Jump to content

చిరస్మరణీయులు, మొదటి భాగం/షెహజాదా ఫిరోజ్‌ షా

వికీసోర్స్ నుండి

67

25. షెహజాదా ఫిరోజ్‌ షా

(1832- 1877)

మాతృభూమిని విముక్తం చేసేందుకు సాగిన సుదీర్గ… స్వాతంత్య్ర పోరాటంలో సామాన్యుల నుండి సంస్థానాధీశులు, రాజుల నుండి రాజకుమారుల వరకు పాల్గొన్నారు. ఆ పరంపరలో భాగంగా అత్యంత సుఖమయమైన జీవితాన్నిత్యజించి, కంఠంలో ఊపిరి ఉనన్నంతవరకు బ్రిటిషర్లతో పోరాడి భారత స్వాతంత్య్రపోరాటాల చరిత్రలో నూతన అధ్యాయాన్ని సృష్టించిన యోధులు మొఘల్‌ రాకుమారుడు ఫిరోజ్‌ షా.

మొఘల్‌ పాదుషా షా ఆలం మనుమడు మీర్జా నిజాం భక్త్‌ కుమారుడు ఫిరోజ్‌ షా. 1832లో ఢిల్లీలో జన్మించిన ఆయన 1855 మేలో మక్కాకు వెళ్ళి 1857 మేలో స్వదేశం వచ్చేసరికి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ నినాదాం అంతా ప్రతిధ్వనిస్తోంది. ఆ శంఖారావంతో ఉత్తేజం పొంది 1857 న్‌లో గ్వాలియర్‌ సంస్థానంలోని మాండిసోర్‌ను కేంద్రంగా చేసుకుని ఆంగ్లేయుల మీద పోరుకు ఆయన సిద్ధమయ్యారు.

బ్రిటిషర్ల అనుకూలుడైన గ్వాలియర్‌ సంస్ధానాధీశుడు ప్రభుభక్తిని చాటుకునేందుకు మాండిసొర్‌ వదలి వెళ్ళాల్సిందిగా ఫిరోజ్‌ షాను ఆదేశించాడు. ఆ హెచ్చరికలను ఖాతరు చేయని ఫిరోజ్‌ షా నగరం బయట మకాం చేశారు. ఆయన ప్రయత్నాల ప్రభావంతో మాతృభూమి కోసం ప్రాణాలు త్యాగం చేసేందుకు ప్రజలు, యువకులు, స్వదేశీ సైనికులు


చిరస్మ రణీయులు 68

మొత్తం మీద 18వేల మంది సిద్ధమయ్యారు. ఆ స్వదేశీ యోధులతో రణ నినాదాం చేసిన ఫిరోజ్‌ షా ప్రజలకు ఏమాత్రం నష్టం కలగకుండా ధర్మబద్ధంగా పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా తన అనుచరులకు, సైనికులకు పిలుపునిచ్చారు.

1857 ఆగస్టు 26న ఆయుధాలను చేతబూని ఫిరోజ్‌ షా నాయకత్వంలో ప్రజలు దాడిచేసి మాండిసోర్‌ను ఆంగ్లేయుల నుండి స్వాధీనం చేసుకుని రెండు సంవత్సరాల పాటు అవిచ్ఛిన్నంగా పోరుబాటన సాగారు. ఆయన స్వయంగా పోరాటాలకు నాయకత్వం వహించి రానొడ్‌, దానసా, షికాం, ఇంత్రాఘర్‌ ప్రాంతాలలో కంపెనీ అధికారులను మట్టికరిపించారు. ఈ సందర్భంగా అవధ్‌ అధినేత్రి బేగం హజరత్‌ మహల్‌, కాన్పూరు నాయకులు నానా సాహెబ్‌లకు ఆయన క్రియాశీలక తోడ్పాటు అందించారు. ఆ ఐక్య సైన్యాలు కంపెనీ సైన్యాల మీద పలు విజయాలను సాధించాయి. ఆ విజయానందంతో ఢిల్లీ వెళ్లి అక్కడ ఆంగ్ల సైన్యాలతో జరుగుతున్న పోరాటంలో పాల్గొనాలని భావించి సహచరులతో సహా ఢిల్లీకి పయనం కాగా, మార్గమధ్యంలోనే ఢిల్లీ తిరిగి ఆంగ్లేయుల స్వాధీనమైనదన్న విషాద వార్త అందడంతో ఫిరోజ్‌ షా హతాశులయ్యారు.

1859 జనవరి 14న జైపూర్‌ సమీపాన చీమలదండులా కదలి వచ్చిన ఆంగ్లేయ సైన్యాలతో సాగిన పోరాటంలో ఫిరోజ్‌ షా వెనుకంజ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు తాంతియాతోపే తోపాటుగా ఫిరోజ్‌ షా అటవీ ప్రాంతంలోకి తప్పుకున్నారు. ఈ ప్రతికూల పరిస్థితులేవీ ఫిరోజ్‌ షాకు నిరాశ కల్గించలేదు. సిరోంజ్‌ అడవుల్లో తలదాచుకున్న ఫరోజ్‌ షా మళ్ళీ పోరుకు తయారయ్యారు.ఆయనను లొంగదీసుకునేందుకు ఆంగ్లేయాధికారులు చేసిన ప్రయత్నాలు ఎంతమాత్రమూ ఫలించలేదు.

చివరకు ఆంగ్లేయ గూఢచారుల కన్నుగప్పి ఆయన ఆఫ్గనిస్తాన్‌ వెళ్ళిపోయారు. 1860 నాికి ఫిరోజ్‌ షా కాందహార్‌ చేరుకుని, అక్కడ నుండి 1862లో టెహరాన్‌ వెళ్లారు . మార్గమధ్యంలో పలువురు రాజులను కలసి తమ స్వతంత్ర పోరాటానికి సహాయం కోరారు. చిన్నపాటి సహచరుల దళంతో సంచారం సాగిస్తూ ఆయుధాలను సమకూర్చు కునేందుకు ఆయన చేస్తున్నప్రయత్నాలను పసిగట్టిన బ్రిటిష్‌ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుంది. గట్టి నిఘా ఏర్పాటు చేయటంతో బ్రిటిషర్ల కన్నుగప్పి తన కార్యకలాపాలు కొనసాగించటం మొఘల్‌ రాకుమారుడు ఫిరోజ్‌కు కష్టమైపోయింది. సంక్లిష్టతరమైన పలు మజిలీల తరు వాత 1875లో మక్కా చేరు కుని, అక్కడ పలు ఇక్కట్లను ఎదుర్కొంటూ 1877 డిసెంబరు 8న షెహజాదా ఫిరోజ్‌ షా అంతిమశ్వాస విడిచారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