జాజిమల్లి/ద్వితీయ గుచ్ఛము

వికీసోర్స్ నుండి


ద్వితీయ గుచ్చము

ఎన్నో అందాలు ఎందరి జీవితాలలోనో ప్రత్యక్షం కాకుండానే, భావమాత్రంగానైనా, దర్శనం ఇవ్వకుండానే ఈ జగత్తు నడిచిపోతూ ఉంటుంది. కాని ప్రాథమికమైన సౌందర్యభావం మానవులందరి జీవితంలోనూ వికసించి ఉండనే ఉంటుంది. జీవితాన్ని నిజంగా అర్ధం చేసికోలేని కర్కశ వాదులు రెండు చేతులా ఆ కాస్త అందాన్ని కూలద్రోసుకొని ధూళి నిండిన దారులలో యాత్రసాగిస్తారు.

పల్లెటూరివారి జీవితాలలో కవిత్వమూ, సంగీతమూ నిత్యకర్మలో అంతర్భాగమై పోతాయి. అవతల ఒడ్డులేని సముద్రము, లోతు తెలియని కడలి పద్దాలుకు ఎప్పుడూ ఏవో చిరుగాలులు ప్రసరించిన యేటి అలలూ, ఆలోచనలను ఉద్బవింపజేసేవి.

పల్లెవారికి సముద్రం ఒక మహారాజ స్నేహితుడు. కాబట్టే వాళ్ళ జీవితాలలో అనంతమైన దూరాలు, లోతులు, లోతులు మించిన పారాలు! వాళ్ళు ఓడలు నిర్మించే విశ్వకర్మలూ, ఆ ఓడలు దెసల కడవలకు తేలిపోజేసే నావికులూ కాగలిగారు.

పద్దమ్మ కూడా తండ్రి తెప్పనావమీద చేపలకోసం ఉదయ దిశాంచలాలు దాటి వెళ్ళేటప్పుడు తానూ వెళ్ళింది. ఉప్పునీళ్ళలో చేపపిల్లలా ఈదగలగేది. ఎంత మునిగినా, లోతులందని నీలజలాలు, ఎంత ఈదినా దూరమందని కెరటాలు; కొండవిరిగినట్లు ఒడ్డుకు దొర్లిపడే తరంగాలు, ఆకాశాలతో గుసగుసలుపోయే కల్లోలాలు; ఏ కడనుంచి, ఏ కడకు పోతాయో తెలియని అవ్యక్తవాంఛల్ని ఎన్నో అందిస్తూ ఉండేది.

ఏడు సముద్రాలకూ పెంపుడు బిడ్డ పద్దమ్మ. ఆ సముద్రాల అమృతం అంతా పద్దమ్మలో నవనవలాడుతూ ఉండేది. ఆ జవ్వని కంఠమూ లావణ్యం దాల్చింది.

సంగీతం మేష్టారు నరసింహమూర్తి నేడు పద్మావతి అయిన పద్దాలుకు గాన విద్యా శిక్షణ ప్రారంభించాడు. కెరటాలలోని, తుఫానులలోని, ఆకాశనీలాలలోని అనంత దూరాలలోని మాధుర్యాలు వాకలు కట్టించుకొన్న ఆమె కంఠం ఆ శిక్షణకు ఎలా లొంగుతుంది? సముద్రానికి ఆనకట్టలు కట్టగలరా? లోతులకు కొలతలు వేయగలరా? నరసింహమూర్తి కష్టపడి కర్నాటక బాణి సంపాదించుకొన్న సంగీతం మేష్టారు. కావలిలో, కావలి చుట్టు ప్రక్కల గ్రామాలలో, సంగీత సభలు చేసి “పాటకుడు” అని పేరుపొందినవాడే! అయితే మాత్రం సంగీత సముద్రాలకు వారధులు కట్టడానికి అతడు శ్రీరామచంద్రుడా ఏమన్నానా!

