జాజిమల్లి/చతుర్థ గుచ్ఛము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


(చతుర్థ గుచ్చము)

ఏమీ తెలియనివాళ్ళ జీవితమే ఆనందమయము. సముద్రంలో ఏరు కలిసేచోట, బెస్తలపల్లెలో ఏటిలో పోటూ పాటులూ, సముద్రం కెరటాలూ, ఆటలాడుకునే యిసుక వొడ్డుల్లోనే, తాను బుచ్చి వెంకులుగా వున్న నాటి జీవితమే ఏ దిగులూ లేకుండా, ఏ పొగులూ తగలకుండా జరిగిపోయింది. వేసవిలో సాయంకాలం సముద్రదూరాలనుంచి వచ్చే చల్లగాలిలా హాయిగా వుండేది. చేవపారిన కొబ్బరిమానుల్ని ఏటిలో ఈ దరినో ఆ దరినో, నిట్రాళ్ళుగా పాతి, పోటులో వలలుగట్టి, పాటులో చేపలను పోగుచేసుకొనే ఆనందం, బంగారు నాణాలను ప్రోగుచేసుకొనేటప్పుడేనా దొరకదు కదా! ఈ ఆలోచనలు బుచ్చి వెంకట్రావు హృదయంలో మేఘాలై కమ్ముకు వచ్చాయి. పద్దాలు ఎంత ఒడుపుగా చేపలను పట్టుకొనేది. ఔను తను గడగాలం వేసి, కాచుకుని వుంటే, గంటలు గంటలు ఇంత చిన్న చేపైనా తన గేలం ముల్లుకు తగిలేదా ఏమన్నానా? ఇంతట్లో పద్దాలు పరుగు పరుగున వచ్చి “బావా! ఎన్ని చేప లట్టినావు? ఏంది! ఒక్క సేపయినా గాలానికి తగల్లేదేం? సూసుకో నే మంత్రంబెట్టి ఎన్ని సేపల్లాగేస్తానో! హామ్. మాంకాళీ హూం మాంకాళీ ఓ యీ శెడుసేపా పడవే” అంటూ గేలంగెడ చేత్తో పుచ్చుకొని తన అందమైన చేతులతో యిటూ అటూ కదిపేటప్పటికి జర్రని గేలం తాడు బిగువెక్కేది. “ఓ చేప పడింది. తాడుకి కట్టిన బెండు ములిగిపోయింది. “తే! యిలాతే! నువ్వు లాగవే”వని తాననేవాడు: “ఓ లాగేయి, అబ్బో దిట్టమైన చేపే! నన్నే లాగేస్తున్నది” అన్నాడు. ఇద్దరూ పట్టి నెమ్మదిగా వెనక్కి నడుస్తూ ఒక సరివిచెట్టు వూతపట్టుకుని ఒక మూరన్నర "పంజరం” చేపని యివతలకు లాగారు! ఎంత తెలివితో పద్దాలు ఆ చేపను ఒడిసిపట్టుకొందీ! తామిద్దరూ కలిసి ఎన్నిమార్లు చందువా చేపలూ, సొరలూ, సముద్రపు పెద్దరొయ్యలూ, పండుగొప్పులూ, సావిడాయిలూ, నెత్తళ్ళూ అతినేర్పుతో పట్టుకొని ఆనందపడలేదు! -

ఆ తీయతీయని దినాలు వెళ్ళిపోయాయి. తమ జీవితంలోంచి చేపల వాసన పోయింది. కొత్తగా వచ్చిన శాండల్ వుడ్ సబ్బు వాసనా, పేరీస్ సెంటుల పరిమళాలూ శ్రుతులు కలియక, తెచ్చుకోలు మాయై, ఎరువులు సొమ్ములైనట్లు కదా!

ప్రపంచ జ్ఞానంవల్ల ఇదివరకు ఎరగని విషయాలు, జీవితంలో క్రొత్తగా ప్రవేశిస్తాయి. ఈ చెన్నపట్నం బ్రతుకు ఎప్పుడూ ఆగని గందరగోళంతో, తగ్గని వేగంతో, అంతులేని కాంక్షలతో నిండి వుంది. కోరి అంతు తెలియరాని దుఃఖాలు తెచ్చిపెట్టుకున్నాడు తాను.

