జాజిమల్లి/పంచమ గుచ్ఛము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


(పంచమ గుచ్చము)

ఇంతేనా? నా సంగతి విన. నా
వంతైనా ప్రియురాలి మనసు కరగదు
పంతమో, చింతయో
కంతుడురటే నా ఎడద గాసిపెట్టి, దూసిపెట్టి
చింతాకులంత చిందర చేసినా
డింతేనా?

అతని కంఠం చాలా మధురంగా ఉంది. ఆ పాట ఏదో కొత్త రకం బెంగాలీ వరసలా వుంది. ఆ కొద్ది మాటలూ మూడు నిమిషాలు పాడాడు రాధాకృష్ణ.

ఆ యువకుడు ఆ పాట ఎంత లోగొంతుకతో పాడినా చుట్టుప్రక్కలవారికి కొంతమందికి వినిపించింది గాబోలు నెమ్మది నెమ్మదిగా పదిమంది ఆ ప్రాంతాలకు చేరినారు.

“ఆడే రాధాకృష్ణడా?”

“అదు! ఎన్న రొంబా నైసా యిరుకు అంద కంఠం!”

“రాధాకృష్ణ ఏమి బాగా పాడతాడయ్యా!"

“ఆ అమ్మాయి కొత్త సినిమా స్టారులా వుంది.”

“మాంచి చురుగ్గా, షోగ్గా ఉంది.”

ఈ మాటలు అస్పష్టంగా వున్నా, పద్మావతీ చెవిలో పడ్డాయి. ఆమె మోము కెంపువారింది. ఆమె గుండెలు కొట్టుకున్నాయి. ఆమెకు కోపమూ వచ్చింది. సంతోషమూ వచ్చింది. ఆమె నెమ్మదిగా లేచి, తలవంచుకొని, బీచి రోడ్డువైపుకు నడవడం ప్రారంభించింది. అది గమనించి నరసింహమూర్తి “వస్తున్నాను వుండు అమ్మాయి!” అని కేకవేసి రాధాకృష్ణవైపు తిరిగి, “మళ్ళీ కలుసుకుంటాను. నీ అడ్రస్సు మురుగప్ప వీధి, పదోనెంబరు ఇల్లుకాదూ, త్యాగరాయ నగరంలో! తప్పకుండా వస్తాను. ఎప్పుడు నీకు సావకాశం?” అని ప్రశ్నించాడు.

“నాకా మాష్టారూ! ఎల్లుండి షూటింగు లేమీ లేవు. రేపు సాయంకాలం అయిదు తర్వాత మా ఇంటికి రండి. ఉండండి! ఉండండి! మిమ్మల్ని ఆ అమ్మాయినీ నా కారుమీద దిగబెట్టనా?” అని రాధాకృష్ణ అడిగాడు.

“వద్దులే, ఆ అమ్మాయికి ఇష్టం ఉండదు.”

ఎంత చక్కగా వుంది అతని కంఠం! ఎంత తెచ్చిపెట్టుకుంటే వస్తుంది సంస్కారము? ఈ ప్రశ్నలు పద్మావతి హృదయంలో దారిపొడుగునా వున్నాయి. బస్సులో ఆమె నరసింహమూర్తి మేష్టారుగారితో మాట్లాడలేదు. ఏలాగో ఆంధ్రమహిళ కడ దిగింది. ఆమెను దించి నడిచి ట్రాం కడకు వెళ్ళి రాయపేట చేరుకున్నాడు నరసింహమూర్తి మేష్టారు. ఆ రాత్రంతా పద్మావతికి నిద్రరాలేదు. పక్కమీద ఇటూ అటూ దొర్లింది. లేచి ఎలక్ట్రిక్కు దీపం వెలిగిద్దామా అంటే తన గదిలోని ఇతర బాలికలు లేస్తారు.

నెమ్మదిగా పక్కమీదనుండి లేచి, పై డాబామీదకు వెళ్ళింది. సభాభవనాల మధ్య వున్న పూలతోటలో నుండి పూలవాసన పైకి ప్రసరించి వస్తున్నది. ఆకాశాన అక్కడక్కడ మబ్బులు ప్రయాణం చేస్తున్నాయి. చంద్రుడు అస్తమించడం చేత నక్షత్రాలు తళతళలాడుతూ ఆకాశం అంతా చిత్రమైన ముగ్గుల పట్టులలా నిండి వున్నాయి. .

ఆ తారకలను చూస్తూ వాటి విచిత్రరూపాలూ, చిత్రమైన కాంతులు గమనిస్తూ వున్న పద్మ ఈ తారలనే పేరు సినిమా స్త్రీల కెందుకు వచ్చింది అని ఆశ్చర్యం పొందింది. ఈలా వారు మినుకు మినుకుమంటారా? ఇంత ఎత్తున వుంటారా అందుబాటులో లేకుండా! చూపులకు చిన్నగా ఉన్నట్టు కనబడి నిజంగా బ్రహ్మాండాలంత వారా వారు! చల్లని రాత్రిలో మినుకుమనే ఈ చుక్కలు సూర్యునికన్న ఎక్కువ వేడిమికల మహా సూర్యగోళాలని టీచరుగారు చెప్పింది. అలానే సినిమాతారలు పైకి ఒక రూపూ, లోపల ఒక రూపూ కలవారనా తాత్పర్యం!

