చిరస్మరణీయులు, మొదటి భాగం/నవాబు మీర్‌ ఖాశిం

వికీసోర్స్ నుండి

2. నవాబు మీర్‌ ఖాశిం

(- 1777)

ఆంగ్లేయులను భరతగడ్డ మీద నుంచి పూర్తిగా తరిమికొడితే గాని వారి దోపిడి నుండి స్వదేశీయులకు విముక్తి కల్పించలేమని భావించి, రాజ్యక్షేమం, ప్రజల సౌభాగ్యం ఆకాంక్షిస్తూ, ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకుల మీద సమర శంఖాన్ని పూరించి, చివరి వరకు పోరుబాటలో సాగిన యోధులు మీర్‌ ఖాశిం.

ఆంగ్లేయులతో చేతులు కలిపి ప్లాసీ యుద్ధంలో నమ్మకద్రోహానికి పాల్పడిన మీర్‌ జాఫర్‌కు కంపెనీ పాలకులు తిలోదకాలు ఇచ్చాక బెంగాలు గద్దె మీద జాఫర్‌కు స్వయాన మేనల్లుడైన మీర్‌ ఖాశింను కూర్చోపెట్టాలని గవర్నర్‌ వాన్సిటర్ట్‌ నిర్ణయం మేరకు 1760 సెప్టెంబరు 27న మీర్‌ ఖాశిం బెంగాలు నవాబు అయ్యారు.

ఆ సమయంలో ప్లాసీ యుద్ధ విజయంతో చెలరగిపోయిన ఈస్ట్‌ ఇండియా కంపెనీ గుమాస్తాలు, దాస్తావేజుల రాతగాళ్ళు, వర్తకులు అపరిమిత అధికారాలతో, అంతు లేని ధనకాంక్షతో రాబర్టు క్లైయివు ఆరంభించిన ధనసంచయాన్ని కొనసాగిస్తూ ఇష్టా రాజ్యంగా ప్రవర్తించసాగారు. ఈ అనుచిత ప్రవర్తన వలన స్వదేశీ వర్తకం ఇబ్బందుల్లో పడింది. రైతులు, వర్తకులు, ఉత్పత్తిదారులు ఇక్కట్లు పడసాగారు. అధికారుల అనుచిత ఆజ్ఞలను ప్రజలు పాటించాల్సి వచ్చింది. కంపెనీ అధికారుల, ఆంగ్ల ఉద్యోగుల, వర్తకుల చిత్తానికి వ్యతిరేకంగా వ్యవహరించటం ప్రజలకు ప్రాణాంతకమయ్యింది. ఆంగ్ల అధికారుల అభిమతాన్ని, పెత్తనాన్ని ఏమాత్రం నిరసించినా ప్రజలకు ముళ్ల కొరడాలతో దెబ్బలు, జైలుశిక్షలు, చిత్రహింసలు అనునిత్యం అనివార్యమయ్యాయి.

ఆ సమయంలో బెంగాలు నవాబుగా అధికారాలను చేపట్టగానే మీర్‌ ఖాశిం స్వతంత్రంగా వ్యవహరించడం ఆరంభించారు. ప్రజల హితవుకు భిన్నంగా ఆంగ్లేయులు, వారి వత్తాసుదారులు సాగిసున్న దుర్మార్గాలను సహంచలేకపోయారు. ఆ వాతావరణంలో మిన్నకుంటే లాభం లేదనుకున్న మీర్‌ఖాశిం కంపెనీ అధికారుల, ఉద్యోగుల నిర్వాకాన్ని ఎండగడ్తూ కంపెనీ ఉన్నతాధికారుల కౌన్సిల్‌కు 1762 మేలో లేఖ రాశారు. ఆ లేఖకు కంపెనీ పాలకుల నుండి అనుకూల స్పందన లేకపోగా ఆంగ్లేయుల దోపిడీ, వేధింపులు మరింత పెరిగాయి. గత్యంతరం లేని పరిస్థితులలో కంపెనీ పాలకులతో మీర్‌ ఖాశిం ఘర్షణకు సిద్దపడి 1762లో తన రాజధానిని ముషీరాబాదు నుండి మాంఘీర్‌ (Monghir) కు మార్చారు. ఆంగ్లేయులకు ప్రసాదించిన ప్రత్యేక అనుమతులను రద్దుచేశారు. ఈ నిర్ణయంతో మండిపడిన కంపెనీ అధికారి ఎల్లీస్‌ (Ellis), నవాబు రాజ్యంలోని పాట్నా పట్టణాన్ని చుట్టుముట్టి స్వాధీనం చేసుకోనడనికి ప్రయత్నించగా మీర్‌ ఖాశిం తన బలగాలతో ఆంగ్ల మూకలను మట్టి కరిపించి తరిమికొట్టారు.

ఈ విధంగా ఆంగ్లేయులు ప్రారంభించిన పోరాటం క్రమంగా యుద్ధంగా రూపు దిద్దుకు ని, 1763 జూన్‌ 10న మీర్‌ ఖాశిం ఆంగ్లేయులను ఎదుర్కొన్నారు. ఆ యుద్దంలో ఆంగ్లేయులది పైచేయి కావటంతో మీర్‌ ఖాశిం రణభూమి నుండి తప్పుకుని అయోధ్య చేరుకున్నారు. స్వజనుల పాలిట శాపంగా మారిన ఆంగ్లేయులను ఎలాగైనా తమ దేశం నుండి తరిమికొట్టాలనుకున్న మీర్‌ ఖాశిం అయోధ్య నవాబు షుజావుద్దౌలా, ఢల్లీ చక్రవర్తి షా ఆలం-2 ల బలగాలతో కలసి మరోమారు కంపెనీ సెన్యాలతో బక్సర్‌ అను ప్రాంతంలో తలపడ్డారు. ఆ చరిత్మ్రాక యుద్ధంలో ఆంగ్లేయుల కుతంత్రం వలన షుజావుద్దౌలా, షా ఆలం సైన్యాలు పూర్తిగా రణరంగంలోకి దిగకపోగా, ఇతరులు మీర్‌ ఖాశింకునైతికమద్దతు ఇవ్వటం వరకు పరిమితమయ్యి ప్క్షకపాత్ర నిర్వహించారు.

ఆ కారణంగా మీర్‌ ఖాశిం నాయకత్వంలో ఉమ్మడి సేనలు ఎంతగా పోరాడినా, సమన్యయం కరు వుకావటంతో1764 అక్టోబరు 22న మీర్‌ ఖాశిం బలగాలకు పరాజయం తప్పలేదు. ఆంగ్లేయ శత్రువుకు ఏమాత్రం లొంగకుండా రణభూమి నుండి తప్పుకుని రహస్య ప్రదేశాలలో సంచరిస్తూ, మళ్ళీ పోరాటం చేసేందుకు విఫల ప్రయత్నాలు చేస్తూ, ఆ క్రమంలో 1777లో ఢిల్లీ సమీపాన మీర్‌ ఖాశిం కన్నుమూశారు.