద జనన సమయములో తన కిరణములను ప్రసరింపజేయుచున్నాడో, ఆ రాశికి సమానముగాయున్న కాలచక్ర లగ్నమును గుర్తించుకోవాలి. అలా గుర్తించుకొన్న లగ్నమునే మొదటి జన్మ లగ్నముగా లెక్కించుకోవచ్చును. ఇప్పుడు ఫిబ్రవరి 17వ తేదీన మంగళ వారము పుట్టిన రంగయ్య అను వ్యక్తి యొక్క జాతకములో మొదటి లగ్నమును ఎలా గుర్తించాలో క్రింద పూర్తి వివరముగా తెలుసుకొందాము.

2009 సంవత్సరము ఫిబ్రవరి 17వ తేదీన పంచాంగము ప్రకారము సూర్యోదయము 6.31 నిమిషములకు జరిగినది. రంగయ్య పుట్టినది ఉదయము 9 గంటలకు. సూర్యోదయము తర్వాత ఎంత కాలమునకు పుట్టాడని చూడగా

9 గంటల సమయములో మీన లగ్నమున్నది.

2-29 నిమిషములు ఉదయము తర్వాత గడచినది. 17వ తేదీన సూర్యుడు ఉదయించినప్పుడు ధనిష్ట నక్షత్రములో నాల్గవపాదమున ఉన్నాడు. కావున ఆ దినము కుంభ లగ్నముతో ప్రారంభమైనది. ఒక లగ్న ప్రయాణము కర్మచక్రము మీద దాటుటకు దాదాపు రెండు గంటలు పట్టును. అయితే పంచాంగమును బట్టి కుంభలగ్న ప్రమాణము 1.39 నిమిషములు కాగా ఆ దినము కుంభ లగ్న భుక్తి 0-18 నిమిషములు పోగా ఉదయము తర్వాత కుంభలగ్నము 1-21 నిమిషములు మిగిలినది. ఉదయమునుండి గడచిన కాలము 2-29 నిమిషములలో మిగిలిన కుంభ లగ్నముపోగా 1-08 మిగిలినది. కుంభము తర్వాత మీన లగ్న ప్రమాణము 1-37 నిమిషములు. మీనలగ్న ప్రమాణములో 1-08 నిమిషములను తీసివేయగా 0-29 నిమిషములు మీన లగ్నము మిగిలినది. అందువలన అతని జననము మీన లగ్నములో జరిగినదని చెప్పవచ్చును.

రంగయ్య అను వ్యక్తి జన్మించిన కాలమును ఆధారము చేసుకొని, అప్పటి పంచాంగము ద్వారా లెక్కించి, అతని జన్మ లగ్నమును తెలుసుకో గలిగాము. ఇంతవరకు మేము వ్రాస్తూ వచ్చిన జ్యోతిష్య గ్రంథము బాగా అర్థమైనా ఇక్కడ జాతకలగ్నమును లెక్కించి తెలుసుకొన్న చోట కొంత వరకు అర్థము కాకుండ ఉండవచ్చును. ఇంతవరకు పంచాంగ ప్రసక్తి లేకుండా గ్రంథము సాగింది. అందువలన వరుసగా అర్థమైవుంటుంది. అయితే ఇక్కడ పంచాంగ ప్రస్తావన వచ్చిన దానివలన, ఇంతవరకు పంచాంగము యొక్క పరిచయము లేనివారికి కొంత ఇబ్బందిగా ఉండి, వ్రాసిన సమాచారము కొంత అర్థముకాక పోయివుండవచ్చును. అయితే ఇక్కడ మనము గమనించవలసిన విషయమేమంటే జ్యోతిష్యము వేరు, పంచాంగమువేరని తెలియవలెను. జ్యోతిష్యమును తెలియుటకొరకు పంచాంగమునుండి కొంత చూచుకోవలసియుంటుంది. అంతేగానీ పంచాంగమునంతటినీ తెలియవలసిన అవరసములేదు. వాస్తవముగా చెప్పితే పంచాంగమును గూర్చి నాకు కూడా పూర్తి తెలియదు. జ్యోతిష్యుడు పంచాంగములోని అవసరమైన కొన్ని అంగములను మాత్రము వాడుకొంటాడు, అంతేగానీ అంతా అవసరముండదు. పంచాంగమునకు అర్థమును చెప్పుకొంటే ఐదు అంగములు కలది పంచాంగము అని అనవచ్చును. అంగము అంటే భాగము అని ఇక్కడ అర్థము చేసుకోవలెను. తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములను ఐదు సమాచారములను తెలుపు దానిని పంచాంగము అని అంటున్నాము. ఈ ఐదు విషయ భాగములలో మన జ్యోతిష్యమునకు ముఖ్యముగా ఉపయోగపడునది నక్షత్రము మాత్రమే. తిథి, వారములను, యోగ కరణములను గుర్తింపుకు వాడుకున్నా ముఖ్యముగా అవసరమైనది నక్షత్రము మాత్రమేనని తెలియాలి. అందువలన పంచాంగములో నక్షత్రము అను అంగము ముఖ్యముగా ఉపయోగ పడుచున్నది.