ఆమె చిరునవ్వు నవ్వుకుంది. ఎందుకు వచ్చిందో ఆ పోలికా ఆ పేరు. తాను సినిమా తార అయితే అద్భుతం అన్నాడేమి ఆ సంగీత దర్శకుడు. తనలో ఏమి వుంది? తనలో ఏదో ఆకర్షణ వుందిట! ఏమిటో ఆ ఆకర్షణ? తెల్లని బంగారం ఛాయతో మిలమిలలాడే బాలికలు ఎంతోమందో తనతో చదువుకుంటున్నారు. మదరాసులో ఆ బంగారు విగ్రహాలు జలజలలాడే చీరలు ధరించి చిత్రమైన ఫేషనుల బ్లౌజులు తొడిగి, కొందరు పంజాబీ కుడతాలు తొడిగి, విచిత్రమైన నగలు ధరించి ఎంత అందంగా వుంటారు. తాను వారి ముందు కోతిలా వుంటుందేమో!

ఆ అబ్బాయి ఎంత అందంగా పాడాడు.

ఆ రాత్రి ఆ చుక్కల వెలుగులో కలిసిపోయేటట్లు తానూ తన మధురమైన కంఠంతో ఆ పాటే పాడింది. తన కంఠం కృష్ణవేణి కంఠంలా వుంటుందా? భానుమతి గొంతు, వరలక్ష్మి గొంతులకు సరిపోల్చడానికి వీలుందా? ఆ సంగీత దర్శకుడు తన కంఠం వింటే ఏమంటాడో? ఏమంటాడు?

ఆ సంగీత దర్శకుడు రాధాకృష్ణకూ ఆ రాత్రి నిద్రపట్టలేదు. ఏదో 'సెక్సు' ఆకర్షణ వుంది ఆ బాలికలో! ఎంత జిగిగా వుంది ఆమె అంగసౌష్ఠవం! ఆమె నరసింహమూర్తి మేష్టారు శిష్యురాలా? అంటే సంగీతములో నిధి అన్నమాట. నిజంగా ఆ యువతి సినిమాలో చేరవలసిందే! ఏమి ఠీవిగా నడిచింది! బెస్తలా? అయితే దాశరాజు కూతురు యోజన గంధిలా వుంది. మత్స్యగంధి మాత్రం కాదు. ఏదో చక్కని సువాసనద్రవ్యం ఉపయోగించింది. ఆమె మూర్తి శిల్పంవలెనే వుంది. ఈనాడు తానో మొదటి రకం సినిమా తారను లోకానికి ఇస్తాడుగాక. పుల్లయ్యగారివంటి దర్శకులే కాదు సినిమా ప్రపంచానికి కొత్తతారను ఇచ్చేది! 'వాహిని' వారి వంటి సంస్థేకాదు పాతతారలను నూతన కాంతితో వికసింపచేసేది! ఒక సంగీత దర్శకుడు తెలుగు సుబ్బలక్ష్మిని ప్రపంచానికి ప్రత్యక్షం చేస్తాడు గాక. మరునాడు నరసింహమూర్తి రాధాకృష్ణ ఇంటికి వెళ్ళినాడు. 

2

రాధాకృష్ణ మేడ చిన్నదైనా చాలా అందంగా ఉంది. ఆ మేడ తాను కట్టించుకున్నానని రాధాకృష్ణ చెప్పినాడు. వంట యిల్లు, భోజనశాల ఆ రెండు ఇళ్ళనూ కలిపి వరండా ఉంది. వరండాకు ఈవలావల దొడ్డి, ఆ దొడ్డికి గోడలు ఉన్నాయి.

అసలు మేడకు దూరంగా తూర్పున ఇంకొక చిన్న మేడ కట్టించుకున్నాడు రాధాకృష్ణ. ఆ మేడకు పైన ఒక పడకగదీ, ప్రక్క గదీ - క్రింద అలాగే పడకగదీ, ప్రక్కగదీ ఉన్నాయి. పెద్దగది అతని సంగీతం గది. క్రింద గది అతని గాంధర్వమేళం గది. రెండు ఫిడేళ్ళు, రెండు వేణువులు, రెండు వీణలు, ఒక క్లారియెనెట్, ఒక పియానో, ఒక జలతరంగము, ఒక తబలా తరంగము, ఒక మృదంగము, ఒక తబలా, ఒక సారంగి, ఒక దిల్‌రుబా, ఒక మాండోలిన్, రెండు వీణలు, ఒక సితార్ - ఇవీ అతని మేళవాద్యాలు. ఆ వాద్యాలు వాయించేవారికి అతడేం జీతమిస్తాడు. ఆ మేళంకోసం తన జీతం కాకుండా ఇంకో వేయి రూపాయలు అతణ్ణి సంగీత దర్శకునిగా పెట్టుకున్న సినిమా కంపెనీవారు జీతం ఇచ్చుకోవలసి వస్తుంది. అతని పై గదిలో “హిజ్ మాష్టర్సు వాయిస్” కాబినెట్ గ్రామఫోను ఉంది. ఒక గోడ్రైజ్ ఇనప బీరువానిండా ఉత్తరాది దక్షిణాదివారల రికార్డులు ఉన్నాయి. ఇంకో బీరువా నిండా హిందీ, తెలుగు, తమిళ, బెంగాళీ, మరాటీ, గుజరాతీ రికార్డులున్నాయి.

