చిరస్మరణీయులు, మొదటి భాగం/పరిచయవాక్యం
ఆచార్య పి.రామలక్ష్మి M.A., Ph.D
చరిత్ర - పురావస్తు విభాగం,
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు
పరిచయవాక్యం
విభిన్న సాంఫిుక జనసముదాయాల మధ్య సంయమనం, సమంవయం,
సామరస్యం సాధించాలనుకున్నశక్తులు సకారాత్మక ధోరణిలో కృషి సాగించటం
వాంఛనీయం. చరిత్రలోని వాస్తవికతను ప్రజల ముందుకు తెచ్చి ఉమ్మడి కృషి,
త్యాగాలలో ఆయా సముదాయాల పాత్రను సవివరంగా, చారిత్రక ఆధారాలతో సహా
ప్రజా బాహుళ్యానికి వెల్లడి చేయడం అభిలషణీయమైన చరిత్ర రచనా విధానం.
చరిత్రలోని వాస్తవాలు తెలిసి త్యాగమయ పోరాటాలలో నాటి జనసమూహాల
భాగస్వామ్యాన్ని తెలుసుకున్న సమకాలీన సమాజంలో సదవగాహన-సద్భావన వృద్థిచెంది
సమాజాన్నిఅశాంతికి గురిచేసే ఘర్షణ వెఖరి స్థానంలో శాంతి-సామరస్యం-సౌభ్రాతృత్వ
వాతావరణం మరింతగా పరిఢవిల్లుతుంది.
ఈ గ్రంథ రచయిత సయ్యద్ నశీర్ అహ్మద్ సరిగ్గా ఇదే మార్గంలో లక్ష్యసాధన దిశగా కృషి ఆరంభించి, అందుకు చరిత్ర రచనను సాధనం చేసు కున్నారు. ఆ ప్రయ త్నంలో భాగంగా భారత స్వాతంత్రోద్యమంలో ముస్లింలు నిర్వహించిన మహోన్నత పాత్రను వెలికి తీసి, ప్రతి అంశాన్ని విడమర్చి వివరిస్తూ ఇప్పటివరకు తెలుగులో వెలువరించిన ఏడు గ్రంథాలలో కూడ ఈ లక్ష్యమే స్పష్టమౌతుంది. ఆ కారణంగా నశీర్ రాసిన ఏడు చరిత్ర గ్రంథాలలో నాలుగు గ్రంథాలు మూడుసార్లు, మూడు గ్రంథాలు రెండుసార్లు పునర్ముద్రణ పొందాయి.
ప్రస్తుత గ్రంథం చిరస్మరణీయులు కూడా ఆ లక్ష్యసాధానలో భాగంగా రూపు దిద్దుకుంది. ఈ గ్రంథం బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించిన ముస్లిం యోదులు, ముస్లిం స్త్రీమూర్తుల గురించి, మానవీయ విలువలకౖెె శ్రమించిన వారి జీవిత ఘట్టాలను సంక్షిప్తంగా తెలియజేస్తోంది. రచయిత ఎంతో శ్రమించి, ఎన్నోఆధారాలను సేకరించి సులభశైలిలో చారిత్రక వాస్తవాలను ఉటంకిస్తూ సాగించిన రచనారీతి అందరిని చదివింప జేస్తుంది. లౌకిక విలువల కోసం పాటుపడిన నాటితరం జీవితాలను వివరించడం ద్వారా, నేటి తరానికి ఆ విలువల ఆవశ్యకతను రచయిత తెలియజేస్తున్నారు.
