జ్యోతిష్య శాస్త్రము/కాలచక్రములో మిత్రు, శత్రు గ్రహములు ఏవి?

వికీసోర్స్ నుండి

13. కాలచక్రములో మిత్రు, శత్రు గ్రహములు ఏవి?

జ్యోతిష్యము ఆధ్యాత్మికముతో ముడిపడియున్నదని ముందే చెప్పు కొన్నాము. ఆధ్యాత్మికము ప్రకారము పరమాత్మ మూడు ఆత్మలుగా విభజింప బడినది. ఆ మూడు ఆత్మలనే భగవద్గీతయందు పురుషోత్తమప్రాప్తి యోగమున క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడని చెప్పారు. క్షరుడు అనగా ప్రకృతిలో కలిసిన ఆత్మ కావున అది నాశనమగునదని అర్థము. అక్షరుడు అనగా నాశనము కానివాడని అర్థము. పురుషోత్తముడనగా క్షరునికంటేను అక్షరునికంటేను ఉత్తమమైనవాడని అర్థము. ఈ మూడు ఆత్మలనే అద్వైతము, ద్వైతముకాని త్రైతము అంటున్నాము. ఈ త్రైతమును రెండు భాగములుగా విభజించవచ్చును. కర్మవున్న ఆత్మలు, కర్మలేని ఆత్మలు అని విభజించి చూస్తే, కర్మవున్న ఆత్మ క్షరుడు అనబడు జీవాత్మ అని తెలియుచున్నది. కర్మలేనివి రెండు ఆత్మలు గలవు. అవి అక్షరుడు అనబడు ఆత్మ, పురుషోత్తముడనబడు పరమాత్మ అని తెలియుచున్నది. ఈ రెండు భాగములలో కర్మలేని అక్షర, పురషోత్తమ ఆత్మలు గొప్పవనీ, కర్మతో కూడుకొన్న క్షరాత్మ తక్కువదనీ తెలియుచున్నది. మూడు ఆత్మలలో గొప్పవి, తగ్గువి అని తెలియునట్లు 2:1 గా చెప్పకోవచ్చును. కర్మ విధానమును అనుసరించి వాటినే సరి, బేసి అంటాము. 2:1 అనినా, సరి బేసి అనినా, కర్మలేని పరమాత్మ ఆత్మలు రెండు అనియూ, కర్మయున్న జీవాత్మ ఒకటి అనియూ అర్థము. ప్రతి జీవరాసి శరీరములోను 2:1 ఉన్నదనీ మరియు సరి బేసి కలదనీ చెప్పవచ్చును. దైవమునకు జీవునకు గుర్తుగా 2:1 అని సరి బేసి అనవచ్చును. ఈ సరి బేసి జ్యోతిష్యములోనూ ఉపయోగ పడుచున్నది. అదెలా ఉపయోగపడుచున్నదనగా! కాలచక్రములోని 12 భాగములలో 2:1 ప్రకారము, అనగా ఒక సరి సంఖ్య, ఒక బేసిసంఖ్య భాగములను తీసుకొని ఆ రెండు భాగములు ఏ గ్రహములకు స్వంత స్థానములో చూచుకోవలెను. ఈ సరి బేసి సూత్రము ప్రకారము, కాలచక్రములోని పండ్రెండు భాగములను విభజించి చూచితే, సరి బేసి రెండు భాగముల ప్రకారము మొత్తము ఆరు సరి, బేసి భాగములు వచ్చును. మొదట సరి, బేసి భాగములు రెండు ఒక పక్షములో పెట్టి, రెండవ సరి, బేసి భాగములను మరొక పక్షములో పెట్టి, అన్ని భాగములను చూచితే మొత్తము ఆరు గ్రహములు ఒక పక్షముకాగా, మిగత ఆరు గ్రహములు మరొక పక్షమగుచున్నవి. ఈ రెండు పక్షములను మిత్రు శత్రు పక్షములు అంటున్నాము. 2:1 అను ఆత్మల నిష్పత్తి ప్రకారము కాలచక్రములో పండ్రెండు భాగములను విభజించి చూచితే, గ్రహముల రెండు వర్గములు తెలియును. ఈ విధానమును తర్వాత పేజీలో 15వ పటములో చూడుము.

15వ పటములో ఒక సరి, ఒక బేసి ఇళ్ళను తీసుకొని, విభజించడము జరిగినది. దాని ప్రకారము, కాలచక్రములో ఎక్కడ నుండి మొదలు పెట్టినా సరి బేసి సూత్రము మీదనే విభజించాలి. దాని ప్రకారము మొదటి 12వ మీన భాగమును 1వ మేష భాగమును తీసుకొని అందులోని రెండు గ్రహములను ఒక పక్షములో చేర్చి, తర్వాత 2వ వృషభ భాగమును 3వ మిథున భాగమును తీసుకొని, అందులోని రెండు గ్రహములను రెండవ ప్రతి పక్షములో చేర్చాలి. అలా చేస్తే 12వ మీన, 1వ మేష స్థానముల అధిపతులైన గురు, కుజులు ఒక పక్షముకాగా తర్వాత 2, 3 స్థానాధిపతులైన చిత్ర, మిత్ర గ్రహములు ప్రతి పక్షమైన శత్రుపక్షములో చేరి పోవుచున్నవి. అదే విధముగా 4, 5 స్థానాధిపతులైన చంద్ర, సూర్యులు, గురు కుజులు
కాలచక్రము -15వ పటము
గల మొదటి పక్షములోనికి చేరుచున్నారు. 6,7 స్థానాధిపతులైన బుధ, శుక్రులు రెండవ ప్రతిపక్షములో చేరుచున్నారు. ఇక 8,9 స్థానములను చూచితే ఆ స్థానాధిపతులైన భూమి, కేతువు, గురు, కుజ చంద్ర రవి గ్రహముల పక్షమున చేరిపోవుచున్నారు. 10,11స్థానముల అధిపతులైన రాహు, శని గ్రహములు; మిత్ర, చిత్ర, బుధ, శుక్రగ్రహముల పక్షములో చేరిపోవు చున్నారు. ఈ విధముగా 2:1 లేక సరి, బేసి అను సూత్రము ప్రకారము ‘12’ గ్రహములలో ఆరు గ్రహములు శాశ్వితముగా ఒక పక్షములో ఉండగా, మిగత ఆరు గ్రహములు శాశ్వితముగా ప్రతి పక్షములో ఉండును.

ఈ విధముగా రెండు వర్గములుగ 2:1 సూత్రము ప్రకారము విభజింపబడిన గ్రహములలో, ఒక వర్గమునకు గురువు, మరొక వర్గమునకు శని నాయకులుగ నియమింపబడినారు. అందువలన నాయక గ్రహములను బట్టి, ఒక వర్గమును గురువర్గమనీ, మరొక వర్గమును శనివర్గమనీ అంటున్నారు. వీటినే నేడు గురుపార్టీ, శనిపార్టీ గ్రహములని కూడా అంటున్నారు.

ఈ గ్రహములు శాశ్వితముగా రెండు వర్గములుగా చేయబడినవి. ఒక వర్గములోని గ్రహములు, మరొక వర్గములోనికి ఎప్పటికీ మారవు.