జ్యోతిష్యమునకు ముఖ్యమైన నక్షత్రమును గురించి కొంతవరకు తెలుసుకొంటే ముందు తెలుసుకోబోవు విషయములు సులభముగా అర్థముకాగలవు. నక్షత్రము అనగా నాశనములేనిదను ఒక అర్థము కలదు. అలాగే కనిపించని ప్రదేశమని కూడా అర్థము కలదు. ఇక్కడ సందర్భమును బట్టి రెండవ అర్థమును తీసుకొందాము. కాలచక్రములోనున్న కనిపించని స్థలమును నక్షత్రములని అంటున్నాము. కాలచక్రము యొక్క పన్నెండు భాగములలో మొత్తము 27 నక్షత్రములు గలవు. కాలచక్రములోని పన్నెండు భాగములకు మేషము మొదలుకొని మీనము వరకు పన్నెండు పేర్లు గలవు. అలాగే నక్షత్రములకు కూడా పేర్లు గలవు. 27 నక్షత్రములకు వరుసగా నున్న పేర్లను చెప్పుకొందాము.

ఈ విధముగా మొత్తము 27 నక్షత్రముల పేర్లు కలవు. 27 నక్షత్రములు కాలచక్రములోని పన్నెండు భాగములలో ఇమిడిపోవుటకు అనుకూలముగా ఒక్కొక్క నక్షత్రము నాలుగు భాగములుగా విభజింపబడి నది. ఒక నక్షత్రము నాలుగు భాగములుగా ఉంటూ కాలచక్రములోని అన్ని లగ్నములలో సమానముగా ఇమిడిపోయాయి. కాలచక్ర లగ్నములకు పేర్లున్నవి. అలాగే నక్షత్రములకు పేర్లున్నవిగానీ నక్షత్ర భాగములకు విడిగా పేర్లు లేవు. పేర్లకు బదులుగా భాగములను విడి అక్షరములతో గుర్తించారు. నక్షత్రములలో మొదటి నక్షత్రము అశ్వని నాలుగు భాగములుగా ఉన్నది. ఆ నాలుగు భాగములను అశ్వనీ నక్షత్ర పాదములని అంటున్నాము. ఈ విధముగా అన్ని నక్షత్రములకు నాలుగు పాదములు గలవు. మొత్తము 27 నక్షత్రము లకు 108 పాదములుగలవు. 108 నక్షత్రపాదములు కాలచక్రములోని పన్నెండు లగ్నములలో ఎలా ఇమిడిపోయాయో ఇప్పుడు గమనిద్దాము. ఒక నక్షత్రములోని నాలుగు పాదములలో ఒక్కొక్క పాదమునకు ఒక్కొక్క అక్షరమును గుర్తుగా ఉంచడము జరిగినది. వాటిని ఇప్పుడు చూద్దాము.