సామాన్య ప్రజానీకానికి మాత్రమే కాకుండా, చరిత్రలో ప్రవేశమున్నవారికి సహితం తెలియని స్వాతంత్య్రసమరయోదుల జీవితాలను, వారి జీవితాలలోని ప్రత్యేక ఘట్టాలను చిరస్మరణీయులు ద్వారా రచయిత పరిచయం చేస్తున్నారు. స్వాతంత్య్రోద్యమం లోని వివిధ దాశలలో ఆ యోధులు నిర్వహించిన అత్యంత ప్రాధాన్యత గల పాత్రను తగిన ఆధారాలతో సహా ఈ గ్రంథాన్ని రచయిత రూపొందించారు. ఈ పరిచయం క్లుప్తంగా రెండుపేజీలకు మించకున్నా వ్యక్తుల ప్రాముఖ్యతకు ఎక్కడ ఏమాత్రం లోటు రానివ్వకుండా రచయిత నశీర్ అహమ్మద్ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
1757లో ఆంగ్లేయుల కుటిలత్వాన్ని ఆదిలోనే గ్రహంచి వారి ఆటకట్టించేందుకు యత్నించిన బెంగాలు నవాబు సిరాజుద్దౌలా, మీర్ ఖాశింల నుండి ఆరంభమై బ్రిటిషర్ల సామ్రాజ్యవిస్తరణ కాంక్షను తొలిదశలోనే పసిగట్టి స్వదేశీయులను హెచ్చరించడమే కాకుండా చివరి క్షణం వరకు ఆంగ్లేయులను అడుగడుగునా అడ్దుకున్న హైదర్ అలీ, టిపూ సుల్తాన్‌ల వీరోచిత పోరాటాల విశేషాలతో చిరస్మరణీయులు ప్రారంభమౌతుంది. ఆనాడు బ్రిటిషర్లకు, వారికి తొత్తులుగా వ్యవహరిస్తూ ప్రజలను పీడిస్తున్న మహాజనులు, జమీందార్లకు వ్యతిరేకంగా ప్రజలను సమాయత్తం చేసి పోరుబాటన నడిపించి, అంగ్లేయాధికారులను ఖంగు తిన్పించిన ప్రజా పోరాట నాయకులైన సయ్యద్ అహ్మద్‌బరేల్వీ,టిటూమీర్, హాజీ షరియతుల్లా, దూదూమియా లాంటి యోధుల సమాచారాన్ని ఈ గ్రంథం అందిస్తుంది.
1857 నాటి పోరాటానికి నాయకత్వం వహించిన మొగల్ పాదుషా బహుద్దూర్‌షా జఫర్ నుండి ఆమనాటి పోరాటాలకు వ్యూహకర్తగా వ్యవహరించిన అజీముల్లా ఖాన్, ప్రథమ స్వాతంత్య్ర సమరయోధుల సర్వసేనాని భక్త్‌ఖాన్, ఆంగ్లేయ సైన్యాలను ముప్పు తిప్పులు పెట్టిన మౌల్వీఅహమ్మదుల్లా ఫైజాబాది నుండి సామాన్య సైనికులు పఠాన్ సలాబత్ ఖాన్ తదితరు లు మాతృభూమి విముక్తి కోరుతూ సాగిన పోరాటంలో నిర్వహించిన త్యాగమయ సాహసోపేత పాత్రను చిరస్మరణీయులు వెల్లడిస్తుంది. ఈ సంగ్రామంలో పురుషులతోపాటుగా వీరోచితంగా పోరాడిన బేగం హజరత్ మహాల్, మృత్యువులో సహితం ఝాన్సీరాణిని నీడలా అనుసరించిన ముందర్, విలాసవంతమైన జీవితాన్ని వదలి కాన్పూరు అధినేత నానా సాహెబ్ పక్షాన చేరి స్వయంగా రణరంగంలో పాల్గొన్న బేగం అజీజున్ లాంటి మహిళల స్పూర్తిదాయక కథనాలు వారి చిత్రాలతో సహా ఈ గ్రంథాంలో చోటుచేసుకున్నాయి.
మన రాష్ట్రంలో ప్రజల మీద ఆంగ్లేయులు సాగిసున్న ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజలతో కలసి హైదారాబాద్ రెసిడెన్సీ మీద సాహసోపేత దాడి చేసిన పఠాన్ తుర్రేబాజ్ ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్‌లను, అంధులైనప్పటికి కడప కేంద్రాంగా ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం మీద పోరాటానికి పకడ్బందీగా పథక రచన చేసిన షేక్ పీర్ షా సాహసం గురించిన ఆసక్తిదాయక వివరాలు ఈ గ్రంథంలో ఉన్నాయి.
ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం తరువాత 28 ఏండ్లకు ఉనికిలోకి వచ్చిన 1885 నాటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు హాజరైన రహిమతుల్లా సయాని, జాతీయ కాంగ్రెస్‌కు తొలిదశలోనే అధ్యా క్షపీరం అలంకరిచిన జసిస్ బద్రుద్దీన్ తయ్యాబ్జీలతో ఆరంభమై ఆ తరువాత సాగిన అహింసాయుత, సాయుధ పోరాటాలలో పాల్గొని స్వాతంత్య్రోద్యమ చరిత్రలో తమదైన ముద్రను స్థిరపర్చుకున్న ప్రముఖుల వివరాలను 'చిరస్మరణీయులు' వెల్లడిస్తుంది.