మూడవ బీరువా నిండా ప్రసిద్ధికెక్కిన పాశ్చాత్య సంగీత మేళాల రికార్డులు, ప్రసిద్ది పాశ్చాత్య గాయకుల రికార్డులూ ఉన్నాయి. -

ఫ్రాన్సునుండి వచ్చిన "ఆర్గను” ఒకటి ఒక మూలను ఉంది, అతడు అన్ని వాద్యాలూ వాయించగలడు.

అన్ని గదులూ చక్కగా అలంకరించుకొన్నాడు. క్రింద ప్రక్కగది తనతో పని ఉండి వచ్చిన పెద్దమనుష్యులు కూర్చుండే గది. పైన ప్రక్కగది తన పడకగది.

ఇవన్నీ నరసింహమూర్తి మేష్టారుకు చూపించాడు.

“ఎంతవాడ వయ్యావోయ్! అంతా అంతా డబ్బే సినిమాలో” అన్నాడు నరసింహమూర్తి మేష్టారు.

“అవునండీ మీ అమ్మాయి పేరేమిటి!”

“పద్మావతి!”

“ఆ అమ్మాయి కంఠం చాలా బాగుంటుందనుకుంటాను.”

“బాగుండడమేమిటోయ్, కిన్నెరకంఠం? నువ్వు విని తీరాలి.”

“ఎప్పుడు తీసుకువస్తారు?”

“ఏదో సెలవురోజున; కాని, ఆ అమ్మాయి భర్త యీ ఊళ్ళోనే ఉన్నాడు. పెద్ద చేపల వర్తకుడు. అతని ఆజ్ఞ లేకుండా ఆ అమ్మాయిని ఎక్కడికీ కదిలించడానికి వీలులేదు.”

“ఏమిటీ? భర్త ఒకడున్నాడు, పైగా ఆ భర్త ఈ ఊళ్ళోనే ఉన్నాడూ? అతని ఆజ్ఞ కూడా కావాలీ! అయితే మీరు ఆ అమ్మాయిని బీచికి ఎట్లా తీసుకువెళ్ళారు!"

“అది ఆ భర్త ఆజ్ఞవల్లనే!" “సరేలెండి! ఆ భర్తనే అడగండి, అతన్ని కూడా వెంటబెట్టుకురండి. నాకు కావలసినవి మధురమైన కంఠాలు. కనక ప్రథమంగా ఆ బాలిక వాణి వినాలి. ఏమంటారు?”

“సరే సరే! ప్రయత్నిస్తాను.”

అక్కడ పద్మావతికి మరునాడు రాత్రి కూడా నిద్రపట్టలేదు. ఆ యువకుడు ఎంత అద్భుతంగా పాడాడు! ఎవరాయన? సంగీత దర్శకుడా? సినిమాలో పాడతాడా? అనుకున్నది. ఆ పాటంత అందంగా తానూ లోగొంతులో పాడుకున్నది. ఆ పాటవిన్న సహాధ్యాయినులైన కొందరు బాలికలు సుడిగాలులులా వచ్చి, ఆమె చుట్టూ చేరినారు. “ఆ పాట ఇంకోమాటు పాడు పద్మా!” అని కొందరు. “ఏది ఏదీ కాస్త కంఠమెత్తండి!” అని కొందరు ఆ బాలికను వేధించసాగినారు.

ఆంధ్రమహిళలలో ఆమె సంగీతమంటే బాలికలందరూ ప్రాణాలిస్తారు. రోజూ చదువులయ్యాక పడుకునే ముందర హాస్టలు భవనంపై మేడమీద ఉపాధ్యాయినులు, బాలికలు చేరి పద్మావతిని పాడమంటూ ప్రార్థిస్తూ ఉంటారు. ఆ బాలిక తన మధుర గాంధర్వం వెన్నెలలోనో, తారకల కాంతిలోనో మేళనం చేస్తూ వుంటుంది.

