Jump to content

జీవశాస్త్ర సంగ్రహము/ఆరవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఆరవ ప్రకరణము.

ఆవర్తకారి (Vorticella).

సామాన్యముగా ప్రతిగుంట నీటియందును ఆవర్తకారు లనేకము లుండును. ఇవి కొన్ని తుక్కునంటియు, కొన్ని నీటిపురుగుల కాళ్ల నంటియు, మరికొన్ని కంపలను, రాళ్లను అంటియు చిన్న చిన్న గంధపుగిన్నెలవలె కంటికి మినుకుమినుకుమనుచు రమ్యముగ వ్రేలాడుచుండును. వీనిని కొందరు శాస్త్రజ్ఞులు తలక్రిందుగా నుండు పొడుగుపిడిగల గంటలవలె నుండునని వర్ణించియున్నారు. ఆవర్తకారియొక్క మొదటిభాగము స్థిరముగ నితర పదార్థముల నంటియుండి యందుండి మొలచినటుల గానవచ్చుటచే ఇది వృక్షజాతిలోనిదేమో యని భ్రమగలుగవచ్చును. అ మొదటిభాగము పొడుగుగ కాడవలెనుండును గాన దానికిని కాడయనియే పేరు (10-వ పటములో A-లో కాడ చూడుము). A-లో చివరభాగము వికసించి గిన్నెవలె నుండుటచే దానికి గిన్నయని పేరు.

ఆవర్తకారియొక్క నిర్మాణము.

గీన్నె యందలి మూలపదార్థమునందు పట్టయనియు (Cortex),దవ్వయనియు (Medulla), రెండుభాగములు గలవు. మధ్యనుండునది దవ్వ (10-వ పటములో A. B. లలో దవ్వ చూడుము). దవ్వచుట్టు నుండునది పట్ట (A. B.లలో పట్ట చూడుము). పట్టచుట్టు నావరించుకొని యొక పలుచనిపొర గలదు (B-లో పై పొర చూడుము). మూలపదార్థమునందు బద్దవలె నుండు నొక పెద్దజీవస్థానమును (Nucleus) దానిసమీపమున గుండ్రనైన యొక చిన్న జీవస్థానమును గలవు (B-లో జీ. చూడుము). ఇవిగాక సంకోచనావకాశ మొకటి గలదు (A-లో సం. అ). కొనవైపున నున్న విశాలమైన గిన్నెవంటిభాగమునకు దళసరియైన బద్దవంటి అంచు గలదు (A-లో అంచు). ఈ అంచుపైని ఇత్తడి సిబ్బి మూతవలె నిమిడియుండు బిళ్ల యొకటి గలదు. (A-లో మూ. బి). ఇది యొకప్రక్కను కొంచె మెత్తబడియుండును. ఇట్లెత్తబడిన చోట అంచునకును, మూతకును మధ్యనున్న సందే దీని నోరు (A. B. లలో నో). దీనినుండి మూలపదార్థములోనికి గొంతుకవంటి గొట్ట మొకటి గలదు (A. B. లలో గొం).

బద్దవంటి అంచుయొక్క లోపలివైపున నంటి యొకవరుస మృదురోమములు గలవు (A-లో మృ. రో). ఈ మృదురోమములు క్రిందివైపున గొంతుగొట్టము పొడుగునను (B-లో మృ. రో). పై వైపున మూతబిళ్ల యొక్క తెరవబడిన భాగమువరకును వ్యాపించియుండును. దీని దేహమునం దితరభాగములం దెక్కడను మృదురోమములు లేవు. ఈ మృదురోమము లన్నియు మిక్కిలి వేగమున కొట్టుకొనుచు ప్రక్కలనుండు నీటియందు గిరగిర తిరుగుచుండు సుడిగుండ్రమును కలుగజేయును. ఈ

ఆవర్తకారి (Vorticella)

A. ఆవర్తకారి నిగిడియున్నప్పటి రూపము. దాని మొదటిభాగము పొడుగుగనుండు కాడ యొకరాతి నంటియున్నది. చివరభాగము వెడల్పుగ గిన్నెవలె నున్నది. పట్ట-దవ్వ-ఇవి మూలపదార్థమునందలి భాగములు. జీ-జీవస్థానము. మూ. బి-మూతబిళ్ల. మృ. రో-మృదు రోమములు. నో-నోరు. గొం-గొంతుక. సం. అ-సంకోచనావకాశము.

