జాజిమల్లి/తృతీయ గుచ్ఛము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


(తృతీయగుచ్చము)

ఏమిటీ సంగీతం. ఎందుకూ ఈ సంగీతం అని పద్మావతి అనుకొన్నది. ఎవరైనా మధురంగా పాట ఒకటి పాడుతుంటే విన్న వారికి మైమరపు కలగాలి! ఏ రాగాలాపనలోనో, కంఠంలో ఏ గమకము వికసింపజేయటంలోనో, ప్రాణాలు కరిగిపోయి దొనదొన ఆనందరూపమై బాష్పాలు ప్రవహించి వస్తాయి అనుకుంటూ ఆమె రాగం ప్రస్తారము చేస్తూనే వుంది. ఆమె తన కంఠం పూర్ణంగా వికసితంచేసి మూడు స్థాయిలలో పాడుకుంటూ తన గాన సౌందర్యానికి తానే మైమరచిపోయేది. ఆమెకు లోకమంతా సంగీతమయమా అని ప్రశ్న ఉదయించేది. చప్పుడు చేయవు అని అనుకొనే కదలికలలో కూడా ఏవో అస్పష్టరాగాలు ధ్వనిస్తూనే ఉంటవి. నిట్టూర్పులో పున్నాగవరాళి ఉన్నదా? సాయంకాలపు మలయమారుతంలో మలయమారుతమే వున్నది.

సంగీతంతో సాహచర్యంవల్ల, గాంధర్వ పీఠాన్ని ఆర్జించడంవల్ల పద్మావతికి పగటికలలు ఎక్కువ కాసాగాయి. వాస్తవిక ప్రపంచముకన్న భావనాలోకం ఆమెకు ఎక్కువ నిజం కాసాగినది. వాస్తవిక ప్రపంచంలో అన్నీ అపశ్రుతులే. ఒక అపశ్రుతిని శ్రుతిగా దిద్దుకొనేటప్పటికి ఇంకొక కొత్త అపశ్రుతి దాపరిస్తుంది. జీవితం నిత్య శోభనమయం చేసుకోవాలంటే నిత్య జాగరూకత అవసరంకదా?

పద్మావతికి పెళ్ళినాటి భర్త వేరు. ఈనాటి భర్త వేరు. ఆనాడు తాను పద్దాలు. తన భర్త బుచ్చి వెంకులు. ఇద్దరూ కలిసి తిరుపతి కొండ మెట్లు ఎక్కుతూవుంటే ఆమెకు తాను ఒక పర్వతం ముందర ఎక్కినట్లయిపోయింది. తన భర్తను ఇంకా చేపల వాసన పొదివి కొన్నట్లే వున్నది.

నిద్రపోతూ గురక కొడతాడు. అతనికి లలితంగా ప్రణయ వాక్యాలు పలకటం చేతకాదు. లాలించలేదు. అనునయించలేడు.

నిజమే! డబ్బు గడిస్తూన్నాడు. ఏ సిల్కు ఆర్జుపాలెస్‌లోనో, ఏ భాలుసామి అయ్యర్ షాపులోనో చక్కని బెంగుళూరు చీరలు, బెనారస్ పట్టుచీరలు, ఖద్దరు సిల్కు అద్దకం చీరలు, వెంకటగిరి ఒరయారు, కోయంబత్తూరు, పుల్లపాడు నూలు నేత చీరలు బుచ్చి వెంకట్రావు కొనుక్కువచ్చి భార్యకు బహుమతులు ఇస్తూ వుండేవాడు. సెకండుహ్యాండ్ హిల్‌మన్‌మింక్స్ కారు కొన్నాడు. భార్యను సినిమాలకు తీసుకొని వెళ్ళేవాడు. బీచికి వాహ్యాళికి తీసుకువెళ్ళి భార్యతో పాటు సముద్రపు వొడ్డున కూర్చునేవాడు.

