చిన్నయసూరి జీవితము/శిష్యవర్గము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

14. శిష్యవర్గము

చిన్నయసూరి తన కాలమునందే సమకాలిక పండిత వర్గముచే పండితమండలికెల్ల మకుటాయమానుఁడుగా పరిగణితుఁ డయ్యెను.

కాలము గడచినకొలఁది నీతనికి కొంత శిష్యవర్గము కూడ నేర్పడినది. వారిలో ప్రథములు ప్రఖ్యాతపండితులు బహుజనపల్లి సీతారామాచార్యులవారు (1827 - 1891), వీరు *[1] శబ్దరత్నాకరనిఘంటువునేకాక బాలవ్యాకరణమునకు శేషగ్రంథమగు ప్రౌఢవ్యాకరణ మను నొక వ్యాకరణమునుకూడ రచించియున్నారు. దీనికే త్రిలింగ లక్షణశేషమని నామాంతరము.

2. వైయాకరణము రామానుజాచార్యులు: ఈతఁడు గొప్ప సంస్కృతాంధ్రపండితుఁడు. చిన్నయసూరికిని వీరికిని ప్రథమ సమావేశము పచ్చయప్పవార్షికోత్సవసందర్భమున సంఘటించినది. అప్పుడు రచింపఁబడిన పద్యములలో సూరి పద్యములకే ప్రథమ సత్కారము కావింపఁబడినది. నాఁటి నుండియు నీతఁడు సూరి ప్రతిభ గుర్తించి యాతని గురువుగా నంగీకరించెను. ఈతఁడు పద్యరచన చేయుటయేకాక మహాభారతము ఆదిపర్వమునంతటిని వచనముగా రచించెను. అది క్రీ. శ. 1847 - వ సంవత్సరమున ముద్రితమైనది. ఒకవైపున నన్నయభట్టారక రచితమైన పద్యభాగమును దాని కెదురుగా వేఱొకపుటయందు ఈ వచనమును ముద్రితమైనవి. ఈ వచనమును సూరి సంస్కరించియున్నాఁడు. ఆ గ్రంథము ముఖపత్రమున నిట్లున్నను తరువాతివారు దీనిని సూరి రచనముల యందు చేర్చుట శోచనీయము. (చూడుడు: ధాతుమాల పీఠిక). ఈ గ్రంథమునకు చిన్నయసూరి సంస్కార ముండుట చేతను, నీతిచంద్రికకన్న ప్రథమ వచనగ్రంథమగుటచేతను నిది తిరిగి ముద్రితము కావలసియున్నది.

3. వింజమూరి కృష్ణమాచార్యులు: ఈతఁడు అలంకారశాస్త్రమున ప్రత్యేకపండితుఁడై భట్టుమూర్తి రచితమైన కావ్యాలంకారసంగ్రహమును టీకాతాత్పర్యములతో ప్రకటించెను. ఇతఁడు కొంతకాలము పచ్చయప్ప కళాశాలలోను, ప్రభుత్వమువారి బోధనాభ్యసనపాఠశాలయందును పండితుఁడై యుండెను.

4. కరాలపాటి రంగయ్య (1819 - 1863): ఈతఁ డాకాలమున సుప్రసిద్ధాంధ్ర పండితులలో నొకఁడు. సూరి కీతఁడు సమకాలికుఁడు. భూతపురీ మహాత్మ్యము, కవి జన మనోహరము అను రెండు కావ్యములను రచించెను. ఈతఁడు మొట్టమొదట తాళపత్రములనుండి పాఠాములు సంస్కరించి మహాభారతము, భాస్కర రామాయణము, రంగనాథ రామాయణము మున్నగు గ్రంథములను ముద్రింపఁజేసెను. ఈతఁడు చిన్నయసూరితో కొంతకాలమును, నా వెనుక నొక వత్సరమును రాజధానికళాశాలలో పండితుఁడుగా నుండెను. 5.కొమ్మి రంగయ్యసూరి: ఈతఁడు సూరిగారికి సాక్షాత్ శిష్యుఁడు. సూరివలెనే చాత్తాద వైష్ణవకులమునకు చెందినవాఁడు. ఆతనివలెనే నీతిసంగ్రహ మను నొక చిన్ని గ్రంథమును రచించి ప్రకటించియున్నాఁడు. ఇదియును ముద్రితమై సూరి నీతిసంగ్రహమువలె పాఠశాలలకు మిగుల నుపయుక్తమై యున్నది.