ఈ విధముగా 27 నక్షత్రముల యొక్క 108 పాదములకు (భాగములకు) 108 అక్షరములను గుర్తులుగా పెట్టడము జరిగినది. కొందరు జ్యోతిష్యులు ఒక నక్షత్రములో పుట్టిన వానికి ఆ నక్షత్రములోని అక్షరములను ముందరయుంచి పేరును పెట్టడము జరుగుచున్నది. ఉదాహరణకు చిత్త నక్షత్రము మూడవ పాద సమయములో పుట్టినవానికి ఆ నక్షత్రము యొక్క మూడవ అక్షరమైన "ర" తో మొదలగు పేరైన రంగయ్య, రమేష్‌, రాము అని పేరు పెట్టుచున్నారు.

27 నక్షత్రములు 108 పాదములుగా విడిపోయి 108 అక్షరముల గుర్తులుగాయున్నవి. పన్నెండు లగ్నములలో 108 పాదములు ఎలా ఇమిడి యున్నవో ఇప్పుడు గమనిద్దాము.

కాలచక్రములో 108 పాదములనబడు 27 నక్షత్రములు కాల చక్రమైన పన్నెండు లగ్నములలో ఎలా ఇమిడియున్నది క్రింద 48వ చిత్ర పటములో చూడవచ్చును.

48వ చిత్రపటము

ఒక దినములో ఏ సమయమందు పుట్టినా, ఆ సమయము ఏ లగ్నములోయున్నదో చూచుకొనుటకు, సూర్యుడు ఏ రాశిమీద ఎంతకాలము తన కిరణములను ప్రసరించుచూ ముందుకు పోవునో ఆ కాలములను తెలుసుకొందాము. కాలచక్రములోనున్న సూర్యుడు కర్మచక్రములోని పన్నెండు రాశులమీద తన కిరణములను ప్రసరించినప్పుడు, ఏ రాశిమీద ఎంతకాలముండునో ఆ రాశికి సమానముగాయున్న కాలచక్ర లగ్నమును జన్మించిన మనిషి జనన లగ్నముగా, జాతక లగ్నముగా చెప్పవచ్చును. సూర్యుడు కర్మచక్ర రాశులమీద కిరణములు ప్రసరించు కాలమును, కాలచక్ర లగ్న పరిమాణములుగా చెప్పుచున్నాము చూడండి.

ఒక గంటకు 60 నిమిషములున్నట్లు ఒక గడియకాలమునకు 60 విగడియలుండును.

ఒక గంటకు 2.½ గడియ అగును. ఒక నిమిషమునకు 2.½ విగడియ అగును.

