చీనా - జపాను/జపాను ప్రతికూల పక్షములు
రాష్ట్రములో ప్రవేశించి అచ్చటనున్న సోవియట్టు సేనాని హ్సూహ్సిసియాంగుషేను సేనలను కలుసు కొనెను. క్వెయిచొ, షెచ్వాను, సికాంగు, యున్నాను, కాన్సూ,షాన్సీ జిల్లాలను చేర్చి ఒక పెద్ద సోవియటు రాష్ట్రము ను నిర్మించెను.ఈవిధముగా ఇప్పటికి 398 జిల్లాలలో సోవియటు ప్రభుత్వము నెలకొల్పబడినది.ఇప్పటికి యెఱ్ఱ సైనికుల సంఖ్య 5లక్షలు.వీరిక్రింద 19 రాష్ట్రములున్నవి.వీటి పేరులు కియాంగ్సీ, క్వాంటంగు, ఫ్యూకీన్, షెకియాంగు, అన్వుహెయి, హోనాను, హ్యూపె, హ్యూనాన్, షెచ్వాను, క్వెయిచొ, యున్నాను, సికాంగు, షెన్సీ, కాన్సూ, హ్యోపేయి, ఫెంగ్టీను, కిరీను, హైలంగుకియాంగు.
జపాను ప్రతికూల పక్షములు
18-9-1931 తేదిన్ చీనాలోఒకపెద్ద ఖండమును జపాను ఆక్రమించుకొని మంచూకో సామ్రాజ్యమును స్థాపించినది.మరి నాలుగేళ్ళవరకు ఈవిజృంభణము ఇట్లే సాగినది.చీనాలో సుమారు సగము భాగము జపాను సామ్రాజ్యము క్రిందనో సైనికదళములక్రిందనో నలిగి వారికి లొంగిపోయినది.మంచుకో తరువాత జహోలు స్వాధీనమైనది.పిమ్మట చీనా“పెద్దగోడ”(గ్రేట్‌వాల్)చుట్టునున్న ప్రాంతమగు షాంఘయిక్వాను స్వాధీనమైనది. తరువాత లియాంగుటంగు జిల్లాలుని సైన్యములు నిరాయుధములు చేయబడినవి. పిమ్మట సూయనును, చాహార్, హోపేయి రాష్ట్రములను జపాను
ఒకటిగాచేసి చీనా ప్రభుత్వమునుండి విడదీసి“ఉత్తర చీనా స్వతంత్ర పరిపాలనాసభ” క్రింద ఉంచినది. అటు తరువాత హోపే, షాంటంగు, షాన్సీ రాష్ట్రములనంటియున్న ప్రదేశములను ఆక్రమించినది. వీనినన్నింటిని వలసరాజ్యముగా చేసికొనుటయే జపాను సంకల్పమని టానాకా మిమోరాండము వల్ల విశదమగుచున్నది.ఇవే వలసరాజ్యములైనచో తక్కిన ప్రాంతములు కూడ సులభముగ జపాను స్వాధీనమగుననుట నిస్సందేహము.
చీనానంతటిని ఈవిధముగా జపాను మ్రింగి వేయుచుండగా క్యూమింగుటాంగు ప్రభుత్వమేమిచేయుచున్నది?చియాంగుకెయిషేకు, వాంగుచిన్‌వెయ్, చాంగుహ్సియూలియాంగు మొదలగు క్యూమింగ్టాంగు సేనానులు జపాను నెదుర్కొనలేదు కదా,దానిని ప్రతిఘటింపనిశ్చయించుకొనిన కమ్యూనిష్టు దళములను రూపుమాప ప్రయత్నించు చున్నారు.దీనికంతటికిని వారు ఒకే కారణము చెప్పుచున్నారు.దేశములో శాంతి నెలకొననిదే విదేశప్రభుత్వ ములను తరుమ వీలులేదట.ఇందుకై చీనా జపానుల పరస్పర ఆర్థిక రాజకీయ సహాకారము అసరమట. కనుక జపాను ఆజ్ఞప్రకారము చీనాలో కమ్యూనిష్టు వాసనలు లేకుండాచేయుట ముఖ్యమట. ఇట్లు చేయుట వలన చీనా అంతటిని పూర్తిగా జపాను వలసరాజ్యముగా చేసి మహాద్రోహ మొనరించుచున్నామని వారు గుర్తించకున్నారు.
