జాజిమల్లి/షష్ఠమ గుచ్ఛము

వికీసోర్స్ నుండి


(షష్ఠమగుచ్చము)

సంగీత దర్శకుడైన రాధాకృష్ణ ఇంట్లో, పద్మావతి సంగీత ప్రదర్శనమైన కొద్దిరోజులకు, ఒక సాయంకాలం, పద్మావతి స్నేహితురాండ్రతో చీనాబజారుకు వెళ్ళింది. ఫేసుపౌడరూ, తిలకాలూ, సబ్బులూ అలాంటివన్నీ కొనుక్కుందామని వారి ఉద్దేశం. హాస్టలుకు కావలసిన సరుకులు కొత్వాల్ సావిడిలో కొనడానికి వసతి గృహాధికారిణి శ్రీమతి కరుణామయిగారు వస్తూ వుంటే వారితో ఈ బాలికలందరూ వచ్చినారు. అచ్చట ఒక కొట్టులోనికి ఎగబడి ఏవో రంగు రంగుల చీరలూ, రవికల గుడ్డలూ బేరం చేస్తున్నారు. అక్కడికి రాధాకృష్ణా అతని భార్య సుశీలాదేవి చక్కావచ్చారు.

"నమస్కారం పద్మావతీదేవిగారూ! చీరలు కొంటున్నారా ఏమిటి?” అంటూ సుశీల, పద్మావతీ తక్కిన బాలికలూ ఉన్నచోటికి వచ్చింది.

“నమస్కారం సుశీలాదేవిగారూ! అదిగో రాధాకృష్ణగారూ కూడా వచ్చారు. నమస్కారం రాధాకృష్ణగారూ! వీరందరూ మా సభా పాఠశాలలో చదువుకుంటున్నారు. వీరు కరుణామయిగారు, మా హాస్టలు అధికారిణి! అక్కగారూ, వీరు రాధాకృష్ణగారు. వీరు వారి భార్య సుశీలాదేవి గారు! ఈమె మళయాళీలు. రాధాకృష్ణగారు తెలుగువారు. ఎంతో ప్రసిద్ధి పొందిన సంగీత దర్శకులు” అని తొందర తొందరగా మాట్లాడింది.

పద్మావతి మోము ప్రఫుల్లమవడమూ, ఆమె కళ్ళలో కాంతి శ్రీమతి చూసింది. శ్రీమతి కరుణామయికి ఏమి బుద్ధి పుట్టిందో కాని సుశీలను చూచి, “ఏమండీ సుశీలాదేవిగారూ, మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారే! కొంచెం మళయాళీయాస ఉందనుకోండి! మీరు తప్పక మా ఆంధ్ర మహిళాసభలో మెంబరు కాకూడదా?” అని అడిగింది.

సుశీల : తప్పక చేరుతానండి. రేపో ఎల్లుండో వీలు చేసుకుని వస్తాను.

కరుణా : మీరు మీ భర్తగారిచేత మా సభలో పదిహేను రోజుల తర్వాత జరిగే సభలో సంగీతం పాడించాలని ప్రార్ధిస్తున్నాను.

రాధా : మా గృహలక్ష్మిగారిని ప్రార్థించనక్కరలేదు. కరుణామయిదేవిగారూ! మీరు ఎప్పుడు వచ్చి పాడమంటే అప్పుడు వచ్చి పాడడానికి సిద్ధం.

పద్మావతి : తప్పక రండి రాధాకృష్ణగారూ! ఆ సందర్భంలో సుశీలాదేవిగారూ కూడా పాడతారు.

సు : పద్మావతీదేవిగారూ పాడతారు.

క : చాలా బాగా ఉంది. ఆ సభ దివ్యంగా రక్తి కడుతుంది.

పద్మా : అమ్మో! నేను పాడడమే!

సు : నేను పాడితేదా చాలా బాగా ఉండునా ఏమీ ఏమమ్మా నీవుదా చెబుతావు. నువ్వు పాడతానంటేనే నేను పాడటానికి మాట ఇస్తును. క : మా పద్మావతి తప్పక వప్పుకుంటుంది లెండి.

రాధా : పద్మావతీదేవిగారి గురువుగారు నాకూ కొంతకాలం గురువుగారు సుమండీ! మా గురువుగారు నరసింహమూర్తిగారు ఫిడేలు వాయిస్తారు లెండి.

పద్మా : మా మేష్టారి అనుమతి పుచ్చుకోవద్దా రాధాకృష్ణగారూ!

రాధా : ఆయన అతి సంతోషపడతారు.

ఇంతట్లో చీరల బేరం సాగింది. సుశీల మంచిచీర ఒకటి తీసి “ఇది కొనుక్కో పద్మావతి వదినా! నీకు ఇది బాగా ఒప్పుతుంది!” అన్నది.