ఈ దినం ఆ బాలిక లెంతమంది బ్రతిమాలినా పద్మ మళ్ళీ పాడడానికి వప్పుకొనలేదు. ఏదో కంఠంలో మంట వచ్చిందంది. విసుగుచెంది ఒక్కొక్క బాలికా వెళ్ళిపోయింది. పద్మావతికి ఏదో బాధ వచ్చింది. తన భర్త అంతచక్కని గాయకుడు ఎందుకు కాలేకపోయాడు అనుకున్నది. ఇంతట్లో అతని మూర్తి తన మనస్సులో ప్రత్యక్షమైంది. ఎంత నాగరికతను అతడు దగ్గిరకు తీసుకున్నా, అది అతనిపైన కప్పిన పట్టు పచ్చడంలా ఉంది కాని, అతడు ఫేషన్‌తో కలకలలాడిపోయాడు. అతని కంఠం ఉరుములా వుంటుంది. అతని దేహం నల్లరాతితో చెక్కిన విగ్రహంలా వుంటుంది. అతడు బుష్‌కోట్లు ధరించినా, పట్టులాల్చీలు తొడుక్కున్నా అతడూ అతని దుస్తులూ ఏ మాత్రమూ శ్రుతి కలియలేదు.

ఈ సంగీత దర్శకుడు ఎంత అద్భుతంగా పాడాడు! తమ తోటలోని పూలన్నీ ఒక్కసారి పరిమళాలు వెదజల్లినట్లయినదికదా! అది మనుష్యుని కంఠం కాదు. దేవతల కంఠం.

ఆమె మంచంమీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ సమయంలో అందరు బాలికలూ నిద్రపోయేదీ, చదువు కొనేది గమనించడానికి వరండాలో తిరుగుతున్న వసతి గృహాధికారిణి, కిటికీలో నుండి చూచి, పద్మావతి ఏదో బాధపడుతున్నట్లు గ్రహించింది. తలుపుతీసి ఉండటంచేత, ఆమె చల్లగా పద్మావతి గదిలోకి వచ్చి, ఆ బాలిక ప్రక్కనే మంచంమీద కూచుని, పద్మమీద చేయివైచి, “పద్మా! ఏమిటిది? ఈ పాటికి నిద్రపోతుంటావు అనుకున్నాను. వంట్లో బాగా లేదా?” అని ప్రశ్నించింది. ఆ అధికారిణి పేరు శ్రీమతి కరుణామయి. హాస్టలులోని బాలికలందరూ ఆమె బిడ్డలు. తన తీయని కంఠంతో మెల్లగా మాట్లాడుతూ, బాలికల మనస్సులు గ్రహించి వారిని కంటికి రెప్పల్లా కాపాడుకుంటూ ఉంటుంది. శ్రీమతి గారంటే బాలికలందరూ ప్రాణాలర్పిస్తారు. ఆమెతో తమ సంతోషాలూ, ఆశయాలూ, కష్టాలూ చెప్పుకుంటారు. ఎవరికైనా ఏ కాస్త జ్వరము వచ్చినా ఆవిడ వారి ప్రక్కను వుండాలని గోలపెడ్తారు.

శ్రీమతి అంత తీయగా తన్ను ప్రశ్నించగానే ఆమెకు మరీ దుఃఖం ఎక్కువైంది. గబుక్కున పద్మ తలను శ్రీమతి ఒళ్ళోపెట్టి వెక్కి వెక్కి ఏడ్చింది. ఎందుకా బాల అలా ఏడుస్తున్నదో శ్రీమతి కేమి తెలుస్తుంది. కాని పద్మకు నరాల జబ్బు వచ్చి ఆరోగ్యం చాలా చెడిపోవడంచేత భర్త ఆమెను ఆంధ్రమహిళా సభ విద్యాలయంలో చేర్పించారు. ఆ జబ్బు ఇంకా పోలేదు అని అనుకుంది. చదువూ వస్తుంది, ఆమె ఆరోగ్యమూ పూర్తిగా కోలుకుంటుంది అని కదా ఆమెను తమ విద్యాలయంలో చేర్పించి హాస్టల్లో ప్రవేశపెట్టించి నాడాయన. కాని నరాల జబ్బు తగ్గినా ఎన్నాళ్ళకోగాని పూర్తిగా వదలదు. అందుకని పద్మ ఏడుస్తున్నదనుకుని శ్రీమతి నెమ్మదిగా ఆ బాలికను అనునయించ ప్రారంభించింది.

“ఏమి పద్మా! యీ స్వాతంత్ర్య మహాయుగ ప్రారంభంలో భారతీయాంగనలు తమ మహోత్తమ కర్తవ్యం నిర్వర్తించడానికి సిద్ధంగా ఉండవద్దూ?”

పద్మావతి మౌనం.

“మనం ధైర్యం వహించి, బాధ్యతలు గుర్తించి, నిజమైన శాంతి దేవతలమై, మగవారికే దారి చూపించవలసి వున్నదిగదా!”

పద్మావతి తల వూపింది.

