చిరస్మరణీయులు, మొదటి భాగం/బెంగాలు నవాబు సిరాజుద్దౌలా

వికీసోర్స్ నుండి

1. బెంగాలు నవాబు సిరాజుద్దౌలా

(1733- 1757)

ఆంగ్లేయుల కుయుక్తులను ఆరంభంలోనే గ్రహించి వారి దుర్మార్గాన్నిఅరికట్టేందుకు ఉపక్రమించి, 'భారత స్వాతంత్య్ర సాయుధ సమరేతిహాసంలో అరుణపుటల్నితెరిచిన' పాతికేళ్ళు దాటని యోధుడు, బెంగాలు నవాబు సిరాజుద్దౌలా.

1733లో సిరాజుద్దౌలా జన్మించారు. తల్లి అమీనా బేగం, తాత బెంగాలు నవాబు అల్లావర్దీ ఖాన్‌. తాత నుండి సిరాజ్‌కు ముషిరాబాద్‌ రాజధానిగా గల బెంగాలు రాజ్యం లభించింది. ఆయన రాజ్యాభిషేకం ఇష్టంలేని శక్తులు ఆరంభం నుండే కుట్రలు చేయడం ఆరంభించాయి. ఆ అనుకూల పరిస్థితులను గ్రహించిన ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారులు నవాబు అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ప్రజలను, వర్తక- వ్యాపారులను, రైతులను దోచుకోవటం ప్రారంభిచేసరికి నవాబు సిరాజ్‌ మండిపడ్డారు. కంపెనీ దుశ్చర్యలను అరికట్టేందుకు పూనుకున్నారు. ఆ ప్రయత్నాల తొలి దశలో ఆయన విజయం సాధించినా, ఆయనలోని శతృవును క్షమించే ఔదార్యం ఆ తరువాత ఆయనకు మాత్రమే కాక భారతదేశ భవిష్యత్తుకు ప్రమాదకరంగా పరిగణించింది.

ఈ వాతావరణంలో సిరాజ్‌ పెద్దమ్మ ఘాసిటీ బేగం, ఆమె దత్తకుమారుడు షౌకత్‌ జంగ్, ఆయన మద్దతుదారుడు దివాన్‌ రాజ్‌ వల్లభ్‌ కుమారుడు కృష్ణదాసు, సిరాజ్‌ సర్వసేనాని, బందువు మీర్‌జాఫర్‌, ప్రముఖ వ్యాపారులు మానిక్‌ చంద్‌, అమీచంద్‌, ప్రముఖ బ్యాంకరు జగత్‌ సేథిలు కలసి నవాబుకు వ్యతిరేకంగా, రాబర్టు క్లయివుతో చేతులు కలిపి కుట్ర పన్నారు.

ఈ కుట్రలు-కుయుక్తులు తెలియని సిరాజుద్దౌలా ఆంగ్లేయుల పీచమణచడానికి 50 వేల భారీ సైన్యంతో బయలుదేరి ప్లాసీ గ్రామం వద్దకు చేరుకున్నారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైన్యం మొత్తం మూడు వేల రెండు వందలు కాగా వీరిలో 950 మంది మాత్రవు ఆంగ్ల సైనికులు. 150 మందితో 10 ఫిరంగిదళాలు, 2 వేల వంద మంది భారతీయ సైనికులు పాల్గొన్నారు. సిరాజుద్దౌలా సైన్యంలో 50 జతల ఎడ్ల ఏర్పాటు కలిగిన భారీ ఫిరంగుల దళం, 50 వేల సైనికులతో కాల్బలం, 18 వేల అశ్విక దళాలు ఉన్నాయి. ఆ బలగాలతో భారతదేశ భవిష్యత్తును నిర్దేశించిన 'ప్లాసీయుద్దం' 1757 జూన్‌ 23న ఆరంభమైంది. ఆంగ్లేయుల మదమణచాలనుకున్న సిరాజుద్దౌలాకు సన్నిహితులైన సేనానులు మీర్‌ మదన్, మోహన లాల్‌లు రాబర్టు క్లయివు సైన్యాల మీద అగ్నిగోళాలు విసురుతూ పోరాడుతుండగా మీర్‌ మదన్‌ గాయపడి కన్నుమూయటంతో సిరాజుద్దౌలా సేనలు ఖంగుతిన్నాయి.

చివరకు రాబర్టు క్లయివుతో కుదిరిన ఒప్పందం మేరకు ఆంగ్ల సైన్యాలకు అనుకూలంగా మీర్‌ జాఫర్‌, మరోసేనాని రాయ్‌ దుర్లభ్‌లు సిరాజుద్దౌలాను ఒంటరిని చేసి యుద్ధభూమిని విడిచి పెట్టడంతో దిక్కుతోచని పరిస్థితులలో సిరాజ్‌కు పరాజయం అనివార్యమైంది. ఈ విషయం తెలుసుకున్న సిరాజుద్దౌలా ఆశ్చర్యపోయారు. ఆయన యుద్ధాభూమి నుండి బయటపడి జూన్‌ 24న రాజధాని ముషిరాబాద్‌ చేరుకుని, అక్కడి వాతావరణం కూడావ్యతిరేకంగా ఉండటంతో భార్య లుత్‌ఫున్నీసా, విశ్వాసపాత్రుడైన మరొక సేవకుడ్ని వెంట పెట్టుకుని ప్రాణరక్షణ కోసం అంతóపురం వదలిపెట్టారు.

ఈలోగా ఆంగ్లేయుల చలువతో బెంగాలు నవాబుగా నియమితుడైన మీర్‌ జాఫర్‌ తన కుమారుడు మీర్‌ మీరాన్‌ను సైన్యంతో సహా పంపి సిరాజుద్దౌలాను వెంబడించి వేాడమన్నాడు. ఆ ఆదేశాల మేరకు సిరాజుద్దౌలాను నిర్భంధించి తెచ్చి 1757 జూలై 2న రాజదర్బారులో బహిరంగంగా అతని శిరస్సును ఖండించి నేల దొర్లించాడు. ఈ విధగా 'బ్రిటిషు దుష్టులను కతిపట్టి ఎదిరించిన మొనగాడు' గా ఖ్యాతిగాంచిన బెంగాలు నవాబు సిరాజుద్దౌలా బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాల చరిత్ర గ్రంథంలోని ప్రప్రథమ పుటను సొంతం చేసుకుని చిరస్మరణీయులయ్యారు.