అతని ఆరోగ్యం చింది, జలజల కండల పొంకాలు విరిగి ఉంది. అతని బలం సముద్రం కెరటాలులా ఉప్పొంగుతూ ఉంటుంది. అతని స్త్రీవాంఛ ఉత్తమ మానవనైజ ధర్మపూర్ణము. ఎన్నడూ అది అతిగా ఉండలేదు. ఉత్తమంగా ఆరోగ్యవంతమై ఉండేది. నేడాతని సహధర్మచారిణి తన్ను ఒంటిగా వదిలి వెళ్ళిపోయింది. తన బ్రతుకు చుక్కాని పోయిన నావలా అయింది. ఈ వాగుల్లో, వేగమైన ప్రవాహాల లాగుడులో, తన నావ మునిగిపోవునో, ముక్క లవునో! అతడు తన మనసులోని బాధను చంపుకోడానికై తన కులస్థులు నివసించే చేరీలలోనికి వెళ్ళేవాడు. ఎంత దుర్భరమైన జీవితం జీవిస్తున్నారు. వాళ్ళు గట్టిగా కాళ్ళు చాపుకుంటే మనిషి పట్టనంత చిన్న స్థలాల్లో కట్టుకొన్న గుడిసెలలో కాపురాలు - పరిసరాలు ఎన్నో కల్మషాలు కూడుకున్న ప్రదేశాలు. ఇంత పెద్ద చెన్న పట్టణంలో జీవిస్తూ ఒక్కరైనా సినిమాకు వెళ్ళి చూడగలుగుతారా? ఆఖరికి చీనాబజారులో, రోడ్డు ప్రక్కన పెట్టుకొని అమ్మే వస్తువుల్లో ఒక్క అణా సరుకైనా కొనుక్కొని ఆనందించగలరా! ఒకనాడైనా వారు కాఫీ హోటలెరుగుదురా! సంగీతం కచ్చేరులంటే ఏమిటో వారికి తెలుసా? ఎందరి జీవితాలలో నాట్యాలు నిండిపోయి ఉన్నాయి! కాని ఒక్క నాట్య ప్రదర్శనానికై యీ చుట్టాలు, యీ ప్రజలు, యీ బెస్తలు, యీ చేపలు పట్టుకునేవాళ్ళు వెళ్ళగలరా? సముద్రపు ఒడ్డున చిన్న పీతలులా బ్రతుకులే ఏనాటికీ వాళ్ళకి రాసివున్నాయా అనుకున్నాడు.

ఎక్కడ చూచినా వలలు - చేపలు వుంచుకునే బుట్టలు! గేలాలు! కుళ్ళిపోయిన చేపల వాసన!!

ఏనాటికైనా యీ చేరీలు, తీర్చిన వీధులలో, తోటల మధ్య ఉన్న సొగసైన యిళ్ళతో, శుభ్రమైన బట్టలు కట్టుకొని ఆడుకొనే పిల్లలతో పొందికగా అలంకరించుకొని కళ్ళల్లో కాంతులు వెలుగుతూవుండగా ఆరోగ్య దేవతలులా నడిచిపోయే స్త్రీలతో కలకలలాడి పోగలవా! తెచ్చిన చేపలు ఉంచేందుకు, వాటిని బుట్టలు కట్టేందుకు, తర్వాత ఎగుమతి చేయడానికి వేరే ఒకటి ఫ్యాక్టరీలాంటి కర్మాగారం వుండవచ్చు గాక! అలాంటి సంస్థను శుభ్రంగా, శాస్త్రయుక్తంగా వుంచవలసి వుంటుంది. కర్మాగారానికీ, ఆ కర్మకూ జనకులైన బెస్తల జీవితానికి ఇతర సంబంధమేమీ వుండకూడదు. వస్త్రాల ఫ్యాక్టరీలో పనిచేసేవారి యిళ్ళలో దూది పడివుంటుందా?

అతడు గాలివానంత నిట్టూర్పు విడిచాడు.