2

పద్మావతి ఒంటినిండా నగలు దింపాడు బుచ్చి వెంకట్రావు. ఆనాటికి అవి పదమూడు వందల ఏభై రూపాయల మూల్యం కలిగిన బంగారం నగలు. తాను పెద్ద చేపల వర్తకుడవుతున్నాడు. యుద్ధంలో దేశాలు తిరిగివచ్చిన వాడవటంచేత ఇంతో కొంత లోకజ్ఞానం సంపాదించుకున్నాడు. దేశాలు తిరిగేవారికి దుమ్ముధూళిలా అక్కర్లేదనుకొన్నా జ్ఞానం కాస్త అంటుకు తీరుతుంది. కాని ఇది ఏమిటీ అని ప్రశ్న వేసుకొనే యోగంతో బయలుదేరిన పురుషునికి అతడు ఎంత తక్కువ బుద్ధి శ్రేణిలో వాడైనా లోకజ్ఞానం బాగా నచ్చితీరుతుంది. బుచ్చివెంకట్రావు తన జీవితానికి నిచ్చెనలు అమరించి, పైకి వెళ్ళాలి అన్న పట్టుదల కలిగిన సంకల్పజీవి. అతడు సముద్ర దూరాలు ఈదుకు వెళ్ళిన మనిషి. యుద్దంలో రంగూనుకు వెళ్ళినప్పుడు సముద్రం ఓడమీద దాటినవాడే! ఏ రేవైనా సముద్రానికి అవతల వొడ్డు రేవు కాదు. సముద్రం వేరు. రేవులు వేరు. రేవులన్నీ సముద్రానికి సేవకులవంటివి అని బుచ్చివెంకట్రావు ఊహించుకున్నాడు.

తాను తన జీవితంలో గొప్పవాడవటం తన పద్మావతి కొరకే. తనకూ తన పద్మావతికీ ఒకేసారి చదువు కావాలి. తన జీవితం చెట్టు అయితే ఆ చెట్టంతా నిండి వికసించిన పూవులప్రోగు పద్మావతి... పూవులు లేని చెట్టుకు అందమే లేదు. చేట్టులేక పూవులు ఎట్లా వికసించగలవు?

ఇద్దరికీ ఒకడే ప్రయివేటు మాష్టరు. ఇద్దరికీ ఒకే పాఠాలు చెప్పుతున్నాడు ఆ మాష్టరు. పద్మావతి దబ్బున గ్రహిస్తుంది. దబ్బున మరచిపోతుంది. బుచ్చివెంకట్రావు ఒక పట్టాన పాఠం త్వరగా గ్రహించలేడు. గ్రహించిన పాఠం త్వరగా మరచిపోడు. కాబట్టి తన భార్యకు తానే రెండవ గురువైనాడు వెంకట్రావు. ఏ పాఠమైనా నాలుగుసార్లు త్వరగా గ్రహించి వెంటనే మరచిపోయిన తరువాత ఐదవసారి పద్మావతికి పాఠం శాశ్వతంగా వచ్చేది. ఈ విధంగా ప్రవాహాలు సుళ్ళు సుళ్ళుగా వారిద్దరి జీవితాలలోకి జ్ఞానం ప్రవహించుకు రాసాగింది. ఆ జ్ఞానంతోపాటు లోకానికి కప్పివున్న తెరలు ఒక్కొక్కటే పైకి చుట్టుకుపోసాగాయి.