ఆ చీర కరుణామయికి నచ్చలేదు. అది అతి నవీన విధానంగా ముందు కుచ్చులకు వచ్చేభాగం ఎంతో పెద్ద లతలతో తక్కిన చీర రంగును భేదంగా ఉన్న రంగుతో ఉంది. చీర అతి పల్చన. అలాంటి చీరలు కొందరు సినీమా తారలూ, పెద్ద ఉద్యోగస్తుల తనయులూ కడుతున్నారు. అయినా పద్మావతి అలాంటి చీర కట్టుకుంటే, ఆమె మనస్సు ఏ ఏ రీతుల ప్రవహిస్తుందో అని కరుణామయి అనుకున్నది. ఒక్కొక్కరకం మనః ప్రవృత్తికలవారు ఒక్కొక్కరకం చీరనూ రంగునూ ఎన్నుకోడం ఉంది. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క చీరా, ఒక విచిత్రమైన లతలూ, నేతా, రంగులూ కలిగిన బ్లౌజు, స్త్రీలలో ఒక్కొక్క మార్పు కలుగజేస్తుంది. అని కరుణామయి అనుకున్నది. ఆ చీర కొనవద్దని చెప్పుదామని రెండుమార్లు అనుకున్నది. నాలుక చివరివరకూ మాట వచ్చింది. తాను మాటంటే పద్మావతి అది రాజాజ్ఞగా పరిపాలిస్తుంది. నిజమే! కాని లోన ఎంతో బాధపడుతుంది. ఎవరి జ్ఞానం వారే సంపాదించుకోవాలిగదా అని నిశ్చయానికి వచ్చి కరుణామయి మాట్లాడక వూరుకుంది. పద్మావతి ఆ చీర కొనుక్కుంది.

తక్కిన బాలికలకు చీరలూ, రవికగుడ్డలూ ఏరుతూ, కరుణామయీ, బాలికలూ ఆ పనిలో నిమగ్నులయ్యారు. సుశీలా, రాధాకృష్ణా, పద్మావతీ షాపులోనుండి వీధిలోనికి వచ్చి అక్కడ వున్న వారి కారులో కూర్చున్నారు. సుశీల తన కారు నడుపుకుంటుంది.

“నువ్వే కారు నడుపుతావా ఏమిటి వదినా? ” పద్మావతి సుశీలను అడిగింది.

“అవును. ఇది నా కారు. మీ అన్నగారికి వేరే కారు ఉంది. నా కారు ఇంకోరు నడిపేందుకు అవుసరం లేదు.” అని సుశీల పకపక నవ్వుతూ జవాబు చెప్పింది.

రాధాకృష్ణ చూపులు ఇంతవరకూ పద్మావతి పైనే ఉన్నాయి. అతడు సిగరెట్టుమీద సిగరెట్టు వూదేస్తూనే వున్నాడు. ఆ అమ్మాయి దేహవిన్యాసము అతణ్ణి విపరీతంగా ఆకర్షించింది. శిల్పశాస్త్ర రీత్యా ఇంత మనోహరమైన శరీరం ఈ లోకంలో ఉండదు అని అతడనుకొన్నాడు. ఆ రూపానికి తగినట్లు మోము, ఆ మోము సౌందర్యంలో ఆర్యజాతి వారి రేఖలు వుండకపోవచ్చుగాక. ఆ చామన ఛాయ ఎంత ఒప్పిందో? ఆ దేహం ఎంత స్నిగ్ధంగా ఉన్నదో. స్వచ్చమైన రంగు, ధనమూ, సంపదా రాగానే రంగు కూడా వచ్చింది. వీళ్ళు మాంసాదులు తినడం మానివేశారట. దానివల్ల మానసికంగా కూడా మార్పులు వస్తాయి కాబోలు!

ఆ బాలిక కళ్ళు విశాలంగా సోగలై, వెన్నెలకాంతులు పొదువుకొని ఉన్నాయి. చామనఛాయ కలవారిలో ఇంత అందం వుంటుందని అతడిదివరకు ఊహించుకోలేదు. అలా అతని ఆలోచనలు ప్రవహించిపోతున్నవి.

ఆర్ద్రత కలిగిన అతని చూపులు తనపై పూర్తిగా ప్రసరించిపోవడం పద్మావతి గ్రహించింది. అతని హృదయంలో తన్ను గురించిన ఏవో ఆలోచనలు గుబాళించు కొంటున్నాయని ఆమె ఊహించుకుంది. ఇంత పేరు పొందినవాడు, ఇంత గాయకుడు తానంటె సమ్మోహపడడం తనకెంతో గొప్ప అనుకుంది. ఆమెకు ఏదో పట్టరాని ఆనందం కలిగింది. “మీరూ మా వదినా పాడేటట్లయితే నేనూ పాడతానండీ రాధాకృష్ణగారూ!” అని చటుక్కున పద్మావతి అన్నది.

రాధాకృష్ణ చకితుడై “ఆఁ ఏమిటీ? చాలా బాగుంటుంది. ఆ రోజు మనవాళ్ళందరికి దివ్యమైన సంగీతపు పిండి వంటలతో విందు చేద్దాము” అన్నాడు.. ఇంతట్లో కరుణామయి తక్కిన బాలికలూ పైకి వచ్చారు. పద్మావతి వారందరితో కలసి ఆంధ్ర మహిళా సభకు వెళ్ళిపోయింది.

2

బుచ్చి వెంకట్రావు, రాధాకృష్ణ ఇంటిలో జరిగిన సంగీత ప్రదర్శనం వెనక పదిరోజులకు ఒక సాయంకాలం తన కారుమీద ఒంటిగా రాధాకృష్ణ మేడకు వచ్చినాడు. అతనికి ఇన్నాళ్ళూ మంచి స్నేహాలు దొరకలేదు. వ్యాపార సంబంధం కలిగినవారు పదిమందితో అతనికి పరిచయం కలిగిన మాట నిజమే. కాని అది పరిచయంగానే ఉండిపోయింది.

