చిరస్మరణీయులు, మొదటి భాగం/సర్దార్‌ హిక్మతుల్లా ఖాన్‌

వికీసోర్స్ నుండి

9. సర్దార్‌ హిక్మతుల్లా ఖాన్‌

( - 1857)

స్వదేశీ పాలకులూ, ప్రజలు మాత్రమే కాకుండా ఈస్ట్‌ ఇండియా కంపెనీలోని ఉన్నతాధికారులు కూడా ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారు. మాతృభూమి మీదఉన్నప్రేమతో ఆయుధం పట్టి ముందుకు సాగిన అలనాటి యోధానుయోధులలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఉన్నతాధికారి అయిన సర్దార్‌ హిక్మతుల్లా ఖాన్‌ ప్రముఖులు.

1857లో ఉత్తర పదశ్‌ రాష్ట్రంలోని ఫతేపూర్‌ జిల్లాకు డిప్యూటీ కలక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు హిక్మతుల్లా ఖాన్‌. స్వదేశీయుల మత సంబంధిత వ్యవహారాలలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారుల జోక్యాన్ని వ్యతిరేకించిన ఆయన 1857లో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ప్రజ్వరిల్లగానే డిప్యూటీ కలక్తర్‌ పదవిని త్యజించి కంపెనీ పాలకుల తరిమివేతకు 1857 జూన్‌ 10న సమర శంఖారావం పూరించారు.

ఈ ప్రతికూల పరిస్థితులకు దిమ్మెర పోయిన కంపెనీ ప్రభుత్వం తేరుకొనేలోపు ఫతేపూర్‌ను ఆధీనంలోకి తెచ్చుకుని కంపెనీ జైళ్ళ లోని ప్రజలను విడుదల చేసి, ఖజానాలోని తొమ్మిది లక్షల రూపాయలను స్వాధీనం చేసుకుని స్వతంత్ర పాలనకు అంకురార్పణ చేశారు. సర్దార్‌ హిక్మతుల్లాకు దారియాన్‌సింగ్, శివదాయాల్‌సింగ్, బాబా గయాదిన్‌ దుబే, మౌల్వీ లియాఖత్‌ ఆలీ, మౌల్వీఅహ్మదుల్లా, జనరల్‌ తిక్కా సింగ్, జ్వాలా ప్రసాద్‌ లాంటి యోధులంతా అండగా నిలిచారు.

ఈ పరిణామాలను ఉపేక్షిస్తే బ్రిటిష్‌ ఆధిపత్యానికి భరతగడ్డ మీద నూకలు చెల్లగలవని భయ పడిన లార్డ్‌ కానింగ్, తిరుగుబాటును కర్క శంగా అణిచివేయాల్సిందిగా అధికారులకు ఆఘమేఘాల మీద ఆదేశాలిచ్చాడు. ఆ ఆదేశాలందుకున్న అధికారులు ప్రజల మీద, తిరుగుబాటు యోధుల మీద విరుచుకుపడి చిత్రహింసలకు, కాల్చివేతలకు గురిచేశారు. అయినా స్వాతంత్య్ర సమరయోధులు వెనక్కు తగ్గలేదు. స్వదేశీపాలకులపై దాడులకు, కుయుక్తులకు పేర్గాంచిన జనరల్‌ హ్యావ్‌లాక్‌, జనరల్‌ రోనాల్డ్ లను రప్పంచి, తిరుగుబాటు యోధులను అణిచి వేసేందుకు లార్డ్‌ కానింగ్ ప్రత్యేక ఆదేశాలిచ్చాడు. ఆ ఆదేశాలు అందుకున్న కంపెనీ సైన్యాలు ముందుకు కదిలాయి. ఆంగ్లసైన్యాలు వస్తున్నాయన్న వర్తమానం అందుకున్న హిక్మతుల్లా మాతృభూమి రక్షణలో ప్రాణాలర్పించడానికి సిద్దమైన వీరసైనికులతో కలసి పోరుకు సిద్ధమయ్యారు.

స్వతంత్ర పాలనను పరిరక్షించుకోడానికి తెగింపుతో నిలచిన సర్దార్‌ హిక్మతుల్లా అనుచరు లతో నేరు గా తలపడటం అసాధ్య మని గ్రహంచిన ఆంగ్ల సైన్యాధికారులు ఎత్తులు వేసి, ఆయన అనుచరులలో పదవులకు, ధానానికి ప్రలోభపడే ద్రోహులను చేరదీసి ఆశలు చూపి లోబర్చుకున్నారు. అనంతరం జనరల్‌ హ్యావ్‌లాక్‌ నాయకత్వంలో కంపెనీ సైన్యం కొంతమేరకు బలహీనపడిన హిక్మతుల్లా ఖాన్‌ దాళాలపై విరుచుకు పడింది. సర్దార్‌ అనుచరులు కంపెనీ బలగాలను వీరోచితంగా ఎదుర్కొన్నప్పటికి కుయుక్తులతో పోరాటం సాగించిన కంపెనీ బలగాలదే చివరకు పైచెయ్యి అయ్యింది.

ఆ సమయంలో సహచరుల సలహా మీద హిక్మతుల్లా ఖాన్‌ పోరాట భూమి నుండి తప్పుకున్నారు. ఆయనను బంధించేందుకు బ్రిటిష్‌ సైన్యాధికారులు తమ బలగాలతో వెంటాడారు. చివరకు నమ్మక ద్రోహులిచ్చిన సమాచారంతో కంపెనీ బలగాలు హిక్మతుల్లా ఖాన్‌ రహస్యంగా గడు పుతున్న ప్రాంతాన్నిచుట్టుముట్టి ఆయనను నిర్బంధించాయి. ఆయన పట్ల అత్యంత కిరాతకంగా వ్యవహరించి, ఆ తరువాత విచారణ తంతు జరిపించిన కంపెనీ పాలకులు ఆయనకు ఉరిశిక్ష విధించారు.

ఆ తీర్పు మేరకు 1857 జూలై 12న హిక్మతుల్లా ఖాన్‌ను ఫతేపూర్‌లోని ప్రస్తుత ముస్లిం ఇంటర్‌ కళాశాల వద్ద గల చింతచెట్టుకు బహిరంగంగా ఉరితీశారు. ఆ మహావీరుని బౌతికకాయాన్ని ఖననం చేయకుండా వారం పాటు చెట్టుకు వ్రేలాడదీశారు. ఆనాడు సర్దార్‌ హిక్మతుల్లా ఖాన్‌ వెంట నడిచిన యోధులను మాత్రమే కాకుండా పిల్లలు-పెద్దలు అని చూడకుండా ప్రతి ఒక్కరినీ వెంటాడి, వేటాడి కిరాతకంగా వధించారు. ♦