“అనేకమంది బాలికలు ఎంత చదువుకున్నా జ్ఞాన విదగ్ద మూర్ఖత్వం వదలలేక వారి దగ్గర వీరిమీదా, వీరిదగ్గర వారిమీదా నేరాలు చెపుతూ, తగాదాలు పెంచుకుంటారు. ముప్ఫై ముళ్ళు ఇముడుతాయి. మూడు కొప్పులు ఇమడవు అన్న సామెత మూడువందల రెట్లు నిజం చేస్తున్నారు. అందుకు కారణం తమ సహజమైన స్త్రీత్వం దగ్ధం చేసుకొని మగవారి సుగుణాలు అలవాటు చేసుకొనలేక మగరాయళ్ళలా సంచరిస్తూ వుంటారు.”

“మగవారు మాత్రం ఉత్తమంగా సంచరిస్తున్నారా పిన్నిగారూ?”

“ఆనాటికీ ఈనాటికీ మగవాళ్ళలో మార్పు ఏమీ రాలేదు తల్లీ. పని వేడి తగ్గగానే వారికి భామ వేడి కావాలి. ఉత్తమమైన ఉద్యమంలో చటుక్కున చేరుతారు. తీవ్రంగా పట్టుదలతో పనిచేస్తారు. జయమో అపజయమో తేలగానే చప్పబడిపోతారు!”

“గాలిపోయిన రబ్బరు బుడగలా!”

“అదీ! సరసమైన పోలిక తెచ్చావు. విజయమే సంభవిస్తే వాళ్ళ ఆత్మబలిభావం ఎగిరిపోయి, స్వలాభాపేక్షా, స్వకులపరాయణత్వమూ స్వీయయశోకామత్వమూ ఉద్భవిస్తాయి. ముఫ్ఫైమంది, మూడువందల ముఠాలవుతారు. దేశాన్ని గంగలో దింపుతారు.”

“మన ఆంధ్రదేశ వ్యవహారాలన్నీ అల్లానే వున్నాయి కాదండీ అక్కా. ”

“నిజం చెప్పావు. ఇంక మనమూ అలానే సిద్ధం అయితే?”

“ఆడవాళ్ళు దేవతల బిడ్డలాండి! వారికి అధికారం చేతికివస్తే మీ రన్నట్లు గర్వాలు ఆకాశం అంటుతాయేమో! అప్ప చెల్లెళ్ళకన్న ఎక్కువగా స్నేహంగా వున్న స్త్రీలు ఒకరికొకరు భరించలేనంత విరోధం వహిస్తారు.” “అందులోనూ నిజం వుంది. అయినా ఆడవాళ్ళు కూడా ఎక్కువగా జాతీయ జీవనంలో పాలుపంచుకోవాలి.”

ఆ విధంగా పద్మావతిని ఊరడింపచేసి శ్రీమతి వెళ్ళిపోయింది.

పద్మావతికి ఏదో వర్ణనాతీతమైన శాంతి కలిగి దిండుపైన తల వాల్చింది. ఆ మరునిమిషంలో నిద్రాదేవి ఆమెను తల ఒడిలోకి గాఢంగా ఒరిగించుకొన్నది.

3

సంగీత దర్శకుడు రాధాకృష్ణ స్వయంగా తన గురువుగారైన నరసింహమూర్తి మేష్టారిని వెంకట్రావుగారింటికి చేర్చాడు. వారు ఇంటికి వెళ్ళేటప్పటికి బుచ్చి వెంకట్రావు హాలులో ఎలక్ట్రిక్ దీపం వెలుతురున పేపరు చదువుకొంటున్నాడు.

“మేష్టారూ రావడం ఆలస్యం చేశారే! పద్మ కులాసాగా వుందికదా?” అని బుచ్చి వెంకట్రావు నరసింహమూర్తి మేష్టారును పలకరిస్తూ, అతనితో వచ్చిన రాధాకృష్ణ వైపు తేరిపార చూచాడు. ఆ చూపులో "ఎవరయ్యా యీ అతి పట్నంవాసం వాడు!” అన్న ప్రశ్న స్పష్టంగా మూర్తించింది.

“ఏమీలేదు. ఈయన రాధాకృష్ణ! చాలా పేరు పొందిన సంగీత దర్శకుడు. నాతోపాటు మా గురువుగారి దగ్గర సంగీతం నేర్చుకొన్న వెంకటరత్నం శిష్యుడు. నా దగ్గిరా కొంతకాలం శిష్యరికం చేశాడు. ఈతనిది బాపట్లలే! చటుక్కున సముద్రం ఒడ్డున కలుసుకున్నాం” అని నరసింహమూర్తి మేష్టారు తొందరగా జవాబు చెప్పినాడు.

“అలాగా. చాలా సంతోషం!” అంటూ లేచి బుచ్చి వెంకట్రావు రాధాకృష్ణ చేతిని స్పృశించి కరచాలనం చేశాడు.

