చిరస్మరణీయులు, మొదటి భాగం/మౌల్వీ పీర్‌ అలీ ఖాన్‌

వికీసోర్స్ నుండి

37

10.మౌల్వీ పీర్‌ అలీ ఖాన్‌

( 1820 - 1857)

మాతృభూమి కోసం బలికావటం తన భూమి పట్ల గల ప్రేమకు నిదర్శనం, అంటూ ఆంగ్లేయ ప్రబుత్వానికి వ్యతిరేకంగా ఆయుధాన్ని అందుకుని పోరుబాటన సాగిన యోధులలో మౌలానా పీర్‌ అలీ ఖాన్‌ ఒకరు.

1820లో బీహార్‌ రాష్ట్రం అజీమాబాద్‌ జిల్లా ముహమ్మద్‌పూర్‌లో పీర్‌ అలీ ఖాన్‌ జన్మించారు. తండ్రి మొహర్‌ అలీఖాన్‌. చిన్నతనంలోనే జ్ఞానతృష్ణ తీర్చుకోడానికి బయలు దేరిన పీర్‌అలీ అరబిక్‌, పర్షియన్‌, ఉర్దూ భాషలలో పాండిత్యం సంపాదించి, చివరకు పాట్నాలో పుస్తక విక్రేతగా స్థిరపడి స్థానికంగా ఉన్న విప్లవ మండలిలో సభ్యులయ్యారు.

1857లో ఆంగ్లేయ ప్రభుత్వం మీద తిరుగుబాటు ప్రకటితం కాగా, ఆ పోరులో భాగంగా ఆత్మగౌరవం, తిరుగుబాటుతత్వం గల స్వదేశీ పాలకులను, నాయకులను సమైక్యం చేసేందుకు ఆయన విఫలప్రయత్నంచేశారు. ప్రభుత్వాధికారి మౌల్వీ మహది ద్వారా అందిన 50 తుపాకులతో, శ్రీరంగపట్నం యుద్ధంలో టిపూ రూపొందించిన తెలుపు- నీలి రంగు పతాకాన్ని తమ తిరుగుబాటు పతాకంగా ప్రకటించి అనుచరులతో కలసి దానాపూర్‌ ఆంగ్లేయ సైనిక స్థావరం మీద దాడిచేశారు.

ఈ పరిణామాలతో ఆగ్రహించిన బ్రిటిష్‌ సైనికాధికారులు పీర్‌ అలీ దాళాన్ని

చిరస్మ రణీయులు 38

మట్టుపెట్టేందుకు విస్త్రృతంగా గాలింపు ప్రారంభించి, పీర్‌ అలీని ఆయన దాళసభ్యులు 43 మందిని 1857 జూలై 4న అరెస్టు చేశారు. మౌలానా అలీని చిత్రహింసలకు గురిచేసి, ఆస్తులను జప్తు చేశారు. ఆయన మీద కుట్రకేసు నమోదు చేశారు. పాట్నా కుట్రకేసు గా చరిత్ర ప్రసద్దిపొందిన ఈ కేసులో ఆయన వాదనకు అవకాశం ఇవ్వకుండా విచారణ పూర్తి చేసి 9 మందికి ఉరిశిక్ష, 5 గురికి జీవిత కారాగార శిక్ష, మిగిలిన వారికి వివిధరకాల శిక్షలు విధిస్తూ ఆంగ్లేయాధికారి విలియం టేలర్‌ తీర్పు ప్రకటించాడు. ఆ తీర్పు మేరకు మౌలానా పీర్‌ అలీ ఖాన్‌ను ఉరి తీయడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తూ మరోవైపు విప్లవోద్యమం రహస్యాలు వెల్లడిస్తే ఉరిశిక్ష రద్దుకు సిపారసు చేస్తామని, ఆయనను అందలం ఎక్కిస్తామనీ అధికారులు పలు ఆశలు చూపసాగారు.

ఆ సందర్భంగా, తనను మభ్యపెడుతున్నఅధికారుల వైపు తృణీకారంగా చూస్తూ, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్కసారి ప్రాణాలను రక్షించుకోడానికి తెలివిగా ప్రవర్తించాల్సిన అవసరం వస్తుంది. అయితే అన్ని సమయాలలో ప్రాణాలు కాపాడు కోవడమే ప్రధానం కాదు. కొన్ని సమయాలలో ఆశయాల కోసం, మాతృభూమి గౌరవ ప్రతిష్టల కోసం జీవితాలను పణంగా పెట్టాల్సి వస్తుంది. మాతృభూమి కోసం బలి కావటం తన భూమి పట్ల గల ప్రేమకు నిదర్శనమౌవుతుంది...నా సహచరు లను నా కళ్ళ ముందే ఉరి తీశారు. ఇంకా చాలా మందిని ఉరి తీయగలరు. నన్నూ చంపగలరు. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి. బలమైన స్వేఛ్చాకాంక్షతో, స్వాతంత్య్రం కోసం రక్తతర్ప ణలకు సిదమౌతున్న ఈ పుడమి తల్లి బిడ్డలను నిలువరించటం మీకు కాదు కదా, మరే శక్తికీ సాధ్యం కాదు. ఈ రణంలో చిందిన మా రక్తపు బిందువుల వలన స్వాతంత్య్ర సమర యోధుల శరీరాలలో అగ్నిపుడుతుంది. ఆ అగ్నిజ్వాలల వేడిమిలో మీ ప్రబుత్వం, మీరూ మాడి మసైపోవటం తథ్యం, అని భారత దేశంలోని బ్రిటిష్‌ పాలకుల భవిష్యత్తును మౌలానా పీర్‌ అలీ ఖాన్‌ ప్రకటించారని ఆయనకు ఉరిశిక్ష ప్రకటించిన విలియం టేలర్‌ ఆనాటి సంఘటనను పూసగుచ్చినట్టు నమోదు చేశాడు.

ఆ సమాధానంతో మరింత మండిపడిన ఆంగ్ల సైనికాధికారులు మౌల్వీని ఉరి తీసేందుకు ఏర్పాట్లు చకచకా పూర్తి చేశారు. చిత్రహింసల వలన ఆయన శరీరం రక్తసిక్తమైంది. ఆయన చేతులకు, కాళ్ళకు బిగుతైన బేడీలు వేశారు. ఆయన మాత్రం తన కోసం పొంచివున్న మృత్యుదేవతను ధిక్కరిస్తూ వీరోచితహాసంతో ఉరివేదిక మీద నిలబడ్డారు. ఆ తరువాత ఉరితాడును ముద్దాడిన మౌలానా పీర్‌ అలీ ఖాన్‌ మరణాన్ని కూడా ఎంతో హుందాగా స్వాగతిస్తూ 1857 జూలై 7న అమరులయ్యారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