జీవశాస్త్ర సంగ్రహము/రెండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రెండవ ప్రకరణము.

సూక్ష్మజీవులు (Micro-Organisms)

మాంసరసము, శాకపదార్థసారము, పాలు మొదలగు జీవపదార్థములు చెమ్మగలచోట నిలువచేసిన యెడల గొంతకాలమునకు దుర్వాసన బయలు దేరి వానిరుచి చెడును. రూపభేదములును గలవి యగును. ఇట్టి మార్పు లేల గలిగెనో శోధించు నిమిత్త మీక్రిందివిధమున నొకకషాయము తయారు చేయుదము.

పిడికెడు వట్టిగడ్డిని వేడినీళ్లలో వేసి కొంచెము నాననిచ్చి చక్కగా వడబోయగా క్రిందికి దిగు కషాయము శోధననిమిత్తము మిక్కిలి యుపయుక్తమై యుండును. ఈ కషాయమును వడబోసి గాజుపాత్రలో బోసి, దుమ్ముపడకుండ నొక కాగితపు అట్టగాని, గాజుపలక గాని మూత వేయవలెను. ఈ రసము మొట్ట మొదట తేటగను స్వచ్ఛముగను ఉండును. ఇది క్రమక్రమముగా మురిగి కాంతిహీన మగును. తుదకు మడ్డియై పైన తెట్టెకట్టి మురికివాస నెత్తును. జంతుజ పదార్థవిషయలలో నీదుర్వాసన భరింప శక్యము కానిదిగా నుండును. ఈ తెట్టె కొంత దళస రెక్కినతరువాత పగిలి ముక్కలయి మునిగిపోవును. అంతట నీరసము క్రమముగా తేరి కొంతకాలమునకు దుర్వాసన యావత్తు పోయి మిక్కిలి స్వచ్ఛమైన దగును. వెలు తురులో దీనిని కొంతకాల ముంచినయెడల ఆకుపచ్చని నలుసు లక్కడక్కడ తేలుచుండును. ఇవి ఆకుపచ్చని జీవులసమూహము లని సూక్ష్మదర్శనితో పరీక్షించుటచే తెలియగలదు. ఇట్టి గాజుపాత్ర మనము సామాన్యముగా చూచుచుండెడి పసరెక్కిన నీటిగుంటను బోలియున్నదని చెప్పవచ్చును. పై జెప్పిన కషాయమువలెనే యీ గుంటలందలి మురుగునీరును ఒక్కసారి విరిగి తేరినపిమ్మట తిరిగి మురగనేరదు. కాని యిట్టినిర్మలమైన స్థితికి ఆనీరు వచ్చునప్పటికి కొన్ని మాసములు పట్టును.

క్రొత్తగా తయారుచేయబడిన కషాయమును వడబోత కాగితముతో చక్కగా వడబోసి యం దొకబొట్టు నెత్తి సూక్ష్మదర్శనియందు పరీక్షించునెడల దానియం దేవిధమైన జీవులుగాని, నలుసులు (Particles) గాని కానరావు. అయినను, కలబారిన వెంటనే ఈ కషాయమునం దొక చుక్కను సూక్ష్మదర్శనితో పరీక్షించిన అతి సూక్ష్మమైన జీవులు లక్షలకొలది మిణుకుమిణుకు మనుచు మిక్కిలి వేగముగ పరుగులెత్తుచు కానబడును. ఇవియే సూక్ష్మజీవులు (Bacteria Or Micro-Organisms). ఇవి ఏకకణ ప్రాణులు. ఇందు ప్రతిదానియందును మూలపదార్థమును, జీవస్థానమును గలవు.

సూక్ష్మజీవులలో ననేక జాతులు గలవు. 1. సూక్ష్మతర్కుపు (Bacterium Termo). 2. సూక్ష్మగుటిక (Micrococcus). 3. సూక్ష్మదండిక (Bacillus). 4. సూక్ష్మకంపక (Vibrio). 5. సూక్ష్మవ్యావర్తక (Spirillum). ఇవి యయిదును ముఖ్యమైనవి.

1. సూక్ష్మతర్కువులు (Bacterium Termo-టర్మో బాక్టీరియము).

ఇవి పై జెప్పిన వట్టి గడ్డికషాయములో నమితముగ నుండును. సూక్ష్మదర్శనితో పరీక్షించునప్పు డీ సూక్ష్మతర్కువు 4-వ పటమునందు సూ.త. లో చూపబడిన ప్రకారము కసరతు జోడు (Dumb-bell డంబెల్)వలె రెండుకొనల రెండు గుండ్రని గుండ్లును ఆ రెంటిని జేర్చు నడిమి కాడయును గలదిగనుండును. మిక్కిలి హెచ్చు దృక్శక్తిగల సూక్ష్మదర్శనులచే పరీక్షించునెడల దానిరూపమును నిర్మాణమును చక్కగా తెలియగలవు. అది సూ. త. లో క్రిందిభాగమున జూపినట్లు రెండు నూలుకండె లొక దాని కొన నొకటంటియున్నట్లు కానబడును. రెండుకొనలయందు పట్టుపోగులవంటి "మృదురోమములు" (Cilia) తోకలవలె అంటియుండును. ఈమృదురోమముల సహాయముచే నీసూక్ష్మజీవులు మిక్కిలి వడిగ నీదులాడుచుండును. సూక్ష్మ తర్కువునందలి కండెవంటి భాగమునకు నీలి మొదలగురంగులు చక్కగాపట్టుటచేత దానియందలి మూలపదార్థమును జీవస్థానమును స్పష్టముగా తెలిసికొనవచ్చును. మూలపదార్థము చుట్టు నొక పలుచని పొరయు గన్పట్టును. ఆపొర కొన్నిటియందు సెల్లులూసు (Cellulose) అను నొకతరహా దూదితోను మరికొన్నిటియందు మాంసకృత్తు (Proteid) తోను చేయబడినదిగా దోచుచున్నది. సూక్ష్మతర్కువులు మన మీవరకు జదివిన ప్రాణులకంటె మిక్కిలి చిన్నవి. అం

సూక్ష్మజీవులు.

4-వ పటము.

Jeevasastra Samgrahamu.pdf

సూక్ష్మజీవుల జాతిభేదములు. సూ. త-సూక్ష్మ తర్కువు. సూ. గు-సూక్ష్మ గుటిక/ సూ. దం-సూక్ష్మ దండిక. సూ. కం-సూక్ష్మ కంపక. సూ. వ్యా-సూక్ష్మ వ్యావర్తక. సూ. దం. బీ-సూక్ష్మ, దండిక బీజము. దొక దానిపొడుగు అంగుళములో 12,500-వ భాగముండును. అనగా నిది వికారిణికంటె 125 రెట్లు చిన్నది. దీని వెడల్పు పొడుగులో 8-వ వంతుండును. అనగా వీనిని ఒకదానిపై నొకటి నరిసెలదొంతరవలె పేర్చినయెడల నొక అంగుళముఎత్తు దొంతవరకు రెండులక్షలు పట్టును.

ఏదైన నొక ద్రవపదార్థము మునుగునప్పుడు దానిపైని కొంతకాలమున కొక తెట్టెకట్టునని చెప్పియుంటిమి. సూక్ష్మజీవులు కొంతకాలము చురుకుగా సంచరించినపిదప పైకి తేలి తోక లూడి జిగటగా నుండు జాంతవము (Gelatine) అను పదార్థము నొకదానిని వెడలగ్రక్కి యాపదార్థములో పొదుగుకొని నిశ్చలనము నొందినవగును (సూ. త. లో కుడిప్రక్కను చూడుము). ఈ జాంతవము మాంసకృత్తు సంబంధమైనది. స్వచ్ఛమైన యీ జిగటపదార్థములో పొదుగుకొని నిశ్చలనమునొంది తేలుచుండెడు అపారమైన సూక్ష్మజీవుల సముదాయమే పైనిచెప్పిన తెట్టె. వికారిణి కొంతకాలము చురుకుగ వ్యవహరించి యొకానొకప్పుడు నిశ్చలనము నొంది గూడుకట్టుకొనునని చెప్పియుంటిమి. అట్లే సూక్ష్మజీవులకుగూడ నిట్లు తెట్టె కట్టుకొనుట విశ్రమస్థితి యని యెఱుంగునది.