జపాను శృంఖలములలో చీనా చిక్కుకోకుండా కాపాడవలెనని తాపత్రయము పడే పక్షము చీనాలో ఒక్కటే ఉన్నది.అదియే చీనా సోవియటు రిపబ్లికుపక్షము.చీనా ప్రజలనందరినీ తనతో యేకీభవించి జపాను నెదురించు మని అదియెంతో ప్రబ్రోధము చేయుచున్నది.క్యూమింగ్టాంగు సోవియటు జిల్లాలలో జోక్యము కలిగించుకోకుండగా ఉండే షరతు పైని చీనాప్రభుత్వముతో సోవియటులు యేకమై జపాను నెదిరించగలమని వారు వాగ్దానము చేయుచున్నారు.చీనాప్రజలందరికిని వాగ్స్వాతంత్ర్యము, ముద్రణాస్వాతంత్ర్యము, సంఘస్వాతంత్ర్యము, ప్రదర్శనా స్వాతంత్ర్యము ఇచ్చుటకు తాము తోడు పడెదమని కూడా వారు వాగ్దానము చేయుచున్నారు.
ఇప్పటికే సగము చీనా, జపాను కాలిక్రింద పడినది. మిగిలినది కూడా పడిపోయి చీనా జాతీయ స్వాతంత్ర్య మడుగంటకుంటా ఉండవలెనంటే చీనా సత్వరముగా ఏదో ఒక నిశ్చయమైన మార్గమునకు రావలెను.ఇందుకై కూడా సోవియటు పక్షములే ప్రయత్నము చేయుచున్నవి.చీనాప్రజలలో యెవరెవరి కెన్నిఅభిప్రాయభేదములు సిద్ధాంతభేదములున్నను వానినన్నింటిని లక్ష్యముచేయక అందరును యేకమై జపానును ప్రతిఘటించవలెనని వారు ప్రబోధమును చేయుచున్నారు.“అఖిల చీనాపరిపాలనము”ను స్థాపించి సోవియట్టులతోను, జపాను ప్రతికూల మంచూరియా నివాసులతోను
ఒక ప్రచండమైన పక్షము నెలకొల్పవలెనని వారు తెలుపుచున్నారు.వీరందరును కలసి జపాను ప్రతికూల అఖిల చీనాసేనను నిర్మించవలెననిన్ని, అద్ సోవియట్టుల యెఱ్ఱసేనలతోను, జపాను ప్రతికూల మంచూరియా సేనలతోను కలసి జపానును ప్రతిఘటించవలెనని వీరు ఉద్బోధించుచున్నారు.ఈ సంగతులు వీరు 1-8-1935 వ తేదిని చీనా ప్రజలకు గావించిన విన్నపమువలన విశదము కాగలవు.
ఇటువంటి సంయుక్త ప్రజాప్రభుత్వము ఈ దిగువ వివరింపబడిన కార్యములను నెరవేర్చవలెనని వీరు నిర్దేశించుచుచున్నారు.
1.జపాను విజృంభణమును సాయుధబలసమేతముగా నిరోధించవలెను.జపాను ఆక్రమించుకొనిన రాష్ట్రములనన్నింటిని తిరిగీ స్వాధీనము చేసుకొనవలెను.
2.చీనాలో కాటకములు రాకుండాచేయవలెను.నదులకు ఆనకట్టలను కట్టి నీటినిపొలములకు కాలువలద్వారా పారించి వ్యవసాయమునకు నీటియిబ్బంది లేకుండా చేయవలెను.ఎక్కడెక్కడ కాటకము ప్రాకుచున్నను వెంటనే తక్కిన ప్రాంతములవారు సహాయమునకై గడంగవలెను
3.జపాను సామ్రాజ్యమునకు చీనాలో ఎటువంటి ఆస్తులున్నను వానిని హరించి, జపాను ప్రతికూల సమరము లకు వలయు ఖర్చులక్రింద వినియోగించవలెను. 4.దేశద్రోహులుగాను జపానుయేజంట్లుగాను రుజువైనవారి బియ్యము, గోధుమలు మొదలగు అస్తులనెల్లను హరించి నిరుద్యోగులు ,పేదలు, సిపాయీల సహాయమునకై పంచవలెను. 5.దుర్భరమైన పన్నులను తొలగించవలెను. ఆర్థిక వ్యవహారములను నాణ్యపద్ధతిని చక్కచేయవలెను. జాతీయ ఖర్చులను మితము చేసి దూబరా వ్యవహారములను మానివేయవలెను.