2009 సంవత్సరము ఫిబ్రవరి నెల 17వ తేదీన అష్టమి మంగళ వారము పుట్టిన రంగయ్య అను వ్యక్తి జాతకమును చూచుటకు ముందుగా అతని జన్మ కర్మచక్రములో ఎక్కడినుండి మొదలైనదో, లగ్న పరిమాణ కాలములను చూచి సూర్యోదయము తర్వాత ఏ లగ్నముతో మొదలైనదో తెలుసుకొన్నాము. ఉదయము అతను జన్మించిన 9 గంటల సమయమునకు సరిగా మీనలగ్నము మీద సూర్యుడున్నట్లు తెలుసుకొన్నాము. సూర్య గమనముతోనే మనిషి ప్రారబ్ధము ప్రారంభమగుచున్నదని తెలుసుకొన్నాము. రంగయ్య జనన కాలమైన 9 గంటలకు కాలచక్రములో ఏయే గ్రహములు ఎక్కడెక్కడున్నవో పంచాంగము ద్వారా తెలుసుకోవచ్చును. జనన కాలములో పన్నెండు లగ్నములందున్న గ్రహములే జీవితాంతము ప్రభావము చూపు చుండును. అందువలన పన్నెండు గ్రహముల స్థానములను ద్వాదశ లగ్నములలో గుర్తించుకొని, దానిని ప్రారబ్ధ కర్మపత్రముగా లెక్కించి చూచుకోవచ్చును. జనన కాలములో ఆ విధముగ గుర్తించుకొనిన పన్నెండు లగ్నముల కాలచక్రమునుబట్టి కర్మచక్రములోని రాశులందు కనిపించక యున్న కర్మను కొంతవరకు గుర్తించుకోవచ్చును. పూర్తి ప్రారబ్ధకర్మను గుర్తించుటకు వీలుపడదు. అయినా కొంతవరకైనా గుర్తించవచ్చును. ప్రారబ్ధకర్మను కర్మచక్రములో వ్రాసి చూచుకొను అవకాశము జ్యోతిష్య శాస్త్రములో లేదు. అయితే కాలచక్రములోని గ్రహములను మాత్రము గుర్తించుకొని వారి కదలిక వలన ఏ కర్మలు అమలు జరుగునో కొంత వరకు చెప్పుకోవచ్చును. కాలచక్రములో కనిపించే గ్రహములు కర్మచక్రము లోని కర్మరాశులందు గల కర్మను అందించుటకు కాలచక్రములో ఎలా ఉన్నవో ఇప్పుడు గుర్తించుకొందాము. వ్యక్తి జన్మించిన కాలమునుబట్టి ఆ దినము కాల, కర్మచక్రముల గమనములనుబట్టి సూర్యుడు ఏ లగ్నములో ఉన్నాడో దానిని గుర్తించు కోవడము జన్మలగ్నమును గుర్తించుకోవడమగును. 2009 సంవత్సరము ఫిబ్రవరి 17వ తేదీ ఉదయము 9 గం॥ జన్మించిన రంగయ్య జాతకమును చూచి అందులో అతను మీనలగ్నమునందు జన్మించినట్లు తెలుసుకొన్నాము. మీన లగ్నమును అనుసరించి మిగతా అన్ని లగ్నములలో పన్నెండు గ్రహముల స్థితిగతులను గుర్తించుకోవచ్చును. వర్తమాన కాలములో గ్రహములు వాటి గమనమును అనుసరించి ఎక్కడైనా ఉండవచ్చును. పుట్టిన దినమున, జనన సమయములోనున్న పన్నెండు లగ్నములలోగల గ్రహములే జాఫతకమునకు ఆధారమగును. అప్పటి లగ్నమునుబట్టి జీవితములో నిర్ణయించబడిన ప్రారబ్ధకర్మను కొంతవరకు తెలియవచ్చును. అందువలన ప్రతి ఒక్కరు తమతమ జాఫతకములను వ్రాయించి పెట్టుకోవడము మంచిది. 2009 సంవత్సర పంచాంగమునందు 17 తేదీన పన్నెండు గ్రహములు ఏయే లగ్నములలో ఉన్నదీ వ్రాసియుందురు. కావున ఆ పంచాంగమును చూచి పన్నెండు లగ్నములలోని గ్రహములను గుర్తించుకొందాము.