2

ఆంధ్ర మహిళాసభ విద్యార్థిను లందరు కలిసి వారి ఉపాధ్యాయినుల ఒద్దికలో ప్రత్యేకం బస్సు ఒకటి కాంట్రాక్టు తీసుకొని, మహాబలిపురం వెళ్ళారు. బాలికలందరూ కలకలలాడుతూ ఆ ప్రదేశమంతా నిండిపోయారు. బొమ్మలు చూస్తున్నారు కొందరు. ఒక్కొక్క శిలతోటే నిర్మాణం చేసిన చిన్న ఆలయాలైన శిలా రథాలకడకు పరుగిడిపోయారు కొందరు. కొందరు సముద్రతీరం దగ్గర వున్న దేవాలయానికి పరుగెత్తారు. భీముని పొయ్యి చూశారు. అర్జునుని తపస్సు ఆశ్చర్యం పొందుతూ గమనించారు. వేణుగోపాలుని వెన్నముద్ద చూశారు.

వాళ్ళకి శిల్పరహస్యాలు అర్థమయ్యాయి అని కాదు. పల్లవ శిల్ప విశిష్టత తెలిసిందనికాదు! శిల్ప సౌందర్యమే వారిని హత్తుకొన్నది. ఆ ప్రదేశముయొక్క మంత్రశక్తి వారందరిని ఆవహించింది. ఏ యుగాలనాటి అనుభూతులో, ఏ మహాశిల్పుల దివ్యస్వప్నాలో ఆ ప్రదేశం నిండా నిండి, ఆ క్షేత్రానికి వచ్చిపోయే యాత్రికుల హృదయాలను స్పృశిస్తాయి. పద్మావతి దేశాలు తిరిగింది. కంచిలో కామాక్షీ, ఏకామ్రేశ్వరుడూ, వరదరాజూ; తంజావూరులో బృహదీశ్వరుడూ, పెరియనాయకీ, చిదంబరంలో నటరాజూ, శివకామసుందరీ; శ్రీరంగంలో రంగనాయకుడూ, లక్ష్మిదేవి; మధురలో మీనాక్షి, సుందరేశ్వరుడూ; రామేశ్వరంలో రామలింగస్వామి, పర్వతవర్ధనీ ప్రత్యక్షమయ్యారు. ఆ పవిత్ర క్షేత్రాలలో భక్తుల ఆనందం ఆమె హృదయానికి పులకరింపులు కలుగజేసింది.

ఇంక ఈ శిల్పక్షేత్రాలేమిటి? పూజలుపోయినా శిల్ప సౌందర్యం ఉంటే. ఆ విగ్రహాలు మనుష్యులకు కళానందం కలిగిస్తాయని మహిళా సభలో కొందరు కళా విద్యార్థినులు అంటూ వుంటారు. దేశం అంతా ఇట్లాంటి క్షేత్రాలెన్నో ఉన్నాయట. ఎల్లోరా, అజంతా, నాగార్జునకొండ, హంపీ, లేపాక్షి, అనుమకొండ, ఒరంగల్లు, సాంచీ మొదలయిన క్షేత్రాలెన్నో ఉన్నాయట. ప్రసిద్ధికెక్కిన దేవతల గుళ్ళల్లో కూడా ఎన్నో ఉత్కృష్టమైన శిల్పాలు ఉన్నాయట. శిల్ప క్షేత్రాలలో ఈ మహాబలిపురం ఒకటి అన్నారు. ఈ విగ్రహాలన్నీ అదో అందం కలిగి ఉన్నట్టు ఆమెకు తోచింది. శిల్పం అన్నా, చిత్రలేఖనం అన్నా తన ఉద్దేశాలు ఇదివరకు వేరు. దేశం అంతా గాంధీ విగ్రహాలు వెలిశాయి. అవే శిల్పాలనుకొంది. మదరాసులో కొందరి తోటల్లో, సిమెంటు చేసిన సింహం, కుస్తీపట్టేవాడు, బంట్రోతు మొదలైన విగ్రహాలే నిజమైన శిల్పం అనుకొన్నది పద్మావతి. చిత్రలేఖనాలు అంటే బజారులో దొరికే అచ్చుబొమ్మలనే ఆమె ఉద్దేశం.