6. తంజనగరము రంగమన్నారయ్య: ఈతఁడు ప్రసిద్ధుఁడగు దేవరాయసుధి తండ్రి. కొన్ని సంస్కృతాంధ్ర గ్రంథములను రచించి ప్రాచీన గ్రంథములకు వ్యాఖ్యానముల నీతఁడు వ్రాసెను. ఈతని వచనశైలియు మనోహరముగ నుండును.

సూరి సమకాలికులలో నాతని కనేకవిధముల సహాయ మొనర్చినవారు. మహాప్రసిద్ధులైనవారు నలుగురు గలరు. వారిలో కలువలపల్లి రంగనాథశాస్త్రిగారును, గాజుల లక్ష్మీనరసింహముశ్రేష్ఠి (1806 - 1868) ముఖ్యులు. ఇంక మిగిలిన వారిద్దఱు పాశ్చాత్యులు. ఒకరు ఆర్బత్ నాటుదొరగారు; రెండవవారు బ్రౌనుదొరవారు. వీరిలో మొదటివా రాకాలమున విద్యాశాఖావిచారణాధికారి (Director of Public Instruction) గా నుండిరి. సూరి తన నీతిచంద్రిక నీదొరవారి కంకిత మొనర్చియున్నాఁడు. ఈదొరగారు సూరిని సువర్ణ హస్తకంకణ మొసఁగి యెట్లు సత్కరించినదియు నింతకు క్రితమే వివరించి యున్నాను. ఇంక బ్రౌనుదొరవా రాకాలమున ఆంధ్రభాషా వాఙ్మయమంతటిని పరిశోధించిన మహావిద్వాంసులు. వారు భారతదేశమున నడుగిడునప్పటికి చిన్నయసూరి పదునాల్గేండ్ల వాఁడు. చిన్నయసూరి పరమపదించుట కే డేండ్లకు పూర్వమే యాతఁ డీ దేశమును విడిచి వెళ్లినాఁడు. కావున వారిర్వురికిని, సమకాలికులైననను, సంబంధ మేమాత్రమును లేదు.

చిన్నయసూరి కుటుంబము - అతని వ్యక్తిత్వము

చిన్నయ తన యుద్యోగధర్మమును నిర్వహించుచు సుఖజీవనమును గడపుచుండెడివాఁడు. ఈతని కిరువురు కొమరులు. వారిలో ద్వితీయునికి శ్రీ రేకము రామానుజసూరిగారి పుత్రిక నిచ్చి వివాహ మొనర్చిరి. ఈ రామానుజసూరిగారే చిన్నయసూరివెనుక నాతని స్థానము నధిష్ఠించిరి. ఈయన కిరువురు కొమారులు. వారిలో ప్రథములు శ్రీ రేకము మణవాళయ్యగారు; రెండవవారు భాష్యకారులుగారు. మణవాళయ్యగారు సబ్‌జడ్జి పనిని నిర్వహించుచు హైదరాబాదులో మూసినదీ ప్రవాహమున మరణించిరి. వారివద్ద సూరివృత్తాంతము కొంత యుండెను. కాని వారి మరణముతో నదియు నంతరించెను. మరియు రెండవవా రగు భాష్య కారయ్యగారు తమ డెబ్బది యెనిమిదవయేఁట తమకు చిన్నయసూరిని గురించి తెలిసిన వృత్తాంతమును కాగితము మూలముగా వ్రాసియిచ్చిరి. దాని నుండియే పరిషత్తువారి సంపుటములయందు నీచరిత్రము ప్రకటింపఁబడినది. చిన్నయసూరిగారు హయగ్రీవలక్ష్మీ మంత్రో పాసకులు. వా రనవరత మీమంత్రములను పఠించెడివారు. ఇప్పటి పండితులవలెఁ గాక వారు మిక్కిలి నియమముతో తమతమ ధర్మములను విధ్యుక్తముగా నాచరించువారు. వీరు వైష్ణవధర్మాను సరణముగ భక్తిశ్రద్ధలతో భగవన్నామమును జపించెడివారు. వీరియొక్క వేషభాషలనుగూర్చి ప్రసిద్ధపండితులు ప్రభాకరశాస్త్రిగా రిట్లు వ్రాసియున్నారు: "చిన్నయసూరి స్ఫురద్రూపియై సన్ననిలాల్చీని ధరించి శుభ్ర వస్త్రములతో కన్పట్టు వాఁడు; కండ్లకు సులోచనములను ధరించెడివాఁడు. ప్రతిదినము స్నానమునకు వెనుక నేదైన నొక భాషాప్రయోగమును క్రొత్త దానిని చూడకయే భోజనమునకు లేచెడివాఁడు కాఁడని ప్రతీతి. ఇట్టి నియమముతో భాషాపరిశ్రమచేయుటఁబట్టియే చిన్నయసూరి రచనములు శాశ్వతములై యొప్పారుచున్నవి."

