చిరస్మరణీయులు, మొదటి భాగం/ఆప్తవాక్యం

వికీసోర్స్ నుండి

డాక్టర్‌ జి.సాంబశివారెడ్డి M.A., M.Ed., Ph.D

చరిత్రశాఖాధ్యక్షులు, SBVR కళాశాల, బద్వేల్‌.

ఆప్తవాక్యం

2004లో విజయవాడ లయోలా కళాశాలలో ఆంధ్రప్రదేశ్‌ హిస్టరీ కాంగ్రెస్‌ సదస్సు జరిగినప్పుడు మిత్రులు మహబూబ్‌ బాషా ద్వారా సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ గారు పరిచయమయ్యారు. ఆ తర్వాత నాగార్జునసాగర్‌, కడప తదితర చోట్ల జరిగిన చరిత్ర సదస్సులలో నశీర్‌ని కలవడం జరుగుతున్నది. మిత్రులు నశీర్‌ రచనా కార్యకలాపాలను గూర్చి బాషా చెబుతున్నప్పుడు ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యాను. క్రమక్రమంగా ఆయన గూర్చి మరిన్ని వివరాలు తెలియడమూ, ప్రత్యక్షంగా ఆయనను కలవడమూ, ఆయనతో ఆలోచనలు పంచుకోవడమూ జరిగి అభిమానం పెరిగి, ఆప్తంగా మారింది. మంచివాడితో స్నేహం సాయంకాలపు నీడలాగా పెరుగుతుందని ఎవరో కవివర్యులు అన్నట్టుగా నశీర్‌ అహమ్మద్‌తో స్నేహం దినదిన ప్రవర్థమానమవుతూ వస్తోంది.

ఒక 'జాతి'గా 'భారతజాతి'ని రూపొందించడానికి చారిత్రక జ్ఞానం అనివార్యం. భారత జాతీయ అస్తిత్వానికి చరిత్ర జ్ఞానం ఆయువుపట్టు అన్నా అతిశయోక్తికాదు. భారత జాతి ఏ విధంగా రూపొందిందన్న విషయం తెలుసుకోవడం భారతీయులందరి కర్తవ్యం. 'సుసంప్నమైన బహువిధమైన మన దేశ వారసత్వ సంపద' పట్ల గర్వించాలంటే ఏయే సాంఫిుక సముదాయాలు, ఏయే విధంగా యిక్కడి చరిత్ర, సంస్కతులను సుసంపన్నం చేశాయో మనం తెలుసుకోవాలి. ఇలా తెలుసుకున్నప్పుడు వివిధాసాంఫిుక సముదాయాలకు ఒకరి పట్ల ఒకరికి గౌరవం, సహానుభూతి యేర్పడతాయి. ఇలాంటిభావాలే జాతీయ విలువల్ని రూపొందిస్తాయి. ఇలాంటి రచనలు మనకెంతగానో అవసరం.

కానీ దురదృష్టవశాత్తు ఈ పని సవ్యంగా సాగడం లేదు. భారత దేశ నిర్మాణంలో అవిభాజ్య భాగాలైపోయిన ముస్లింల చరిత్ర విస్మరణకు గురైపోతుండడం దీనికొక ఉదాహరణగా చూడవచ్చు. ఋణాత్మక భావనలో ముస్లింలు చరిత్ర భారాన్నిమోయాల్సి రావడం మిక్కిలి శోచనీయం. 'సెక్యులర్‌' భారతంలో ముస్లింలు దినదినమూ అంచులకు నెట్టివేయబడుతున్న వైనం మనందరికీ తెలిసిందే! మనకు సాధారణంగా తెలిసిన విషయాలనే జస్టిస్‌ సచార్‌ కమిటీ గణాంకాల ఆధారంతో ఋజువు పర్చింది. తనకు ప్రమేయం లేకుండా జరిగిన చరిత్ర వల్ల చేకూడిన పుట్టుమచ్చల భారాన్ని భారత ముస్లింలు మోస్తున్నారు.