మురుగుటకు ప్రారంభించిన కషాయమునందు మొట్టమొదట సూక్ష్మతర్కువులుమాత్రమే యుండవచ్చును. మురిగిన కొలది నితరజాతులు సామాన్యముగా కన్పట్టును.

2. సూక్ష్మగుటిక (Micrococcus-మైక్రొకాకసు).

ఇది మిక్కిలిచిన్నది. ఇది సూక్ష్మమైన గుండ్రని చుక్కవలె నుండును (సూ. దం). వీనిసమూహము సూక్ష్మదర్శనిలో చూచునప్పుడు మిక్కిలి చిన్నదగు నల్లపూసలు విరజిమ్మినట్లుండును. ఇందు కొన్నిజాతులలో నీ సూక్ష్మగుటికలు రెండు రెండు చొప్పున జంటలుగా జేరియుండును (సూ. గు. లో పై భాగమున జూడుము). మరికొన్నిజాతులలో పూసల సరములవలె నవి యొకదానిప్రక్క నొకటి క్రోవలుగా నేర్పడియుండును (సూ. గు. లో నెడమప్రక్కను జూడుము). ఈసూక్ష్మగుటికలే మన శరీరమునందు జేరి కురుపులు, గాయములు మొదలగు వానియందు చీము పుట్టించునవి. పై పైని వ్యాపించుపుండ్లలోనివి గుత్తులు గుత్తులుగను (Staphylococci) లోతుగ దొలుచుకొనిపోవు స్వభావము గల రణములలో నివి క్రొవలుగను (Streptococci) ఉండును. సెగవ్యాధినిపుట్టించు సూక్ష్మజీవు లీజాతిలోనివే. ఇవి జంటులు జంటులుగ నుండును. (7-వ పటములో "సె" చూడుము).

3. సూక్ష్మదండిక (Bacillus-సిల్లను).

ఇవి కొన్ని దినములవరకు మురిగినకషాయములో గన్పట్టును. సూక్ష్మదండికలు వృద్ధిబొందినకొలది సూక్ష్మతర్కువులు తగ్గిపోవును. కొంత కాలమునకు సూక్ష్మతర్కువులు నశించి సూక్ష్మదండికలు మాత్రము వృద్ధిబొందుచుండును. ఈ సూక్ష్మదండికలు సూక్ష్మతర్కువులకంటె మూడురెట్లు పెద్దవి. ఇవి చిన్న చిన్న రూలుకర్ర ముక్కలున్నట్లుండును (సూ. దం. చూడుము). ఇవియే అన్నిటికంటె తరుచుగనుండుజాతి. వీనికి చలరూపమును అచలరూపమును గూడ గలవు. చలించువాని రెండుకొనలను రెండుమృదురోమము లుండును. తెట్టెకట్టుగుణము వీనికిని గలదు. ఈతెట్టెయందు సూక్ష్మదండిక లొక దానికొన కొకటి అంటుకొని పొడుగైన దారములవలె కనబడును. క్షయవ్యాధిని, పశువుల దొమ్మవ్యాధిని గలిగించు సూక్ష్మజీవులు ఈసూక్ష్మదండిక జాతిలోనివి (7-వ పటము చూడుము).

సూక్ష్మకంపక (Vibrio-విబ్రియో).

ఇవి సూక్ష్మదండికలవలెనే యుండునుగాని యీ కణికెలు తిన్నగా నుండక కొంచెము మెలితిరిగి యుండును (సూ. కం). ఇవి మిక్కిలి చురుకుగా పరుగు లెత్తుచుండును. మంచి సూక్ష్మదర్శనులతో చూచునెడల కలరా అనగా వాంతిభేదిని గలిగించునది సూక్ష్మకంపకల జాతిలోనిదే. (7-వ పటములో "క" చూడుము).

సూక్ష్మవ్యావర్తక (Spirillum-స్పైరెల్లము).

ఇది మరమేకు చుట్లవలె మెలికలుతిరిగి యుండును. ఇట్టి రూపమును చూచువెంటనే సూక్ష్మవ్యావర్తకను గుర్తింపవచ్చును (సూ. వ్యా). సూక్ష్మవ్యావర్తక ఈతకొట్టునప్పుడు చూపునకు మిక్కిలివడిగా మెలికలు తిరుగుచు పోవు పామువలె కనిపించును. గాని యీరెండింటికి భేదముగలదు. ఎట్లన, పాము చలింపకుండునప్పుడు దానియా కారమునందు మెలిక లుండక తిన్న గానుండును. ఈ మెలికలు పాము కదలునప్పుడు మాత్రము గలుగును. కాని సూక్ష్మ వ్యావర్తకయొక్క మెలికలు కదలకుండునప్పుడు సహితము దాని శరీరమునందు స్థిరముగ నుండుట చేత దానిసహజ నిర్మాణమునందే యీ మెలికలు గలవని తెలిసికొందుము. సూక్ష్మ వ్యావర్తకకును రెండుకొనలయందును తోకలవంటి మృదురోమములు గలవు.

మృదురోమము.

మృదురోమ మనగ నేమి? ఈమృదురోమము సూక్ష్మజీవులకు చలనము నెట్టు కలిగించును? కను రెప్ప వెండ్రుకలవలె నుండుటచేత దీనికి రోమమను పేరు గలిగినది. అయిననిది రోమమువలె కఠినముగను, నలుపురంగు గలదిగను నుండునవి తలంపవలదు. ఇది పట్టువలె మిక్కిలిమృదువుగను, స్ఫటికమువలె స్వచ్ఛముగను ఉండి ఎల్లప్పు డతివేగమున ముందుకును వెనుకకును ఊగుచుండును.

వికారిణియొక్క చలనమునుగూర్చి వ్రాయునప్పుడు అది తన దేహమునందలి మూలపదార్థమును అక్కడక్కడ పాదములుగ చాచి తన యిచ్చవచ్చిన వైపునకు నెమ్మదిగా కదలుచుండునని చెప్పియున్నాము. వికారిణికి పాదమును తన దేహమునందేభాగమున పెంచినను బెంచగలదు; వానిని తనైచ్చకొలది ముడుచుకొనను గలదు. సూక్ష్మజీవులు

సూక్ష్మజీవులయొక్క మృదురోమముగూడ సూక్ష్మజీవుల మూలపదార్థముయొక్క శాఖయే. అయినను వికారిణి పాదమునకును దీనికిని కొన్ని భేదములు గలవు.

1. ఈ మృదురోమము వికారిణిపాదమువలె దళముగగాక మిక్కిలి సన్నముగను సున్నితముగను ఉండును. ఇది సూక్ష్మజీవి నంటియుండు భాగమున అనగా మొదట కొంచెము లావుగనుండి క్రమముగ కొనవైపునకు సన్నగించిపోవును; ఈరూపము మారక స్థిరముగనుండును. వికారిణి పాదము అనేక రూపములు దాల్చవచ్చును. అది యొకప్పుడు పొట్టిగను, మరియొకప్పుడు పొడుగుగను, ఒకప్పుడు వంకరగును, మరియొకప్పుడు తిన్నగను ఉండును.

2. వికారిణి తనపాదముల నన్నిటిని ముడుచుకొని ఒక్కచోట మిక్కిలి పొడుగైన సన్ననిపాదము నొక దానిని చాచినదని మనము భావించినయెడల అది మృదురోమమును బోలియుండునని చెప్పవచ్చును. వికారిణియొక్క పాదము దానియం దేభాగమున గలిగినను గలుగును. మృదురోమము సూక్ష్మజీవులందు ఇచ్చవచ్చినచోట్ల కలుగక నియతముగా వానికొనలయందు మాత్రము కలుగును.

3. ఇంతేకాక, వికారిణియొక్క పాదము నొక దానిని తెగగొట్టినయెడల దాని నేమియు వికారిణి లెక్కచేయదు. మరియొక పాదమును దానికి బదులుగా నిర్మించుకొని తనవ్యాపారము మృదురోమము


లను జరుపుకొనుచుండును. సూక్ష్మజీవుల మృదురోమము లూడిపోయినగాని, లేక వానిని మనము తెగగొట్టినగాని సూక్ష్మజీవులు తత్క్షణము నిశ్చలనము నొందును.