చిన్నయసూరి విష్ణుభక్తిపరుఁడై తనగ్రంథములన్నిటిని శ్రీవేంకటేశ్వరస్వామికి కృతినొసంగెను. బాలవ్యాకరణాంతమం దుదాహరించిన "శ్రీ స్తనాంచిత కస్తూరీ" యను శ్లోకము నాతని నిత్యానుసంధానపరాయణత్వము నుద్ఘోషించుచున్నది. పచ్చయప్ప యశోమండనమునఁగూడ శ్రీ వేంకటేశ్వరస్వామినే యాతఁడు ప్రశంసించియున్నాఁడు ఈవిధముగా గ్రంథప్రారంభమున దైవస్తుతి యొనరించు ప్రాచీనసంప్రాదయము ననుష్ఠించి నిర్మలుఁడైన భగవద్భక్తుఁడగు పండితాగ్రేసరుఁ డగుటంబట్టి పండితలోకమున పూజనీయుఁడై వెలుగొందినాఁడు.

పందొమ్మిదవ శతాబ్ది ప్రారంభమున ఆంగ్లేయుల పరి పాలనతో నూతనాధ్యాయ మొకటి ఆంధ్రసారసత్వమున నేర్పడినది. పాశ్చాత్యులు పరిభాషను తెలుఁగును నేర్చుకొనుటకు సులభమగు పద్ధతు లవలంబించుటచే వ్యావహారిక భాషకే గాని గ్రాంథికభాషకు నాస్కారము లేకపోయినది. ప్రాచీన గ్రంథములు సంస్కరింపఁబడినను నవి వ్యావహారికరీతిగా నుండుటచే ప్రాచీనసాహిత్యమునకు భాషాలక్షణములకు పండితులే కొంచెము సుదూరముగ నిలువవలసిన దశ యేర్పడినది. ఇట్లు వ్యావహారికపంక నిమగ్నమైన యున్నతపరిస్థితులలో చిన్నయసూరి యుదయించి సలక్షణమును, శాస్త్రసమ్మతమును, శాశ్వతమును నగు వైయాకరణ సంప్రదాయమును సుప్రతిష్ఠము గావించి తన్మూలమున గ్రాంథికవాఙ్మయప్రపంచమును పునరుద్ధరించినవాఁ డయ్యెను. ఇంతేకాక నవయుగవికాసమునకు తోడ్పడిన యుద్యమములయం దీతఁ డెట్లు పాల్గొన్నదియు నీతని రచనలే యుద్ఘోషించుచున్నవి.

ఆంధ్రవాఙ్మయప్రపంచమున నజరామరమును, నాచంద్రార్కము నగు యశస్సు సంపాదించి ప్రాచీనులగు నన్నయాది కవులతో తులతూగఁదగినవాఁ డీతఁ డొక్కఁడే. చిన్నయసూరి ప్రభవసంవత్సరమున (1806) ప్రభవించినాఁడు; దుందుభి సంవత్సరమున (1862) కీర్తిశేషుఁ డైనాఁడు. వాఙ్మయ ప్రపంచమున నాతని యశోదుందుభి నేఁటికిని రేపటికిని మాఱుమ్రోఁగుచునే యుండును.

చిన్నయసూరిని గూర్చిన అభిభాషణములు.