6.కూలులు, జీతములు యెక్కువ చేయవలెను.కర్షక కార్మికులయొక్కయు, సిపాయూలు విద్యాధికుల యొక్కయు సంసారములను అభివృద్ధి పరచవలెను.
7.ప్రజలందరకును సామాన్య ప్రాధమిక హక్కులనొసంగవలెను.రాజకీయఖైదీల నందరను విడుదలచేయవలెను.
8.ప్రజలందరకు ఉచితముగ విద్య నేర్పవలెను.పిల్లలకు బడియీడు గడువగానే జీవనోపాధిమార్గములు కల్పింపవలెను.
9.చీనాలో నివసించుచున్న వివిధ దేశీయులకును సమానహక్కులు ఒసగవలెను.చీనాలో నివసించు విదేశీయుల యొక్కయు, విదేశములలో నివసించు చీనాప్రజల యొక్కయు హక్కులను ఆస్తులను ఇండ్లను వృత్తులను సంరక్షించవలెను.
10.జపాను సామ్రాజ్య తత్వవిరోధులగు వారందరితోను స్నేహములు చేయవలెను;ముఖ్యముగా జపాను కార్మికులు, కొరియా, ఫార్మోజా మొదలగు దేశముల ప్రజలతో వీరు స్నేహముగా ఉండవలెను. వీరందరికి ఒక్కరీతి శత్రువగు జపానుప్రభుత్వముతో యుద్ధము చేయవలెను.
11.చీనా జాతీయవిముక్తి ప్రయత్నము యెడ సహకారమును చూపు జాతులన్నింటియొక్క సమ్మేళనము నొకదాని నేర్పరచవలెను;మరియు చీనా జపానులకు యుద్ధము సంభవించునెడల యేపక్షమునందును చేరక ఉదార తటస్థభావముతో వర్తింపగల జాతులు ప్రభుత్వములు అన్నింటితోస్నేహసంబంధముల నేర్పరచవలెను.
ఈవిన్నపము జపాను ప్రతికూలపక్షముల వారకందరికిని బాగా నచ్చినది.చీనా ఈశాన్యప్రాంతములందున్న “సంయుక్త జపాను ప్రతికూల సేన” వారు?మంచూరియాలో పితూరీలు రేపి జపానుదేశమును రెచ్చగొట్టుచున్న స్వచ్ఛంద సేవకదళములవారు;క్యూమింగుటాంగు క్రిందనే ఉన్న వేలకొలది కర్షకకార్మిక సైనిక విద్యాధిదళముల వారు ఈ సన్నాహమునకు చేయూత నిచ్చుచున్నారు.షాంఘే, కాంటను, హాంకో, చాంగ్షా, టీన్‌స్టిను, పీపింగు, ఫెంగ్టీను, హార్బన్ మొదలగు పారిశ్రామిక నగరములలో జపాను సామ్రాజ్య ప్రతికూలములగు సమ్మెలు లేచుచున్నది.షాంఘే, కాంటను, ఫ్యూచో, స్వాటో మొదలగు నగరములలో డాకులలో పనిచేసేవారు జపాను వస్తువులను,జపానుయుద్ధ పరికరములను చేతులతో తాకనైన తాకమని ప్రతిఘటించిరి. షాంఘక యివాను, జెహోలు నగరములను జపాను అణచివేయ బూనినప్పుడు గనుల పనివారు తమ సుత్తులను, కర్షకులు తమ కొడవళ్ళను పట్టుకొని జపానువారి నెదరించుటకు నిలబడిరి.క్యూమింగుటాంగు సేనలు కూడా తమసేనానులు ఒసంగిన దేశద్రోహకరములగు ఆజ్ఞలను తిరస్కరించి తమ తుపాకులను జపాను వారి మీదకే గుఱిపెట్టిరి.జపాను సామ్రాజ్యతత్వము నెదరించుటకును జాతీయనీతి సంరక్షణమునకును చీనాయంతయు ఒక్క పెట్టున కృతనిశ్చయముతో నిలచియున్నది.
