Jump to content

జీవశాస్త్ర సంగ్రహము/అయిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

అయిదవ ప్రకరణము.

రక్తాక్షి. (Euglena).

రోడ్డుప్రక్కల త్రవ్వబడు గోతులలో నొకానొకప్పుడు వాననీరు నిలిచి పసరెక్కుచుండును. అట్టి నీటి నొక గాజుపాత్రములో పట్టి చూచునప్పుడు అందు సన్నని పచ్చనిదారములవంటి తుక్కు కన్పట్టును. వీనినిగూర్చి 7-వ ప్రకరణములో చర్చించెదము. ఈ దారములు లేకయే యొకానొకప్పు డీ నీరు సర్వత్ర పచ్చగ నుండి వట్టికంటికి నలుసు లేమియు నున్నట్లు తెలియదు. కాని యిం దొకబొట్టును సూక్ష్మదర్శనితో పరీక్షించినయెడల నీ పచ్చరంగు, పసిరిక రంగుగల లెక్క లేని జీవుల సముదాయము వలన గలిగినదని తెలియగలదు. ఈ జీవులయందు ప్రతిదానికి ప్రకాశమానమైన ఎర్రని కన్నువంటి చుక్క యొక టుండుటచేత వీనికి రక్తాక్షు లను పేరు గలిగినది. రక్తాక్షి వికారిణికంటె కొంచెము చిన్నది. రక్తాక్షి నూలుకండెవలె రెండు చివరలందును సన్నముగను, నడుమ లావుగను ఉండు ఆకారము గలది. ఆ రెండుకొనలలో ముందరిది కొంచెము మొండిగ నుండును. దీనినుండి పొడువైన మృదురోమ మొకటి బయలువెడలియుండును. ఆ మృదురోమము మిక్కిలి వేగముగ పడవ తెడ్డువలె నాడుచుండుటచే దాని దేహము ముందుకు కదలుచుండును. రక్తాక్షికి నీ యీతవంటి చలనమెగాక జలగనడకవంటి నడకయు గలదు. అప్పు డది యొకభాగమున ముడుచుకొని మరియొక భాగమున సాగియుండును. అది ఎట్లన్న, దాని దేహమును మూడుభాగములుగా నున్నట్లు ఊహించినచో అందు ప్రథమమున ముందరిభాగము కొంచెము లావయి తక్కినభాగములు సన్న మగును. క్రమముగా నాలావు మధ్యభాగమునకు వచ్చి ముందుభాగము సన్న మగును. మరల నాలావు వెనుకభాగమునకు గలిగి మధ్య భాగమును ముందుభాగమును సన్న మగును.

నిర్మాణము.

రక్తాక్షియొక్క దేహము మూలపదార్థముతో జేయబడినది. ఆమూలపదార్థముచుట్టును పలుచనిపొర యొకటి చర్మమువలె నావరించియుండును (9-వ పటము చూడుము). ఈ పొరయందు మిక్కిలి సన్నని రేఖలు (Striae) గలవు. ఇది దళసరెక్కి గట్టిపడిన మూలపదార్థమే యని చెప్పవచ్చును.

దీని మూలపదార్థములో హరితకము లిమిడియుండుటచేత రక్తాక్షి కీ యాకుపచ్చరంగు గలిగినది. దీని మూలపదార్థమధ్యమున జీవస్థానమును, దానిమధ్య అంతర్జీవస్థానమును స్పష్టముగ కన్పట్టును (పటములో జీ. చూడుము). ముందుభాగమున సంకోచనావకాశ మొకటి గలదు (సం. అ). రెండు కొనలయందును హరితకములు లేకపోవుటచేత నవి స్వచ్ఛముగ నుండును.

A. రక్తాక్షియొక్క ఆకారము అనేక రెట్లు పెద్దదిగ చూపబడినది, జీ-జీవస్థానము. దీని మధ్యమున అంతర్జీవస్థానము స్పష్టముగ కనబడుచున్నది. సం-సంకోచనావకాశము. మృ. రో-మృదురోమము. నో-నోరు. మృదురోమము గొంతుగొట్టముయొక్క అడుగుభాగమున నుండి వెడలుచున్నది. క-కనుచుక్క.

B.రక్తాక్షి నిశ్చలనమునొందిన అవస్థ. ఇందు ఒక రక్తాక్షి నిలువున రెండుగా చీలి రెండును కణకవచము (క. క) లోపల నిమిడియున్నవి.

రక్తాక్షి వృక్షమా?

రక్తాక్షులు మెండుగ గల నీటియందు ఆమ్లజనము (O) బుడగలుగ వెడలుచుండును. వృక్షజాతి సూక్ష్మజీవులవలెనే రక్తాక్షియు నీటియందు లీనమైయున్న కర్బనికామ్లవాయువు (CO2) ను హరితకముల మూలమున ఎండవేళల విడదీసి, కర్బనము (C) ను తన యాహారమునిమిత్త ముంచుకొని ఆమ్లజనము (O) ను విడచివేయును. ఇట్టి కారణముచేత నీరక్తాక్షిని చిర కాలమువరకు వృక్షజాతిజీవిగా నెంచుచుండిరి. కాని యిది వృక్షజాతిలోనిది కాదనుటకు అనేక కారణములు గలవు.

రక్తాక్షి జంతువా?