పద్మావతి భర్తను తన్ను కూడా ఈ ప్రదేశాలకు ఆ ప్రదేశాలకు తిప్పి, ఉత్తమ గాయకుల పాటలు తాను వినేటట్టు చేయవలసిందని ప్రార్థించింది. వాళ్ళిద్దరు సంగీత సభలకు మద్రాసు వెళ్ళసాగారు. వారిద్దరూ రామేశ్వరంవరకు ప్రయాణం చేసినప్పుడు దర్శనం చేసికొన్న తంజావూరు, చిదంబరం, శ్రీరంగం, మధుర, రామేశ్వరం మొదలైన దివ్యక్షేత్రాలలో ప్రత్యక్షమైన దేవాలయాల రీతిగానే కర్ణాటక బాణి ఉంటుంది. రాగాలు, మూర్చనలు, కీర్తనలు, గతులు, తాళాలు, క్షేత్రాలై, మండపాలై ఉత్తుంగ గోపురాలై, విమానాలై పద్మావతికి గోచరించినవి. ఆమెకు ఆనందము కలిగినది. భయము వేసినది.

ఏ సుబ్బులక్ష్మో, శమ్మంగుడో, కర్ణాటక సంప్రదాయ ప్రపంచమును ఇంద్ర జాలికులులా ప్రత్యక్షం చేసేటప్పటికి పద్మావతి దిగ్భ్రమచెంది అతిలోకమైన దివ్య మాధుర్యంలో మైమరచిపోయి స్థాణువులా అయిపోయేది.

పద్మావతి: నాకీలాంటి సంగీతం ఏలా వస్తుందండీ? ఈ రాగాల పోకడలే నా గ్రహణశక్తికి మించిపోతున్నాయి. నేను ఎన్నాళ్ళు తపస్సుచేస్తే, ఆ తపస్సు ఎన్ని జన్మలు వీడని దీక్షతో ఆచరిస్తే, నాకు ఈలాంటి సంగీతం అబ్బగలదు! ఎందుకు నాకు ఈ సంగీతం చెప్పించడం. ఆ సుబ్బులక్ష్మి అమృత ప్రవాహం ముందర నా కంఠం ఉప్పునీళ్ళ కాలవలా కనపడుతుంది.

బుచ్చి వెంకట్రావు: ఓసీ వెర్రినాగమ్మా! ఒక్క రోజులో సుబ్బులక్ష్మి తనకున్న యావత్తు సంగీతశక్తితోను వూడిపడిందా? ఎన్ని సంవత్సరాలు కష్టపడిందో. నేను లక్షాధికారిని కావాలంటే ఒక్క రోజులో కాగలనా చెప్పు. పద్మ: అంత విద్య మన నరసింహమూర్తి మాష్టారు చెప్పగలరనేనా?

బుచ్చి: నరసింహమూర్తి మాష్టారు కావలి స్టేషను అనుకో, ఇంకా బిట్రగుంట, నెల్లూరు, గూడూరు జంక్షను చెన్నపట్టణం ఉన్నవి కదా?

పద్మ: ఎన్ని వుంటే ఏమండీ? నా కెట్టావస్తుంది ఆ సుబ్బలక్ష్మి కంఠం.

బుచ్చి: ఎవరందాలు వారివి; ఎవరి గొప్పలు వారివి. ఏమంటావ్! నీ కంఠంలో శ్రీ పి.సుబ్బలక్ష్మి కంఠంలో కనపడేలేదు! ఎవరికున్న గొప్ప వారిది.

పద్మ: ఐతే నన్ను పట్నం తీసికెళ్ళో లేకపోతే దక్షిణాదికి తీసుకుపోయో గొప్పవారి దగ్గర సంగీతం చెప్పించండి.

3

బుచ్చి వెంకట్రావు ఎండురొయ్య పప్పు ఎగుమతి మద్రాసునుండే చేయ సంకల్పించాడు. తన ఆఫీసు కావలినుండి మద్రాసుకు మార్చాడు. కావలినుండి మద్రాసువరకూ ఉండే పల్లె గ్రామాలలో పల్లెవాళ్ళను తన కంపెనీకే వారి రొయ్య పప్పు అమ్మేటట్టుగా ఏర్పాటు చేసికొన్నాడు. తన ఆఫీసు వాల్టాక్సు రోడ్డులో కుదుర్చుకొన్నాడు. తను కాపురం ఉండేందుకు రాయపేటలో ఇల్లు కుదుర్చుకొన్నాడు. బ్రహ్మప్రళయంమీద ఊరంతా జల్లిస్తే ఆ ఇల్లు దొరికింది. భార్యకు సంగీతం చెప్పే నరసింహమూర్తి మాష్టారును కూడా తీసికొని వచ్చాడు.