నిర్మాణము.

A. యందలి కాడ కెడమప్రక్కను ఆవర్తకారి ముడుచుకొనియున్న రూపము చూపబడినది. ఇందు మూతబిళ్లయు మృదురోమములును మూసికొనబడినవి.

B. ఇందు గిన్నెమాత్రము చూపబడినది. ఆ. అ-ఆహార అవకాశములు. ఇట్టివి పెక్కులు దవ్వలో గిరగిర తిరుగుచుండును. జీ-జీవస్థానములు. అందొకటి పెద్దది-బద్దవలె నుండునది. రెండవది చిన్నది-గుండ్రముగ నుండునది. పైపొర-ఇది గిన్నెను, కాడను ఏకముగా నావరించియుండుట చూడనగును.

D1, D2, D3. సంతానవృద్ధియందలి అవస్థలు. D1, పైభాగమున బీట పుట్టినది. D2. రెండు పిల్ల ఆవర్తకారులును ఒక కాడనే అంటియున్నవి. D3. రెండువైపుల మృదురోమము గల పీపారూపము. అది బాణపు గురుతు చూపువైపునకు ఈదుకొని పోవుచున్నది.

E1. E2. సంయోగవిధానము: E1. ద్విఖండనమువలన గలిగిన పిల్లఆవర్తకారులలో నొకటి ఎనిమిది ఆవర్తకారులుగా చీలియున్నది. E2. చిన్న ఆవర్తకారి యొకటి మరియొక పెద్ద ఆవర్తకారిని జేరి, దాని గిన్నెయొక్క క్రిందిభాగమున అంటియుండి క్రమముగా పెద్దదానిలో నిముడ్చుకొనబడుచున్నది.

F1, F2, F3, F4, F5. బీజోత్పత్తియందలి వివిధావస్థలు. F1. నిశ్చలనము నొందినరూపము. జీ-జీవస్థానము అనేకముక్కలుగా చీలియున్నది. F2. బీజముయొక్క ప్రథమరూపము. F3. ఒకవైపున మృదురోమము లేర్పడియున్నవి. F4. మృదురోమములుగలవైపుక్రిందికి తిరిగి యితర పదార్థముల నంటుకొనబోవుచున్నది. F5. ఆవర్తకారి యొక రాతిని స్థిరముగ నంటుకొనియున్నది. మొదటికొనను మృదురోమము లూడిపోయినవి. పైకొనను మూతబిళ్లయు మృదురోమములును పుట్టినవి. సుడిగుండ్రమునకు జలావర్తమని పేరు. దీనిని కలుగ జేయు జంతువునకు ఆవర్తకారి యని పేరు. ఈ సుడిలో బడి కొట్టుకొనివచ్చు ఆహారపదార్థము లొక నీటిబొట్టులో నిమిడి నోటిగుండ కంఠములోనుండి మూలపదార్థములోనికి ప్రవేశించును. ఈ యాహారపదార్థమును దానిని చుట్టియుండు నీటిబొట్టును గలసి మూలపదార్థములో నాక్రమించియుండుస్థలమునకు ఆహారావకాశములని పేరు (B-లో ఆ. అ). ఈ యాహారావకాములు మూలపదార్థపు దవ్వ (Medulla) లో చుట్టిచుట్టి తిరుగుచు జీర్ణముకాగా మిగిలిన యజీర్ణ పదార్థములను గొంతుగొట్టమునకు అడుగుననున్న అపానద్వారామను రంధ్రమున వెలువరించు చుండును.