రాధాకృష్ణ చేయి నెప్పెట్టింది. ఆరి ఉద్దండపిడుగా, చేయి కాస్తయితే ముక్కలయి వుండును. ఎంత బండగా ఉన్నాడు! అందుకనే ఆ నీలికలువ పూవులాంటి ఆ అందమైన బాలిక అంత బాధపడుతున్నట్లు కనబడింది. అని అనుకున్నాడు రాధాకృష్ణ.

బుచ్చి: కూర్చోండి రాధాకృష్ణగారూ! మిమ్ములను కలుసుకోవడం చాలా ఆనందంగా వుంది. మా ఆవిడ చాలా గొప్ప సంగీత పాఠకురాలు అంటారు మా నరసింహమూర్తి మేషారు. మీరు వినాలి. మీ అభిప్రాయం చెప్పాలి.

నర: అదేనయ్యా వస్తూ అనుకున్నాము. రాధాకృష్ణ సంగీతం నువ్వు వినితీరాలి. ఏమయ్యో

రాధాకృష్ణా! మా బుచ్చి వెంకట్రావుకు సంగీతం అంటే ప్రాణం.

రాధా: అవును! ఆయన్ని చూడగానే గ్రహించవచ్చును. ఆయన కళాహృదయం ఈ హాలు చూడగానే గ్రహించవచ్చును.

నర: ఈ రోజుల్లో డబ్బున్న ఒక్క పెద్దమనిషి ఒక్క కళాపూర్ణమైన బొమ్మనుకొని తన ఇల్లు అలంకరించుకొన్న పాపాన పోతున్నాడటండీ?

రాధా: ఈ రోజులలో లలితకళలు నేర్చుకోవడం ముష్టి ఎత్తుకోడానికే! జమీందారులు వారింక శతాబ్దాల నుంచి వచ్చిన సంస్కృతి ప్రీతిచేత కళావేత్తలను పోషిస్తూ వచ్చారు. ఇప్పుడేముందీ? జమీందారీలు లాగేశారు. స్వతంత్ర సంస్థానాలు ఎగిరి పోయాయి. ఎక్కడినుంచి వస్తారింక అపరభోజులూ, కృష్ణదేవరాయలూను!

బుచ్చి: జమీలూ అవీ పోవలసిందే అనుకోండి. కాని లక్షలు ధనం ఆర్జించే ధనస్వాములకు ఏం పొయ్యేకాలం వచ్చింది చెప్పండి?

నర: ఈ దేశంలో ప్రభుత్వం కులతత్వ ప్రభుత్వం! తక్కిన దేశోద్ధారక ప్రణాళికలన్నీ కులతత్వ రాక్షసి కడుపులో ప్రాణాయస్వాహా అయిపోతున్నాయి.

రాధా: ధనస్వాములకు కళలెందుకండీ. సంగీతం పాడే బాలిక మీద ఎక్కువ మోజు. అందుకనే సినిమాలు. సినీమాలు అని కంపెనీ పెడుతూ ఉంటారు. అలా పెట్టడం మా బోటివారికి లాభమే అనుకోండి. లేకపోతే ఎంతమందో చిత్రకారులూ, గాయకులూ మాడిపోవలసిందే కదా!

బుచ్చి: నేను ఇంతవరకూ కొంచెం కళావేత్తలు అనుకున్నవారి సలహాతో ఒక డజను మంచిబొమ్మలు కొన్నాను రాధాకృష్ణగారూ! రండి చూద్దురుగాని.

రాధా: మొత్తం ఏమాత్రం అయివుంటుందండీ!

బుచ్చి: పదిహేనువందలు ఖర్చయ్యాయి. కాని అంత విద్య సంపాదించుకొని, అలా అందంగా బొమ్మలువేస్తే నూరు నూటయాభై వారిని ఏం పోషిస్తాయి చెప్పండి?

రాధా: చూడండి, మా సినిమావారు లక్షలు సంపాదిస్తారు. ఒక్కబొమ్మ కొన్న డైరెక్టరుగాని, తారగాని, తారకుడు గాని ఉన్నారా? ఒక్క రామబ్రహ్మంగారు తప్పబుట్టాడు మహానుభావుడు.

నర: ఏమనుకుంటే ఏం లాభం? ప్రభుత్వం ప్రజారాజ్యం అంటారు. ప్రజలకు కళ కావాలికదా. ఆ కళను ప్రదర్శనశాలలుగా ఏర్పాటు చెయ్యాలి ప్రభుత్వం. ఈ ప్రజా ప్రభుత్వాలకు మాటలు జాస్తీ, చేతలు నాస్తి.

బుచ్చి: ఎప్పుడండీ మీ సంగీతం మేము వినడం?

రాధా: నా కారు పంపిస్తాను.

నర: మా కారుమీదే వస్తాములే! నీకు ఎప్పుడు వీలో, అప్పుడే వస్తాము. మా అమ్మాయినీ తీసుకువస్తాము.