1. సుజనరంజని పత్రిక (1865 డిసెంబరు)

"ఈ వచనకావ్యము 'నీతిచంద్రిక' మిక్కిలి ప్రౌఢముగాను లక్షణములకు ముఖ్యలక్ష్యములుగాను జక్కనిప్రయోగములు గలదిగాను గానఁబడుటచేత లోకమునం దిది విశేషవ్యాప్తి గలిగియుండఁదగినది. దీనిని రచించిన పరవస్తు చిన్నయసూరి గారి కాంధ్రమునందును తదుపయుక్త సంస్కృత ప్రాకృతములయందు దలస్పర్శియగు పరిజ్ఞానము గలదని వారు చేసిన లక్ష్య లక్షణగ్రంథములే నిరూపించుచున్నవి. మేము వారితోడ చిరకాలము సావాసముచేసి యాంద్గ్రమునందలి యనేక విషయంబుల నెఱింగినవారము గనుక వారి పాండిత్యము మా కనుభవ సిద్ధము. వారు రచించిన గ్రంథములలో ముఖ్యములు: - శబ్దలక్షణ సంగ్రహము, బాలవ్యాకరణము, నీతిచంద్రిక. వీ రారంభించి ముగింపనివి అకారాదినిఘంటు వొకటి, సంస్కృత సూత్రాంధ్ర వ్యాకరణ మొక్కటి, విశ్వనిఘంటువునకు టీక యొకటి. ఈ మూఁడును ముగిసియుండెనేని యాంధ్రభాషకు మరి యపేక్షణీయ మేమియు నుండనేరదు. ఆంధ్రభాషయొక్క అభాగ్యమే వారిని కీర్తిశేషులను గావించెను. ఈగ్రంథములను సమగ్రములను గాఁ జేయింపవలె నని Honourable గాజుల లక్ష్మీనరసింహుల సెట్టిగారు, C. S. I. బహుప్రయత్నములు చేయుచున్నారు. వారియత్నము సఫలము కావలయునని మేము సర్వేశ్వరుని ప్రార్థించుచున్నాము."


ఇట్లు

వింజమూరి కృష్ణమాచార్యులు

బహుజనపల్లి సీతారామాచార్యులు

కార్మంచి సుబ్బరాయలు

2. కందుకూరి వీరేశలింగము (1848 - 1919)

               ఉ. చిన్నయసూరి ధీరు లెదఁజేరిచి సారెకు నాదరింపఁ గా
                   మున్ను రచించి మించె సగమున్వచనంబుగ నీతిచంద్రికన్.

                                                       సంధి, విగ్రహము, కృత్యాది.

3. కొక్కొండ వేంకటరత్నము (1842 - 1915)

               క. నన్నయ్య యనరె యత్తి
                   క్కన్నయు నెఱ్ఱనయుఁ బూజ్యఘనులనుచు జనుల్
                   మున్నిప్పు డాంధ్రభాషకుఁ
                   జిన్నయ్యయు మాన్యుఁడన్నఁ జిత్రమె యరయన్?

                                                         విగ్రహతంత్రము, కృత్యాది.

4. వావిలాల వాసుదేవశాస్త్రి (1851 - 1897)

          తే. గీ. జీర్ణమైపోవు తెనుఁగును జేవగొలిపి
                  నిలిపినట్టి చిన్నయసూరి నిలిపి మదిని.

5. శివశంకర పాండ్యా (1855 - 1910)

"Mean while the late Chinnaya suri of the old high school at Madras, patronized by such native gentleman, as the late lamented the Honourable Gazula Lakshminarasu Chetty Garu, C. S. I. and others published in 1853 a Telugu prose work Known as the "First half of the Neetichandrika" thus winning the honourable distinction of being a Telugu prose writer of significance. This work established this fact beyond doubt, being written in a moderately beautiful Telugu style though stiff here and there as being the first effort at genuine Telugu prose composition."

(The Rise and progress of Telugu Prose Literature by R. Sivasankara Pandya, B. A. appended to notes on Vigrahatantram of Kokkonda Venkataratanam Pantulu, 1872.)


శ్రీ స్తనాంచిత కస్తూరీపంక సంకలి తోరసే,

కలౌ వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళమ్.

  1. * ఈ శబ్దరత్నాకర మిటీవల (1960) అనుబంధవిశేషములతో నా సంపాదకత్వమున ప్రకటితమైనది. (C. L. S., Madras).