కాడయని చెప్పబడు మొదటిభాగము మిక్కిలి మృదువుగను స్వచ్ఛముగను ఉండును. గిన్నెకు కవచముగానుండు పైపొర యీకాడ అడుగువరకును వ్యాపించి దానికిగూడ కవచముగా నేర్పడుచున్నది (A. B. లలో పైపొర చూడుము). ఈ కాడ నిగిడియుండుసమయమున వంకర లేమియు లేక సూటిగ నుండును. దానియందు మిక్కిలి సన్నని నారపోగువంటి దార మొకటి కొంచెము మెలికలుతిరుగుచు మొదటినుండి చివరవరకు వ్యాపించి నడిమిపోగు అనదగియుండును. శేద్ధగా శోధించునెడల ఆ పోగునందు అతి సూక్ష్మమైన అడ్డ చారలు కానబడును. ఇవి గిన్నెయందలి పట్టలోనుండు చారలవరకు ఎడతెగక వ్యాపించి వానితో సంబంధము గలిగియున్నట్టు కంపట్టుటచేత నీపోగు పట్టయొక్క పూర్వభాగమేయని చెప్పవచ్చును.

ప్రేరిత సంకోచనము

ప్రేరిత సంకోచనము (Irritability):- అనగా బాహ్యమైన ప్రేరేపణకు జవాబుగా సంకోచించుటకు సిద్ధముగా నుండుట. ఇది ఆవర్తకారియొక్క గుణములలో ముఖ్యమైనది సూక్ష్మదర్శని యందలి మూత అద్దము (Coverglass) యొక్క స్వల్పమైన తాకుడునుగాని, ప్రక్కల నీదుచుండు ఇతర జంతువులయొక్క స్పర్శమునుగాని ఆవర్తకారి అతి మెలకువతో గ్రహించి తత్క్షణమే ముడుచుకొనును. అప్పుడు దాని కాడయందలి నడిమి పోగుయొక్క మెలికలు దగ్గిరపడుటచేత నది మొదటిపొడుగులో వీసమంతటి ప్రమాణమును లేనిదగును. గిన్నెవలె నుండు దేహము గుండ్రనై, మూతబిళ్లను లోపలి కీడ్చుకొని అంచులచే దానిని మూసిపట్టును. పటములో A. యొక్క అడుగుభాగమునకు ఎడమప్రక్కనున్న ఆకారమును చూడుము.

మాంసాంకురము.

చూపునకు కనబడియు కనబడకుండునంత చిన్నదియై మినుకు మినుకు మను ఆవర్తకారియందు మాంసపుకండ గలదని వ్రాసినచో జదువరులకు చిత్రముగా దోచును కాని దీనియొక్క సంకోచ వికాసములు కండసంబంధమైనవి అనుటకు సందియము లేదు. పూర్తిగా నిగిడి యున్నప్పుడు కాడ సూటిగ నుండునని చెప్పియుంటిమి. కాని దాని నడిమిపోగు సూటిగ బోవక పెద్దపెద్ద మెలికలు గలదై చుట్టిచుట్టి పోవుచుండును. ఈపోగు పొడుగునను కాడయొక్క లోతట్టును అంటియుండును. ఇట్లు చుట్టిచుట్టిపోవునదగుటచేత నీపోగు సంకోచించునప్పుడు దాని నంటియుండు ఆవరణపుపొరను నలువైపులను సమముగ క్రిందకి నీడ్చు శక్తి గలదై యున్నది. ఆకస్మికముగా నీ కాడ ముడుచుకొనునప్పుడు పోగుయొక్క మెలికలు దగ్గిరపడి చిక్కనగును. ఈ పోగును కురుచయై లావగును. మూలపదార్థపుభాగములు ముడుచుకొనునప్పుడు వాని మొత్తపుపరిమాణము తక్కువ కానేరదని వికారిణివిషయమై వ్రాసినప్పుడే జెప్పియుంటిమి (6-వ పుట చూడుము). ఈ నడిమిపోగు గిన్నెయందలి పట్ట యనుభాగముతో సంబంధించినదే కాన మూలపదార్థపుభాగమే. పైని జెప్పిన ప్రకార మీపోగు కురుచయగునప్పుడు దానిచుట్టు నంటియుండు పైపొరగూడ స్థితిస్థాపకత్వము అనబడు రబ్బరువలె సాగెడు గుణముగల (Elastic) దగుటచేత పొట్టిదగుట సహజమే.