దారిలో తిరుక్కలికుండ్రంలో ఆగి ఆ పక్షి తీర్థం చూశారు వారంతా. తామంతా సర్దాగా కొండ ఎక్కారు. దారిలో అల్లర్లు చేశారు. ఆడుకున్నారు. పాడుకొన్నారు. కొండమీదికి వెళ్ళిన వెనక పూజారి పక్షులను పిలవడం అవి రావడం; ప్రసాదం ఆరగించడం, మళ్ళీ దేని దిశకు అవి వెళ్ళిపోవడం ఆ దృశ్యాలు పద్మావతి కెంతో ఆనందం కలిగించాయి. ఒక పక్షి కాశీ నుండి వస్తుందట - ఇంకొక పక్షి రామేశ్వరాన్నుంచి వస్తుందట.

ఆ పక్షులు మొదట ఏ అనంత నీలాల్లో నుండో ప్రత్యక్షమయ్యాయి. ఆకాశంలో గాలిపడగల్లా తేలుకొని వచ్చాయి. తన మనస్సు తిరిగిపోయినట్లే ఆ రెండు పక్షులు వాలుతూ గిరగిరా తిరిగినవి. తేలుకొని డేలుకొని వచ్చి పక్షులు పూజారికడ వాలినవి.

కొందరు ఉపాధ్యాయినులు ఇదంతా హుళక్కిఅన్నారు - "ఆ పక్షులు ఆ చుట్టు ప్రక్కలనే కొండలలో ఉంటాయి. సరిగ్గా, భోజనం వేళకు అవి వచ్చి వాల్తాయి!” అంది సైన్సు ఉపాధ్యాయిని.

“అయితే ఈ చుట్టుప్రక్కల వున్న అన్ని గరుడ పక్షులూ ఎందుకు రాకూడదండీ!” అని పద్మావతి ప్రశ్నించింది.

“వాటికి భయం!”

“వీటికెందుకు లేకపోయింది?”

“వీటిని పెంచి ఈలా అలవాటు చేసి ఉంటారు!”

“ఈ పక్షులు ఎంత పూర్వకాలంనాటివో?”

“ఒక జత ముసలివైపోగానే ఇంకో జతను తయారుచేస్తారు.” ఈ సంభాషణ అంతా వింటూవున్న ఇంకో ఉపాధ్యాయిని వీరిద్దరి దగ్గరకూ వచ్చి కూచుంటూ, “ఒక మహా భావాన్ని ఎంత ముక్కలు చేశావమ్మా మాలతీ?” అని అన్నది.

“ముక్కలు చేయడమేమిటి ఇందిరగారూ? భావం ముక్కలు అవడమేమిటి?”

“అవును, భావం ముక్కలవడమేమిటి? భావం రబ్బరు ముక్కలు కాదులే! గాజు సామాను ముక్కలౌతుంది. ఎంత శాస్త్రజ్ఞురాలివి. కలలు విచ్ఛిన్నం కావూ? ఆశయాలు భగ్నం కావూ? ఆశలు ముక్కలు కావూ? ఆ విధంగానే భావాలు ముక్కలవుతాయి.”

మాలతి: నువ్వు కవయిత్రివి. కథలు రాస్తావు. మధురమైన కంఠంతో పాటలు పాడుతావు. వీణతీగలు మీటి మంత్రాలు పన్నీరు జల్లుతావు.

పద్మావతి: మాటలతో కవిత్వం ప్రదర్శిస్తున్నారే టీచరుగారు!

ఇందిర : అలాంటిది ఆ అమ్మాయి భావం ముక్కలవడమంటుందేమిటి పద్మా!

పద్మా: ఏం భావం ముక్కలయింది ఇందిరక్కగారూ!

ఇందిర: ఈ విచిత్ర సన్నివేశము అనేక శతాబ్దాలనుండీ జరుగుతూ ఉన్నదని, చరిత్రలు చెప్పుతూన్నవి. ఈ పూజారి పూర్వీకులు ఈ పూజారివలెనే పక్షులను పిలిచారు. పక్షుల పూర్వీకులు యీ పక్షులవలెనే సరిగా వేళకు యింత అందంగానూ వచ్చి తమ కర్పించిన ప్రసాదము ఆరగించి, రివ్వున నీలాల లోతులోనికి ఎగిరిపోయి తెల్లని మేఘాలలో కలిసిపోతున్నాయి.

మాలతి: ఎంత తియ్యగా చెప్పుతున్నావు అక్కా! కోతులను తయారుచేసి మన యింటికి వచ్చి ఆటలాడించే చెంచు, జంగాల ముసలమ్మల కన్న ఈ పూజారులు ఎక్కువేమిటి.