అతనికి అతి సన్నిహిత మిత్రుడు నరసింహమూర్తి మేష్టారే! ఇంతవరకూ భార్యా, తనూ సర్వతోముఖంగా జ్ఞానవంతు లవ్వాలన్న దీక్షే అతనికి స్నేహాలు అవసరం లేకుండా చేసింది. ఇప్పుడు భార్య దూరమైపోయింది. మదరాసులో నరసింహమూర్తి మేష్టారు నానాటికి తనకు తాబేదారయ్యాడు. స్నేహం చాకిరిగా మారిపోయింది.

ఇంక అతనికి తన వ్యాపారం తప్ప ఇంకో వృత్తి లేకపోయింది. సాయంకాలం ఏమీ తోచేదికాదు. బీచికి వెళ్ళటం మొదటి దినాల్లో కొంత కాలక్షేపం అయింది. సినిమాలు కొంత కాలక్షేపం తీర్చేవి. చివరికి రెండూ విసుగు పుట్టించాయి. కొన్ని దినాలు అలా కారు వేసుకొని మద్రాసంతా తిరిగేవాడు. అతడు వెళ్ళని పేటలేదు. తిరగని సందులేదు. అదీ విసుగు పుట్టింది.

అలాంటి బుచ్చివెంకట్రావుకు రాధాకృష్ణ మంచి స్నేహితుడు కావచ్చును అనిపించింది. ఆ ఆలోచనతో రాధాకృష్ణ ఇంటికి వచ్చాడు.

రాధాకృష్ణ ఇంటిలో లేదు. “ఏదో సినిమా చిత్రంలో ఒక పాట రికార్డు చేస్తూండడం వల్ల వారు వెళ్ళినారు” అని సుశీలాదేవి ఆయనతో చెప్పి. “రండి! కాస్త కాఫీ తాగుదురు గాని!” అని లోని హాలులోనికి ఆహ్వానించింది.

బుచ్చి వెంకట్రావు బలసంపద కళ్ళు తనివోవ సుశీల చూస్తూ అతడు కూచున్న సోఫాకు ఎదురుగా వున్న సోఫాలో కూచుంది.

“మీరు యుద్ధానికి వెళ్ళివచ్చారా వెంకట్రావుగారూ?”

“వెళ్ళివచ్చాను. కాని అది నాకు ఉపకారమే చేసిందో, అపకారమే చేసిందో?” “అదేమిటి అలా అంటారు?”

“అవునండి! యుద్ధానికి వెళ్ళకముందు నేను వట్టి పల్లెటూరి పల్లెవాడిని. యుద్ధంనుంచి వచ్చాను. ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు పుట్టాయి. చేపల వర్తకం పెట్టాను. రంగూనుకు, అలాంటి ఇతర దేశాలకూ రొయ్యపప్పు ఎగుమతీ. ఆ మూలాన బాగా లాభం వచ్చింది. వస్తూ వున్నది. ఇంక నాకు మా ఆవిడకూ జ్ఞానసముపార్జన తృష్ణ ఉద్భవించింది. నాగరికతా, చదువూ కావాలి. ఆవిడకు: సంగీతమూను, మేము నాగరికులమయ్యాము. కాని తృప్తి, ఆనందమూ మాత్రం మాయమయ్యాయి సుశీలాదేవిగారూ!”

బుచ్చి వెంకట్రావు మాట్లాడుతున్నంతసేపూ సుశీల అతనివైపు రెప్పవాల్చకుండా చూస్తుంది. ఎంత విచిత్రంగా వుంది బుచ్చి వెంకట్రావు కథ. పద్మావతిలోనూ ఏదో అసంతృప్తి వుంది. ఈతనిలోనూ ఏదో అనూహ్యమైన ఆవేదన బయలుదేరింది. తన జీవితమూ విచిత్రమైనదే, తనకు ఈ వివాహం కాకముందే పురుష సంబంధం వున్నది. స్కూల్ ఫైనల్ పరీక్ష అయి తిరువాన్‌కూరులో సంగీతమూ, నాట్యమూ కొంత నేర్చుకొన్నది. ఒక మలయా సినిమా చిత్రంలో వేషం వేయడానికి (ఏదో చిన్న నాట్య వేషమే అనుకోండి) తను మద్రాసు వచ్చింది. అంతట్లో తను, రాధాకృష్ణ దగ్గిర శిష్యురాలయింది. అతనితో నాట్య భాగస్వామిని అయింది. అతడు బ్రాహ్మణుడు, తను నాయరు బాలిక, అయినా తనకు అతడు సరియైన పురుషుడని తోచింది. అతని వల్ల తనకూ పేరు వచ్చింది. అతడు సంగీత దర్శకుడుగా, నాట్యదర్శకుడుగా ఉన్న ప్రతి చిత్రంలో తనకూ నాట్య వేషమో లేక రెండవ నాయిక వేషమో వస్తోన్నది. అతడు తన పేర ఒక ఇల్లు కొన్నాడు. కొంత డబ్బు బ్యాంకిలో వేస్తున్నాడు. తన జీవితం హుషారుగా ప్రవహించి పోయింది. ఇంతట్లో అతని పేరు హెచ్చిపోసాగిందిది. అనేక కంపెనీల వారు ఇతర నాట్యకత్తెలు కావాలనేవారు. ఇంక రాధాకృష్ణ దూరమైపోతాడని ఊహించింది. వివాహ ప్రసక్తి తెచ్చింది.