పొరయొక్క లోతట్టున ఏదో యొకప్రక్కనుమాత్రమే యీ పైపోగు అంటియుండునెడల ఆపొరను ఆవైపునమాత్రము కురుచయగున ట్లీడ్చి, రెండవవైపున నున్న భాగమును మొదటి వైపునకు వంచును. అటుగాక ఈపోగు చుట్టిచుట్టి పోవుచు వెలుపలిపొరను నలువైపుల నొకేరీతిగ నంటియుండుటచే పైపొర నంతటిని సమానముగ క్రిందికి ఈడ్చును. కనుకనే నడిమిపోగు పొట్టిదైనప్పుడు దానితోపాటు చుట్టునుండుపొరయును పొట్టిదగును.

సంకోచనమునందలి భేదములు.

వికారిణిపాదము, మృదురోమము, కండపోగు వీని సంకోచనమునందలి భేదములు.

1. వికారిణియొక్క మూలపదార్థము ఇటునటు అను నియమము లేక ఎన్నివంకరులుగనైనను పాదములుగ సాగగలదు. ఇట్లు కొన్నిపాదములలోనికి మూలపదార్థము సాగుటయు, మరికొన్ని పాదములనుండి తిరిగి వికారిణి దేహములోనికి అది సంకోచించుటయు, ఇవియే వికారిణియొక్క చలనమునకు ముఖ్యాంగములు (9-వ పుట చూడుము).

మృదురోమము మూలపదార్థపుదారమే యని చెప్పి యుంటిమి. పై పేరాలో జెప్పబడినప్రకారము గాక దీనియందలి మూలపదార్థము క్రమానుసారముగ నొకసారి యొకవైపునకును, మరియొకసారి రెండవవైపునకును ప్రవహించుటచేత మృదురోమముయొక్క చలనము గలుగుచున్నది (35-వ పుట చూడుము).

కండపోగును మూలపదార్థపుదారమే. ఇందు మూలపదార్థము ముందుకు వెనుకకు మాత్రము ప్రవహించును; ప్రక్కలకు ప్రవహించదు. కండపోగు వికసించినప్పుడు మూలపదార్థము ముందునకును, సంకోచించినప్పుడు వెనుకకును ప్రవహించుటచే దాని ఆకారమునందలి భేదములు గలుగుచున్నవి. మూలపదార్థము ముందుకు ప్రవహించినప్పుడు కండపోగు పొడుగై సన్నమగును. ఇదియే వికాసము (Expansion). వెనుకకు ప్రవ హించినప్పు డాపోగు పొట్టిదై లావు అగును; ఇది సంకోచము (Contraction).

II. వికారిణియొక్క మూలపదార్థమునందలి మార్పులు నెమ్మదిగను ఒక్కొకసారి కొంచెముకొంచెముగను క్రమశ: గలుగును. మృదురోమమునందలి మార్పులు అతివేగముగను ఎడతెగకుండను గలుగుచుండును.

కండసంబంధమైన సంకోచము అప్పుడప్పుడు అకస్మాత్తుగ గలుగును. ఇది వికారిణిచలనమువలె క్రమక్రమముగా గలుగునది గాదు. మృదురోమచలనమువలె నెడతెగక యుండదు. కాలక్రమములేక జంతువున కిచ్చవచ్చినప్పుడుమాత్రమే గలుగును. కాలనిర్ణయము లేక ఇచ్ఛానుసారముగ నడిమిపోగునందు అకస్మాత్తుగా గలుగునట్టి యీ సంకోచవికాసములను చూచుతోడనే ఆవర్తకారికి కండస్వభావము గలదని నిశ్చయముగా జెప్పవచ్చును.