గత రెండుసంవత్సరముల చీనాచర్యలను తిలకించిన వారికి చీనాఉద్యమములో ఈ దిగువ తెలుపబడిన ప్రధానలక్షణములు గోచరింప గలవు;
1.చీనాలో జపాను ప్రతికూల సేన 5 లక్షల వరకు ఉన్నది.ఇందలి సైనికులందరూ కర్షక కార్మికులే.ఫెంగ్టీను నగరము నందలి గనులపనివారలు రైల్వే పనివారలు జపాను ప్రతికూల మంచూరియా పితూరీదారులతో కలసి పోరాడిరి.కొరియాకును కిరీనుపాన్షేకు, హ్వాటీను రాష్ట్రముల తూర్పు పశ్చమ భాగములకును మధ్యనున్న చీనా రాష్ట్రములలోని కర్షక కార్మికులు“జపాను ప్రతికూల జనసముదాయపు సేన ”లో చేరుటయేకాక“ప్రజల వొప్లవ ప్రభుత్వము” నొకదానిని నెలకొల్పిరి.వారు ఈదిగువ ప్రణాళికను అవలంబించిరి.
(అ) మంచూరియాలో జపాను సామ్రాజ్యమువారి నావిక సైనిక వైమానిక స్థానమునెల్ల నిర్మూలించుట.
(ఆ)“ప్రజల విప్లవ సేన”లో“మంచూకోసైనికులను”లీనము చేసుకొనుట.
(ఇ)“మంచూకో” జపాను ప్రభుత్వముల ఆజ్ఞలనెల్ల తిరస్కరించుట.
(ఈ)“మంచూకో” లో జపాను సామ్రాజ్యహితాభిలాషులగువారి ఆస్తులనెల్ల హరించి జపాను ప్రతికూల యుద్ధకార్యములకై వినియోగించుట.
(ఉ)ప్రజల ప్రచండదీక్షను పెంపొదించి పితూరీయుద్ధములలోనికి వారిని పురికొల్పుట.
(ఊ)గ్రామములలో కర్షకసభలను స్థాపించుట.
(ఋ)శత్రువును ఓడించుటకై కర్షక కార్మిక సైనిక విద్యాధికులను సంయుక్త ప్రతిఘటన సంఘముగా యేర్పాటు చేయుట:మూడు షరతులమీద జపాను ప్రతికూల సంఘములలోచేరుట.వీనిలోమొదటిది, జపాను మంచూకో ప్రభుత్వములతో పోరాడి వారికేవిధముగా లొంగిపోని యేర్పాటులు చేయుట.రెండవది జపాను ప్రతికూల సైనిక రాజకీయ సమరములలో కర్షకకార్మిక సైనికులకు సంపూర్ణ సహాయము చేయుట కంగీకరించుట. మూడవది, ప్రజలను ఆయుధోపేతులుగాచేయుట. (ౠ)మంచూకోను గురించి లిట్టను కమిటీవారు తయారుచేసిన నివేదికను ప్రతిఘతించి, సోవియటు రష్యా ప్రభుత్వముతో కలసి యుండుట కేర్పాటు చేయుట.
(ఌ)చీనాజాతిని శత్రువులకు ఒప్పచెప్పి జాతీయ కళంకమునకు కారణమైన క్యూమింగుటాంగును, నాంకింగు ప్రభుత్వమును కూలద్రోయుట.
(ౡ)చీనా ఈశాన్య భాగము లందున్నట్టియు జపానుచే ఆక్రమింపబడినట్టియు ప్రదేశములను స్వాధీనము చేసుకొనుట, ఇతర విదేశ సామ్రాజ్య ప్రభుత్వములు ఇట్టి ఆక్రమణములు చేయకుండా చీనాను సంరక్షించుట.
(ఎ)జపాను సామ్రాజ్యమున్ను ఇతర సామ్రాజ్యపూంచీదారీ సంఘములున్నుచేరి పీల్చిపిప్పిచేయుచున్న కొరియా మాంగోలియా ప్రజలతో సన్నిహిత స్నేహరీతిని వర్తించుట.
(ఏ)ప్రపంచము నందంతటను ఉన్న కార్మిక వర్గముతో సన్నిహిత సంబంధము నేర్పరచుకొని వారందరికిని పరమశత్రువగు సామ్రాజ్యతత్వమును యెదుర్కొనుట.