“బుచ్చి వెంకట్రావుగారు! తృప్తి, ఆనందమూ అనేవి మనలో ఉన్నవి అంటారా, పైనుంచిదా వచ్చేవంటారా?”

“మనలోనే ఉన్నాయనుకోండి, కాని పైన మనకు సంధానమయ్యే పరిస్థితులనుబట్టి కదా మనకు ఆనందమూ, తృప్తి కలగడము!"

“అవునుదా! నిజమే కాని, మనకు ఏలాంటి పరిస్థితి సంఘటించినా, దానివల్ల మన మనః ప్రవృత్తి ఎందుకుదా మారాలి?”

“నిగ్రహం కలవారికి మారదనుకోండి. కాని ఎందుకు మనం ఈ పనులన్నీ చేస్తున్నామో తెలియని వారికి నిగ్రహం కలుగదు. జ్ఞానం వృద్ధి అయినకొద్దీ, మనస్సుకు నిలకడ తక్కువౌతుంది."

“సంపూర్ణ జ్ఞానం కలవారికి!”

“సంపూర్ణత అనేది జ్ఞానానికి వుందా!”

“కాబట్టి, జ్ఞానం సంపాదించడానికి అంతులేదు. జ్ఞానం సంపాదించే వారందరికీ అసంతృప్తి అన్న మాటేనని సెప్పండిమీ!” “ఈ విషయాలన్నీ ఆలోచించడానికి నాకు శక్తి ఎక్కడ ఉందండి!”

“కాబట్టి ఏమీ ఆలోచించకుండా ఉండరాదా అండి.”

“అది ఎల్లా సాధ్యం! నేను యోగినా? ఉప్పూ, పులుసూ, కారం తినేవాడిని.”

“అయితే ఆ ఆలోచనలవల్ల వచ్చే బాధలను, ఆవేదనలను భరించడం నేర్చుకోవలసిదా, ఉంటుంది. అసంతృప్తి వల్ల వచ్చే హృదయ బాధ భరించవలసిదా ఉన్నది.”

“అందుకోసమే సర్వకాలమూ ప్రయత్నం చేస్తున్నాను!”

ఇంతట్లో నాయరు ఏవేవో ఫలహారాలు, “టీ కెటిల్” పాల “జగ్గూ", పంచదారభరిణా, చెంచాలూ, అన్నీ పట్టుకు వచ్చి, ఆ లోని హాలులో ఒక మూలగా ఉన్న టీ బల్లపైన వుంచాడు. సుశీల “రండి మీ వెంకట్రావుగారూ!” అని పిలిచి అతణ్ణి టీ బల్ల కడనున్న కుర్చీలో ఒకదానిలో కూచోమని కోరింది. వారిద్దరూ కూచుని ఉపహారం సేవింప సాగించారు.

“ఏమండీ వెంకట్రావుగారూ! మీకు తోచనప్పుడల్లా మా ఇంటికి రండి. మీరు ఎప్పుడు పడితే అప్పుడే రావచ్చును. అరవ సినిమా చిత్రాలలో, మళయాళ చిత్రాలలో, నా కంఠము కొందరు సినిమా తారలకు ఇస్తున్నాను. అందుకై పాటలు రికార్డింగుకు మాత్రందా వెడుతూ ఉంటాను. నాట్యకత్తెగా సినిమా చిత్రాలలో నటిస్తాను. గనుక, ఆ సమయాలలో తీరుబడి ఉండదు. మీరు ముందు ఫోనుచేసి, మా ఇద్దరిలో ఎవరన్నా ఉన్నారో లేరో కనుక్కుని, ఎవరున్నా తప్పకుండా రండిమీ. మీ ఆవిణ్ణిదా తీసుకువస్తూ ఉండండి”

“మా ఆవిడ ఆంధ్ర మహిళాసభ విద్యాలయంలో విద్యార్థిని. ఆవిడ ఆసభ విద్యాలయం, వసతి గృహాల క్రమశిక్షణకు బద్దురాలు కదా! కాబట్టి ఎప్పుడు ఆవిణ్ణి వీలుగా తీసుకురావచ్చునో అప్పుడల్లా తీసుకువస్తాను.”

“మీ రెప్పుడు ఇంటి దగ్గిరనా ఉందురు?”

3

“ఇల్లూ, ఆఫీసూ ఒక్కటేగనుక ఎప్పుడుపడితే అప్పుడే వుంటాను.”

“అయితే చూస్తిరా? నేనుగాని, నేనూ మా ఆయనగాని, మా ఆయన ఒక్కరేగాని మీ ఇంటికి తరుచుగా వస్తూ వుంటుమే.”

“అంతకన్న భాగ్యమేముందండీ!”

అంతకంతకు బుచ్చి వెంకట్రావుకు సుశీలతోనూ, రాధాకృష్ణతోనూ స్నేహం ఎక్కువయినది. ఈతడు వీరింటికి రావడమూ, వీరు బుచ్చి వెంకట్రావు ఇంటికి వెళ్ళడమూ, అందరూ కలిసి సినీమాకు వెళ్ళడమూ, వెంకట్రావుకు కాలం జరగడం లేదన్న ఆవేదన పోయింది.