సంతానవృద్ధి విధానములు.

1. ద్విఖండనము:- ఆవర్తకారి సామాన్యముగా ద్విఖండనవిధానముచే నిలువున రెండుగా చీలి సంతానవృద్ధి జెందును. పటములో (D1.) చూచిన దానిపైని నొక చిన్నబీట కనిపించును. ఆబీట క్రమముగా పెద్దదయి ఆవర్తకారిని రెండు పిల్లలుగా చీల్చును. ఇవిరెండును కాలక్రమమున పెరుగుచు నొక్క కాడ నంటియున్న రెండుపూర్ణవయస్కులైన ఆవర్తకారులుగా నేర్పడుచున్నవి (D2. చూడుము). కాని శీఘ్రకాలములోనే యీపిల్లకణములలో నొకటి పీపావంటి ఆకారముగలదై (D3. చూడుము) చుట్టు అంచును మూతబిళ్లయు ముడుచుకొని మొదటికొననుగూడ మృదురోమములవరుసను గూర్చుకొని, తల్లి కాడను తనతోడికణము ప్రత్యేకముగా ననుభవించుటకై వదలి కాడలేని ఆవర్తకారిగా వీడిపోవును. అది పటములో జూపిన ప్రకారము కొంతదూరము నీళ్లలో నీదుకొనుచుబోయి తన మొదలుతో నేదో యొకవస్తువు నంటి యా కొనయందుండు మృదురోమముల విసర్జించి క్రొత్తకాడ నేర్పరచుకొని క్రమముగా సంపూర్ణ ఆవర్తకారి యగును.

ఈప్రకారము సోదరుని పితృస్థానమునందు విడిచి తనకు మరియొకచోటును వెదకబోవు ఆవర్తకారియొక్క యుద్దేశము కొంచె మాలోచించిన తెలియగలదు. పై జెప్పినప్రకారము నిలువున చీలి ఏర్పడిన ఆవర్తకారులు రెండును, ఒక్కకాడనే యంటియుండి, తిరిగి వానిలో ఒక్కొక్కటియు పిల్లలుగా చీలి కాలక్రమమున అనేకము లొక్కచోటనే జేరెడునెడల అక్కడ నుండు ఆహారమంతయు త్వరలో ఖర్చుపడి అవి క్షామముపాలు కావలసివచ్చును. ఈప్రాణు లీ సంగతి గుర్తురెగినవై అట్టి యపాయము గలుగకుండ తమలో నొక్కటి స్థలాంతరమునకు బోయి ఏకఫలాపేక్షితులగు స్వజాతీయుల పోరు లేనిచోట సమృద్ధిగా నాహారము గొనుచు స్వేచ్ఛగా జీవించును.

తల్లిదేశము, కాలనీలు.

ఈపిల్ల ఆవర్తకారుల చరిత్రము మన కేమి బోధించుచున్నదో చూతము.

ఐరోపాఖండమునందు ఇంగ్లాండు, ఫ్రాంసు, జర్మనీ, స్పెయిను మొదలగు చిన్నచిన్న దేశములుగలవు. మన ఇండియాదేశమును దిగుదీయుచున్నట్టి క్షామాదిబాధ లాదేశములందలి ప్రజలకు లేకపోవుటచేత కాలక్రమమున వారి జనసంఖ్య మిక్కిలి హెచ్చుచు, ఆయాదేశములలోని ప్రజలకు ఆదేశములు చాలక పోవునేమో యనుభయము కలిగినది. నాలుగువందల సంవత్సరములక్రిందటనే ఆ దేశములయందలి బుద్ధిమంతులు కొందరు ఈసంగతిని గుర్తెరిగినవారై, ప్రపంచకమునం దెక్కడెక్కడ గయాళుప్రదేశము లున్నవో గాలించి వెతకి క్రమక్రమముగా నాక్రమించుకొనిరి. వీరు ఆక్రమించుకొనిన పిల్ల దేశములకు కాలనీ లనిపేరు. వీరిలో కనడా మొదలగు ననేకదేశములవారు పేరునకుమాత్రము తల్లిదేశముయొక్క రాజ్యమునకు లోబడియుమ్మను సర్వవిషయములయందును స్వాతంత్ర్యము గలవారుగా నున్నారు. యునైటెడ్డుస్టేట్సు మొదలగు కొన్ని ఇతరదేశముల వారు తల్లి దేశములవారు తమ కపకారముజేయ నెంచినప్పుడు వారిని లెక్కజేయక సర్వస్వతంత్రమును బొందియున్నారు.