ఆ తరువాత జాతీయోద్యమ కాలంలో ఆంగ్లేయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించిన యోధులలో ఖిలాఫత్ ఉద్యమ సారదులుగా ఖ్యాతిగాంచిన అలీ సోదరులు, దశాబ్దాలుగా ప్రవాస జీవితం గడిపిన మౌల్వీ ఒబైదుల్లా సింధీ, ప్రవాస భారత ప్రభుత్వ ప్రదమ ప్రదానిగా బాధ్యా తలు స్వీకరించిన బర్కతుల్లా భోపాలి, ఉత్తేజపూరిత ప్రసంగాలతో సభికులను తనవైపుకు ఆకట్టుకుంటూ జాతీయోద్యమంలో 'చిచ్చర పిడుగు' గా ఖ్యాతి గాంచిన మౌలానా హస్రత్ మోహాని, గుజరాత్‌లో గాంధీజీ సాగించిన ప్రయోగాలకు నాయకత్వం వహించిన జస్టిస్ అబ్బాస్ తయ్యాబ్జీలు లాంటి చిరస్మ రణయులు ఈ గ్రంథంలో తారసపడతారు.
గోవధను నిషేధించాలని కోరిన హకీం అజ్మల్ ఖాన్, మౌలానా మజహర్రుల్ హఖ్, సాయుధ పోరాటంలో భాగంగా నాయకుడి కోసం నేరభారాన్నంతా తాను మోసి ఉరికంబం ఎక్కడానికి సిద్దపడ్డ 'కాకోరి వీరుడు' అష్పాఖుల్లా ఖాన్, సాయుధపోరాటానికి వ్యూహరచన గావించిన మౌలానా ముహమ్మద్ హసన్, చివరిశ్వాస వరకు హిందూ, ముస్లింల ఐక్యత కోసం శ్రమించిన డాకర్ ముక్తార్ అహమ్మద్ అన్సారి లాంటి యోధు లకు సంబంధించిన అత్యంత విలువైన సమాచారంతోపాటుగా ఆనాడు దేశ విభజనను వ్యతిరేకిసూ,హిందూ, ముస్లిం ఐక్యతను ప్రగాఢంగా వాంఛిస్తూ అ విశ్రాంత ప్రయత్నాలు చేసిన పలువురు వ్యక్తుల కృషి ఈ గ్రంథంలో నమోదయ్యింది.
బీహార్ రాష్ట్రం చంపారన్‌లో గాంధీజీని విషాహారం నుండి రక్షించిన బతఖ్ మియా అన్సారి లాంటి సామాన్యులు, జాతీయ కాంగ్రెస్‌ను ప్రబావితం చేయ గలిగినంతగా, ఆంగ్లేయుల పెత్తనానికి వ్యతిరేకంగా రైతాంగ పోరాటాన్ని నిర్వహించిన షేక్ ముహ్మద్ గులాబ్ లాంటి రైతు నాయకులకు సంబంధించి చాలావరకు వెలుగులోకి రాని విశేషాలను ఈ గ్రంథంలో ఆధారాలతో సహా రచయిత పాఠకుల ముందుంచారు.
ఈ గ్రంథంలో పురుషులతోపాటుగా పోరుబాట సాగిన మహిళలకు రచయిత తగిన ప్రాముఖ్యత కల్పించారు. ముస్లిం మహిళలు పర్దా చాటున మాత్రమే ఉంటారన్న అపోహను బద్దలు కొడ్తూ అనేకమంది ముస్లిం మహిళలు బహిరంగ జీవనంలోకి ప్రవేశించి, బ్రిటిష్ వ్యతిరేక పోరాలలో పాల్గొనడమేగాక ఇతరులను సయితం ఉత్తేజపర్చిన తీరు-తెన్నులు ఈ పుస్తకంలో చూస్తాం. అవసరం వచ్చినప్పుడు మాతృభూమి సేవల కోసంగాను వ్యక్తిగత బంధనాలను కూడా త్రోసిపుచ్చుతూ మహిళలు కూడా శాంతియుత -సాయుధ పోరాటాలలో పాల్గొన్న వైనాన్ని కళ్ళకు కట్టిటనట్టు రచయిత వివరించారు. బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమకారులైన మహిళల జీవితాలను పరికిస్తే ముస్లిం మహిళ గురించి ప్రచారంలోఉన్న సంకుచిత భావాలు చాలా వరకు దూరం కాగలవు.