అతనికి, సుశీలకూ స్నేహం ఎక్కువైంది. సుశీల అతణ్ణి ఒక్కణ్ణే కలుసుకునేది. అతణ్ణి కారుమీద ఈ ఊరు ఆ ఊరు ప్రయాణం చేయించేది. రాధాకృష్ణ “సుశీల మీ చెల్లెలనుకోండి, మీ రామెస్నేహంలో ప్రపంచజ్ఞానం పూర్తిగా అలవలరచుకొంటారు బావగారూ!” అనేవాడు. సుశీల బుచ్చి వెంకట్రావుకోసం రాగానే అతని భుజాల మీద చేయివేస్తుంది. ప్రక్కనే కూచుంటుంది. అతని ఛాతీ మంచి విశాలమైనదని తడుముతుంది. దండలు ఉక్కుతో చేసివుంటాయని నొక్కుతుంది. తనకు బలమైన వాళ్ళను చూస్తే ఆనందమంటుంది.

సుశీల కలుపుగోరుతనమూ, ఆమె లేనిపోని పిచ్చి పిచ్చి ఊహలు పెట్టుకోకుండా తనతో సాయిలా ఫాయిలాగా ఉండడమూ అతనికి చాలా ఆనందం కలిగింది. అతని హృదయంలో ఏవో బరువులు కరిగిపోయినట్టయినది.

మధ్య మధ్య ఆంధ్రమహిళాసభ పాఠశాల ప్రధానోపాధ్యాయిని అనుమతితోనూ, వసతిగృహాధికారిణి అనుమతితోనూ పద్మావతిని రాధాకృష్ణగారింటికి బుచ్చి వెంకట్రావు తీసుకువచ్చేవాడు. ఆ సమయంలో రాధాకృష్ణ ఆనందానికి మేరలేకపోయేది. పద్మావతీ అతడూ సంగీతం అని కూచునేవారు. రాగాలు, తాళాలు సినిమాలలో ఆనాడు ఎక్కువగా వాడుకలోకి వచ్చిన పాటలు, అవి విపరీతంగా ప్రజామోదం పొందటానికి హేతువులు, గట్టి సంగీతం ఎందుకు ప్రజలకు భరింపరానిదవుతుంది - ఈ విషయాలు ఆమెకు చెప్పేవాడు రాధాకృష్ణ, ఆమెకు ఉత్తరాది, మహారాష్ట్ర సినీమాల పాటలు గ్రామ ఫోనులో వినిపించేవాడు. తానిచ్చిన వరసలు ఉత్తరాది వరసలకన్నా దక్షిణాది వరసలకన్నా ఎందుకు బాగుంటాయో చెపుతూ, తన వరసలూ ఆయా పాటల వరసలూ పాడి వినిపించి ఆమెకు తెలియజేసేవాడు.

ఆ మేడలో సుశీలా వెంకట్రావు ఒక వైపునకూ పద్మావతీ రాధాకృష్ణ లొకవైపునకూ తేలుకు వెళ్ళేవారు. పద్మావతిని ఏదో వంకతో రాధాకృష్ణ స్పృశించేవాడు. ఆమె దేహం తన శరీరానికి తగులుతూ ఉండేటట్లు సోఫాలో కూచునేవాడు. నడుస్తూ ఉన్నప్పుడు, ఆమె నడుం చుట్టూ చేయి వేసేవాడు.

మొదట పద్మావతి భయపడింది. ఈ విధానం అతి నవీనం కాబోలు. ఇందులో తప్పులేదని సమాధాన పెట్టుకున్నది. అంతకంతకు రోజులు గడచిన కొద్దీ ఆ బాలికకు రాధాకృష్ణ స్నేహం అతి అవసరమైనది. సంగీతం విషయాలు నేర్చుకొనడం ముఖ్యమే! అంతకన్న ముఖ్యం రాధాకృష్ణ మాటలే! అతడు మాట్లాడేవన్నీ ఆమెకు తెలియవు. అతడు ఏవేవో చెప్పేవాడు. అతడు ప్రపంచంలోని అన్ని విషయాలు తెలిసికోలేదు. అతని చదువూ అంత పెద్దదికాదు. రోజూ వచ్చే దినపత్రికలు వార్తలిస్తాయి. కొన్ని ఉపన్యాసాలు ముద్రిస్తాయి. అవి విజ్ఞాన విషయాలేమి చెప్పగలవు? స్నేహితులైన సినీమావారు మాట్లాడుకునే మాటలూ, చప్పచప్పని ఆరణాల మాస, పక్షపత్రికలు ఏమంత జ్ఞానం ఈయగలవు?

అయినా ఇప్పుడిప్పుడే ప్రపంచజ్ఞాన వాతావరణంలో హృదయపుష్పపుటాలు విప్పుతూన్న పద్మావతికి అతడు ఏ విషయం చెప్పినా అవన్నీ అద్భుతంగా ఉండేవి. ఇంతకూ అతడు అదృష్టవంతుడూ, చాలా తెలివైన సంగీతదర్శకుడూ!

ఇటు పద్మావతికి ఏ రీతిగా ఏదో సంతృప్తి హృదయం నిండిపోయిందో, ఆ రీతిగా సుశీలాదేవి స్నేహంవల్ల బుచ్చి వెంకట్రావుకు వర్ణింపరాని తృప్తి కలిగింది. అతని హృదయంలోనూ సుశీలాదేవి విషయంలో స్త్రీ పురుష సంబంధ విషయకమైన భావాలు కలుగలేదు. అలాంటి భావాలేమైనా పద్మావతీ వెంకట్రావుల హృదయ మూలాల స్పందనం అయివుండెనో ఏమో! కాని వారిద్దరి ఆవేదనలూ తగ్గిపోయాయి.