పైనిచెప్పిన దేశములవారు ప్రవేశించునప్పటికి మిర్జనములగు అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండములలోని యరణ్య

తల్లిదేశము, ---------

ప్రదేశములు, ఇప్పుడు ప్రజలచే క్రిక్కిరిసియుండి తల్లిదేశములను వెక్కిరించుచున్నవి. ఇట్లు వీరు తమదేశమునుండి లేచి పోవుటచేత తాము సంపత్సరోవముల మునిగితేలుచు సర్వ సుఖముల ననుభవించుచుండుటయేగాక తమ ఇంటివద్ద నున్నవారికి తమబరువును తగ్గించినవా రగుటచేత వారికిగూడ గొప్ప ఉపకారము చేసినవార లగుచున్నారు. వీరిచరిత్రము పైనిచెప్పిన ప్రకారము సోదరుని పితృస్థానమున విడచి తనకు మరియొక చోటును వెదకబోవు ఆవర్తకారియొక్క చరిత్రమును బోలియున్నది.

ఇది ఇట్లుండగా మనదేశమునువిడచి వెలుపలి దేశములకు బోయి స్వతంత్రముగ జీవనము చేసికొనువారిని మన హిందూదేశమునందలి ప్రజలు అగౌరవముగ చూచెదరు. అట్లుచూచుట తప్పు. ఇండియాదేశపు జనులు ఎక్కడెక్కడ జీవించుచున్నను ఇండియనులే. తల్లిదేశమైన ఇండియాదేశమునందు వారి కభిమాన ముండకమానదు. వారికి మనమును మనకు వారును సహాయభూతులుగానుండి సజాతీయులగు ఒండొరుల బలములను వృద్ధిచేసికొనవలయును.

2. రెండవవిధమైన సంతానవృద్ధి, సంయోగము:- ఆవర్తకారి యొకానొకప్పుడు సంయోగ విధానమునగూడ సంతానవృద్ధి జెందును. సంతానవృద్ధికొరకై రెండుకణములు ఐక్యమగుటకు సంయోగ మని పేరు. ఆవర్తకారి యొకానొకప్పుడు అసమానమైన రెండుభాగములుగా చీలును. అం దొకటి, రెండు మొదలు ఎనిమిది చిన్నజీవులుగా ఖండింపబడును (పటములో E1). ఇవి పరిమాణములో చిన్నవై నప్పటికిని తక్కిన సర్వవిషయముల యందును పై జెప్పిన పీపారూపుల బోలి తల్లికాడనుండి వీడిపోయి మొదటికొననుగూడ మృదురోమములు గలిగి స్వేచ్ఛగ నీదులాడుచుండును. కొంతకాల మట్లు సంచరించి తుదకు సాధారణమైన పెద్దఆవర్తకారి నొకదానిని జేరి దాని గిన్నెయొక్క మొదటిభాగము నంటుకొని క్రమముగా దానిలో నిముడ్చుకొనబడి లీనమగును (పటములో E2 చూడుము).