ఆ దిన పంచాంగములో ఉన్న దానినిబట్టి ఏ లగ్నములో, ఎన్నో పాదమందు, ఏ గ్రహముకలదో గుర్తించుకొన్నాము. ముఖ్యముగా గమనించ తగ్గ విషయమేమనగా! ఇక్కడున్న పన్నెండు గ్రహముల సమాచారము పంచాంగములలో ఉండదని తెలుపుచున్నాము. ఇంతవరకు జ్యోతిష్య శాస్త్రములలోగానీ, పంచాంగములలోగానీ నవగ్రహములను గురించియే చెప్పుకొన్నారు. మిగత భూమి, మిత్ర, చిత్ర గ్రహములను గురించి ఎవరు గానీ, ఎక్కడగానీ చెప్పలేదు. అందువలన పంచాంగములో భూమి, మిత్ర, చిత్ర గ్రహముల సమాచారముండదు. పంచాంగములలో లేకున్నా మూడు గ్రహముల స్థానములను పాదములను మేము ఎలా చెప్పగలిగామో తర్వాత వివరిస్తాము. దాని ప్రకారము మీరు కూడా భూమి, మిత్ర, చిత్రగ్రహములను గుర్తించుకోవచ్చును. ఇకపోతే అందరికీ తెలిసిన చంద్రగ్రహము యొక్క విషయము కూడా పంచాంగములలో ఉండదు. చంద్రుడు మినహా ఎనిమిది గ్రహముల లగ్నములను వాటి పాదములను చెప్పిన పంచాంగములు చంద్రుని విషయమును వదలివేశాయి. చంద్రుడు ఏ లగ్నమందు ఎన్నో పాదమునగలడో జ్యోతిష్యులైనవారు స్వంతముగా తెలుసుకోవలసియున్నది. పంచాంగములో చంద్రుడు ఏ నక్షత్రములో ఉన్నదీ వ్రాయబడియుండును. ప్రతి దినము క్యాలెండర్‌లోగానీ, పంచాంగములోగానీయున్న నక్షత్రము ఏదైతే ఉన్నదో అది చంద్రునిదనియే తెలియవలెను. నక్షత్రము తెలిసినా పాదము కొరకు కొంత గణితమును ఉపయోగించి తెలియవలెను. అదెలాగో క్రింద చూస్తారు. 2009 సం॥ ఫిబ్రవరి 17వ తేదీన ఉదయము 9 గంటలకు జన్మించిన దానివలన ఆ దినమున్న అనూరాధ నక్షత్రములో 9 గంటల సమయమున చంద్రుడు ఏ పాదమందున్నాడో తెలియుటకు అనూరాధకంటే ముందు గడచిపోయిన నక్షత్రమును ఆధారము చేసుకొని చూడవలెను. అట్లు చూచిన అనూరాధకంటే ముందు విశాఖ నక్షత్రము జరిగిపోయినది. విశాఖ జరిగిన తర్వాత 17వ తేదీ మంగళవారము అనూరాధ నక్షత్రము సూర్యోదయమునకు ముందు ఎంత గడచినది తెలిసి ముందు దినము గడచిన అనూరాధ నక్షత్రమునూ, ఆ దినమున్న అనూరాధ నక్షత్రమునూ కలిపి చూచిన నక్షత్ర పరిమాణము తెలిసిపోవును. అప్పుడు నిన్నటి దినము గడచిన అనూరాధను నేడు సూర్యోదయము తర్వాత గడచిన అనూరాధను కలిపిన మొత్తము గడచిన అనూరాధ వచ్చును. నక్షత్ర పరిమాణ కాలమును నాలుగు భాగములుగా విభజించి, ఉదయము 9 గంటల సమయములో నాలుగు భాగములలో ఏ భాగము జరుగుచున్నదో దానినే అప్పటి చంద్రగ్రహ నక్షత్ర పాదముగా లెక్కించవలెను. ఇప్పుడు చెప్పినదంతా అర్థమగుటకు గణితరూపములో చూద్దాము. ముందు దినము 16వ తేదీ విశాఖ 46-25 గడియలకు రాత్రి 1-06 నిమిషములకు అయిపోయినది. అప్పటినుండి అనూరాధ గడుస్తున్నట్లు తెలియవలెను. విశాఖ గంటల ప్రకారమైతే రాత్రి 1-06 నిమిషముల వరకు గలదు. గడియలలో అయితే గడియలు 46-25 విగడియల వరకు కలదు. 17వ తేదీ అనూరాధ 53-04 గడియలు రాత్రి 3-45 వరకు గలదు.

దీనినిబట్టి చంద్రుడు అనూరాధ నక్షత్రములో రెండవ పాదమందున్నట్లు తెలియుచున్నది.