రాధా: రేపు రాత్రి ఎనిమిది గంటలకు రండి. మా ఇంట్లోనే మీ భోజనాలు. మళ్ళీ కాదనకండి. మాకు కులం తేడాలు లేవండోయ్ బుచ్చి వెంకట్రావుగారూ.

బుచ్చి: నాకు ఆ విషయంలో ఎవరినీ, ఏమీ ఇబ్బంది పరచకూడదని నియమం.

రాధా: మా ఆవిడ ఒక నాయరమ్మాయి. సంగీతానికీ, నాట్యానికీ నాకు శిష్యురాలయింది. ఆ తర్వాత భార్య అయింది. కాని మన బ్రాహ్మణులకన్నా ఆచారాలే. మాంసం చూడలేదు, చేపవాసనే గిట్టదు. కోడిగుడ్డు కూడా పడదు.

బుచ్చి: మాకూ ఈ మాష్టారు పుణ్యమా అని చప్పటి భోజనమే అలవాటయింది.

రాధా: కాబట్టి తప్పకుండా రేపు రావాలి. మీ ఫోను నెంబరివ్వండి. ఫోనులో జ్ఞాపకంచేస్తాను. సెలవు. నమస్కారం మేష్టారూ.

రాధాకృష్ణ సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. 

4

రాధాకృష్ణ ఇంటిలో బుచ్చి వెంకట్రావూ, పద్మావతీ, నరసింహమూర్తి, రాధాకృష్ణ భార్య సుశీల చేరారు. నాయరు వంటలో పండితుడు, మధురమైన మలబారు శాకాహార భోజనమూ, పిండివంటలు వడ్డించగా భోజనాలు పూర్తి చేసి, తాంబూలాలు వేసుకుంటూ లోని హాలులో కూచున్నారు. రేడియో చక్కని సంగీతం పాడుతున్నది.

పద్మా: ఇప్పుడు వచ్చే సంగీతం అంతా వట్టి కాఫీ హోటలు సంగీతం మేష్టారూ!

నర : అవునమ్మా అవును. ఎవరికి కావాలి ఉత్తమమైన కర్ణాట బాణి?

రాధా : ఉత్తమమైన ఉత్తరాది బాణి కూడా ఉత్తరాది వారికే అక్కరలేక పోతోంది.

సుశీ : నాకు మాత్రం ఈనాటి సంగీతం చాలా అందంగా ఉంటుంది.

బుచ్చి: కొన్ని కొన్ని ఉత్తరాది సినిమా పాటలు సురయా పాడినవీ, కన్నన్‌బాల పాడినవీ లతామంగేష్కర్, షేంషెడ్‌బీగం పాడినవీ చాలా ఇష్టం నాకు. అలానే సైగల్, పంకజమల్లిక్, వసంతదేశాయీలు నాకు ఇష్టం.

అక్కడనుంచి అందరూ రాధాకృష్ణ గాంధర్వ మందిరానికి పోయారు. అక్కడ రాధాకృష్ణ మేళం వారు అంతా సిద్ధంగా వున్నారు.

రాధాకృష్ణ తన భార్యనూ, ముగ్గురు అతిథులనూ అక్కడున్న సోఫాలపై కూచోపెట్టి, తానువెళ్ళి తన మేళ వాయిద్యాల వారి మధ్య తన దర్శకాసనంపై అధివసించాడు.

అక్కడనుంచి అతడు గంభీరమైన తన కంఠమెత్తి నాలుగు పాటలు పాడాడు. ఆ తర్వాత సుశీల వెళ్ళి రాధాకృష్ణ ప్రక్కన కూచుని రెండు మలయాళపు పాటలూ ఒక తెలుగుపాటా పాడింది. ఆ

నరసింహమూర్తి మేష్టారు ఆనందంతో చప్పట్లు కొట్టి “చాలా ఆనందంగా ఉందయ్యా, ఇంక మా అమ్మాయి పద్మావతి పాట వినాలి నువ్వు. అమ్మా! ఏదీ ఒక్క పాట వినిపించూ. రాధాకృష్ణా! ఒక్క పిడేలూ, మృదంగమూ మాత్రమే మేళం. నా ఫిడేలు తెచ్చుకున్నాలే! దానితో నేనే వాయిస్తాను” అన్నాడు.

“పాడు పద్మా! భయమేమిటి? అంతా మనవాళ్ళే!” అని బుచ్చి వెంకట్రావు భార్యను కోరాడు.

పద్మావతి శ్రుతి చూచుకుని తన గురువు అందివ్వగా నెమ్మదిగా రాగం ప్రారంభించింది. రెండు మూడుసార్లు భయంచేత శ్రుతి తప్పింది. కాని వెంటనే అందుకుంది. నెమ్మది నెమ్మదిగా తనకు ఇష్టమైన ఆ తోడిరాగం సాగించింది. ఆ రాగంలో తన వర్ణంలోనికి ప్రసరించింది. ఆ వెంటనే త్యాగరాజకృతి అందుకుంది. ఆ కృతికి సరిపడిన స్వరకల్పనా వికాసంతో ఆ పాట పూర్తి చేసింది. అంతా పదిహేను నిమిషాలు పట్టింది.