4. వికారిణి తన పాదమును ముందునకుగాని, వెనుకకుగాని, ప్రక్కలకుగాని తన కోరికప్రకారము కదల్చుకొనగలదు. మృదురోమమో, ఏదో యొక నిర్ణయమైనరీతిని ముందువెనుకలకు మాత్రము ఊగుచుండును. ప్రక్కపటములో "మొదలు" అనునది మృదురోమముయొక్క మొదటిభాగము.

Jeevasastra Samgrahamu.pdf

"కొ" అనునది దానికొన. అది మృదురోమము. కదలక నిలుకడగా నుండునప్పటి యాకారమును సూచించును. మృదురోమ మెడమప్రక్కకు వంగినప్పుడు దానిమూలపదార్థములో నెడమవైపున లోటుపడి కుడివైపున నుబుకును (ఎ. చూడుము). తిరిగి మృదురోమము కుడివైపునకు వంగినప్పు డావైపున సొట్టపడి ఎడమవైపున నుబుకును (కు. చూడుము). ఇట్లది ముందునకును వెనుకకును కొట్టుకొనుచు, తెడ్లు వేయుటవలన పడవ ఏప్రకారము కదలునో అదేప్రకార మీ మృదురోమములు తెడ్లవలె ఆడుచు సూక్ష్మజీవులను అతివేగమున బోవునట్లు చేయును.

5. వికారిణియొక్క పాదము అప్పుడప్పుడుమాత్రము గదలుచుండును. మృదురోమ మెల్లప్పుడును విరామము లేక యాడుచుండును. ఈవరకు చెప్పిన కారణములచేత వికారిణియొక్క పాదమును, సూక్ష్మజీవుల మృదురోమమును ముఖ్యాంశములయం దొక్కటే యనియు, రెండును మూలపదార్థనము దాయపుభాగములే యనియు తెలియనగును.

శ్రమవిభాగము (Division Of Labour)

వికారిణియొక్క చలనము దాని మూలపదార్థమునందలి యే భాగముయొక్క సహాయమువలన నైనను గలుగవచ్చును. వికారిణియొక్క నిర్మాణము దానియొక్క దేహమునం దేభాగమునందు జూచినను ఒక్క టేరీతిగ నుండును. అనగా ఒక్క చోట కొంతభాగము నోరు అనిగాని, కొంతభాగము కాళ్లు అనిగాని, కొంతభాగము చేతు లనిగాని ఏర్పాటు లేదు. తనకు కావలసిన యేకార్యము నైనను వికారిణి చేయ దలైనయెడల, దానిమూల పదార్థమునందలి ప్రతిభాగమును ఆకార్యము నెరవేర్చుటకు సిద్ధముగా నుండును. అనగా నది తినుటకు ఎక్కడతలచిన అక్కడే నోరు గలద; ఏవైపునకు నడువ తలచిన నావైపున నే పాదములేర్పడును. సూక్ష్మజీవియొక్క నిర్మాణమునం దట్లు గాక, దాని రెండుకొనలను రెండు మృదురోమము లనుతోక లేర్పడియున్నవి. వీని సహాయము లేక దానికి నడక జరుగ నేరదు. వికారిణివలె నది తన శరీరమునందలి ప్రతిభాగమును తన నడకనిమిత్తము ఉపయోగించుకొననేరదు. ఈ అంశమును మన మనుదినము చూచు జనసంఘములయందలి నిదర్శనములవలన చక్కగ గ్రహింప గలము. మానవసంఘములలో నాగరికు లగువారిని హెచ్చు జాతులుగను, అనాగరికు లగువారిని తక్కువజాతులుగను నెంచుదురు. అడవులలో నుండు కోయలు మొదలయినవారు అనాగరికులు పట్టణవాసులు నాగరికులు. కోయవాండ్రలో నొక్కొక్కడును, తనకు తానే బట్ట లుతుకుకొనుచు, తనకుతానే వడ్లు దంచుకొనుచు, వంట చేసికొనుచు, రోగము వచ్చినప్పుడు తానే వైద్యము చేసికొనుచు మరి యెవ్వరితో నవసరము లేకుండ తనకాలమును గడపగలిగి యుండును. నాగరికులలో ఆయాపనులకు వేరువేరు నౌకర్లు ఏర్పడియుందురు. ఇట్లొక్కొకరు ఒక్కొకపనిలో ప్రవీణత గలవారై తమతమపనులు తాము నెరవేర్చుటవలన నితరులకు సహాయముచేయుచు, తాము తిరిగి వారిచే ప్రతిఫలముగా సహాయముపొందుచు అన్ని వృత్తులవారును సుఖించుచుందురు. ఇట్లొక వృత్తిగలవారి సహాయమును మరియొక వృత్తిగలవారు ఉపయోగించుకొనుచు తమతమశ్రమను తగ్గించుకొనుటయే శ్రమవిభాగము.

ఇట్లే హెచ్చుతరగతి జీవులకును, తగ్గుతరగతి జీవులకును నిర్మాణమునందలి వ్యత్యాసమునుబట్టి వ్యాపారమునందలి భేదములును గలుగుచుండును. అందు మనవంటి జంతువులును, పెద్ద చెట్లును, హెచ్చుతరగతి జీవులు; ఇవి నాగరికులను బోలియున్నవి. వికారిణి మొదలగు అల్పజంతువులు తగ్గుతరగతిజీవులు. ఇవి యనాగరికుల బోలియున్నవి. హెచ్చుతరగతి జంతువులకు కడుపు, కాళ్లు, నోరు మొదలగు సేవకులు గలరు. ఈ యవయవములు తమతమ పనుల నెరవేర్చకుండినయెడల వీని కొక్క గడియయైనను సదుపాయము జరుగ నేరదు. చెట్ల వేళ్ల నుగాని కొమ్మలను ఆకులనుగాని నరికివేసిన, ఆ చెట్లు జీవింపనేరవు. అటులనే నాగరికుడగు జమీందారునకు వేరువేరుపనులు నెరవేర్చుటకు ప్రత్యేక సేవకులుండినగాని జీవనము కష్టసాధ్యముగా నుండును.

ఇదేప్రకారము తక్కువతరగతివగు వికారిణి మొదలగు ప్రాణులు కోయవాండ్రును బోలియున్నవి. వీని నిర్మాణము ఏమాత్రమును చిక్కులేనిది. వీనికి వేరు వేరు అంగము లనబడు సేవకులు లేరు. వికారిణికి కావలసిన సమస్తకార్యములను నెరవేర్చుకొనుటకు దానియందలి ప్రతిభాగమును సిద్ధముగ నుండును. వికారిణి నిర్మాణమునందుకంటె సూక్ష్మజీవుల నిర్మాణమునందు అంగసమిత్రణము (Comlexity) అధిక మైనది గమనము గలిగించుటకు మృదురోమమను ప్రత్యేక అవయవముయొక్క నిర్మాణముచే సూక్ష్మజీవి వికారిణికంటె హెచ్చుతరగతిలో జేరుచున్నది. పై జెప్పినవిధమున జమీందారు నౌకర్లు లేనిచో తన వ్యాపారములను అతడు క్రమముగ నెట్లు నెరవేర్చుకొనలేడో అట్లే మృదురోమ మను తోకలు లేనిచో సూక్ష్మజీవులకు గమనము గలుగ నేరదు. మృదురోమమను అంగవిశేషము గలిగినదగుటచే సూక్ష్మజీవి వికారిణికంటె నాగరికతగలదని చెప్పనగును. ఇట్టి యంగవిశేషత్వముచేత సూక్ష్మజీవియందు శ్రమవిభాగము కలుగుచున్నది. ఎట్లన, దానియందలి ప్రతిభాగమును నడకనిమిత్తము శ్రమపడ నక్కరలేదు. మృదురోమములు తనకు చలనము గలిగించు వ్యాపారమును ప్రత్యేకముగ జేయుచుండ, తక్కిన శరీరమంతయు ఆహారసంపాదనము యెడలగుపనులను నెరవేర్చుచుండును. ఇట్లే జీవులయొక్క తరగతి హెచ్చుకొలదిని వాని నిర్మాణమునందు అంగసమ్మిశ్రణము అధిక మగుచు, అట్టి యంగములయొక్క వ్యాపారములు ప్రత్యేకముగ నేర్పడి, ఆయా వ్యాపారములను ఆయా యంగములు క్రమముగ నెరవర్చుచుండుటచే, హెచ్చుతరగతి జీవులయొక్క శ్రమ తగ్గుచున్నది. ఇదియే శ్రమవిభాగము. ఈ విషయమై యింకను ముందు జదువగలము.