పద్మావతికి చెన్నపట్నం వచ్చినప్పటి నుంచీ జీవితం ఒక అనంతమూలికలా అయిపోయింది. కావలసినన్ని జాజిపూవులు, కావలి వచ్చినప్పుడే ఆమెకు మొదటిసారి జాజిమల్లె ప్రత్యక్షమైనది.

ఒక్కొక్క వస్తువు ఒక్కొక్కరి జీవిత ప్రవాహాన్ని నూతన పథాలకు త్రిప్పుతుంది. ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క బాలిక బ్రతుకునే మారుస్తుంది. పెద్దజాజిపువ్వును మదరాసులో జాజిమల్లిపూవు అంటారు. తెలుగుదేశంలో పెద్దజాజి అని మాత్రమే పిలుస్తారు. అసలు జాజికి మల్లికి ఉద్భవించిన పువ్వు అయివుంటుంది. అటు మల్లిపువ్వులోని సౌందర్యాలూ ఉన్నవి. ఇటు జాజిలోని సుకుమారతా ఉన్నది. ఏదో వివశత్వం కలిగించే మత్తువాసన నక్షత్రరూపమై, నక్షత్ర లోకాల ఆవలిదశలకు కొనిపోయే రూపసౌందర్యము, స్వచ్ఛజాజిమల్లి పూవులో నృత్యమాడుతూ ఆమెకు గోచరించినవి. ఆమె మల్లెపూవు లెరుగును; నాగమల్లి పూవులూ ఎరుగును. నాగమల్లి చెట్లు వాళ్ళ పల్లెదగ్గరనే ఉన్నవి. వర్షాకాలం రాగానే అవి చక్కగా వికసించి వాన జల్లులతోపాటు పూవులు జల్లులు జల్లులై కురుస్తవి. తెల్లవారగట్లే లేచేది పద్దాలు వాటిని ఏరుకోటానికి. చెవులలో జూకాలుగా అమరించుకొనేది. దండలు గుచ్చి మెడలో వేసుకొనేది. తన చింపిరి జుట్టులో అలంకరించుకొనేది. ఒక్కొక్క పువ్వూ ముచ్చిక తెంపి ఆ పువ్వులోని తియ్యటి పాలను తాగేది. సన్నగా బూరాలు ఊదేది.

ఆ నాగమల్లి పువ్వులు జాజిమల్లి ఎదుట సామ్రాజ్ఞి ఎదుట రాణులులా అయిపోయినవి.నాగమల్లి మల్లియపీఠానికి దారి చూపిస్తుంది. మల్లిక జాజిమల్లి సింహాసన వితర్ధిక కడకు గౌరవంగా తీసికొని వెడుతుంది. కావలిపట్నంలో తాను తన భర్త కాపురం పెట్టిన మొదటి వసంతమాసంలో ఈ జాజిమల్లి పువ్వులు అమ్మకానికి వచ్చినప్పుడు, ఏమిటి యీ కొత్తరకం పూవులు ఇంత అందంగా వున్నాయేమిటి అనుకొన్నది. జీవితం అడుగు భాగాలలో దాగుకొనివున్న ఎన్నో కాంక్షలనూ, ఆశయాలనూ ఈ జాజిమల్లి పూవుల వాసన రేకెత్తించినది. ఎక్కి ఎక్కి పైకి ఎక్కి ఏదో ఒక మహానది ప్రవహించి క్రిందికి దిగే పర్వత సానువుల చరియల అనుసరిస్తూ, ఎక్కుతూ, కొండలు దాటుతూ, ఆ నదీబాలిక ఉద్భవించే పరమరహస్య ప్రదేశాలకే ఆ జాజిమల్లి వాసనలు తీసికొనిపోతున్నట్లుగా ఆమె మనసులో పొంగులు కలిగించేది..