పద్మావతి ఇప్పుడు విద్యాలయంలో తృప్తిగా చదువుకుంటున్నది. తోటి బాలికలతో ఎక్కువ చనువును సంపాదించుకుంటున్నది. వారితో కలిసి తిరగడం ఆమెకు ఎక్కువ ఇష్టమైనది. అంతకంతకు శ్రీమతి కరుణామయిగారితో ఆమె స్నేహం వృద్ధి పొందింది.

కరుణామయికి పద్మావతి అంటే చెప్పలేని దయ కలిగింది. ఆమె ఎక్కువ శ్రద్ధ వహించి తానే ఎన్నో విషయాలు ఆమెకు బోధించేది. పద్మావతి సభలలో నిర్భయంగా సంగీతం పాడేట్లు చేసి, ఆమె సభా పిరికితనం మాయంచేసింది.

ఇంతలో దసరా ఉత్సవాలు వచ్చినవి. ఆ ఉత్సవాలలో ఒక రోజున రాధాకృష్ణ, సుశీల, పద్మావతిగార్ల సంగీతపు కచ్చేరీ జరిగింది. ఆ రోజున పద్మావతి అపర మీరాబాయిలా ప్రకాశించింది. సంగీతంలో సుబ్బులక్ష్మికి దీటనుపించుకుంది. పాడినపాటలలో ఒకటి మాత్రమే త్యాగయ్య కృతి. తక్కినవన్నీ ఈనాటి కవులలో ప్రసిద్ధికెక్కినవారి పాటలు, కృష్ణశాస్త్రిగారి ఊర్వశీ గీతమొక్కటీ, మురళీ గీతమొక్కటీ పాడింది.

“మోయింపకోయ్ మురళి మొయింపకోయ్!” అన్న పల్లవిలో రాధాదేవిలో ప్రతిభక్తునిలో, మురళీకృష్ణ దివ్యభావంవల్ల ఉద్భవించే పరమ మనోహరానందం రాగంలో అవరోహణంలో చూపించింది - "తీయ తేనియ బరువు మోయలేదీ బ్రతుకు” అని అనుపల్లవి ఎత్తుకొని, ఆ ఆనంద వివశత్వం, ప్రియా ప్రణయగాఢోత్కంఠితయైన రాధ ఆ విశ్వసౌందర్యంలో లయమూ కావాలి. లయము కాకుండా తన దివ్యపురుషునితో సాలోక్య, సారూప్య సామీప్యానందమూ పొందాలి.

ఆ పాట శ్రోతల హృదయాలు కరిగించినది. ఆనందంతో అనేకమంది స్త్రీల కన్నులనీరు జలజల ప్రవహించాయి.


★ ★ ★

(సప్తమ గుచ్చము)

“పద్మావతీదేవిగారికి గాయకులమైన మేమంతా 'గీతాదేవి' అని బిరుదు ఇస్తున్నాము.” అని రాధాకృష్ణ ఆ సంగీతసభ అనంతరం, పద్మావతి సంగీతాన్ని మెచ్చుకుంటూ ఉపన్యాసం ఇచ్చి ముగించాడు. సభ అంతా కరతాళ ధ్వనులు నిండిపోయాయి.

అక్కడనుండి 'గీతాదేవి' సంగీత కచ్చేరీలు మద్రాసులో ఎన్నో జరిగాయి. కొన్ని ఆంధ్ర విద్యా సంస్థల పోషణార్థం ధనం వసూలు చేయడానికి గీతాదేవి సంగీత సభలు ఏర్పాటయ్యాయి. ఒక్కొక్క గానకచ్చేరీకి పదివేలు, పదిహేనువేల రూపాయలు రాబడి రాసాగింది. ఆంధ్ర తుఫాను నిధికీ, తమిళదేశం వరదలనిధికీ, ప్రభుత్వంవారు ఆ బాలికను కచ్చేరీలకు ప్రార్ధించి ఒప్పించుకొన్నారు.

'గీతాదేవి' ప్రసిద్ధనామమయినది. గ్రామఫోను కంపెనీలవారు ఆమె పాటలు రికార్డు తీయ ఏర్పాట్లు చేసుకొన్నారు. ఒక ప్రసిద్ధ ఆంధ్ర సినిమా కంపెనీవారు ఆమెను తమ చిత్రంలో ఉపనాయికగా రమ్మనమని పిలిచారు. ఆమె రానని చెపితే, ఆమె కంఠం నాయికకు గాంధర్వ కంఠంగా బుక్ చేసుకున్నారు.

వీటి అన్నింటికీ కారణం రాధాకృష్ణ. రాధాకృష్ణ పద్మావతీ చరణచారణ చక్రవర్తి అయిపోయినాడు. ఒక్కరోజు పద్మావతిని చూడకపోతే అతనికి తోచదు. తాను ఆంధ్ర మహిళాసభకు సుశీలను పంపి పద్మావతిని తీసుకు రమ్మంటాడు. 'గీతాదేవి'కి చదువు సాగటంలేదు. పద్మావతికి మతిలేదు.