సంతానవృద్ధి.

(1) వికారిణివలెనే సూక్ష్మజీవులును ద్విఖండనవిధానమున సంతానవృద్ధి జెందును. అనగా ఒక్కొక్క సూక్ష్మజీవి రెండు సూక్ష్మజీవులుగా ఖండన మగును. ఈ ఖండనము చలనావస్థయందుగాని, నిశ్చలనావస్థయందుగాని కలుగవచ్చును. ఈ ద్విఖండనమువలన నొక్క సూక్ష్మజీవి 24 గంటలలోపల నూటయరువది (160) లక్షల కంటె ఎక్కువ సంతానమును పొందుచున్నదని శాస్త్రజ్ఞులు కనిపెట్టియున్నారు. ఒక తల్లిసూక్ష్మదండిక మధ్యమున ఖండింపబడుటచే నేర్పడిన రెండు పిల్లసూక్ష్మదండిక లిరువైపులకు దొర్లుచు క్రమముగా నొక దాని కొకటి దూరమగును. క్రిందిపటము

Jeevasastra Samgrahamu.pdf

చూడుము. ఈ రెండు ముక్కల మధ్య నుండు సూక్ష్మమైన మూలపదార్థపు పోగు ఒకటి ఈ రెంటికిని సంబంధము గల్గించుచుండును (పటములో 1, 2 చూడుము) ఈరెండు ముక్కలును క్రమముగా దూర మగుటచే నడిమిదారము పెద్దదయి తల్లియొక్క మృదురోమముకంటె రెట్టింపు పొడుగై నప్పుడు నడుమ తెగి రెండుపిల్లలకును మృదురోమముల గలిగించును (పటములో 3) ఒకానొకప్పుడు సూక్ష్మదండికలయొక్క పిల్లలు విడివిడిగా చెదరిపోక వరుసగా నొకదాని కొన కొక టంటీ గులుసులవలె గాని (పటములో 4 చూడు), మెలికలు వేసిన దారములవలె గాని కన్పట్టును. ఇదిగాక మరియొకవిధమైన సంతానవృద్ధికూడ గలదు.

(2)సూక్ష్మదండిక యొక విచిత్రమైనవిధమున గ్రుడ్లు పెట్టును. అది విశ్రమస్థితిలో నున్నప్పుడు దాని మూలపదార్థములో నొకచోట నొక ప్రకాశమానమైన చుక్క కన్పట్టును. ఈ చుక్క క్రమముగా మూలపదార్థము నంతయును ఖర్చు పెట్టుచు పెద్దదై స్వచ్ఛమై అండాకృతి నొంది సూక్ష్మదండికయొక్క ఆవరణపు గోడచే చుట్టుకొనబడినదై కొంతకాలము విశ్రమించును (4-వ పటములో సూ. దం. బీ. చూడుము). తుద కా కవచమును పిగిల్చికొని సూక్ష్మదండిక యొకటి బయలు వెడలి యది ద్విఖండన విధానముచే మిక్కిలి చురుకుగ సంతానవృద్ధి గావించును.

(3) మరికొన్ని సూక్ష్మజీవులు పై జెప్పిన మూలపదార్థమునందలి మార్పులు లేకయే ఆవరణపుగోడమాత్రము దళసరెక్కి అండాకృతి నొంది బీజము లగుచున్నవి. ఇవియే సూక్ష్మజీవులకు విత్తనములు. ఈబీజములు కొంతకాలము విశ్రమించినపిమ్మట అనుకూలమైన స్థానమును సమయమును సందర్భపడినప్పుడు, ఒకప్రక్కను కొంచెము పెరిగి గుండ్రనికణికలవలె నయి క్రమముగా బాలసూక్ష్మ జీవులగును. పశువులకు దొమ్మవాధి కలిగించు సూక్ష్మజీవుల బీజములు ఇదేప్రకారము పుట్టుచున్నవి. ఈ బీజ ములు ఎండకును వానకును లెక్క జేయక నేలబడియుండి కొంత కాలమునకు మొకరించి తీవ్రమైన శక్తిగలవై వ్యాధిని తిరిగి వ్యాప్తిజెందించును.

సూక్ష్మజీవుల ఆహారము

సూక్ష్మజీవు లనేకములు వృక్షజాతిలోనివి. ఇందు క్రింద వివరింపబోవు హరితకము లనబడు ఆకుపచ్చ రంగుగల నలుసులుండుటచే, నివి ఆకుపచ్చగ నుండును. కాని కొన్ని జంతుజాతివియు గలవు. ఇందు హరితకము లుండవు. కాన నివి స్వచ్ఛముగ నుండును. మరికొన్ని జంతువు లనికాని వృక్షము లనికాని నిశ్చయముగా చెప్పుట కవకాశ మియ్యక, కొన్ని విషయములలో జంతువులను, ఇతరవిషయములలో వృక్షములను బోలి యీ రెండింటికి మధ్యమావస్థను దెలుపుచుండునని చెప్పవచ్చును.

హరితకములు.

ఆకులు, లేగొమ్మలు మొదలగు నాకుపచ్చగ నుండు భాగములయం దెల్లను పసిరికవర్ణము గలపదార్థ మొకటి గలదు. ఈ పదార్థమునకును మూలపదార్థమునకును గల భేద మీక్రింది శోధనవలన తెలియగలదు. పసిరికరంగు గల జీవిని మద్యసారము (Alcohol) లో వేసినయెడల దాని మూలపదార్థము పేరుకొని కరుడు గట్టును. పసికరంగు మద్యసారములో కరగి మద్యసారమునకు ఆకుపచ్చరంగు నిచ్చును. ఈ పసిరికరంగు చూపునకు క్షణమునం దంతటను వ్యాపించిన ట్లున్నను సూక్ష్మదర్శనితో పరీక్షించునెడల మూలపదార్థములో చెల్లాచెదరుగా నీ రంగు గల భాగము లక్కడక్కడ చిమ్మబడి యున్నట్లు కనిపించును. ఈభాగములయందలి మూలపదార్థపు అణువులమధ్య నుండు సందులలో నీ పసిరికరంగునలుసులు గుంపులుగుంపులుగ నిమిడియుండుటచేత వాని కీ యాకుపచ్చరంగు గలుగుచున్నది. ఈ పసికరంగు నలుసులకు హరితకము లనిపేరు. హరిత మనగా ఆకుపచ్చ రంగు. హరిత వర్ణముగల నలుసులు హరితకములు. వృక్షకణము (Vegrtable cell) యొక్క లోతట్టున హరితకము లన్నియు నొక వరుసగా నేర్పడియుండును. ఆకుపచ్చగ నుండు సూక్ష్మజీవుల మాలపదార్థములో నీ హరితకములు చిమ్మబడియుండును.

సూక్ష్మజీవులలో కొన్నిటియొక్క కణకవచము సెల్లులూసు (cellulose) అను నొకతరహా దూదితో చేయబడినదిగా నుండవచ్చునని చెప్పియుంటిమి. ఇట్టి కణకవచము గల సూక్ష్మజీవులు వృక్షజాతిలోనివి. వృక్షజాతికణముల కిట్టి కవచ మావశ్యకము. ఈ దూదియే మరియొక రూపముగా మారి పెద్దమ్రాకులకు కఠినత్వమును, జిగియును కలుగజేయు పదార్థముగా నేర్పడుచున్నది. వరిపిండియు (Starch) సెల్లులూసును (C6 H10 O5) రెండును కూడ 6 భాగములు కర్బనము, 10 భాగములు ఉజ్జనము, 5 భాగములు ఆమ్లజనము, వీనిసమ్మేళనముచే నేర్పడిన వగుటవలన నొకదానితోనొకటి సంబంధము గలవిగా నున్నవని రసవాదశాస్త్రజ్ఞుల సిద్ధాంతము.