చెన్నపట్నంలో అన్నీ జాజిమల్లిపూలే! అరటిదొప్పలలో దొంతరలు; దండల చుట్టలు, తక్కెడలో తూకాలు! జాజిమల్లియతో సంగమిస్తూన్న కనకాంబరాలు, మరువం కురువేరులున్న కదంబ మాలలు! మదరాసు జాతి కుసుమ వైభవ సమృద్ధమైన మహానగరం.

ఎన్ని కాంక్షలు ఆ నగరంలో ఉద్భవించాయో! తీరని కలలు, గాఢవాంఛలు, ఉత్కృష్టమైన ఆశయాలు జాతీ కుసుమ పరీమళ సంఘాతాలై మదరాసు నగరంలో ఎన్ని బ్రతుకులలోనో పుట్టి పెరిగి, మహాఝుంఝులై గాలివానలై పోతున్నాయో!

4

నరసింహమూర్తి సంగీతం మేష్టారు వాళ్ళింటిలోనే మకాం. నెమ్మదిగా సంగీతం మేష్టారు వంట బ్రాహ్మణుడూ అయ్యాడు; పద్మావతికి పితృదేవుడూ, గురువూ అయ్యాడు. పద్మావతి కనుముక్కు తీరుగల, అందమైన ముఖముకల పడుచు. ఆమెలో నాగరికత స్థానం ఏర్పరచుకొన్నప్పటినుంచీ ఆమెకున్న నీలోత్పలకాంతి ఉజ్వల శ్యామలకాంతి కావొచ్చింది! శరీరం సామ్యాంగ పరిపుష్టమై కాకతీయశిల్ప బాలికా సౌందర్యం మూర్తించుకొన్నది.

సంగీతం మేష్టారు నరసింహమూర్తికి పల్లెపడుచు పద్దాలు ఏవో పరమరహస్యాల పాలసముద్ర తరంగాలలో నుండి అవతరించిన లక్ష్మిలా గోచరమయ్యేది. పల్లెవారికి ఈ అందాలు ఎక్కడనుంచి వచ్చాయి? కాశీరాజుకు మత్స్య గ్రంధి చేపగర్భంలో దొరికినట్లు యీ పద్మావతి కూడా ఏ సముద్రపు అలలకో కొట్టుకు వచ్చిన వరుణదేవుని కొమరిత ఏమో? నల్లవారున్నారు. వారు తెల్లచీర కట్టుకుంటే చీర నల్లబడిపోతుందేమో అన్నట్టుంటారు. కాని పద్దాలు నలుపు రంగు ఆకాశనీలంలా, సముద్రంలోతుల గరుడపచ్చల నీలంలా, నరసింహమూర్తికి దర్శనం అయ్యేది. జూకామల్లి పూవుల నీలంలో వున్న ఆర్ద్రత ఆమె శరీరచ్ఛాయలో వికసించి వున్నదని నరసింహమూర్తి అనుకున్నాడు.

నరసింహమూర్తి: ఏమమ్మా పద్మావతీ! ఏదో ప్రైవేటు మాష్టరును పెట్టి మీ ఆయన నీకు ఏదో వానాకాలం చదువు చెప్పించాడు. నిజంగా సంగీత రహస్యాలే అర్థం కావాలంటే చదువు కూడా బాగా వచ్చి తీరాలి అమ్మాయి.

పద్మావతి : ఇక్కడ కూడా ప్రయివేటు మాష్టారును పెట్టించుకోవచ్చు కాదుటండీ!