ఆమెలో అసంతృప్తి, తొలకరివర్షం చినుకులు భూదేవి హృదయంలోకి ప్రసరించి వచ్చినట్లు ప్రవేశించింది. ఈ జీవితంలో తనకేమి లోటున్నది? భర్త తనకున్న కోరికలనన్నిటిని నెరవేరుస్తున్నాడాయెను. బాగా సంపాదిస్తున్నాడు. బాగా ఖర్చు చేస్తున్నాడు. తన జీవితం యేదో ఓ వున్నత పథాలకు యెక్కి వెళ్ళేందుకు అతడు మెట్లు నిర్మిస్తున్నాడు, కాని డాక్టరు మూలం కనుక్కోలేని రోగికి కారణం తెలియలేని చిన్న రోగంలా, ఆమె జీవితంలో అసంతృప్తి ప్రవేశించింది. మృగశిరా కార్తి రాగానే ఆకాశంలో చిన్న చిన్న కారుమేఘాలు మూలమూలలగా ప్రయాణించి వచ్చినట్లు ఆమె హృదయం మారుమూలలా అసంతృప్తి చొచ్చుకు వచ్చింది.

ఆమెలోని స్త్రీత్వము నూతనపరిణామం పొందుతున్నది. ఆమె చదివిన చదువులలో జీవితానికి నూతనార్థాలు పొడసూపినవి. రాత్రిళ్ళు తన ప్రక్క నిద్దరపోయే భర్త ఆమెకు ఎవరో క్రొత్తవానిలా గోచరింప ప్రారంభించినాడు. ఇన్నాళ్ళు ఇరువురి జీవితాలు ఒకటిగానే ప్రవహించి వచ్చినవి. ఆమెకు అతడు జీవిత సర్వస్వము. ఒకనాడు తన జీవితానికి పరమేశ్వరుడై తన ప్రపంచానికి చక్రవర్తియై తన ఆలోచనలు, హృదయము, ఆశయాలు, నిండియున్న తన ప్రాణసర్వస్వము, అణువు అణువున నిబిడించియున్న యీ పురుషుడు, ఈ రోజులలో ఎందుకు తనకు క్రొత్తవాడవుతున్నాడో?

2

ఒకనాడు పద్మావతీ బుచ్చి వెంకట్రావూ ఎన్నూరు వైపుకు కారుమీదపోయి వస్తున్నారు. అతనికి ఎన్నూరులో ఏవో కొన్ని చేపల విషయం కనుక్కోవలసి వచ్చింది. ఈనాడు ఆ ఎండిపోయిన ఉప్పుచేపల వాసన పద్మావతి భరించలేకపోయింది. ఆమెకు తల తిరిగి వాంతి వెళ్ళిపోయింది.

బుచ్చి వెంకట్రావు కంగారుపడిపోయి మంచినీళ్ళు ముఖం మీద చల్లి యెత్తుకు తీసుకొని వచ్చి కారులో పడుకోపెట్టి, ఇంటికి తీసుకొని వచ్చినాడు. డాక్టరు వచ్చి మందు ఇచ్చినాడు. కొంచెం సేపటికి ఆమెకు బలము వచ్చి మామూలు మనిషి అయినది.

తన జీవితం ముందుకు సాగివచ్చిన వేగంతో తన భర్త జీవితం ముందుకు సాగిరాలేదు. అతని రూపమే కర్కశమై ఆమెకు కనుపించినది. అతని చుట్టూ ప్రసరించియున్న గంధమే నేడామెకు భరింపరాని దవుచున్నది. అతని మాటలలో అపశ్రుతులూ, అపస్వరాలు స్వచ్చజలాలతో ప్రవహించివచ్చే శైవాలినీలో రాళ్ళు దొర్లుకు వస్తున్నట్లనుకొని, పద్మ భరింపలేనని భావించింది.

ఆమె అతనితో ఏకశయ్యాగతురాలు కాలేకపోయినది. ఆ భావమే ఆమెకు నానాటికి దుర్భరమైపోయింది. ఏదేని వంకతో ఆమె తనకు వేరే పడక ఏర్పాటు చేసికొన్నది.

“అదికాదు బావా! వంట్లో అంత బాగుండడంలేదు.”

“ఏమిటి జబ్బు! డాక్టరుగారు చెప్పినమందు పుచ్చుకోవు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూవుంటావు. నవ్వులతో ఎప్పుడూ కలకలలాడే నీ ముఖము వానలు కురవని పొలంలా బిగుసుకుపోయి ఉంటున్నది. నిజంగానే వంట్లో బాగుండటము లేదా? నీకు చీరలు కావాలా, నగలు కావాలా? పద్మా నీవు ఏదో మారిపోతున్నావు”

“నా వంట్లో బాగుండటములేదు బావా, తిండి తిన్నగా సహించటములేదు. వళ్ళు అంతా నొప్పులుగా ఉంటున్నది. రాత్రిళ్ళు నిద్రపట్టదు.”