దీని ముందుభాగము హెచ్చు దృక్ఛక్తిగల సూక్ష్మదర్శనితో చూచునప్పుడు పటములో జూపిన ట్లుండును. దీని దేహమునందలి ముందరికొన మొండిదిగ నుండునని చెప్పియుంటిమి. ఆకొనయం దొక సన్నని గొట్టమువంటి రంధ్రము గలదు. ఈ గొట్టమే దాని గొంతుక. ఈగొట్టముయొక్క పైభాగమే దాని నోరు (9-వ పటములో నో. చూడుము). ఈ గొట్టముయొక్క అడుగుభాగమునుండి పై జెప్పబడిన మృదురోమము వెడలుచున్నది. ఈ మృదురోమ మెల్లప్పుడును కొట్టుకొనుచు నా చుట్టుప్రక్కలనుండు నీటియందు సుడి గలిగించును. ఆ సుడిలో బడి కొట్టుకొనివచ్చిన అణుమాత్రమైన ఆహారపదార్థములు రక్తాక్షి గొంతుకలోని కీడ్వబడును. పిమ్మట అవి దానిమృదువైన మూలపదార్థములో నిముడ్చుకొనబడి వికారిణి విషయములో జెప్పబడినరీతిగనే జీర్ణమగును. కావున రక్తాక్షియు వికారిణివలె జంతుజాతిలోని దేమోయని తోచుచున్నది.

రక్తాక్షి ఈ ఆహారపదార్థముల మ్రింగుననుటకు నిదర్శనముగా, మన మది నివసించు నీటియందు అణుమాత్రమైన రంగు పలుకులు కలిపినయెడల అవి రక్తాక్షినోటిగుండ మూలపదార్థములోనికి పోవుచుండునప్పుడు స్పష్టముగా చూడవచ్చును.

రక్తాక్షి వికారిణికంటె హెచ్చుజాతిలోనిది.

వికారిణి తన దేహమునందలి ఏభాగమునుండి యయినను ఆహారము నిముడ్చుకొనగలదు. రక్తాక్షి కా యాహారపదార్థములొక్క మార్గముననే చేరవలెను. రక్తాక్షికి నోరును, కంఠమును ప్రత్యేకముగా ఏర్పడియుండుటచే వికారిణికంటె నిర్మాణవ్యత్యాసము (Differentiation of Structure) గలుగుచున్నది. ఇట్టి విశేషనిర్మాణముచే రక్తాక్షి వికారిణికంటె హెచ్చుజాతిలోని దని చెప్పవలయును.

పైని చెప్పబడిన జంతుజాతిప్రాణులవలె ఆహారము తినుటయు, జీర్ణము చేసికొనుటయు మొదలగు వ్యాపారములు గలదగుటచేత రక్తాక్షి జంతువని చెప్పదగియున్నది. దీని ముందుభాగమున నొక ప్రకాశమానమైన ఎర్రనిబొట్టు కలదని చెప్పితిమి (పటములో క. చూడుము). ఇది కంటిని బోలియుండుటచేత దీనికి కను చుక్కయని పేరు. ఇటీవలి శోధకులీ చుక్కమూలముననే యీ జంతువునకు వెలుతురును చీకటియు తెలిసికొనెడు జ్ఞానము కలుగుచున్నదని కనిపెట్టియున్నారు. జ్ఞానేంద్రియము యొక్క అంకుర మనదగియుండు ఇట్టి కనుచుక్కయొక్క నిర్మాణ విశేషముచేగూడ జీ జంతువు వికారిణికంటె హెచ్చుజాతిదిగ నెన్నదగియున్నది.

రక్తాక్షికి రేయింబగళ్ల వివరము తెలిసియుండుటచే నది పగటియందు సూర్యకాంతి సహాయముచే వృక్షమువలె ఆహా రము గొనుననియు చీకటివేళలయం దట్టిభోజనము సమకూడదు గాన జంతుభోజనము చేయుననియు నూహింపనగు.

రక్తాక్షివృక్షము; రక్తాక్షిజంతువు.

పై జెప్పబడిన యాహారవిధానములబట్టి రక్తాక్షిని వృక్ష శాస్త్రజ్ఞులు వృక్షములలో లెక్కింతురు. జంతుశాస్త్రజ్ఞులు దీనిని జంతువుగా గణింతురు. ఇది కేవలము వృక్షముగాక కేవలము జంతువుగాక మధ్యమజాతిలోనిదని చెప్పదగియున్నది. ఇట్టిజీవులింక ననేకములు గలవు. ఇవియన్నియు వృక్షములకును జంతువులకును మధ్యమావస్థలో నిలిచియుండి, వానికిగల సంబంధమును సూచించుచుండును.

సంతానవృద్ధి.

ఒకానొకప్పుడు రక్తాక్షి మృదురోమమును విసర్జించి, నిశ్చలనమునొంది, తనచుట్టును సెల్లులూసు గోడకట్టుకొని, కొంతకాలము విశ్రమించినపిదప ఆ గూటిని పగుల్చుకొని బయలు వెడలి చాక చక్యము నొందును. ఇట్టి విశ్రమస్థితియందురక్తాక్షి నిలువున రెండుగా చీలుటచే సంతానవృద్ధి గలుగుచున్నది (పటములో B. చూడుము). ఒకానొకప్పుడు తల్లిగూటినుండి పగిలి బయటబడకముందే ఒక్కొక చీలికయు రెండుగా చీలి నాలుగుపిల్లలు వచ్చును. ఇట్లె ఎనిమిదై నను గలుగుట గలదు.