నర : ప్రయివేటు మాష్టరు చదువు ఆటా పాటల చదువు. ఏదయినా స్కూలులో చేరి చదువుకోవాలి. ఆ చదువునకు ప్రయివేటు మాష్టరు చదువు బలమిస్తుంది. పద్మ: ఇంత పెద్దదాన్ని ఇప్పుడు స్కూలు ఏమిటండీ మాష్టారూ?

నర: ఆంధ్ర మహిళా సభలో చేరరాదూ. వాళ్ళు బెనారసు యూనివర్సిటీ ప్రవేశపరీక్షకు పంపిస్తారు. రెండేళ్లలో టింగురంగా అని ఇంటర్‌మీడియట్‌లో చేరవచ్చును.

పద్మ: ఇవాళ మా వారిని అడుగుతానుండండి. ఒక్కప్పుడు నాకు ఈ చదువెందుకు బాబూ అనిపిస్తుంది. ఈ పట్టణవాసం, ఈ మోటారుకార్లు ఈ గడబిడల్లో ఏమి ఆనందం ఉంటుందీ! మా పల్లెలో ఆ సముద్రం వొడ్డునే ఆ ఏటి కాడనే ఎంతో ఆనందంగా ఉండేది.

నర: ఇక్కడమాత్రం సముద్రం లేదటమ్మా.

పద్మ: ఇక్కడ సముద్రం సముద్రంలా అనిపించదండీ.

నర: అక్కడ కెరటాలు ఇక్కడా వున్నాయి. అక్కడ ఇసుక ఇక్కడా వుంది.

పద్మ: ఎట్టా అయినా ఆ సముద్రం వేరు. ఈ సముద్రం వేరు. ఇన్ని లక్షల జనంలో సముద్రం మన సముద్రంలా కనిపించదు. ఎవరి సముద్రమో చూడడానికి వచ్చినట్లుగా వుంటుంది. మాష్టారూ ఈ సముద్రంలో చేపలు దొరుకుతాయీ.

నర: అదేమిటమ్మా! పొద్దున్నే తెప్పలు కట్టుకొని మీవాళ్ళెంతమందో తెల్లారగట్టే సముద్రంలోకి వెళ్ళిపోతారు. పది పన్నెండు గంటలకు తిరిగివస్తారు. తెప్పలనిండా కావలసినన్ని చేపలు పట్టుకువస్తారు.

పద్మ: అవి విదేశీ చేపలేమో!

నర: మంచిదానవే!

పద్మావతి ఆంధ్ర మహిళా సంస్థలో చేరింది. బుచ్చి వెంకట్రావు తాను అగ్నికుల క్షత్రియులమని చెప్పాడు. ఆంధ్రమహిళాసభ విద్యాలయంలో చేరినప్పటినుండి పద్మావతికి దీక్ష ఎక్కువైంది. రాత్రింబవళ్ళు చదువే. మహిళాసభ విద్యాలయంలో వున్న బి.ఏ. పాసయిన ఉపాధ్యాయినిని ఒకరిని ఆమెకు ప్రయివేటు మాష్టరుగా కుదిర్చాడు బుచ్చి వెంకట్రావు.

మద్రాసు వచ్చినప్పటినుంచీ బుచ్చి వెంకట్రావు వ్యాపారం వృద్ధి అయింది. వచ్చిన ఆరునెలలో అతనికి ఎనిమిదివేలు లాభం వచ్చింది. భర్తను ఆంధ్ర మహిళా సభకు దగ్గిరగా యిల్లు అద్దెకు పుచ్చుకోమని పద్మ పోరు పెట్టింది. సలివన్సే గార్డెన్స్‌లో చిన్న మేడ నూరురూపాయలు అద్దెకు కుదుర్చుకొన్నాడు బుచ్చి వెంకట్రావు. అందుకు వేయి రూపాయలు అడ్వాన్సు యిచ్చాడు.