జాతీయోద్యమకారుల చేత 'అమ్మా' అన్పించుకుని, జాతీయోద్యమ స్పూర్తిని రగిల్చిన ఆబాదిబానో బేగం, ప్రముఖ విప్లవకారుడు ఖుదీరాం బోసుకు ఆశ్రయమిచ్చి, తన అసలు పేరుతో కాకుండా 'ఖుదీరాం కి దీదీ' పేరుతో ప్రసిద్ధికెక్కిన ఖుదీరాం కి దీదీ, సింధ్-నౌఖాళీ ప్రాంతాల్లో మతకల్లోలాలు చెలరేగినప్పడు, మహాత్ముని ఆదేశాల మేరకు ఆ ప్రాంతాలలో పర్యటించి, హిందూ-ముస్లింల ఐక్యత కోసం కృషి చేయడం మాత్రమే కాకుండాచివరకు 20 రోజులపాటు సత్యాగ్రహ దీక్ష సాగించి గాంధీజీ నిజమైన వారసు రాలిగా పేర్గాంచిన గాంధీ దంపతు ల ఇష్టపుత్రిక బీబి అమతుస్సలాం ఈ గ్రంథంలో కన్పిస్తారు.
భర్తతో కలసి విభజన వ్యతిరేకోద్యమాన్ని సాగించిన పంజాబుకు చెందిన షపాతున్నీసా బీబి, అకుంఠిత దీక్షతో నిర్వహించిన సేవా కార్యక్రమాలకు గాను మహాత్ముని నుండి ప్రత్యేకంగా వందనాలు అందుకున్న షంషున్నీసా అన్సారి, జుగాంతర్ విప్లవదళ యోధురాలైన రజియా ఖాతూన్, వితంతువులు పైజామా కుర్తా ధరించరాదన్న సంప్రదాయవాదుల నిషేదాజ్ఞలను ఉల్లంఫిుంచి ఖద్దరు బట్టలు ధరించి ఉద్యమించిన సుగరా ఖాతూన్, ఉమ్మడి ప్రయోజనాల ముందు వ్యక్తిగత జీవితాలు ఏమాత్రం ప్రధానం కావంటూ ' మా మాతృభూమి స్వేచ్ఛాస్వాతంత్య్రాల నిమిత్తం పోరాడుతున్న నా భర్త జీవితం తొలుత ఈ జాతి సొత్తు; ఆ తరువాత మాత్రమే నాది, మరెవరిదైనా' అని ప్రకటించి సంచలనం సృష్టించిన బేగం ఆలం తారసపడతారు. అపూర్వ దైర్య సాహసాలతో పోరాటాలలో పాల్గొన్న మహిళల వివరాలు చాల మంది దృష్టికి రాని అంశాలే !