వికారిణికిని, వృక్షజాతికణములకును ఆహారము తిను రీతుల యందు గల తారతమ్యముల నాలోచింతము.

ఆహారము

వికారిణి ఎట్లు ఆహారముతినును?

వికారిణి తనపాదములను అటునిటు పెంచి చాచి ఆహారము నిముడ్చుకొనును. దానికి కణకవచము లేదు. వృక్షజాతికణము చుట్టును సెల్లులూసు కవచ ముండుటచేత వెలుపలనుండి ఘనపదార్థ మేమియు కణములోనికి ప్రవేశించుటకు సాధ్యము కాదు. దీనిమూలపదార్థము పాదములుగా వ్యాపించుట కీ కణకవచ మభ్యంతర మగును. అట్లయిన నిది యెట్టి ఆహారము తిని బ్రతుకును? దానికి నోరు లేదు గదా, ఎట్లుతినును? అను నంశములను విచారింపవలసియున్నది.

వృక్షజాతి సూక్ష్మజీవు లెట్లు ఆహారముతినును?

మన మెంతకాలము సూక్ష్మదర్శనితో నీసూక్ష్మజీవులను పరీక్షించినను, అవి యటునిటు పరుగులెత్తుటయే చూడగలముగాని యేవస్తువునైనను చేరుటగాని, స్పృశించుటగాని, పట్టుకొనుటగాని చూడ నేరము. హరితకములు గల సూక్ష్మజీవులు నివసించు నీళ్లలో నెల్లప్పుడు కొన్ని నత్రజనసంబంధమైన పదార్థములును (Nitrogenous Substances), స్వల్పమాత్రముగ లోహాదులును, లీనమైయుండును. సూక్ష్మజీవులయొక్క ఆవరణకవచము మిక్కిలి పలుచని దగుటచేత, వెలుపలనుండి వాయువులును నీరును లోపలికి కొంచెముకొంచెముగా ఊరుచు జొచ్చుచుండును. ఈ నీటిలో కరిగియున్న నత్రితములును ఈషన్మాత్రము లోహాదులును ఈ నీటితోపాటు కణములోనికి పోవుచుండును. అయిన నీపొరగుండ స్రవించు విధానము వడబోత గుడ్డగుండగాని, నిర్జీవ మైన పలుచని పొరగుండగాని ఒకవైపుననుండి మరియొకవైపునకు దిగునట్టి వడబోతవంటిది కాదు. ఎందుచేత ననగా: ఈ సూక్ష్మజీవులు జీవించెడి నీళ్లలో కొన్ని పదార్థములు వానికి వలసినంతకంటె హెచ్చుగను, అనవసరమైన వస్తువులనేకములుగను, మిక్కిలి యగత్యమైన వస్తువులు కొన్నివేళల నతిస్వల్పముగను, ఉండవచ్చును. అట్టిపదార్థము లన్నిటిలో సూక్ష్మజీవులకు ఏయే వస్తువులు ఎంతెంత కావలెనో ఆయావస్తువు లంతంతమాత్రమే పొరగుండ పోవుచుండునుగాని, హెచ్చుతగ్గులుగ పోనేరవు. వడబోత గుడ్డగుండ గాని, జీవములేని పొరగుండ గాని, మనము వడబోసినప్పుడు, పైవైపుననున్న నీళ్లలో లీనమైయున్న పదార్థములు క్రిందివైపునకు సమూలముగ దిగును. అనగా పై నీటిలో ఏయేపదార్థములు ఎంతెంత యున్నవో క్రిందికి దిగు నీటిలోను ఆయాపదార్థములు అంతంతయే యుండును. పై నీటిలో ఉప్పు కలిసియున్నయెడల క్రింది నీటిలోగూడ ఉప్పుండును. అంతేకాక పై నీ రెంత యుప్పగా నున్నదో క్రిందికిదిగు నీరును అంత యుప్పగానే యుండును. వానికి వెలుపల నుండు నీటిలో ఉప్పు విశేషముగా నున్నను మిక్కిలి తక్కువగానున్నను సూక్ష్మజీవుల కెంతటి యుప్పని నీరు తీసికొనవలెనని యిచ్ఛగా నుండునో అంతటి యుప్పగానే యుండు నీరు సూక్ష్మజీవుల లోపలికి ఊరుచుండును. కాని అంతకంటె హెచ్చుతగ్గులుగ నుండు ద్రవములు సూక్ష్మజీవులు బ్రతికియున్నంత కాలము లోపలికి ప్రవేశింపనేరవు. దీనినిబట్టి జీవించియున్న సూక్ష్మజీవులయొక్క మూలపదార్థమునకు తనకు గావలసిన పదార్థములను తమకెంతంతగావలెనో అంతనే ప్రత్యేకించి లోనికి గొనుశక్తిగలదని స్పష్టముగ తెలిసికొనదగును.

కర్బనికామ్లవాయువును విడదీయుట.

సూక్ష్మజీవులు నివసించు నీళ్లలో బొగ్గుపులుసుగాలి (కర్బనికామ్లవాయువు) గలదు. ఈ నీరు సూక్ష్మజీవియొక్క మూలపదార్థమునందలి అణువుల మధ్య నుండు సందులయందెల్ల పైనిచెప్పిన ప్రకారము వ్యాపించియుండును. వృక్షజాతి సూక్ష్మజీవులు పగటిపూట ఈ బొగ్గుపులుసుగాలిని హరితకముల సహాయముచే ప్రాణవాయువును బొగ్గుగను (ఆమ్లజనముగను కర్బనముగను) విడదీసి, కర్బనమును తన శరీరనిర్మాణము నిమిత్త ముంచుకొని ప్రాణవాయువును (ఆమ్లజనమును) గాలి లోనికి విడిచివేయును. కర్బనికామ్లవాయువును కర్బనముగను ఆమ్లజనముగను విడదీయుటకు కొంతశక్తి, అనగా వేడిమి కావలసియున్నది. దీనిని సూక్ష్మజీవులు సూర్య కాంతినుండి తీసికొనుచున్నవి. కనుకనే యివి యెండవేళనే గాని రాత్రులయందు ఆహారము తీసికొన నేరవు. కావుననే వృక్షము లెన్నడును తగినంత సూర్యకాంతి లేనిదే వృద్ధిబొందవు.

(మూలపదార్థమును కట్టుట.)

ఇట్లు సంపాదించిన కర్బనముతో నీ వృక్షజాతి సూక్ష్మజీవులు తమ మూలపదార్థము నెట్లు నిర్మించుకొనుచున్నవి? మూలపదార్థమునందు కర్బనము, ఆమ్లజనము, ఉజ్జనము, నత్రజనము, గంధకము, స్పురము అను పదార్థములు గలవని చెప్పి యుంటిమి (14-వ పుట చూడుము). ఇందు కర్బనము ఎట్లు సమకూరినదో పైని చెప్పబడినది. ఆమ్లజనమును ఉజ్జనమును సూక్ష్మజీవుల యొక్క శరీరమునందు వ్యాపించియున్న నీటియందే గలవు. ఈ మూటితో నీసూక్ష్మజీవి కర్బనోజ్జనితము (Carbohydrate) ను తయారుచేయును. ఈ కర్బనోజ్జనిత మా నీటియందుండు లఘు నత్రితములతోను (Simple Nitrates), లోహాదులతోను గంధకము, స్పురము, మొదలగువానితోను గలిసి కొన్ని కొన్నిమార్పులనుచెంది తుదకుమిక్కిలి మిశ్రములైన నత్రితములుగా (Complex Nitrates) మారును. ఈ నత్రితములనుండి మాంసకృత్తు (Proteids) లేర్పడును. ఈ మాంసకృత్తులనుండి యీ సూక్ష్మజీవుల సజీవమగు మూలపదార్థ ముత్పన్న మగుచున్నది. ఇదియే వీని యాహారము జీర్ణ మగుపడ్ఢతి యని చెప్పవచ్చును.