చదువు వస్తున్న భార్య బుచ్చి వెంకట్రావుకు నిత్యనూతన విద్యామూర్తిలా, సౌందర్యదేవతలా కనిపించేది. చదువుకున్న బాలికలతో సహవాసాలు అలవరచుకొన్న పద్మావతికి ఏదో ఒక నూతన ప్రపంచం సన్నిహితం కాసాగినది. చదువులు, దేశాలు, దుస్తుల విధానాలు, వివిధ భాషలు, రాజకీయాలు, అలంకరణలు, ఆనందాలు, శుచి, శుభ్రతలు పద్మావతికి అర్థంకాసాగినవి.

ఆమె ఇల్లు అలంకరించటం నేర్చుకొన్నది. తాను కడిగిన ముత్యంలా ఎప్పుడూ నిర్మలంగా వుండటం నేర్చుకొన్నది. వివిధ సువాసనలు తమ తమ వ్యక్తిత్వాలతో ఆమె జీవితంలోనికి వచ్చి చేరినవి. తాను అర్థం చేసుకొన్న ప్రతి సంస్కృతినీ ఆ బాలిక తన భర్త జీవితంలో కూడా ప్రవేశపెట్టాలనీ ప్రయత్నం చేయసాగింది. బుచ్చి వెంకట్రావు ఆమెకు దాసానుదాసుడైన శిష్యుడైనాడు. వారిద్దరికీ ఈ దైనందిన సంస్కృతి విద్యాశిక్షణ ఎంతో ఆనందం కలిగించే వ్యావృత్తి అయినది.

ఇల్లు అలంకరించుకొనే పాఠం ఉపాధ్యాయిని చెప్పేది. చెప్పిన పాఠమెల్లా ఆచరణలో పెట్టాలని పద్మావతికి కుతూహలం. భర్తతో మారాం పెట్టేది. రోజుకు ఒక కొత్తరకం భావం బుచ్చి వెంకట్రావును ఉక్కిరిబిక్కిరి చేసేది. ఇవాళ కిటికీలన్నిటికి పచ్చరంగు, ఎర్రరంగులు కలిగిన పువ్వులు. రేపు నీలంమీద తెల్లచారలు కలిగిన తెరలు, ఇవాళ పేము కుర్చీలు, రేపు రోజువుడ్డు సోఫాకుర్చీలు “నీకేమైనా మతిపోయిందా?” అంటాడు బుచ్చి వెంకట్రావు.

నరసింహమూర్తి మాష్టారు పద్మావతి భావాలన్నీ వింటూ ఎంతో ముచ్చట పడిపోయేవాడు. ఎంతో కాలం సంగీతంలో ప్రయివేటు మాష్టరుగా వుండి నూరు రూపాయలు నెల్లూరులో సంపాదించుకుంటూ కుటుంబం పోషించుకుంటూ ఉండేవాడు. నేడు అరవైరెండు ఏళ్ళు వచ్చాయి. భార్య పోయింది. బిడ్డలు లేరు. స్వచ్చమైన వెలనాటి బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. పెద్దవాడవటంచేత నెమ్మదిగా పాఠాలు తగ్గిపోయినాయి. నెల్లూరు వదలి స్వగ్రామమయిన కావలి చేరుకొన్నాడు. కావలి చేరుకొన్న కొద్దిదినాలకే బుచ్చి వెంకట్రావు 50 రూపాయలిచ్చి నరసింహమూర్తిగారిని భార్యకు సంగీతపు మాష్టారుగా ఏర్పాటు చేసినాడు. నేడు యీ కుటుంబంతో తాను మదరాసు వచ్చాడు. తానింత వండుకొని వాళ్ళిద్దరికి వడ్డించుకు తినమని ఇవతల పెట్టేసేవాడు. పద్మావతే అతనికి కూతురైంది. బుచ్చి వెంకట్రావు అల్లుడైనాడు. వీళ్ళిద్దరి దినదినాభివృద్ధి అతనికి నిత్య సంతోషకారణమైనది.

★ ★ ★