Jump to content

చిరస్మరణీయులు, మొదటి భాగం/హాజీ షరియతుల్లా

వికీసోర్స్ నుండి

33

8. హాజీ షరియతుల్లా

(1780-1840)

స్వాతంత్య్రోద్యమ చరిత్రలో విప్లవకారులకు స్పూర్తిని ప్రసాదించిన ఉద్యమాలలో ఫరాజీ తిరుగుబాటు ప్రముఖ స్థానం పొందింది. ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులు భారత దేశంలో నిలదొక్కుకుంటున్న సమయంలో బ్రిటిషర్ల మీద తిరుగుబాటు ప్రకటించి ప్రజలను, ప్రధానంగా గ్రామీణ రైతాంగాన్ని, చేతి వృత్తులవారిని ఏకం చేసి పోరుబాటన నడిపించిన ఫరాజీ ఉద్యమనేత హాజీ షరీయతుల్లా.

1780లో తూర్పు బెంగాల్‌లోని ఫరీద్‌పూర్‌ జిల్లా, బహదూర్ర్‌ గ్రామంలో ఆయన జన్మించారు. తండ్రి అబ్దుల్‌ జాలిబ్‌. తండ్రిది చేనేత వృత్తి. షరియతుల్లా 18వ ఏటనే మక్కా వెళ్ళి ధార్మిక గ్రంథాలను అధ్యయనం చేసి పండితుడిగా రాటుదేలారు. అ సందర్భంగా వహాబీ ఉద్యమ నిర్మాత సయ్యద్‌ అహమ్మద్‌ బరేల్వీ, మహాయోధుడు టిటూమీర్‌లను కలుసుకున్నారు. ఆ చర్చల పర్యవసానంగా తనదైన ధార్మిక-లౌకిక మార్గాన్నినిర్దేశించుకుని 1802లో ఫరీద్‌పూర్‌ చేరుకున్నారు.

స్వదేశం చేరు కోగానే మక్కాలో నిర్ణయించుకున్నలక్ష్యాల సాధనకు ప్రస్తు త బంగ్లాదేశ్‌ రాజధాని ఢకా సమీపాన గల నవాబారి గ్రామాన్ని కేంద్రంగా చేసు కుని ధార్మిక బోధనలతో ఆరంభించి క్రమంగా మాతృదేశాన్ని ఆంగ్లేయుల పాలన నుండి విముక్తం చేయడానికి

చిరస్మ రణీయులు 34

ప్రజలను ఉద్యమదిశగా ప్రేరేపిస్తూ ముందుకు సాగారు. ఆయన ఉద్యమం ఫరాజీ ఉద్యమంగా, ఆయన అనుచరులు ఫరాజీలుగా చరిత్రకెక్కారు.

ఫరాజీ ఉద్యామాన్ని ఉదృతం చేసేందుకు షరియతుల్లా గావించిన పర్యటనలలో గ్రామీణులు, ప్రదానంగా రైతులు, కుల వృతులను అనుసరిసున్న కుటుంబాలు పడుతున్న వెతలకు ఆంగ్లేయ పాలకవర్గాలు, వారి తొత్తులైన జమీందారులు, మహాజనులు, అధికారులు ప్రధాన కారణమని షరియతుల్లా గ్రహించారు. ఆ వర్గాల పీడన నుండి ప్రజలను తద్వారా తమ గడ్డను విముక్తం చేసేందుకు ఆయన సిద్దపడ్డారు . ఆ ప్రయత్నంలో షరియతుల్లా సాధించిన విజయాల వలన ఫరాజీ ఉద్యమం బాగా విస్తరించి భారీ అనుచర వర్గం ఏర్పడింది. ఆ అనుచరులతో ఆయన ప్రజల పక్షంగా పలు పోరాటాలు సాగించి ఆంగ్లేయుల మీద, స్వదేశీ జమీందారులు, ప్లాంటర్ల మీద విజయాలు సాధించారు.

ఆంగ్లేయ ప్లాంటర్లు, జమీందారులు, మహాజనుల దోపిఫీకి వ్యతిరేకంగా తిరుగుబాటుకు షరియతుల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన పిలుపుకు స్పందించిన ఫరాజీలు ఎక్కడ అరాచకం, అవినీతి, అన్యాయం ఉంటే అక్కడల్లా ప్రత్యక్షమయ్యారు. ప్రజాకంటకుల ఆటకట్టించి ప్రజలకు అభిమానపాత్రులయ్యారు. అవాంఛనీయ శక్తులకు అండగా నిలుస్తున్నఆంగ్లేయ పాలకవర్గాల అణిచివేత వికృతరూపం ధరించే కొద్ది ప్రజలు మతం, కులం, వృతులకు అతీతంగా షరియతుల్లాకు చేరు వయ్యారు. ఆంగ్లేయుల పెత్తనం, జమీందారుల దోపిడి, ప్లాంటర్ల కిరాతక చర్యల నుండి తమను కాపాడేందుకు తరలి వచ్చిన రక్షకుడిగా షరీయతుల్లాను, ఆయన సహచరులను అభిమానించి గౌరవించారు.

ఉద్యమబాటన ప్రజలకు మార్గదర్శకత్వం వహిస్తూ, పాలకవర్గాల చట్టపరమైన ఉచ్చులలో చిక్కుకోకుండా హాజీ షరియతుల్లా జాగ్రత్త పడినందున పోలీసులు, చట్టాలు, కోర్టులు ఆయన దారి చేరలేక పోయాయి. అరాచకాన్ని ఎదుర్కోవటం మాత్రమే కాకుండా ప్రజలలో స్వేచ్ఛాకాంక్షను, స్వతంత్ర భావాలను ఉద్దీపింపచేయడంలో షరియతుల్లా ప్రబోధాలు, ఆయన నిర్మించిన ఫరాజీ ఉద్యమం ఎంతగానో ఉపయోగపడింది.

అరశతాబ్దికి పెగా ఉధృతంగా సాగి, మరో అర్దశతాబ్ది పాటు సమకాలీన సమాజాన్ని ప్రభావితం చేసిన హజీ షరియతుల్లా సాహసోపేతమైన చర్యలు స్వాతంత్య్రోద్యమంలోని సాయుధా పోరాట యోధులకు ప్రేరణగా నిలిచాయి. ఆది నుండి అంతం వరకు ప్రజల పక్షం వహించి పరాయి పాలకులకు, స్వదేశీ దోపిడిదారులకు వ్యతిరేకంగా బలమైన ఉద్యామాన్ని నిర్మించిన ఫరాజీ ఉద్యమ నిర్మాత హాజీ షరియతుల్లా 1840లో కన్నుమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