ఈ విషయమున వికారిణికిని వృక్షజాతి సూక్ష్మజీవులకును గల తారతమ్యముల నాలోచింతము. ఈ రెంటియందును చిట్ట చివరకు మూలపదార్థము తయారగుటయే వాని జీర్ణ వ్యాపారముల పర్యవసానము.

వికారిణి ఎట్లు జీర్ణము చేసికొనును?

ఇవి తనవలెనే సజీవులగు జంతువులను తినును. అట్లు తినబడిన జంతువుయొక్క మూలపదార్థము వికారిణియొక్క జీర్ణ రసములశక్తిచే నీటియందు లీనమగు మాంసకృత్తులుగా విభజింపబడును. ఈ మాంసకృత్తులనుండి తిరిగి వికారిణి తనమూల పదార్థమును నిర్మించుకొనును. వికారిణి తిను మూలపదార్థము అనేక పదార్థములయొక్క మిక్కిలి మిశ్రమైన సమ్మేళనము. ఇది నీటిలో లీనము కాని ఘనపదార్థము. దీనిని వికారిణి మొట్టమొదట లఘుపదార్థములుగా పగులగొట్టి తన శరీరమునందలి నీటిలో లీనము చేసికొనును. పిమ్మట నా లఘుపదార్థములనుండి తిరిగి తన మూలపదార్థమును నిర్మంచుకొనును.

వృక్షజాతిజీవులు ఎట్లు జీర్ణముచేసికొనును?

ఇవి బొగ్గుపులుసుగాలి, నీరు, గంధకితములు (Sulphates) లఘునత్రితములు (Simple Nitrates) మొదలైన నీటిలో లీనమగు లఘుపదార్థముల నాహారముగా తీసికొని వీనినుండి మొట్టమొదట మిక్కిలి మిశ్రమైన నత్రితముల (Complex Nitrates) ను కట్టును. పిమ్మట నా నత్రితములనుండి మాంసకృత్తులను, వీనినుండి మూలపదార్థమును కట్టుకొనును.

వికారిణియొక్క జీర్ణవ్యాపారము ముఖ్యముగా మిశ్రపదార్థములను లఘుపదార్థములుగా పగులగొట్టుట. వృక్షజాతిజీవుల జీర్ణవ్యాపారము లఘుపదార్థములనుండి మిశ్రమపదార్థములను కట్టుట. ఎట్లన, వికారిణి తనకు పూర్వము మరియొక జంతువుచే తయారుచేయబడిన మూలపదార్థమును పగులగొట్టిమాత్రమే తన మూలపదార్థమును తయారు చేసికొనగలదు. తనకు కావలసిన మాంసకృత్తులను తాను లఘుపదార్థములనుండి తయారు చేసికొననేరదు. వృక్షజాతిజీవులు లఘు (Simple) పదార్థముల నుండి ముందుగా మాంసకృత్తులను కట్టుకొని పిమ్మట వానినుండి తమ మూలపదార్థమును తయారు చేసికొనును.

కేవల జంత్వాహారము.

వికారిణియొక్క ఆహారమువంటి ఆహారమునకు కేవల జంత్వాహారము (Holozoic Nutrition) అని పేరు. అనగా తిండినంతటిని జంతువువలె తినునని యర్థము.

కేవల వృక్షాహారము.

హరితకములు గలవృక్షజాతులు అనగా చెట్టు, పొదలు, పచ్చనితీగెలు, గడ్డి, నాచు, కొన్ని సూక్ష్మజీవులు మొదలగునవి యన్నియు నీరు, కర్బనికామ్లవాయువు, నత్రజనము మొదలగు ఎక్కువ మిశ్రము కాని పదార్థములమాత్రము తీసికొని వానివలన తమ మిక్కిలి మిశ్రమైన నిర్మాణములను చేసికొనును. ఇట్టి ఆహారమునకు కేవల వృక్షాహారము (Holophytic Nutrition) అనిపేరు.

ఇట్లు వ్రాయుటచే కేవల వృక్షాహారమును కేవల జంత్వాహారమును గాక, కొంతవరకు జంత్వాహారమును, కొంతవరకు వృక్షాహారమును పుచ్చుకొను జీవులు గలవని స్ఫురించుచున్నది. ఈవరకు జెప్పిన కేవల వృక్షాహారముచే జీవించునవి గాక సూక్ష్మజీవులు పెక్కుజాతులు మురుగుచుండు జీవపదార్థములలో వృద్ధిబొందును. వీనియందు హరితకము లుండవు. హరితకములు లేని సూక్ష్మజీవులఆహారము కేవల వృక్షాహారము కాదనుట స్పష్టము. శోధన చేయగా నీసూక్ష్మజీవులయాహారము కేవల జంత్వాహారమును గాదని తెలియవచ్చుచున్నది. ఏలయన, వీనికి నోరు లేదని యు, గాన నివి జంతువులను తినవనియు మొదలైనసంగతు లిదివరకే చెప్పియున్నాము. కాన నివి ప్రత్యేకముగ జంతువులను గాని, వృక్షములను గాని ఆహారవిషయమున బోలక రెంటికిని మధ్యమున నుండి కొన్నికొన్ని యంశములయందు రెంటిని బోలి మధ్యమము లన బరగుచున్నవి.

మధ్యమజాతి సూక్ష్మజీవులు-పూతిభుక్కులు.

ద్రవరూపముగను వాయురూపముగను నుండు ఆహారపదార్థములు మూలపదార్థపు సందులలోనికి వెలుపలనుండి యెట్లు ఆవరణపుగోడగుండ ఊరి వ్యాపించునో యిదివరకే చెప్పియున్నాము. ఇట్లు వ్యాపించిన నీరు, కర్బనికామ్లవాయువు, లఘునత్రితములు మొదలగువానినుండి మధ్యమజాతి సూక్ష్మజీవులు తమ యాహారమును ఏర్పరచుకొన నేరవు. ఏలయన, వీనినుండి మూలపదార్థము కట్టునట్టి సామర్థ్యము గల హరితకము లీ సూక్ష్మజీవులందు లేవు. వికారిణిమొదలగు జీవులవలె నివి మిక్కిలి మిశ్రమైన నత్రితముల సమ్మేళనముచే నేర్పడిన వైన మాంసకృత్తులను తిని వానిని జీర్ణించుకొనలేవు. స్థూలములు (Solids) వాని దేహములోనికి పోనేపోవు. అట్లయిన నివి యెట్టిపదార్థములను తీసికొనును?

వీని నివాసములగు మురుగుచుండు ద్రవములలో మాంసకృత్తులు సగము క్రుళ్లుటచే విభజింపబడి నీటిలో కరిగియుండు పదార్థములుగా మారియుండును. ఇట్లు కుళ్లి నీటిలో కరగుట యొకవిధమైన జీర్ణ పద్ధతి యని చెప్పవచ్చును. ఇట్లు జీర్ణమై సిద్ధ ముగా నున్న ద్రవపదార్థములను మధ్యమజాతి సూక్ష్మజీవులు తమ పలుచని యావరణపు పొరగుండ లోనికి తీసికొనును. పిమ్మట వీనినుండి తమ మూలపదార్థమును నిర్మించుకొనును. ఇట్టి మధ్యమజాతి ప్రాణులకు పూతిభుక్కులు (మురికితినునవి) అని పేరు. ఇట్టి యాహారమునకు పూతికాహారము (Saprophytic Nutrition) అని పేరు. ఇట్టి పూతిక (Putrid-మురిగిన) పదార్థముల తినుట కియ్యకొనుటచేత నివి తమ యాహారమును జీర్ణము చేయువిధానము తమ సంబంధము లేకయే తమ శరీరములోనికి ప్రవేశింపకముందే జరుగుచున్నందున తా మాశ్రమను తప్పించుకొనుచున్నవి. కేవల జంత్వాహారము చేతను కేవల వృక్షాహారము చేతను జీవించుప్రాణులలో ఈజీర్ణము చేసికొనునవి వాని దేహమునందే జరుగవలసియున్నది

వికారిణి అప్పుడప్పుడు, అనగా, జంతువులు దొరికినప్పుడు మాత్రమే మేయుచుండును. వృక్షజాతిప్రాణులు సూర్య కాంతిగల పగటికాలమునందుమాత్రమే మేయుచుండును. మధ్యమజాతి ప్రాణులు సర్వకాలములయందు పుష్టికరమైన ఆహారరసములో మునిగి తేలుచు రాత్రిపగలనక, జంతువులవలె నోటితో మాత్రమే కాక, వీనికి నోరే లేదు గనుక, శరీరమంతటితోను తినుచుండును.