మనరాష్ట్రానికి సంబంధించి కూడా చాలా అమూల్యమైన సమాచారాన్ని రచయిత అందించారు. 1885లో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడగానే నిజాం ఆదేశాలను ఖాతరు చేయకుండా హైద్రాబాదు రాష్ట్రం నుండి సభ్యత్వంస్వీకరించిన ప్రప్రథమ ముస్లింగా ఖ్యాతిగాంచిన ముల్లా అబ్దుల్ ఖయ్యూం ఖాన్, డాక్టర్ సరోజిని నాయుడు తండ్రి అఘోరనాధ్ చ్టోపాధ్యాయతో కలసి హిందూ-ముస్లింల ఐక్యతకు కృషిచేశారు. మన్యం పోరాట వీరుడు అల్లూరి సీతారామరాజుకు పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన బ్రిటిష్ ప్రబుత్వాధికారి ఫజులుల్లా ఖాన్, ఖద్దరు విక్రయశాలను ఆరంభించి 'ఖద్దర్ ఇస్మాయిల్' గా పేర్గాంచిన ముహమ్మద్ ఇస్మాయిల్, నేతాజి సుభాష్ చంద్రబోస్‌కు వ్యక్తిగత కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన అబిద్ హసన్ సఫ్రాని లాంటి యోధుల గురించి, స్వాతంత్య్రం లభించాక నిజాం సంస్థానం నుండి వేరుపడి స్వతంత్ర రిపబ్లిక్‌ను ప్రకటించిన 'పరిటాల రిపబ్లిక్' స్థాపనలో తనదైన ఉత్తేజకర పాత్రవహించిన షేక్ మౌలా సాహెబ్ జీవిత విశేషాలు సమకూర్చడంలో రచయిత శ్రమ అర్థమవుతుంది. జాతీయోద్యమంలో పురుషులతోపాటుగా పరోక్షంగా పాల్గొన్న హజరా బీబి లాంటి మహిళల జీవిత విశేషాలను రచయిత ఈ గ్రంథంలో పొందుపర్చారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో ఒకవైపున బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయోద్యమంలో ప్రదాన పాత్ర వహిస్తూ సంఘం సంస్కరణకు, సత్సంఘం నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ, సామ్యవాద వ్యవస్థ స్థాపనకు పాటుపడిన ఉద్యమకారుల గురించి కూడా రచయిత వివరించారు.
1919లో బ్రిటిష్ ప్రభుత్వాన్ని శత్రువుగా పరిగణించి దేశం వదలి వెళ్ళాలని ముస్లింలు తీసుకున్న నిర్ణయం మేరకు కొందరు దేశం విడిచి వెళ్ళారు. అలా వెళ్ళిన వాళ్ళు సానుకూల పరిస్థితులకు నోచుకోక అష్టకష్టాలు పడి అటునుండి రష్యా వెళ్ళి, సామ్యవాద వ్యవస్థపట్ల ఆకర్షితులయ్యారు. అలా ఆకర్షితులై షౌకత్ ఉస్మాని భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. దాక్షిణ భారత దేశంలో రహస్యంగా కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి సిద్ధపడి వచ్చి పుచ్చలపల్లి సుందరయ్య, కంభంపాటి సీనియర్‌కు కమ్యూనిజాన్ని పరిచయం చేసిన అమీర్ హైదర్ ఖాన్, సామ్యవాద వ్యవస్థ నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేసిన కాకాబాబు ముజఫర్ అహమ్మద్ లాంటి ప్రముఖుల గురించి ఈ గ్రంథంలో ఉన్న ఆసకకర విషయాలు మనల్ని ఆకట్టుకుంటాయి.
జమీందారి కుటుంబం నుండి వచ్చినప్పిటికీ సోషలిస్టు భావాల పట్ల ఆకర్షితు లై జమీందారీ వ్యవస్థ రద్దుకు కృషి చేసిన జాతీయ కాంగ్రెస్ నేత రఫీ అహమ్మద్ కిద్వాయ్, క్విట్ ఇండియా, సైమన్ వ్యతిరేక ఉద్యమాలలో సింహంలా విక్రమించిన సామ్యవాది యూసుఫ్ అలీ లాంటినే తలకు, కార్మికుడిగా జీవితం ఆరంభిం చి, జాతీయోద్యమంలో ప్రవేశించి ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ వ్యవస్థాపకులలో ఒకరై, ఉపాధ్యక్షులుగా సేవలు అందించిన అబిద్ అలీ లాంటి యోధుల జీవిత విశేషాలు ఆకట్టుకుంటాయి. ఈ గ్రంథంలో ప్రచురించిన వందమంది స్వాతంత్య్రసమరయోదులలో అత్యధికుల చిత్రాల వలన వారి కృషి, త్యాగం పాఠకుల హృదయాల మీద చెరగని ముద్ర వేస్తుంది.
ఈ విధంగా మానవీయ-లౌకిక విలువల కోసం జీవితాలను ధారపోసిన వంద మంది స్వాతంత్య్రసమర యోధుల విశేషాలను అందించిన చిరస్మరణీయులు గ్రంథానికి పరిచయవాక్యం రాసే అవకాశం నాకు లభించినందుకు సంతోషిస్తూ, చరిత్రకారులు, రచయిత సయ్యద్ నశీర్ అహమ్మద్ గారికి శుభాభినందనలు తెలుపుతున్నాను.