అంతటనుండి ఆ యావర్తకారి అతి చురుకుగలదై, పూర్వముకంటె ఎక్కువ ఆహారమును తినుచు ద్విఖండన విధానమున ఎక్కువపిల్లలను పెట్టుచుండును. ఇది రెండుకణముల సంయోగమువలన గలిగినది గాన దీనిని సంయుక్తబీజము (Zygote) అని చెప్పనగును.

పై జెప్పిన సంయోగమునందు గూడునట్టిజీవులకు గల తారతమ్యము చక్కగ గ్రహింపవలెను. సంయోగము నొందు జీవులు రెండును ఒక్కరూపముగ నుండవు. అం దొక్కటిచిన్నది మిక్కిలి చాకచక్యము గలది. దీనికి సూక్ష్మసంయోగి యనిపేరు. రెండవది మొదటిదానికంటె పెద్దది. ఇది మిక్కిలి మందముగ నుండును. దీనికి స్థూలసంయోగి యనిపేరు. ఇదేప్రకారము మనము చదువబోవు పాఠములలో స్త్రీ పురుష వివక్షతగల జీవులయొక్క బీజములలో నొకటి పెద్దదిగను, రెండవది చిన్నదిగను ఉండుట సర్వసామాన్యముగ జూడగలము. అందు సామాన్యముగ చిన్నది పురుషజాతిగను పెద్దది స్త్రీజాతిదిగ నుండును. కాన నీ సంయోగులలో నాడదానిని స్థూలసంయోగి యనియు, మగదానిని సూక్ష్మసంయోగి యనియు వాడెదము.

3. మూడవవిధమైన సంతానవృద్ధి, బీజోత్పత్తి:- ఆవర్తకారి యొకానొకప్పుడు పటములో (F1. లో) జూపినరీతిని గూడు కట్టుకొనును. ఇట్లు నిశ్చలన మొందిన స్థితిలో దీని జీవస్థానము (జీ) కొన్నిముక్కలుగా చీలి యాముక్కలు కొంతమూలపదార్థమును తమచుట్టును జేర్చుకొనును. కొంతకాలమయినతరువాత నా గూడు పగిలి దానినుండి చిన్నచిన్న బీజములు (Spores) బయలు వెడలును (F2. చూడుము). వీనిలో ప్రతిదానియందును జీవస్థానముయొక్క ముక్క యుండును. పిమ్మట వీని కొకవైపున మృదురోమములు గలిగి వానిసహాయముచే నివి యీదుచుండును. (F3). ఒకానొకప్పు డీ స్థితిలో నివి ద్విఖండనముచే వృద్ధిబొందుటయు గలదు. తుద కివి మృదురోమముగల కొనచే నేదోయొక పదార్థము నంటుకొని స్థావరముగ నుండును (F4.చూడుము). ఇట్లు స్థిరపడిన తరువాత దాని మొదటిభాగము పొడుగుగా పెరిగి కాడయగును. పిమ్మట దాని మొదటికొననుండు మృదురోమములూడి చివరకొనయందు మృదురోమములు గల యంచును, మూతబిళ్లయు నేర్పడును (F5). ఇట్లు క్రమక్రమమున బీజ మంకురించినది మొదలు పరిపూర్ణమైన ఆవర్తకారి ఏర్పడువరకు దాని యాకారమునందును, నడవడి యందును గూడ ననేకమార్పులు గలుగును.

రూపపరిణామము.

ఆవర్తకారియొక్క బీజములు మొట్టమొదట F2.లోచూపిన ప్రకారము గుండ్రముగను, మృదురోమములు లేనివిగను ఉండి, నీటియందు తేలుచుండు నోరులేనిజీవులు యుక్తవయస్సు గల ఆవర్తకారియో, స్థిరముగ నొక్కచోట నంటియుండి మృదురోమములు గలిగి నోటితో నాహారము తినునది, ఒక్కచోటనే స్థిరముగ నంటియుండునట్టిదయ్యును, తన కపాయము గలుగ బోవునప్పుడు గ్రహించి తటాలున ముడుచుకొని సంరక్షించు కొనుటకు తగిన జ్ఞానముగల జంతువు. ఇట్లు బాల్యమునం దొక రూపమును నడవడియు గలిగి, యుక్తవయస్సు వచ్చినప్పు డాకారమునందుగాని నడవడికయందుగాని తమ బాల్యస్థితిని ఎంత మాత్రమును పోలక, వేరురూపముతో పరిణమించుజంతువు లనేకములు గలవు. గొంగిళిపురుగునుండి సీతాకోకచిలుక యిట్లే పరిణమించుచున్నది. ఇట్టి మార్పునకు రూపపరిణామని పేరు.