(ఐ)ప్రజల విప్లవసేనను నిర్మించినాయకత్వము వహించుచున్న చీనా కమ్యూనిష్టు పార్టీకి సర్వవిధములను సహాయముచేయుట.
(2)చీనా గ్రామములందెల్ల జపాను సామ్రాజ్యప్రతికూల సంఘములు,ఇతర విదేశ సామ్రాజ్య తత్వప్రతికూల సంఘములు,ఇతర విదేశీ సామ్రాజ్య తత్వప్రతికూల సంఘములు,ఈవిధమైన ప్రపంచసంఘముల శాఖలు, స్వకీయ
సంరక్షణా సంఘములు శాఖోపశాఖలతో వెలయుచున్నవి.సామ్రాజ్య ప్రతికూల ప్రదర్శనములు కేకలు చెలరేగు చున్నవి.విద్యార్థులందరును వీరికి పట్టుకొమ్మలై ప్రబోధమును రేకెత్తించుచున్నారు.నాంకింగు ప్రభుత్వము చేసిన దేశద్రోహచర్యలను ప్రకటించి ప్రజాపరిపాలక సంస్థల నిర్మించుచున్నారు.
ఈవిధముగా ఒకప్రక్కను విదేశీ సామ్రాజ్యముల మీదను, వేరొక ప్రక్కను దేశద్రోహులమీదను ద్వేషము పెచ్చుపెరుగుచున్నది.సోవియట్టుతత్వ మొకప్రక్కను యెఱ్ఱసేనలు వేరొక ప్రక్కను వర్థిల్లుచున్నవి.క్రమక్రమముగా నాంన్కింగు ప్రభుత్వముయొక్క పలుకుబడి క్షీణించుచున్నది.నాంకింగు ప్రభుత్వమునకు ప్రస్తుతము నేతగను సర్వాధికారిగను ఉన్న చియాంగుకాయ్‌షేకు జపాను పక్షపాతముతో వర్తించుచున్నాడన కారణమున ఇతరపక్ష నాయకుడు చాంగుహుగ్సాలియాంగు అతనిని అరెస్టుచేసి నెలదినముల వరకు విడువలేదనిన, నాంకింగు ప్రభుత్వము పలుకుబడి యెంతవరకు తగ్గినదో విశదము కాగలదు.చియాంగుకాయ్‌షేకు తనకు జపాను పక్షపాతమేమియును లేదనియు, జపానుతో తీవ్రవిరోధము సాగింతుననియు వాగ్దానము చేసినపైని అతనిని విడుదలచేసి తిరిగీ అధికారస్థానమున నిలబెట్టిరి.నేటికిని అతనే చీనా ప్రభుత్వమునకు అధికారి.అతను కూడా జపానుతో రగిడీ పెట్టుకోకుండా శాంతిని స్నేహమును వాంఛించుచున్నను చైనా హక్కులకేమాత్రమైన భంగము కలిగెడి శాంతి అక్కరలేదని ప్రకటించినట్లు 1937 జూలై 19 వ తేది కూలింగు నగరమునుండి వచ్చిన వార్తలవలన తెలియుచున్నది.చీనానుండి ఒక్కముక్కయైనను చీలిపోవుట అతనికిష్టము లేనట్లు తెలిపినాడు.చీనా జాతీయత నశించకుండుటకై అతను సర్వవిధములను తాపత్రయము పడుచున్నాడు.చీనాలో యేభాగమునకుగాని అబిస్సీనియాకు పట్టినగతి పట్టకూడదని అతను భీష్మించియున్నాడు.లూకోచియావో నగరములో జపానువారు తమ సేనలు నింపినను చీనాసేనకు కూడా అక్కడ కిక్కిరిసియే యున్నవి.జపానుకు సంపూర్ణముగా గెలుపాశ లేనందువల్లనే శాంతిరాయబారములుకూడ నడుపుచుండుటకు కారణమని మనము ఉహించవచ్చును.జపాను యేదో సాకుపైని ఉత్తరచీనాలో యుద్ధమును ప్రకటించినను రాయబారముల మాట మరువకున్నది,చీనాకూడా జపాను రాయబారములను తృణీకరించుచు యద్ధమునకు సంసిద్ధముగ నున్నట్లే ప్రకటించుచున్నది. ఫలితంమెట్లుండునో చూడవలసియున్నది.