ఇందిర: ఇక్కడ ఈ దృశ్యంలో వుండే భావము చాలా ఉత్తమమైనది కదా! కోతులాట ఒక బిచ్చకత్తె అడుక్కునేందుకు వుపయోగించేందుకు మాత్రమే.

మాలతి: ఆ కోతిని హనుమంతుడని ఆడించుతుందిగా! అదీ గొప్ప భావమే.

ఇందిర: ఎంత చక్కగా పోల్చావు! ఈ కొండ శిఖరాలమీద పచ్చని వృక్షాలు నిండిన యీ చరియలలో మేఘాలు మన కడకు వచ్చి మేలమాడే పవిత్ర ప్రదేశాలలో ఒక దివ్యలోకము ప్రత్యక్షమౌతుంది. ఆ లోకంలో శ్రుతి కలిసిపోయి, మహావిచిత్ర సన్నివేశము మానవజీవితాలను మహోన్నతపథాలకు కొనిపోతుంది. హిమాలయాలలో నిత్యజన్మయై దిగివచ్చి భారతదేశంలో నిత్యప్రవాహయై నిత్యసముద్రసంగమయైన గంగానదీ భావం భారతీయ జీవితానికి ఎట్లు నిత్యనూతనోత్తేజము చేకూరుస్తుందో, అలాగే యీ తిరుక్కళికుండ్ర సన్నివేశమున్నూ!

పద్మా: ఇందిరక్కయ్యగారు చెప్పిన మాటలు నాకేవో పులకరాలు కలుగజేస్తున్నవి. నేను గ్రహించుకోలేని ఆలోచనలు జాజిమల్లి సువాసనలుగా నన్ను అలుముకుపోతున్నవి.

3

నరసింహమూర్తి మేష్టారు నానాటికి చిక్కులెక్కువ పడిపోతున్న బుచ్చి వెంకట్రావు పద్మావతుల జీవిత సూత్రాలు గమనిస్తూ గాఢ విషాదంలో పడిపోయాడు. వాళ్ళ బ్రతుకులే ఒక సంగీతమైతే అపశ్రుతుల్లా అపస్వరాలులా, తప్పుడు తాళాలు ఏవేవో వచ్చి పడినవి. అతి వేగమైన ఒక ప్రవాహంలోపడి తాను కొట్టుకొచ్చాడు. తగిన శిష్యురాలై తనకు పేరు ప్రతిష్ఠ తెచ్చిపెట్టుతుంది అనుకున్న పద్మావతి తన దగ్గరకు రావడమే మానేసింది. పోనీ, సంగీతాభ్యాసం కోసం ఎవరైనా ఒక పెద్ద సంగీత విద్వాంసుడి దగ్గరకు వెళ్ళుతున్నదా అంటే, ఆ వెళ్ళడమూ మానుకుంది. ఆడవాళ్ళ మనోభావాలెవరికర్దమౌతాయి? అసలే సంగీతం మానివేస్తుందేమో, అని లోలోన అతడు భయపడినాడు.

తాను వట్టి వంట బ్రాహ్మణుడై పోయినాడు. వీరిరువురి కోసమూ తాను పాడుకునే సంగీతమూ కూడా అభ్యాసము చేసుకోవడము లేదు. సంగీతము భగవతార్చన అని అనుకున్న తాను చేపల వాసన కొట్టే ఒక బెస్తల దాంపత్యం, తన్నంత ఇంద్రజాలంలో ముంచివేయడం ఒక విచిత్రమే. ఆమె తనకు ఒక కూతురుకన్న యెక్కువైనది. ఉత్తమ విద్య విషయంలో కులం తేడాలు వుండనే వుండవు. అసలు కులం తేడాలేమిటి? ఏ విధంగానూ గోడలు కట్టని మూడు ముఖ్యమైన కులాలు వేదకాలంలో వుండేవంటారు. వారిలో ఒకరికొకరికి సంబంధ బాంధవ్యాలు, భోజన ప్రతి భోజనాలు ఉండేవి కాదా! రాను రాను జనసమృద్ధి ఎక్కువై, భావసంఘర్షణలు వృద్ధియై అనేక కులాలు ఉద్భవించాయి! ఏమిటి తనకీ ఆలోచనలు! ఏది ఎట్లాయైనా వీరిద్దరు తన బిడ్డలు! వీళ్ళు వృద్దిలోనికి రావడం అతను కన్నులారా చూశాడు. ఆ వృద్ధిలో తాను పాలుపంచుకొన్నాడు. వాళ్ళిద్దరినీ తల్లిలా పెంచాడు. చూస్తూ చూస్తూ ఉండగా ఏదో పెనుభూతం వాళ్ళ జీవితాన్ని ఆవహిస్తున్నట్లు అతనికి భయం ముంచుకువచ్చింది.