అఖండావర్తకారి.

ఆవర్తకారులు సామాన్యముగా రెండుగా చీలి యందొకటి కాడనంటియుండుననియు, రెండవది కాడను విడచి ఈదుకొనుచు

వేరొక చోటికి పోవు ననియు చెప్పియుంటిమి. అట్లుగాక పిల్ల ఆవర్తకారులు తరతరముల వృద్ధియగుచు ఒక్క కాడనే అంటి యుండునెడల ఎట్లుండునో ఊహించునది. అట్టిరూపము పైనివివరింపబడిన జాతివగు ఆవర్తకారులలో లేకపోయినను దానిసంబంధజాతులలో జేరిన అఖండావర్తకారి (Zoothamnium) అను జీవియందు గలదని ఎరుంగునది (ప్రక్క పటము చూడుము). దీనియందలి పిల్ల ఆవర్తకారుల కన్నిటికిని ఆహారము ఒక్క కాడనుండియే రావలెనుగదా. ఆహారము సమృద్ధిగ నున్నంతకాలము వానికిలోపములేదు. కాని ఆహారము చాలకపోవుట తటస్థించినయెడల అన్నియు నొక్కసారియె శుష్కించవలసి వచ్చును.

ఈ అఖండావర్త కారియొక్క చరిత్రము ఇండియనుల చరిత్రమును బోలియున్నది. ఇండియా అను తల్లియొక్క పిల్లలు అనగా ఇండియను లెవ్వరును పూర్వాచారముల ప్రకారము ఇండియాను విడచిపోకూడదు. పూర్వపు ఆచారములు అప్పటిరోజులకు చక్కగతగియున్నవి. ఆ కాలమున జనసంఖ్య మిక్కిలితక్కువ కాబట్టి అప్పటివారు తమసంఘమునుండి కొంతమంది విడిపోయిన యెడల తమకు బలము తక్కువగునని భయపడి ఇతర దేశముల కెవ్వరును పోకూడదను కట్టుబాట్లు చేసిరి. పూర్వమువలె నన్య సమృద్ధియు, స్వరాజ్యమును ఉండినచో ప్రజలకు ఎట్టిలోపములును లేక, అందరును ఒక్కచో గలసి యుండుటవలన తమ ఐకమత్యబలముచేత తమశత్రువులనుండి తమ్ము రక్షించుకొనుటకు మరింతశక్తి గలిగియుందురు.

అట్లుగాక విడువనిక్షామముల పాలబడి, వరుసగా చిరకాలమునుండి పరరాజులచే జిక్కి కష్టములను అనుభవింప వలసి వచ్చినప్పుడు, అఖండావర్తకారియొక్క బిడ్డలవలెనే ఎల్లవారును ఒక్కసారిగా నశింపవలసి వచ్చునుగదా !

మొదట వ్రాయబడిన ద్విఖండవిధానమున విభాగమైన తోడనే విడిపోయి స్వతంత్రముగ జీవించు శక్తిగల ఆవర్తకారులలో క్షామాదిబాధ లుండనే యుండవు. ఒక్కొకచో నట్టివి సంభవించినను ఏవో కొన్నిపిల్లలే అనుభవించునుగాని, ఒక్క సంతతిలోని ఆవర్తకారుల కన్నిటికిని ఒక్కసారిగా అంతము గలుగనేరదు.