చిరస్మరణీయులు, మొదటి భాగం/రచయిత మాట

వికీసోర్స్ నుండి

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

శివప్రసాద్‌ వీధి, కొత్తపేట వినుకొండ - 522 647.

రచయిత మాట

బ్రిటిష్ వ్యతిరేక పోరాటాలలో పాల్గొని తమదైన సాహసోపేత, త్యాగాలతో పునీతులైన ముస్లిం యోధుల గురించి సంక్షిప్త సమాచారంతో పుస్తకం రాయమని చాలా కాలంగా మిత్రులు, విజయవాడకు చెందిన సామాజిక కార్యకర్త హబీబుర్‌ రెహమాన్‌ కోరుతూ వచ్చినందున చిరస్మరణీయులు రాశాను. ఒక్కసారిగా వందమంది స్వాతంత్య్ర సమర యోధుల జీవిత చరిత్రలను ఒక గ్రంథంలోనే చదవగల అవకాశం పాఠకులకు కల్పిస్తే బాగుంటుందన్న మిత్రుని సలహా ఈ పుస్తకాన్ని రూపొందించేందుకు మరింతగా నన్ను పురికొల్పింది.

ఆంగ్లేయుల పాలనను తుదముట్టించేందుకు 1757 నుండి 1947 వరకు సాగిన పోరాటాలలో పాల్గొన్నవంద మంది యోధు ల గురించి సంక్షిపంగా చిరస్మ రణీయులు లో వివరించాను. ఈ పోరాటాలలో పాల్గొన్న సామాన్య సైనికుడి నుండి సంస్థానాధీశుని వరకు, సామాన్య ప్రజల నుండి ప్రముఖుల వరకు ప్రాతినిధ్ం కల్పిస్తూ తగిన ప్రాధమిక సమాచారంతోపాటుగా విశేషాంశాలను కూడా జోడించ ప్రయత్నించాను.

ప్రదమస్వాతంత్ర సంగ్రామానికి ముందు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి ఉద్యమించిన ప్రజా పోరాటాల నేతలు, ఆ తరువాత ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకుల పెత్తనాన్ని తిరస్క రిస్తూ పోరుబాట పట్టిన నవాబులు, సంస్థానాధీశుల వివరాలను, ప్రథమస్వాతంత్య్ర సంగ్రామం, జాతీయోద్యమంలో భాగంగా సాగిన శాంతియుత- సాయుధ పోరాటాలలో భాగస్వాములైన సమర యోధులు, చివరకు ఇండియ న్‌ యూనియన్‌ లో నైజాం సంస్థానం విలీనం కోరుతూ సాగిన ఉద్యమంలో భాగస్వాములైన యోధుల వివరాలు కూడా సమకూర్చాను.

మాతృభూమిని వలసపాలకుల నుండి విముక్తం చేసేందుకు ఉద్యమించిన అసంఖ్యాక స్వాతంత్య్రసమరయోధు లలో ఈ పుస్తకం కోసం వంద మంది వరకు పరిమితం చేయడం చాలా కష్టతరమయ్యింది. కనుక ఇందులో స్థానం కల్పించలేక పోయిన స్వాతంత్య్ర సమర యోధుల పోరాటాల చరిత్రలను భవిష్యత్తులో మరో గ్రంథంలో పొందుపర్చడానికి ప్రయత్నిస్తాను.

బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడిన యోధుల చిత్రాలు కూడా ఈ గ్రంథంలో ఎంతో శ్రమకోర్చి సమకూర్చాను. ఆ చిత్రాలు, ఫోటోల సేకరణలో భారత ప్రభుత్వం ప్రచురించిన పలు గ్రంథాలు, ఇతర చరిత్ర గ్రంథాలు, నా పర్యటనలు ఉపకరించాయి. నాకు లభించిన సమాచారం, సమకూరిన ఫోటోలు, చిత్రాల ఆధారంగా వినుకొండకు చెందిన ప్రముఖ చిత్రకారులు వజ్రగిరి జెస్టిస్‌ సహకారంతో ఆయా యోధుల చిత్రాలను తిరిగి గీయించి చిరస్మరణీయులులో పొందుపర్చాను.

ఈ పుస్తకానికి పరిచయవాక్యం రాసిచ్చిన ప్రొఫెసర్‌ పి.రామలక్ష్మి (ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు), ఆప్తవాక్యం రాసిచ్చిన డాక్టర్‌ ఎస్‌.సాంబశివారెడ్డి (చరిత్ర శాఖాధ్యక్షు లు, యస్‌.బి.వి.ఆర్‌ కళాశాల, బద్చెల్‌, కడప జిల్లా) లకు, ఈ గ్రంథాన్ని ఆమూలాగ్రం చదివి పలు సూచనలు చేసన మిత్రులు పెద్ది సాంబశివరావు (గుంటూరు), చక్కని ముఖచిత్రం రూపొందించిన చిత్రకారులు వజ్రగిరి జెస్టిస్‌, పుస్తకం గెటప్‌ను తీర్చిదిద్దిన మిత్రులు, చిత్రకారులు అబ్దుల్లా (విజయవాడ), నా ప్రతి ప్రయత్నానికి తన సమ్మతితోపాటుగా తగిన సహకారం అందించే నా జీవిత భాగస్వామి షేక్‌ రమిజా భానులకు ధన్యవాదాలు.

ఈ పుస్తక ప్రచురణకు కొంత వరకు ఆర్థిక సహాయం అందించిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (హైదారాబాద్‌) వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

ఈ పుస్తక రచనకు పలు గ్రంథాలు, పత్రికలు, వ్యక్తుల, సంస్థల నుండి ప్రత్యక్షంగా/పరోక్షంగా సమాచార సహకారం-సహాయం స్వీకరించాను. ఆ కారణంగా ఈ పుస్తక సృష్టి 'వ్యష్టి' కృషి అనే కంటే 'సమష్టి' ప్రయత్నంగా భావిస్తూ, ఆయా వ్యక్తులు, గ్రంథాల రచయితలు, ప్రచురణకర్తలకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ గ్రంథాన్ని చదివిన పాఠక మిత్రుల నుండి మార్పులు-చేర్పులు, సూచనలు-సలహాలను, తప్పొప్పులను వినమ్రంగా ఆహ్వానిస్తున్నాను.