ఏమిటీ పెనుభూతం? ఎవరిలోటు? అంత ప్రేమించుకున్నారే! ఒకరినొకరు విడవకుండా ఉండేవారే! విడిచి బ్రతుకలేక పోయేవారే! ఒకరికోసం ఒకరు రూపాలు దాల్చినట్లుగా, ఈడుజోడై తన కన్నుల యెదుట తిరుగుతూ ఉండే వారే! ఏమిటి ఈనాటి ఈ పరిస్థితి! నరసింహమూర్తి మేష్టారు దినదినమూ ఆంధ్ర మహిళా సభకు వచ్చి పద్మావతిని చూచిపోతూ ఉండేవాడు. సాయంకాలము కాగానే పిల్లలందరు సభలో ఉన్న తోటలో ఆడుకొంటూ ఉండేవారు. కొందరు కేరంబోర్డ్సు ఆడేవారు. ఊయల ఊగేవారు కొందరు. బల్ల బంతి ఆట ఆడేవారు కొందరూ. బల్ల ఊపు ఆట ఆడేవారు మరి కొందరు. ఇలా కలకల ఆటల్లో పొంగి బాలికల మధ్య ఎక్కడో పద్మావతి ఒక్కతే కూచుని ఆలోచించుకుంటూ ఉండేది!

ఆమె కేమీ ఆలోచనలు తెగేవికావు. ఇంతట్లో నరసింహమూర్తి మేష్టారుగారు వచ్చారనగానే ఆమెకు కొంత ఊరట కలిగేది. వెంటనే అధికారి అక్కగారిని సెలవు వేడి, ఆ బాలిక నరసింహమూర్తితో సముద్రం ఒడ్డుకు వాహ్యాళికి బయలుదేరింది. పన్నెండో నెంబరు బస్సు ఎక్కి ట్రిప్లికేనులో దిగి, సముద్రం ఒడ్డుకు పోయేవారు వారిద్దరూ!

ఓనాడు వారు అక్కడ కూచుండగా నరసింహమూర్తి సతీర్థుని శిష్యుడైన ఒక యువకుడు వీరిద్దరూ కూచున్న కడకు వచ్చాడు. ఆ యువకుడు నరసింహమూర్తికి కొన్నాళ్ళు శిష్యరికం చేసినాడు.

యువకుడు. “నమస్కారం నరసింహమూర్తి మేష్టారూ! మద్రాసు ఎప్పుడు వచ్చారు? ఇక్కడ పనేమిటి? ఎంతకాలం ఉంటారిక్కడ?” అని ప్రశ్నల వర్షం కురిపించాడు. నరసింహమూర్తి ఒక్క నిమిషం అతణ్ణి ఆనవాలు పట్టలేక పోయినాడు. “ఓహో! నువ్వటోయ్ రాధాకృష్ణా! నీ వేషం చూచి నిన్నానవాలు పట్టలేకపోయినాను సుమా! ఏం చేస్తున్నా విక్కడ? ఎన్నాళ్ళనుండి ఉన్నావు?” అని ఆనందంతో లేచి, అతన్ని కొంచెం దూరంగా తీసుకువెళ్ళి ఆ ఇసుకలో అతన్ని కూచోబెట్టి తానూ కూచున్నాడు. వారి మాటలు పద్మావతికి వినబడుతున్నాయి.