ఇలాంటిదయనీయ పరిస్థితులు ఒకవైపున అప్రతిహతంగా సాగిపోతూంటే యింకోవైపు కొన్ని ముస్లిం వ్యతిరేకశక్తులు పనిగట్టుకుని వీరిపట్ల విద్వేషాలను రెచ్చ గొడుతున్నాయి. దీనికై చరిత్రను వక్రీకరిస్తున్నాయి. 'కమల నాగులు' పడగలిప్పి కసిదీర బుసలు కొట్టడం, తమ రథచక్రాల కింద అసలు చరిత్రను నలిపివేయడం సమీప గతంలో చూసి మనం దిగ్భ్రమకు గురయ్యాం. భారతీయ మిశ్రమ సాంస్కతిక విలువల్ని కాలరాసి విషమయం చేయ్యాలని ఈ నయవంచక శక్తులు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి; అడపాదడపా విజయవంతమవుతున్నాయి. పసిపిల్లల మెదళ్ళని దురాక్రమిస్తున్నాయి.

సరిగ్గా ఈ సందర్భంలోనే నశీర్‌ గారి చరిత్ర పుస్తకాలు వెలుగు చూస్తున్నాయి. నాటిచారిత్రక ప్రాధాన్యత కూడా ఈ నేపధ్యంలోనే ఏర్పడుతుంది. 'ముస్లింలు విదేశీయులు', 'దేశద్రోహులు', 'ఇక్కడి సంస్కతిని మంటగలిపారు', 'నాశనం చేయడం మినహా ఈ దేశానికి ముస్లింలు చేసిందేమీ లేదు' మొదలైన కలుపు మొక్క ఆలోచనలు దాదాపుగా 'ప్యాసివ్‌' ఆమోదం పొందుతున్న సందర్భంలో భరతమాతను దాస్యశృంఖాల నుండి విముక్తం చెయ్యడానికి ఉరికొయ్యలు, చెరసాలలు, ఫిరంగి కుహరాలను ముద్దాడిన ముస్లింల చరిత్రను కళ్ళకు కట్టిటనట్లు దృశ్యీకరిస్తున్న నశీర్‌గారి కృషిని ప్రశంసించకుండాఎలా ఉండగలం !

ఒకటికాదు, రెండు కాదు సుమారు ఏడు పరిశోధానాత్మక చరిత్ర గ్రంథాలను అతి తక్కువ కాలంలో వెలువరించడం వెనుక ఎంతకృషి ఉందో మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పుస్తకాలు పలు ముద్రణలు పొందుతున్నాయంటే అవి పాఠకుల ఆదరణ ఏమేరకు చూరగొంటున్నాయో తెలుస్తుంది. ప్రముఖ విశ్వవిద్యాలయాల్లోని ప్రొఫెసర్లు సైతం చేయలేకపోయిన / పోతున్న పనిని నశీర్‌ అహమ్మద్‌ ఒక్కరుగా చేసుకురావడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించకమానదు.

నశీర్‌ మనుషులను ప్రేమిస్తారు; మనుషులు నిర్మించిన చరిత్రను మరీ ప్రేమిస్తారు. పుంఖానుపుంఖాలుగా ఆయన కలం నుండి జాలువారుతున్న రచనలు ఈ విషయాన్నే నిరూపించి, అయన కర్తవ్యపరాయణతకూ, సామాజిక నిబద్దతకూ, దీక్షాదక్షతలకు అద్దం పడ్తున్నాయి. మన భావిభారత పౌరులకు వివిధ సాంఫిుక జనసముదాయాల ఆత్మార్పణలను,త్యాగాన్నిసాధికారికంగా పరిచయం చేయడం ద్వారా రాజ్యాంగంలో పొందుపర్చుకున్నలౌకిక విలువల్ని కాపాడుకొని, సౌభ్రాతృత్వపుష్పాలను పూయించగలం. ఈ బృహత్తరకార్యాన్ని ఫలప్రదంగా నిర్వహిస్తున్న ఏకలవ్యుడ్ని మనసారా అభినందిసున్నాను.

ఆగే బడో నశీర్‌ సాబ్‌ ... హమ్‌ సబ్‌ ఆప్‌కే సాత్‌హై.