జనన సమయమున కాలచక్రములో ఏ లగ్నములో ఏ గ్రహములు ఉన్నవో, అవి ఏ పాదములలో ఉన్నవో వెనుక పేజీలలో చెప్పుకొన్నాము. అయితే అక్కడ మొత్తము పదకొండు గ్రహములను లగ్నములలో ఏ పాదములో ఉన్నది గుర్తించుకొన్నాము. చంద్రున్ని మాత్రము వృశ్చిక లగ్నములో అనూరాధ నక్షత్రమున ఉన్నట్లు చెప్పుకొన్నాము గానీ, చంద్రుడు అనూరాధ నక్షత్రములో ఏ భాగములో (పాదములో) ఉన్నాడో చెప్పలేదు. చంద్రుడు ఆ దిన నక్షత్రమైన అనూరాధలో ఏ పాదములో ఉన్నాడో తెలియుటకు కొంత గణితమును ఉపయోగించుకొని చివరకు అనూరాధ పాదమును తెలుసుకోగలిగాము. ఆ దినము చంద్రుడు అనూరాధ నక్షత్ర రెండవ పాదములో ఉన్నట్లు తెలిసినది. ఇప్పుడు 2009 సంవత్సరము ఫిబ్రవరి 17వ తేదీ అష్టమి మంగళవారమున కాలచక్రములోని లగ్నములనూ, అందులోని గ్రహములనూ, గ్రహములున్న పాదములనూ కాలచక్ర లగ్న కుండలిలో అందరికీ తెలియునట్లు వ్రాసి చూచుకొందాము. తర్వాత పేజీలో 49వ చిత్రపటమును చూడుము.

పాఠకులందరికీ సులభముగా జన్మలగ్న కుండలిలో పన్నెండు గ్రహములను లగ్నములలో గుర్తించడమేకాక ఆయా లగ్నములలో ఏ నక్షత్రమందు, ఏ పాదములో ఆ గ్రహములు గలవో సులభముగా అర్థమగుటకు నక్షత్రముల పేర్లను లగ్నములో ఉంచుతూ, వాటితోపాటు నక్షత్రముల నాలుగు పాదములను కూడా చూపి జనన కాలములోని గ్రహములు ఉన్న నక్షత్ర పాదమును కూడా చూపడము జరిగినది. ఈ శ్రమయంతయు పూర్వము జ్యోతిష్యులు పడి జన్మకుండలిని, జన్మ లగ్నమును తెలుసుకొనెడివారు. నేడు ఇటువంటి శ్రమ ఏమాత్రము లేకుండా పుట్టిన తేదీ, పుట్టిన సమయమును చెప్పితే ఆ దినము జన్మ లగ్నము ఏదైనదీ, మిగతా లగ్నములలో గ్రహములు ఎక్కడున్నదీ, దశలు ఏవైనవీ అన్ని వివరములనూ నేడు కంప్యూటర్‌ ద్వారా క్షణాలలో తెలిసిపోవుచున్నవి. పూర్వము ఒక వ్యక్తి యొక్క జాతకలగ్నమును చూచుటకు అతడు పుట్టిన సంవత్సర పంచాంగమునే చూడవలసియుండుట వలన, జ్యోతిష్యులు గడచి పోయిన వందసంవత్సరముల పంచాంగములను కూడా తమవద్ద ఉంచు
49వ చిత్రపటము
కొనెడివారు. నేడు అటువంటి అవసరము లేకుండా వందసంవత్సరముల పంచాంగములను కంప్యూటర్‌లో ఎక్కించియుండడము వలన, వంద సంవత్సర పంచాంగమునుగానీ లేక యాభై అరవై సంవత్సర పంచాంగ విషయములను గానీ సులభముగా తెలియవచ్చును. అంతేకాక ఏ గణితము వేయకుండా లగ్నమునూ, నక్షత్రమునూ, దశలనూ నిమిషముల వ్యవధిలో తెలియవచ్చును. ఇప్పుడు అన్ని సౌకర్యములు ఉండినా, ఈ శాస్త్రము ఇలా ఉంది అని తెలియుటకు వరుసగా అన్ని విషయములను మేము వ్రాసి చూపించడము జరిగినది. ఇంతవరకు గ్రహచారమును తెలియుటకు కావలసిన వివరమును అందించాము. ఇప్పుడు దశలు అంటే ఏమిటి? దశాచారము అంటే ఏమిటి? అను విషయమును వివరించుకొందాము.