ఆ పాట పాడినంతసేపూ అందరూ మంత్రముగ్ధులై విన్నారు. రాధాకృష్ణకు ఆ పాట వింటూ ఉంటే తాను ఒకనాడు సందర్శించిన ఉదకమండలం ప్రకృతి దృశ్యం ప్రత్యక్షం అయింది. ఒత్తుగా వివిధములైన ఆకుపచ్చని రంగుల చెట్లు నిండివున్న కొండచరియలు చిన్న చిన్న సెలయేళ్ళు, చెరువులు, లేళ్ళగుంపులు, పూవులు, నెమళ్ళు, పక్షులు, మేఘాలు ఒక మహాశ్రుతిలో స్వరాలై దర్శన మిచ్చినట్లు అతనికి తోచింది. ఆ కంఠం అంత అమృతమయమని అతడు కలలోనైనా అనుకోలేదు. ఆ బాలికా, ఆమె గానమూ, చంద్రమూర్తీ, చంద్రికా అయి అతనికి ఎదుట లోచనగోచరమైనట్లయినది.

ఆమె వెంటనే రాగమాలికతో “కస్తూరి తిలకం” అన్న శ్లోకం పాడింది. శ్రీకృష్ణభగవానుడు నీలమేఘ శ్యామల కాంతిపూర్ణుడై, కోటి సౌందర్య - రాజిత హాసాంచిత వదనుడై, సదస్యులందరికీ గాంధర్వరూపంలో ప్రత్యక్షమైనట్లనిపించింది. క్షేత్రయ్య పదం ఆ వెంటనే ఎత్తుకొన్నది.

నరసింహమూర్తి ఆనందం వర్ణనాతీతం, అతడా ఆనందంతో అచేతనుడౌతూ తన ఫిడేలును వాయించడం మానుతూ ఉండేవాడు.

మేళంవారు ఆ పరమసౌందర్య గాంధర్వం వింటూ శిల్పాలే అయిపోయినారు. ఏమి భాణి! ఇది మానవమాత్రుల భాణియా అని బుచ్చి వెంకట్రావు, ఆమెను తప్ప సర్వమూ మరచిపోయాడు. సుశీలాదేవి కన్నురెప్ప వేయని అనిమిషత్వంతో పద్మావతిని చూస్తూ ఆమె గాంధర్వంలో మేళవించి పోయింది. ఇవన్నీ ఒక గంట పట్టాయి.

పద్మావతి పాట చాలించి అక్కడే తన తల వంచుకొని కన్నుల నీరు కారిపోగా వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది. అది గమనించగానే సుశీలాదేవి ఒకగంతున ఆ బాలిక కడకు పరుగిడి ఆమెను పొదివి పట్టుకొని, లేవదీసి తన గదిలోనికి తీసుకుపోయింది. అక్కడ ఆమెను ఒక సోఫాపై కూర్చుండబెట్టి తానామె ప్రక్కన కూర్చుండి, “అంత సిగ్గయితే ఎలా అమ్మా!” అని తెలుగులోనే మాట్లాడుతూ, నీ సంగీతందా నేను వర్ణించ శక్తి చాలదే. జన్మకోసారి కూడా ఇందమాదిరి పరమసౌందర్య స్వరూపమైన సంగీతం దొరుకునో ఏమో!” అని అన్నది.

ఇంతట్లో నాయరును పిలిపించి “కోకోచేసి, వెంటనే తీసుకురమ్మని.” ఆజ్ఞ ఇచ్చి, ఈలోగా తాను మలబారు నుంచి తెచ్చిన మంచి ఔషధం రెండు మాత్రలు మింగించి, మంచినీళ్ళు త్రాగిపించింది.

సుశీల పద్మావతిని గదిలోకి తీసుకువెడుతూ ఉంటేనే పద్మావతి తేరుకుంది. మందు బాగా పనిచేసింది. కోకో పద్మావతిని పూర్తిగా మామూలు మనిషిని చేసింది.

సుశీలాదేవి పద్మావతిని తన స్నానాల గదిలోకి తీసుకుపోయి, మొగం కడుక్కోమని, తుడుచుకొనే తువాలు ఇచ్చింది. ఆమెకు తలసర్ది, పౌడరు అవీ వ్రాసి, బొట్టుంచి, తన పూలబుట్టలోంచి జాజిమల్లియ దండను తీసి ఆమె తలలో అమరించింది.

పద్మావతి జాజిమల్లియ దండను చూచింది. ఆమె మనస్సు తేటబారింది. ఆ దండతో తన తలను అలంకరించిన సుశీలను పద్మావతి సిగ్గుతో పలకరిస్తూ ఇంగ్లీషులో “వదినా! ఈనాటినుంచి మనమిద్దరం ప్రాణ స్నేహితులం సుమా!” అంది.

★ ★ ★