మహిళాసభ విద్యా సంస్థాధ్యక్షురాలు పద్మావతిని తన గదిలోనికి పిలిపించుకుంది. “ఏమమ్మా పద్మావతీ! నువ్వు సంగీతంలో అతి ప్రసిద్ధురాలివైపోయినావు, నువ్వు మా సభలో ఉండటం కీర్తే! కాని విజయం పొందదలచుకొన్న పరీక్షమాట ఏమిటి? ఇంతవరకూ చదువులో బాగా వచ్చావు. కాని, ఈ సంగీతం గొడవవల్ల కాబోలు మొన్న అర్ధసంవత్సరం పరీక్షలో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. పరీక్షలు ఇంక నాలుగు నెలలే ఉన్నాయి. ఇప్పటినుండి గట్టిగా చదవకపోతే నువ్వు పరీక్షలకు వెళ్ళి లాభం వుండదు. నీకు సంగీతంలో పేరు రావడం, నీవల్ల లోకానికంతకూ ఉపకారం జరగడం మాకందరికీ ఎంతో ఆనందంగానే వుంది. అయితే మరి చదువుమాట?" ,

“అవునండీ. అదే నేనూ ఆలోచిస్తున్నాను. ఇంతా కష్టపడి చదివి, పరీక్షకు వెళ్ళకపోతే ఏమిలాభం? ఈ ఏడు పరీక్షకు వెళ్ళకపోతే ఇంక జన్మలో పరీక్షకు వెళ్ళలేను.”

“కాదుమరీ! కనుక బాగా ఆలోచించుకో. పరీక్షకు వెళ్ళడం మానివేస్తే నువ్వు హాస్టలునుంచి వెళ్ళిపోవాలి. నిరుడు పరీక్షలో నెగ్గని ఇద్దరు బాలికలు ఈ నాలుగు నెలలు ఇక్కడే వుండి చదవాలని, వస్తామని వ్రాసారు. వారిని నీ గదిలో ప్రవేశపెట్టగలను.”

“నేను పరీక్షకు వెళ్ళితీరుతానండి!” “అయితే సంగీతం? పేరు? సభలూ? రికార్డులూ? సినీమా?”

“ప్రస్తుతం అన్నీ మానేస్తాను!”

“రేపు రాధాకృష్ణగారు వచ్చి బలవంతం చేస్తారు. సుశీలగారు వచ్చి బ్రతిమాలుతారు!”

“అవన్నీ లెక్కచేయనండీ! పరీక్షకని సంకల్పంతో కదా ఇక్కడ చేరిందీ! అవి పూర్తిచేసుకుని తీరుతాను.”

“ఇంక నేను చేసే ఏర్పాట్లు విను. నీ భర్తగాని, నరసింహమూర్తి మేష్టారుగాని సాయంకాలం వచ్చి మాట్లాడవచ్చును. సుశీలగారూ, రాధాకృష్ణగారు వస్తే నీకు తీరుబడి లేదన్న మాట! సంగీత బేరాలు ఏవీ ఒప్పుకోడానికి వీలు లేదు. ఏవైనా సరే! ఎంత గొప్పవాళ్ళయినా సరే! సాయంకాలం షికారు బందు! ఇవి ఇష్టమైతే పరీక్షకు దరఖాస్తు పెట్టిస్తాను. లేదంటావూ నువ్వు మీ ఇంటికెళ్ళవలసిందే!”

ఈ మాటలు ఖచ్చితంగా అధ్యక్షురాలు అంటూ వుంటే పద్మావతి ముఖం వెలవెలపోయింది. అది చూచి, "నేనింత నిష్కర్షగా అంటూ వుంటే మనస్సులో బాధపడకు తల్లీ! నీకోసమే చెప్పాను. ఏ విషయమూ వేళాకోళంగా చూడకూడదు. తర్వాత నీ ఇష్టము” అని అన్నది. పద్మావతి ఆలోచించుకుంటూ వెళ్ళిపోయింది.

2

నరసింహమూర్తి మాష్టారుకు ఏదో ఆవేదన పట్టుకుంది. పద్మావతి విషయం చూస్తూవుంటే అతనికి మతిపోయింది. ఈనాడు ఆమె జీవితం తనకందని వేగంతో ప్రవహిస్తోంది. ఆ మహాఝంఝామారుతంలో తానో మూలకు కొట్టుకొనిపోయినాడు. అతణ్ణి గమనించేవారే లేరు. రాధాకృష్ణ “ఓహో!” అంటాడు. “మేష్టారూ! ఎప్పుడు వచ్చారండోయ్!” అంటాడు. “సుశీల లోపల ఉందండీ!” అంటాడు; ఆ తర్వాత ఆ ముక్కలూ అనడం మానివేశాడు.

రాధాకృష్ణ గానమేళంలో, మొదట అతడు ఫిడేలు వాయించేవాడు. ఆ రోజుల్లో “మేష్టారూ! ఈ పాట ఈ రకంగా ప్రారంభిద్దాము” అనేవాడు. “గురువుగారూ, ఇప్పుడు ఆ ఫ్లూటు ఈ సంగతులు వేస్తే బాగుంటుంది కాదండీ!” అనేవాడు. నేడు అలాంటి సలహాలు అడగడు. ఆయన రాకపోయినా రాధాకృష్ణ మేళం సాగిపోతూనే వుంది. రమ్మనమనీ అడగడం తగ్గించాడు.

అప్పుడంత గౌరవం చేసిన రాధాకృష్ణ నేడింత ఉదాసీనం వహించాడేమిటి?

నరసింహమూర్తి మేష్టారి హృదయం కృంగిపోయింది. అటు బుచ్చి వెంకట్రావూ తనకు దూరమైపోయాడు. ఇటు పద్మావతీ చదువులో పడిపోయింది.