“రా వెంటనే డాక్టరుగారి దగ్గరకు వెళుదాము. ఇలాంటివి అశ్రద్ధ చేస్తే కొంపలు ముంచుకువస్తాయి. అప్పుడు ఏమి అనుకున్నా ఏం లాభంలేదు.”

“నా వంట్లో కొంచెము నలతేతప్ప డాక్టరుని చూడవలసినంత అవసరములేదు. నువ్వు వట్టి కంగారు మనిషివి.” ఏమైనా బుచ్చి వెంకట్రావు హృదయంలో ఏదో భయం ప్రవేశించింది. ఎప్పుడూ నిర్మలమైన హృదయంతో చంటిబిడ్డలా ఆడుకొనే తన పద్మావతి ఏమిటి ఇలా అయిపోతున్నది? నిజంగా దాని వంట్లో పెద్ద జబ్బు ప్రవేశించిందేమో! ఏలాగా? డాక్టరు దగ్గిరకురాదు; కనుక దిట్టమైన డాక్టరును ఒకరిని ఇంటికే తీసుకొని వచ్చి పద్దాలుని పరీక్ష చేయించడం మంచిది.

ఆ మర్నాడు ఉదయం డాక్టరు లక్ష్మి అనే ప్రసిద్ధి వహించిన వైద్యురాలిని బుచ్చి వెంకట్రావు తీసుకొని వచ్చినాడు. ఆమె పద్మావతిని పూర్తిగా పరీక్ష చేసినది. జ్వరం రావటం లేదాయెను. ఒళ్ళు నొప్పులు మామూలేగాని, ఎచ్చటా ఎక్కువగా నొప్పిగాని పోటుగానీ లేదాయెను. మొదట డాక్టరు లక్ష్మి బుచ్చి వెంకట్రావు మాటలు విని ఆమె గర్భవతేమోనని అనుకున్నది. అదీలేదు. ఇంక ఏమిటి?

పద్మావతికి వంట్లో ఏ విధమైన జబ్బూ లేదని నరములు నీరసించి యుండవచ్చునని మానసికమైన వ్యధ ఏదో ఆమెకు తెలియకుండానే ఉద్భవించి యుండవచ్చునని డాక్టరు లక్ష్మి బుచ్చి వెంకట్రావును వేరే తీసుకొని వెళ్ళి చెప్పినది. అతణ్ణి ఆమెను సర్వదా సంతోషము కలిగేటట్లు చూడమని ఆమె నొక్కి చెప్పినది.

పద్మావతిని చూచి డాక్టరు లక్ష్మి, “పద్మావతమ్మ గారూ, శరీర సంబంధమైన జబ్బు ఏదీలేదు. కాని కొంచెం నరాలు నీరసించాయి. సరదాగా ఉంటూ ఉండండి. ప్రస్తుతం సంగీతం నేర్చుకోవడం ఆపి, నాలుగురోజులపాటు కాలక్షేపం చేయండి. రెండు మందుల పేర్లు మీ ఆయనకు వ్రాసి ఇచ్చాను. అవి పుచ్చుకునే విధానమూ వ్రాసి యిచ్చాను. ఒక్కొక్కటి రెండేసిబుడ్లు చాలు. మీవంటి సంగీత పాఠకులు ఎంతో ఆనందముగా గడపవచ్చునుకదా! సాయంత్రమపుడు మా ఇంటికి రండి. కొంత సేపు రోజూ కులాసాగా కాలక్షేపం చేయవచ్చును.” అని సలహా ఇచ్చింది.

పద్మావతి మందులు పుచ్చుకుంటున్నది. కాని ఆవిడ జబ్బేమీ నెమ్మదించినట్లు లేదు. రాత్రిళ్ళు నిద్రలేక కూర్చోవడం సాగించింది. ఒక్కొక్కప్పుడు ఊరికే ఎక్కి ఎక్కి ఏడవడం, కొంచెం పని సరిగా జరగలేదనుకున్నా విపరీతమైన కోపం రావడం, చేతిలో ఏముంటే ఆ వస్తువుని నేలకేసి గట్టిగా బద్దలకొట్టడం, చీరలు, రవికెలు చింపుకోవడం. గబ గబా తల బాదుకోవడం ఆవహించాయి.