ఆ యువకుడు రాగానే పద్మావతి అతన్ని కొంచెం ఆశ్చర్యంగానే చూచింది. పట్టుపయిజామా, పట్టులాల్చీ. చేతికి కొంచెం ఖరీదుగల రిస్టువాచీ, మెళ్ళో సన్నని బంగారపు గొలుసూ ఆ గొలుసును వేలాడుతూ ఏదో ఓ చిన్న పతకమూ! కళ్ళకు ఫ్రేములేని అద్దాలజోడు! కాళ్ళకు జరీ పూవులు కుట్టిన మొఖమల్ చడావులున్నాయ్! ఈ యువకుడు చాలా గమ్మత్తుగా ఉన్నాడు. గిరజాలులా జుట్టు చిత్రంగా సముద్రపుగాలికి ఎగురుతూ ఉంది. అతడూ నరసింహమూర్తి మేష్టారు మాట్లాడే మాటలు వింటూ, ఆ యువకుని గమనిస్తూ ఆమె కూచుని ఉన్నది.

“నేను ఇక్కడ ఓ సినిమా కంపెనీలో సంగీత దర్శకునిగా ఉన్నాను. భరతనాట్యం కూడా బాగా నేర్చుకున్నాను. గొంతు చాలా తియ్యగా సైగల్ కంఠంలా వుండడంచేత కథానాయకునికి నా కంఠం ఇస్తూ వుంటాను.'

“ఆశ్చర్యమే! ఎంత సంపాదిస్తున్నావు?”

“ఏదోలెండి. నెలకు రెండు మూడువేలు! సంగీత దర్శకునిగా ఒక్కొక్క చిత్రానికి పదివేలు చొప్పున ఇస్తారు. కంఠం ఇచ్చినందుకు పాటకు వేయి రూపాయలు. డాన్సు డైరెక్టరుగా ఉంటే అయిదారువేలు. ఒక్కొక్కసారి రెండు మూడు కంపెనీలలో పనిచేస్తూ వుంటాను.”

“ఏమిటీ! బాగానే ఉందోయ్ నీ పని. నాకూ సినిమాలలో పని యిప్పించ కూడదటయ్యా ?”

“దానికేముందండి మేష్టారు! అదిగో అందమైన చిన్న కారు చూశారా! బేబీఫియట్టంటారు దాన్ని. అది నా స్వంత కారు. మా కుటుంబానికి ఒక హిల్‌మాన్‌మిన్క్సు” కొన్నాను. దానికి డ్రైవరున్నాడు."

“చాలా బాగా ఉంది. ఫస్టుక్లాసు! ప్రజ్ఞ అంటే నీదీ ప్రజ్ఞ!”

“మా ఇంటికోసారి రండి మేష్టారు!"

“తప్పకుండానోయ్”

“అచ్చా! అయితే అడగవచ్చునో అడగకూడదో! మరి, ఆ అమ్మాయి ఎవరు? మీ బ్రహ్మచర్యానికి స్వస్తి చెప్పారేమిటి? ఎవరా సినిమాతార! సినిమాలో చేర్పించడానికి తీసుకువచ్చారా? అయితే మనం చాలా సహాయం చేయగలం.”

“ఛా! ఛా! ఆ అమ్మాయి నా బిడ్డవంటిది. వంటి దేమిటి, నా పెంపుడు బిడ్డే! నా దగ్గిర సంగీతం నేర్చుకుంటూంది. మా వూరే. కావలి. వాళ్ళు బెస్తలులే! అయినా భాగ్యవంతులు. ఆవిడ భర్త ఈ ఊళ్ళోనే పెద్ద వ్యాపారం చేస్తున్నారులే!" “అలాగా! క్షమించాలి మీరు. కాని కాస్త నలుపైనా ఏమి అందంగా ఉందండీ ఆ అమ్మాయి! పేరు మోసిన మా సినిమా తారలు చాలామందికన్న నయం. సంగీతం బాగుంటుందా అండీ మేష్టారు!

“బాగుండడమేమిటోయ్! తిలోత్తమ కంఠమే. తారలందరికన్నా చాలా బాగా పాడుతుంది.”

“నాకోమాటు వినిపించేటట్లు చేయరూ”

“చూద్దాములే!”

“ఆ అమ్మాయిలో ఏదో అద్భుతమైన ఆకర్షణ ఉంది మేష్టారు! ఆ అమ్మాయి భర్త ఒప్పుకుంటే ఆవిణ్ణి మొదటి రకం తారగా తయారు చేయగలను. ఈ మధ్య మన కంఠం మీరు వినలేదు. మొన్ననే రికార్డు ఇచ్చిన ఈ పాట వినండి!”


★ ★ ★