బుచ్చి వెంకట్రావు సుశీలాద్వితీయుడై లోకం అంతా తిరుగుతున్నాడు. ఇప్పుడంత త్రాగడానికి వీలులేదు. పట్టణంలో ప్రొహిబిషను వచ్చింది. రహస్యంగా ఏలాంటి బుడ్లయినా దొరుకుతాయి. కాని అతనికి ధైర్యం లేకపోయింది. త్రాగుడు అతనికి జీవితంలో భాగం కాలేదు. పైగా త్రాగుడు కన్న నిషాకలిగిన సుశీల స్నేహం దొరికింది. ఆ స్నేహంలో

బుచ్చి వెంట్రావుకు పద్మావతి అవసరం లేదు. నరసింహమూర్తి మేష్టారూ అవసరంలేదు అనిపించింది.

రాధాకృష్ణకు సుశీల అంటే నమ్మకమే! మలబారు నాయర్లమ్మాయి. సంగీతమూ నాట్యమూ తిరువాంకూరులో నేర్చుకుని, మద్రాసులో భరతనాట్యంలో అందెవేసిన చేయి కావాలని ఆ మహానగరం వచ్చింది. మదరాసులో కామాక్షీశ్వర పిళ్ళెదగ్గిర తంజావూరి విధాననాట్యం నేర్చుకునే రోజుల్లో రాధాకృష్ణ కామాక్షీశ్వర పిళ్ళె ఇంటికి వచ్చినాడు. కామాక్ష్మీశ్వరపిళ్ళెకు అతడు శిష్యుడు.

రాధాకృష్ణ తనగతి ఏమిటి అని పదేళ్ళ క్రిందట తటపటాయించే రోజుల్లో కొంతకాలం కూచిపూడి వెళ్ళి, నాట్యం నేర్చుకున్నాడు. కొన్నాళ్ళు వేదాంతం లక్ష్మినారాయణగారికి శిష్యుడయ్యాడు. అతడు ఆడవేషంవేసి నాట్యం చేస్తే ఆడవాళ్ళ నాట్యంకన్న, అతని నాట్యం బాగుంటుందంటున్నారు. “వేషము స్థానం నరసింహారావుగారి చిన్ననాటి ఆడవేషం అంత బాగుంటుంది.” అని ఒక నాట్యకళా విమర్శకుడు వ్రాసినాడట. ఆ వెనుక తంజావూరి విధానంకోసం అతడు మదరాసు వచ్చి కామాక్షీశ్వరపిళ్ళెకు శిష్యుడయ్యాడు. అక్కడ తోటి శిష్యురాలైన సుశీలతో ఈతనికి పరిచయం గాఢమైనది.

సుశీలకు ఆమె ఇంటిదగ్గర కూచిపూడి నాట్యం నేర్పినాడు. ఆమెకు ఆంధ్ర సంగీతం నేర్పినాడు. వారిద్దరి స్నేహమూ ప్రేమగా మారింది. రాధాకృష్ణ సంగీత దర్శకత్వంలోకి ఉరికాడు. వివిధ వాద్య కుశలులైన వారిని చేర్చి, సంగీత మేళం ఏర్పాటు చేశాడు. ఎందులోనన్నా చొచ్చుకుపోయే జాతి గనుక అతడు మేళ విధానములో ప్రథమశ్రేణిలోకి వెళ్ళినాడు. వెంటవెంటనే ఒక సినిమా కంపెనీ అతన్ని సంగీత దర్శకుడుగా నియమించింది. వారు తీసే బొమ్మలో పాటలు దివ్యంగా, జనానురంజకంగా తయారై దేశమంతా మారుమ్రోగిపోయినవి. సుశీలాదేవి నాట్యమూ ప్రసిద్ధి వహించింది. రాధాకృష్ణ సుశీలలు రిజిష్టరు వివాహం చేసుకున్నారు. వారి వివాహానికి సినిమా ప్రపంచం, రసజ్ఞలోకం బంధుమిత్ర సమేతమై హాజరైంది. -

బుచ్చి వెంకట్రావుకు సుశీలకు స్నేహం లతలా అల్లుకుపోయి వారిద్దరూ విడవకుండా ఉండడమూ నరసింహమూర్తి మేష్టారుకు భయం వేసింది. వీళ్ళిద్దరూ ఎంతవరకు వెళ్ళినారో ఈ అతి స్నేహంలోంచి ఏ విషాద పరిణామం ఉద్భవిస్తుందో? రాధాకృష్ణ ఉద్దేశ్యమేమిటి? రాధాకృష్ణ మనస్తత్వం ఎలాంటిది? అతనికి ఇతర స్త్రీలతో సంబంధాలున్నాయా?

ఏమిటీ సినిమా ప్రపంచం! నీతి నియమాలకూ ఈ ప్రపంచానికి ఎక్కడా చుట్టరికమే లేదా? సినిమాలోకం సుడిగాలి లోకం. అతి అనేది తప్ప ఇంకోటి కనపడదు. ఆ వాతావరణంలో స్త్రీ పురుష సంబంధాలకు ఒక దారీ మార్గమూ లేదు. ఇక హద్దూపద్దూ లేదు. ఈ సినిమా వాతావరణం ఇతరమైన జీవిత పథాలకు కూడా ప్రసరించి దైనందిన నిత్య జీవితాన్ని కూడా కల్మషం చేస్తున్నది. నరసింహమూర్తి మేష్టారు గడగడ వణికిపోయాడు.