బుచ్చి వెంకట్రావు భయపడి దయ్యము పట్టుకుందేమోనని అనుమానపడి, కావలి తనవాళ్ళకు టెలిగ్రాము ఇచ్చాడు. అత్తగారు, మామగారు, తన తల్లిదండ్రులు, ఇంకా ఇద్దరు ముగ్గురు చుట్టాలు చెన్నపట్నం చక్కావచ్చారు.

చింతాద్రి పేట నుంచి దయ్యాల మంత్రగాడిని తీసుకువచ్చారు. పద్మావతికి మరీ మతిపోయింది.

“ఏమిటండీ మీ గొడవంతానూ! మీకన్నా మతిలేదు. నాకన్నా మతిలేదు. నాకు దయ్యం పట్టడమేమిటి? ఎందుకు బాధపడుతున్నానో నాకు తెలియదు. మనసంతా పాడైపోయింది. ఇలా దయ్యాలనీ, దేవతలనీ, కుళ్ళుచేపలలో పొర్లాడే మనవాళ్ళ పిచ్చి భావాలన్నీ ఇంకా మిమ్ములను పట్టుకుని వేళ్ళాడుతూనే వున్నాయి. ఇవన్నీ ఇంతటితో ఆపుచేయండి. లేకపోతే నేను నిజంగా ఏ సముద్రంలోనో పడిపోతాను” అని పద్మావతి భర్తతో కేకలువేస్తూ ఒకరకంగా ఏడుస్తూ చెప్పింది.

ఆంధ్ర మహిళా సభ కార్యదర్శిని పద్మావతికి “నాలుగు రోజుల పాటు మహిళా సభలోనే మకాము పెట్టండి పద్మావతిగారూ! పిల్లలతో, ఈ మాష్టర్లతో కాస్త కాలక్షేపం జరిగి మీ మనస్సు నెమ్మదిస్తుంది” అని సలహా యిచ్చింది. ఆ సలహా బుచ్చి వెంకట్రావుకు నచ్చింది, వాళ్ళ చుట్టాలందరు బాగుందన్నారు. పద్మావతి వచ్చి మహిళాసభ హాస్టలులో చేరింది. ఇదివరకల్లా విద్యార్థినిగా వుండనే వుంది.

3

ఆంధ్ర మహిళాసభలో చేరిన దగ్గరనుండి పద్మావతి నెమ్మది నెమ్మదిగా శాంతించి ఆమె హృదయంలో ఏమూలనో దాగుకొనివున్న భయాలు మంచువలె మాయంకాసాగాయి. ఆ భయాలకు కారణమైన పరిస్థితులు ఆంధ్ర మహిళాసభలో లేవుకదా?

తాను తన భర్తతో ఏకశయ్యాగతురాలు కానక్కరలేదు. హాయిగా ఏ విధముగా పురుషుని సంపర్కములేని ఒక నిశ్చలత్వము ఆమెకు ఆంధ్ర మహిళా సభలో దొరికినది. తోడుగా చదువుకునే బాలికలుగాని ఇతరులుగాని అతి తెలివితేటలుగా మాట్లాడుతారని కాదు; ఆధ్యాత్మిక చింతన చేసినవారు అక్కడ వున్నారనే కాదు; ఇన్నాళ్ళనుంచీ ఏ చిత్తవృత్తి తనలో వృద్ధిపొంది తనకు శాంతము దూరము చేసిందో ఆ చిత్తవృత్తికి కారణాలైన పరిసరాలనుంచి ఆమె విడివడి రావడమే పద్మావతికి శాంతం చేకూర్చింది.

సాయంత్రం వాళ్ళందరు సభకు ముందున్న తోటలో చేరి కథలు చెప్పుకుంటూ వుంటే తాను “ఊ” కొట్టేది, తనకు తెలిసిన కథలు చెప్పేది. వాళ్ళతో ఉయ్యాలలూగేది. కారమ్సుబోర్డులో పందేలు వేసేది. డాక్టరు లక్ష్మి బుచ్చి వెంకట్రావుతోను పద్మావతితో కూడా వాళ్ళిద్దరూ కొన్నాళ్ళపాటు విడిగా వుండటమే మంచిదని సలహా ఇచ్చింది.