పరాన్న భుక్కులు.

ఇవిగాక కొన్ని సూక్ష్మజీవు లితరజంతువుల గర్భమునందును, రక్తమునందును నివసించుచు వానిచేత జీర్ణము చేయబడి సిద్ధ
Jeevasastra Samgrahamu.pdf

ఇందుండు సూక్ష్మజీవులన్నియు తమ నిజస్వరూపములకంటె 1,000 రెట్లు అధిక ప్రమాణముగ జూపబడినవి.

స. జ్వి - సన్ని పాతజ్వరమును పుట్టించునది (Typhoid Bacillus). ఇది యొక సూక్ష్మదండిక.

(52-వ పుట చూడుము). సె. - సెగను పుట్టించునది (Goriococcus).ఇది యొక జాతిసూక్ష్మగుటిక. ఇది రెండు రెండు జంటలుగా నుండు నుపజాతిలోనిది. ఇవి సెగజాడ్యముగలవాని యంగమున వెడలు చీమునుండి యెత్తబడినవి. ఇవి యొక తెల్లకణముచే ంరింగబడి, దాని శరీరములో నిముడ్చుకొనబడినవి. దీని కుడిప్రక్కను-మరియొక తెల్లకణముగలదు. అందు సూక్ష్మగుటికలు లేవు.

క. - కలరాను పుట్టించునది (Cholera-Vibrio). ఇది యొక జాతి సూక్ష్మ కంపక. ఇదికామా (,) వలెనుండునని వర్ణింపబడియున్నది.

క్ష. - క్షయమును పుట్టించునది. (Tubercle Bacillus). ఇది యొకసూక్ష్మ దండిక. క్షయరోగియొక్క కఫమునుండి యెత్తబడినది.

కు. - కుష్ఠరోగమును పుట్టించునది (Leprosy Bacillus). ఒకరోగియొక్క పుండునుండి యెత్త బడినది.

దొ. - దొమ్మరోగమును పుట్టించునది (Anthrax Bacillus). ఈరోగముచే చచ్చిన పశువుయొక్క నెత్తురునుండి యెత్తబడినది. ఇది యొక సూక్ష్మదండిక.


______________ ముగా నున్న ఆహారము నుపయోగించుచు జీవించు చుండును. వీనికి పరాన్న భుక్కులు (ఇతరుల యాహారమును తినునవి. Parasites) అని పేరు. ఇందు కొన్ని తమ నివాసములగు జీవులయొక్క సజీవభాగములనే అనగా ప్రాణముతో నున్న వానిచే తినుచుండును. మసూచికము (Small-Pox), మహామారి (Plague), విషూచి (Cholera), క్షయము (Tuberculosis), కుష్ఠరోగము (Leprosy), సెగ (Gonorrhoea), కొరుకు (సవ్వాయి-Syphilis), సన్నిపాతజ్వరము (Typhoid Fever), మన్యపుజ్వరము (Malarial Fever) మున్నగు మానవరోగములును, దొమ్మ (Anthrax), గాళ్లు (Foot & Mouth-disease), కింక (Rinderpest), కల్లవాపు లేక చప్ప్వాపు ()Quarter-ill మొదలగు పశురోగములును నీ జంతు భుక్కులగు సూక్ష్మజీవులవలననే గలుగుచున్నవి. ఇందు కొన్నిటియొక్క ఆకారములజూపు పట మిందు చేర్పబడియున్నది 51-వ పుటలో 7-వ పటము చూడుము.

చీము ఎట్లు పుట్టుచున్నది ?

ఇవి జంతువుల శరీరమునందలి రక్తము మొదలైన పోషకద్రవములలో ప్రవేశించి వాని నాహారముగా వినియోగపరచుకొనుటయె గాక అవి విసర్జించు విషములచే తమ పోషకులకే రోగము గలుగజేయును. గాయములు, పుండ్లు మొదలగువానియందు చీము పుట్టించునవి యీ సూక్ష్మ జీవులే. అతి వేగమున లోతుగ దొలుచుకొని వ్యాపించు వ్రణములకు క్రోవలుగానుండు సూక్ష్మ గుటికలును (Streptococci), పైపై నుండు కురుపులకు జంటలుగ నుండు సూక్ష్మగుటికలును (Staphilococci)కారణములు. మన శరీరమునందలి రక్తకణములకును, ఈ సూక్ష్మజీవులకును యుద్ధము జరిగి ఆ పోరాటములో నిరుప్రక్కల సేనలును కొంతవరకు చచ్చును. అట్టి మృతకణశవములును, కొన్ని సజీవములగు కణములును, సూక్ష్మజీవులనుండి స్రవించు విషములచే కరగిపోవు శరీరభాగములును, రక్తమునుండి స్రవించు కొంత రసికయును గలిసి చీము ఏర్పడుచున్నది.

హరితకములు లేని కొన్ని సూక్ష్మజీవులు కుళ్లుచుండు పదార్థములయందే గాక మూడవప్రకరణములో జెప్పబోవు పాస్ట్యూరు కషాయములోగూడా వృద్ధిజెందును. ఈ పాస్ట్యూరు రసములో సగము జీర్ణమైన మాంసకృత్తులకు బదులు లఘునత్రితములనుండికూడ నత్రజనమును తీసికొనునట్టి సామర్థ్యము సూక్ష్మజీవులలో కొన్నిటికి గలదని తెలియవచ్చుచున్నది. వేయేల? కొన్నిజాతుల సూక్ష్మజీవులు నిర్మలమైన వట్టి నీటితో (Distilled Water) సహితము జీవింపగలవనుట చిత్రమే కదా?

సూక్ష్మజీవులవలన గలుగు మార్పులు

కొన్ని సూక్ష్మజీవులు తాము నివసించు పదార్థములనుండి ఆహారమును గొనుటయే గాక ఆయాపదార్థములలో ననేకవిధములైన మార్పులను గలుగ జేయును.

అనుకూల స్థితిగతులు.

1. పాలు, పెరుగులు ఎక్కువకాలము నిలువచేసినప్పుడు పులిసి తుదకు మురిగిపోవునని మనమందర మెరిగినదియే. ఇట్టిమార్పు పాలయందు జేరియుండు సూక్ష్మక్షీరకలు (Bacterium Lacto) అను సూక్ష్మజీవులవలన గలుగును. వీని శక్తిచేత పాలయం దుండు చక్కెర క్షీరామ్లము (Lactic acid) గా మారును. ఈ సూక్ష్మజీవులు సూక్ష్మతర్కువుల బోలియుండును.

2. సారాయి మొదలగు అరఖులలో నీరు కలిపిన నవి పులిసిపోవును. సూక్ష్మసౌరికలు (Bacterium Aceti) అను సూక్ష్మజీవులచే నీ మార్పు గలుగుచున్నది. వీని శక్తిచే మద్యసారము ప్రాణవాయువుతో గలిసి సౌరికామ్లము (Acetic acid) అగును.

3. జీవపదార్థములు కుళ్లిపోవుటగూడ ఈ సూక్ష్మజీవుల మూలముననే కలుగుచున్నది. సూక్ష్మతర్కువులే యిట్లు మురిగించుశక్తిగలవి. ఇవి మాంసకృత్తులను ఆదిధాతువులుగా (Elements) విడగొట్టును. అట్టి మార్పులలో మధ్య అంతస్థులుగా ననేక పదార్థములు పుట్టును. అందు అమ్మోనియా (Ammonia-నవాసార వాయువు N H3), ఉజ్జనగంధకిదము (Hydrogen Sulphide H2S ), అమ్మోనియాగంధకిదము (Ammonium Sulphide [NH4]2S) మొదలైన దుర్వాసన గల వాయువులు వెలువడు చుండుటచేతనే, ఆ పదార్థములకు మురుగువాసన గలుగుచున్నది.