బుచ్చి వెంకట్రావు ధనవంతుడు. ధనం తేనెవంటిది. తేనె ఈగలను ఆకర్షిస్తుంది. ధనం ఒక రకమైక ఈగజాతి మనుష్యులని ఆకర్షిస్తుంది. వెంకట్రావుకు స్నేహితులకు కొదవేమిటి? మనుష్యులలో ధనము సంపాదించేవాళ్ళు మూడు జాతులుగా తయారవుతారు. ధనం ఇంకా కావాలనుకునేవారు. వాళ్ళు ధనం పోగుచేయడంలో ఆనందం. ధనం పెంచడంలో పరమార్థం ధనం పెరగడమే. రెండో రకం వాళ్ళు తాము సంపాదించిన ధనం, తాము సంతృప్తిగా అనుభవించాలని కోరుకుంటారు. మూడోరకంవారు తాము సంపాదిస్తూన్నట్లు లోకానికి తెలియాలి. తమ ఐశ్వర్యము చూచి లోకం దిగ్రమ చెంది అసూయపడిపోవాలి. అది వారి కానందం.

బుచ్చి వెంకట్రావు యీ మూడు రకాలుగా కూడా ఆనందపడేవాడు. భార్య చక్కని నగలతో, అందమైన చీరలతో దేవలోకంనుంచి తిలోత్తమలా దిగివచ్చినట్లు కనబడుతూ తనతోపాటు సినిమాలకు రావడం, బీచికి రావడం ఎంతో ఆనందంగా వుండేది. ఏ మాత్రమూ బొద్దుకాకుండా చిన్ననాటి అంగసౌష్ఠవమూ పరిపూర్ణత పొందిన శరీర సౌందర్యము కలిగి, లావణ్యమును అమృతధునీ సంగమమొంది, పద్మావతీ నేడు ఎల్లోరాలోని ముప్పది నాలుగవ గుహలోని శచీదేవి విగ్రహంలా వున్నది. అలాంటి భార్య ఈనాటి కాతనికి దూరమైనది. ఆమెకు స్వకీయమైన పరిమళము ఆమె తన ప్రక్క నిదురపోవునప్పుడు. మేలుకొని తన్ను లతలా చుట్టివున్నప్పుడు. తనతో సమంగా నడిచి వచ్చేటప్పుడు తన అంకాసనం అలంకరించి ఉన్నప్పుడు తన్ను పొదివికొని పోయినప్పుడు. ఆ సురభిళము తన జీవితంలో ఒక భాగమైనదది. ఆ సుగంధము నేడు తనకు దూరమైపోయింది.

ఏమి జరిగినది? ఎందుకు తనకామె ఇలా దూరమైపోయినది? ఆనందపూర్ణమైన తమ దాంపత్య పూర్ణిమను నేడు ఏ రాహుగ్రహము మ్రింగివేసినది? పుష్పానికి పరిమళంలా తన చిన్నారి భార్యకు సంగీతము, నేడా సంగీతము ఆమెను ఎచ్చటికో లాక్కొనిపోతోందా? చిన్ననాటి నుంచీ ఆ బాలిక తనకు వేయి తిమింగిలాల బలం సమకూర్చేదికదా? ఆమె చూపుల రక్షణలో సముద్రపు మొసళ్ళన్నా భయపడక, అతివేగంగల ప్రవాహాలన్నా భయపడక ఎన్నిసార్లు తాను సముద్రంలో ఉరకలేదు! -

తనకు చదువువస్తూ కవిత్వము అర్థమయ్యే ఈ రోజుల్లో ఆమె తనకు వేయికాంతులతో దర్శనమిచ్చే ఈనాడు, ఆమె పెదవులలో ఉద్భవించిన కాంతులలో నూరవపాలు ఎరుపులలో నుండి పగడాలు పుట్టివుంటాయి అని అనుకున్నాడు. ఆమె నవ్వితే తళతళలాడే పళ్ళ తళుకులలో నూరవపాలు ధగధగలోంచి ముత్యాలు పుట్టాయి అనుకున్నాడు. దట్టంగా, నల్లగా, ఒత్తుగా, పట్టులావున్న ఆమె జుట్టు చీకటిలోనుండి నూరవపాలు నిగనిగలు సముద్రపు లోతులై వుంటాయని బుచ్చి వెంకట్రావు సరిపోల్చుకునేవాడు.

పద్మావతి ఎందుకు వెళ్ళినట్లు? తానేదోషము చేసినాడు? ఆమె మనస్సు చెడిపోలేదుకదా? ఆమె ఎడబాటు నానాటికి అతనికి భరించరానిదై పోయినది. సినిమాలకు వెళ్ళేవాడు. కథలు అర్థమయ్యేవి కావు. అప్పటికింకా మద్రాసు నగరంలో ప్రొహిబిషన్ రాలేదు. బుచ్చి వెంకట్రావు బసోటోకో, కాన్మెరాకో పోయి కొంచెం ఘాటైనవి ద్రాక్షసారాయి, బీరులు, విస్కీలు, బ్రాందీలు వగైరాలు మొదట సోడాలో కలిపి, ఆ తరువాత ఏమీ కలుపకుండా సేవించడం ప్రారంభించాడు. తన పనియందు శ్రద్ధ తగ్గిపోయినది. జాగ్రత్త తక్కువయ్యేటప్పటికి అతని కంపెనీ వ్యవహారాలు చిక్కులు పడసాగినవి.

అతని పురుషత్వము స్త్రీ స్పర్శను సర్వకాలము కోరే గాఢవాంఛతో నిండినది. స్త్రీ శరీర సంచలిత సౌరభాలు ఆఘ్రాణించక ఒక్క నిమేషమైన అతడు మనలేకపోయినాడు. ఇంతవరకూ అతని ప్రపంచము అతని భార్యే, నేడు ఆ ప్రపంచము శూన్యమై పోయింది.

4

పద్మకు కలలో ఎన్నిసార్లో భర్త కనబడేవాడు. ఆ కలలు ఒక్కొక్కప్పుడు, హృదయ బాధాపూర్ణమైన సంఘటనలతోనూ, ఒక్కొక్కప్పుడు ఉత్సాహసమ్మిశ్రితానుభవ యుక్తంగానూ ఉండేవి.

ఎలా వచ్చింది తనకీ బాధాపూర్ణమైన పరిణామం? ఎందుకు? ఏ మార్గాల తన జీవితం ప్రవహించబోతున్నది? ఎంతవరకు? ఏదికోరి? దైవమనుకొన్న భర్తను వదలిపెట్టుకోగలిగిందే! తన చిన్ననాటినించీ తనతో ఆడుకొన్నవాడు, లోకం అందిచ్చే చేతులు పట్టుకొని, తనతోపాటు అతడున్నూ పైపథాలకు నడచి వచ్చాడు కదా? ఏ జీవితం జీవిస్తే ఆ జీవితాన్ని సమగ్రంగా అందిపుచ్చుకొని, దృఢమైన నడకలు వేయగల ధీమా గల్గిన మనిషి! అతనికి చేపల పేర్లన్నీ తెలుసు, వాటి గుణగణాలు తెలుసు. వాటి జీవిత విశేషాలన్నీ తెలుసు. సముద్రపు మొసలి (షార్క్) కాని, టేకిచేపగాని, తూరగాని, ఎదుట వచ్చినప్పుడుగాని, పడవని ఎదుర్కొన్నప్పుడుగాని వాని బారినుండి ఎలా తప్పించుకోవాలో, కూడా వుండే శూలబల్లెంతో వాటిని ఎలా హతమార్చాలో అతనికి పూర్తిగా తెలుసు.

తన్ను పడవలో తీసుకువెళ్ళేవాడు! అతడు తెడ్డువేస్తే తాను తోలవేసేది. అతడు తెరచాప ఎత్తి చుక్కాని కోలవేస్తూ వుంటే తాను డామాను దగ్గర కూర్చొని.

“ఏ దిక్కు పోతాదో
 ఈ కడలి మన పడవ
 ఆ తీరమేలేని
 ఆకాశమే నీరు ||ఏ దిక్కు |

 పై కెగసి వాగులో
 పల పాల తుంపర
 నీ రాల బయలులో
 దారడిగి దారంది ||ఏ దిక్కు||

 తెరచాప రెక్కలతొ
 తెల్ల పులుగై పడవ
 మన వలపు రేవునకు
 మనల నిరువుర చేర్చు ||ఏ దిక్కు!

అని పాడుతూ ఉంటే తన బావ తన్ను చిరునవ్వులతో చూస్తూ తానూ ఒక పాట ఎత్తుకునేవాడు.

“వాగువాగులు కలిసి సాగు దారుల యెంట
 వాగు వడిలో తేలి వడివడిగ మన పడవ
 నా ముందు నీ నవ్వు నా ఎనకనా నువ్వు
 ఈ పడవ తెరలెత్తు మన బ్రతుకు దవుదవ్వు.

★ ★ ★