సూక్ష్మజీవుల జీవనమున కనుకూలమగు స్థితిగతులు.

అందు మొదటిది వేడి-శీతోష్ణపరిమాణము కొన్ని భాగముల మధ్య నున్నప్పుడుమాత్రము సూక్ష్మజీవులు జీవించును. ఎల్లప్పుడు వేడిగ నుండు పొయ్యి (Hearth) సమీపమున నుంచుటచేగాని, మంచుగడ్డతో చుట్టబెట్టుటచేగాని సంరక్షింపబడిన యెడల భోజనపదార్థము లనేకదినములవరకు కుళ్లి పోకుండ నిలువ యుండును. అనగా మిక్కిలి వేడిగను, మిక్కిలి చలిగను ఉండుచోట్ల సూక్ష్మజీవులు వృద్ధిబొందనేరవు. కాని కొంచెము వెచ్చదనము వానికి మిక్కిలి యనుకూలము. వేసవికాలపు ఉడుకు రోజులలో కోడిగ్రుడ్డు మొదలగు జంతుజపదార్థములును, ఇతర భోజనపదార్థములును అత్యల్ప కాలములోనే క్రుళ్లి వాసనయెత్తి చెడిపోవుట అనుభవమువలన మనకందరికిని దెలిసినదియే. సూక్ష్మతర్కువులకు మిక్కిలి యుక్తమైనది 30°C-35°C భాగములు గల వేడిమియైనను, 5°C భాగములు మొదలు 40°C భాగముల వరకు నది జీవింపగలదు. సూక్ష్మజీవులు గల నీళ్లను కాచునప్పుడు ఆ నీళ్లు పొంగుట (100°C) కు ముందే అవి చచ్చును. కాని వాని బీజములు 130°C భాగములపర్యంతము వేడి ఎక్కువరకును చావనేరవని శాస్త్రజ్ఞులు కనిపెట్టియున్నారు. ఆ నీళ్లు చల్లారిన తరువాత ఆ బీజములు తమ కవచముల పగుల్చుకొని సూక్ష్మజీవులుగా నుద్భవ మొందును.

మనదేశమును యిప్పుడు మిక్కిలి పీడించుచున్న కలరా మహామారి అను రెండువ్యాధులను కలిగించెడు సూక్ష్మజీవులకు బీజములు లేనట్టు కనిపెట్టబడినది. కావున మరుగబెట్టిననీళ్లు త్రాగువాని కానీటినుండి కలరావచ్చుననుభయము లేదు. కావుననే విషూచి మొదలగు అంటురోగములు వ్యాపించియున్నప్పుడు చక్కగ మూతవేసి మరుగబెట్టిన నీటిని చల్లార్చుకొని త్రాగవలెను. లేనియెడల తా మా నీటిగుండ వ్యాధిగ్రస్థు లగుటయే గాక తమ మూలమున సన్నిధి నున్నవారలకుగూడ అపాయ హేతువు లగుదురు. ఈ నీటిని పై జెప్పినట్లు మరుగబెట్టక కొంచెము వెచ్చబెట్టునెడల సూక్ష్మజీవులు చచ్చుట యట్లుండగా మునుపటికంటె నూరింతలు, వేయింతలుగా వృద్ధియయి మిక్కిలి చాకచక్యము నొందును. కాన, గోరు వెచ్చగా కాచిన నీళ్లకంటె నొకవిధముగ కాచని నీళ్ళే మేలు.

రెండవది తడి:- సూక్ష్మజీవుల నిర్మాణమునకు కొంతనీరు కావలసియున్నందున లేశమయినను తడిలేని యనగా, మిక్కిలి పొడిగా నుండు పదార్థములయందు సూక్ష్మజీవులు జీవింపనేరవు. కాబట్టియే బాగుగ నెండబెట్టినపదార్థము లెన్నడును కుళ్లనేరవు.

మూడవది ఎండ:- కొన్నిజాతుల సూక్ష్మజీవులు చీకటియందును, వెలుతురునందును సమానముగానే వృద్ధిబొందినను పెక్కుజాతు లెడతెగని ఎండను భరింపజాలవు. కావుననే కషాయములు తగినంతకాల మెండలో బెట్టినయెడల చిరకాలమువరకు చెడవు. ఇ ట్లెండబెట్టుటలో సూక్ష్మజీవులకు సూర్యకిరణముల వెలుతురే గాని ఎండవేడి మంతగా నపాయకరము గాదని శాస్త్రవేత్తలు స్థిరపరచియున్నారు.

సమాప్తి.

సూక్ష్మజీవులును, వాని బీజములును, మనల నావరించుకొని యెల్ల యెడలను మూగియున్నవి. భూమియందును, నీటియందును, గాలియందును, గాలితో సంబంధముగల సమస్త వస్తువుల మీదను, మన శరీరములోపలను, శరీరముమీదను సర్వకాలములయందును వ్యాపించియుండును. చీము పుట్టించు సూక్ష్మగుటికలు మన గోళ్లలో దూరియుండు మట్టిలో నమితములుగ నుండును.

సూక్ష్మజీవులు మిక్కిలి చిన్నవియగుటచే దేశ దేశములకు వాయువేగముతో పోగలవు. ఈగలు దోమలు మొదలగు నల్ప ప్రాణులును, గాలియు, నీరును వాని ముఖ్యవాహనములు. వాని బీజములు పర్వతములమీది మంచుగడ్డల శీతలమునకుగాని, ఎడారులయందలి దుర్భరమైన యుష్ణమునకుగాని నశింపవు. అతివృష్టి యనావృష్టుల నవి సరకు జేయవు. ఇట్టిబీజముల రూపమున సూక్ష్మజీవులు తమ వృద్ధి కనుకూలముకాని ఋతువులందును స్థలములందును కొంతతడవు విశ్రమించి, తమ కనుకూలమైన కాలమును స్థలమును సందర్భపడినప్పుడు విజృంభించును. తొలకరివానలు కురిసినతోడనే కలరా ప్రారంభమగుట కిదియే కారణము.

జనసమ్మర్దము గల పట్టణములయం దీ సూక్ష్మజీవులు మిక్కిలి యధికముగ నుండును. ఎల్లప్పుడు నిర్మలమైనగాలి వీచునట్టి పల్లెలయందును ఉన్నతప్రదేశములయందును ఇవి మిక్కిలి తక్కువగా నుండును. లండను పట్టణమునందు పరీక్షార్థమై ఒక చదరపుటడుగు పరిమాణముగల పలకకు జిగురురాచి గాలిలో నుంచినయెడల దానిమీద నొక నిమిషములో రమారమి 300 సూక్ష్మజీవులు వ్రాలి యాపలక కంటుకొనునని శాస్త్రవేత్తలు లెక్కించి యున్నారు. ఈ సూక్ష్మజీవులన్నియు రోగము గలిగించునవి కావు.

సమాప్తి.

కొన్ని జనుల కుపయోగమైనవియు గలవు. ఇందునకు తార్కాణముగా జనపు పైరుబెట్టిన భూమికి సత్తువ గలుగుట యీ సూక్ష్మ జీవులమూలముననే అని తెలియవలయును. ఇవి యా మొక్కల వ్రేళ్ల నాశ్రయించియుండి మొక్కలకు కొంత నత్రజనసంబంధమైన యాహారమును గాలిలోనుండి సంపాదించిపెట్టును.

మన ప్రేవులయందు నివసించు కొన్ని సూక్ష్మజీవులు మనము తిను ఆహారములో కొంతభాగమును తిని బ్రతుకుచు మనకు ప్రత్యుపకారముగా మన జీర్ణ రసములచే జీర్ణము కాని యాహార పదార్థములను గొన్నిటిని జీర్ణము చేయు శక్తిగలవై యున్నవి.

ఇట్టి విచిత్రమయిన సూక్ష్మజీవులవిషయమై వివరముగ తెలిసికొన గోరువారు వానినిగూర్చి ప్రత్యేకముగ వ్రాయబడిన ప్రౌఢ గ్రంథములను జదువవలయును.


Jeevasastra Samgrahamu.pdf